కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 7/8 పేజీలు 21-24
  • దేవుని కాపుదల నుండి నేనెలా ప్రయోజనం పొందాను

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని కాపుదల నుండి నేనెలా ప్రయోజనం పొందాను
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • భవిష్యత్తు కొరకైన ఒక నిరీక్షణ
  • అవాంతరాలను అధిగమించడం
  • నర్సింగ్‌ హోమ్‌లకు లోపల, వెలుపల
  • ప్రేమపూర్వకమైన శ్రద్ధను పొందినదానను
  • విషమిస్తున్న పరిస్థితిని ఎదుర్కోవడం
  • వదిలిపెట్టేది లేదు
  • యెహోవా నిశ్చయమైన మద్దతుకు కృతజ్ఞతలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • నన్ను నిజంగా ప్రేమించిన కుటుంబం
    తేజరిల్లు!—1995
  • యెహోవా నాపట్ల కృపగల దేవుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ‘పడద్రోయబడినను నశించినవాడను కాను’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 7/8 పేజీలు 21-24

దేవుని కాపుదల నుండి నేనెలా ప్రయోజనం పొందాను

మే 18, 1963 ఉదయాన, నేను మామూలుకన్నా మరింత సంతోషంతో మేల్కొన్నాను. అది చక్కని, సూర్యరశ్మిగల దినారంభం. అయితే ఆ రోజు నాకు ఎందుకు ప్రత్యేకమైనదో చెప్పే ముందు, నా గురించి కొంత చెప్పుకోనివ్వండి.

అమెరికాలోని, పెన్సిల్‌వేనియానందలి, ఫిలదెల్ఫియాలో మే 20, 1932న నేను జన్మించాను, నేను మా కుటుంబంలోని నలుగురు కూతుళ్ళలో అందరి కంటె చిన్నదాన్ని. నాకు రెండేళ్ళున్నప్పుడు మా అమ్మ చనిపోయింది, నాకు ఐదేండ్లున్నప్పుడు మా నాన్న పునర్వివాహం చేసుకున్నారు. కొంత కాలం తర్వాత, ఆరుగురు తమ్ముళ్ళు చెల్లెళ్ళు పుట్టారు. మేము బాప్టిస్టు సంఘం వాళ్ళం, నేను సన్‌డే స్కూల్‌ ఉపాధ్యాయురాలినవ్వాలని కూడా అనుకున్నాను.

నేను కీళ్ళ వాతంతో పుట్టాను, అందువల్ల నా బాల్యం చాలా కఠినంగా ఉండేది. సంవత్సరాలు గడిచిన కొలది అది ఇంకా విపరీతమౌతుందని, నాకు తొమ్మిదేండ్లున్నప్పుడు వైద్యుడు నాతో చెప్పాడు. విచారకరంగా, ఆయన చెప్పింది నిజమైంది. నాకు 14 ఏండ్లు వచ్చేసరికి, నేనిక ఏ మాత్రం నడవలేక పోయాను. చివరికి, నా చేతులు, పాదాలు, కాళ్ళూ, బలహీనమయ్యాయి, నా తుంటి కీళ్ళు బిగుసుకు పోయాయి. మరీ వ్రాయలేనంతగా, వస్తువులను పైకి తీయలేనంతగా నా వ్రేళ్ళ రూపం మారిపోయింది. నా అనారోగ్యం వల్ల, నేను పబ్లిక్‌ స్కూల్‌కి మళ్ళీ వెళ్ళలేక పోయాను.

నేను 14 ఏండ్ల వయస్సులో ఆసుపత్రిలో చేర్చబడినప్పుడు, నర్సులకు సహాయం చేసేందుకు వారు నన్ను చిన్న పనులు చేయడానికి అనుమతించారు గనుక, నేను చాలా సంతోషించాను. ఈ పని నాకు చాలా నచ్చింది. తర్వాత, నేను ఒంటరిగా కూర్చోలేని పరిస్థితికి చేరుకున్నాను. నా కోసం తాము ఏమీ చేయలేరని వైద్యులు మా తలిదండ్రులతో చెప్పారు, కాబట్టి, ఆసుపత్రిలో మూడు నెలలు గడిపిన తరువాత, నన్ను ఇంటికి పంపించారు.

నాకు 16 ఏండ్లు వచ్చేంతవరకు, తరువాతి రెండు సంవత్సరాలు నేను పక్క మీద పడుకోవడం తప్ప మరేమీ చేయలేదు. ఇంట్లో ట్యూషన్‌ ఇవ్వబడింది, అయితే నా ఆరోగ్యం మరీ పాడైపోయింది. నా కుడికాలి చీలమండపై వ్రణం వచ్చింది, అలాగే కీళ్ళవాతానికి సంబంధించిన జ్వరమూ వచ్చింది, గనుక మళ్ళీ ఆసుపత్రికి పోవలసి వచ్చింది. నాకు 17 ఏండ్లు వచ్చాయి. నేను మరొకసారి మూడునెలలు ఆసుపత్రిలో ఉన్నాను. నేను తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు, నేనిక ఇంట్లో ట్యూషన్‌ చెప్పించుకోలేకపోయాను.

నాకు 20వ ఏడు వస్తుండగా, నా పరిస్థితి మరింత దీనంగా మారింది, నేను ఎక్కువ సేపు ఏడుస్తూ గడిపాను. దేవుడున్నాడని నాకు తెలుసు, సహాయం కోసం నేను ఆయనను చాలాసార్లు ప్రార్థించాను.

భవిష్యత్తు కొరకైన ఒక నిరీక్షణ

నా చీలమండకు చికిత్స చేయించుకోవడానికి, నేను ఫిలదెల్ఫియా జనరల్‌ ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేనూ, మిరియమ్‌ కేలమ్‌ అనే అమ్మాయి ఒకే గదిలో ఉండేవాళ్ళం. మేము స్నేహితులమయ్యాం. మిరియమ్‌ సహోదరియైన కాథరీన్‌ మైల్స్‌ అక్కడికి వచ్చినప్పుడు, కాథరీన్‌ బైబిలులోని సమాచారాన్ని నాకు చెప్పేది. నేను ఆసుపత్రి నుండి బయటకు వచ్చిన తర్వాత, యెహోవాసాక్షియైన కాథరీన్‌తో ఎలాగో సంబంధం పెట్టుకోగల్గాను.

విచారకరమైనదేమంటే, మా సవతి తల్లి నన్ను అంతగా ఇష్టపడేది కాదు. నాకు 25 ఏండ్లున్నప్పుడు మా అక్క ఇంటిలోకి మకాం మార్చాను, కాథరీన్‌ కూడా ఆ చుట్టుప్రక్కల ఉన్న ఒక ఇంట్లోకి మకాం మార్చడం జరిగింది. నేను ఆమెను పిలిచాను, దేవుడు సత్యవంతుడుగా ఉండుగాక అనే ఆంగ్ల పుస్తకాన్ని పఠన సహాయకంగా ఉపయోగించి, ఆమె నాతో బైబిలు పఠించనారంభించింది. నేను ఎన్నటికీ కుంటిదానిగా ఉండనవసరం లేదని, ఒకనాటికి దుష్టత్వమంతా తీసివేయబడుతుందని తెలుసుకున్నప్పుడు ఎంత సంతోషించానో! (సామెతలు 2:21, 22; యెషయా 35:5, 6) పునరుత్థాన నిరీక్షణ మరియు మా అమ్మను మళ్ళీ చూసే నిరీక్షణలతో ఈ సత్యాలు నన్నాకర్షించాయి.—అపొస్తలుల కార్యములు 24:15.

తొందరలోనే నేను యెహోవాసాక్షుల కూటాలకు హాజరుకావడం ఆరంభించాను. కాథరీన్‌ భర్త నన్ను కారులో ఎక్కించుకుని, రాజ్యమందిరంలోనికి తీసుకువెళ్ళేవాడు. నేను కూటాలకు వెళ్ళినప్పుడు, నాకు చూపించబడిన ప్రేమను చూసి ప్రోత్సహించబడ్డాను.

అవాంతరాలను అధిగమించడం

విచారకరంగా, నా అక్కా బావలు విడిపోయారు, అందువల్ల నేను మళ్ళీ మా నాన్నతోను, సవతి తల్లితోను ఉండవలసి వచ్చింది. మా సవతి తల్లి యెహోవాసాక్షులను ఎంతో ఎదిరించేది గనుక, నేను 1958 నుండి 1963 వరకు బైబిలును రహస్యంగా పఠించవలసి వచ్చింది. యెహోవాసాక్షులనెవరినీ ఇంటిలోనికి రావడానికి ఆమె అనుమతించేది కాదు. నేను ఒక్కొక్కరితో టెలిఫోను ద్వారా లేదా ఆసుపత్రిలో ఉన్నప్పుడు పఠించేదాన్ని.

మరొక అభ్యంతరమేమంటే, మా సవతి తల్లి కొన్నిసార్లు నాకు భోజనం పెట్టేది కాదు, నాకు స్నానం చేయించేది కాదు. ఒకసారి ఆమె ఎనిమిది నెలల వరకు నాకు తలస్నానం చేయించలేదు. అలాగే తాను అనుమతించని ఏ ఉత్తరాన్నైనా నన్ను చదవనిచ్చేది గాదు. అయితే, నా సహోదరుడు తన ఇంటి చిరునామాకు నాకు ఉత్తరాలు రావడాన్ని అనుమతించడం ద్వారా యెహోవా కాపుదల స్పష్టమైంది. నేను ఉత్తరాలు వ్రాసే క్రైస్తవ సహోదరియైన పాట్‌ స్మిత్‌ నాతో సంబంధం కొనసాగించడానికి, లేఖనాధారితమైన ప్రోత్సాహాన్ని నాకివ్వడానికి ఈ ఏర్పాటు సాధ్యపరచింది. నా సహోదరుడు ఆమె ఉత్తరాలను తెచ్చియిచ్చేవాడు; నేను వాటికి జవాబు వ్రాసే దానిని, ఆయన వాటిని దొంగచాటుగా పంపించేవాడు.

నేను 1963లో ఆసుపత్రికి మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది, పాట్‌ స్మిత్‌ అక్కడ నాతో పఠనాన్ని కొనసాగించింది. “మన ప్రాంతీయ సమావేశంలో బాప్తిస్మం పొందడానికి నువ్వు ఇష్టపడతున్నావా?” అని ఆమె నన్నొకరోజు అడిగింది.

“ఇష్టపడుతున్నాను!” అని నేను జవాబిచ్చాను.

అప్పుడు నేను శారీరక లోటు ఉన్న వ్యక్తులకు ఊతనిచ్చి యథాస్థితికి తీసుకుని వచ్చే వార్డులో ఉన్నాను, నేను ఒక రోజు బయటికి వెళ్ళేందుకు అనుమతిని పొందగలిగాను. ప్రాంతీయ సమావేశ దినమున నన్ను తీసుకు వెళ్ళడానికి మరి కొందరు సాక్షులతో పాటు పాట్‌ వచ్చింది. నాకు బాప్తిస్మమిచ్చేందుకు సహోదరులు పార్టిషన్‌ మీదుగా నన్ను పైకెత్తి నీళ్ళలోకి ముంచవలసి వచ్చింది. అప్పటినుండి నేను యెహోవా సేవకుల్లో ఒకదానినయ్యాను! అది మే 18, 1963, అది నేను మరవలేని రోజు.

నర్సింగ్‌ హోమ్‌లకు లోపల, వెలుపల

నవంబరులో నేను ఆసుపత్రి వదిలి పెట్టవలసి వచ్చింది. నేను ఇంటికి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే, అక్కడ నేను యెహోవాను ఎక్కువగా సేవించలేనని నాకు తెలుసు. కాబట్టి నేను ఒక నర్సింగ్‌ హోమ్‌కి వెళ్ళే ఏర్పాట్లు చేసుకున్నాను. అక్కడ ఉంటూ, యెహోవాసాక్షులు ఇంటింటి పరిచర్య ద్వారా చేరుకోలేని ప్రజలకు ఉత్తరాలు వ్రాయడం ద్వారా నేను పరిచర్యలో పాల్గొనడం మొదలెట్టాను. నేను మరణవార్తలు ఉండే కాలమ్‌లను చదివి, ఇటీవల చనిపోయినవారి బంధువులకు ఉత్తరాలు వ్రాసి, బైబిలునుండి ఊరట కలిగించే లేఖనాలతో వాటిని ముగించేదాన్ని.

మే 1964లో నేను నా పెద్దక్కా బావలతో ఉండేందుకు న్యూయార్క్‌ నగరానికి వెళ్ళాను. ఆయన నా మొదటి వీల్‌ చెయర్‌ని కొన్నారు, నేను కూటాలకు హాజరు కావడం ఆరంభించాను. న్యూయార్క్‌ నగరంలో ఉండగా, దైవపరిపాలనా పాఠశాలలో నేను నా మొదటి ప్రసంగాన్ని ఇవ్వడం ఎంత ఆనందదాయకంగా ఉండిందో!

ఫిలదెల్ఫియాలోని కొందరు స్నేహితులు 1965 తొలి భాగంలో, తమతో రెండు వారాలు గడపమని నన్ను కోరారు. నేను ఫిలదెల్ఫియాలో నివసిస్తుండగా, నన్ను ఇక తనకొద్దని, నేనింతకు ముందు ఎక్కడున్నానో అక్కడే ఉండవచ్చని నా అక్క నాకు వ్రాసింది, చెప్పింది. నేను తిరిగి నర్సింగ్‌ హోమ్‌కి వెళ్ళే ఏర్పాటు చేసుకున్నాను. నేను అక్కడ ఉన్నప్పుడు, నేను కూటాలకు హాజరు కావడంలోను, ఉత్తరాలను వ్రాయడం ద్వారా ప్రజలకు సాక్ష్యమివ్వడంలోను కొనసాగేదాన్ని. సహాయ పయినీరింగ్‌ అని పిలువబడే దానిలో పాల్గొనడం ద్వారా నా పరిచర్యను విస్తరింపజేసుకోగలిగిన సమయం అదే.

ప్రేమపూర్వకమైన శ్రద్ధను పొందినదానను

ఫిలదెల్ఫియాలోని యెహోవాసాక్షుల పడమటి సంఘం నాకు ఇచ్చిన సహాయం, యెహోవా యొక్క శ్రద్ధకు మరొక సూచన. నన్ను క్రైస్తవ కూటాలకు తీసుకు వెళ్ళడమే కాకుండా, కలము, కాగితము వగైరాలను, నా పరిచర్యకు అవసరమైన ఇతర వస్తువులను వారు నాకు అందజేసేవారు.

నేను, 1970లో క్రైస్తవ సహోదరియును, పదవీ విరమణ పొందిన నర్సుసైనా మాడ్‌ వాషింగ్టన్‌తో ఉండడానికి ఏర్పాట్లు జరిగినప్పుడు, యెహోవా శ్రద్ధ చూపిస్తున్నాడన్నదానికి మరొక రుజువు లభించింది. ఆమెకు అప్పుడు 70వ ఏడు వస్తున్నప్పటికీ, ఆమె ఇంక చెయ్యలేననుకునేంత కాలం వరకు, అంటే మరో రెండు సంవత్సరాలు ఇష్టపూర్వకంగా నన్ను చూసుకుంది.

నేను మాడ్‌తోపాటు ఉండగా, ఫిలదెల్ఫియాలోని రిడ్జ్‌ సంఘం నందలి సహోదరులు నేను కూటాలకు హాజరు కాగలిగేలా అన్ని విధాల శ్రద్ధ వహించేవారు. వారానికి మూడు సార్లు వారు నన్ను మూడంతస్థుల మెట్ల పైకి క్రిందకు మోయవలసి వచ్చేది. నేను కూటాలకు వెళ్ళేందుకు అంత నిష్ఠగా సేవ చేసిన వారియెడల నేనెంతో కృతజ్ఞురాలిని!

సహోదరి వాషింగ్టన్‌ 1972లో నన్నిక చూసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు, నేను స్వంతంగా అపార్ట్‌మెంట్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. రిడ్జ్‌ సంఘంలోని క్రైస్తవ సహోదరీల స్వయం త్యాగ పూరితమైన సహాయము మరియు ప్రేమ లేకపోతే ఈ నిర్ణయం సాధ్యమయ్యేది కాదు. నాకు భోజనం పెట్టడానికి, స్నానం చేయించడానికి, నా వ్యక్తి గత అవసరాలను తీర్చడానికి వారు ఏర్పాట్లు చేశారు. మరితరులు షాపింగ్‌ చేయడం ద్వారా మరియు అవసరమైన పనులు చేసిపెట్టడం ద్వారా నాకు సహాయం చేశారు.

ప్రతి ఉదయం నాకు తినిపించడానికి, నాకు దుస్తులు ధరింపజేయడానికి ఆ సహోదరీలు త్వరగా వచ్చేవారు. నేను నా వీల్‌ చెయర్‌లో కూర్చోవడానికి నాకు సహాయపడిన తర్వాత, వారు నన్ను అపార్ట్‌మెంట్‌లో కిటికీ దగ్గరలో మూలకున్న నా డెస్క్‌ దగ్గరికి నన్ను చేర్చేవారు. నేను అక్కడ కూర్చుని, టెలిఫోను ఉపయోగించడం ద్వారా మరియు ఉత్తరాలు వ్రాయడం ద్వారా పరిచర్యలో నిమగ్నమయ్యేదాన్ని. నేను అపార్ట్‌మెంట్‌లోని ఈ భాగాన్ని పారడైస్‌ కార్నర్‌ అని అంటాను, ఎందుకంటే నేను దైవపరిపాలనా సంబంధమైన చిత్రాలతో దాన్ని అలంకరించాను. రాత్రి ఎవరైన వచ్చి నన్ను పడక మీద పడుకోబెట్టేంతవరకు నేను పగలంతా నా పరిచర్యలో గడుపుతాను.

నేను 1974లో ఆరోగ్యం బాగోలేనందువల్ల ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చింది. నేను అక్కడున్నప్పుడు రక్తం ఎక్కించుకోమని నన్ను బలవంత పెట్టడానికి వైద్యులు ప్రయత్నించారు. ఒక వారం తరువాత, నా ఆరోగ్యం మెరుగుపడ్డ తర్వాత, డాక్టర్లలో ఇద్దరు నన్ను చూడడానికి వచ్చారు. “ఓ మీరిద్దరూ నాకు గుర్తున్నారు, మీరు రక్తం ఎక్కించడానికి నన్ను ఒప్పించాలని ప్రయత్నించారు,” అని నేను వాళ్ళతో అన్నాను.

“అవును, దాని వలన లాభమేమీ ఉండదని మాకు తెలుసు,” అని వారు జవాబు చెప్పారు. పునరుత్థానము మరియు పరదైసు భూమిని గూర్చిన బైబిలు వాగ్దానాన్ని గూర్చి వైద్యులకు సాక్ష్యమిచ్చేందుకు నాకు అవకాశం దొరికింది.—కీర్తనలు 37:29; యోహాను 5:28, 29.

నేను ఒంటరిగా ఉన్న మొదటి 10 సంవత్సరాల్లో క్రైస్తవ కూటాలకు హాజరవ్వగలిగాను. నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు తప్ప, మరెన్నడూ వెళ్ళకుండా ఉండలేదు. వాతావరణం బాగా లేకపోతే, ఆ స్నేహితులు నా కాళ్ళను తడవకుండా ఉండేందుకు కంబళితో కప్పేవారు. అప్పుడప్పుడు ప్రయాణ కాపరి నన్ను చూడడానికి వచ్చేవారు. నేను టెలిఫోను ద్వారా నడిపే బైబిలు అధ్యయనాలకు ఆయన సందర్శించే సమయాల్లో తాను నాతో పాటు “వచ్చేవారు.” ఆ సమయాల్లో నాకు ఎంతో సంతోషంగా ఉండేది.

విషమిస్తున్న పరిస్థితిని ఎదుర్కోవడం

నేను 1982లో, ఇక ఏ మాత్రం పడక మీద నుండి లేవలేని స్థితికి చేరుకున్నాను. నేను కూటాలకు హాజరు కాలేకపోయాను, నేను 17 సంవత్సరాలుగా ఎడతెగక చేస్తున్న పయినీరింగ్‌ చేయలేకపోయాను. ఈ పరిస్థితులు నాకు మరింత దుఃఖం కలిగించాయి, నేను తరచూ ఏడ్చేదాన్ని. అయినప్పటికీ, యెహోవా శ్రద్ధ స్పష్టంగా కనబడింది—సంఘ పుస్తక పఠనము ఒకటి నా అపార్టమెంట్‌లో ఉండేలా క్రైస్తవ పెద్దలు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటును బట్టి ఇప్పటికీ నేనెంత కృతజ్ఞురాలినో!

నేను రోజంతా పడక మీదే పడుకుండిపోయి, డెస్క్‌ దగ్గరికి వెళ్ళలేక పోయేదాన్ని, గనుక నేను బోర్లా పడుకుని ఒక చిన్న కాగితం మీద వ్రాసే అలవాటు చేసుకోవడం మొదలెట్టాను. మొదట్లో నా వ్రాత చదవడం వీలయ్యేది కాదు, చాలా సార్లు అభ్యసించడంతో చదవడం వీలయ్యేలా వ్రాయగలిగాను. కొంత కాలం తర్వాత నేను మళ్ళీ ఉత్తరాలు వ్రాయడం ద్వారా సాక్ష్యమివ్వగలిగాను, అది నాకు కొంత మేరకు సంతోషాన్నిచ్చింది. విచారకరమైనదేమంటే, నా పరిస్థితి ఇంకా ఘోరంగా మారింది, నేను ఈ రకమైన పరిచర్యలో ఇక ఏ మాత్రం పాల్గొనలేను.

నేను 1982 నుండి జిల్లా సమావేశానికి హాజరయ్యేందుకు శారీరకంగా శక్తి లేకపోయినప్పటికీ, నేను సమావేశం జరిగే సమయంలో ఆ ఉత్సాహాన్ని పొందేందుకు ప్రయత్నించేదాన్ని. ఒక క్రైస్తవ సహోదరి ఒక లేపల్‌ కార్డును తీసుకు వచ్చి, నా గౌనుకు గుచ్చిపెట్టేది. నేను దూరదర్శినిని పెట్టుకుని ఫిలదెల్ఫియలోని వెటిరాన్స్‌ స్టేడియమ్‌లోని బేస్‌బాల్‌ గేమ్‌ చూస్తూ, సమావేశం జరిగేటప్పుడు సేను స్టేడియమ్‌లో ఎక్కడ కూర్చునేదాన్నో తలంచుకునేదానిని. నేను సమావేశ కార్యక్రమాన్నంతటినీ వినేందుకు, సాధారణంగా ఎవరన్నా ఒకరు దానిని రికార్డు చేస్తారు.

వదిలిపెట్టేది లేదు

నేను పరిచర్యలో క్రితం చేసినంత ఇప్పుడు చేయలేకపోయినప్పటికీ, నేను ఇప్పటికీ ప్రజలతో బైబిలు సత్యాలను గూర్చి మాట్లాడడానికి అప్రమత్తంగా ఉంటాను. పయినీరింగ్‌ చేయగలగడం, ఆసక్తిగల అనేకులు బైబిలు పఠించడానికి వారికి సహాయపడడం నా సంతోషానికి మూలంగా ఉండేవి. గత 22 సంవత్సరాలు ఒంటరిగా జీవించడం సులభం కానప్పటికీ, నేనింట్లో ఉండి ఉంటే చేయలేని పనిని చేయగలిగాను, అంటే ఆటంకాలు లేకుండా యెహోవాను సేవించే స్వేచ్ఛను ఆనందంగా అనుభవించగలిగాను.

నేను నా స్వంత వ్యక్తిత్వాన్ని సరిదిద్దుకోవడానికి మనఃపూర్వకంగా కృషిచేయవలసిన అవసరం నాకు కనిపించింది. నాకు సహాయం చేయడానికి స్వచ్ఛందంగా వచ్చేవారికి నిర్దేశాలిచ్చేటప్పుడు, కొన్నిసార్లు నా మాటలు అంత రుచికరంగా ఉండేవి కావు. (కొలొస్సయులు 4:6) ఈ విషయంలో నేను మెరుగుపడడానికి నాకు సహాయం చేయమని యెహోవాను నేను ఎడతెగక ప్రార్థించాను. సంవత్సరాలుగా ప్రేమపూర్వకంగా నన్ను సహించి, నా ఎడల చూపిన ఓరిమికి, క్షమా గుణానికి నిజంగా వారికి నేనెంతో కృతజ్ఞురాలిని. వారి ప్రేమపూర్వకమైన సహాయం నాకు ఆశీర్వాదము, దానిని బట్టి వారికి, యెహోవాకు నా కృతజ్ఞతలు.

సంవత్సరాలుగా నేను శారీరకంగా కూటాలకు హాజరు కావడానికి సాధ్యం కాకపోయినప్పటికీ—ఒక్కసారి ఆసుపత్రికి వెళ్ళింది మినహాయిస్తే, ఆ కాలమంతా నేను అపార్ట్‌మెంటు వెలుపలికి వెళ్ళనప్పటికీ, నేను ఆనందంగా, సంతోషంగా ఉన్నాను. కొన్నిసార్లు నిరాశచెందుతానన్న విషయాన్ని ఒప్పుకుంటాను, అయితే దాని నుండి బయటపడడానికి యెహోవా నాకు సహాయం చేస్తున్నాడు. నేనిప్పుడు రాజ్య మందిరంతో అనుసంధానం చేసిన టెలిఫోన్‌ ద్వారా కూటాల్లోని కార్యక్రమాలను విని ఆనందిస్తున్నాను. ప్రార్థన ద్వారా, యెహోవాయందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనను ఆశ్రయిస్తున్నందువల్ల నేనెన్నడూ ఒంటరిగా భావించలేదు. అవును, నేను యెహోవా కాపుదల నుండి ప్రయోజనం పొందానని నిజంగా చెప్పగలను.—సెలెస్టే జానెస్‌ చెప్పినది.

[23వ పేజీలోని చిత్రం]

నేను పరిచర్యలో నిమగ్నమయ్యే ఈ స్థలానికి పారడైస్‌ కార్నర్‌ అని నేను పేరుపెట్టాను

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి