నన్ను నిజంగా ప్రేమించిన కుటుంబం
బిడ్డకు, ఏ బిడ్డకైనా కుటుంబం ఎంతో ప్రాముఖ్యమైనది. బిడ్డ శారీరక మరియు భావోద్రేక అవసరాలను ప్రేమానురాగాలు గల కుటుంబం తీరుస్తుంది. తర్ఫీదునివ్వడంలోను విద్యాభ్యాసంలోను అభివృద్ధిలోను అది ముఖ్యమైన పాత్రను నిర్వహిస్తుంది. అది బిడ్డకు సురక్షిత భావాన్నిస్తుంది. నేను వెళ్ళగొట్టబడినట్లు, ఒకరిని తన కుటుంబం వెళ్ళగొట్టడం ఎంత విచారకరమో!
నేను తూర్పు నైజీరియాలోని ఒక పెద్ద కుటుంబంలో జన్మించాను. మా నాన్న ఏడుగురు భార్యలకు శిరస్సు. ఆయన 30 మంది పిల్లలకు జన్మనిచ్చాడు, నేను 29వ వాడను.
ఒకరోజు, 1965లో నాకు పదేండ్లున్నప్పుడు, నేను పాఠశాల నుండి వచ్చి, వరండాలో కూర్చున్న మా నాన్నను కలిశాను. ఇద్దరు పురుషులు బ్రీఫ్‌కేసులను పట్టుకుని కాంపౌండులోకి వచ్చి సంతోషంగా నమస్కారం చెప్పిన తరువాత, తాము యెహోవాసాక్షులమని తమను తాము పరిచయం చేసుకున్నారు. వారు చెప్పినదానిని మా నాన్న శ్రద్ధగా విన్నారు. వారు ఆయనకు రెండు పత్రికలను ఇచ్చినప్పుడు, మా నాన్న నావైపు చూసి, అవి నీకు కావాలా అని అడిగాడు. కావాలి అని నేను తలూపాను, ఆయన నాకు వాటిని కొనిచ్చాడు.
ఆ సాక్షులు తిరిగి వస్తామని మాటిచ్చారు, అలాగే వచ్చారు. తరువాతి రెండు సంవత్సరాలు నాతో బైబిలును చర్చించడానికి వారు వచ్చేవారు. అయితే, మా గ్రామం నుండి వారు ఉండే ప్రాంతానికి పది కిలోమీటర్లు నడవవలసి ఉండేది గనుక, వారు క్రమంగా దర్శించేవారు కారు.
నా కుటుంబం నన్ను నిరాకరిస్తుంది
నా తండ్రి రోగియై మరణించినప్పుడు నాకు 12 ఏండ్లు. నాన్నను సమాధి చేసిన ఎనిమిది రోజుల తరువాత, మా పెద్దన్న కుటుంబంలో అందరినీ రమ్మని పిలిచాడు. దాదాపు 20 మందిమి ఉన్నాము. అంత్యక్రియల ఖర్చు గురించి ఆయన మాట్లాడబోతున్నాడేమోనని మేమందరం అనుకున్నాం. అయితే, తన తమ్ముని గురించి, అంటే నా గురించి మాట్లాడడానికే అందరినీ పిలిచానని ఆయన చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను! నన్ను పోషించడానికి కుటుంబానికి డబ్బు లేనట్లు నాలుగు పెన్సుల కోసం “భిక్షమెత్తుకు” తిరగడానికి నేను ఇష్టపడుతున్నానని వారితో ఆయన చెప్పాడు. నాలుగు పెన్సులకోసం పుస్తకాలను అమ్మడానికి తిరగడం కుటుంబ ప్రతిష్ఠను మట్టిపాలు చేయడమని కూడా ఆయన చెప్పాడు. యెహోవాసాక్షులతో ఉండాలా లేక నా కుటుంబంతో ఉండాలా అని నేను తీర్మానించుకోవాలని ఆయన చెప్పాడు.
అప్పటికే మా అమ్మ మరణించింది, కనుక మా ఒక సవతి తల్లి ఏడుస్తూ, నా కోసం ప్రాథేయపడింది. వారసత్వంలో నాకు వాటా లేకుండా చేసేందుకు దీనినొక సాకుగా తీసుకోకూడదని ఆమె వారిని కోరింది. కాని వారి దృష్టిలో ఒక స్త్రీ అభిప్రాయానికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. కుటుంబమంతా మా అన్న పక్షానే మాట్లాడింది, నేను ఒక తీర్మానం తీసుకోవాలని పట్టుపట్టింది.
ఆ విషయాన్ని గూర్చి ఆలోచించడానికి సమయమివ్వాలని నేను కోరాను. మరుసటి రోజు సాయంకాలం వరకు నాకు సమయమివ్వడానికి వారు ఒప్పుకున్నారు. నా గదిలో నేను ఒంటరిగా ఉండి ఏడ్వడం మొదలెట్టాను. నేను బలహీనునిగా నిరాకరించబడినవానిగా భావించాను, మరి భయపడిపోయాను. నాకు ఏమి జరుగుతుందోనని భయపడ్డాను.
అప్పటి వరకు ఎన్నడూ నేను రాజ్యమందిరానికి వెళ్ళనూలేదు, సాక్షులతో ప్రకటనా పనిలో పాల్గొననూ లేదు. నాకు బైబిలు బోధలను గూర్చి కొద్దిపాటి జ్ఞానమే ఉండేది, నా పక్షాన మాట్లాడడానికి గ్రామంలో సాక్షులు ఎవరూ లేరు.
నేను నా జీవితంలో మొదటి సారిగా యెహోవా నామమున ఆయనకు ప్రార్థన చేశాను. ఆయనే నిజమైన దేవుడని నేను తెలుసుకుంటున్నానని ఆయనతో నేను చెప్పాను. ఆయన నాకు మద్దతునివ్వాలని, ఆయనను అప్రీతిపర్చని తీర్మానాన్ని తీసుకోవడానికి నాకు సహాయం చేయమని నేను ఆయనను వేడుకున్నాను.
మరుసటి రోజు కుటుంబంలోని అందరూ మళ్ళీ కలుసుకుని, నా తీర్మానమేమిటని అడిగారు. నాకు ఊపిరి పోసిన నా తండ్రియే సాక్షులతో నా పఠనాన్ని ఏర్పాటు చేశారని నేను వివరించాను. ఆయనే నా పత్రికల కొరకు బైబిలు కొరకు డబ్బు చెల్లించాడు. నేను సాక్షులతో పఠించడంలో ఆయనకు బాధ ఏమీలేదు, అయితే మా పెద్దన్న ఎందుకు దీనిని నాకు వ్యతిరేకంగా తీసుకుంటున్నాడో నాకు అర్థం కాలేదు. వాళ్ళు నాకు ఏమి చేసినా ఫరవాలేదు కానీ, నేను యెహోవాను సేవించవలసిందే అని చెప్పాను.
నా మాటలు వారికి నచ్చలేదు. “మనతో ఇలా మాట్లాడడానికి ఈ చిట్టెలుక ఎవరు?” అని వారిలో ఒకరు అన్నారు. వెంటనే నా అన్న పెద్దగా చప్పుడూ చేస్తూ నా గదిలోకి నడిచి నా దుస్తులను, పుస్తకాలను, నా చిన్నకార్డుబోర్డు సూట్‌కేస్‌ను విసురుగా లాగి బయట నేల మీద విసిరి వేశాడు.
మా గ్రామంలో నివసిస్తున్న నా తోటి విద్యార్థి ఇంట్లో నాకు ఆశ్రయం లభించింది, నేను అతని కుటుంబంతో ఐదు నెలలపాటు నివసించాను. తనతో ఉండడానికి నన్ను ఆహ్వానించిన లాగోస్‌లో ఉన్న మా మేనమామకు నేను ఆ సమయంలో ఉత్తరం వ్రాశాను.
అనేక నెలలుగా నేను ఈతకాయలను సేకరించి, వాటిని అమ్మి డబ్బు దాచుకున్నాను. నా పక్షాన మాట్లాడిన సవతి తల్లి కూడా నాకు కొంత డబ్బు ఇచ్చింది. నాకు కావలసినంత డబ్బు జమా అయ్యేసరికి నేను లాగోస్‌కు ప్రయాణం మొదలెట్టాను. నేను కొంత దూరం ఇసుక బండి వెనుక కూర్చుని వెళ్ళాను.
రెండవసారి వెళ్ళగొట్టబడ్డాను
నేను లాగోస్‌కు చేరుకున్నప్పుడు మా మేనమామ సాక్షులతో పఠిస్తున్నాడని తెలుసుకుని నేను చాలా సంతోషించాను. వెంటనే నేను రాజ్యమందిరంలో సంఘ కూటాలకు హాజరు కావడం మొదలెట్టాను. అయితే, యెహోవాను సేవించాలన్న మా మేనమామ ఆసక్తి, మా పెద్దన్నయ్య సందర్శించడానికి రావడంతో అంతర్థానమైంది. నేను యెహోవాసాక్షులతో సహవసిస్తూ ఉన్నందు వల్ల నన్ను పోషించనూ వద్దు, పాఠశాలకు నన్ను వెళ్ళనివ్వనూ వద్దన్నది కుటుంబ తీర్మానమని మేనమామతో ఆయన చెప్పాడు. ఆయన మా మేనమామను బెదిరించి ఇంటికి తిరిగి వెళ్ళాడు.
మా అన్న వెళ్ళిన ఒక వారం తరువాత, మా మేనమామ మధ్యరాత్రిలో నన్ను లేపి, ఏదో వ్రాసి ఉన్న ఒక కాగితాన్ని నా ముందు పారేశాడు. ఆయన ఒక కలాన్ని నా చేతికిచ్చి దానిపై సంతకం చేయమన్నాడు. నేను ఆయన ముఖంలో కోపాన్ని చూసినప్పుడు అది ఏదో గంభీరమైనదని నాకు తెలిసింది. “మామయ్యా, నేను దీనిపై రేపు ఉదయం సంతకం పెడితే సరిపోదంటారా?” అని నేనన్నాను.
ఆయనను నేను “మామయ్యా” అని పిలువవద్దు గాని వెంటనే కాగితంపై సంతకం చేయాలని ఆయన చెప్పాడు. ఒక హంతకునికి కూడా తనకు వ్యతిరేకంగా ఉన్న నేరారోపణలను గూర్చి తెలుసుకునే హక్కు ఉంది అని జవాబు చెప్పాను. ఆ కాగితంపై సంతకం చేసేముందు దానిని చదివే హక్కు నాకు తప్పకుండా ఉంది.
అప్పుడు ఆయన కోపంతో, చదవడానికి నాకు అనుమతినిచ్చాడు. అది ఇలా మొదలౌతుంది: “యు. యు. యుడో అను నేను యెహోవాసాక్షుల్లో ఒకరిని కానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా సంచీని, పుస్తకాలను కాల్చివేయడానికి నేను ఒప్పుకుంటున్నాను, యెహోవాసాక్షులతో ఇక ఏ సంబంధమూ పెట్టుకోనని మాటిస్తున్నాను. . . .” మొదటి కొన్ని వరుసలు చదివిన తరువాత, నేను నవ్వడం మొదలెట్టాను. నాకు ఆయన ఎడల గౌరవం లేనందువల్ల కాదుగాని, అలాంటి లేఖపై సంతకం చేయడం అసాధ్యమని వెంటనే వివరంగా చెప్పాను.
మా మేనమామ చాలా కోపపడి, వెంటనే ఇంటి నుండి వెళ్ళిపొమ్మని చెప్పాడు. నేను చప్పుడు కాకుండా నా దుస్తులను, పుస్తకాలను నా పెట్టెలో సర్దుకుని, అపార్ట్‌మెంటుకు వెలుపల నడవలోకి వెళ్ళి, నిద్రపోదామని అక్కడ నేలమీద పడుకున్నాను. మేనమామ అక్కడ నన్ను చూసినప్పుడు తాను నడవకు కూడా అద్దె చెల్లిస్తున్నందున నేను ఆ బిల్డింగ్‌నంతటిని వదిలిపెట్టి వెళ్ళాలి అన్నాడు.
ఆకర్షణీయమైన వాగ్దానం
నేను లాగోస్‌లో రెండు వారాలు మాత్రమే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. నన్ను రాజ్యమందిరానికి తీసుకువెళ్ళడానికి వచ్చే సహోదరుడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. కాబట్టి తెల్లవారుతుండగా, నాకు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థిస్తూ నడవడం తిరగడం మొదలెట్టాను.
రాత్రయ్యేసరికి నేను పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాను. నేను దాని యజమాని దగ్గరికి వెళ్ళి, దొంగలు నా పెట్టెను నా దగ్గర నుండి దొంగిలించకుండా ఉండేందుకు ఆయన దానిని రాత్రంతా కార్యాలయంలో పెట్టి తాళమేస్తాడేమోనని అడిగాను. ఈ అభ్యర్థన, నేనెందుకు ఇంటికి పోవడంలేదో అడగాలనే కుతూహలాన్ని ఆయనకు కలిగించింది. నేను ఆయనకు నా కథ చెప్పాను.
ఆ వ్యక్తి సానుభూతి కలవాడు, తనింట్లో నన్ను పనివానిగా ఉంచుకుంటానని చెప్పాడు. నేను ఆయన ఇంటి పనుల్లో సహాయపడితే నన్ను పాఠశాలకు పంపిస్తానని కూడా ఆయన చెప్పాడు. అది ఆకర్షణీయమైనదే గాని, పనివానిగా ఉండడమంటే ఉదయం నుండి రాత్రివరకు పనిచేయవలసి ఉంటుందని నాకు తెలుసు. అలాగే, ఇంటిని దోచుకోవడానికి దొంగలతో పనివాళ్ళు చేతులు కలుపుతారేమోననే భయంతో వాళ్ళు బయటివాళ్ళతో సహవసించడానికి తరచూ అనుమతించబడరు. మంచి పరిస్థితుల్లో కూడా, నెలలో ఒక్క ఆదివారం మాత్రమే నాకు సెలవు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన చూపించిన శ్రద్ధకు నేను నిజంగానే కృతజ్ఞతలు చెప్పాను, ఆయన వాగ్దానాన్ని నిరాకరించాను. నేను వాళ్ళింట్లో పనికి చేరితే, నేను రాజ్యమందిరంలో కూటాలకు హాజరు కాలేనని ఆయనకు చెప్పాను.
ఆ వ్యక్తి ఇలా అన్నాడు: “నీకు ఉండడానికి స్థలమే లేనప్పుడు కూటాల గురించి నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు?” నేను కూటాలకు హాజరు కాకుండా ఉండేందుకు సిద్ధపడినట్లయితే నేను నా తండ్రి ఇంటనే ఉండగలిగేవాడ్ని. నా మతం వల్లనే నేను ఇల్లు వదిలి పెట్టవలసి వచ్చింది. ఆయన దగ్గర నుండి నాకు కావలసిందల్లా, నా పెట్టె పెట్టుకోవడానికి కొంత స్థలమేనని నేను జవాబిచ్చాను. దానితో ఆయన నా పెట్టెను భద్రంగా ఉంచుతానని ఒప్పుకున్నాడు.
మరొక కుటుంబాన్ని కనుక్కోవడం
నేను ఆ పెట్రోల్ బంక్ వెలుపల మూడు రాత్రులు పడుకున్నాను. ఆహారం కొనుక్కోడానికి నా దగ్గర డబ్బులేదు. ఆ సమయంలో నిజంగా నా దగ్గర తినడానికి ఏమీ లేదు. నాల్గవరోజు, నేను తిరుగుతుండగా, ఒక యౌవనస్థుడు వీధిలో కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలను ప్రజలకు అందించడం గమనించాను. నేను సంతోషంతో ఆయన దగ్గరకు పరుగెత్తుకెళ్ళి, ఆయనకు గాడ్వన్ ఇడె తెలుసా అని అడిగాను. నేనెందుకు అడిగానో ఆయన తెలుసుకోగోరాడు, కాబట్టి, నాకు జరిగినదంతా ఆయనకు చెప్పాను.
నేను చెప్పడం ముగిసిన తరువాత, ఆయన వెంటనే పత్రికలను సంచిలో పెట్టుకుని ఇలా అడిగాడు: “ఇక్కడ లాగోస్‌లో వేలకొలది సాక్షులుండగా నువ్వెందుకు కష్టపడాలి?” ఆయన ఒక టాక్సీని కేకేసి ఆపి, నా సూట్‌కేస్ తీసుకునేందుకు నన్ను ఆ పెట్రోల్ బంక్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. తరువాత ఆయన నన్ను తన అపార్టుమెంట్‌కు తీసుకువెళ్ళి, నాకు భోజనం ఏర్పాటు చేశాడు. తర్వాత దగ్గరలో ఉన్న ఇడె సహోదరుని కొరకు మనుషులను పంపాడు.
ఇడె సహోదరుడు వచ్చినప్పుడు నేనెవరితో ఉండాలి అనే విషయాన్ని వారు చర్చించుకున్నారు. ఇద్దరికీ నన్నుంచుకోవాలనుంది! చివరికి, ఇద్దరూ నన్ను వంతులవారీగా చూసుకోవడానికి ఒప్పుకున్నారు. అంటే నేను కొంత కాలం ఒకరిదగ్గర, మరి కొంతకాలం ఇంకొకరి దగ్గర ఉంటాను.
త్వరలోనే వార్తావహునిగా నేను ఉద్యోగం సంపాదించాను. నేను మొదటి జీతం పుచ్చుకున్నప్పుడు, ఆ ఇద్దరు సహోదరులతో నేను మాట్లాడి, భోజనానికి, అద్దెకు ఎంత డబ్బు వారికి ఇవ్వాలని అడిగాను. వాళ్ళు నవ్వి, నేను ఏమీ చెల్లించనవసరం లేదని చెప్పారు.
త్వరలోనే నేను సాయంకాల క్లాసులకు మరియు ప్రైవేట్ క్లాసులకు నా పేరు నమోదు చేయించుకున్నాను, తుదకు నేను నా ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాను. నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. నేను సెక్రెటరీగా మరింత మంచి ఉద్యోగాన్ని సంపాదించి, చివరికి నా అంతట నేను సొంతంగా స్థలం సంపాదించుకున్నాను.
నేను 1972లో బాప్తిస్మం పొందాను. అప్పుడు నాకు 17 ఏండ్లు. యెహోవా నాకు చేసిన వాటన్నింటికీ, ముఖ్యంగా క్లిష్టమైన ఆ సమయంలో ఆయన నాకు చేసినవాటన్నిటి ఎడల నా మెప్పుదలను చూపించేందుకు పయినీరు పరిచర్యలో ప్రవేశించాలని కోరుకున్నాను. నాకు వీలైనప్పుడెల్లా నేను తాత్కాలిక పయినీరుగా సేవ చేశాను. చివరికి, 1983లో నేను క్రమ పయినీరుగా చేరాను.
అప్పటికెల్లా నేను నా ఆత్మీయ కుటుంబ విలువను పూర్తిగా గ్రహించాను. “దేవుని రాజ్యము నిమిత్తమై యింటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టినవాడెవడును, ఇహమందు చాలరెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని” యేసు పలికిన మాటలు నా విషయంలో నిజమని రుజువు చేయబడ్డాయి.—లూకా 18:29, 30.
సాక్షులు నిజంగా నా ఎడల ప్రేమను చూపించి నాపై శ్రద్ధ కనబరచారు. నా దగ్గర డబ్బులేని సమయంలో వారు నాకు ఆశ్రయాన్నిచ్చారు. వారి సహాయంతో నా పరలోక తండ్రి సహాయంతో నేను ఆత్మీయంగా అభివృద్ధి సాధించాను. నేను లౌకిక విద్యనభ్యసించడమే గాక యెహోవా మార్గాలను కూడా నేర్చుకున్నాను.
నేను ఎవరినైతే నిరాకరించాలని నా సొంత కుటుంబం నన్ను ఒత్తిడి చేసిందో ఆ ప్రజలు వీరే. నేను తిరస్కరించినప్పుడు నా కుటుంబం నన్ను నిరాకరించింది. మరిప్పుడు నా ఆత్మీయ సహోదర సహోదరీలు నా సొంత కుటుంబాన్ని నిరాకరించమని ప్రోత్సహిస్తున్నారా? లేనే లేదు. “మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి” అని బైబిలు బోధిస్తుంది.—లూకా 6:31.
నన్ను నిరాకరించిన కుటుంబానికి సహాయం చేయుట
నేను ఇల్లు విడిచి పెట్టిన కొంతకాలానికే నైజీరియాలో అంతర్యుద్ధం మొదలైంది. మా గ్రామం నాశనం చేయబడింది. నాకోసం అభ్యర్థించిన పిన్నితో సహా నా స్నేహితుల్లో, బంధువుల్లో అనేక మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఆర్థిక సుస్థిరత లేకుండా పోయింది.
యుద్ధం ముగిసినప్పుడు, నేను ఇంటికి ప్రయాణం గట్టి, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు నన్ను ఇంటినుండి వెళ్ళగొట్టిన మా అన్నల్లో ఒకరి దగ్గరకు వెళ్ళాను. అతని భార్య మరియు కూతుళ్ళు అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో చేర్చబడ్డారు. నాకతనిపై సానుభూతి కలిగి, నేనేమైనా సహాయం చేయగలనా అని ఆయనను అడిగాను.
బహుశ, అపరాధ భావం ఉండడం వల్ల కావచ్చు, తనకు ఏమీ అవసరం లేదని ఆయన చెప్పాడు. కుటుంబం నాకు చేసిన దానికి నేను ప్రతీకారం తీర్చుకుంటానని అయన అనుకోవద్దని నేను వివరంగా చెప్పాను. వారికి తెలియక అలా చేశారని నాకు తెలుసని, నిజంగా వారికి సహాయం చేయాలని నేను ఇష్టపడుతున్నానని ఆయనకు చెప్పాను.
అప్పుడు ఆయన ఏడ్వడం మొదలెట్టి, తన దగ్గర డబ్బులేదని, తన పిల్లలు బాధపడుతున్నారని ఒప్పుకున్నాడు. నేను ఆయనకు 300 (అమెరికా) డాలర్లు ఇచ్చి, లాగోస్‌లో పనిచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడేమో అని ఆయనను అడిగాను. నేను లాగోస్‌కు తిరిగి వెళ్ళినప్పుడు నేను ఆయనకు ఒక ఉద్యోగాన్ని వెదికి పెట్టి, వచ్చి నాతో ఉండమని ఆయనను ఆహ్వానించాను. ఆయన డబ్బు సంపాదించి, ఇంట్లో భార్యకు, పిల్లలకు పంపిస్తూ, నాతోపాటు రెండు సంవత్సరాలు ఉన్నాడు. ఆ సమయంలో ఆయన వసతి కొరకు, ఆహారం కొరకు నేను సంతోషంగా డబ్బు చెల్లించాను.
యెహోవాసాక్షులు నిజమైన మతాన్ని ఆచరిస్తున్నారని తనకు తెలుసని ఆయన చెప్పాడు. తను లౌకిక మనిషి కాకపోయి ఉంటే, తాను కూడా ఒక సాక్షి అయి ఉండేవాడినేనని కూడా ఆయన చెప్పాడు. అయితే తన భార్య, పిల్లలు బైబిలు పఠించడానికి తాను ఏర్పాటు చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు.
నేను 1987లో ప్రాంతీయ పనిని చేపట్టాలని ఆహ్వానించబడ్డాను. నేను ఏప్రిల్ 1991లో సారా యూక్‌పోంగ్‌ను పెళ్ళి చేసుకున్నాను. మేము 1993లో ప్రాంతీయ సేవను వదిలిపెట్టి నైజీరియా బ్రాంచ్‌లో సేవ చేయడానికి ఆహ్వానించబడ్డాము. మేము ఆ ఆహ్వానాన్ని అంగీకరించి, నా భార్య గర్భవతి అయ్యేంత వరకు అక్కడ సేవ చేశాము.
నా కుటుంబం నన్ను బయటికి వెళ్ళగొట్టినా, నన్ను ఆత్మీయ కుటుంబం—తల్లులు, సహోదరులు, సహోదరీలు మరియు పిల్లలు ఆదరించారు. నేను నిజంగా నన్ను ప్రేమించే, నేను నిజంగా ప్రేమించే ఈ సాటిలేని భూవ్యాప్త కుటుంబానికి చెందినవాడనవ్వడం ఎంత సంతోషకరమో!—యూడమ్ యుడో చెప్పినది.
[26వ పేజీలోని చిత్రం]
యూడమ్ మరియు సారా యుడో