అణు భయం చివరికి అంతరించిందా?
“రెండవ ప్రపంచ యుద్ధం నుండి మునుపెన్నటికంటే యిప్పుడు భూమ్మీద శాంతి సాధ్యమనిపిస్తోంది.” ఓ వార్తా విలేఖరి 1980వ దశకం చివర్లో వేసిన ఈ ఆశావాద అంచనా, చెప్పుకోదగిన నిరాయుధీకరణ ఒప్పందాలూ ఎదురుచూడని రాజకీయ మార్పులూ చివరికి ప్రచ్ఛన్న యుద్ధాన్ని అంతం చేశాయనే వాస్తవంపైన ఆధారపడింది. అయితే మునుపటి అగ్రరాజ్యాల పోటీ మూలంగా ఏర్పడ్డ అణు భయం కూడా అంతరించిపోయిందా? శాశ్వతమైన శాంతి భద్రతలు త్వరలో పొందగల్గేలా ఉన్నాయా?
బహుళోత్పాదకతలోని అపాయాలు
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో, శాంతిని కాపాడేందుకు సైనిక శక్తిని సమతుల్యం చేసుకోవడంపై ఆధారపడుతూనే అగ్రరాజ్యాలు శాంతియుత ప్రయోజనాల కొరకు అణు పరిజ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడాన్ని అంగీకరించాయి. అయితే, అణ్వస్త్రాలను తయారుచేసే రాజ్యాలను పరిమితం చేయాలని అంగీకరించాయి. న్యూక్లియర్ నాన్‌ప్రొలిఫరేషన్ ట్రీటీ 1970లో అమలులోకొచ్చింది; ఆ తర్వాత దాన్ని 140 దేశాలు ఆమోదించాయి. అయితే, అణ్వస్త్రాలను తయారు చేయగల శక్తివున్న బ్రెజిల్, అర్జెంటీనా, ఇండియా, ఇశ్రాయేల్ వంటి దేశాలు నేటికీ దానిపై సంతకం చేయడానికి అంగీకరించలేదు.
అయితే, 1985లో అణ్వస్త్రాలను తయారుచేయగల శక్తివున్న మరో దేశమైన ఉత్తర కొరియా దానిపై సంతకం చేసింది. అయినా మార్చి 12, 1993లో అది ఆ ఒప్పందం నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించినప్పుడు, లోకం అసౌకర్యంతో ప్రతిస్పందించడం సబబే. జర్మన్ పత్రికైన ద ష్పీగెల్ యిలా వర్ణించింది: “న్యూక్లియర్ నాన్‌ప్రోలిఫరేషన్ ట్రీటీ నుండి వైదొలగుతున్నామని తెలిపే నోటీసు: గత విధానాన్ని ఒక దాన్ని పునరావృతం చేసింది: అదేమిటంటే, ఒకప్పుడు అగ్రరాజ్యాల మధ్యనున్న బాంబుల వైరం కంటే మరెక్కువ ప్రమాదకరంకాగల అణు ఆయుధ పోటీ ఆసియాలో ప్రారంభమౌతుంది.”
విస్మయమొందిస్తున్న రీతిలో జాతీయవాదం, కొత్త దేశాలు ఆవిర్భవించడానికి దోహదపడడంతో, అణు శక్తిగల దేశాల సంఖ్య పెరిగే అవకాశముంది. (బాక్స్ చూడండి.) చార్ల్జ్ క్రౌట్హామర్ అనే జర్నలిస్టు యిలా హెచ్చరించాడు: “సోవియట్ భయం అంతరించిందంటే దాని అర్థం అణు ప్రమాదం అంతరించిందని కాదు. అసలు అపాయం ఏమిటంటే, అణు శక్తిగల దేశాలు పెరగటం, మరి వాటి విస్తరణ యిప్పుడిప్పుడే ప్రారంభమైంది.”
అమ్మకమునకు బాంబులు
అణు ఆయుధాల వల్ల కలిగే బలప్రతిష్ఠలు పొందడానికి అణు సంపత్తిని ఆర్జించబోయే దేశాలు ఎంతో ఉబలాటపడుతున్నాయి. ఒక దేశం, కజకస్తాన్ నుండి కనీసం రెండు అణు యుద్ధ ఆయుధాలను తెచ్చుకుందని చెప్పబడుతోంది. ఈ మునుపటి సోవియట్ దేశం అణ్వస్త్రాలు “కనిపించడంలేదు” అని అధికారికంగా తెల్పుతోంది.
అక్టోబరు 1992లో జర్మనీ నందలి ఫ్రాంక్‌ఫర్ట్‌లో 200 గ్రాముల అధిక రేడియో ధార్మిక సీసియమ్తో అనేకమంది పట్టుబడ్డారు. ఆది ఆ పట్టణ నీటి సరఫరానంతటిని విషపూరితం చేయడానికి సరిపోతుంది. ఓ వారం తర్వాత, 2.2 కిలోగ్రాముల యురేనియమ్తో ఏడుగురు స్మగ్లర్లు మూనిచ్లో పట్టుబడ్డారు. గత సంవత్సరమంతటిలో ప్రపంచవ్యాప్తంగా అలాంటి కేసులు అయిదు మాత్రమే నమోదు కాగా, కేవలం రెండు వారాల్లోనే రెండు న్యూక్లియర్ స్మగ్గింగ్ ముఠాలను కనిపెట్టడం అధికారులను ఆశ్చర్యపర్చింది.
ఈ వ్యక్తులు వీటిని ఉగ్రవాద గుంపులకు అమ్మాలనుకున్నారో లేక జాతీయ ప్రభుత్వాలకు అమ్మాలనుకున్నారో తెలియదు. అయినప్పటికీ, అణ్వస్త్ర ఉగ్రవాదం చెలరేగే సాధ్యత పెరుగుతోంది. యూరోపియన్ ప్రోలిఫరేషన్ యిన్ఫర్మేషన్ సెంటర్‌కు చెందిన డా. డేవిడ్ లోరి ఈ అపాయాన్ని యిలా వర్ణించారు: “ఒక ఉగ్రవాది చేయవలసిందల్లా అత్యంత శక్తివంతమైన యురేనియమ్ కొంత నమూనాను తగిన అధికారులకు పరీక్ష నిమిత్తం పంపి, మా దగ్గర యురేనియమ్ ఉందని తెలియజేయడమే. అది, ఓ అపహరణకర్త తాను అపహరించిన వ్యక్తి తన వద్ద ఉన్నట్లు అతనికి సంబంధించిన గుర్తును పంపినట్లుంటుంది.”
నిదానంగా ముప్పుతేగల “టైమ్ బాంబులు” మరియు “మరణకరమైన ఉచ్చులు”
పందొమ్మిదవందల తొంభైరెండు ప్రారంభానికి, 420 అణు ఉత్పాదక కేంద్రాలు విద్యుచ్చక్తిని ఉత్పత్తి చేసే శాంతియుత పనిలో నిమగ్నమై ఉన్నాయి; మరో 76 యింకా నిర్మాణంలో ఉన్నాయి. అయితే సంవత్సరాలు గతించే కొలది, ఉత్పాదక కేంద్ర ప్రమాదాలు అస్వస్థత, గర్భస్రావాలు జన్మ లోపాలవంటివి ఎక్కువయ్యేలా చేశాయి. ఓ రిపోర్టు, 1967 నాటికే సోవియట్ ప్లూటోనియమ్ ఉత్పాదక కేంద్రంలో జరిగిన సంఘటనలు, చెర్నోబెల్ ప్రమాదంలో వెలువడిన రేడియా ధార్మిక శక్తి కంటే మూడు రెట్లు అధికంగా వెళ్లగ్రక్కాయని తెల్పుతున్నది.
నిజమే, 1986 ఏప్రిల్‌లో యుక్రేన్ నందలి చెర్నోబెల్లో సంభవించిన ఈ తర్వాతి సంఘటన వార్తా మాధ్యమాల అవధానాన్ని ఆకర్షించింది. “దీర్ఘకాలీన పరిణామాల మాటకొస్తే,” దాని నుండి వాతావరణంలోకి చొచ్చుకుపోయిన “పెద్ద మొత్తంలోనున్న దీర్ఘకాలం నిలిచే రేడియో ధార్మిక శక్తి పది హిరోషీమా బాంబులతో సరిసమానమని,” చెర్నోబెల్ ఉత్పాదక కేంద్రమందు 1970వ దశకంలో అణు డిప్యూటీ చీఫ్ ఇంజనీరైన గ్రెగోర్యాయి మెడ్వెడెఫ్ అన్నారు.
చెర్నోబెల్స్కేయా క్రోనికా అనే తన పుస్తకంలో మెడ్వెడెఫ్, మునుపటి సోవియట్ యూనియన్‌లో 1980 దశకం మధ్య భాగాని కల్లా సంభవించిన 11 తీవ్రమైన అణ్వస్త్ర ఉత్పాదక కేంద్రాల సంఘటనలనూ, అమెరికాల్లో సంభవించిన మరి 12 సంఘటనలను పేర్కొన్నారు. అమెరికాలో సంభవించిన వాటిలో త్రీ మైల్ ఐలండ్ నందు 1979లో సంభవించిన విభ్రాంతి కల్గించే ప్రమాదం కూడా ఉంది. ఆ సంఘటనను గూర్చి మెడ్వెడెఫ్ యిలా చెప్పారు: “అది, అణు శక్తిపై మొట్టమొదటి దెబ్బ కొట్టింది, అంతేకాదు అది అనేకుల మనస్సులోనుండి అణు శక్తి కేంద్రాలు సురక్షితం అనే భ్రమను తొలగించింది—అయితే అందరి మనస్సులనుండి తొలగించలేదు.”
ఇది, దుర్ఘటనలు యింకా ఎందుకు సంభవిస్తున్నాయనే విషయాన్ని వివరిస్తోంది. రష్యా నందు, అవి 1992వ సంవత్సరంలో 20 శాతానికి పెరిగాయి. ఆ సంవత్సరం మార్చిలో, రష్యానందలి సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని సొస్నొవె బోరా పవర్ ప్లాంట్ వద్ద, ఈ సంఘటనల్లో ఒకటి సంభవించిన తర్వాత, ఈశాన్య ఇంగ్లాండ్‌లో రేడియేషన్ ప్రమాణం 50 శాతం వరకు పెరిగింది, అంతేకాకుండా ఎస్టొనియా మరియు దక్షిణ ఫిన్లాండ్లో అనుమతించదగిన పరిమాణం కంటే రెండింతలకు చేరుకుంది. న్యూకాసిల్ యూనివర్సిటీలోని ప్రొఫెసరైన జాన్ ఆర్క్వర్ట్ యిలా ఒప్పుకున్నాడు: “సొస్నొవె బోరానే ఈ పెరుగుదలను కల్గించిందని నేను నిరూపించలేను—కానీ సొస్నొవి బోరా కాకపోతే మరింకేది అయ్యుంటుంది?”
చెర్నోబెల్ తరహా ఉత్పాదక కేంద్రాల తయారీలోనే లోపంవుందనీ, వాటిని ఉపయోగించడమే చాలా అపాయకరమని కొందరు అధికారులు చెబుతున్నారు. అయినప్పటికి, అధిక విద్యుచ్ఛక్తి వినియోగానికి సహాయపడేందుకు ఒక డజను కన్నా ఎక్కువ ఉత్పాదక కేంద్రాలు యింకా ఉపయోగంలో ఉన్నాయి. ఉత్పాదక కేంద్ర నిర్వాహకులు కొందరు, ఉత్పాదకతను ఎక్కువ చేసేందుకు సురక్షిత ప్రమాణాలను కాలరాచేశారని నిందించబడ్డారు. తమ దేశ విద్యుచ్ఛక్తిలో 70 శాతం అణు కేంద్రాల నుండే ఉత్పత్తి చేస్తున్న ఫ్రాన్స్ వంటి దేశాలను ఇలాంటి నివేదికలు, భయబ్రాంతులను చేస్తున్నాయి. “చెర్నోబెల్” వంటి మరో సంఘటనలెక్కడైనా జరిగితే, ఫ్రాన్స్‌లోని అనేక కేంద్రాలు శాశ్వతంగా మూసివేయవలసిన అవసరత ఏర్పడుతుంది.
“సురక్షిత” ఉత్పాదక కేంద్రాలు కూడా కాలం గడిచేకొలది అసురక్షితమౌతాయి. ఆనవాయితీగా భద్రతా పరీక్ష జరుపుతున్న సమయంలో 1993 తొలి భాగమందు జర్మనీ నందలి బ్రన్స్బ్యూటెల్లో అతి పురాతన ఉత్పాదక కేంద్రంలోని స్టీల్ పైపింగ్‌లో వందకంటే ఎక్కువ బీటలు కనిపించాయి. అలాంటి బీటలు, ఫ్రాన్స్, స్విడ్జర్లాండ్ల్లోని ఉత్పాదక కేంద్రాల్లో కూడా కనిపించాయి. జపాన్ అణు శక్తి ఉత్పాదక కేంద్రంలో మొట్ట మొదటి తీవ్రమైన దుర్ఘటన 1991లో సంభవించింది, దానికి ముఖ్య కారణం అది పాతది కావడమే. అమెరికా వ్యాపార ఉత్పాదక కేంద్రాల్లో కూడా ప్రమాదాలు సంభవించే అవకాశముంది. ఎందుకంటే, వాటిలో మూడింట రెండొంతులు పది సంవత్సరాలకంటే పైబడినవి.
అణు ఉత్పాదక కేంద్ర ప్రమాదాలు ఎక్కడైనా ఎప్పుడైనా సంభవించగలవు. ఎన్ని ఎక్కువ ఉత్పాదక కేంద్రాలుంటే అంత ఎక్కువ అపాయం ఉంది; ఉత్పాదక కేంద్రం ఎంత పాతదైతే అంత ఎక్కువ ప్రమాదం ఉంది. అందుకే వార్తా పత్రికలు వీటికి టిక్‌టిక్ టైమ్ బాంబులనీ, రేడియోధార్మిక మరణకరమైన ఉచ్చులని మారు పేర్లను పెట్టాయి.
వ్యర్థ పదార్థాన్ని వారెక్కడ పడెయ్యాలి?
ఇటీవల ఫ్రెంచ్ ఆల్ఫ్స్ నందలి నదీ తీరానున్న ఓ పిక్నిక్ స్థలానికి కంచె వేసి పోలీసులు దానిని కాపలాకాయడం చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. ది యూరోపియన్ వార్తా పత్రిక యిలా వివరించింది: “రెండు నెల్ల క్రితం బెరిలియమ్ విషం వల్ల ఓ స్థానికురాలు మరణించిన తర్వాత రేడియోధార్మిక శక్తి కొరకు పదేపదే జరిపిన పరీక్షల్లో, పిక్నిక్ ప్రాంతంలోవున్న రేడియోధార్మిక శక్తి చుట్టుప్రక్కల ఉన్నదానికంటే 100 రెట్లు ఎక్కువగా ఉందని బయల్పడింది.”
పలు విధాల పనితో ఉత్పత్తి చేయబడే అతి తేలికైన లోహమగు బెరీలియమ్, విమాన పరిశ్రమల్లోను అణు విద్యుత్ కేంద్రాల్లో రేడియేషన్‌కు గురియైనప్పుడు, ఉపయోగించడం జరుగుతుంది. బెరీలియమ్ను ఉత్పత్తి చేసే ఓ కర్మాగారం, అపాయకరమైన రేడియేషన్ పద్ధతి నుండి వచ్చిన వ్యర్థ పదార్థాన్ని పిక్నిక్ స్థలంలో లేక దాని సమీపంలో పారేసింది. “రేడియేషన్‌కు గురిచేయకపోయినా పరిశ్రమలు పారవేసే వ్యర్థపదార్థములో మనకు తెలిసినంతవరకు బెరీలియమ్ ధూళి అతి విషపూరితమైనదని” ది యూరోపియన్ తెల్పింది.
ఇంతలో, మునుపటి సోవియట్ 1950వ పడి తొలి భాగంలో అణ్వస్త్ర పరిశీలన ప్రాంతంగా ఉపయోగించిన నోవాయా జిమ్లయా తీరాన, 30 సంవత్సరాలకుపైగా 17,000 పీపాల రేడియో ధార్మిక వ్యర్థ పదార్థాన్ని తరచు పారవేస్తూ వస్తుంది. దానికి తోడు, అణు జలాంతర్గాముల యొక్క రేడియో ధార్మిక విభాగాలనూ, 12 ఉత్పాదక కేంద్రాల భాగాలనూ అనుకూలంగా ఉన్న ఈ చెత్త బుట్టలో పడేశారు.
అది బుద్ధిపూర్వకమైనదైనా కాకపోయినా, అణు కాలుష్యం ప్రమాదకరం. నార్వే తీరాన 1989లో మునిగిపోయిన ఒక జలాంతర్గామిని గూర్చి టైమ్ యిలా హెచ్చరించింది: “మునిగిన దాని నుండి, క్యాన్సర్‌ను కలుగజేస్తుందని చెప్పబడుతున్న ఐసోటోపైన సీసియమ్-137 యిప్పటికే వెలువడుతోంది. దాని నుండి వెలువడుతున్నది సముద్ర జీవరాసులకు గానీ మానవుని ఆరోగ్యానికి గానీ ఏమాత్రం ప్రమాదం కానంత స్వల్పమేనని ఇంతవరకూ భావించబడింది. అయితే కామ్సోమోలెట్స్, సగం జీవన శక్తి అంటే, 24,000 సంవత్సరాలు గల్గి, ఒక్క రవ్వ ఓ మనిషిని చంపగల్గేంత విషమున్న 13 కేజీల [29 పౌండ్ల] ప్లూటోనియమ్ ఉన్న రెండు అణ్వస్త్ర నౌకా విధ్వంసకాలను కల్గివుంది. ఈ ప్లూటోనియమ్ నీళ్లలోపడగలదనీ 1994 కల్లా మహాసముద్రపు అన్ని భాగాలనూ కలుషితం చేయగలదని రష్యన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.”
రేడియో ధార్మిక వ్యర్థపదార్థాన్ని పారవేయడం ఫ్రాన్స్, రష్యాల సమస్య మాత్రమే కాదు. అమెరికాలో “గుట్టలు గుట్టల రేడియోధార్మిక వ్యర్థ పదార్థం ఉంది, కానీ వాటిని నిలువ చేయడానికి శాశ్వతమైన స్థలం లేదు,” అని టైమ్స్ నివేదించింది. పది లక్షల పీపాల ప్రాణాంతకమైన పదార్థాలు తాత్కాలికంగా నిలువచేసే స్థలాల్లో ఉంచబడి ఉన్నాయి. అవి “పోతాయని, దొంగిలించబడుతాయని అంతేకాకుండా వాటిని సరిగా ఉపయోగించకపోవడంవల్ల పర్యావరణానికి ముప్పు కలుగుతుందనే” ప్రమాదాలు ఎల్లప్పుడూ ఉన్నాయి.
ఈ అపాయాన్ని దృష్టాంతపర్చాలంటే 1993 ఏప్రిల్‌లో సైబీరియా నందలి టోమ్స్క్లోని మునుపటి ఆయుధ కేంద్రం వద్ద ఉన్న అణు వ్యర్థ పదార్థాల ట్యాంకు ప్రేలింది. అది చెర్నోబెల్ వంటి మరో ప్రమాదం యొక్క భయంకరమైన మానసిక చిత్రాలను సృష్టిస్తుంది.
కనుక, అణు ప్రమాదం అంతరించిందని తలంచి, దాని ఆధారంగా చేసే శాంతి భద్రతల కొరకైన పిలుపు సరియైన పునాదిపై ఆధారపడినది కాదు. అయినప్పటికీ శాంతి భద్రతలు సమీపంలోనే ఉన్నాయి. అది మనకెలా తెలుసు?
[4వ పేజీలోని బాక్సు]
అణు శక్తిగల్గి ఉన్నవి
12 దేశాలు, ఆ సంఖ్య యింకా పెరుగుతూనే ఉంది
ప్రకటించిన లేక వాస్తవిక దేశాలు: బెలారస్, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, ఇండియా, ఇజ్రాయేల్, కజకస్తాన్, పాకిస్తాన్, రష్యా, దక్షిణాఫ్రికా, యుక్రేన్, అమెరికా
సామర్థ్యంగల దేశాలు: అల్జీరియా, అర్జెంటీనా, బ్రెజిల్, ఇరాన్, ఇరాక్, లిబియా, ఉత్తర కొరియా, సిరియా, తైవాన్
[5వ పేజీలోని చిత్రం]
అణు శక్తిని శాంతియుతంగా ఉపయోగించడం కూడా ప్రమాదకరంకావచ్చు
[క్రెడిట్ లైను]
Background: U.S. National Archives photo
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
Cover: Stockman/International Stock
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
U.S. National Archives photo