నా ప్రియమైన స్నేహితురాలు
మీ స్నేహితులెవరు? వాళ్లు మీ తోటివయస్కులు మాత్రమేనా? తన స్నేహితుల్లో తన కన్నా సుమారు డెబ్భై ఏళ్లు పెద్దదైన, ఒక స్నేహితురాలి గూర్చి ఓ యౌవనస్థురాలి వృత్తాంతాన్ని చదవండి.
నాకు కేవలం ఆరేళ్లున్నప్పుడు, అంటే సుమారు తొమ్మిదేళ్ల క్రితం, స్కాట్లాండ్‌లోని అబెర్‌డీన్‌కు మా కుటుంబం మకాం మార్చింది. ఈ సమయం నాకు భయాన్ని కలిగించే సమయం, ఎందుకంటే నేను క్రొత్త స్కూల్‌కు వెళ్లాలి, క్రొత్త స్నేహితులను చేసుకోవాలి. కానీ ఏదో నన్ను నా క్రొత్త పరిస్థితిలో నేను నెమ్మదిగా సర్దుకుపోయేలా చేసింది. మా అమ్మానాన్నలు అంతకుముందు కలిసిన ఓ పెద్దమనిషి మేముంటున్న ఇంటికి దగ్గిరలోనే నివసించేది. వారు నన్ను చక్కగా పరిచయం చేశారు, కొద్ది సమయంలోనే ఆమె ఎంతో ఆసక్తిదాయకమైన వ్యక్తియని తెలుసుకుని నేను ఆశ్చర్యపోయాను. ఆమె మానసికంగా చురుకుగా ఉండేది, ఆమె ఎంతో అందంగా తయారయ్యేది.
మేమున్న ఇల్లు అద్దె ఇల్లు కనుక లూయీ ఆంటీ వాళ్లింటినుండి ఓ మైలు దూరంలోని మా సొంత ఇంటికి మేము మారాము. గౌరవంతోనూ ప్రేమ సూచకంగానూ “ఆంటీ” అనే మాటను నేను ఉపయోగిస్తాను. నేను, మా అన్నా క్రమంగా ఆమె దగ్గరకు వెళ్లనారంభించాము కనుక మేము అక్కడినుండి వెళ్లవల్సి వచ్చినప్పుడు నేను ఎంతో బాధపడ్డాను.
అయినప్పటికీ, నేను వెళ్లే పాఠశాల లూయీ అంటీ ఇంటికి దగ్గిరలోనే ఉండేది. కనుక ప్రతి శుక్రవారం క్లాసులైపొయ్యాక, అలాగే సాయంత్రం స్కాటిష్ కంట్రీ డాన్సింగ్ పాఠశాలకు వెళ్లకముందూ టీ త్రాగేందుకు నేను ఆంటీ ఇంటికి వెళ్లేదాన్ని. ఇది నాకు అలవాటైపోయింది. నేను నా కథల పుస్తకాల్లో ఒకదాన్ని తీసుకెళ్లేదాన్ని, మరి నేను దోసకాయ శాండ్విచ్‌లు తింటూ చల్లని పాలు త్రాగుతుండగా ఆమె దాన్ని నాకు చదివి వినిపించేది.
శుక్రవారాల్లో లూయీ అంటీ ఇంటికి పరుగుతీసేందుకు గురైన సాయంత్రం 3:30 బెల్లు ఎప్పుడు కొడతారా అని నేను ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నకొలది ఆ సమయం మరీ మెల్లిగా గడుస్తున్నట్లు తోచేది. పెద్దలు ఎంత ఆసక్తిదాయకంగానూ ఎంత తమాషాగా ఉంటారన్న విషయాన్ని నేను ఈ సమయంలోనే మొదటిసారిగా నేర్చుకున్నాను. వాస్తవానికి, నేను ఆమెను వృద్ధురాలిగా దృష్టించలేదు. నా దృష్టిలో ఆమె చాలా యౌవనురాలిగా ఉండేది. ఆమె బండిని నడిపించగల్గేది, ఎప్పుడూ గుభాళించే సువాసనలా ఇంటినీ తన తోటనూ చూసుకునేది—ఓ బిడ్డకు అంతకంటే ఇంకేమి కావాలి?
మూడు సంవత్సరాలు గడిచిపోయాయి మరి నేను ప్రాథమిక పాఠశాలలో చివరి సంవత్సరంలో ఉన్నాను. ఆ సమయంలోనే, తోటను చూసుకోవడం తనకు కష్టంగా ఉంది కనుక ఓ ఫ్లాట్ తీసుకోవడం ఆచరణాత్మకంగా ఉంటుందని లూయీ ఆంటీ నిర్ణయించుకుంది. ఆ సమయంలో ముసలివారవ్వడం అన్న విషయాన్ని నేను గ్రహించలేకపోయాను. ఆమె ఫ్లాట్ పట్టణంలోని మరో భాగంలో ఉన్నందుకు నేను బాధపడ్డాను. ఇంక శుక్రవారాలకు అంతకుముందున్నంత ఆకర్షణ లేనేలేదు.
1990లో నేను ఉన్నత పాఠశాలకు వెళ్లే ఏర్పాట్లు మొదలయ్యాయి. అంత పెద్ద పాఠశాలో నేనేం చేస్తాను? నేను ఎలా తట్టుకుని ఉండగలను? మా కుటుంబం మరో ప్రాంతంలో ఉండేది కనుక నా స్నేహితులనుండి దూరంగా నేను వేరే పాఠశాలకు వెళ్లాల్సి వచ్చింది. అయితే లూయీ అంటీ మరలా అక్కడ ఉంది ఎలా అంటే ఆమె మారిన ఫ్లాట్ సరిగ్గా నా ఉన్నత పాఠశాల ప్రక్కనే ఉండేది! మధ్యాహ్న భోజన–సమయాలు నేను నా శాండ్విచ్‌లను తినేందుకు ఆమె ఫ్లాట్‌కు వెళ్లవచ్చునా అని నేను ఆమెను అడిగాను. ఆ విధంగా మరో అమూల్యమైన రొటీను ప్రారంభమైంది.
బహుశ ఈ సమయంలోనే అనుకుంటా, మా సంబంధం పాప–బామ్మల సంబంధంనుండి, ఇరువురూ ఒకరి సాహచర్యాన్ని మరొకరు ఇష్టపడేలా మారింది. అది అనేక విధాల్లో గోచరమైంది కానీ, ప్రత్యేకంగా ఒకటి ఏమిటంటే, నా కథల పుస్తకాలకు బదులుగా జేన్ ఐర్, విల్లెట్, ప్రైడ్ అండ్ ప్రిజుడైస్ మరియు విమెన్ ఇన్ వైట్ వంటి సాహిత్య పుస్తకాలను కలిసి చదవనారంభించడం. నా అభిరుచి పరిణతి చెందింది.
ప్రజలను ప్రేమించగల్గడం ఓ నైపుణ్యమని ఓ కళయని లూయీ ఆంటీ నాకు చెప్పేది. ఆమె కనుక నాకు బోధించకపోయివుంటే నేను ఎంతో పెద్దదాన్నయ్యేంతవరకూ ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయేదాన్ని. వినడం ఎలాగో ఆమె నాకు నేర్పింది, చిన్నవాళ్లేమి పెద్దవాళ్లేమి లోకంలోని అనేక మంది ప్రజలు దీన్ని ఎన్నటికీ నేర్చుకోరు. నేను నా సోఫామీద బాసికపెట్టి కూర్చున్నప్పుడు తన జీవితపు కథలనూ తనకున్న అనుభవాలనూ చెప్పేది. ఈవిడకున్న అతి ఆసక్తిదాయకమైన జ్ఞానాన్నిబట్టి నేను ఎంతో అనురాగాన్ని పొందాను.
అనారోగ్యంగా ఉన్న తన తలిదండ్రులనూ ఆంటీనీ చూసుకునేందుకు లూయీ అంటీ ఎంతో త్యాగం చేసింది—పెళ్లిని, పిల్లలనూ ఉద్యోగాన్ని త్యాగం చేసింది. అది ఆమె తమ్ముడు పూర్తికాల సేవలో కొనసాగేందుకు సహాయపడింది.
గత రెండు సంవత్సరాలుగా, లూయీ అంటీ ఆరోగ్యం క్షీణిస్తోంది, మరి వృద్ధాప్యం తీసుకువచ్చే కలతను, కష్టాన్ని, వేదనను నేను చూడగల్గుతున్నాను. ఇటీవల, 84 ఏండ్లప్పుడు ఆమె వాహనాన్ని నడిపించడం మానుకోవల్సివచ్చింది, అలా మానుకోవడం ఆమెకు ఎంతో బాధను కలిగించింది. ఆమె ఎంతో చురుకైన జీవితానికి అలవాటుపడిన మనిషి అలాంటిది ఇప్పుడు ఇంట్లో బంధించబడినట్లుండడం ఆమెకు ఎంతో బాధను కలిగిస్తోంది. తాను ఇతరులను శ్రమపెడుతోందన్న భావంతో ఆమె పోరాడవల్సి వచ్చింది. మేము ఆమెను ప్రేమిస్తున్నామనీ ఆమె కొరకు ఏమి చేసేందుకైనా మేము సిద్ధంగా ఉన్నామని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ, ఆమె తన్ను తాను నిందించుకుంటుంది.
ఇప్పుడు ఆమె స్నానం చేసుకోలేకపోవడం తయారవ్వలేకపోవడం దీన్ని మరింత ఘోరం చేస్తుంది. వీటిని ఆమె ఇతరుల కొరకు చేసినప్పటికీ, తాను ఇప్పుడు అలాంటి సహాయాన్ని తీసుకోవల్సిరావడం ఓ పరీక్షగా ఉంది. ప్రజలు తమ కొరకు తాము ఏమీ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, వారు మన గౌరవానికి పాత్రులేనని ఇది నాకు నేర్పింది.
అన్నిటికంటే ప్రాముఖ్యంగా, వార్థక్యానికి చేరుకోవడం అంటే ఏమిటో అర్థంచేసుకునేందుకు నాకు ఈ అనుభవం సహాయపడింది. లూయీ ఆంటీ చేయలేని ప్రతిదీ నాకు ఏడుపు తెప్పిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా, ఆమె కలత చెందుతున్నప్పుడైనా లేక తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నప్పుడైనా, నాకు వెక్కివెక్కి ఏడ్వాలనిపిస్తుంది. ముఖ్యంగా, నా కంటే చిన్నదైన ఏ బిడ్డా నేను ఆమె జ్ఞానాన్ని పొంది ఆనందించినంతగా గుణగ్రహించినంతగా ఇక ఆనందించలేరు గ్రహించలేరనే నేను బాధపడుతున్నాను.
నేను ఆమెకు చేయాల్సినంత చేస్తున్నానా లేదా అని నేను కొన్నిసార్లు ఆలోచిస్తాను. నేను ఆమెను ప్రేమించినంతగా నేను ఆమెవల్ల ఆనందించినంతగా ఆమె నన్ను ప్రేమిస్తుందా నా వల్ల ఆనందిస్తుందా? అయితే నేను మధ్యాహ్నం భోంచేసేందుకు వెళ్లి ఆమెను కౌగిలించుకున్నప్పుడు అనుమానాలన్నీ కనుమరుగు అవుతాయి.
అలాంటి స్నేహితురాలిని కల్గివుండడం నేనెంతో గొప్పగా భావిస్తున్నాను. ఆమె నాకు ఎన్నో చక్కని లక్షణాలను నేర్పించింది—ప్రాముఖ్యంగా ప్రేమను గూర్చి నాకు బోధించింది. నూరు మంది నా తోటి వయస్కుల స్నేహం కొరకు నేను ఆమె స్నేహాన్ని ఇవ్వలేను. కొన్ని రోజుల్లో నేను పాఠశాల మానుకుని, ఇక ఆమె ఇంటికి భోజనానికి వెళ్ళకపోయినప్పటికీ, నా ప్రియమైన స్నేహితురాలిని ప్రేమించడం, సందర్శించడం, ఆమెకు సహాయపడడం నేను ఎన్నడూ మానుకోను. మీకన్నాముందు ఇతరులను గూర్చి మీరు ఆలోచించినప్పుడు మీ జీవితం మరి ఆనందదాయకంగానూ ఫలవంతంగానూ ఉంటుందని ఆమె నాకు నేర్పింది.—ఉచిత వ్యాసం
[14వ పేజీలోని చిత్రం]
లూయీ అంటీతో