ప్రపంచ పరిశీలన
పొగత్రాగడం వల్ల కలిగే హాని పూడ్చలేనిదా?
పొగత్రాగడం వల్ల ధమనులకు కలిగే హాని శాశ్వతంగా నిలిచిపోవచ్చు అని ఇటీవలి అధ్యయనం చెబుతుంది. సిగరెట్ త్రాగినా, ఇతరులు త్రాగి విడిచిన పొగను పీల్చుకున్నా బాగుచేయలేనంత హాని ధమనులకు కలుగగలదని ద జర్నల్ ఆఫ్ ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్‌లో పరిశోధకులు నివేదించారు. 45 నుండి 65 ఏండ్ల లోపు వయస్సుగల 10,914 మంది స్త్రీ పురుషులను ఆ అధ్యయనం నిశితంగా పరిశీలించింది. పొగ త్రాగేవారినీ, మునుపు పొగత్రాగినవారినీ, పొగత్రాగే అలవాటు లేకపోయినా ఇతరులు త్రాగి వదిలిన పొగను క్రమంగా శ్వసించవలసి వచ్చినవారినీ, అలాంటి పొగను అప్పుడప్పుడు మాత్రమే శ్వసించవలసి వచ్చినవారినీ ఆ బృందం సర్వే చేసింది. పరిశోధకులు అల్ట్రాసౌండ్‌ను ఉపయోగిస్తూ మెడలోపల ఇరువైపులా ఉండే గళధమనుల మందాన్ని కొలిచి చూశారు. ఈ పద్ధతిలోనే మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మళ్ళీ ఉపయోగించి చూశారు.
అనుకున్నట్లుగానే, క్రమంగా పొగత్రాగేవారి ధమనులు గట్టిపడడంలో చాలా గొప్ప పెరుగుదలే కనిపించింది—33 సంవత్సరాలుగా రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్లు త్రాగేవారిలో ఈ పెరుగుదల రేటు సగటున 50 శాతం ఉంది. మునుపు పొగత్రాగినవారి ధమనులు కూడా పొగత్రాగే అలవాటు లేనివారికన్నా 25 శాతం ఎక్కువ వేగంతో సంకుచితమయ్యాయి—కొందరి విషయంలో అయితే, వాళ్ళు పొగత్రాగడం మాని 20 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా సంకుచితమయ్యాయి. ఇతరులు త్రాగివిడిచిన పొగ బారిన పడనివారికన్నా, అలాంటి పొగ బారిన పడినవారి ధమనులు 20 శాతం ఎక్కువ మందమైనట్లు కనిపించింది. ఆ అధ్యయనం ప్రకారం, అమెరికాలో ప్రతి సంవత్సరం త్రాగి విడిచిన పొగకు గురై దాదాపు 30,000 నుండి 60,000 వరకూ మరణిస్తున్నారని అంచనా వేయబడింది.
ఒత్తిడి కారు ప్రమాదాలను అధికం చేస్తుంది
ఒక వ్యక్తికి తన పని ఎడల ఉన్న దృక్పథం డ్రైవింగ్ చేసేటప్పుడు ఆయన ప్రవర్తనపై గొప్ప ప్రభావం చూపుతుందని జర్మనీలోని ప్రొఫెషనల్ అసోసియేషన్ ఫొర్ హెల్త్ సర్వీస్ అండ్ సోష్యల్ వెల్ఫేర్ చేసిన అధ్యయనం చెబుతుంది. తమ పనివల్ల ఒత్తిడి కలిగినవాళ్ళు రోడ్డు ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని స్యూడోయిచె సైటుంగ్ నివేదించింది. “బాస్ మీదా లేదా తోటి పనివారి మీద కలిగిన ఉక్రోషాన్ని దిగమింగడం డ్రైవింగ్ చేసేటప్పుడు ఏకాగ్రత లేమికి కారణం కాగలదు” అని ఆ నివేదిక చెబుతుంది. ఆ అధ్యయనంలో, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, లేదా తిరిగి వచ్చేటప్పుడు రోడ్డు ప్రమాదానికి కారణమైన 75 శాతం మంది “ఏకాగ్రత లేమి, అసాధారణ వేగంతో వెళ్ళడమూ, సమయానికి వెళ్ళాలన్న తొందర లేదా ఒత్తిడి”యే కారణమని నిందిస్తున్నారు. ప్రతికూలమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రమాదాలకు కారణమయ్యేది ఎక్కువగా మగవాళ్ళేనని చెప్పబడుతున్నప్పటికీ, ముఖ్యంగా చిన్న పిల్లల తల్లులు ఈ అపాయానికి గురికాగలరని కూడా ఈ అధ్యయనం కనుగొంది. “సమయానికి వెళ్ళి పిల్లలను కిండర్‌గార్టన్ స్కూల్ నుండి తీసుకురావాలి లేదా మధ్యాహ్నం విశ్రాంతి తీసుకునే సమయంలో వంట చేయవలసి ఉంటుంది కనుక తరచూ వాళ్ళు చాలా ఎక్కువ ఒత్తిడిలో ఉంటారు” అని ఆ వార్తాపత్రిక అంటోంది.
ప్రపంచ అనారోగ్య కారకాలు
“మనం 21వ శతాబ్దంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ, ప్రపంచంలో 33 శాతం మరణాలకు అంటు రోగాలే కారణమౌతున్నాయి” అని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన డా. డేవిడ్ హేమాన్ అంటున్నారు. ఈ సమస్యకు అనేక కారకాలు దోహదమౌతున్నాయి. జనాభా పెరుగుదలా, టీకాల కార్యక్రమం విఫలమవ్వడం, జనసమ్మర్దం, పర్యావరణ మార్పులు, ప్రపంచవ్యాప్తంగా ప్రజా ఆరోగ్య వ్యవస్థ దెబ్బతినడమూ అన్నీ కూడా అందులో తమ పాత్ర వహించాయని ద జర్నల్ ఆఫ్ ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అంటోంది. ఇతర కారకాల్లో, బలవంతపు వలస, శరణార్థుల రాకపోకలు, భూగోళ పర్యటన పెరగడం ఇమిడి ఉన్నాయి. అవన్నీ కూడా అంటురోగాల వ్యాప్తికి తోడ్పడ్డాయి. “అసలు ఇవన్నీ నివారించగలవే. ఈ రుగ్మతలను ఎదుర్కొనే లేదా తుడిచిపెట్టే ఉపకరణాలు లభ్యమే” అని డా. హేమాన్ అంటున్నారు.
పిల్లలకు పీడకలలు రావడం సాధారణమే
భయంకరమైన కలలు దాదాపు పిల్లలనందరినీ వేధిస్తూనే ఉంటాయి. జర్మనీలోని మానెహీమ్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫొర్ మెంటల్ హెల్త్ చేసిన అధ్యయనం ప్రకారం, తమకు కలలు వచ్చినప్పుడు మెలకువ రావడం ప్రతి 10 మంది పిల్లల్లో 9 మంది పిల్లలకు గుర్తుంది. సాధారణంగా పిల్లలకు, వాళ్ళను ఎవరో తరుముతున్నట్లు, చాలా ఎత్తు నుండి పడిపోతున్నట్లు, లేదా యుద్ధానికి లేదా ప్రకృతి వైపరీత్యానికి గురైనట్లు పీడకలలు వస్తాయి. చాలా మట్టుకు, అలాంటి కలలు కల్పనల మరియు వాస్తవాల మిళితమై ఉంటాయి. సాధారణంగా అబ్బాయిలు తమకు వచ్చే కలలను మర్చిపోతారు. అయితే, అమ్మాయిలు తమ కలల గురించి తరచూ మాట్లాడడమో వ్రాసిపెట్టుకోవడమో చేస్తారు. పీడకలల వల్ల కలిగే ఆదుర్దాల నుండి ఉపశమనాన్ని పొందేందుకు పిల్లలు తమకు కలలో ఏమి వచ్చిందో చెప్పడం, దాని బొమ్మను గీయడం లేదా దానిలోని ఒక సన్నివేశాన్ని అభినయించడం చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారని బెర్లీనర్ సైటుంగ్ నివేదిస్తుంది. ఈ సలహాలను పాటిస్తే, సాధారణంగా కలలు రావడం కొన్ని వారాల్లోనే చాలా తక్కువవుతుంది, కలలు ఇకెన్నడూ భయపెట్టవు కూడా.
టీవీ ఎక్కువ, చదవడం తక్కువ
గ్రీస్‌లోని ఆడియోవిష్వల్ మీడియా ఇన్‌స్టిట్యూట్ చేసిన సర్వే ప్రకారం, ఆ దేశంలో, 35 లక్షల ఇండ్లలో 38 లక్షల టీవీ సెట్లు ఉన్నాయి; ప్రతి మూడు ఇండ్లలో ఒక ఇంట వీడియో క్యాసెట్ రికార్డరు కూడా ఉంది. టు వీమా అనే ఏథెన్స్ వార్తాపత్రిక, గ్రీస్ దేశస్థులు 1990లో ప్రతిరోజూ టీవీ చూడడానికి సరాసరి రెండున్నర గంటల కన్నా తక్కువ సమయాన్ని వెచ్చించగా, 1996లో దాదాపు నాలుగు గంటలు వెచ్చించారని నివేదించింది. చదవడం అకస్మాత్తుగా చాలా తగ్గిపోవడం ఆశ్చర్యకరమేమీ కాదు. 1989లో సగటు గ్రీసు దేశస్థుడు 42.2 వార్తాపత్రికలను చదివేవాడనీ, అది 1995లో 28.3కి తగ్గిందనీ ఆ సర్వే వెల్లడి చేసింది. అలాగే, పత్రికలను చదవడం అదే కాల వ్యవధిలోనే 10 శాతం తగ్గింది.
కుపోషణకు గురైన పెద్దవాళ్ళు
“పెద్దవాళ్ళు తరచూ సరిగా తినరు కనుక, ఎక్కువగా అనారోగ్యం పాలౌతుంటారు” అని జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లోని నాసావుషే నోయి ప్రెస్ నివేదిస్తుంది. పది యూరోపియన్ దేశాల్లోని 70 ఏండ్లకు పైబడిన 2,500 కన్నా ఎక్కువ మంది స్త్రీ పురుషులపై సర్వే జరిపిన తర్వాత ఈ నిర్ధారణకు రావడం జరిగింది. పెద్దవాళ్ళకు ఎక్కువ ఆహారం అవసరం లేదని అనేకులు అనుకుంటారు కానీ కెలోరిలను తక్కువగా తీసుకోవడం రోగనిరోధక శక్తిని బలహీనం చేస్తుంది. అంతేకాక, పెద్దవాళ్ళు ఒకేసారి మరింత ఆహారాన్ని వండుకుని అది అయిపోయేదాకా దాన్నే తింటూ ఉంటారు గనుక వాళ్ళు తీసుకునే ఆ ఆహారంలో పోషకగుణం అంతగా ఉండదు. అంతేగాక, చాలా మంది తాజా పండ్లను, కూరగాయలను చాలా తక్కువగా తింటారు, ముఖ్యంగా, వాటి సీజన్ కాని సమయంలో. “బాగా తినాలని, క్రమం తప్పకుండా తినాలని” వైద్యులు పెద్దవాళ్ళైన రోగులకు గుర్తు చేయాలనే నిర్ధారణకు ఆ అధ్యయనం వచ్చింది. శారీరకంగా కష్టపడడం ఆకలిని పెంచుతుంది కనుక, పెద్దవాళ్ళకు మరింత వ్యాయామ తర్ఫీదు ఇవ్వాలని కూడా అది సిఫారసు చేస్తుంది.
బైబిలు 2,197 భాషల్లో లభ్యమౌతుంది
“బైబిలులోని అనేక భాగాలను గత సంవత్సరం 30 అదనపు భాషల్లోకి అనువదించడంతో, లేఖనాలు లభ్యమయ్యే భాషల సంఖ్య 2,197 అయ్యింది” అని స్విట్జర్‌ల్యాండ్‌లోని జెనీవాలో ఇఎన్‌ఐ బులెటిన్ నివేదిస్తుంది. ఎస్‌పరాన్టో వంటి క్రొత్తగా రూపొందించిన భాషలతో సహా 363 భాషల్లో ఇప్పుడు పూర్తి బైబిలు లభ్యమౌతుంది. ద యునైటెడ్ బైబిల్ సొసైటీస్ (UBS) బైబిలులోని కనీసం ఒక పుస్తకమైనా ప్రచురించబడిన భాషల లెక్కలను ఉంచుతుంది. UBS జనరల్ సెక్రటరీ అయిన ఫర్గస్ మ్యాక్‌డొనాల్డ్, “దేవుడి వాక్యాన్ని ప్రజల మాతృ భాషలో లభ్యం చేయాలి” అన్నదే లక్ష్యం అని చెబుతున్నారు.