కిలిమంజారో—ఆఫ్రికా పైకప్పు
కెన్యాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
నూట యాభై సంవత్సరాల క్రిందటి వరకూ, ఆఫ్రికా లోతట్టు ప్రాంతాల్లో చాలా వరకు మ్యాపుపై కనబడలేదు. వెలుపటి ప్రపంచానికీ గొప్ప ఖండం, అన్వేషణకు అసాధ్యంగానూ, మర్మంగానూ ఉండేది. తూర్పు ఆఫ్రికా నుండి వెలువడ్డ అనేక కథనాల్లో ఒకటి, విశేషంగా యూరోపియన్లకు అపరిచితమైందిగా కనబడింది. అది మంచుతో కప్పబడి శ్వేతవర్ణ శిఖరాన్ని కల్గివున్న ఉత్కృష్టమైన పర్వతాన్ని భూమధ్యరేఖకు సమీపంలో 1848లో చూశామని చెప్పుకున్న యోహాన్నస్ రాప్మాన్, యోహాన్ ఎల్. క్రాఫ్ అనే పేర్లుగల జర్మనీ మిషనరీలు తెలియజేసిన కథనమే.
ఉష్ణమండల ఖండమైన ఆఫ్రికాలో మంచుతో కప్పబడిన శిఖరంగల పర్వతం ఉందనే కథనం, సందేహానికి మాత్రమేగాక ఎగతాళికి కూడా గురైంది. కానీ, ఈ భీకరపర్వతపు వృత్తాంతాలు భౌగోళికవేత్తల, అన్వేషకుల జిజ్ఞాసనూ ఆసక్తినీ రేకెత్తించాయి. మరి మిషనరీల నివేదికలు సరియైనవేనని చివరకు వాళ్లు రూఢిపర్చుకున్నారు. తూర్పు ఆఫ్రికాలో కిలిమంజారో అని పిలువబడే మంచుతో కప్పబడివున్న శిఖరంగల అగ్నిపర్వతం నిజంగా ఉంది. దాని భావం “మహత్వపర్వతం” అని కొంతమంది ప్రజలు అర్థంచేసుకున్నారు.
ఆఫ్రికా “పైకప్పు”
కొట్టొచ్చినట్లుండే దాని అందాన్నిబట్టీ, ముగ్ధుల్నిచేసే దాని ఎత్తునుబట్టీ ఈ గొప్ప కిలిమంజారో నేడు ప్రసిద్ధిగాంచింది. దూరంలో ఠీవిని ప్రదర్శిస్తూ అస్పష్టంగా కనబడుతున్న మంచుతోకప్పబడిన శిఖరంగల “కిలి” పర్వత నేపథ్యదృశ్యంతో ఎండిపోయిన, దుమ్ము ధూళితోనున్న ఆఫ్రికా మైదానాల్ని దాటుతున్న ఏనుగుల గుంపులవంటి కొన్ని చిత్రాలు రమణీయమైనవై, స్మృతిపథంలో ఉంచుకోదగినవై ఉన్నాయి.
కిలిమంజారో ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన పర్వతం. అది ప్రపంచంలో నిద్రాణంగావున్న భారీ అగ్నిపర్వతాల్లో అతి పెద్దది. ఇది భూమధ్యరేఖకు దక్షిణాన, కెన్యా సరిహద్దుకు అవతల టాంజానియాలో ఉంది. మేఘాలనంటే శిఖరాలుగల ఈ పర్వతం రూపొందడానికి, నాలుగు వందల కోట్ల క్యూబిక్ మీటర్ల లావాను ఇక్కడి నేల వెళ్లగ్రక్కింది.
మరేవీలేకుండా అదొక్కటే పర్వతం ఉండడాన్నిబట్టి, భీకరమైన ఆ పర్వతం మరింత గుర్తింపు పొందింది. ఇది సముద్రమట్టానికి దాదాపు 900 మీటర్ల ఎత్తున ఉన్న అడవి ప్రదేశానికి చెందిన మాషై దేశాన్నుండి మహత్తరమైన రీతిలో 5,895 మీటర్ల ఎత్తుకు పెరిగి, ఒంటరిగా దూరంగా నిలిచివుంది. ఆఫ్రికా పైకప్పు అని ఆ కిలిమంజారోని కొన్నిసార్లు వర్ణించడంలో ఆశ్చర్యమేమీ లేదు.
వెలిగే తెల్లని సిగ్నల్ దీపంలా, ఆ పర్వతపు మంచు శిఖరాలూ, నెమ్మదిగా క్రిందకు పడుతున్న మంచు సముదాయాలూ వందలాది కిలోమీటర్ల దూరం వరకు ఏ దిశలోనుండైనా కనబడగలవు గనుక కిలిమంజారో, “ప్రయాణీకుల పర్వతం” అని కూడా పిలువబడింది. గత శతాబ్దాల్లో దంతాలనూ, బంగారాన్నీ, బానిసలనూ తీసుకొని ఆఫ్రికాలోని ఆటవిక లోతట్టు ప్రాంతాలనుండి తిరుగు ప్రయాణం చేసే వారికి మంచుతో కప్పబడిన దాని శిఖరం తరచూ దారిచూపిస్తుంది.
ఆకట్టుకునే దాని శిఖరాలు
కిలిమంజారో రెండు అగ్నిపర్వత శిఖరాలతో రూపొందింది. కిబో అనేది ప్రధాన అగ్నిపర్వత శిఖరం; దాని అందమైన సౌష్ఠవాకార శంఖువు ఎప్పుడూ మంచుగడ్డలతోనూ, హిమంతోనూ కప్పబడి ఉంటుంది. తూర్పున మవెన్ఝె అనే రెండవ శిఖరం, 5,150 మీటర్ల ఎత్తున ఉంది. ఇది కిబో, కెన్యా పర్వతశిఖరాల తర్వాత ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతశిఖరాల్లో మూడవది. సాఫీగా ఏటవాలుగా ఉండే పార్శ్వములతో ఉన్న కిబో పర్వతశిఖరానికి భిన్నంగా మవెన్ఝె శిఖరం, ఎత్తుపల్లాలుగా ఉండి అన్ని వైపులా ఎత్తైన పదునైన అంచులుగల రాతిగోడలతో అందంగా చెక్కబడినట్లుంది. 4,600 మీటర్ల ఎత్తులో గండుశిలలతో కప్పబడ్డ విస్తారమైన ఏటవాలు మైదానంతో కిబో, మవెన్ఝీ శిఖరాలు అనుసంధానం చేయబడ్డాయి. కిబోకు పశ్చిమాన, గాలి నీరులచే ఎంతోకాలం నుండీ హరించివేయబడిన ప్రాచీన అగ్నిపర్వతపు పాడైన అవశేషాలతో కూడిన షీరా ఉంది. అది సముద్ర మట్టానికి 4,000 మీటర్ల ఎత్తులో విస్మయాన్ని కల్గించే మూర్ పీఠభూమిగా ఇప్పుడు రూపొందుతోంది.
ఓ పర్యావరణ ఉత్తమ కృతి
కిలిమంజారో పర్యావరణ విధానం దాని ఎత్తు, వర్షపాతం, పచ్చదనాల మూలంగా హద్దులేర్పర్చబడ్డ వేర్వేరు మండలాలచే రూపొందింది. దాని దిగువ ఏటవాలు ప్రాంతాలు, ఏనుగుల గుంపులూ భయంకరమైన గేదెల గుంపులూ తిరిగే ఉష్ణమండల అరణ్యాలతో నిండివున్నాయి. వివిధ రకాల జాతులకు చెందిన కోతులు అడవిలోని ఎత్తైన ప్రదేశాల్లో నివసిస్తాయి, దట్టమైన చెట్లపొదల్లో దూరి అతి సులభంగా దాక్కునే పర్వతంపై నివసించే దుప్పులు, లేళ్లు అలా కన్పించి ఇలా మాయమవ్వడాన్ని సందర్శకుడు కొన్నిసార్లు చూడగలడు.
అడవికి ఎగువన ఉన్నదే అడవిపొద మండలం. గాలి తీవ్రతనుబట్టీ కాలాన్నిబట్టీ బుడుపులుగావుండి మెలిదిరిగిన నార్లెడ్ ప్రాచీన వృక్షాలు, వృద్ధుని పొడవైన నెరిసిన గెడ్డాన్ని పోలిన శిలీంధ్రపు పోగులతో అలంకరించబడ్డాయి. ఇక్కడ పర్వతపార్శ్వం నెరవిడిచి, ద్వైత్వాకార అడవిపొదలు తయారౌతాయి. తేజోవంతమైన రంగురంగుల పుష్పగుచ్ఛాలతో మధ్యమధ్య పరచబడిన పొడవైన టుస్సోకు అనే గడ్డి, పల్లెసీమను సుందర దృశ్యంగా చేస్తుంది.
వృక్ష శ్రేణికి మరింత ఎగువన పచ్చిక మైదానాలు కనబడతాయి. వృక్షాలకు బదులుగా, నాలుగు మీటర్ల ఎత్తుకు చేరుకునే ద్వైత్వాకార గ్రౌండ్సెల్స్ అని పిలువబడే అసాధారణ మొక్కలూ, పెద్ద కేబేజీ మొక్కలనో లేక ఆర్టీచోక్లు అనే ఓ రకమైన దుంప మొక్కలనో పోలివుండే లొబిలియాలు ఉంటాయి. గండు శిలల చుట్టూ, పైకి పొడుచుకు వచ్చిన రాతి పొరల చుట్టూ ఎక్కువకాలం నిలిచివుండే పుష్పాలు పెరుగుతాయి, అవి గడ్డిపరకవలె ఉండి ఎండిపోయినట్టుగా కన్పించి అలాగే ప్రకృతి భూతలదృశ్యానికి లేత బూడిద వర్ణాన్నీ మరికొంత అందాన్నీ జోడిస్తాయి.
ఇంకాపైకి వెళితే, గడ్డితోనిండిన మైదానాలు ఆల్ఫైన్ పర్వత మండలానికి దారినిస్తాయి. ముదురు గోధుమ, బూడిద వర్ణ మేళవింపులతో ఉన్న రంగులో ఆ మైదానం కాంతివిహీనంగా ఉంటుంది. ప్రధాన శిఖరాలైన కిబొ, మవన్ఝెలు రెండూ ఎత్తైన ఎడారీ, బీడూ, రాతినేలతో ఉన్న వారధిలాంటి విశాలమైన భూభాగంచే అనుసంధానం చేయబడ్టాయి. ఇక్కడ శీతోష్ణస్థితులు విపరీతంగా ఉంటాయి. అవి పగటి వేళలో 38 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతూ, రాత్రివేళల్లో శీతలీకరణకు మరీ దిగువస్థాయికి పడిపోతాయి.
చివరిగా మనం శిఖరాగ్ర మండలానికి చేరతాం. ఇక్కడ గాలి చల్లగానూ శుభ్రంగాను ఉంటుంది. ముదురు నీలివర్ణ ఆకాశానికి అభిముఖంగా, తెల్లగానూ స్వచ్ఛంగానూ కన్పించే మెల్లగా జారుతున్న మంచు సముదాయాలూ, కప్పబడిన హిమ క్షేత్రాలూ పర్వతపు ముదురు వర్ణ మైదానంతో కొట్టొచ్చినట్టు అందంగా ఉంటాయి. గాలి పలచగా ఉండి, సముద్ర మట్టం దగ్గరున్న గాలిలోని ప్రాణవాయువు దాదాపు సగమే ఉంటుంది. కిబో సమతల శిఖరాగ్ర పైభాగంలో అగ్నిపర్వత బిలం ఉంది, అది ఇంచుమించు గుండ్రంగా ఉండి, 2.5 కిలోమీటర్ల వ్యాసాన్ని కల్గివుంది. పర్వతపు అంతర్భాగంవద్దనున్న ఆ బిలంలోపల ఓ పెద్ద బూడిద గొయ్యి ఉంది. అది జ్వాలాముఖిలోపలకు 300 మీటర్లకు పైగా వెడల్పునూ, 120 మీటర్ల లోతునూ కల్గివున్నది. నిద్రాణంగా ఉన్న ఈ మహాగొప్ప అగ్నిపర్వతం లోపలి అలజడిని రూఢిపరుస్తూ, అగ్నిపర్వతపు చిన్న బిలాల్లో (పొగబిలాల్లో) నుండి వేడి సల్ఫ్యూరిక్ పొగలు చల్లని గాలిలోకి నెమ్మదిగా లేస్తూ ఉంటాయి.
కిలిమంజారో యొక్క అసాధారణమైన పర్వతాకృతీ, ద్రవ్యరాశీ కలిసి దాని స్వంత వాతావరణాన్ని అది సృష్టించుకోడానికి అనుమతించాయి. అల్పవర్షాధార దిగువ ప్రాంతాల మీదుగా హిందూ మహా సముద్రం నుండి ఖండాంతర ప్రాంతంలోకి వీచే తేమతో కూడిన గాలి, పర్వతాన్ని తాకి పైకి వెళ్తుంది. ఆ గాలి అక్కడ ఘనీభవించి వర్షపాతాల్ని కలుగజేస్తుంది. ఇది పర్వత పీఠ ప్రాంతం చుట్టుప్రక్కల జీవించే ప్రజలను పోషించే కాఫీ మొక్కలూ, ఆహారపు పంటలు పండేలా దిగువ ఏటవాలు ప్రాంతాల్ని సారవంతం చేస్తుంది.
“కిలి” పర్వతారోహణ ఆటంకాల్ని అధిగమించడం
కిలిమంజారో నీడలో జీవిస్తున్న ప్రజలు ఆ పర్వతపు చరియలు దుష్టాత్మలకు నిలయాలుగా ఉన్నాయనీ, దాని హిమ శిఖరాన్ని అధిరోహించడానికి ప్రయత్నించే వారెవరికైనా సరే హాని తలపెడతాయనీ మూఢంగా నమ్ముతారు. దాని శిఖరాన్ని చేరుకోవడానికి ప్రయత్నించకుండా స్థానిక ప్రజల్ని ఇది ఆటంకపరచింది. జర్మనీకి చెందిన ఇద్దరు అన్వేషకులు 1889లో ఆ పర్వతాన్ని అధిరోహించి, ఆఫ్రికాలో అత్యున్నతమైన శిఖరంపై కాళ్లుమోపేంతవరకూ పర్వతారోహణ ప్రయత్నం జరుగలేదు. అధిరోహించడానికి సాంకేతికంగా మరింత కష్టతరమైన మవెన్ఝె అనే రెండవ పర్వత శిఖరాన్ని 1912 వరకూ ఎవరూ అధిరోహించలేదు.
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించే అవకాశం ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరికీ నేడు తెరవబడివుంది, తూర్పు ఆఫ్రికాకు సందర్శనార్థమై వచ్చిన సందర్శకులకు ఇది మరింత ప్రీతిపాత్రమైంది. టాన్జానియన్ పార్కు అధికారులు పర్వతాన్ని అధిరోహించాలని కోరుకునే వారి కొరకు చక్కగా సంస్థీకరించబడిన ఏర్పాట్లను చేశారు. పర్వతారోహణ దుస్తులూ, పరికరాలూ అద్దెకు దొరుకుతాయి. తర్ఫీదు పొందిన పోర్టర్లూ (సామాన్లు మోసే వ్యక్తులూ), మార్గనిర్దేశకులూ అందుబాటులో ఉంటారు, అనేక లాడ్జీలు పర్వతారోహణ ప్రయాణం ప్రారంభం నుండీ చివరివరకూ సుఖప్రదమైన వసతి సౌకర్యాల్ని అందిస్తాయి. వేర్వేరు ఎత్తుల్లో పటిష్టంగా నిర్మించబడ్డ వసతిగృహాలు పర్వతంపై ఉన్నాయి, అవి పర్వతారోహకునికి సుఖంగా నిద్రపోయే సౌకర్యాల్నీ ఆశ్రయాన్నీ ఇస్తాయి.
స్వయంగా కిలిమంజారో పర్వతాన్ని చూడడం, మనస్సును ఆకట్టుకుంటుంది, ఆలోచించేలా ప్రేరేపిస్తుంది. దేవుని గూర్చి చెప్పిన ఈ క్రింది మాటలతో ఒకడు అంగీకరించడానికి సిద్ధంగా ఉంటాడు: “తన శక్తిచేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే.” (కీర్తన 65:6) అవును, ఆఫ్రికా ఉపరితలంపై ఎత్తైనదీ, ఏకైక పర్వతమూ అయిన కిలిమంజారో, మహిమాన్విత సృష్టికర్త శక్తికి ఉత్కృష్టమైన సాక్ష్యంగా నిలుస్తోంది.
[20వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
ఆఫ్రికా
కెన్యా
కిలిమంజారో
టాంజానియా