మా పాఠకుల నుండి
డౌన్ అండర్ జీవితం ఆస్ట్రేలియాను గురించిన “డౌన్ అండర్ జీవితం భిన్నంగా ఉంది” అనే ప్రేమపూర్వకమైన, జీవం ఉట్టిపడుతున్నటువంటి శీర్షికనుబట్టి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. (నవంబరు 8, 1997) ఆసక్తికరమైన, వైవిధ్యాలుగల ఈ దేశం గురించి నేను చాలా చదివినప్పటికీ, యెహోవా యొక్క అద్భుతమైన సృష్టిని బట్టి మనం ఆయనకు ఎంత ఋణపడివున్నామో అర్థం చేసుకునేందుకు మీ శీర్షిక నాకు సహాయపడింది.
ఎల్. కే., జర్మనీ
సమస్యలులేని పరదైసు “సమస్యలు లేని పరదైసు—ఎప్పుడు?” (నవంబరు 8, 1997) అనే పరంపరకు నేను చాలా కృతజ్ఞుడను. నేను పుట్టకముందే మా నానమ్మ చనిపోయింది, ఆమెకు క్యాన్సర్ వచ్చి చనిపోయింది. కానీ పరదైసులో, ఇక రోగమనేది ఉండదు. నేను ఆమెను పరదైసులో చూడగల్గేందుకుగానూ నేను నమ్మకంగా ఉండాలని ఈ శీర్షిక నన్ను ప్రోత్సహించింది.
ఎమ్. జే., ట్రినిడాడ్
జంతువుల మగత నిద్ర “జంతువుల మగత నిద్రలోని రహస్యాలు” అనే శీర్షికను బట్టి నా మెప్పుదలను వ్యక్తం చేయాలని నేను కోరుకున్నాను. (అక్టోబర్ 8, 1997) అది భలే తమాషాగా ఉంది—మరి నేను సృష్టిలోని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకున్నాను.
జే. జీ., ప్యూర్టోరికో
మాకు ఒక చేప ఉంది, చేప నిద్రపోతుందా అని తెలుసుకోవాలని ఎప్పుడు అనుకునేవాడ్ని. అది కదలకుండా ఉందంటే విశ్రాంతి తీసుకుంటుందన్నమాట అని తెలుసుకున్నప్పుడు నేను సంతోషించాను.
ఏ. పీ. ఎల్. ఎమ్., బ్రెజిల్
పాదాల నొప్పి “పాదాల నొప్పికి నివారణోపాయం” (నవంబరు 8, 1997) అనే శీర్షిక ముఖ్యంగా స్త్రీలను దృష్టిలో పెట్టుకుని వ్రాసినట్లు అనిపించింది. అయినప్పటికీ, శీర్షికను చదివిన కొన్ని రోజుల తర్వాత, తనకు పాదాల నొప్పి వస్తుందని మా వారు చెప్పారు—గత ఏడు సంవత్సరాలుగా ఆయనకు ఆ నొప్పి ఉంది. ఈ శీర్షిక నా మదిలో ఉండగా, మేము షూ స్టోర్‌కు వెళ్ళాం. చెబితే మీరు నమ్మరు, తనకు వెడల్పులో 9వ సైజు అవసరం, కానీ ఆయన 8వ సైజు షూ వాడుతున్నారు! తేజరిల్లు! కారణంగా ఆయన ఇప్పటికే ఎంతో ఉపశమనాన్ని పొందుతున్నారు.
ఎస్. జే., అమెరికా
నేను దాదాపు రోజంతా నిలబడే పనిచేయవలసి ఉంటుంది. హై హీల్స్ వేసుకోవడం వల్ల నాకు సమస్యలు మొదలయ్యాయి. ఈ నెల నేను సహాయ పయినీర్‌గా (భాగ-కాలిక సువార్తికురాలుగా) సేవచేశాను. ఈ శీర్షిక కారణంగా నేను మూడు జతల సుఖప్రదమైన షూలను కొనుక్కున్నాను. మా ఆరోగ్యం విషయంలో ఆసక్తి చూపిస్తూ, మాకు సమాచారాన్ని అందజేస్తూ ఉన్నందుకు కృతజ్ఞతలు.
సీ. ఎల్., జర్మనీ
తోబుట్టువుల సమస్యలు “మా అన్నయ్య మీదే అవధానమంతా ఎందుకు ఉంచబడుతోంది?” (నవంబరు 8, 1997) అనే శీర్షిక సరిగ్గా మాకు అవసరమైనప్పుడే వచ్చింది. విభిన్నంగా వ్యవహరించడం తప్పనిసరిగా అన్యాయమేమీ కాదని గ్రహించేందుకు మాకు సహాయపడింది. మా తల్లిదండ్రులు మా తోబుట్టువులకు అదనపు అవధానాన్నివ్వడానికి మంచి కారణముందని మేము ఇప్పుడు గ్రహించగల్గుతున్నాం. మేము నిజంగానే ఆ శీర్షికతో ఏకీభవిస్తాం.
బీ. కే., హెచ్. కే., మరియు జీ. యూ. ఓ., నైజీరియా
చప్పుడు కాలుష్యం నేను అనేక సంవత్సరాలు ఒక పెద్ద కర్మాగారంలో పనిచేశాను. నేనూ, నా తోటి ఉద్యోగస్థులు కొందరూ అక్కడి పెద్ద చప్పుళ్ళ దుష్ప్రభావాలను అనుభవిస్తూ వచ్చాం. నేను డిసెంబర్ 8, 1997 సంచికను (“శబ్దం—మన అత్యంత అనర్థదాయకమైన కాలుష్యమా?”) కర్మాగారానికి తీసుకువెళ్ళాను. ఆ తర్వాత మానేజ్‌మెంట్ కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలని నిర్ణయించుకుంది.
ఆర్. పీ., ఇటలీ
మా పొరుగున ఉన్న వ్యక్తి చేసే చప్పుళ్ళ వలన అనేక సంవత్సరాలుగా బాధపడుతున్నాను. రాత్రి దాకా ఆయన తన వ్యాపారం నడుపుతాడు. కొన్నిసార్లు నాకు విపరీతంగా కోపం వస్తుంది. నాలాగే చప్పుళ్ళకు గురై బాధపడుతున్న సహోదర సహోదరీలున్నారనీ, ఆత్మనియంత్రణ ద్వారా వారు దానిని అధిగమిస్తున్నారని తెలుసుకోవడం నన్ను బలపరచింది.
టీ. ఓ., జపాన్