కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 11/8 పేజీలు 19-22
  • సిగరెట్లు—మీరు వాటిని నిరాకరిస్తారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సిగరెట్లు—మీరు వాటిని నిరాకరిస్తారా?
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిర్బంధాలు విధించబడ్డాయి
  • పిల్లలు—నిస్సహాయ బాధితులు
  • మారిన దృక్పథం
  • సముద్రాంతర అమ్మకాలు
  • లక్షలాది ప్రాణాలు పొగలోనే కలిసిపోతున్నాయి
    తేజరిల్లు!—1995
  • పొగతాగడం తప్పా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • పొగతాగడం గురించి దేవుడు ఏమంటున్నాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • పొగత్రాగుట నిజంగా అంత చెడ్డదా?
    తేజరిల్లు!—1992
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 11/8 పేజీలు 19-22

సిగరెట్లు—మీరు వాటిని నిరాకరిస్తారా?

ప్రపంచానికి పొగాకును పరిచయం చేయడానికి సహాయపడిన దేశం దాని ప్రమాదాలను గూర్చి హెచ్చరించడంలో నాయకత్వం వహిస్తుంది.

“అమెరికాను కనుగొనక పూర్వం పొగాకుకు లిఖిత చరిత్ర లేదు” అని ఒక చరిత్రకారుడు వ్రాశాడు. కరిబీయన్‌ స్థానికులు దానిని కొలంబస్‌కు ఇచ్చారు. దాని ఎగుమతి ఉత్తర అమెరికాలోని మొట్టమొదటి శాశ్వత బ్రిటీష్‌ సెటిల్‌మెంట్‌ అయిన జేమ్స్‌టౌన్‌ నాశనమవ్వకుండా తప్పించబడడాన్ని నిశ్చయపర్చింది. దాని అమ్మకం అమెరికా విప్లవానికి ఆర్థిక మద్దతునిచ్చేందుకు సహాయం చేసింది. అమెరికా తొలి అధ్యక్షులైన జార్జి వాషింగ్టన్‌, థామస్‌ జెఫర్సన్‌లు పొగాకును సాగుచేసినవారే.

ఇటీవలి కాలాల్లోనే, సిగరెట్లను రొమాన్స్‌కు, ఆకర్షణకు, మగతనానికి సూచనగా హాలీవుడ్‌ ఉపయోగించింది. అమెరికా సైనికులు తాము పోరాడిన దేశాలలో తాము కలిసిన ప్రజలకు వాటిని ఇచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, “పారిస్‌ నుండి పీకింగ్‌ వరకు” సిగరెట్లు కరెన్సీగా ఉపయోగించబడ్డాయని చెప్పబడుతుంది.

కానీ పరిస్థితి మారింది. 1964, జనవరి 11న అమెరికా సర్జన్‌ జనరల్‌ పొగత్రాగడం మూలంగా ఎంఫిసీమా, ఊపిరితిత్తుల కాన్సర్‌, మరితర తీవ్రమైన వ్యాధులు సంక్రమిస్తాయని చెబుతూ ఒక 387 పేజీల నివేదికను విడుదల చేశాడు. త్వరలోనే అమెరికాలో అమ్మబడే అన్ని సిగరెట్టు ప్యాకెట్లపై “జాగ్రత్త: పొగత్రాగడం మీ ఆరోగ్యానికి అపాయకరం కావచ్చు” అనే హెచ్చరిక ఉండాలని ఫెడరల్‌ చట్టం కోరింది. ఇప్పుడు, అంచనాల ప్రకారం అమెరికాలో ఏటా 4,34,000 మరణాలకు పొగత్రాగడమే కారణమని చెప్పబడుతుంది. గత శతాబ్ద కాలంలో యుద్ధంలో మరణించిన అమెరికన్లందరి సంఖ్యకన్నా అది ఎక్కువే!

నిర్బంధాలు విధించబడ్డాయి

పది కంటె ఎక్కువ సంవత్సరాల క్రితం, కొలరాడోలోని ప్రసిద్ధ శీతాకాల విహార కేంద్రం అయిన ఆస్‌పెన్‌ తన రెస్టారెంట్లలో పొగత్రాగడాన్ని నిషేధించింది. అప్పటి నుండి రెస్టారెంట్లలో, పనిస్థలంలో, మరితర బహిరంగ స్థలాలలో పొగరహిత విభాగాలు చాలా సాధారణమైపోయాయి. అనేక సంవత్సరాల క్రితం, ఒక కాలిఫోర్నియావాసి ఒక వర్జీనియా రెస్టారెంట్లో పొగరహిత విభాగం ఎక్కడుందని తన కుమార్తెను అడిగాడు. “డాడీ” అంటూ ఆమె ప్రత్యుత్తరమిచ్చింది, “ఇది పొగాకు పండించే ప్రదేశం!” అయితే ఆయన మరోసారి సందర్శించే సమయానికల్లా ఆ రెస్టారెంట్‌లో సగానికి సగం పొగత్రాగని వారికోసం ప్రత్యేకించబడింది. ఇటీవల, ఆయనక్కడ పొగత్రాగేవారిని ఎవరినీ చూడలేదు.

కానీ పొగత్రాగే వారికి ప్రత్యేక విభాగాలను ఉంచడం సమస్యను పరిష్కరించలేదు. కాలిఫోర్నియాలోని ప్రధాన రహదారుల ప్రక్కన ప్రభుత్వ మద్దతుతో చేయబడుతున్న పెద్ద ప్రకటన బోర్డులు ఇలా అడుగుతున్నాయి: “పొగత్రాగే విభాగంలోనే ఉండిపోవాలన్న సంగతి పొగకు తెలుసని మీరు అనుకుంటున్నారా?”

న్యూయార్క్‌ నగరం పెద్ద రెస్టారెంట్లలో పొగత్రాగడాన్ని నిషేధించినప్పుడు, ఇది యూరప్‌ నుండి వచ్చిన పర్యాటకులను దూరం చేస్తుందని యజమానులు నిరసనను ప్రదర్శించారు, అక్కడ కొన్ని నిబంధనలే పొగత్రాగడాన్ని నియంత్రిస్తాయని వారన్నారు. అయితే, అమెరికన్లలో కేవలం 26 శాతంమంది మాత్రమే పొగరహిత రెస్టారెంట్‌కు వెళ్లేందుకు తక్కువ ఉన్ముఖత చూపిస్తుండగా, 56 శాతంమంది వెళ్లే సాధ్యత ఎక్కువ ఉందని మునుపటి సర్వే ఒకటి కనుగొంది.

న్యూయార్క్‌ నగరం సబ్‌వే కార్లలోని ఒక సూచన ఇలా అంటుంది: “భాష ఏదైనా సందేశం ఒక్కటే: మన స్టేషన్లలోగాని లేక మన రైళ్లలోగాని ఎప్పుడూ, ఎక్కడా పొగత్రాగరాదు. ధన్యవాదములు.” ఆ సూచన ఈ సందేశాన్ని కేవలం ఆంగ్లంలోనే కాదు కానీ మరితర 15 భాషల్లో పేర్కొంటుంది.

ఈ విషయం నిజంగా అంత గంభీరమైనదా? అవును. ఒకవేళ ఒక పెద్ద విపత్తులో 300 మంది చనిపోతే అది రోజుల తరబడి, బహుశ వారాల తరబడి వార్తలలో ప్రస్తావించబడుతుంది. కానీ 53,000 మంది అమెరికన్లు ఏటా ఇతర ప్రజలు త్రాగే సిగరెట్ల పొగను పీల్చుకోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక ఫలితాల మూలంగా చనిపోతున్నట్లు అంచనా వేయబడిందని ద జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌లోని ఒక శీర్షిక చెప్పింది. ఆ వాస్తవం అటువంటి సెకండ్‌హ్యాండ్‌, లేక పర్యావరణ పొగాకు పొగను పీల్చడాన్ని, “నేరుగా పొగత్రాగడం మరియు మద్యం తరువాత మరణాన్ని నివారించగల మూడవ అతిపెద్ద కారణం”గా చేస్తుంది అని అది చెబుతుంది.

పిల్లలు—నిస్సహాయ బాధితులు

కానీ గృహంలో పొగత్రాగే విషయమేమిటి? “అకాల మృత్యువును మరియు అనవసర వ్యాధులు, అంగ వైకల్యాలను” తగ్గించడానికై లక్ష్యాలను పెట్టుకున్న అమెరికా ప్రభుత్వ ప్రచురణ అయిన ఆరోగ్యకరమైన ప్రజలు 2000 (ఆంగ్లం) ఇలా అంది: “అమెరికాలోని ప్రతి ఆరు మరణాలలో ఒకటి కంటే ఎక్కువ మరణాలకు పొగాకు వినియోగమే కారణం, అంతేగాక మన సమాజంలో మరణాలకు, వ్యాధులకుగల కారణాలలో అత్యంత ప్రాముఖ్యమైన ఏకైక నివారించదగ్గ కారణం అది.”

అదింకా ఇలా అంటోంది: “గర్భధారణ సమయంలో సిగరెట్టు త్రాగడం 20 నుండి 30 శాతం బిడ్డలు తక్కువ బరువుతో పుట్టడానికి, 14 శాతం వరకు అకాల ప్రసవాలకు, మరి అన్ని విధాలైన శిశు మరణాలలో దాదాపు 10 శాతం మరణాలకు కారణమౌతుంది.” పొగత్రాగే తల్లులు శిశువుకు ఇచ్చే తల్లిపాల ద్వారా లేక శిశువువుండే పరిసర ప్రాంతాల్లో పొగత్రాగడం ద్వారా మాత్రమే కాదు గానీ “అప్పుడే పొగత్రాగిన గదిలో శిశువును ఉంచడం” ద్వారా కూడా పొగాకు పొగలోని మూలకాలను అందించగలరని అది తెల్పింది.

తండ్రులు కూడా ఇమిడివున్నారు. అదే ప్రచురణ ఇలా సలహా ఇచ్చింది: “పిల్లల దగ్గర ఉన్న వ్యక్తులు పొగత్రాగవలసి వస్తే, వారు ఇంటివెలుపల లేక పిల్లవాడు ఉండే స్థలాల వైపుకు గాలి వీయని ప్రాంతాలలో పొగత్రాగాలి.” ఒకే గదిలో ఎంతమంది పెద్దవారు పొగత్రాగుతున్నారు, ఎన్ని సిగరెట్లు కాల్చారు అన్నదానిపై పిల్లలకు సంభవించే హాని పెరుగుతుంది. అందువలన, మాజీ అమెరికా సర్జన్‌ జనరల్‌ అయిన జాస్‌లిన్‌ ఎల్డర్స్‌ ఇలా అంది: “మీ పిల్లలు మీ వ్యసనాలకు అమాయక బాధితులు.”

ఇతర ప్రజలు కూడా ప్రమాదంలో ఉన్నారు. కాలిఫోర్నియాలో ప్రభుత్వం అందించే ఒక టెలివిజన్‌ వ్యాపార ప్రకటన ఒంటరిగా కూర్చున్న ఒక వృద్ధుడిని చూపించింది. ఆయన తన భార్య ఎప్పుడూ పొగత్రాగడాన్ని మానమని బలవంతం చేస్తూండేది అని అన్నాడు. “నేను పొగత్రాగడం మానకపోతే తను ముద్దుపెట్టుకోవడం మానివేస్తానని కూడా భయపెట్టింది. నా ఊపిరితిత్తులూ నా జీవితం, అని నేను చెప్పాను. కానీ నేను పొరబడ్డాను. నేను మానలేదు. నేను పోగొట్టుకునేది నా జీవితం కాదని ఆమె జీవితం అని నేను గ్రహించలేకపోయాను.” విషాదంగా ఆమె చిత్రం వైపు చూస్తూ ఆ వృద్ధుడు ఇలా కొనసాగించాడు: “నా భార్యే నా సర్వస్వం.”

మారిన దృక్పథం

అటువంటి హెచ్చరికలు అమెరికాలో పొగత్రాగడాన్ని బహుగా తగ్గించడానికి దోహదపడ్డాయి. ఆశ్చర్యకరంగా, 4 కోట్ల 60 లక్షల అమెరికన్లు—అంటే ఎప్పుడో ఒకప్పుడు త్రాగినవారిలో 49.6 శాతంమంది—మానివేశారు అని అంచనా!

అయినప్పటికీ, పొగాకు కంపెనీలకు భారీ ప్రకటనా బడ్జెట్లు ఉన్నాయి మరి వారు ఎదురు పోరాటాన్ని సాగిస్తున్నారు. తత్ఫలితంగా, పొగత్రాగడంలో తగ్గుదల నత్తనడక నడుస్తుంది. న్యూయార్క్‌ నందలి కొలంబియా యూనివర్శిటీ వద్దనున్న సెంటర్‌ ఆన్‌ అడిక్షన్‌ అండ్‌ సబ్‌స్టెన్స్‌ అబ్యూజ్‌కు చెందిన జోసెఫ్‌ ఏ. కాలఫానో, జూనియర్‌. ఇలా అన్నాడు: “పొగాకు పరిశ్రమ నుండి ప్రజా ఆరోగ్యానికి వాటిల్లే అత్యంత గొప్ప ప్రమాదం [ఏమంటే] పిల్లలవైపు, టీనేజర్లవైపు గురిపెట్టబడిన దాని ప్రకటనా మరియు అమ్మకపు మెలకువలే, వారు దాని ప్రాణాంతకమైన ఉత్పత్తులకు వ్యసనభరితులయ్యే క్రొత్త గుంపు.”

ద జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఇలా అంది: “అంచనాల ప్రకారం ప్రతిదినానికి 3,000 మంది యౌవనస్థులు, ఎక్కువగా పిల్లలు మరియు కౌమారదశకు చేరుకుంటున్నవారే, క్రమంగా పొగత్రాగేవారిగా తయారౌతున్నారు. ఇది ప్రతి సంవత్సరం క్రొత్తగా పొగత్రాగే దాదాపు పదిలక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తుంది, వీరు ప్రతి సంవత్సరం పొగత్రాగడం మానివేసిన, లేక చనిపోయిన దాదాపు 20 లక్షల మంది స్థానాన్ని పాక్షికంగా భర్తీ చేస్తారు.”

అమెరికాలోని పొగత్రాగేవారిలో సగం కంటే ఎక్కువమంది 14 ఏళ్లు వచ్చేసరికల్లా ప్రారంభిస్తారు. యు. ఎస్‌. ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ అయిన డేవిడ్‌ కెస్‌లర్‌ ప్రతిదినం పొగత్రాగడం మొదలుపెట్టే 3,000 మంది పిల్లలలో దాదాపు 1,000 మంది చివరికి పొగసంబంధిత అస్వస్థతల మూలంగా చనిపోతారు అని అన్నాడు.

ఒకవేళ అటువంటి అంకెలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే, మన పిల్లలు మన మాదిరిని అనుకరిస్తారని గుర్తుంచుకోవడం బాగుంటుంది. వారు పొగత్రాగకూడదని మనం కోరుకుంటే మనం కూడా ఆ పని చేయకూడదు.

సముద్రాంతర అమ్మకాలు

అమెరికాలోని సిగరెట్టు వినియోగం పడిపోయినా విదేశీ మార్కెట్టు వృద్ధిచెందుతుంది. “ఎగుమతులు మూడింతలు కన్నా ఎక్కువ పెరిగాయి, విదేశాల్లో అమెరికా పొగాకు పరిశ్రమలు వర్థిల్లాయి” అని లాస్‌ ఏంజిల్స్‌ టైమ్స్‌ నివేదించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో “పొగత్రాగడంలోని అపాయాలకు తక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది” గనుక పొగాకు కంపెనీలు “విదేశీ మార్కెట్లలోనికి వేగంగా చొచ్చుకుపోవడానికి” అవి అనుమతిస్తున్నాయి అని ద న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ చెబుతుంది.

అయినా, ఆర్‌. జె. రేనాల్డ్స్‌, జూనియర్‌. కుమారుడును, కామెల్‌ మరియు విన్‌స్టన్‌ సిగరెట్లను ఉత్పత్తి చేసే కంపెనీ వ్యవస్థాపకుడి వంశస్థుడును అయిన పాట్రిక్‌ రేనాల్డ్స్‌ అమెరికాలోని ప్రతి 5 మరణాలలో ఒక మరణం పొగత్రాగడం వలననేనని అన్నాడు. ప్రతి సంవత్సరం కొకైన్‌, మద్యం, హెరాయిన్‌, అగ్ని, ఆత్మహత్య, హత్య, ఎయిడ్స్‌, వాహనాల ప్రమాదాలు అన్నింటి మూలంగా ఎంతమంది చనిపోతారో అంతకంటే ఎక్కువమంది చనిపోవడానికి పొగత్రాగడమే కారణమని, మన శకంలోనే మరణం, వ్యాధి, వ్యసనాలకైన కారణాలలో నివారించదగ్గ ఏకైక కారణం అదేనని రేనాల్డ్స్‌ అన్నట్లు కూడా చెప్పబడింది.

పొగత్రాగడాన్ని నేర్చుకోవడంలో ప్రపంచానికి సహాయపడిన దేశం పొగాకు ఎడల పెరుగుతున్న జాతీయ వ్యతిరేకతను వృద్ధిచేయడం వింతగా లేదూ? ఆలాగైతే, ‘ఈ వింత ధోరణికి సమాధానం ఎవరికి బాగా తెలుసు?’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం మంచిది.

50 కంటే ఎక్కువ సంవత్సరాలపాటు పొగత్రాగిన ఒక స్త్రీ గురించి ఆధునిక పరిణతి (ఆంగ్లం) అనే పత్రిక చెప్పింది. ఆమె ఇలా అన్నది: “మీరు వ్యసనానికి అలవాటు పడ్డారంటే మీరు చిక్కుకుపోయారన్నమాటే.” కానీ మొట్టమొదట ఆమె పొగత్రాగడం ప్రారంభించేలా చేసిన ఆ భ్రమ నుండి బయటికి వచ్చి, పొగత్రాగడాన్ని కొనసాగించడానికి, మానివేయడానికి ఆమె చెప్పిన సాకులను విశ్లేషించింది.

“పొగత్రాగడం మానుకోండి” అని ఆమె వ్రాసింది. “అది అద్భుతంగా ఉంటుంది.”

[19వ పేజీలోని బాక్సు]

“1990లలో అభివృద్ధి చెందిన దేశాలలో పొగాకు 35 నుండి 69 ఏండ్ల వయస్సుగల వారిలో దాదాపు 30 శాతం మరణాలను కలుగజేస్తుందని, ఇది దానిని అభివృద్ధి చెందిన ప్రపంచంలో అకాల మృత్యువును కలుగజేస్తున్న ఏకైక అతిపెద్ద కారణంగా చేస్తుందని అంచనా” వేయబడింది.—న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌

[20వ పేజీలోని బాక్సు/చిత్రం]

కాన్సర్‌ హెచ్చరికలు

ఈ క్రింది హెచ్చరికలు అమెరికన్‌ కాన్సర్‌ సంస్థ బ్రోషూర్లైన ఊపిరితిత్తుల కాన్సర్‌ గురించిన వాస్తవాలు మరియు కాన్సర్‌ వాస్తవాలు మరియు అంకెలు—1995 నుండి తీసుకోబడ్డాయి:

• “భర్తలు పొగత్రాగేవారైతే పొగత్రాగని భార్యలకు ఊపిరితిత్తుల కాన్సర్‌ వచ్చే

ప్రమాదం 35% ఎక్కువగా ఉంది.”

• “అంచనాల ప్రకారం ఊపిరితిత్తుల కాన్సర్‌ కేసులలో పురుషులలో 90% మరియు స్త్రీలలో 79% సిగరెట్టు కాల్చడం వలనే సంభవించాయి.”

• “గత 40 సంవత్సరాలుగా రోజుకు రెండు ప్యాకెట్లు కాల్చే వ్యక్తికి ఊపిరితిత్తుల కాన్సర్‌ మరణానుపాతం పొగత్రాగని వారికంటే దాదాపు 22 రెట్లు ఎక్కువగా ఉంది.”

• “ఊపిరితిత్తుల కాన్సర్‌కి విరుద్ధంగా శ్రేష్ఠమైన సంరక్షణ ఏమంటే పొగత్రాగడం ఎన్నడూ ప్రారంభించకపోవడమే, లేదా వెంటనే మానివేయడమే.”

• “సురక్షితమైన సిగరెట్టు అంటూ ఏమీ లేనే లేదు.”

• “పొగాకును నమలడంగాని లేక నశ్యాన్ని ఉపయోగించడంగాని నోటి, స్వరపేటిక, గొంతు, ఈసోఫేగస్‌ కాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని ఎక్కువ చేస్తుంది, మరి అది అత్యంత వ్యసనాత్మకమైన అలవాటు.”

• “దీర్ఘకాలికంగా నశ్యాన్ని ఉపయోగించేవారిలో బుగ్గ మరియు చిగుళ్ల కాన్సర్‌ యొక్క అదనపు ప్రమాదం దాదాపు యాభై రెట్లు పెరగవచ్చు.”

• “వయస్సుతో నిమిత్తం లేకుండా పొగత్రాగడం మానివేసే ప్రజలు, పొగత్రాగడాన్ని కొనసాగించే వారికన్నా ఎక్కువ కాలం జీవిస్తారు. పొగత్రాగడాన్ని కొనసాగించే వారితో పోల్చుకుంటే 50 ఏళ్లకు ముందే పొగత్రాగడాన్ని మానివేసే వారు తరువాతి 15 సంవత్సరాలలో చనిపోయే ప్రమాదం సగానికి సగం తగ్గుతుంది.”

[22వ పేజీలోని బాక్సు]

వ్యవసాయదారుని సందిగ్ధత

వేరే పంట వేస్తే కుటుంబ పోషణకు వీలుకానంత మరీ చిన్న పొలాలున్న కుటుంబాలకు అనేకతరాల నుండి పొగాకు మద్దతునిచ్చింది. స్పష్టంగా అనేకమంది ప్రజలకు ఈ వాస్తవం మనస్సాక్షికి సంబంధించిన సమస్యను తెచ్చిపెట్టింది. ఒక పొగాకు మోతుబరిచే స్థాపించబడినదైన డ్యూక్‌ విశ్వవిద్యాలయంలోని వేదాంత నీతిశాస్త్ర ప్రొఫెసర్‌ స్టాన్లీ హార్‌వస్‌ ఇలా అన్నాడు: “పొగాకును పండించే ప్రజల అత్యంత గొప్ప బాధ ఏమిటంటే . . . వారు పండించడం మొదలుపెట్టినప్పుడు, అది ఎవరినైనా చంపుతుందన్న విషయం వారికి తెలియదన్నదేనని నేను తలస్తున్నాను.”

[21వ పేజీలోని చిత్రం]

పొగ పొగత్రాగేవారి విభాగంలోనే ఉండిపోదు

[21వ పేజీలోని చిత్రం]

గర్భధారణ సమయంలో సిగరెట్టు త్రాగడం అన్ని విధాలైన శిశు మరణాలలో దాదాపు 10 శాతం మరణాలకు కారణమౌతుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి