యెహోవా నిశ్చయమైన మద్దతుకు కృతజ్ఞతలు
షారన్ గాస్కిన్స్ చెప్పినది
భూమిపై పరదైసు! పచ్చికబయలు మీద గంతులేస్తూ సీతాకోకచిలుకల్ని పట్టుకోవడానికి పరుగెత్తుతూ, సింహపు పిల్లలతో ఆట్లాడుతూ గెంతడాన్ని నాకైనేనే ఊహించుకున్నాను. ఎంత చక్కని అనుభవం! అయితే నాకు సందేహాలుండేవి. నా నిరీక్షణ ఎంత తరచుగా నిస్పృహగా మారేదో!
నాకు జ్ఞాపకమున్నంత వరకు, వీల్ఛైరే నాకు తోడుగావుంది. జన్మఃతా నాకొచ్చిన మెదడు పక్షవాతం, చిన్ననాటి ఆనందాల్ని నాకు లేకుండా చేసింది. వేరే పిల్లలందరు కర్రలతో జారుతూ ఆడుకుంటూ, సైకిళ్లు తొక్కుతుంటే, కనీసం నడవలేకుండా నేను ఒంటరిగా కూర్చునేదాన్ని. ఒకరితర్వాత మరొకరి దగ్గరకు స్వస్థతా ప్రార్థనలుచేసే వారి దగ్గరకు మా అమ్మ నన్ను తీసుకెళ్లినప్పుడు, ఏదైనా అద్భుతం జరుగుతుందని ఆశపడేవాళ్లం. అలా ఎన్నోసార్లు ఏమీ జరక్కుండానే తిరిగివచ్చేవాళ్లం. నాకెంతో నిరాశగా ఉండేది, అయితే అది ఆమెకెంత హృదయవేదనగా ఉండేదో!
నిజమైన నిరీక్షణ కొరకు నిరీక్షిస్తూ మా అమ్మ 1964 తొలిభాగంలో యెహోవాసాక్షులతో బైబిలు పఠించడం ఆరంభించింది. నాకప్పుడు ఆరున్నర సంవత్సరాలు.
ఒకప్పుడు ఈ భూమ్మీదే పరదైసు ఉండెనని నేర్చుకోవడం ఎంతో అద్భుతంగా ఉండెను. మొదటి మానవుడైన ఆదాము దాన్ని పోగొట్టుకోవడం విచారకరం, అయితే అతను ఒకప్పుడు దేవునితో కలిగియున్న సన్నిహిత సంబంధం నాకెంతో నచ్చింది. దేవునితో సంబంధం కలిగియుండడం ఎలావుండేదో? లేదా ఆయన స్వంత కుమారుడు భూమ్మీద జీవించినకాలంలో జీవించడం ఎలావుండేదో? భవిష్యత్తునందలి పరదైసును గూర్చి కూడా నేను పగటికలలు కనేదాన్ని. ఆ చిన్న వయస్సులోనే మేము సత్యం కనుగొన్నామనే విషయం నాకు స్పష్టంగా తెలిసింది.
పరదైసు ముంగుర్తులు
మా అమ్మ కుటుంబాన్ని యెహోవాసాక్షుల రాజ్యమందిరానికి తీసుకెళ్లడం ఆరంభించింది. చర్చీల్లో మేం చూసిన దాన్నుండి వారి కూటాలు ఎంతో భిన్నంగా ఉండెను. ఆ ప్రజలు, ఆ వాతావరణం నన్నెంతో ఆకట్టుకున్నాయి.
మమ్మల్నందరిని రాజ్యమందిరానికి తీసుకెళ్లడం మా అమ్మకు కష్టంగా ఉండేది. నేను కాక, నాకంటే చిన్నవారు ముగ్గురుండిరి, పైగా మాకు కారులేదు. వీలైనప్పుడల్లా తను టాక్సి మాట్లాడేది. ఒక ఆదివారం ఆమె పడ్డ కష్టం నాకింకా గుర్తుంది. దగ్గర్లో ఎక్కడా టాక్సి కనబడలేదు. అంతలో అకస్మాత్తుగా ఎక్కడనుండో ఊడిపడ్డట్టు ఒకాయన లారీలోవచ్చి మమ్మల్ని ఎక్కించుకొని వెళ్లాడు. మేము కూటాలకు ఆలస్యంగా వచ్చాము కాని, మేమక్కడికి చేరుకున్నాము. యెహోవాకు మేమెంతగా కృతజ్ఞతలు చెల్లించామో!
త్వరలోనే తమకు కార్లున్న మన ప్రియ సహోదర, సహోదరీలు తలా ఒకసారి మమ్మల్ని ప్రేమతో తీసుకెళ్లి తీసుకొచ్చేవారు. నిజంగా రోగగ్రస్తులమైతే తప్ప ఎన్నడూ కూటములకు తప్పిపోకూడదని మా అమ్మ ఇచ్చిన ప్రోత్సాహం నా చిన్నారి మనస్సుపై ‘సమాజముగా కూడుకొనే’ ప్రాముఖ్యతను ముద్రించింది. (హెబ్రీయులు 10:24, 25) తాను నేర్చుకున్న విషయాలకు స్పందించి మా అమ్మ తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకొని 1965లో బాప్తిస్మం పొందింది.
అప్పటికే కూటాలను ఇంకా ఎక్కువగా గుణగ్రహించే వయస్సు నాకొచ్చింది. న్యూయార్క్, బ్రూక్లిన్‌లోని సైప్రస్ హిల్స్ సంఘంలో యురోపియన్లు, నల్లవారు, స్పానీష్ జాతీయులు ఇంకా ఇతరులు ప్రక్కప్రక్కనే కూర్చుని ఆరాధించేవారు. దైవ భయంగల ప్రజలు అటువంటి నిజమైన సహోదరత్వంతో జీవించడం ఎంతో యుక్తమన్నట్లు నాకన్పించింది.—కీర్తన 133:1.
కూటములకు ఎలా సిద్ధపడాలో మా అమ్మ నాకు నేర్పింది. ఇది మానసిక సమస్యే కాదు, శారీరక సమస్య కూడ. మెదడు పక్షవాతం చిన్న పనుల్ని సహితం ఎంతో కష్టభరితమైన పెద్ద పనులుగా మార్చివేస్తుంది. మన బైబిలు సాహిత్యాలల్లో జవాబులు గుర్తుపెట్టడానికి సరళంగా గీతగీయడం నాకింకా సాధ్యం కాలేదు. అయితే, అభ్యాసం ద్వారా అక్షరాల క్రింద గీతగీయడం మెరుగయ్యింది.
నా మనస్సు చెప్పాలనే ఉప్పొంగుతోంది. అయితే మాటలు నోరుపెగిలి బయట పడేసరికి కలగాపులగంగా తయారయ్యాయి. నా కండరాలు బిగుసుకుపోకుండా ప్రశాంతంగా ఉండడం ప్రాముఖ్యం. అంతేకాకుండా, ప్రతిపదాన్ని సాధ్యమైనంత స్పష్టంగా పలకడంపై నేను దృష్టినిల్పాలి. చెప్పిన వ్యాఖ్యానం నేననుకున్న విధంగా రాలేదని లేదా నా మాటల్ని ఇతరులు అర్థం చేసుకోలేదని తెలిసినప్పుడు నాలో ఎంతో నిర్లిప్తత చోటుచేసుకునేది. నా మాటలకు ఒక్కసారి అలవాటుపడ్డ తరువాత సంఘమందలి సహోదర సహోదరీలు నా మాటలు మరిచక్కగా అర్థం చేసుకోగల్గారు. అయితే, ఈ సమస్యతో మంచి మరియు కష్టమైన దినాలింకా ఉన్నాయి.
కలవరపరచిన ఆరునెలలు
నాకు ఎనిమిది సంవత్సరాల వయస్సప్పుడు, నేటివరకు నాపై ప్రభావం చూపిన ఆరునెలల అనుభవం నాకు కలిగింది. శరీర వ్యాయామం, చిన్నచిన్న పనులు చేయించి, పలకడానికి సంబంధించిన చికిత్సలన్నీ చేసిన తర్వాత, డాక్టర్లు నన్ను న్యూయార్క్, వెస్ట్ హావెస్ట్రా పునరావాస వైద్యశాలకు పంపించారు. నాకు మా అమ్మకు చాలా బాధేసింది. అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం నాకు మానసిక రుగ్మత ఉందని డాక్టర్లు తప్పుగా చెప్పినప్పుడు, నన్ను పిచ్చాసుపత్రిలో పెట్టి తానసలు ఉండలేదని మా అమ్మ వారితో చెప్పింది. కాబట్టి, తాత్కాలిక ఎడబాటు కూడ ఆమెకు చాలాకష్టమే. అయితే నేను స్వతంత్రంగా జీవిస్తూ, మా అమ్మానాన్నలపై ఆధారపడకుండా సాధ్యమైనంతమట్టుకు భౌతికంగా నా అంతట నేనే పనులు చేసుకొనెలా ఆమె చేసింది.
అక్కడ వసతులు బాగానే ఉన్నాయి కాని, నన్ను ఒంటరిదాన్ని చేశారని బాధపడ్డాను. కూర్చుని ఏడ్వడం, కోపంతో అరవడం ఆ స్థలాన్నిగూర్చిన నా భావాల్ని స్పష్టంచేశాయి. ముఖ్యంగా మా అమ్మ ఐదవ శిశువుతో గర్భిణిగా ఉన్నందున, మూడుగంటల బస్సు ప్రయాణంచేసి వారు నన్ను అరుదుగా సందర్శించ గల్గేవారు. వారు వెళ్లిపోయే సమయం నన్నెంతగా కృంగజేసేదంటే, అలా రావడం తగ్గించాలని డాక్టరు వారికి చెప్పాడు. కేవలం రెండుసార్లు మాత్రమే ఇంటికి వెళ్లడానికి నన్ను అనుమతించారు.
ఒంటిరిగా ఉన్ననూ ఈ అనుభవం నాకు సహాయపడింది. వైద్యులు సీసం బరువుపెట్టిన చంకలక్రింది కర్రలు, చేతికర్రల సహాయంతో ఎలా నడవాలో నాకు నేర్పించారు. అవి చాలా బరువుగా ఉన్నట్లు అన్పించేవి. అయితే ఆ బరువు బ్యాలన్సు కలిగి నేను పడిపోకుండా ఉండేటట్లు చేసేవి. చేతికర్రలు లేకుండా ఒక్కదాన్నే నడిచే ప్రయత్నంలో ఇది మొదటి మెట్టు.
భోజనం చేయడం, దుస్తుల గుండీలు పెట్టుకోవడం వంటి వ్రేళ్లతోచేసే ఏ పనైనా అసాధ్యం కాకపోయినా కష్టంగా ఉండేది. అయితే ఏదోవిధంగా నాకైనేను భోజనం చేయడం బట్టలు వేసుకోవడం నేర్చుకున్నాను. నాకిది ఆ తర్వాత దేవుని సేవలో సహాయపడింది.
నా శిక్షణ పూర్తయి, నేను మరలా మా యింటికి వెళ్లాను. మా అమ్మ నా క్రొత్త నైపుణ్యాల నుపయోగించి పనిచేయడానికి కొంత పని కల్పించింది. నాకైనేను పనిచేయాలని ఉన్నా అలాచేయడం భావోద్రేకంగా ఒక పోరాటంలా ఉండేది. వాటిని నెరవేర్చడం విసుగ్గా, ఎక్కువ సమయం తీసుకుంటూ నేను అలసిపోయేలా చేసేది. అంతెందుకు, నేను మీటింగ్‌కు తయారవడం రెండు గంటలు తీసుకునేది.
రాజ్యమందిరానికి తిన్నగావుండే వీధిలోనికి మేము మారినప్పుడు, నేనొక్కదాన్నే స్వంతగా నడిచివెళ్లాను. అది నాకో పెద్ద విజయం!
నా జీవితంలో అత్యంత సంతోషకరమైన దినం
కుటుంబం ఆత్మీయాహారాన్ని సమతూకంగా తీసుకునేటట్లు మా అమ్మ చూసుకునేది. ఆమె నాతో పఠనంచేసి ది వాచ్‌టవర్, అవేక్! పత్రికల ప్రతి సంచికను నేను చదవాలని ఆమె కోరేది. సిద్ధపడి హాజరుకావాల్సిన కూటములుండేవి. ఈ జ్ఞానాన్ని నామనస్సు, హృదయం ఆతురతతో గ్రహించిననూ, యెహోవాకు సమర్పించుకుని, నీటి బాప్తిస్మం పొందాలనే గంభీరమైన తలంపులకు నేనంత ప్రాముఖ్యతనివ్వలేదు. అంగవైకల్యత ఉన్నప్పటికిని, ఆత్మీయ విషయంలో వ్యక్తిగతంగా నేను దేవునికి జవాబుదారుననే విషయాన్ని గ్రహించేందుకు మా అమ్మ నాకు సహాయపడింది. మా అమ్మచేసే మంచిపనుల్నిబట్టి, ఆమె కొంగు పట్టుకుని నూతన విధానంలో ప్రవేశించడాన్ని నేనాశించలేనని తెల్పింది.
దేవుడంటే నాకు ప్రేమే, అయితే నా పరిస్థితి చాలాభిన్నం, ఇది ఒక యౌవనవ్యక్తికి చాలాబాధాకరమైన విషయం. నా పరిమితుల్ని అంగీకరించడం కష్టంగా ఉండేది. కోపం వచ్చేది, దీన్ని నేను బాప్తిస్మానికి ముందే అదుపుచేసుకోవాలి. (గలతీయులు 5:19, 20) యెహోవాకు నేను చేసుకున్న సమర్పణకు తగిన రీతిలో జీవించలేనట్లయితే ఎలా?
మా అమ్మచేసిన విన్నపం ప్రకారం, ఒక సంఘపెద్ద నాతో మాట్లాడారు. ఆయన “యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు” అని ప్రవక్తయైన ఏలీయా ఇశ్రాయేలీయులను ప్రశ్నించిన విషయాన్ని చూపించాడు. (1 రాజులు 18:21) స్పష్టంగా, నా అనిర్ణయ స్థితి యెహోవాకు ప్రీతికరంగా లేకుండెను.
నేను ఆత్మీయంగా మేల్కొని యెహోవా సహాయం కొరకు, నా జీవితాన్ని ఆయనకు సమర్పించుకునే ధృడ తీర్మానంకొరకు మనఃపూర్వకంగా ప్రార్థించాను. సంఘమందలి ఒక సహోదరి నాతో పఠనంచేసింది. ఆమె వయస్సులో నాకంటే చిన్నది, చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుంది. అయినప్పటికిని, ఆమె యింకా చిన్నగావున్నప్పుడే దేవునికి సమర్పించుకుని, ఒక చక్కని క్రైస్తవ మాదిరినుంచింది.
నాకు 17 సంవత్సరాలప్పుడు, నా మనస్సు కుదుటపడగా నా సామర్థ్యంమేరకు యెహోవాను సేవించాలని కోరుకున్నాను. నేను 1974, ఆగష్టు 9న బాప్తిస్మం తీసుకున్నాను, అది నా జీవితంలో అత్యంత సంతోషకరమైన దినం.
పరిచర్యలో ఆనందం
పరిచర్యయందు భాగం వహించడం, నాకు కొన్ని పెద్ద అడ్డంకుల నుంచింది. అర్థవంతంగా చెప్పడమే నాకొక పెద్ద సవాలుగా ఉండేది. సాధ్యమైనంత స్పష్టంగా మాట్లాడేదాన్ని. ఆ తర్వాత, కావల్సివచ్చినప్పుడల్లా, ప్రాంతీయ సేవలో నాతో పనిచేసే వారు నా మాటల్ని గృహస్థులకు తిరిగి చెప్పేవారు. సాక్షులు మోసగించిన నిస్సహాయ జీవిగా నన్నుచూస్తూ కొందరు ప్రతికూలంగా ఉండేవారు. అయితే ప్రకటించడం నా హక్కు, నా హృదయపూర్వక కోరిక.
ఒక బ్లాకులోని ప్రతి యింటికి నడిచివెళ్లడం నేను పూర్తిగా అలిసిపోయేటట్లు చేసేది. మా సాక్ష్యపు ప్రాంతంలోని అనేక ఇళ్లకు మెట్లుంటాయి, వాటిని చేరుకోవడం నాకు చాలాకష్టం. శీతాకాలంలో, మంచుతో నిండివుండే వీధులు నా యింటింటి సేవను దాదాపు అసాధ్యం చేస్తాయి. (అపొస్తలుల కార్యములు 20:20) ఏమైననూ, ఆత్మీయ సహోదరులు ఎంతో సహాయం చేశారు, కాగా యెహోవా నాకు మోటారు బిగించిన వీల్ఛైర్నిచ్చి ఆశీర్వదించాడు. దీనితో నేనిప్పుడు పరిచర్యను మరింత సులభంగా చేయగల్గుతున్నాను.
కొంతకాలానికి, నేను పోస్టుద్వారా సాక్ష్యమివ్వడాన్ని ఆరంభించాను. నేను చేత్తో ఉత్తరాలు వ్రాయను ఎందుకంటే నా చేతివ్రాత చాలామందికి అర్థమయ్యేటట్లు ఉండదు. కాబట్టి ఎలక్ట్రికల్ టైపు మిషనే నాకు లేఖికుడు. నా చేతులెక్కువగా సహకరించవు గనుక నేను చాలా నెమ్మదిగా టైపు చేస్తాను. ఒక కీ నొక్కబోయి మరో కీ నొక్కడంవలన సగం సమయం అయిపోతుంది. కాబట్టి ఒక్కపేజీ టైపు చేయడానికి నాకు ఒక గంట అంతకంటే ఎక్కువే సమయం పడుతుంది.
శరీరంలో శక్తి అంతగా లేకపోయిననూ, అప్పుడప్పుడు నెలలో 60 లేదా అంతకంటే ఎక్కువ గంటలు గడుపుతూ సహాయ పయినీర్ సేవ చేస్తున్నాను. దీనికి మంచి సమయ పట్టిక, అదనపు కృషి, తోటి విశ్వాసుల మద్దతు అవసరం. వారి పయినీరు స్ఫూర్తి నన్ను ప్రోత్సహిస్తున్నది. కష్టాల్ని, ఆరోగ్య సమస్యలు, మత పరంగా విభాగింపబడిన కుటుంబంలో ఏడుగురు పిల్లల్ని పెంచే సవాలును ఎదుర్కొంటూనే మా అమ్మకూడ క్రమ పయినీర్‌గా లేదా సహాయ పయినీర్‌గా సేవచేస్తూ ఒక చక్కని మాదిరి ఉంచింది.
నేను వేరుగా జీవించడం
నాకు 24 సంవత్సరాలప్పుడు, నా అంతట నేనే వేరుగా జీవించాలని తీర్మానించుకున్నాను. నేను బ్రూక్లిన్‌లో బెన్సన్హర్ట్ ప్రాంతానికి వెళ్లడం ఒక ఆశీర్వాదంగా పరిణమించింది. అక్కడి మార్ల్బొరొ సంఘం సన్నిహితంగా ఒకే కుటుంబముగా ఉన్నది. వారితో ఉండడం విశ్వాస సంబంధంగా ఎంత బలపర్చింది! సంఘంలో వారికి కేవలం రెండు మూడు కార్లే ఉన్ననూ, ఆత్మీయ సహోదరులు నన్ను అన్ని కూటాలకు తీసుకెళ్లేవారు. అయిననూ, నేనక్కడ ఎక్కువ కాలం ఉండలేదు.
పూర్తిగా విఫలమయ్యాననే భావంతో, మరలా మా యింటికి తిరిగివచ్చి, మూడు సంవత్సరాలపాటు మానసిక కృంగుదల ననుభవించాను. నాలో విపరీతమైన కోపం తిరిగి పేట్రేగిపోయింది. ఆ తర్వాత ఆత్మహత్యా భావాలు చోటుచేసుకుని అనేకమార్లు అలాచేయడానికి ప్రయత్నించాను. మరణం కారుమేఘంవలె నన్ను చుట్టుకుంది. అయితే నేను దేవునిపై ఆధారపడి, ఆయనిచ్చిన జీవమనే బహుమానం యెడల మెప్పును చూపుతానని వాగ్దానం చేశాను. సంఘ పెద్దల నుండి ప్రేమపూర్వకమైన ఓదార్పు, సలహా నాకు లభించాయి. దీనితోపాటు ప్రార్థన, వ్యక్తిగత పఠనం, నాకుటుంబ సభ్యుల సహనం, కొంత వృత్తిపరమైన నిపుణుల సహాయం నా ఆలోచనా విధానాన్ని సరిచేశాయి.
ది వాచ్‌టవర్ ద్వారా, యెహోవా ఆప్యాయంగా తీవ్ర మానసిక కృంగుదల విషయమై మంచి పరిజ్ఞానాన్ని సమకూర్చాడు. అవును, ఆయన తన ప్రజలయెడల శ్రద్ధచూపుతూ, వారి తలంపులను అర్థం చేసుకుంటాడు. (1 పేతురు 5:6, 7) కొంతకాలానికి ఆ తీవ్ర మానసిక కృంగుదల తగ్గింది. పది సంవత్సరాల తర్వాత, ఈ విసుగును, మానసిక కృంగుదలను ఎదుర్కోవడానికి యెహోవా యింకనూ సహాయం చేస్తున్నాడు. కొన్నిసార్లు నేనెందుకూ పనికిరాననే భావాలు నన్ను పూర్తిగా ఆవహిస్తాయి. అయినప్పటికిని, ప్రార్థన, బైబిలు పఠనము, నా ఆత్మీయ కుటుంబమిచ్చే సహాయం నేనా ప్రభావం నుండి తప్పించుకోవడానికి నాకందుబాటులోగల అద్భుతమైన సాధనాలై యున్నాయి.
మరో అపార్టుమెంటు కొరకు వెదకి వేసారిన తర్వాత, అయిష్టంగానే నేను నా మిగతా జీవితాన్ని నా కుటుంబంతోనే గడపాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు యెహోవా నా ప్రార్థనలకు జవాబిచ్చాడు. బ్రూక్లిన్‌లో బెడ్ఫోర్డ్ స్టీవిసెంట్ ప్రాంతంలో స్థలం దొరికింది. నేను 1984 వేసవికాలం చివర్లో అక్కడికి వెళ్లి, అప్పటినుండి అక్కడేవున్నాను.
ఎంతో ప్రేమగల లాఫయట్ సంఘ సభ్యులు దయతో నన్ను కూటములకు తీసుకెళ్లారు. అక్కడ మొదటిసారి నేను హాజరైన సంఘపుస్తక పఠనం నాకింకా బాగా గుర్తుంది. అది నాలుగో అంతస్తులో జరిగింది, దానికి లిఫ్ట్లేదు. కేవలం యెహోవా సహాయంతోనే నేనా మెట్లెక్కి దిగగల్గాను. యుక్తకాలంలో నేను మరి సులభంగా వెళ్లగల స్థలం ఇవ్వబడింది. ఇప్పుడు ఒక పుస్తక పఠనం నా గృహమందు జరిపించు ఆధిక్యతనిచ్చి యెహోవా నన్ను ఆశీర్వదించాడు.
ఈ సంఘంలో అద్భుతమైన పయినీర్ స్ఫూర్తి నెలకొనియుంది. నేను వచ్చినప్పుడు 30 మంది పయినీర్లు ఉండేవారు, వారిలో కొందరు నాయెడల ప్రత్యేక శ్రద్ధచూపే బాధ్యత తీసుకున్నారు. ఆసక్తిపూర్వక వాతావరణం తరచు నేను సహాయ పయినీర్ సేవచేయడానికి నన్ను ప్రేరేపించింది.
లాఫయట్ సంఘం ప్రాట్ సంఘం కలిసి 1989 ఏప్రిల్‌లో నేనున్న అపార్ట్మెంటు వీధిలోనే రాజ్యమందిరం నిర్మించారు. అది సరిగ్గా అవసరమైన సమయంలోనే నిర్మించడం జరిగింది. ఎందుకంటే నా శరీరం మరింత బలహీనపడి నడవడం మరలా ఒక సమస్యగా మారింది. మోటరు బిగించిన నా వాహనంతో నా ఆత్మీయ సహోదర సహోదరీలు నా ప్రక్కనేవుండి నన్ను కూటములకు తీసుకెళ్లి తీసుకురావడం నాకెంతో ఆనందంగా ఉంది. అటువంటి ప్రేమపూర్వకమైన సహాయాన్ని నేను మిక్కిలి అభినందిస్తాను.
దేవుని మద్దతుకు కృతజ్ఞతలు
నా కాళ్లు అస్థిరంగా ఉన్ననూ, నా గుండె మాత్రం స్థిరంగా ఉంది. మంచి విద్య జీవితాన్ని కాస్త సులభతరం చేసిననూ, దేవుడే నన్ను కాపాడాడు. కొన్నిసమయాల్లో నాకు భోజనం ఎక్కడనుండి వస్తుందో తెలియదు, అయితే యెహోవా నాకు మద్దతునిచ్చి నమ్మకంగా నాకన్నీ సమకూర్చాడు. దావీదు పలికిన ఈ మాటలు నిజంగా నాకెంతో ప్రియం: “నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనైయున్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు.”—కీర్తన 37:23-25.
అనేకమార్లు శస్త్రచికిత్స సమయాల్లో రక్తమార్పిడిని నిరాకరించుటకు నాకు సహాయంచేసి, లేఖనాల ప్రకారం నిలబడ్డానికి యెహోవా నాకు శక్తినిచ్చాడు. (అపొస్తలుల కార్యములు 15:28, 29) ఈ మధ్యే మా నాన్నగారు చనిపోయారు. అంత సన్నిహితుల్ని పోగొట్టుకోవడం నిజంగా పెద్ద దెబ్బ. ఈ దెబ్బనుండి ఇతర శోధనలనుండి తేరుకోవడానికి యెహోవా బలమే నన్ను కాపాడింది.
నా ఆరోగ్యం యింకా పాడైపోవచ్చు గాని దేవుని యందలి నా నమ్మకం, ఆయనతో నాకున్న సంబంధం నా జీవనరేఖలై యున్నవి. యెహోవా ప్రజల మధ్యవుండి, నిశ్చయమైన ఆయన మద్దతు కలిగివుండడం ఎంత ధన్యం!