పేద దేశాలు సంపన్న దేశాల చెత్త కుప్పలుగా మారుతున్నాయి
అవాంఛిత అనాథవలె విషపూరిత రవాణా సరుకును రవాణాచేసే నిమిత్తం ఓడ నుండి ఓడ వరకు రేవు నుండి మరో రేవు వరకు స్థలాన్ని అన్వేషిస్తుంది. విషపూరితమైన జిగురు, కీటకనాశక మందులు మరియు అపాయకరమైన రసాయనాలతో నిండిన స్థూపాకారంలోని పదకొండు వేల పీపాలు జిబోటి ఆఫ్రికా నుండి, వెనిజ్యులాకు, సిరియాకు, గ్రీసు వరకు రవాణా చేయబడుతున్నాయి. చివరికి కారుతున్న పీపాలు సరుకుల ఓడలలో ఒకదాని సిబ్బందికి ప్రాణాంతకంకానారంభించాయి. ఓడలోని విషపూరితమైన రసాయనాలవల్ల ఒక వ్యక్తి చనిపోయాడు, మిగిలిన చాలా మంది చర్మ వ్యాధులకు, మూత్రపిండ వ్యాధులకు మరియు శ్వాస సంబంధ వ్యాధులకు గురయ్యారు.
అలాంటి ప్రాణాంతకమైన వ్యర్థపదార్థాలను మోసుకువెళ్ళే ఓడలు, ట్రక్కులు, రైళ్ళు వాటిని ఎక్కడైన వేసేందుకు స్థలాలను వెదుకుతూ అస్తవ్యస్తంగా గ్రహం చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే పేదరికం, క్షామం, వ్యాధి వంటి వాటి వల్ల నాశనమౌతున్న దేశాలు తరచూ టన్నుల లెక్కన విషపదార్థాలకు, మలినపరచబడిన వ్యర్థపదార్థాలకు చెత్త కుప్పలుగా మారుతున్నాయి. ఇక పర్యావరణ విపత్తు జరగడమే తరువాయి అని వాతావరణ నిపుణులు భయపడుతున్నారు.
పాత పెయింట్లు, ద్రావణాలు, టైర్లు, బ్యాటరీలు, అణుధార్మిక వ్యర్థపదార్థాలు, సీసం మరియు పి.సి.బిల చిట్టెం మిమ్మల్ని ఆకర్షించపోవచ్చు. కాని పెరుగుతున్న పారిశ్రామిక వ్యర్థపదార్థాల వ్యాపార సంస్థకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. తమాషా ఏంటంటే, పర్యావరణ విషయంలో ప్రభుత్వం నిష్కర్షగా ఉండేకొలది, దాని పరిశ్రమలు అంత ఎక్కువగా విషపూరితమైన వ్యర్థ పదార్థాలను విదేశాలలో విడిచిపెడతాయి. “ప్రతి సంవత్సరం” పారిశ్రామికం చేయబడిన “నీతినియమాలు లేని దేశాలు దాదాపు రెండు కోట్ల టన్నుల విషపూరితమైన రసాయనాలను వర్ధమాన దేశాలకు పంపివేస్తున్నాయి” అని ద అబ్సర్వర్ అనే లండన్ వార్తాపత్రిక చెప్పింది. నిష్కర్షమైన నియమాలను అమలుపరచకపోవడం వల్ల ఆఫ్రికా, ఆసియా మరియు లాటిన్ అమెరికా దేశాల్లో వేల టన్నుల లెక్కన విషపదార్థాలు నిలువచేయబడుతున్నాయి.
చెత్తను పారవేయడం ఈ కర్మాగారాలకు ఆకర్షణీయంగా కనబడడంలో ఆశ్చర్యం లేదు! సరైన స్థలం ఉపయోగించినట్లయితే దానికయ్యే ఖర్చును చాలా తగ్గించవచ్చు. సముద్రయాన ఓడయైన యునైటెడ్ స్టేట్స్ అనే ఒకప్పటి అమెరికన్ యాత్రికుల అడ్మిరల్ ఓడ దీనికొక ఉదాహరణ. విహార యాత్ర నిమిత్తం 1992లో కొనుగోలు చేయబడిన ఈ ఓడకు మెరుగులు దిద్దవలసి ఉంది. మరే ఇతర ఓడలోకన్నా దీనిలోనే ఎక్కువ రాతినార ఉండి ఉండవచ్చు. రాతినారలను తొలగించడానికి అమెరికాలో 10 కోట్ల డాలర్ల ఖర్చయి ఉండేది. దానికి 20 లక్షల డాలర్లే ఖర్చు అయ్యే టర్కీకి అది పంపబడింది. కాని టర్కీ ప్రభుత్వం పుట్టకురుపు వ్యాధిని కలిగించే 46,000 చదరపు మీటర్ల రాతినారలను తన దేశంలో దించడం చాలా అపాయకరమని నిరాకరించింది. చివరికి ఆ ఓడ పర్యావరణ ప్రమాణాలు అంత నిష్కర్షగా లేని మరో దేశంలోని ఓడ రేవుకు తరలించబడింది.
ప్రాణాంతకమైన పునఃచక్రం
అభివృద్ధిచెందుతున్న దేశాల్లోని పాశ్చాత్య దేశ వ్యాపారాలు తమను తాము పేదల దాతలుగా తలుస్తుండవచ్చు. “వ్యర్థపదార్థాల ఎగుమతి మరియు పునరుత్పాదన పరిశ్రమలు ఈ దేశాల్లోని జీవన ప్రమాణాలను పెంచుతున్నాయి” అని అమెరికా వాణిజ్య మండలిలోని హార్వే ఆల్టర్ వాదిస్తున్నారు. ఎక్కువ కేసుల్లో జీవన ప్రమాణాలను పెంచేబదులు, ఈ వ్యాపార సంస్థలు “స్థానిక కనిష్ట కూలి కన్నా తక్కువే ఇస్తూ, పరిసరాలను కలుషితం చేస్తున్నారు, కొన్నిసార్లు ప్రమాదకరమైన ఉత్పత్తులు అమ్ముతున్నాయి మరియు మోసపూరితంగా విక్రయిస్తున్నాయి” అని విదేశాల్లో వాటి సంఘటిత ప్రవర్తనను గూర్చిన పునఃసమీక్ష తెలిపింది.
అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలోని కాలుష్యాన్ని గూర్చిన ఇటీవల ఒక కార్ఖానాలో పోప్ జాన్ పాల్ II తన విచారాన్ని వెలిబుచ్చారు. ఆ మత గురువు ఈ విధంగా చెప్పారు: “పరిసరాలను మరియు ప్రజల ఆరోగ్యాన్ని మలినపరచే సాంకేతిక విద్యలను వ్యర్థపదార్థాలను ఎగుమతి చేయడం ద్వారా సంపన్న దేశాలు బలహీనమైన ఆర్థిక వ్యవస్థల నుండి బీద దేశాల చట్టనిర్మాణాల నుండి లాభాలనార్జించడం విపరీతమైన దురుపయోగమే.”
మెర్క్యూరీ వ్యర్థపదార్థాలను తిరిగి ఉపయోగించే విధానానికి ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థకు పుట్టినిల్లయిన దక్షిణ ఆఫ్రికాలో దీనికి సరైన మాదిరి కనిపిస్తుంది. “ఆ ఖండంలో అతిగొప్ప కాలుష్య లోకాపవాదాలలో ఒకటి” అని చెప్పబడిన దానిలో విషపూరిత వ్యర్థపదార్థాల వలన ఒక కార్మికుడు మరణించాడు, ఇంకొక కార్మికుడు కోమాలోకి వెళ్ళాడు మరియు కార్మిక వర్గంలోని మూడవ వంతు ఏదో ఒక రకమైన మెర్క్యూరీ విషప్రయోగానికి గురైందని నివేదించబడింది. కొన్ని పారిశ్రామిక దేశాల్లోని ప్రభుత్వాలు కొన్ని మెర్క్యూరీ వ్యర్థపదార్థాలను పారవేయడాన్ని నిషేధించాయి, లేక కఠినంగా నిర్బంధించాయి. ఈ దేశాల్లో కనీసం ఒక దేశపు కార్పొరేషన్ ఓడలు అపాయకరమైన రవాణా సరకులను ఆఫ్రికా తీర ప్రాంతాలకు రవాణా చేస్తున్నాయి. ప్లాంట్‌లో నిల్వ చేసిన మూడు విదేశీ కర్మాగారాల 10,000 పీపాల మెర్క్యూరీ వ్యర్థ పదార్థాలను ఒక పరిశోధక జట్టు కనుగొనింది.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యర్థపదార్థాలను పారవేయడం కన్నా వాటిని తిరిగి ఉత్పత్తి చేసేందుకు అక్కడికి పంపించడమే మేలైనదిగా కనిపిస్తుంది. అది విలువైన ఉపోత్పత్తులను ఉద్యోగాలను ఇస్తుంది, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దక్షిణ ఆఫ్రికాలోని పై నివేదిక చూపిస్తున్నట్లు విపత్కరమైన పర్యవసానాలు కూడా కలుగవచ్చు. ఈ పదార్థాల నుండి పొందగల విలువైన ఉత్పత్తులు కాలుష్యానికి, వ్యాధులకు, కొన్నిసార్లు పనివారి మరణానికి దారితీయగల ప్రాణాంతకమైన రసాయనాలను కూడా విడుదల చేయగలవు. “పునరుత్పాదన అనేది పారవేయడానికి కారణంగా కూడా ఉపయోగించబడింది అనడానికి సందేహం లేదు” అని న్యూ సైంటిస్ట్ పత్రిక చెబుతుంది.
యు. ఎస్. న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ ఆ తంత్రాన్ని ఈ విధంగా వర్ణించింది: “దొంగ లేబుళ్ళను వేయడం, చట్టాన్ని తప్పించుకోవడం, అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోవడం వంటి వాటి వల్ల చిల్లర వ్యాపారులు విషపూరితమైన మురికి మట్టిని ‘సేంద్రియ రసాయనిక ఎరువులుగా’ లేక పాతబడ్డ క్రిమి సంహారకాలను ‘వ్యవసాయ సహాయకాలు’గా అమ్మేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు సులభమైన లక్ష్యాలౌతున్నాయి.”
విదేశీ యాజమాన్యంలోని మాక్విలడోరాలు, లేదా కర్మాగారాలు మెక్సికోలో అంకురించాయి. కచ్చితమైన కాలుష్య ప్రమాణాలను తప్పించుకోవాలి మరియు తక్కువ వేతనం పొందుతున్న పనివారి నుండి ఆర్థిక లాభాన్ని పొందాలి అన్నదే విదేశీ కంపెనీల ముఖ్య లక్ష్యం. కలుషితమైన నీళ్ళున్న ముఱికి కాలువల ప్రక్కనున్న గుడిసెల్లో వేలాదిమంది మెక్సికన్లు నివసిస్తున్నారు. “కనీసం మేకలు కూడా వాటిని త్రాగవు” అని ఒక స్త్రీ చెబుతుంది. ఒక అమెరికా మెడికల్ అసోసియేషన్ నివేదిక ఆ సరిహద్దు ప్రాంతాన్ని “వాస్తవంగా అంటువ్యాధుల కూపమని, అనుకూలమైన స్థలం” అని పిలిచింది.
చనిపోయేది కీటకాలు మాత్రమే కాదు
“ఒక దేశం స్వదేశంలో విషాన్ని నిషేధిస్తూనే, దానినెలా ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు అమ్మగలదు? న్యాయం ఎక్కడుంది?” అని వ్యవసాయ అర్థశాస్త్రవేత్త మరియు కీటకసంహార నిపుణుడునైన ఖార్టూమ్‌లోని అరీఫ్ జమాల్ అడుగుతున్నాడు. అవి ఏదేశం నుండి వచ్చాయో ఆ పారిశ్రామిక దేశంలో అవి “ఉపయోగార్థం రిజిష్టరు చేయబడలేదు” అనే ముద్రగల పీపాల ఫొటోగ్రాఫ్‌లను ఆయన ప్రదర్శించాడు. అవి సాదన్లోని వన్య ప్రాణుల కొరకై ప్రత్యేకించిన ప్రాంతంలో కనుగొనబడ్డాయి. సమీపంలో దానికి చనిపోయిన జంతువుల కుప్పలు కూడా ఉన్నాయి.
“నిషేధించబడిన, నిర్బంధించబడిన మరియు స్వదేశ ఉపయోగానికి లైసెన్సు లభించని దాదాపు 22.7 కోట్ల కిలోగ్రాముల కీటకనాశక మందులను” ఒక సంపన్న దేశం “ప్రతి సంవత్సరం ఎగుమతి చేస్తుంది” అని ద న్యూయార్క్ టైమ్స్ నివేదిస్తుంది. 1978లో డిడిటికి సంబంధించిన, క్యాన్సరు కలుగజేసే హెప్టాక్లోర్ను, ఆహార పంటలపై వాడడం నిషేధించబడింది. కాని దానిని కనుగొన్న రసాయనిక సంస్థ దానిని తయారు చేస్తూనే ఉంది.
కనీసం 85 అభివృద్ధిచెందుతున్న దేశాల్లో “ఎంతో విషపూరితమైన కీటకనాశక మందులు” విస్తృతంగా లభ్యమౌతున్నాయని ఐక్యరాజ్య సమితి జరిపిన ఒక సర్వే కనుగొనింది. దాదాపు పది లక్షల మంది ప్రజలు ప్రతి సంవత్సరం తీవ్రమైన విష ప్రయోగానికి గురౌతున్నారు. బహుశా 20,000 మంది రసాయనాలవల్ల చనిపోతున్నారు.
పొగాకు పరిశ్రమ అనేది ప్రాణాంతకమైన పేరాశకు ఉదాహరణ అని చెప్పవచ్చు. “ప్రపంచమంతటా ఉన్న పొగాకు సంబంధిత వ్యాధులు మరియు మరణాల రేట్లను అతిశయోక్తిగా చెప్పలేము” అని “భూగోళ వ్యాప్త పొగాకు అంటువ్యాధి” అనే సైంటిఫిక్ అమెరికన్ శీర్షిక చెబుతుంది. పొగాకు త్రాగడాన్ని ఆరంభించే వారి సరాసరి వయస్సు మరీ తగ్గుతూ వస్తుంది, పొగత్రాగే ఆడవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కుయుక్తమైన ప్రకటనదారులతో సంబంధం కలిగి ఉన్న శక్తివంతమైన పొగాకు కంపెనీలు తక్కువ అభివృద్ధిగల దేశాల్లో ఎక్కువ మార్కెట్టును విజయవంతంగా నెగ్గగలుగుతున్నాయి. ఐశ్వర్యానికి నడిపే వారి మార్గంలో మృత కళేబరాలను మరియు వ్యాధికి గురైన శరీరాలను విడిచిపెడతాయి.a
అయితే, కంపెనీలన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాల క్షేమం మీద శ్రద్ధ చూపించడం లేదని చెప్పవలసిందే. అభివృద్ధిచెందుతున్న దేశాల్లో న్యాయమైన, బాధ్యతాయుతమైన వ్యాపారాన్ని చేయడానికి శ్రమపడే కొన్ని కంపెనీలే ఉన్నాయి. ఉదాహరణకు, ఒక కంపెనీ పదవీ విరమణ మరియు ఆరోగ్య బెనెఫిట్లను అందిస్తుంది, దాని పనివారికి అవసరమైన కూలికి మూడు రెట్లు చెల్లిస్తుంది. మరో కంపెనీ మానవ హక్కుల విషయంలో దృఢమైన దృక్పథాన్ని గట్టిగా చేపట్టింది, దుర్వినియోగాలున్నందున డజన్ల కొలది కాంట్రాక్టులను అది వదిలిపెట్టుకుంది.
కపటపూరితమైన భ్రష్టత
దేశాల మధ్య ఉన్న అపాయకరమైన వ్యర్థపదార్థాలను మార్చడాన్ని నియంత్రించడానికి స్విట్జర్లాండ్‌లోని బాసెల్ నందు 1989లో ఐక్యరాజ్య సమితి సమావేశ ఒడంబడికపై సంతకం చేయబడింది. సమస్యను పరిష్కరించడంలో అది విఫలమైంది, మార్చి 1994లో ఆ దేశాలే జరుపుకున్న తరువాతి సమావేశాన్ని గూర్చి న్యూ సైంటిస్ట్ అనే పత్రిక చెబుతుంది:
“అభివృద్ధి చెందుతున్న దేశాలకున్న సరైన కోపానికి జవాబుగా, బాసెల్ సమావేశంలో పాల్గొన్న 65 దేశాలతో కూడిన పార్టీ ఒ.ఇ.సి.డి [ఆర్థిక సహకార మరియు అభివృద్ధి సంస్థ] నాన్-ఒ.ఇ.సి.డి దేశాలకు ఎగుమతి చేయడాన్ని ఆపివేయడం ద్వారా సమావేశాన్ని పొడిగించాలని తీర్మానించినప్పుడు ఒక ప్రాముఖ్యమైన చర్యను గైకొన్నారు.”
కాని ఈ క్రొత్త తీర్మానం వర్థమాన దేశాలకు నచ్చలేదు. న్యూ సైంటిస్ట్ తన విచారాన్ని ఇలా వెలిబుచ్చింది: “అమెరికా, బ్రిటన్, జర్మనీ మరియు ఆస్ట్రేలియా దేశాలు ఈ తీర్మానాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాయన్నది కలవరపరచే విషయం. అమెరికా ప్రభుత్వం సమావేశాన్ని ధృవపరచడానికి అంగీకరించే ముందు దాని నుండి బయటికిపొక్కిన రహస్యంగా దొరికిన పత్రాలు నిషేధానికి ‘మెరుగులు దిద్దే’ రహస్య దౌత్య ప్రయత్నాలను బయటపెట్టింది.”
పేరాశపరులు లెక్కచెప్పవలసిన రోజు
“ధనవంతులారా మీ కొరకు కష్టాలు వేచి ఉన్నందువల్ల మీరు ప్రలాపించి ఏడ్వవలసిన సమయమిది!” అని బైబిలు యాకోబు 5:1 నందు హెచ్చరిస్తుంది. (ఆధునిక ఆంగ్లంలో క్రొత్త నిబంధన జె. బి. ఫిలిప్స్) విషయాలను చక్కదిద్దే వ్యక్తి లెక్కించే సమయం వస్తుంది: “యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికి న్యాయము తీర్చును.”—కీర్తన 103:6.
ఇప్పుడు తీవ్రమైన పేదరికంలో జీవిస్తున్నవారు త్వరలోనే కీర్తన 72:12, 13లోని మాటలు నెరవేరుతాయని తెలుసుకుని ఊరటను పొందవచ్చు: “దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును.”
[అధస్సూచి]
a తేజరిల్లు! జూన్ 8, 1995 “లక్షలను గడించడానికి లక్షలాదిమందిని చంపడం” అనే శీర్షికను చూడండి.
[6వ పేజీలోని బాక్సు]
దూరమవ్వడానికి నిరాకరిస్తున్న ప్రాణాంతకమైన చెత్తకుప్ప
“ప్రాణాంతకమైన అణ్వాయుధ వ్యర్థ పదార్థాలు ప్రస్తుతం స్పష్టమైన పరిష్కార మార్గమేమీ లేకుండా ప్రోగైపోతున్నాయి.” గత మార్చిలో ద న్యూయార్క్ టైమ్స్‌లోని విజ్ఞాన శాస్త్ర భాగంలోని వార్తా శీర్షికనందు ఇలా చదవబడుతుంది. “సరళమైన మార్గమేంటంటే దానిని పూడ్చివేయడమే. అయితే, నెవాడాలో భూమి అంతర్భాగాన చెత్త ఉంచితే చివరికి వ్యర్థమైన ప్లూటోనియమ్ ద్వారా అణు ప్రేలుడు వలన అది పేల్చివేయబడుతుందా అనే విషయాన్ని గూర్చి నేడు శాస్త్రజ్ఞులు చర్చిస్తుండగా, మరి ఫెడరల్ ఏజెన్సీలు దాని గురించి పఠిస్తుండగా ఆ విషయం విమర్శించబడుతుంది కూడా” అని ఆ శీర్షిక చెప్పింది.
లోకంలో ఎక్కువగా ఉన్న ప్లూటోనియమ్ను తొలగించడానికి శాస్త్రజ్ఞులు అనేక పథకాలను ప్రతిపాదించారు, కాని దానికయ్యే ఖర్చు, భిన్నాభిప్రాయాలు, భయాలు ఈ పద్ధతులను నిర్లక్ష్యం చేశాయి. దానిని సముద్రంలో పారవేయాలన్న తలంపు అనేకులకు నచ్చలేదు. దానిని ఎండలో కాల్చివేయడమన్నది మరింత ఊహించదగిన సలహా. దానిని కాల్చివేయడానికి రియాక్టర్లను ఉపయోగించడమన్నది మరో పరిష్కారం. కాని దానికి “లక్షలాది సంవత్సరాలు” పడుతుంది గనుక ఇది త్రోసివేయబడింది.
“సాంకేతికమైన ప్రతి మంచి పరిష్కారానికి భయానకమైన రాజకీయ కారణాలున్నాయి, రాజకీయంగా మంచిదైన ప్రతి మంచి పరిష్కారం సాంకేతికంగా అవలక్షణంగా ఉండేందుకు మొగ్గు చూపిస్తుంది. ఈ గందరగోళానికి మనతో సహా ఎవరి దగ్గర కూడా మొత్తం మీద మంచి పరిష్కారాలు లేవు” అని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ అండ్ ఎన్విరోన్మెంటల్ రిసర్చ్లోని డా. మకిజాని చెప్పింది.
ఆరు కోట్ల ఇళ్ళకు విద్యుచ్ఛక్తిని—దేశంలోని విద్యుచ్ఛక్తిలో 20 శాతం—సరఫరా చేసేందుకు అమెరికాలోని పరమాణు విద్యుత్తు కేంద్రంలోని 107 రియాక్టర్లు 2,000 టన్నుల వాడబడిన ఇంధనాన్ని ప్రతి సంవత్సరం తయారు చేస్తున్నాయి, 1957 నుండి, వాడబడిన ఇంధనం తాత్కాలికంగా న్యూక్లియర్ ప్లాంట్లలో నిలువ చేయబడుతుంది. దానిని వదిలించేందుకు ప్రభుత్వమే మార్గాన్ని కనుగొనేందుకు దశాబ్దాలుగా ప్రజలు వ్యర్థంగా ఎదురు చూశారు. కార్యాలయంలోని తొమ్మిది మంది అధ్యక్షులు మరియు 18 మహాసభలు అణుధార్మిక వ్యర్థపదార్థాల నిల్వను భూగర్భప్రాంతాల్లో జాగ్రత్తగా నిల్వచేసేందుకు పథకాలను మరియు హద్దులను ప్రతిపాదించారు, కాని వేలాది సంవత్సరాలు సురక్షితంగా ఉండే విధంగా మారణాయుధాల వ్యర్థ పదార్థాలను తుదకు వదిలించుకోవడాన్ని గూర్చిన తీర్మానం ఇంకా తీసుకోవలసి ఉంది.
ఇందుకు భిన్నంగా, విశ్వమందు సుదూరానున్న నక్షత్రములలో యెహోవా జరిగిస్తున్న లక్షకోట్ల కొలది విలయన కొలుములు ప్రమాదకరమైనవి కావు, మరి ఆయన సూర్యునిలో జరిగిస్తున్నది భూమిపైన జీవనాన్ని సాధ్యపరుస్తుంది.
[క్రెడిట్ లైను]
UNITED NATIONS/IAEA
[7వ పేజీలోని చిత్రం]
త్రాగడానికి, బట్టలుతకడానికి ఉపయోగించే నీటిని విషపూరితమైన రసాయనాలు మలినం చేస్తాయి
[7వ పేజీలోని చిత్రం]
పిల్లలు అపాయకరమైన లేదా ప్రాణాంతకమైన వ్యర్థపదార్థాల మధ్య ఆడుకుంటారు