అనివార్య ప్రవర్తన—అది మీ జీవితాన్ని అదుపుచేస్తోందా?
“నేను ప్రతి ఉదయం 6 గంటలకు లేస్తాను. అలారంవున్న నా గడియారం దానంతటదే 6 గంటలకు సెట్టయ్యుంటుంది. అది సెట్టయ్యిందని నాకు తెలుసు. నేను దానిని ఎన్నడూ మార్చను. అయినప్పటికీ, నేను దానిని పరీక్షించి చూస్తూ ఉండవలసిందే. ప్రతి రాత్రి నేను పడుకునే ముందు కనీసం ఐదుసార్లయినా దానిని చూస్తాను. స్టవ్ నాబ్లన్నీ ఆఫ్ చేసి ఉన్నాయా లేదా అని రూఢిచేసుకోవాలి. అవి ఆఫ్ చేయబడి ఉండడం నాకు కనిపిస్తుంది, కాని కేవలం రూఢి చేసుకోవడానికి ఒకసారి, రెండు సార్లు, మూడుసార్లు చూసేందుకు మళ్ళీ వెళ్ళవలసిందే. నేను రిఫ్రజిరేటర్ తలుపు మూశానో లేదో రూఢి చేసుకునేందుకు మళ్ళీ మళ్ళీ చూడవలసి ఉంటుంది. ఇక మెష్ తలుపు తాళం, ఇంటి ముఖ ద్వారము యొక్క రెండు తలుపులు తాళాలు వేసున్నాయో లేదో . . . ” అని కీత్ చెబుతోంది.a
నియంత్రించలేని తలంపులు (పదే పదే వచ్చే ఆలోచనలు) మరియు చర్యలు (అనివార్య ప్రేరణలు) లక్షణాలుగా గల బలహీనపరచే పరిస్థితి అని నిర్వచించబడిన పదేపదే వచ్చే ఆలోచనలతో అనివార్య ప్రేరణలతో పీడించే రుగ్మత [అబ్సెస్సివ్-కంపల్సివ్ డిసార్డర్— (ఒ.సి.డి.)]తో కీత్ బాధపడుతోంది.b ఈ ఆలోచనలు మరియు అనివార్య ప్రేరణలు పూర్తిగా అసంకల్పితంగా వస్తాయని ఒ.సి.డి. గల వ్యక్తి భావిస్తాడు. అవి బలవంతంగా వచ్చి అదుపు చేస్తున్నట్లుగా ఉంటుంది.
ప్రతి మానవునికి అప్పుడప్పుడు అవాంఛనీయమైన తలంపులు, ప్రేరణలు కలుగుతాయి. కాని ఒ.సి.డి. ఉన్నప్పుడు అవి ఎంత అవిరామంగాను పునరావృతమయ్యేవిగానూ ఉంటాయంటే అవి సాధారణ జీవితానికి అంతరాయం కలిగిస్తాయి, విపరీతమైన కృంగుదలకు కారణమౌతాయి, కొన్నిసార్లు తుదకు నిరాశను కూడా కలిగిస్తాయి. “ఎడతెగని మానసిక పోరాటం నేను ఆత్మహత్యను గూర్చి తలంచేలా చేసింది” అని ఒక బాధితుడు చెబుతున్నాడు. గందరగోళపెట్టే ఈ వ్యాధి లక్షణాలను కొన్నింటిని పరిశీలించండి.
చూడడమంటే నమ్మడమని కాదు
బ్రూస్ తన కారును ఎత్తయిన ప్రదేశం మీద నడిపేటప్పుడు అతన్ని అమితమైన భయం ఆవరిస్తుంది. ‘నేను పాదచారి మీదుగా పోనిచ్చానా?’ అని తనను తాను ప్రశ్నించుకుంటాడు. “నేరం” జరిగిన చోటును పరిశీలించడానికి ఒక్కసారి కాదు అనేకసార్లు తిరిగి వెళ్ళేంతగా ఆ భావాలు బలీయమౌతాయి! నిజమే బ్రూస్ గాయపడిన పాదచారిని కనుగొనడు. అయినప్పటికీ, అతనికి నమ్మకం కుదరదు! అతడు ఇంటికి చేరుకున్నప్పుడు, గుద్ది ఆగకుండా పోయిన వాహన ప్రమాదాన్ని గూర్చిన నివేదికల కొరకు వార్తలను చూస్తాడు. “ఒప్పుకోవడానికి” అతడు పోలీసులను కూడా పిలుస్తాడు.
బ్రూస్లాగే ఒ.సి.డి. ఉన్న అనేకులు ‘నేనెవరినైనా గాయపరిచానా? నేను ఇంట్లోనుండి బయటకు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేశానా? నేను తలుపుకు తాళం వేశానా?’ అనే ప్రశ్నలతో బాధపడుతుంటారు. చాలామంది ప్రజలకు కొన్నిసార్లు అలాంటి తలంపులు వస్తుండవచ్చు, కాని ఒ.సి.డి. ఉన్న వ్యక్తి ఒక సారి పరికించి చూస్తాడు, మళ్ళీ పరికించి చూస్తాడు, అయినా తృప్తి ఉండదు. “మళ్ళీ మళ్ళీ చూసే మా రోగులు ‘గ్రహింపు అనేది ఇంద్రియ జ్ఞానం నుండి మాత్రమే వస్తుంది’ అని అంటున్నట్లుంటుంది. కాబట్టి, తలుపు నాబ్లను మళ్ళీ మళ్ళీ త్రిప్పి పెట్టాలి; లైట్లను వెయ్యాలి ఆర్పాలి, వెయ్యాలి ఆర్పాలి. ఈ పనులు వాళ్ళకు వెంటనే సమాచారాన్ని అందిస్తాయి. అయినప్పటికీ వాళ్ళకు నమ్మకం కుదరదు” అని డా. జూడిత్ రాప్పపోర్ట్ వ్రాస్తోంది.
ఇంత శుభ్రం సరిపోదు
చార్ల్స్ అనే పేరుగల 14 ఏండ్ల అబ్బాయిని క్రిముల వల్ల కలిగే అశుచిని గూర్చిన భయం వెంటాడుతూ ఉండేది. అతడు ముట్టుకునే ప్రతిదాన్ని వాళ్ళ అమ్మ రబ్బింగ్ ఆల్కహాల్‌తో శుభ్రం చేయాలి. అంతేకాక, ఇంటికి వచ్చేవారు వీధిలోవున్న మురికిని లోపలికి తీసుకువస్తారని కూడా భయపడ్డాడు.
బట్టలు ఉతుక్కునేటప్పుడు ఫ్రాన్కు భయముండేది. “నేను వాషింగ్ మెషీన్ నుండి బట్టలను బయటకు తీసేటప్పుడు, అవి మెషీన్ ప్రక్క భాగాన్ని అంటుకున్నట్లయితే వాటిని మళ్ళీ ఉతకవలసిందే” అని ఆమె చెబుతుంది.
చార్ల్స్ మరియు ఫ్రాన్ వలె ఒ.సి.డి. ఉన్న అనేకులు క్రిములను మరియు అశుచిని గూర్చిన ఎడతెగని తలంపుతో ఉన్నారు. ఇది పొక్కులు వచ్చేంతగా స్నానం చేసేటప్పుడు ఎక్కువ నీళ్ళు వాడడానికి లేదా చేతులు కడగడానికి కారణమవ్వవచ్చు—అయినప్పటికీ ఈ రుగ్మత గల వ్యక్తికి శుభ్రంగా ఉన్నట్లు అనిపించదు.
మనస్సు పీడించడం
దేవుని గూర్చి బలవంతంగా వచ్చే అగౌరవమైన తలంపులతో ఇలాన్ బాధపడుతుంది. “నేను ఎన్నడూ మనస్సులో కూడా అనుకోలేని విషయాలు ఇవి, అలా అనుకునేదానికన్నా చావడం మేలు” అని ఆమె చెబుతుంది. అయినప్పటికి, తలంపులు అలాగే వస్తున్నాయి. “ప్రతిరోజు వీటితో పోరాడడం వల్ల కొన్నిసార్లు రాత్రుల్లో నేను అక్షరాల నిస్త్రాణంగా అయ్యాను” అని కూడా ఆమె చెబుతుంది.
స్టీవన్ తన తప్పిదాలను గూర్చిన అపరాధ భావాలచే పురికొల్పబడి దేవునికి “ప్రమాణం” చేస్తాడు. “ఈ ధోరణి నా ఇష్టానికి వ్యతిరేకంగా వస్తున్నట్లుంటుంది గనుక ఇది నన్ను దుఃఖపెడుతుంది. ఆ తరువాత, నేను చేసిన ప్రమాణాన్ని నెరవేర్చాలని నా మనస్సాక్షి నన్ను బలవంతపెడుతుంది. ఈ కారణం చేత, ఒకసారి గొప్ప భావోద్వేగ విలువను నాశనం చేయడానికి నేను బలవంతపెట్టబడ్డాను” అని ఆయన చెబుతున్నాడు.
ఇలాన్ మరియు స్టీవన్ మనస్సులో పెట్టుకున్న తలంపులు నిరంతరం వారితో ఉండేవి. వారి లక్షణాలు వెంటనే గ్రహించలేనివైనప్పటికీ, ఎడతెగక ఒకే తలంపులు ఉన్నవారు అపరాధభావం మరియు భయము అనే చక్రంలో ఇరుక్కుని ఉంటారు.
ఇవి ఒ.సి.డి. యొక్క అనేక లక్షణాల్లో కొన్ని మాత్రమే.c ఈ రుగ్మతకు ఏది కారణమౌతుంది? దానినుండి ఉపశమనాన్నెలా పొందవచ్చు?
నియంత్రించలేనిదానిని నియంత్రించడం
ఒక వైద్యురాలు వర్ణిస్తున్నట్లు ఒ.సి.డి. ప్రవర్తన “సెరిబ్రల్ షార్ట్ సర్క్యూట్” వలన జరుగుతుంది, అందులో ఇంద్రియ సమాచారం రిజిస్టరు చేయబడదు, “ఆ ప్రక్రియ మళ్ళీ మళ్ళీ చేయబడుతుంది.” ఈ పునరావృతానికి కారణమేమిటి? ఎవరికీ కచ్చితంగా తెలియదు. నరాల ప్రచోదకాలను సంక్రమింపజేసే పదార్థం చేరి ఉన్నట్లు అనిపిస్తుంది, అయితే మెదడులోని ఇతర కారకాలు కూడా పరిగణించబడుతున్నాయి. బాల్యకాల అనుభవాలు బహుశ ఒ.సి.డి.కి అనుకూలమైన జన్యు వ్యవస్థతో జతకలిసినప్పుడు ఒ.సి.డి. రావచ్చు అని కొందరు చెబుతారు.
అయితే, కారణమేదైనప్పటికీ ఒక వాస్తవం స్పష్టం: ఊరకే కడుక్కోడం మానేయండి, లేదా మళ్ళీ మళ్ళీ పరికించి చూడడం మానేయండి అని ఒ.సి.డి ఉన్నవారితో చెబితే ప్రయోజనం ఉండకపోవచ్చు. అందుకు ఇచ్ఛా శక్తికన్నా మించినది అవసరమై ఉంది.
మందిచ్చి చేసే చికిత్స చాలా సహాయకరమని చాలా మంది విషయంలో నిరూపించబడింది. మరొక పద్ధతేమిటంటే రోగిని భయపెట్టే పరిస్థితికి గురిచేసి, సాధారణంగా ఉండే ప్రతిస్పందనను నివారించడమే. ఉదాహరణకు, ఊరికే కడుక్కునే అలవాటున్నవారు మురికైన దేనినైనా పట్టుకొని, తరువాత కడుక్కోకుండా ఉండవలసి ఉండవచ్చు. నిజమే, అలాంటి చికిత్స ఒకరిని ఒక్క రాత్రిలోనే నయం చేయకపోవచ్చు. అవిరామంగా ఆపకుండా అలా చేయడం ఉపశమనాన్నివ్వగలదని కొందరు భావిస్తున్నారు.
కనీసం కొందరి విషయంలో బాల్యకాల అనుభవాల్లో ఒ.సి.డి. లోతుగా పాతుకొనిపోయి ఉండే సాధ్యతను నిపుణులు కనుగొన్నారు. దుర్వ్యవహారానికి గురైన చాలామంది పిల్లలు తాము ప్రయోజనం లేనివారమనే లేదా అశుద్ధులమనే భావాలతో పెరుగుతారని, దాని ఫలితంగా వారిలో కొందరు అనివార్యంగా కడుక్కునే అలవాటును పెంపొందించుకుంటారని గమనించబడింది.
పదేపదే వచ్చే ఆలోచనల నుండి అనివార్య ప్రేరణల నుండి ఉపశమనం
మీరు ఒ.సి.డి.తో బాధపడుతున్నట్లయితే, మీరు భిన్నంగా ఉంటున్నారని లేక ఒకవేళ పిచ్చివారౌతున్నారని అనుకోకండి. “వారి ప్రత్యేక భయాలు తప్ప ఒ.సి.డి. గలవారు తమ జీవితాల్లో మిగిలిన అన్ని రంగాల్లోని వాస్తవాలను ఎరిగున్నవారే” అని డా. లీ బెయర్ వ్రాస్తున్నారు. మీరు సహాయం పొందగలరు! ఒ.సి.డి. అనేది అపరిపూర్ణత ఫలితమని గుర్తుంచుకోండి. ఇది నైతిక బలహీనత యొక్క లేదా ఆత్మీయ పరాజయం యొక్క చిహ్నం కాదు! లేదా అది దేవుని అప్రీతిని సూచించడం లేదు. “యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.”—కీర్తన 103:8, 14.
ఏకధాటిగా వచ్చే తలంపులు అగౌరవప్రదంగాను లేదా నిందార్హంగాను ఉన్నట్లయితే ఏమిటి? ఒ.సి.డి. ఉన్నవారికి విప్లవాత్మకమైన తలంపులు నేరానికి ఆజ్యం పోస్తాయి, నేరం మరింత విప్లవాత్మకమైన ఆలోచనలకు ఆజ్యం పోస్తుంది. “అది, అంటే యెహోవాకు నా మీద కోపంగా ఉండవచ్చు అనే తలంపు నేను మరింత విసుగ్గాను అసహనంతోను ఉండేలా చేస్తుంది.” తమ తలంపులు క్షమించరాని పాపాలకు సమానమని కూడా కొందరు భావిస్తారు!
అయితే, క్షమించరాని పాపాన్ని గూర్చి అంటే, దేవుని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పాపాన్ని గూర్చిన యేసు అభిప్రాయాలు తొందరపాటుతో కూడిన ఏకధాటిగా వచ్చే ఆలోచనలను సూచించడం లేదన్నది వ్యక్తం. (మత్తయి 12:31, 32) యేసు పరిసయ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. వారు దాడి చేసేది ఉద్దేశపూర్వకంగానేనని ఆయనకు తెలుసు. ఉద్దేశపూర్వకమైన వారి చర్యలు విద్వేషంతో నిండిన వారి హృదయం నుండి వచ్చాయి.
నిజమే, దేవునికి అప్రీతి కలిగించేది చేశానే అనే ఒకని చింత అతడు నిజానికి క్షమించరాని పాపాన్ని చేయ లేదనే దానికి రుజువు. (యెషయా 66:2) అంతేకాక, దేవుడు ఈ రుగ్మతను అర్థంచేసుకుంటాడని తెలుసుకోవడం మనకు ధైర్యాన్నిస్తుంది. ఆయన దయాళుడు, ‘క్షమించడానికి సిద్ధంగా ఉన్నవాడు.’ (కీర్తన 86:5; 2 పేతురు 3:9) మన స్వంత హృదయాలు మనలను నిందిస్తున్నప్పుడు కూడా, “దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు.” (1 యోహాను 3:20) ఒకరు అంతగా నియంత్రించలేని రుగ్మత మూలంగా వచ్చే తలంపులు, ప్రేరణలు ఎంతమేరకు ఉంటాయన్నది ఆయనకు తెలుసు. దీనిని గ్రహించే ఒ.సి.డి. బాధితుడు అనవసరమైన అపరాధ భావంతో తనను తాను బాధపెట్టుకోకుండా ఉంటాడు.
శారీరకమైన, మానసికమైన, భావోద్వేగపరమైన బాధలన్నింటినుండి ఉపశమనం లభించే క్రొత్త లోకాన్ని యెహోవా వాగ్దానం చేస్తున్నందుకు మనమెంత కృతజ్ఞులమై ఉండగలం! (ప్రకటన 21:1-4) అదే సమయంలో, ఈ రుగ్మతను సహించవలసినవారు తమ బాధనుండి ఉపశమనం పొందేందుకు కొన్ని ఆచరణాత్మకమైన చర్యలను గైకొనగలరు.
[అధస్సూచీలు]
a ఈ శీర్షికలోని కొన్ని పేర్లు మార్చబడ్డాయి.
b తేజరిల్లు! ఏదైన ఒక ప్రత్యేకమైన చికిత్సను సిఫారసు చేయడంలేదు. ఈ రుగ్మత గల క్రైస్తవులు తాము పొందే ఏ చికిత్సా బైబిలు సూత్రాలకు వ్యతిరేకమైనది కాకుండా ఉండేందుకు జాగ్రత్తగా ఉండాలనుకుంటారు.
c మరనేక ఇతర లక్షణాల్లో కొన్నింటిలో లెక్కబెట్టడం లేదా అవసరమైనవాటికన్నా ఎక్కువ వస్తువులను కూడబెట్టడం లేదా అన్నీ సమానంగా ఉండాలనే ఎడతెగని తలంపులు కూడా ఇమిడి ఉన్నాయి.
[22వ పేజీలోని బాక్సు]
మద్దతునిచ్చేందుకు
ఒకే ఆలోచనతో తీవ్రంగా పీడించే రుగ్మత(ఒ.సి.డి.)తో పోరాడుతున్న వ్యక్తికి మద్దతునిచ్చేందుకు ఒక స్నేహితుని(రాలి)గా లేక కుటుంబ సభ్యుని(రాలి)గా మీరు ఎంతో చేయగలరు.
• మొదట, మీ స్వంత దృక్పథాన్ని పరిశీలన చేసుకోండి. బాధితుడు(రాలు) బలహీనుడ(రాల)ని, సోమరియని లేదా మొండియని మీరు నమ్ముతున్నట్లయితే అతడు గాని ఆమె గాని దానిని తప్పకుండా గ్రహించి, మెరుగుపడాలని పురికొల్పబడరు.
• బాధితుని(రాలి)తో మాట్లాడండి. అతడు లేదా ఆమె దేనితో పోరాడుతున్నారో తెలుసుకోండి. యథార్థవంతులైన, నిజాయితీ గల విశ్వసనీయులైన వ్యక్తులను కలిగి ఉండడమే తరచూ బాధితు(రాలు)డు ఒ.సి.డి. లక్షణాలను అదుపు చేసుకోవడంలో మొదటి మెట్టు.—సామెతలు 17:17.
• పోల్చవద్దు. బాధితులు కానివారు అనుభవించని లోబరచుకునే ప్రేరణలను ఒ.సి.డి. కలిగిస్తుంది. కనుక, మీరు మీ ప్రేరణలను ఎలా ఎదుర్కుంటారో చెప్పడం సాధారణంగా ప్రభావవంతంగా ఉండదు.—సామెతలు 18:13 పోల్చండి.
• వాస్తవమైన లక్ష్యాలను పెట్టుకొని వాటిని చేరుకునేందుకు బాధితుని(రాలి)కి సహాయం చేయండి. ఒక లక్షణాన్ని ఎన్నుకొని, దానిని ఎదుర్కునేందుకు లక్ష్యాలను సంక్షిప్తపరచండి. చేరుకోవడానికి ఏమంత కష్టంలేని లక్ష్యంతో మొదలు పెట్టండి. ఉదాహరణకు, స్నానం చేసేటప్పుడు నిర్దిష్ట సమయం కన్నా ఎక్కువ సేపు నీళ్లు పోసుకోకూడదన్నది ఒక లక్ష్యం కావచ్చు.
• అభివృద్ధిని మెచ్చుకోండి. ప్రశంస సరైన ప్రవర్తనను బలపరుస్తుంది. అభివృద్ధిలోని ప్రతి మెట్టు, అది ఎంత చిన్నదైనా ప్రాముఖ్యమైనదే.—సామెతలు 12:25.
ఒ.సి.డి. బాధితుని(రాలి)తో జీవించడం కుటుంబ సభ్యులకు భావోద్వేగపరంగా హరింపజేసేదిగా ఉంటుంది. కనుక స్నేహితులు అర్థం చేసుకునేవారిగాను, ఆచరణాత్మకమైన ఏ మార్గాల్లోనైనా తాము ఇవ్వగల మద్దతునిచ్చేవారిగాను ఉండాలి.—సామెతలు 18:24b.
[21వ పేజీలోని చిత్రాలు]
అమితంగా పరికించి చూడడం మరియు కడుక్కోవడం—ఒ.సి.డి. యొక్క రెండు లక్షణాలు