“చర్చివిరోధి” విచారణ మరియు మరణశిక్ష
ఇటలీలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
భయానకంగా కనిపించే కోర్టుగదిలో ఒక వైపున న్యాయమూర్తుల బల్ల ఎత్తుగా హుందాగా కనిపిస్తుంది. మధ్యలో ఉండే అధ్యక్షుని సీటు పై భాగాన ముదురు రంగు బట్ట వితానం గొడుగులా ఉంటుంది. దాని పైన కొయ్యతో చేసిన పెద్ద సిలువ ఉంటుంది. అది కోర్టుగది అంతటిలో ఉన్నతంగా కనిపిస్తుంది. అధ్యక్షుని ఆ సీటు ముందు కోర్టు బోను ఉంటుంది.
కుటిల కాథలిక్ ఇన్‌క్విజిషన్ కోర్టులు తరచూ అలా వర్ణించబడేవి. దురదృష్టవంతులైన ప్రతివాదులపై చేయబడే భయానకమైన నేరారోపణ “చర్చివిరోధము” అన్నదే. ఆ పదం హింసిస్తున్న దృశ్యాలను కొయ్యమీద కాల్చి చంపుతున్న దృశ్యాలను మనస్సులోకి తీసుకువస్తుంది. చర్చివిరోధమును—ఆర్థడాక్స్ రోమన్ కాథలిక్ బోధలకు అనుగుణ్యంగా లేని అభిప్రాయాలను లేదా సిద్ధాంతాలను—నిర్మూలం చేయడానికి స్థాపించబడిన ప్రత్యేక చర్చి కోర్టే ఇన్‌క్విజిషన్ (“విచారణ చేయడం” అనే భావం గల ఇన్క్వీరో అనే లాటిన్ క్రియా పదం నుండి వచ్చింది).
అది దశలవారీగా స్థాపించబడిందని కాథలిక్ మూలాలు చెబుతున్నాయి. 1184లో కౌన్సిల్ ఆఫ్ వెరోనాలో ఆ ఇన్‌క్విజిషన్‌ను పోప్ లూషీయస్ III స్థాపించాడు. దాని సంస్థీకరణను మరియు పద్ధతులను ఇతర పోప్‌లు పరిపూర్ణం చేశారు—భయానకమైన ఆ సంస్థను వర్ణించేందుకు పరిపూర్ణం అనే పదాన్ని ఉపయోగించవచ్చో లేదో. 13వ శతాబ్దంలో, పోప్ గ్రెగరీ IX యూరప్‌లోని వివిధ ప్రాంతాల్లో విచారణా న్యాయస్థానాలను స్థాపించాడు.
ప్రముఖ పరిపాలకులైన ఫర్‌డనాస్ట్, ఇసబెల్లాల అభ్యర్థన ప్రకారం, పోప్ సిక్‌టస్ IV ఆజ్ఞానుసారం 1478లో కుప్రసిద్ధి గాంచిన ఆ స్పానిష్ ఇన్‌క్విజిషన్ స్థాపించబడింది. వేధింపును తప్పించుకునేందుకు కాథలిక్కులుగా మారినట్లు నటించిన యూదులైన మర్రానోలతో పోరాడేందుకు; వేధింపును తప్పించుకోవాలన్న అదే కారణం చేతనే కాథలిక్ మతాన్ని స్వీకరించిన ఇస్లామ్ అనుచరులైన మారిస్కోలతో పోరాడేందుకు; స్పానిష్ చర్చి వ్యతిరేకులతో పోరాడేందుకు అది స్థాపించబడింది. స్పెయిన్‌లోని మొదటి ముఖ్య విచారణకర్తా, డొమినికా సన్యాసీ అయిన తోమస్ డె టార్‌క్యుమాడా తన మతంమీదున్న తనకున్న పిచ్చి ఆసక్తి కారణంగా, ఇన్‌క్విజిషన్ యొక్క నీచమైన లక్షణాలకు ప్రతీక అయ్యాడు.
1542లో పోప్ పాల్ III రోమన్ ఇన్‌క్విజిషన్‌ను స్థాపించాడు. మొత్తం కాథలిక్ ప్రపంచం మీద దానికి న్యాయపరిపాలనా అధికారం ఉండేది. ఆరుగురు కార్డినల్‌లు ఉన్న కేంద్ర న్యాయస్థానమైన చర్చి సభను ఆయన నియమించాడు. అది కాన్‌గ్రిగేషన్ ఆఫ్ ది హోలీ రోమన్ అండ్ యూనివర్సల్ ఇన్‌క్విజిషన్ అని పిలువబడింది. అది “రోమ్ అంతటినీ భయంతో నింపిన భయానక ప్రభుత్వంగా” మారింది. (డీట్స్యోనారియో ఎన్‌చీక్లోపడీకో ఈటాల్యానో) చర్చివిరోధులకు ఇవ్వబడే శిక్ష పూర్తిగా కాథలిక్ అధికారంలో ఉన్న దేశాలకు ఎంతో భయాన్ని కలిగించింది.
విచారణ మరియు ఊటోడఫే
చర్చికి విరోధంగా ఉన్నారన్న నేరం మోపబడిన వారిచేత దాన్ని ఒప్పించేందుకు విచారణకర్తలు వారిని హింసించేవారని చరిత్ర నిరూపిస్తుంది. ఇన్‌క్విజిషన్ యొక్క అపరాధాన్ని తగ్గించి చూపే ప్రయత్నంలో, లోక న్యాయస్థానాల్లో కూడా హింసించడమనేది చాలా సాధారణమని కాథలిక్ వ్యాఖ్యాతలు వ్రాశారు. కానీ, క్రీస్తు ప్రతినిధులని చెప్పుకునే పరిచారకులు అటువంటి పనిని చేయడాన్ని అది సమర్థించగలదా? క్రీస్తు తన శత్రువుల మీద చూపించినటువంటి సానుభూతిని వారు కూడా చూపించవలసింది కదా? దీనిని వాస్తవంగా పరిశీలించేందుకు, మనం ఒక సరళమైన ప్రశ్నను పరిశీలించవచ్చు: తన బోధలతో ఏకీభవించనివారిని క్రీస్తు హింసించి ఉంటాడా? “మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి” అనే యేసు అన్నాడు.—లూకా 6:27.
ఇన్‌క్విజిషన్ ముద్దాయికి న్యాయాన్ని హామీ ఇవ్వలేదు. నిజానికి ఆచరణ విషయానికొస్తే ఇన్‌క్విజిటర్‌కు అపరిమితమైన అధికారాలు ఉండేవి. “సందేహం, నేరారోపణలు, కింవదంతులు కూడా ఇన్‌క్విజిటర్ ఒక వ్యక్తిని తన సమక్షానికి పిలిపించుకునేందుకు సరిపడే కారణాలే.” (ఎన్‌చిక్లోపీడియా కాటోలీకా) రోమన్‌లు స్థాపించిన ప్రాచీన నేరారోపణా పద్ధతిని వదిలిపెట్టి, న్యాయ విచారణా పద్ధతిని సూత్రీకరించినది మరియు స్వీకరించినది కాథలిక్ ఆధిపత్యమేనని ఈటాలో మీరోయి అనే ఒక న్యాయ చరిత్రకారుడు ధృవీకరిస్తున్నాడు. రోమా చట్టం ప్రకారం, తనపై చేయబడిన నేరారోపణ తప్పని రుజువు చేసుకునే అవకాశం ముద్దాయికివ్వాలి. దోషమేమీ చేయలేదేమోనన్న సందేహం ఉన్నట్లయితే, నిర్దోషియైన ఒకరికి శిక్ష విధించే కన్నా వదిలిపెట్టడమే మంచిదని భావించబడేది. కాథలిక్ ఆధిపత్యం ఈ ప్రాథమిక సూత్రాన్ని తీసివేసి, సందేహం కలిగిందంటే దోషమున్నట్లేనన్న ఉద్దేశానికి తావిచ్చింది. ప్రతివాది తన నిర్దోషత్వాన్ని తానే నిరూపించుకోవాలి. అభియోగం చేసిన సాక్షుల (తెలియజేసినవారి) పేర్లు రహస్యంగా ఉంచబడేవి, ఒకవేళ ఎవరైనా డిఫెన్స్ లాయరు ఉన్నట్లయితే, చర్చివిరోధిగా భావించబడిన వ్యక్తిని ఆయన విజయవంతంగా సమర్థిస్తే, చెడ్డ పేరు తెచ్చుకునే ప్రమాదం, తన పదవిని కోల్పేయే ప్రమాదం ఉంది. దాని ఫలితంగా, “నిందితులకు నిజానికి రక్షణే లేకుండా పోయింది. తప్పు ఒప్పుకోమని నిందితులకు సలహా ఇవ్వడమే లాయరు చేయగలిగింది!” అని ఎన్‌చిక్లోపీడియా కాటోలికా ఒప్పుకుంటుంది.
విచారణ ఊటోడఫేలో పరాకాష్ఠకొస్తుంది. ఊటోడఫే అనే పోర్చుగీస్ పదం భావం “విశ్వాస క్రియ.” ఏమిటది? చర్చి విరోధులని ఆరోపించబడిన దురదృష్టవంతులైన ముద్దాయిలు ఘోరమైన దృశ్యంగా చూపించబడ్డారని ఆ కాలానికి చెందిన ఒక చిత్రలేఖనము చూపిస్తుంది. నేరనిరూపణను గూర్చి చదివిన తర్వాత “ఖండించబడిన మరియు పశ్చాత్తాపపడిన చర్చి వ్యతిరేకులు చేసే బహిరంగంగా సమాధానపడే చర్యే” ఊటోడఫే అని డీట్స్యోనారియో ఏక్లేసీయాస్టీకో నిర్వచిస్తుంది.
చర్చివ్యతిరేకుల నేరనిరూపణ మరియు శిక్ష వాయిదా వేయబడేవి. నేరస్థులని తీర్పు తీర్చబడినవారిని అలా సంవత్సరానికి రెండుసార్లు లేదా అంతకన్నా ఎక్కువసార్లు జరిగే భయంకరమైన ప్రదర్శన కొరకు జమచేసేవారు. భయంతోను క్రూరమైన ఆసక్తితోను పాల్గొనే చూపరుల ఎదుట చర్చివిరోధుల పెద్ద ఊరేగింపు ప్రదర్శించబడేది. దోషులుగా తీర్పు తీర్చబడినవారిని రెండో మూడో లేదా అంత కన్నా ఎక్కువ వీధుల మధ్య ఖాళీగా ఉండే విశాలమైన స్థలాల్లో అంచెలుగల మంచెను ఎక్కించేవారు. వారి శిక్షలు బిగ్గరగా చదవబడేవి. తమ విశ్వాసాలను వదులుకున్నవారు అంటే, చర్చి విరుద్ధ సూత్రాలను వదిలిపెట్టినవారు చర్చి సహవాసం నుండి బహిష్కరించబడే శిక్ష నుండి తప్పింపబడతారు, వారికి యావజ్జీవ కారాగార శిక్షతో సహా వివిధ శిక్షలు విధించబడతాయి. తమ విశ్వాసాలను వదిలిపెట్టకపోయినప్పటికీ, చివరి నిమిషంలో ప్రీస్టు దగ్గరకు వెళ్ళి పాపసంకీర్తన చేసినవారిని ఊపిరాడకుండా చేసి చంపేందుకు, ఉరితీసేందుకు, లేదా శిరచ్ఛేదం చేసేందుకు, ఆ తర్వాత కాల్చివేసేందుకు ప్రభుత్వాధికారులకు అప్పజెప్పేవారు. పశ్చాత్తాపపడనివారు సజీవంగా దహనం చేయబడేవారు. మరో బహిరంగ ప్రదర్శన చేసిన తర్వాత మరణశిక్ష అమలు చేయబడేది.
రోమా ఇన్‌క్విజిషన్ క్రియలు చాలా రహస్యంగా జరిగేవి. ఈ రోజు కూడా, పండితులు దాని అధికార పత్రాలను చూసేందుకు అనుమతించబడడం లేదు. అయితే, ఓరిమితో చేసిన పరిశోధన వల్ల రోమా కోర్టు విచారణా పత్రాలనేకం వెలికితీయబడ్డాయి. అవి ఏమి వెల్లడి చేస్తున్నాయి?
క్రైస్తవమత ఉన్నతాధికారి విచారణ
16వ శతాబ్దారంభంలో ఫీరన్‌సేలో జన్మించిన ప్యెట్రో కార్నసక్కీని పోప్ క్లెమెంట్ VII తన కోర్టులో తన పర్సనల్ సెక్రెటరీగా నియమించాడు. చర్చి సంబంధమైన ఆ పదవిలో కార్నసక్కీ చాలా త్వరితగతిన అభివృద్ధి సాధించాడు. అయితే ఆ పోప్ చనిపోయినప్పుడు కార్నసక్కి పదవి అకస్మాత్తుగా లేకుండాపోయింది. తర్వాత, తనలాగే, ప్రొటెస్టెంట్ సంస్కరణోద్యమం బోధించిన అనేక సూత్రాలను అంగీకరించిన ప్రముఖులతోను చర్చి నాయకులతోను ఆయనకు మంచి పరిచయం ఏర్పడింది. దాని ఫలితంగా, ఆయన మూడు సార్లు విచారణ చేయబడ్డాడు. ఆయనకు మరణ శిక్ష విధించబడింది, ఆయన శిరస్సు ఛేదించబడింది, శరీరం కాల్చివేయబడింది.
కార్నసక్కీ కారాగార జీవితాన్ని సజీవ మరణంగా వ్యాఖ్యాతలు వర్ణించారు. ఆయనను లొంగదీసుకునేందుకు ఆయనను వేధించి, పస్తులుంచారు. 1567 సెప్టెంబర్ 21న, రోమ్‌లోని దాదాపు కార్డినల్‌లందరి సమక్షంలో సాంప్రదాయబద్ధమైన ఊటోడఫే నిర్వహించబడింది. కార్నసక్కీ శిక్షావిధిని పెద్ద జనసమూహం ఎదుట అంచెలుగల మంచె మీద ఆయనకు వినిపించారు. ఆచారం ప్రకారం పొందుపరచిన మాటలతోనూ, సివిల్ కోర్టు సభ్యులెవరికైతే చర్చివిరోధిని అప్పగిస్తారో వాళ్ళు ‘ఆ వ్యక్తికి మరీ కఠినంగా శిక్షను అమలు చేయకూడదు, చనిపోయేంతగా శిక్షించకూడదు, మరీ రక్తం ప్రవహించేంతగా వేధించకూడదు’ అని కోరడంతోనూ ఆ కార్యక్రమం ముగిసింది. ఇది మహా గొప్ప వేషధారణే కదా? ఈ ఇన్‌క్విజిటర్‌లు చర్చి విరోధులను నిర్మూలం చేయాలని కోరుకున్నారు, కానీ అదే సమయంలో, దయ చూపించమని లోకాధికారులను కోరుతున్నట్లు నటిస్తూ, తమ పేరు అప్రతిష్ఠపాలు కావడాన్ని నివారిస్తూ, రక్తాపరాధాన్ని ఇతరులపైకి నెట్టారు. కార్నసక్కీని అంచెలుగల మంచె మీద ఎక్కించి ఆయన శిక్షావిధిని చదివి వినిపించిన తర్వాత, సాన్‌బెనిటో అనే వస్త్రాన్ని తొడిగించారు. సాన్‌బెనిటో అనేది పశ్చాత్తాపపడినవారి కొరకైన ఎర్రని సిలువల గుర్తున్న పసుపురంగు గోనెపట్ట వస్త్రం లేదా పశ్చాత్తాపపడని వారి కొరకైన మంటలు మరియు భూతముల బొమ్మలు గల నల్లని గోనెపట్ట వస్త్రం. పది రోజుల తర్వాత శిక్ష విధించబడింది.
మునుపటి పోప్ సెక్రెటరీపై నేరారోపణ ఎందుకు చేయబడింది? ఆయన సవాలు చేసిన సిద్ధాంతాలను గూర్చిన 34 ఆరోపణలను బట్టి ఆయన దోషిగా నిరూపించబడ్డాడని గత శతాబ్దాంతంలో కనుగొన్న ఆయన విచారణను గూర్చిన ఆధికారిక వృత్తాంతాలు వెల్లడి చేస్తున్నాయి. అందులో పాపవిమోచనా స్థలం, ప్రీస్టుల, సన్యాసినుల బ్రహ్మచర్యం, రొట్టె, ద్రాక్షామద్యం క్రీస్తు శరీరంగానూ రక్తంగానూ మారడం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, పాపసంకీర్తనం, కొన్ని ఆహారపదార్థాల నిషేధం, పాపపరిహార పత్రాలు, “పరిశుద్ధులకు” ప్రార్థనలు వంటి బోధలు ఇమిడి ఉన్నాయి. ఎనిమిదవ ఆరోపణ ముఖ్యంగా ఆసక్తికరమైనది. (27వ పేజీలోని బాక్స్‌ను చూడండి.) “పరిశుద్ధ లేఖనములలో వ్యక్తం చేయబడిన దేవుని మాటలను” మాత్రమే విశ్వాసానికి ఆధారంగా అంగీకరించినవారికి మరణశిక్ష విధించడం ద్వారా, పరిశుద్ధ బైబిలును మాత్రమే ప్రేరేపిత మూలంగా కాథలిక్ చర్చి పరిగణించడం లేదని ఇన్‌క్విజిషన్ స్పష్టంగా చూపించింది. కనుక, అనేక చర్చి సిద్ధాంతాలు లేఖనాలపై కాక, చర్చి పారంపర్యంపై ఆధారపడి ఉండడంలో ఆశ్చర్యం లేదు.
యువ విద్యార్థి మరణశిక్ష
క్లుప్తమైన, కదిలించే విధమైన పోమ్పాన్యో ఆల్‌జేరీ జీవిత కథ అంతగా ఎవరికీ తెలియదు. ఆయన 1531లో నేపల్స్ దగ్గర జన్మించాడు. కానీ అనేక మంది పండితులు శ్రద్ధాపూర్వకంగా చరిత్రను పరిశోధించినందువల్ల అజ్ఞాత కాలంనాటి ఈ కథ బయటికి వచ్చింది. ఆల్‌జేరీ పాడవ యూనివర్సిటీలో చదువుకుంటున్న కాలంలో, యూరప్‌లోని అనేక ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతో తనకు గల సంబంధాల ద్వారా చర్చివిరోధులు అని పిలువబడేవారితోను ప్రొటెస్టెంట్ సంస్కరణోద్యమ సిద్ధాంతాలతోను పరిచయం ఏర్పడింది. లేఖనాలలో ఆయనకు ఆసక్తి పెరిగింది.
బైబిలు మాత్రమే దైవ ప్రేరేపితమని ఆయన విశ్వసించనారంభించాడు, దాని ఫలితంగా, పాపసంకీర్తనం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, పాపవిమోచనా స్థలం, రొట్టె, ద్రాక్షమద్యం క్రీస్తు శరీరంగానూ రక్తంగానూ మారడం, “పరిశుద్ధుల” మధ్యవర్తిత్వం వంటి అనేక కాథలిక్ సిద్ధాంతాలను అలాగే పోప్ క్రీస్తు ప్రతినిధి అనే బోధలను తిరస్కరించాడు.
పాడవలోని ఇన్‌క్విజిషన్ ఆల్‌జేరీని అరెస్టు చేసి, విచారణ చేసింది. “నేను ఇష్టపూర్వకంగా మళ్ళీ చెరసాలకు వెళ్తున్నాను. ఒకవేళ నేను మరణించడమే దేవుని చిత్తమైతే, మరణానికైనా నేను సిద్ధమే. దేవుడు తన తేజస్సు ద్వారా ప్రతి ఒక్కరికి మరింత జ్ఞానోదయాన్ని కలిగిస్తాడు. బాధితుల ప్రాణాలకు సంపూర్ణ ఊరటకలిగించేవాడును, నా జ్ఞానోదయమును, నా నిజమైన వెలుగును, ప్రతి అంధకారాన్నీ పారద్రోలగలవాడును అయిన క్రీస్తును బట్టి ప్రతి వేధింపును ఆనందంగా భరిస్తాను” అని తన విచారణకర్తలతో ఆయన అన్నాడు. ఆ తర్వాత, పాడవలోని ఇన్‌క్విజిషన్ రోమా ఇన్‌క్విజిషన్‌కు ఆయనను అప్పగించింది. రోమా ఇన్‌క్విజిషన్ ఆయనకు మరణశిక్ష విధించింది.
ఆల్‌జేరీ మరణించినప్పుడు ఆయనకు 25 ఏండ్లు. రోమ్‌లో ఆయనకు మరణశిక్ష విధించబడినప్పుడు, తప్పని ఒప్పుకునేందుకైనా లేక చర్చిలో జరిగే పూజలో పాల్గొనేందుకైనా ఆయన నిరాకరించాడు. ఆయనకు మరణశిక్ష విధించేందుకు ఉపయోగించిన ఉపకరణం సాధారణకన్నా చాలా ఘోరమైనది. అనేక కట్టెలను పేర్చి రగిలించిన మంటలో ఆయనను కాల్చలేదు. బదులుగా, నిప్పంటుకోగల వస్తువులను—చమురును, కీలును, గుగ్గిలాన్ని—పెద్ద అండా నిండా నింపి, అంచెలుగల మంచె మీద జనసమూహముల ముందు పెట్టి ఆ యువకుణ్ణి బంధించి అందులోకి దించి, అండాలో ఉన్నదానికి నిప్పంటించారు. ఆ యువకుడు నెమ్మదిగా సజీవంగా కాలిపోయాడు.
మరో గంభీరమైన దోషానికి కారణం
ఇన్‌క్విజిషన్ చేత మరణశిక్షకు గురైన కార్నసక్కీకి, ఆల్జేరీకి, మరితరులకు లేఖనాలను గురించిన పూర్తి అవగాహన లేదు. జ్ఞానము ఇంకా ఈ విధానము యొక్క “అంత్యకాలము”లో “అధికమ”వ్వవలసివుంది. అయితే, దేవుని వాక్యము నుండి వారు సంపాదించుకోగలిగిన కొద్ది పాటి “నిజమైన జ్ఞానమును” [NW] బట్టి వారు మరణించేందుకు కూడా సిద్ధమయ్యారు.—దానియేలు 12:4.
ప్రొటెస్టెంట్లు వారి సంస్కర్తలలో కొందరితో సహా ఏకీభవించని వారిని కొయ్య మీద కాల్చి నిర్మూలం చేశారు లేదా కాథలిక్‌లను ప్రభుత్వాధికారుల సహాయంతో చంపారు. ఉదాహరణకు, కాల్విన్ శిరచ్ఛేదం చేయడానికి ఇష్టపడినప్పటికీ, త్రిత్త్వ విరోధియైన చర్చివిరోధిగా మైకిల్ సెర్వటస్‌ను సజీవంగా కాల్పించాడు.
కాథలిక్‌లు మరియు ప్రొటెస్టెంట్లు చర్చివిరోధులను వేధించి మరణశిక్ష విధించడం సాధారణమే అయినప్పటికీ, వారలా చేసేందుకు సమర్థనీయమైన కారణాలేమీ లేవన్నదే వాస్తవం. కానీ మతాధికారులు మరో గంభీరమైన విషయంలో బాధ్యత వహిస్తున్నారు. హత్యలకు లేఖనాధార కారణాలున్నాయని సమర్థించుకుంటున్నందుకు, అలాంటి చర్యలను గైకొనమని దేవుడే ఆజ్ఞాపించినట్లు నటించినందుకు బాధ్యత వహిస్తున్నారు. అది దేవుని నామంపై ఎంతో నిందను తీసుకురాదా? “మతసంబంధ” బలప్రయోగమనే సూత్రాన్ని, అంటే చర్చివిరోధానికి వ్యతిరేకంగా పోరాడేందుకు బలాన్ని ఉపయోగించడాన్ని మొదట సమర్థించింది సుప్రసిద్ధుడైన కాథలిక్ “చర్చి ఫాదర్” అయిన అగస్టీన్ అని అనేక మంది పండితులు ధృవీకరిస్తున్నారు. తాము చేస్తున్నదాన్ని సమర్థించుకునేందుకు బైబిలును ఉపయోగించే ప్రయత్నంలో, లూకా 14:16-24 వచనాల్లోవున్న యేసు ఉపమానంలోని “లోపలికి వచ్చుటకు . . . బలవంతము చేయుము” అన్న మాటలను ఆయన ఉటంకించాడు. స్పష్టంగా, అగస్టీన్ అపార్థం చేసుకున్న ఈ మాటలు ఉదారంగా ఆతిథ్యం ఇవ్వడాన్ని సూచిస్తున్నాయి కానీ, క్రూరమైన బలప్రయోగాన్ని కాదు.
ఇన్‌క్విజిషన్ చురుగ్గా ఉన్నప్పుడు కూడా, మత సహిష్ణుతకు మద్దతునిచ్చేవారు గోధుమలు, గురుగుల ఉపమానాన్ని ఉదాహరిస్తూ, చర్చివిరోధులను పీడించడానికి వ్యతిరేకంగా వాదించారన్నది గమనార్హమైన విషయం. (మత్తయి 13:24-30, 36-43) రోటెర్‌డామ్‌లోని డేసీడర్యూస్ ఎరాస్‌మస్ వారిలో ఒకరు. పొలం యజమానియైన దేవుడు గురుగులను అంటే చర్చి విరోధులను సహించాలి అని కోరుకున్నాడు అని ఆయన అన్నాడు. మరొకవైపు, మార్టిన్ లూథర్ సామాన్యులైన వ్యతిరేకులకు విరుద్ధంగా హింసాకాండను పురికొల్పగా, దాదాపు లక్షమంది చంపబడ్డారు.
చర్చివిరోధులని పిలువబడేవారికి వ్యతిరేకంగా హింసాకాండను ప్రాబల్యంలోనికి తెచ్చిన క్రైస్తవ మత సామ్రాజ్యంలోని మతాల గంభీరమైన బాధ్యతను గుర్తిస్తూ, మనం ఏమి చేయడానికి పురికొల్పబడాలి? తప్పకుండా, దేవుని వాక్యాన్ని గూర్చిన నిజమైన జ్ఞానం కొరకు అన్వేషించాలని మనం కోరుకోవాలి. నిజ క్రైస్తవుని చిహ్నం దేవుని ఎడల మరియు తన పొరుగువాని ఎడల ఆయనకు గల ప్రేమ అని—హింసకు ఏ మాత్రం తావివ్వని ప్రేమ అని యేసు చెప్పాడు.—మత్తయి 22:37-40; యోహాను 13:34, 35; 17:3.
[27వ పేజీలోని బాక్సు]
కార్నసక్కీ దోషి అని నిరూపించిన కొన్ని నేరారోపణలు
8. “పరిశుద్ధ లేఖనములలో వ్యక్తీకరించబడిన దేవుని వాక్యాన్ని తప్ప మరి దేనినీ విశ్వసించకూడదని [నువ్వు నమ్మావు].”
12. “పరిశుద్ధంగా తలంచవలసిన పాపసంకీర్తనం డీ యూరె డీవీనో [దైవిక నియమం ప్రకారం] కాదనీ, అది క్రీస్తు చేత స్థాపించబడినది కాదనీ, దేవునికి తప్ప మరెవరికీ ఏ ప్రకారమైన పాపసంకీర్తన చేయనవసరం లేదనీ [నువ్వు నమ్మావు].”
15. “పాపవిమోచనస్థలాన్ని గురించి సందేహాన్ని విసిరావు.”
16. “మృతుల కొరకైన ప్రార్థనలు ఇవ్వబడిన మాక్కాబీస్ పుస్తకం సందేహాస్పదమైనదని నువ్వు పరిగణించావు.”
[24వ పేజీలోని చిత్రసౌజన్యం]
The Complete Encyclopedia of Illustration/J. G. Heck