కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 6/8 పేజీలు 28-29
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పెళ్లిళ్లు తగ్గుతున్నాయ్‌
  • ఆహార నియమం క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
  • నిద్రాలేమితో యౌవనులు
  • స్థిర జనాభా?
  • బ్యాటరీ-ఫ్రీ రేడియో
  • హంతకి వర్షం
  • ఆఫ్రికా ఏనుగులకు శిక్షణ
  • చావును కొనితెచ్చే సాహసకృత్యాలు
  • పిల్లల సైన్యాలు
  • దోమలకోసం కాదు
  • ఏనుగులు—మిత్రులా లేక శత్రువులా?
    తేజరిల్లు!—1994
  • మీ శరీరానికి నిద్ర ఎందుకవసరం
    తేజరిల్లు!—1995
  • నాకు మంచిగా నిద్రపట్టాలంటే ఏం చేయాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—2001
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 6/8 పేజీలు 28-29

ప్రపంచ పరిశీలన

పెళ్లిళ్లు తగ్గుతున్నాయ్‌

“వివాహం ఒక వ్యవస్థగా అదృశ్యమవ్వడాన్ని మనం చూస్తున్నాము” అని స్టాటిస్టిక్స్‌ కెనడావద్ద ప్రస్తుత జనాభా విశ్లేషణ అధ్యక్షునిగావున్న జాన్‌ డ్యూమా అంటున్నాడు. ద టొరాంటో స్టార్‌ ప్రకారం కెనడాలో, ప్రత్యేకంగా క్విబెక్‌లో వివాహ రేట్లు పడిపోతున్నాయి. కొన్ని కేసుల్లో తమ స్వంత తలిదండ్రుల వివాహాల గురించి సదభిప్రాయం లేకపోవడంవల్ల శాశ్వతమైన వివాహానికి కట్టుబడివుండడంపట్ల అయిష్టత ఏర్పడుతుందని ఆ రిపోర్టు చెబుతుంది. 1969లో పెళ్లి చేసుకున్న దంపతుల్లో 30 శాతంమంది 1993వ సంవత్సరానికల్లా కల్సివుండడం లేదని 25 సంవత్సరాల కాలంలో సమీకరించబడిన సమాచారం వెల్లడిస్తుంది. మరీ ఇటీవలనే పెళ్లి చేసుకున్న దంపతులు కూడా విడాకులు తీసుకుంటున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. 1993లో కెనడాలో విడాకులు తీసుకున్న వారందర్లో మూడింట ఒక వంతుమంది ఐదుకన్నా తక్కువ సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నవారే, 1980లో ఈ సంఖ్య నాలుగింట ఒక వంతు మాత్రమే ఉండేది. ఒంటారియోలోని యూనివర్సిటీ ఆఫ్‌ గ్వెల్ఫ్‌వద్దనున్న వివాహ, కుటుంబ సేవా కేంద్రానికి డైరెక్టరైన మార్షల్‌ ఫైన్‌ ఇలా అంటున్నాడు: “యౌవనస్థులకు ఈ ప్రపంచం అంత భద్రతకలదిగా కన్పిస్తున్నట్లు లేదు.”

ఆహార నియమం క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

రోజుకు కనీసం ఐదు గరిటెల పళ్లూ, కూరగాయలూ తినడం ఒక వ్యక్తికి ఊపిరితిత్తుల క్యాన్సరు, పెద్దప్రేవుల క్యాన్సరు, ఉదర క్యాన్సరు, మరితర భాగాల్లో క్యాన్సరు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని ద వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నివేదిస్తుంది. ఈ ఆహార నియమంయొక్క ప్రయోజనాలను ధృవీకరించే “బలమైన సాక్ష్యాధారం” కనీసం 17 దేశాల్లో 200 కన్నా ఎక్కువ అధ్యయనాలు జరిపిన తర్వాత వెలుగులోనికి వచ్చింది. తీసుకునే మొత్తం మరీ ఎక్కువగా ఉండనవసరం లేదు. అమెరికా జాతీయ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ చేపట్టిన ఒక కార్యక్రమం ప్రకారం సరైన మోతాదు ఇదీ: “ఒక చిన్న పండు, మూడొంతుల కప్పు పండ్లరసం, ఉడకబెట్టిన కూరగాయలు సగం కప్పు, సాలడ్‌లో ఒక కప్పు తాజా ఆకుకూరలు, లేక ఒక కప్పులో నాలుగవవంతు డ్రైఫ్రూట్లు.” ఈ ఇన్‌స్టిట్యూట్‌ ఈ విధమైన ఆహార నియమాన్ని ఐదు సంవత్సరాలుగా సిఫారసు చేస్తూ వచ్చింది, కానీ ప్రస్తుతం అమెరికాలో, ప్రతి ముగ్గురు పెద్దవాళ్లలో ఒక్కరు, ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒక్కరు మాత్రమే ఈ నిర్దేశనాన్ని అనుసరిస్తున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌పట్ల తీవ్రమైన వాంఛ దీని విజయానికి అడ్డంకులను ఏర్పరుస్తున్నట్లు ఉంది. ద వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఇలా చెబుతుంది: “కెచప్‌తో ఫ్రెంచ్‌ ఫ్రైలు రెండు గరిటెల కూరగాయలతో సమానం కావు.”

నిద్రాలేమితో యౌవనులు

టీనేజర్లు తెల్లవారిన తర్వాత కూడా పడకమీదనుండి లేవడానికి ఇష్టపడకపోవడానికి టీవీ, తిరుగుబాటుతనం, లేక సోమరితనం వంటివి కారణమౌతుంటాయి. కానీ వీటితోపాటు మరికొన్ని కారణాలు ఉండవచ్చని ఆస్ట్రేలియా, అమెరికాల్లోని కొంతమంది నిద్రా నిపుణులు అంటున్నారని ఏసియావీక్‌ పత్రిక నివేదిస్తుంది. యౌవనస్థులు ఎక్కువగా నిద్రపోవాలని ఇష్టపడడానికి వారిలో హార్మోనుల మార్పులు సంభవించడం, వారి పెరుగుదల అకస్మాత్తుగా జరగడం వంటివి కారణమౌతుండవచ్చని ఆస్ట్రేలియా నిద్రా నిపుణుడు డా. క్రిస్‌ సీటన్‌ అంటున్నాడు. తొమ్మిదేళ్లప్పుడు ప్రారంభమై, యౌవనస్థుని నిద్రావసరత పెరుగుతూ ఉంటుంది. అయితే, 17 నుండి 19 ఏండ్ల వయస్సుల్లోవున్న 3,000 మంది అమెరికా విద్యార్థులపై జరిపిన ఒక సర్వేలో 85 శాతంమంది కావాల్సిందానికన్నా తక్కువగా నిద్రపోతున్నారని తేలింది. దాని పర్యవసానంగా విద్యార్థులు తరచూ నిద్రమూలాన జోగుతూ ఉంటారని, ఇది ప్రత్యేకంగా ఉదయంపూట తరగతుల్లో ఎక్కువగా జరుగుతుందని ద న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదిస్తుంది. “ఈ పిల్లలు ఎంత నిద్రాలేమితో ఉన్నారంటే, వారు నిజానికి మాదకద్రవ్యాలు తీసుకున్నారా అన్నట్లుగా ఉంది” అని కార్నల్‌ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్‌ జేమ్స్‌ బి. మాస్‌ అన్నాడు. ఈ టీనేజర్లకు ఒక రాత్రికి కనీసం ఎనిమిదిన్నర గంటల నిద్రన్నా అవసరమని నిపుణులు విశ్వసిస్తున్నారు.

స్థిర జనాభా?

వీయన్నాలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అప్లైడ్‌ సిస్టమ్స్‌ అనాలసిస్‌ (IIASA) ప్రకారం ప్రస్తుత ప్రపంచ జనాభా బహుశ రెండింతలవ్వకపోవచ్చు. వారి అంచనాల ప్రకారం జనాభా “ప్రస్తుతమున్న 575 కోట్లనుండి 2050కల్లా 1,000 కోట్లకు చేరుకుని, 2075 కల్లా శిఖరాగ్ర సంఖ్యగా 1,100 కోట్లకు చేరుకోవచ్చు, తర్వాత 2100 సంవత్సరం సమీపిస్తుండగా దాదాపు స్థిరంగా ఉండడమో లేక కాస్త తగ్గడమో జరుగుతుంది” అని న్యూ సైంటిస్ట్‌ చెబుతుంది. IIASA ప్రకారం, మన ప్రస్తుత ప్రపంచ జనాభా ఎన్నటికీ రెండింతలు అవ్వదనడానికి 64 శాతం అవకాశం ఉంది. జనన రేట్లు 1995లో ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ తగ్గినట్లుగా కన్పిస్తుందని వారి సంఖ్యలు తెల్పుతున్నాయి.

బ్యాటరీ-ఫ్రీ రేడియో

ఆఫ్రికాలో చాలామట్టుకు గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు లేకపోవడమూ, బ్యాటరీలు సరిగ్గా అందుబాటులో లేకపోవడమూ వంటి పరిస్థితుల్ని మార్చడానికి దక్షిణ ఆఫ్రికాలో కేప్‌ టౌన్‌లోని ఒక చిన్న ఫ్యాక్టరీ చేతితో తిప్పే జనరేటర్‌ ఉన్న ఒక పోర్టబుల్‌ రేడియోను తయారు చేస్తుంది. “హ్యాండిల్‌ను గట్టిగా కొన్నిసార్లు తిప్పండి, దాంతో అది అరగంటసేపు పనిచేస్తుంది” అని ద న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదిస్తుంది. టిఫిన్‌ డబ్బా పరిమాణంలో, మూడు కిలోల బరువున్నప్పటికీ ఈ క్రొత్త మోడల్‌ తప్పకుండా విజయం సాధిస్తుందనిపిస్తోంది. ఈ ఫ్యాక్టరీలోని మార్కెటింగ్‌ కార్యకలాపాల్ని చూసుకుంటున్న సియాంగా మలూమా ప్రకారం రేడియోను రోజుకి ఐదునుండి పది గంటలపాటు ఉపయోగించినట్లైతే మూడు సంవత్సరాల్లో 500 నుండి 1,000 డాలర్ల బ్యాటరీల వరకు ఆదా అవుతుంది. సైకిలూ, మోటరుసైకిళ్లతోపాటు “రేడియో ఆఫ్రికాలోని మూడు పెద్ద ప్రతిష్ఠా చిహ్నాలలో ఒకటని” మలూమా అంటున్నాడు. “మీరు నిశ్చయంతో ఉండవచ్చు” అంటూ ఆయన నొక్కిచెబుతున్నాడు. మీరు ఒక్క రేడియోకి యజమానియైతే “మీరు వివాహం చేసుకోవడానికి యోగ్యులౌతారు” అని ఆయన అంటున్నాడు.

హంతకి వర్షం

స్వీడన్‌కు చెందిన శాస్త్రజ్ఞుడు డా. ఆడ్రియన్‌ ఫ్రాంక్‌ ప్రకారం, ఆమ్ల వర్షం స్కాండినేవియాలోని అనేకమైన లేళ్ల మృత్యువుకు పరోక్షంగా కారణమైంది. కలుషితమైన వర్షం ప్రభావాలను త్రిప్పికొట్టడానికి పొలాల్లోనూ, సరస్సుల్లోనూ సున్నం జల్లబడింది. అయితే, సున్నం వెదజల్లిన మట్టిలో పెరిగిన మొక్కల్లో కొన్ని మూలకాల మోతాదులు పెరిగినట్లు, ప్రత్యేకంగా మాలిబ్డెనమ్‌ మోతాదు పెరిగినట్లు కన్పిస్తోంది. లేళ్లు అధిక మోతాదులో మాలిబ్డెనమ్‌ను లోపలికి తీసుకోవడంవలన వాటి రోగనిరోధక వ్యవస్థలను బాగా ప్రభావితం చేసే రాగికొరత వాటిలో ఏర్పడుతుంది. ఈ రాగి కొరత వాటికి ప్రాణాంతకంగా ఉంటుంది. ఆమ్ల వర్షం కలిగించే అదనపు పరిణామంగా, ఇప్పుడు స్వీడన్‌లోని 4,000కు పైగా ఉన్న సరస్సుల్లో చేపలు జీవించలేకపోతున్నాయి. నార్వేలో మంచినీటి చేపల సంఖ్య మునుపటికన్నా సగానికి తగ్గిపోయింది. కాలుష్యం ఉత్పన్నమవ్వడాన్ని అదుపులో ఉంచడానికి బ్రిటీష్‌ ప్రభుత్వం తన శక్తి ఉత్పాదక కేంద్రాలనుండి వెలువడే సల్ఫర్‌ను తగ్గించినప్పటికీ ఆమ్ల వర్షపు అవశిష్టాల ప్రభావాలు చాలా సంవత్సరాల వరకూ కొనసాగవచ్చని లండన్‌లోని ద సండే టెలిగ్రాఫ్‌ అంటుంది.

ఆఫ్రికా ఏనుగులకు శిక్షణ

ఆసియా ఏనుగులు శతాబ్దాలుగా పనిచేయించుకోవడానికి ఉపయోగించబడ్డాయి. అయితే, వాటికన్నా కాస్త పెద్దగా ఉండే ఆఫ్రికా ఏనుగులు మచ్చిక చేసుకోవడానికి వీలుకానంత మదంతో ఉంటాయని భావించబడేది. కానీ ఒక విజయం సాధించినట్లు కన్పిస్తోంది. జింబాబ్వేలోని ఇమీరె వన్యప్రాణి సంరక్షక కేంద్రంలో ఆఫ్రికా ఏనుగులు పొలాలు దున్నడానికీ, దుర్గమంగా ఉన్న ప్రాంతాల్లోకి అటవీశాఖ రేంజర్లను తీసుకెళ్లడానికీ ఉపయోగించబడ్తున్నాయి. ఇక్కడ ఉపయోగించబడే శిక్షణా పద్ధతి “ప్రేమ మరియు ప్రతిఫలం” అని పిలువబడుతుంది. న్యాషా అనే ఒక ఏనుగు, మూచెమ్వా అనే ఒక కార్మికుడ్ని తనపై కూర్చుండబెట్టుకుని పొలం దున్నడాన్ని ఒక ఆఫ్రికా వార్తాపత్రిక రిపోర్టరు చూశాడు. “అప్పుడప్పుడు ఆ ఏనుగు తన తొండాన్ని తనపైన కూర్చున్న మూచెమ్వావైపుకి చాపుతుంది, అప్పుడాయన దానికి ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే ఒక తినుబండారాన్ని అందిస్తాడు” అని ఆ రిపోర్టరు వివరిస్తున్నాడు. ఆ నివేదిక ఇలా కొనసాగింది: “ఇమీరెలోని న్యాషా, మరితర ఆరు శిక్షణపొందిన ఏనుగులు వర్షాకాలానికి ముందే జొన్నలూ మరితర పంటలకూ పొలాల్ని సిద్ధం చేయడానికి ఉపయోగించబడ్తాయి. వీటికీ, ఈ కేంద్రంలోని మరితర జంతువులకూ ఆహారంగా ఆ పంటలను ఉపయోగిస్తారు.”

చావును కొనితెచ్చే సాహసకృత్యాలు

ఫ్రాన్స్‌లో బంగీ జంపింగ్‌, ఫ్రీ క్లైంబింగ్‌, స్కైడైవింగ్‌, బేస్‌ జంపింగ్‌ లాంటి సాహస క్రీడలు అత్యంత ప్రజాదరణను పొందుతున్నాయి. ఈ సాహస క్రీడలు ఫ్రాన్స్‌లో ఎందుకంత ప్రజాదరణను పొందుతున్నాయని పారిస్‌ వార్తాపత్రిక ల మోండ్‌ అనేకమంది నిపుణులను అడిగింది. క్రమశిక్షణకన్నా స్వేచ్ఛకూ, సరదాకీ ప్రాముఖ్యతనిచ్చే నేటి యువత అనుసరించే విలువలకూ సాంప్రదాయిక క్రీడల్లో అవసరమయ్యే నియమాలూ, క్రమశిక్షణా, శిక్షణా వంటివాటికీ ఇక ఎంతమాత్రమూ పొంతన లేకపోవడం ఒక కారణమని వినూత్న క్రీడల అధ్యయన కేంద్రం డైరెక్టరైన ఆలన్‌ లోరేట్‌ చెప్పాడు. ఫ్రెంచి సమాజశాస్త్రవేత్త దావిద్‌ ల బ్రటోన్‌ ప్రకారం “అత్యంత ప్రమాదభరితమైన క్రీడలకు పెరిగిపోతున్న ప్రజాదరణ నైతిక విలువల సంక్షోభానికి అద్దం పడుతోంది. నిజానికి, మనం దేనికొరకు జీవిస్తున్నామో మనకిక నిజంగా ఎంతమాత్రం తెలియదు. జీవితం జీవించాల్సినంత విలువైందని మన సమాజం మనకు చెప్పట్లేదు. అందుకనే సాహసం కొరకైన ఈ వెదుకులాట . . . జీవితానికొక అర్థం ఉండేలా చేసుకోవడానికి ఒక మార్గమని అర్థంచేసుకోవచ్చు.” అయితే, చాలామంది యౌవనులు తమ ప్రాణాలను ప్రమాదంలో పడవేసుకుని వాటిని కోల్పోతున్నారు.

పిల్లల సైన్యాలు

26 దేశాల్లో పరిశోధన జరిపి, ఇంగ్లాండ్‌లోని మాంఛెస్టర్‌లోని గార్డియన్‌ వీక్లీలో నివేదించినదాని ప్రకారం, ఏడేళ్ళంత చిన్న వయస్సు పిల్లల్తో సహా ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షలమంది పిల్లలు సాయుధ బలగాల్లో పనిచేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి యొక్క రెండేళ్ల అధ్యయనంలో భాగమైన ఆ నివేదిక, సైన్యంలో క్రొత్తగా చేరిన పిల్లలతో మొరటుగా వ్యవహరిస్తారనీ, తరచూ తమ బంధువులను హింసించడాన్నీ, వారిని చంపడాన్నీ ప్రత్యక్షంగా చూసేలా బలవంతపెడ్తారనీ వెల్లడించింది. ఆ తర్వాత, వారు మరణశిక్షను అమలుపర్చేవారిగానూ, హత్యలు చేసేవారిగానూ, గూఢచారులుగానూ ఉపయోగించబడ్తారు. ఒక దేశంలో “చిత్రహింసలు పెట్టమనీ, తప్పించుకోవడానికి ప్రయత్నించే పిల్లల్నైనా పెద్దల్నైనా అవిటివారిగా చేయమనీ లేక చంపమనీ పిల్ల సైనికుల్లో చాలామందికి ఆజ్ఞాపించడం జరిగింది.” పోరాటం చేయడానికి ముందు పిల్లలకు తరచూ మాదకద్రవ్యాలనో లేక మత్తుపానీయాలనో ఇవ్వడం జరుగుతుంది, దాంతో వారు “తాము అమర్త్యులమన్నట్లో, తమనెవరూ గాయపర్చలేరన్నట్లో” భావిస్తూ యుద్ధానికి దూసుకుపోవడం కన్పిస్తుంది.

దోమలకోసం కాదు

రాత్రిపూట కీటకాలను ఆకర్షించి టప్‌మని శబ్దం చేస్తూ వాటిని చంపే బగ్‌ జాపర్‌లు అని పిలువబడే, ఇంటిబయట వ్రేలాడదీయబడే విద్యుత్‌ ఉపకరణాలు దోమలపైన పనిచేయడంలేదు. “ఈ ఉపకరణాలు ఎందుకూ పనికిరావు” అని కీటకశాస్త్ర ప్రొఫెసర్‌ అయిన జార్జ్‌ బి. క్రేగ్‌, జూ. అంటున్నాడు. ఆహారం కొరకు వెదికే దోమల్లో చాలామట్టుకు ఆ ఉపకరణాలనుండి వచ్చే వెలుగుకు ఆకర్షితం కావడంలేదు, మనుషుల్ని కుట్టే ఆడదోమలు అమ్మోనియా, కార్బన్‌ డయాక్సైడ్‌, వేడి వంటివాటితోపాటు చర్మం నుండి వెలువడే మరితర పదార్ధాల కొరకు వెదుకుతున్నాయి. మరి వీటిని బగ్‌ జాపర్‌లు ఇవ్వడంలేదు. ఇవి దొరకకపోవడంతో అవి ఈ ఉపకరణాలకు దూరంగా ఎగిరిపోతున్నాయి. దానికితోడు, జాపర్‌లతో దోమలను చంపబూనుకోవడం అనేది “సముద్రాన్ని గరిటెతో శుద్ధం చేయాలని ప్రయత్నించడం వంటిది” అని డా. క్రేగ్‌ అంటున్నాడు. ఒక్క ఆడ దోమ కేవలం కొద్ది నెలల్లోనే 60,000 కన్నా ఎక్కువగా ఆడ సంతానాన్ని ఉత్పత్తి చేయగలదు. సాధారణంగా జాపర్‌లు ఒక రాత్రి చంపే కీటకాల్లో ఆడ దోమలు కేవలం 3 శాతం మాత్రమేనని మూడు నెలలపాటు జరిపిన అధ్యయనం ఒకటి చూపించింది. క్రేగ్‌ అభిప్రాయం ప్రకారం, జాపర్‌లు “గృహవినోదం సెక్షన్‌లో అమ్మబడాలి గానీ గార్డనింగ్‌ సెక్షన్‌లో కాదు.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి