కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 3/8 పేజీలు 16-19
  • విశిష్టమైన మాటర్‌హార్న్‌

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విశిష్టమైన మాటర్‌హార్న్‌
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • తొలి నివాసాలు
  • ప్రకృతి శాస్త్రంయెడల పెరుగుతున్న ఆసక్తి
  • మాటర్‌హార్న్‌ జయించబడింది!
  • చాలా హెచ్చైన మూల్యం
  • ప్రమాదాలు
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1996
  • కిలిమంజారో—ఆఫ్రికా పైకప్పు
    తేజరిల్లు!—1997
  • పర్వతాలు—సృష్టిలో ఉత్కృష్టమైనవి
    తేజరిల్లు!—1994
  • మహాతెలివిగల ఇంజనీర్లు
    తేజరిల్లు!—1994
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 3/8 పేజీలు 16-19

విశిష్టమైన మాటర్‌హార్న్‌

స్విట్జర్లాండ్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

“భూమ్యంతటిపైన ఒకే ఒక్క మాటర్‌హార్న్‌ ఉంది; అటువంటి సమతౌల్య నిష్పత్తులు గల ఒకే ఒక్క పర్వతం. అద్భుతమైన దృశ్యం!” అలా అని ఇటాలియన్‌ పర్వతారోహకుడైన గ్వీడో రే అన్నాడు.

నిజానికి, ప్రపంచంలోని ప్రసిద్ధమైన పర్వతాలలో ఒకటైన మాటర్‌హార్న్‌, అసాధారణమైన పర్వతం. ఈ పేజీల్లోని ఈ గమనార్హమైన పర్వతంయొక్క చిత్రాన్ని చూడడం బహుశ మీకిదే మొదటిసారి కాకపోవచ్చు.

పిరమిడ్‌వంటి మాటర్‌హార్న్‌, ఇటలీ స్విట్జర్లాండ్‌ల సరిహద్దుల్లో, స్విట్జర్లాండ్‌లోని జర్మాట్‌ గ్రామానికి పది కిలోమీటర్లు నైరృతి దిశలో ఉంది. ఈ పట్టణం నుండే శిఖరానికి ఆ పేరు వచ్చింది. అది ఆకాశంలోకి 4,478 మీటర్ల ఎత్తు వరకు చేరుకుంటుంది, మరి 100 మీటర్ల ఎడంలో రెండు శిఖరాలున్నాయి.

అది మధ్య ఆల్ప్స్‌లలో భాగమైనప్పటికీ మాటర్‌హార్న్‌ దగ్గరలో ఏ పర్వతంలేకుండా ఒంటరిగా నిల్చుంటుంది. అన్ని దిక్కుల్లో నుండి పర్వతంయొక్క దివ్యమైన దృశ్యానికి ఇదే కారణమౌతూ దాన్ని ఛాయాచిత్రానికి అనుకూలంగా చేస్తుంది.

కొంతమంది మాటర్‌హార్న్‌ ఒక శూలాకార రాతి స్తంభంగా ఉంటుందని సరైన రీతిలోనే వర్ణించారు. ప్రతి ప్రక్క విస్పష్టంగా ఒక శిఖతో వేరు చేయబడి దాని నాలుగు ప్రక్కలు నలుదిక్కులకు బహిర్గతమై ఉంటాయి.

మాటర్‌హార్న్‌ అంత ఎత్తున్నా అది ఎప్పుడూ మంచుతో కప్పబడివుండదు. వసంతం ఆఖరులో నిట్రంగావున్న దాని పైభాగంలోని రాతి గోడలను కప్పి ఉంచే మంచు, సూర్యుని వేడిమి వలన కరిగిపోతుంది. దానికి క్రిందుగా, సంవత్సరమంతా పర్వతం నడుం చుట్టూ తెల్లని నడికట్టువలె తూర్పున మరియు వాయవ్యదిశలో మంచుదిబ్బలు దానికి అంటిపెట్టుకుని ఉంటాయి.

సాటిలేని ఈ పర్వతం ఎలా ఆవిర్భవించిందోనని అనేకమంది ప్రశంసకులు ఆశ్చర్యపోయారు. అది దేన్నుండైతే చెక్కబడిందో ఆ వస్తువుయొక్క అవశేషాలుగా దాని దిగువ భాగం చుట్టూ శిథిలాల కుప్పలు కనబడవు. చెప్పలేనన్ని వేలాది సంవత్సరాల దాని ఉనికిలో అటువంటి శిథిలాలు కొట్టుకొనిపోయుండవచ్చు. ఈ సుందర దృశ్యానికి బలమైన ప్రకృతి శక్తులు ఎంతగా తోడ్పడివుంటాయో!

తొలి నివాసాలు

మాటర్‌హార్న్‌ దిగువ భాగానికి నడిపించే ఆల్పైన్‌ లోయలో రోమా సామ్రాజ్య కాలంలోనే ప్రజలు నివసించనారంభించారు. సా.శ.పూ. 100వ సంవత్సరంలో రోమా సైన్యాధ్యక్షుడు మారియస్‌, మాటర్‌హార్న్‌కు తూర్పు దిక్కున టేయోడూల్‌ కనుమను 3,322 మీటర్ల ఎత్తులో దాటాడని చరిత్ర నివేదిస్తుంది. మధ్య యుగంలో దక్షిణం నుండి ఉత్తరానికి సరుకులను రవాణా చేయడానికి కూడా ఈ పర్వత మార్గం ఉపయోగించబడింది.

ఆ కాలాల్లో నివాసులు మాటర్‌హార్న్‌ను ఎంతో గౌరవంతో ఆఖరికి మూఢనమ్మకంతో కూడిన భయంతో చూసేవారు. దయ్యమే దానిపై నివసిస్తుందనుకుని, ఆ పర్వతాన్ని ఎక్కడానికి ఎప్పుడూ ప్రయత్నించేవారు కాదు! ఇళ్ళంత పెద్ద రాళ్ళను, హిమప్రపాతాలను క్రిందికి మరెవరు విసురుతారు?

ప్రకృతి శాస్త్రంయెడల పెరుగుతున్న ఆసక్తి

ఆ నమ్రతగల జనం బెదురుపాటుతో దేన్నుంచైతే దూరంగా వెళ్ళారో తరువాత అదే, ఇంగ్లాండ్‌యొక్క ఉన్నత వర్గంలో ఎంతో ఫ్యాషన్‌గా తయారైంది. వైజ్ఞానిక ఆసక్తి పెరగనారంభించింది, అది పరిశోధకులు భూగర్భశాస్త్రం, స్థలాకృతి వర్ణనశాస్త్రం మరియు వృక్షశాస్త్రం వంటి రంగాల్లో అధ్యయనాల కొరకు పర్వతాలను ఎక్కడానికి దారితీసింది.

నిజానికి 1857లో, లండన్‌లో ఆల్పైన్‌ క్లబ్‌ కనుగొనబడింది, మరి ఆల్ప్స్‌ను జయించేందుకు అనేకమంది సంపన్నులైన ఆంగ్లేయులు ఫ్రాన్స్‌, ఇటలీ, లేక స్విట్జర్లాండ్‌లకు ప్రయాణించారు. సాహసపూరిత వ్యక్తులు మో బ్లాంక్‌తో సహా శిఖరం తరువాత శిఖరం ఎక్కనారంభించారు. 4,807 మీటర్ల ఎత్తున్న ఈ పర్వతం ఐరోపాలోకెల్లా ఎత్తైనదైనప్పటికీ, పర్వతారోహకులకు మాటర్‌హార్న్‌ కంటే ఇది తక్కువ ప్రయాసను కలుగజేస్తుంది.

ఈ ప్రయత్నాలన్నీ పూర్తిగా ప్రకృతిశాస్త్రం పేరిటే జరగలేదు. లాలస ప్రవేశించింది. మొట్టమొదటి వారుగా, అతి ధైర్యవంతులుగా, మహా గట్టివారుగా ఉండడం ద్వారా వచ్చే ఖ్యాతి ఒక ముఖ్య కారణాంశంగా ఉండేది. ఆ సమయంలో ఇంగ్లాండ్‌లో “క్రీడ” అనే పదానికి ప్రధాన అర్థం పర్వతారోహణే.

ప్రాముఖ్యంగా మాటర్‌హార్న్‌ సంబంధంగా, పర్వతాలు ఎక్కడంలో 1865 వేసవి అతి సందడిగా ఉండింది. ఈ సమ్మోహన పిరమిడ్‌ జయించబడకుండా ఉన్న ఆఖరి శిఖరాలలో ఒకటి. అది దుర్గమంగా పరిగణించబడేది, స్థానిక గైడ్లు ప్రయత్నించడానికి కూడా నిరాకరించారు. వారి వైఖరి ఏమంటే, ‘ఏ ఇతర శిఖరమైనా ఫరవాలేదు—కానీ హార్న్‌ మాత్రం కాదు.’

అయినా గానీ మాటర్‌హార్న్‌పై విజయం అనివార్యమైంది. 1860ల తొలి భాగంలో అనేక ఆల్పైన్‌ శిఖరాలు జయించబడ్డాయి. ఆరోహకులు అనుభవంద్వారా నేర్చుకొన్నారు మరి క్రొత్త మెలకువలను వృద్ధి చేసుకున్నారు. ఆల్పైన్‌ దృశ్యాల విషయంపై ఒక పుస్తకం కొరకు చిత్రాలను గీయడానికి ఇంగ్లాండ్‌లోని ఎడ్వర్డ్‌ వింపర్‌, 20 సంవత్సరాల వయస్సులో, ఒక లండన్‌ సంపాదకునిద్వారా స్విట్జర్లాండ్‌కు పంపబడ్డాడు. పర్వతాలవల్ల వింపర్‌ సమ్మోహితుడయ్యాడు, మరి పర్వతాలను ఎక్కడం ఆయన ప్రగాఢ వాంఛ అయ్యింది. ఫ్రాన్స్‌ మరియు స్విట్జర్లాండ్‌లలో అనేక శిఖరాలను ఆయన జయించాడు మరి మాటర్‌హార్న్‌ ఎక్కడానికి అనేక యత్నాలు చేశాడు. కానీ హార్న్‌ ప్రతిఘటించింది.

మాటర్‌హార్న్‌ జయించబడింది!

ఆఖరికి, 1865 జూలైలో మూడు వివిధ ఆరోహణ జట్లు జర్మాట్‌లో కలవడం జరిగింది—ఆ మూడు జట్లూ మాటర్‌హార్న్‌ ఎక్కడం ప్రారంభించాయి. ఒక ఇటాలియన్‌ జట్టు తమకంటే ముందు వెళ్తుందేమోనన్న హడావుడిలో, ఈ మూడు జట్లు ఒక కొర్డే లేక తాడుతో కలపబడిన పర్వతారోహకుల వరుసగా కలిసి వెళ్ళడానికి నిశ్చయించుకొన్నారు. గుంపు ఏడుగురు పురుషులతో కూడినది—ఎడ్వర్డ్‌ వింపర్‌, లార్డ్‌ ఫ్రాన్సస్‌ డగ్లస్‌, చార్ల్స్‌ హడ్సన్‌, ఆయన యువ స్నేహితుడు హాడో—వీరందరూ ఆంగ్లేయులే—ఇద్దరు స్విస్‌ జాతీయులు, వారు కష్టపడి కుదుర్చుకున్న ఒక ఫ్రెంచ్‌ గైడ్‌.

జూలై 13న వారు జర్మాట్‌ను వదిలి ఏ తొందరా లేకుండా తూర్పునుండి పర్వతాన్ని సమీపించి క్రింది భాగాలు సాపేక్షికంగా సులభంగా ఎక్కగలిగేలా ఉన్నట్లు కనుగొన్నారు. వారు 3,300 మీటర్ల ఎత్తులో తమ డేరాను వేసి వెచ్చని ఎండ కాస్తున్న ఆ మిగిలిన దినాన్ని ఆనందించారు.

ఆ తరువాతి ఉదయం, జూలై 14న తెల్లవారకముందే ఎక్కడం మొదలెట్టారు. తాడు అప్పుడప్పుడు మాత్రమే అవసరమైంది. కొన్ని భాగాలు మిగతా భాగాల కంటే కష్టంగావున్నాయి కానీ మరీ క్లిష్టమైన అడ్డంకులకు తరచూ వారు చుట్టూతిరిగి వెళ్ళే మార్గాన్ని కనుగొన్నారు. రెండు విశ్రమ కాలాల తరువాత, వారు అతి కీలక భాగానికి చేరుకొన్నారు. ఆఖరి 70 మీటర్లలో ఒక మంచు మైదానం ఉంది, మధ్యాహ్నం 1:45కి వారు శిఖరానికి చేరుకొన్నారు. మాటర్‌హార్న్‌ జయించబడింది!

శిఖరంపైన మానవ సందర్శకుల చిహ్నాలేవీ కనుపించలేదు, కాబట్టి స్పష్టంగా వారే మొదటివారు. ఎంతటి అనుభూతి! ఒక గంట వరకు, విజయోత్సాహ జట్టు ప్రతి దిశలోనున్న ఊపిరిబిగబట్టేలాంటి దృశ్యాన్ని ఆనందించింది, అప్పుడు వారు దిగడానికి సిద్ధపడ్డారు. అదే రోజు ఆరోహణకు ప్రయత్నించిన ఇటాలియన్‌ పర్వతారోహకులు చాలా వెనుకగా ఉన్నందున, తాము పందాన్ని కోల్పోయామని తెలుసుకొన్నప్పుడు వెనక్కు మరలారు.

చాలా హెచ్చైన మూల్యం

అయితే, ఆరోహకుల విజయం వారికి చాలా హెచ్చైన మూల్యంగా పరిణమించబోతుంది. అవరోహణలో ఒక క్లిష్టమైన మార్గాన్ని చేరుకొన్న తరువాత అత్యంత అనుభవశాలియైన గైడ్‌ నాయకత్వం వహిస్తుండగా, వారందరూ కలిసి ఒకే తాడు కట్టుకున్నారు. వారు జాగ్రత్తపడినప్పటికినీ అందరిలో చిన్నవాడైన భాగస్థుడు జారి, తన పైనున్న వారిని తనతో ఈడుస్తూ, క్రిందున్న వ్యక్తిపై పడ్డాడు. ఆఖరి ముగ్గురు వ్యక్తులు కేకతో హెచ్చరించబడి, కొన్ని బండలను పట్టుకోగలిగారు. కానీ తాడు తెగి, క్షణంపాటులో మొదటి నలుగురు క్రింద నిట్రమైన ప్రాంతంలోకి మాయమయ్యారు.

కొయ్యబారిపోయిన ఎడ్వర్డ్‌ వింపర్‌ ఇంకా ఇద్దరు స్విస్‌ గైడ్లు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉండిపోయారు. వారు ఆ రాత్రికి విడిది చేసి, ఆ తరువాత రోజు జర్మాట్‌కు తిరుగు ప్రయాణం చేయవలసివచ్చింది. ఆ దినపు కీర్తి, బ్రతికిన వారి శేష జీవితాలపై గుర్తును విడిచిపెట్టిన దుర్ఘటనగా త్వరలోనే మారిపోయింది.

ప్రమాదం జరిగిన స్థలంనుండి 1,200 మీటర్ల దిగువన ఒక మంచుదిబ్బ నుండి, నాలుగు శవాలలో మూడు తరువాత స్వాధీనం చేసుకోబడ్డాయి. నాలుగవదైన లార్డ్‌ డగ్లస్‌ది, అసలు కనుగొనబడలేదు.

మాటర్‌హార్న్‌ లోతుల్లో బలైన వారిలో వీరే ఆఖరివారు కారు. రాతి గోడల పైకి లేక చుట్టూరా అనేక మార్గాలలో బండలోనికి మరియు సన్నని పగుళ్ళలోనికి అనేక త్రాళ్ళు గట్టిగా కట్టబడ్డాయన్నది వాస్తవమైనప్పటికీ పర్వతారోహకుల అనుభవం పెరుగుతున్నప్పటికీ మరియు ఎంతో అభివృద్ధి చెందిన సాధనాలున్నప్పటికీ కేవలం ఈ పర్వతంమ్మీదే దాదాపు 600 మరణాలు సంభవించాయి.

ప్రమాదాలు

ప్రమాదానికి ఎంతో దోహదపడే ఒక విషయమేమంటే వాతావరణం. అది ఎంతో త్వరగా మారిపోగలదు. ఒకరోజు సుందరంగా మొదలవ్వొచ్చు, కానీ ఒక వ్యక్తికి దానిగురించి తెలిసేలోపలే ఆ పిరమిడ్‌ను దట్టమైన పొగమంచు లేక నల్లని భారీ మేఘాలు కమ్ముకొని భయంకరమైన తుపాను మొదలవ్వగలదు. పెనుగాలులతోపాటు, భయాన్ని పుట్టించే మెరుపులు పిడుగులు దీనికి తోడవ్వొచ్చు, ఆఖరికి భారీ మంచు కురియడానికి దారితీయవచ్చు. మరి ఇదంతా అందమైన వేసవి రోజునే జరుగుతుంది!

ఒకవేళ ఇటువంటి సంఘటనలు హఠాత్తుగా ఆరోహకులకు ఎదురైతే వారు బయలులో ఆ రాత్రి, బహుశ వారిని కేవలం నిల్చోడానికి అనుమతించే కొంచెం ఎత్తుగావున్న స్థలంలో గడపవలసివస్తుంది. ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థానానికి తక్కువుండవచ్చు. క్రింద అగాధముంది. అప్పుడు తాను దూరం నుండే మాటర్‌హార్న్‌కు అభివాదం చేసివుండవలసిందని ఒకరు కోరుకోవచ్చు!

ఇంకొక ప్రమాదం రాళ్ళు పడడం. కొన్నిసార్లు ఆలోచన లేని ఆరోహకులు వారికైవారే రాళ్ళు పడేలా చేస్తారు. అయినా అనేక సందర్భాలలో కారణాలు ప్రాకృతికమైనవే. హార్న్‌ చుట్టూ వీస్తున్న బలమైన గాలులతో పాటు ఉష్ణోగ్రతల్లో మార్పులు, ఐసు, మంచు, కురుస్తున్న వర్షం, తీవ్రమైన ఎండ, ఇవన్నీ రాళ్ళపై ప్రభావం చూపిస్తూ పెద్ద ముక్కలు విడిపోవడానికి కారణమౌతాయి. అవి కొన్నిసార్లు వాటి స్థానంలోనే పెద్ద ఫలకాల కుప్పలలాగ సంవత్సరాల కొలది ఉండిపోతాయి కానీ ఆఖరికి అవి కదిలి పడిపోవడానికి హిమప్రపాతాలు కారణమవ్వవచ్చు.

ఈ అభివృద్ధి వేల సంవత్సరాల కొలది సాగుతూనే ఉన్నా దాని ఆకారంలో మార్పుల చిహ్నాలేమీ చూపక, ఈ పర్వతం దాని సన్నని శూలాకార రాతి స్తంభ రూపాన్ని కోల్పోలేదని అనేకమంది ఆరోహకులు ఆశ్చర్యపడ్డారు. గణించబడిన 250 కోట్ల ఘనపు మీటర్ల రాతితో పోల్చినప్పుడు, దాని ఆకారాన్ని మార్చడానికి పడిపోతున్న రాళ్ళు అంత ప్రాముఖ్యమైనవి కావు. అయినా అవి గాయపరుస్తాయి జీవం కోల్పోవడానికి కారణమౌతాయి.

ఈ లోపల మాటర్‌హార్న్‌ను ఎక్కడం ప్రజాదరణ పొందింది. కొంతమంది గైడ్లు దాని అగ్రంపైకి వందలసార్లు ఎక్కారు. ఇంకా, అనేకమంది పురుషులు స్త్రీలు ప్రతీసారి వేర్వేరు మార్గాలను ఎంచుకొని ఈ సాహసకృత్యాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు.

కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడం లేక వారి స్వంత సామర్థ్యం, శారీరక స్థితి, లేక శిక్షణ వంటివి సరిపోకపోవడం గుర్తించినా, ఒక ప్రయత్నం చేసేవారూ ఉన్నారు. కాబట్టి వారు ఎక్కడం కొనసాగించరు గానీ మాటర్‌హార్న్‌ను “జయించామన్న” ఖ్యాతి కన్నా తర్కం గెలిచేందుకు అనుమతిస్తారు.

అయినా, గమనార్హమైన ఈ పర్వతాన్ని మీరు చిత్రాలలో లేక చలన చిత్రాలలో చూసినా, లేక సూర్యోదయం లేక సూర్యాస్తమయంలో శోభాయమానమైన దాని వర్ణాలను విస్మయంతో కూడిన ప్రశంసతో దగ్గర నిల్చుని చూసినా, మీకు గొప్ప శిల్పి జ్ఞాపకం వచ్చివుండవచ్చు. ఆయన చేతిపని ఎడల ప్రగాఢమైన గౌరవంతో, మీ హృదయం కీర్తనలు 104:24 నందున్న మాటలను ప్రతిధ్వనించివుండవచ్చు: “యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి