కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 8/8 పేజీలు 26-28
  • అమ్మాయిల వెనకపడ్డం తప్పా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అమ్మాయిల వెనకపడ్డం తప్పా?
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వివాహితులైతే
  • మానసిక వ్యభిచారం
  • అవివాహితుల సంగతేమిటి?
  • సరదా కోసం సరసాలాడడం తప్పా?
    యువత అడిగే ప్రశ్నలు
  • 1 సమస్యలు రాకుండ చేసుకోవడానికి సహాయం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2018
  • మీ హృదయాన్ని కాపాడుకోవడం ద్వారా మీ పవిత్రతను నిలబెట్టుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • మీరు ఇమిడివున్న ఒక వివాదాంశం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 8/8 పేజీలు 26-28

బైబిలు ఉద్దేశము

అమ్మాయిల వెనకపడ్డం తప్పా?

“అమ్మాయిల వెనకపడ్డం మోసకరమైనదనీ లేక కుయుక్తితో కూడినదనీ లేక చెడ్డదనీ మనం ఎందుకనుకుంటాము? అది అలాంటిది కాదు! అది ఒక ఆట! మీరు అవతలి వ్యక్తిని సంతోషపరుస్తారు గనుక అది ఇరువైపుల వారూ గెలిచే ఆట.”—సూజాన్‌ రాబిన్‌, ఫ్లర్టింగ్‌ పాఠశాల డైరెక్టర్‌, న్యూయార్క్‌ నగరం.

చాలామంది ప్రజలు అమ్మాయిల వెనకపడ్డాన్ని (ఫ్లర్టింగ్‌) సాధారణమైనదిగా, నిష్కపటమైనదిగా, చివరికి మానవ సంబంధాలను ఏర్పరచుకుని కాపాడుకోవడానికి అవసరమైనదిగా దృష్టిస్తారు.a పాశ్చాత్య దేశాల్లో, “అమ్మాయిల వెనకపడే కళ”లో అంతర్గత అంశాలైన సైగలు, భంగిమలు, ఓరచూపులు, దృక్కులు వంటివి నేర్పే పుస్తకాలు, పత్రిక శీర్షికలు, ప్రత్యేక తరగతులు ఇటీవల ఎక్కువవుతున్నాయి.

అసలు అమ్మాయిల వెనకపడ్డమంటే ఏమిటి? అనేక నిర్వచనాలు, అర్థాలు ఉన్నాయి. ఒక నిఘంటువు దాన్ని “చపలమైన శృంగార భావాలు లేక లైంగికంగా మరులు గొలిపే” ప్రవర్తన అని నిర్వచిస్తోంది. దాన్ని మరో నిఘంటువు “గంభీరమైన ఉద్దేశం లేని శృంగార” ప్రవర్తన అని నిర్వచిస్తోంది. కాబట్టి అమ్మాయిల వెనకపడే వ్యక్తి ఎవరంటే, వివాహం చేసుకోవాలన్న ఉద్దేశం ఏమాత్రం లేకుండానే ప్రణయాసక్తిని కనపర్చే వ్యక్తి అని సాధారణంగా తలంచబడుతుంది. అమ్మాయిల వెనకపడ్డం నిరపాయకరమైనదన్నట్లు దృష్టించవచ్చా? దాని గురించి బైబిలు దృక్కోణం ఏమిటి?b

అమ్మాయిల వెనకపడ్డం గురించి లేఖనాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించబడనప్పటికీ, మనం దేవుని దృక్కోణాన్ని తెలుసుకోవచ్చు. ఎలా? ఆ విషయానికి సంబంధించిన బైబిలు సూత్రాలను పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. అలా మనం ‘మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియాలను’ అభివృద్ధి చేసుకోగల్గుతాము. (హెబ్రీయులు 5:14) ముందుగా, ఒక వివాహితుడు మరో స్త్రీ వెనకపడ్డం సరైనదేనా అనేది మనం పరిశీలిద్దాం.

వివాహితులైతే

వివాహిత దంపతులు ఏకాంతంగా ఉన్నప్పుడు ఒకరితో ఒకరు శృంగారంగా ప్రవర్తించడం చాలా సహజమైనదే. (ఆదికాండము 26:8 పోల్చండి.) కాని వివాహ భాగస్వామి కానివారి పట్ల అలాంటి భావాలు కల్గివుండడం దేవుని సూత్రాలకు విరుద్ధమైనది. వివాహిత దంపతులు సన్నిహితమైన, నమ్మకమైన సంబంధాన్ని ఆనందించాలని యెహోవా సంకల్పించాడు. (ఆదికాండము 2:24; ఎఫెసీయులు 5:21-33) ఆయన వివాహాన్ని పవిత్రమైన, శాశ్వతమైన బంధంగా దృష్టిస్తాడు. మలాకీ 2:16లో దేవుడు ఇలా అంటున్నాడు: “భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ.”c

ఒక వివాహితుడు మరో స్త్రీ వెనకపడ్డం, వివాహాన్ని గూర్చిన దేవుని దృక్కోణంతో పొందిక కల్గివుందా? అది గంభీరమైన విషయం, ఎందుకంటే అలా పరస్త్రీల వెనకపడే వివాహిత వ్యక్తి దేవుడు చేసిన వైవాహిక ఏర్పాటు యొక్క పవిత్రత పట్ల అగౌరవాన్ని చూపిస్తాడు. అంతేగాక, ఎఫెసీయులు 5:33, “తననువలె తన భార్యను ప్రేమింపవలెను” అని క్రైస్తవ భర్తకు, “తన భర్తయందు భయము [“ప్రగాఢ గౌరవం,” NW] కలిగియుండునట్లు చూచుకొనవలెను” అని భార్యకు ఆజ్ఞాపిస్తోంది. భార్యకు అసూయను రేకెత్తించేలా మరో స్త్రీ వెనకపడ్డం, భార్య పట్ల ప్రేమను లేక గౌరవాన్ని చూపిస్తుందా?

మరింత గంభీరమైన వాస్తవం ఏమిటంటే, అలా పరస్త్రీల వెనకపడ్డం వ్యభిచారానికి నడిపిస్తుంది, అది యెహోవా పూర్తిగా ఖండించిన, మోసకరమైనది అని ఆయన వర్ణిస్తున్న పాపం. (నిర్గమకాండము 20:14; లేవీయకాండము 20:10; మలాకీ 2:14, 15; మార్కు 10:17-19) వాస్తవానికి, వ్యభిచారాన్ని యెహోవా ఎంత గంభీరమైనదిగా పరిగణిస్తాడంటే, వివాహ బంధంలో విశ్వాసఘాతుకం జరిగితే విడాకులు తీసుకోవడాన్ని ఆయన అనుమతిస్తున్నాడు. (మత్తయి 5:32) మరి, పరస్త్రీల వెనకపడ్డం వంటి ప్రమాదకరమైన సరదాను యెహోవా ఆమోదిస్తాడని మనం ఊహించగలమా? ప్రేమగల తల్లి లేక తండ్రి తన బిడ్డ పదునైన కత్తితో ఆడుకోవడానికి ఎలా అనుమతించరో అలాగే దేవుడు దాన్ని ఎంతమాత్రం ఆమోదించడు.

వ్యభిచారం గురించి బైబిలు ఇలా హెచ్చరిస్తోంది: “ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా? ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని పాదములు కమలకుండునా? తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు.” (సామెతలు 6:27-29) అయితే, వ్యభిచారం జరుగకపోయినప్పటికీ, పరస్త్రీ వెనకపడే వివాహిత వ్యక్తి ఇంకో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది, అదేమిటంటే, “మానసిక వ్యభిచారం” అని పిలువబడేదానిలో చిక్కుకోవడం.

మానసిక వ్యభిచారం

కొంతమంది తమ వివాహం వెలుపల, లైంగిక సంబంధం లేకపోయినప్పటికీ, ప్రణయ భావాలు వృద్ధి అయ్యే సంబంధాలను పెంపొందించుకున్నారు. అయితే, యేసు ఇలా హెచ్చరించాడు: “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.” (మత్తయి 5:28) హృదయం దాటిరాని కామవాంఛకు యేసు ఎందుకు అభ్యంతరం చెప్పాడు?

ఒక కారణమేమిటంటే, “వ్యభిచారములు . . . హృదయములో నుండియే వచ్చును.” (మత్తయి 15:19) అయితే, ఆ సంబంధం వ్యభిచారం జరిగేంత వరకు రాకపోయినప్పటికీ, అది హానికరమైనదే. అదెలా? ఈ విషయంపైని ఒక పుస్తకం ఇలా వివరిస్తోంది: “మీ వివాహజతతో మీరు గడిపే సమయంలో నుండి, వేరే ఏదైనా కార్యకలాపం గానీ లేక సంబంధం గానీ మరీ ఎక్కువ సమయాన్నీ శక్తినీ హరించివేస్తుంటే అది ఒక రకమైన విశ్వాసఘాతుకమే.” అవును, మానసిక వ్యభిచారం ఒకరి వివాహజత యొక్క సమయాన్నీ, అవధానాన్నీ, అనురాగాన్నీ దోచుకుంటుంది. ఇతరులు మనల్నెలా చూడాలని మనం కోరుకుంటామో అలాగే మనం ఇతరులను చూడాలని యేసు ఇచ్చిన ఆజ్ఞ దృష్ట్యా, పరస్త్రీ వెనకపడే భర్త తనను తాను ఇలా ప్రశ్నించుకోవడం మంచిది, ‘నా భార్య మరో వ్యక్తితో ఇలా ప్రవర్తిస్తే నేనెలా భావిస్తాను?’—సామెతలు 5:15-23; మత్తయి 7:12.

ఒక వ్యక్తి ఇలాంటి అనుచితమైన భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకుంటే, ఆయనేమి చేయాలి? అనుచితమైన భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకునే వివాహిత వ్యక్తి, వాహనం నడుపుతూ నిద్రలోకి జారుకునే డ్రైవరులా ఉంటాడు. ఆయన ఆ స్థితిలోనుండి మేల్కొని, తన వివాహమూ, దేవునితో తన సంబంధమూ ముక్కలుచెక్కలవ్వకముందే అత్యవసరమైన నిర్ణయాత్మకమైన చర్య తీసుకోవలసిన అవసరం ఉంది. కన్ను లేక చెయ్యి ఒకవేళ దేవుని ఎదుట మనకుగల మంచి స్థానానికి ముప్పును వాటిల్లజేస్తున్నట్లయితే ఆ కన్నును పెరికివేయాలని ఆ చెయ్యిని నరికివేయాలని యేసు చెప్పినప్పుడు, ఎంతో తీవ్రమైన చర్య తీసుకోవాల్సిన అవసరతను ఆయన సోదాహరణంగా చెప్పాడు.—మత్తయి 5:29, 30.

అవతలి వ్యక్తిని మీరు ఎక్కడ, ఎంత తరచుగా కలుస్తారనేదాన్ని పరిమితం చేసుకోవడం జ్ఞానయుక్తంగా ఉంటుంది. ఖచ్చితంగా, ఆ వ్యక్తితో ఒంటరిగా ఉండడాన్ని నివారించండి, పని స్థలంలో ఉన్నట్లైతే ఎటువంటి సంభాషణనైనా పరిమితం చేయండి. ఆ వ్యక్తితో అన్ని రకాలైన కాంటాక్ట్‌లను ఆపివేయడం కూడా అవసరం కావచ్చు. అటుతర్వాత, మీ దృష్టి, తలంపులు, భావాలు, ప్రవర్తనకు సంబంధించి ఖచ్చితమైన స్వయం–నియంత్రణను పాటించాలి. (ఆదికాండము 39:7-12; కీర్తన 19:14; సామెతలు 4:23; 1 థెస్సలొనీకయులు 4:4-6) వివాహితుడైన యోబు ఇలా చెప్పినప్పుడు చక్కని మాదిరి నుంచాడు: “నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని, కన్యకను నేనేలాగు చూచుదును?”—యోబు 31:1.

పరస్త్రీల వెనకపడ్డం అపాయకరమైనదనీ, లేఖనవిరుద్ధమైనదనీ స్పష్టమౌతుంది. అయితే, అవివాహితులు అలా చేయడాన్ని గురించిన బైబిలు దృక్కోణం ఏమైవుంది? దాన్ని సహజమైనదిగా, నిష్కపటమైనదిగా, లేక వ్యతిరేకలింగ వ్యక్తులతో సంబంధాలను కాపాడుకోవడానికి అవసరమైనదిగా పరిగణించాలా? దాని వల్ల నిజమైన హాని ఏమైనా జరుగగలదా?

అవివాహితుల సంగతేమిటి?

ఇద్దరు అవివాహితులు వివాహం చేసుకోవాలనుకుంటూ, అశుద్ధమైన ప్రవర్తనేదీ కల్గివుండకుండా ఒకరి పట్ల ఒకరు ప్రణయాసక్తిని కనబర్చుకోవడం తప్పేమీకాదు. (గలతీయులు 5:19-21) వివాహం జరిగే సాధ్యత ఇంకా కాస్త తక్కువగానే ఉన్న సమయమైన కోర్ట్‌షిప్‌లోని తొలిదశల్లో అలాంటి ఆసక్తి ఏర్పడుతుంది. ఉద్దేశాలు మంచివైనప్పుడు ఇది అనుచితమైనది కానవసరం లేదు. అలాంటి ప్రవర్తన నిజానికి అమ్మాయిల వెనకపడ్డం కాదు.

అయితే కేవలం సరదా కోసం అవివాహితులు ఒకరి కొకరు ప్రణయ సంబంధ సూచనలను పంపుకుంటే అప్పుడేమిటి? వాళ్లు అవివాహితులు గనుక అది నిరపాయకరమైనదిగానే కన్పించవచ్చు. అయితే, మానసిక గాయాలు ఏర్పడే సాధ్యత గురించి ఆలోచించండి. అమ్మాయిల వెనుకపడుతున్న వ్యక్తి దృక్పథాన్ని, ఉద్దేశింపబడిన దానికన్నా గంభీరంగా తీసుకుంటే, అది విపరీతమైన బాధకూ, మనోవేదనకూ దారి తీయవచ్చు. సామెతలు 13:12 నందలి, “కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము” అనే ఈ మాటలు ఎంత నిజమో కదా ! ఇద్దరూ తమకు గంభీరమైన ఆసక్తి లేదనే అవగాహనకు వచ్చామని చెప్పినప్పటికీ, అవతలి వ్యక్తి నిజంగా ఏమి ఆలోచిస్తున్నారో లేక భావిస్తున్నారో ఇద్దరిలో ఎవరైనా ఖచ్చితంగా చెప్పగలరా? బైబిలు ఇలా సమాధానమిస్తోంది: “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?”—యిర్మీయా 17:9; ఫిలిప్పీయులు 2:4, పోల్చండి.

వ్యభిచారం జరిగే ప్రమాదాన్ని గురించి కూడా ఆలోచించండి, వ్యభిచారం మూలంగా రోగాలు లేక అక్రమ గర్భధారణ వంటి పర్యవసానాలు కలిగే సాధ్యత ఉంది. లేఖనాలు వ్యభిచారాన్ని ఖండిస్తున్నాయి, ఉద్దేశపూర్వకంగా వ్యభిచారం చేస్తూనే ఉండేవారు దేవుని అనుగ్రహాన్ని కోల్పోతారు. శోధనను ఎదిరించమని అపొస్తలుడైన పౌలు క్రైస్తవులను హెచ్చరించాడు, వారు ‘జారత్వానికి’ సంబంధించి తమ “అవయవములను” ‘చంపివేసుకుని,’ జారత్వానికి నడిపించే ‘కామాభిలాషను’ నివారించాలి. (కొలొస్సయులు 3:5; 1 థెస్సలొనీకయులు 4:3-5) జారత్వము “పేరైనను ఎత్తకూడదు,” అంటే తప్పుడు కోరికను రేకెత్తించే విధంగా ప్రస్తావించకూడదు అని ఆయన ఎఫెసీయులు 5:3 నందు మనకు ఉపదేశిస్తున్నాడు. అమ్మాయిల వెనకపడ్డం ఈ ఉపదేశంతో పొందిక కల్గివుండదు. లైంగిక విషయాల గురించి అనారోగ్యకరమైన సంభాషణను కూడా దేవుడు నిషేధిస్తున్నాడు.

అమ్మాయిల వెనకపడ్డం తోటి మానవులపట్ల క్రూరమైనదిగానూ, వివాహ వ్యవస్థాపకుడైన యెహోవాకు అగౌరవం కల్గించేదిగానూ ఉండగలదని బైబిలు సూత్రాలు వెల్లడి చేస్తున్నాయి. అమ్మాయిల వెనకపడ్డం అనుచితమన్న బైబిలు దృక్పథం ఖచ్చితంగా ప్రేమపూర్వకమైనది, సహేతుకమైనది, ఎందుకంటే అది ప్రజలకు హాని జరుగకుండా కాపాడుతుంది. కాబట్టి, దేవుడ్ని ప్రేమించేవారు అమ్మాయిల వెనకపడడం అనుచితమని తెలుసుకుని, ఆ విధంగా చేయకుండా వారితో పూర్ణపవిత్రతతోనూ, గౌరవంతోనూ వ్యవహరిస్తారు.—1 తిమోతి 2:9, 10; 5:1, 2.

[అధస్సూచీలు]

a ఇక్కడ మేము అబ్బాయిలను ఉద్దేశించి చెబుతున్నప్పటికీ, ఈ విషయాలు అమ్మాయిలకు కూడా వర్తిస్తాయి.

b ఏ విధమైన లైంగిక సంబంధమైన దృక్పథం లేకుండా స్నేహపూర్వకంగా ఉండడంతో లేక కలుపుగోలుగా ఉండడంతో అమ్మాయిల వెనకపడ్డాన్ని కలగాపులగం చేయకూడదు.

c తేజరిల్లు! (ఆంగ్లం) ఫిబ్రవరి 8, 1994 సంచికలోని “దేవుడు ఏ విధమైన విడాకులను ద్వేషిస్తాడు?” అనే శీర్షికను చూడండి.

[26వ పేజీలోని చిత్రసౌజన్యం]

© The Curtis Publishing Company

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి