ప్రపంచ పరిశీలన
నడక ఆయుష్షును పెంచగలదు
ప్రతిరోజు కాస్త నడవడం ఆయుష్షును ప్రభావవంతంగా పెంచగలదని ఏషియావీక్ చెబుతుంది. నడిచే సత్తువ ఉన్న 61 నుండి 81 ఏండ్ల వయస్సుగల 707 మంది పొగత్రాగని పురుషులపైన 12 సంవత్సరాలపాటు అధ్యయనం చేయబడింది. “రోజుకు కేవలం 3.2 కిలోమీటర్లు (2 మైళ్ళు) నడిచినవారిలో—చివరికి తాపీగా నడుచుకుంటూ వెళ్లినవారిలో సహితం—మరణాన్ని కలుగజేసే అన్ని రకాల కారణాలను సగానికి సగం తగ్గించి వేసిందని” ఆ రిపోర్టు తెలియజేస్తుంది. అలా రోజుకి కనీసం రెండు మైళ్ళు నడిచినవారికన్నా అలా నడవనివారు ఏదో ఒక రకమైన క్యాన్సరు మూలంగా మరణించే ప్రమాదం 2.5 రెట్లు ఎక్కువ ఉంది. ప్రతి రోజు హీనపక్షం సగం మైలు నడిచిన వారిలో సహితం మరణరేటును తగ్గించిందని ద న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం కనుగొన్నది. ఇంతకుమునుపు, కొందరు శరీర వ్యాయామ నిపుణులు ఈ విధంగా అతిస్వల్ప మొత్తంలో వ్యాయామం చేయడంలోని ప్రయోజనాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు, ఈ క్రొత్త అధ్యయనం ఇలా నిర్ధారిస్తుంది: “వృద్ధులను నడవమని ప్రోత్సహించడం వారి ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చగలదు.”
పిల్లలపై టీవీ ప్రభావం
“6 నుండి 12 సంవత్సరాల వయస్సున్న పిల్లల ప్రవర్తనను స్కూలుకన్నా కార్టూన్లు, వీడియో గేమ్‌లే ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి. దానిక్కారణం వారు వారానికి దాదాపు 23 గంటలు క్లాసురూమ్‌లో గడుపుతుంటే 38 గంటలు టీవీ చూస్తూ గడపడమే” అని ఎల్ యూనివర్సాల్ అనే మెక్సికో వార్తాపత్రిక రిపోర్టు చేస్తుంది. ఫలాని పరిస్థితిలో ఎలాంటి వైఖరిని అలవర్చుకోవాలి అన్నది పిల్లలకు టీవీ నేర్పిస్తుంది—కానీ ఆ వైఖరులు మంచివో చెడ్డవో మాత్రం పిల్లలకు తెలియదు అని ఓమర్ టోరెబ్లాంకా అనే పరిశోధకుడు పేర్కొన్నాడు. ఆయనిలా వివరిస్తున్నాడు: “పిల్లవాడు ఒక కార్టూన్ చిత్రంగానీ లేదా ఒక సినిమా గానీ చూస్తే, అందులో ఒక పాత్ర సంతృప్తికరమైన ఫలితాలను సాధిస్తే, ఆ పిల్లవాడు బహుశ ఆ చర్యలనే అవలంబించవచ్చు.” “పిల్లలు తాము స్కూల్లో నేర్చుకునే వాటిని కాదు గానీ, ప్రతి దినం టీవీనుండి నేర్చుకొనే వాటినే తమ దైనందిన జీవితంలో అన్వయిస్తారని, ఎందుకంటే వారు స్కూలును కేవలం విధిగా హాజరవ్వాల్సిందిగా మాత్రమే దృష్టిస్తారని” టోరెబ్లాంకా చేసిన పరిశోధన సూచించింది.
సంగీతం పిల్లలకు సహాయకరం
మూడు లేదా నాలుగేళ్ల పిల్లలకు సంగీత వాయిద్యాన్ని వాయించడం నేర్పించడం వారు తర్కించడానికీ, ఆలోచించడానికీ సహాయం చేయగలదని అర్విన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గోర్డన్ షా తెలియజేస్తున్నాడు. ఇంత చిన్న వయస్సులో మెదడులోని కనెక్షన్‌లు చాలా త్వరగా ఏర్పడతాయి, అంతేగాక రోజుకి కనీసం పది నిముషాలు అయినా క్రమంగా అభ్యాసం చేయడం, “ఒక పిల్లవాడు తర్కించే విధానంలోను ఆలోచించే విధానంలోను దీర్ఘకాలిక అభివృద్ధిని” కలుగజేయడానికి సహాయం చేస్తుందని పరిశోధనలు చేసినవారు చూపిస్తున్నారు. తొమ్మిది నెలలపాటు జరిపిన ఒక పరిశీలనలో, పియానో తరగతులకు హాజరైన పిల్లల్ని కంప్యూటర్ తరగతులకు హాజరైన పిల్లలతోనూ లేదా ఎటువంటి శిక్షణనూ పొందని పిల్లలతోనూ పోల్చడం జరిగింది. పియానో వాయించడం నేర్చుకున్న పిల్లలు తమ బుద్ధికుశలతా పరీక్షల్లో 35 శాతం ఎక్కువ మార్కుల్ని తెచ్చుకోగా, మిగతా రెండు గ్రూపుల్లోని పిల్లల్లో అభివృద్ధి అంతగా లేకపోవడమో లేక అసలు లేకపోవడమో జరిగిందని లండన్‌లోని సండే టైమ్స్ రిపోర్టు చేస్తుంది.
భూవ్యాప్త వంటలెక్కలు
లోకంలోని ప్రజలంతా కలిసి రోజుకి ఎంత ఆహారాన్ని స్వాహా చేస్తారో మీరెప్పుడైనా ఆలోచించారా? టో వేమా అనే గ్రీకు వార్తాపత్రిక అనుదినం మనం తినే ఆహారం గురించిన కొన్ని ఆశ్చర్యపర్చే లెక్కల్ని తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా, 200 కోట్ల గ్రుడ్ల ఉత్పత్తి జరుగుతుంది, అన్ని స్వాహాకాబడుతున్నాయి—సైప్రస్ దీవి సైజులోని ఆమ్లెట్ వేయడానికి చక్కా సరిపోతాయి. ప్రపంచం మొత్తంమీద 16,00,000 టన్నుల మొక్కజొన్నలు జీర్ణం చేసుకోబడుతున్నాయి. బంగాళాదుంపలు కూడా సర్వామోదం పొందినవే; 7,27,000 టన్నులు! భూమ్మీది జనాభాలో అత్యధిక భాగానికి బియ్యం ప్రధాన ఆహారంగా ఉంది, 15 లక్షల టన్నుల బియ్యం ప్రతిరోజు ఉత్పత్తి చేయబడుతుంది. ఇందులో 3,65,000 టన్నులు చైనీయులే వినియోగిస్తున్నారు. టీ ఆకులనుండి తయారైన 7,000 టన్నుల టీపొడి 300 కోట్ల కప్పుల్లో చేరుతుంది. ప్రపంచంలోని ఉన్నతవర్గానికి చెందినవారు 2.7 టన్నుల కేవియార్‌ను ఆనందిస్తారు. పాశ్చాత్య దేశాల్లోని సగటు వ్యక్తి రోజుకు 4,000 కేలరీలను తీసుకుంటాడు—సిఫారసు చేయబడేది 2,500 కేలరీలు మాత్రమే—ఆఫ్రికాలో సగటు వ్యక్తి తీసుకునేది కేవలం 1,800 కేలరీలే.
పొగాకు మరణాలు
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 110 కోట్లమంది పొగత్రాగుతారని ఏషియన్ కన్సల్టెన్సీ ఆన్ టుబాకో కంట్రోల్‌కు చెందిన ప్రొఫెసర్ జూడిత్ మకే అంటుంది. పొగాకూ, ఆరోగ్యంపై జరిగిన పదవ ప్రపంచ మహాసభవద్ద, 1990లో పొగాకు సంబంధిత మరణాలు ముప్పై లక్షలని అంచనా వేయబడిందని బ్రిటీష్ మెడికల్ జర్నల్ రిపోర్టు చేసింది. ఆ సంఖ్య 2025-2030 సంవత్సరాల మధ్యకాలానికల్లా పదిలక్షలకు పెరుగుతుందని భావిస్తున్నారు. రానున్న మూడు దశకాల్లో పొగాకు సంబంధిత మరణాలు అభివృద్ధి చెందిన దేశాల నుండి అభివృద్ధిచెందుతున్న దేశాలకు బదిలీ అవుతాయని జర్నల్ చెబుతుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీవద్ద వైద్య గణాంకాల్లో ప్రొఫెసర్ అయిన రిచర్డ్ పీటో ప్రకారం, “ఇప్పటికే ఏ ఇతర దేశంలోకన్నా పొగాకు సంబంధిత మరణాలు చైనాలో ఎక్కువ ఉన్నాయి.”
శరీర భాగాల దాతలు
మీరు మరణించిన తర్వాత మీ శరీర భాగాలను ఇతరులు తీసుకోవాలని కోరుకుంటున్నారా? 1998 జనవరి 1 నుండి ఒక క్రొత్త చట్టం అమల్లోకి వచ్చినందున చాలామంది బ్రెజిల్‌వాసులు ఆ ప్రశ్నను ఎదుర్కొంటున్నారు. 18 ఏండ్లకు పైబడిన బ్రెజిల్‌వాసులందరూ మినహాయింపును కోరుతూ పత్రాలపైన సంతకాలు చేయనంత వరకు వారు ఆటోమేటిక్‌గా తమ శరీర భాగాల దాతలుగా అవుతారని ఆ చట్టం చెబుతుంది. కానీ “బ్రెజిల్‌వాసులలో అత్యధికులు తాము చనిపోయిన తర్వాత తమ శరీరం అలాగే, కోయబడకుండా ఒక్కటిగానే ఉండాలని ఇష్టపడుతున్నారనేందుకు సరిపడినన్ని సూచనలు కన్పిస్తున్నాయి” అని ద మయామి హెరాల్డ్ రిపోర్టు చేస్తుంది. “గత ఆరు నెలల కాలంలో డ్రైవింగ్ లైసెన్సు పొందే ప్రతి నలుగురిలో ముగ్గురు తమ శరీర భాగాలను దానం చేయడానికి నిరాకరించారు.” ఎందుకని? తమ శరీర భాగాలను తీసుకునేందుకుగాను చనిపోవడానికి ముందే తాము బ్రెయిన్ డెడ్ అని ప్రకటించేలా డాక్టర్లు ఒత్తిడికి గురికావచ్చని కొంతమంది ప్రజలు భయపడుతున్నారు.
మాయమౌతున్న అడవులు
మానవులు అడవులపై దురాక్రమణ చేయడానికి ముందు భూమిని కప్పిన అటవీ సంపదలో మూడింట దాదాపు రెండు వంతులు ఇప్పటికే అదృశ్యమైందని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) చెబుతుంది. ఈ సమస్యను గురించి ప్రజల్ని అప్రమత్తులను చేయడానికి మనిషి పట్టువదలని కృషి చేసినప్పటికీ, ఈ దశాబ్దంలో జరిగిన అడవుల నరికివేత ఎంతగా పెరిగిందంటే త్వరలోనే చాలా దేశాల్లో అసలు సహజ అడవులు అంటూ ఉండకుండాపోయే స్థితి వచ్చింది. కలప కోసం, సాగు భూమి కోసం అడవులను కొట్టివేయడం వివిధ మొక్కల జాతులను జంతు జాతులను నిర్మూలం చేస్తుంది. అంతేగాక, చెట్లను కాల్చివేయడం మూలంగా భూమి వాతావరణంలోనికి కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది, ఇది భూమి వేడెక్కడానికి (గ్లోబల్ వార్మింగ్‌కు) నడిపిస్తుందని అనేకమంది భయపడుతున్నారు. 2000వ సంవత్సరానికల్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల అడవుల్లోనూ కనీసం 10 శాతాన్ని పరిరక్షించాలని WWF ప్రేరేపిస్తుందని లండన్‌లోని గార్డియన్ వార్తాపత్రిక రిపోర్టు చేస్తుంది.
ప్రపంచవ్యాప్త ఆహారకొరతల అంచనాలు
జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ద్వారా చేయబడిన ఒక అధ్యయనం ప్రకారం, “జనాభా పెరుగుదల తగ్గకపోయినట్లైతే, వ్యవసాయ ఉత్పత్తులు ఒక్కసారిగా పెరగకపోయినట్లైతే, 2025వ సంవత్సరానికల్లా ఉండగల 800 కోట్లమంది ఆకలిని తీర్చడానికి సరిపడినంత ఆహారం ఉండదు” అని ఒక అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక తెలియజేస్తుంది. “ఒక్క స్త్రీకి దాదాపు ఇద్దరు పిల్లలుగా సంతాన (ఫెర్టిలిటీ) రేట్లు పడిపోకపోతే,” ప్రజలకు “సరిపడినంతగా ఆరోగ్యదాయకమైన, పోషకాహారాన్ని అందుబాటులో” ఉంచేందుకుగాను 2025కల్లా ఆహార ఉత్పత్తి రెండింతలు కావాల్సి ఉంటుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఈ సమస్యకు తోడు నీటికొరతా, భూమి కాలుష్యమూ, పైమట్టి కొట్టుకుపోవడమూ, శీతోష్ణస్థితిలో మార్పులూ వంటి సమస్యలు కూడా ఉన్నాయి. నేడు కూడా, ప్రతి సంవత్సరమూ దాదాపు కోటీ ఎనభై లక్షలమంది ప్రజలు ఆకలి మరణాలకు గురౌతున్నారు, భూమ్మీద ఇప్పుడు ఉన్న దాదాపు 600 కోట్లమంది జనాభాకు సరిపడినంత ఆహారం ఉత్పత్తి అవుతున్నప్పటికీ ఇలా జరుగుతుంది.