కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 8/8 పేజీలు 20-23
  • భారతీయ వనితలు—21వ శతాబ్దంలోనికి అడుగుపెట్టడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భారతీయ వనితలు—21వ శతాబ్దంలోనికి అడుగుపెట్టడం
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉద్యోగాలకు క్రొత్త అవకాశాలు
  • వివాహ రంగంలోనూ మార్పులు
  • ఆడపిల్లలు ఎక్కువ శ్రద్ధను పొందుతున్నారు
  • గ్రామానికి, పట్టణానికి మధ్య తేడాలు
  • ఇరవై ఒకటవ శతాబ్దంలోనికి అడుగుపెట్టడం!
  • మనం స్త్రీలను గౌరవించాలని దేవుడు కోరుతున్నాడు
    కావలికోట: దేవుడు స్త్రీలను పట్టించుకుంటాడా?
  • స్త్రీలకు ఎలాంటి భవిష్యత్తు ఉంది?
    తేజరిల్లు!—1998
  • స్త్రీలనూ, వారి పనినీ మెచ్చుకోవడం
    తేజరిల్లు!—1998
  • యెహోవా సంకల్పంలో స్త్రీల పాత్ర
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 8/8 పేజీలు 20-23

భారతీయ వనితలు—21వ శతాబ్దంలోనికి అడుగుపెట్టడం

ఇండియాలోని తేజరిల్లు! విలేఖరి

వారు పొడవైనవారు, వారు పొట్టివారు. వారు సన్నగా ఉంటారు, వారు లావుగా ఉంటారు. వారు హాస్యభావం గలవారు, వారు గంభీరమైన స్వభావం గలవారు. వారు ఎంతో ధనవంతులు, వారు నిరుపేదలు. వారు ఉన్నత విద్యాభ్యాసం గలవారు, వారు పూర్తిగా నిరక్షరాస్యులు. వారెవరు? భారతీయ వనితలు. వారు ఎక్కడికి వెళ్తున్నారు? వారు 21వ శతాబ్దంలోకి అడుగుపెడుతున్నారు.

భారత దేశానికి వెలుపలవున్న చాలామంది ప్రజల దృష్టిలో భారతీయ వనిత లావణ్యానికి, సౌందర్యానికి, కుశాగ్రబుద్ధికి, ఆకర్షణీయతకు ప్రతిరూపమై ఉంది. అనేకులు భార్యల కొరకు భారతదేశానికి వచ్చేదెందుకంటే, భారతీయ వనితలు సాధారణంగా పాశ్చాత్య దేశీయులైన తమ బంధువులైన సహోదరీలకన్నా విధేయులుగా ఉంటారు, తమ భర్తలను ప్రీతిపరుస్తారు, మంచి గృహిణులై ఉంటారు అనే ఉద్దేశం కొంతమేరకు ఉండడం వలననే. అయితే వివిధ వంశాలు, మతాలు, సాంఘిక పూర్వాపరాలు గల ఇంత పెద్ద జనాబా నుండి సగటు భారతీయ వనితను వర్ణించడంలో పొరపాటుపడవచ్చు. ఈ అందమైన దేశంలో అన్ని తెగలకు చెందిన వనితలు ఉన్నారు.

భారతదేశ చరిత్ర అనేది సమాధానపూర్ణంగా లేక బలవంతంగా ఒకటిగా చేయబడిన అనేక సంస్కృతులలో ఒకటి. తొలి నివాసులైన ద్రావిడులు ఎక్కడ నుండి వచ్చారనే దాని గురించి ఊహలున్నాయి. క్రేతుతో ముఖ్య సంబంధాలు కలిగి, ఆస్ట్రేలియా మరియు దక్షిణ మధ్యదరా తీరాల్లోని ప్రజల సంకరం ద్వారా వారు ఉద్భవించినట్లుగా కనిపిస్తుంది. వాయవ్యం నుండి ఆర్యులు మరియు పారసీయులు, ఈశాన్యం నుండి మంగోలులు భారతదేశంలోనికి రాగా, ద్రావిడులు దక్షిణానికి మకాం మార్చారు. కనుక, సాధారణంగా పొడుగ్గాను, తెల్లగాను, నల్లని కళ్ళు మరియు నల్లని వెండ్రుకలుగల ఉత్తర భారతదేశంలోని వనితల కన్నా దక్షిణాన ఉన్న వనితలు పొట్టిగాను నల్లగాను ఉంటారు. ఈశాన్యమున ఉండే ప్రజలు తరచూ తూర్పు దేశస్థులవలె ఉంటారు.

భారతదేశంలోని వనితల అంతస్థును నిరూపించడంలో మతమనేది పెద్ద పాత్ర వహిస్తోంది. ఆధునిక భారతదేశం లౌకిక రాజ్యం గనుక, స్త్రీని అభివృద్ధికి దూరంగా ఉంచిన పారంపర్యాచారాలన్నింటినీ మార్చడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధనవంతులు లేదా పలుకుబడిగల స్త్రీలకే కాక, స్త్రీలందరి కొరకూ విద్యాభ్యాస అవకాశాలను పెంచేందుకు గొప్ప చర్యలు గైకొనబడ్డాయి. అక్షరాభ్యాస తరగతులు, గ్రామాల్లో ఉద్యోగ ప్రాముఖ్యతగల తర్ఫీదులు, ఉచిత పాఠశాల విద్యాభ్యాసం భారతీయ వనితల అంతస్థును మార్చివేస్తున్నాయి.

జూన్‌ 22, 1994న మహారాష్ట్ర అనే రాష్ట్రంలో స్త్రీల కొరకు ఒక ప్రభుత్వ పాలసీ విడుదలైనప్పుడు, పెద్ద అభివృద్ధి సాధించబడింది. భారతదేశ ఉపరాష్ట్రపతి కె. ఆర్‌. నారాయణన్‌ అది “ప్రాముఖ్యమైనదని, విప్లవాత్మకమైనదని” వర్ణించాడు. సమిష్టి యాజమాన్య హక్కులు, సంరక్షకత్వం, వసతి ప్రయోజనాలు పొందడం, ఉద్యోగాలకు సమాన అవకాశాలు వంటి స్త్రీల మౌలిక సమస్యలపై అది శ్రద్ధ నిలిపింది.

అనేక మంది స్త్రీలు ఇక ఏ మాత్రం ఇండ్లకే పరిమితమై ఉండక కళాశాలకు వెళ్ళి, ఉద్యోగ మార్కెట్లలో ప్రవేశిస్తున్నారు గనుక, నైతిక వాతావరణంలోకూడా మార్పులను గూర్చిన ప్రశ్న లేవదీయబడింది. కళాశాలల్లో మాదక ద్రవ్యాల దురుపయోగం, నైతిక విలువలు లేకపోవడం వంటి నివేదికలు వస్తున్నాయి. మాధ్యమాలు కొందరు భారతీయ యువతులలో మార్పులు తేవడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. ముప్పయి సంవత్సరాల క్రితంనాటి భారతీయ చలన చిత్రాలను నేటి చలన చిత్రాలతో పోల్చి చూస్తే, స్త్రీల చిత్రీకరణలో చాలా పెద్ద మార్పు వచ్చిందని అనేకులు కనుగొంటారు. “నేను పాఠశాలలో ఉన్నప్పటి చిత్రాల్లోని నమ్రతగల, సున్నితమైన, స్వయంత్యాగంచేసే మునుపటి కథానాయిక స్థానాన్ని తనకు సంతోషం లేనప్పుడు తన భర్తను అత్తింటివారిని వదిలిపెట్టి తన హక్కుల కొరకు తన స్వాతంత్ర్యం కొరకు పోరాడే ఆధునిక అమ్మాయి తీసుకుంది” అని ఒక భారతీయ వనిత వ్యాఖ్యానించింది.

అయినప్పటికీ, అనేక దేశాలను పోల్చి చూస్తే, నేటికి భారతదేశంలో మొత్తం మీద ప్రవర్తనలోను, వస్త్రధారణలోను నమ్రత ఉంది. సాధారణంగా ధరించేదేమంటే దాదాపు శరీరాన్నంతా మాన్యంగా కప్పే చక్కని చీరే. యువతులు, ముఖ్యంగా ఉత్తరాన ఉన్నవాళ్ళ మధ్య, పైజామా వంటి స్లాకుల పై వేసుకునే వదులుగా ఉండే డ్రెస్సు—షాల్వార్‌-కమీస్‌ చాలా ప్రసిద్ధమైనది. పశ్చిమార్థ ఫ్యాషన్లు ముఖ్యంగా బొంబాయిలోను గోవాలోను కలకత్తాలోను సాధారణంగా మర్యాదగల రీతిలో పొడవుగా కనిపిస్తాయి.

ఉద్యోగాలకు క్రొత్త అవకాశాలు

భారతీయ వనితలు 21వ శతాబ్దంలోకి అడుగుపెడుతుండగా ఏ రకమైన ఉద్యోగావకాశాలున్నాయి? భారతదేశ జనాబాలో ఎక్కువ మంది గ్రామాల్లో నివసిస్తున్నారు, వారి వృత్తి వ్యవసాయం. కోట్లకొలది మంది పొలాల్లో పనిచేస్తున్నారు. పురుషులతో పాటు స్త్రీలు అన్నిరకాల పొలం పనులను చేస్తున్నారు. అలాగే వారు ఎంతో దూరాన ఉన్న నదుల నుండి బావుల నుండి నీళ్ళు మోసుకొచ్చుకుంటారు, కష్టపడి వంట చెరుకును సేకరించుకుంటారు. పనిచేసే సమయాల్లో పిల్లలను వీపుమీద కూర్చోపెట్టుకుంటారు, లేదా చెట్లకు వ్రేలాడగట్టిన చిక్కపు ఊయలలో పడుకోబెడతారు.

గ్రామీణ ప్రాంతాల్లోని భారతీయ కుటుంబాలు 20వ శతాబ్దారంభంలో ఉద్యోగాలను వెతుక్కుంటూ పట్టణ ప్రాంతాలకు తరలివెళ్ళాయి. స్త్రీలు బట్టల మిల్లుల్లోను, కర్మాగారాల్లోను పని చేశారు. అయితే, పరిశ్రమల ఆధునికీకరణ పురుషులకన్నా స్త్రీలనే ఎక్కువగా ప్రభావితం చేసింది. పురుషులు యంత్రాలను నడపడానికి తర్ఫీదివ్వబడ్డారు, కాని స్త్రీలకు తర్ఫీదు ఇవ్వబడలేదు. ఇందువల్ల స్త్రీలు ఎక్కువగా కష్టపడవలసి వచ్చింది. నిర్మాణ స్థలాల్లో సామగ్రిని మోసుకుపోవడం, బరువైన బస్తాలను తోపుడు బండిమీద తీసుకువెళ్ళడం, పాత దుస్తులను అమ్మడం, లేదా తక్కువ కూలి దొరికే వేరే పనులు వంటివాటిని మాత్రమే వారు చేయగలుగుతున్నారు.

సాంఘిక సంస్కర్తలు స్త్రీల జీవిత విధానాలను మెరుగుపర్చడానికి ప్రయత్నాలు చేశారు. ఎస్‌.ఇ.డబ్ల్యు.ఎ (సెల్ఫ్‌ ఎంప్లోయిడ్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌, అంటే స్త్రీల స్వయం ఉపాధి సమాజం) వంటి సంస్థలు అకస్మాత్తుగా ఆవిర్భవించాయి. నిరక్షరాస్యులైన స్త్రీలు పని చేయగలిగేలా తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, అవినీతిపరుల బారినుండి తప్పించుకునేందుకు, పని చేసే తమ సామర్థ్యాలను మెరుగుపరచుకునేందుకు డబ్బు దాచుకుని తమకు కావలసిన వస్తువులను కొనుక్కోగలిగేందుకు వారికి సహాయపడడం, నీతి విచక్షణ లేని వడ్డీవ్యాపారులకు వడ్డీ చెల్లించుకోవలసిన పరిస్థితి రాకుండా వారిని కాపాడడమే వాటి ధ్యేయము. స్త్రీ స్వాతంత్ర్యవాదాన్ని ఒక సాంఘిక ఉపకరణంగా ఉపయోగించడాన్ని గూర్చి అడిగినప్పుడు ప్రఖ్యాతి గాంచిన సాంఘికశాస్త్రవేత్తయైన జారినా భట్టే ఈ విధంగా చెప్పారు: “భారతదేశంలో స్త్రీ స్వాతంత్ర్యవాదం అంటే స్త్రీల సమస్యలను విని, వారిని సంస్థీకరించడం, వారికి ఆరోగ్యం, పోషణ వంటివాటిని గూర్చిన జ్ఞానాన్నందించడంతో పాటు వారికి సాంకేతిక విద్యను అభ్యసింపజేయడానికి ప్రయత్నించడమే.”

అదే సమయంలో, సమాజంలో ఉన్నత వర్గమని ఎంచబడిన ధనిక కుటుంబాల్లోని, అలాగే మధ్య తరగతి కుటుంబాల్లోని విద్యావంతులైన స్త్రీల పరిస్థితిని గూర్చిన అభిప్రాయాలు మారుతున్నాయి. ఇప్పుడు ఈ రెండు పూర్వాపరాలు గల స్త్రీలూ బోధన లేదా వైద్య రంగంలో మాత్రమే కాక అన్ని రంగాల్లోను కనిపిస్తున్నారు. వారు ఎయిర్‌లైన్‌ పైలెట్లుగాను మోడల్స్‌గాను ఎయిర్‌ హోస్టెస్‌లుగాను పోలీసులుగాను ఉద్యోగాలు చేస్తున్నారు, ఉన్నత అధికార స్థానాల్లోను కనిపిస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఒక మహిళ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడి, అనేక సంవత్సరాలు పరిపాలించింది. భారతీయ వనితలు సాయుధ దళాల్లోను, న్యాయవాదులుగాను, ప్రధాన న్యాయమూర్తులుగాను నియామకాలను చేపడుతున్నారు, వేవేల మంది వ్యవస్థాపకులుగా వ్యాపారం చేస్తున్నారు.

వివాహ రంగంలోనూ మార్పులు

స్వతంత్రంగా ఉద్యోగాన్ని చూసుకునే దృక్పథంగల ఆధునిక భారతీయ వనిత వివాహాన్ని గూర్చి ఎలా భావిస్తుంది? వివాహితులైన భారతీయ స్త్రీలలో 19వ, 20వ శతాబ్దాలు గొప్ప మార్పును తెచ్చాయి. సతి అని పిలువబడే పురాతన ఆచారంలో విధవరాలు తన పతి చితిలో స్వయంగా ఆహుతి అయ్యేది, అది బ్రిటీషు పరిపాలనలో రద్దుచేయబడింది. బాల్యవివాహాన్ని చట్టం నిషేధించింది, గనుక ఇప్పుడు ఏ అమ్మాయి అయినా 18 ఏండ్లకు తక్కువ వయస్సులో చట్టబద్ధంగా వివాహం చేసుకోలేదు. అమ్మాయి వాళ్ళ ఇంటి నుండి వరకట్నం అడగడాన్ని కూడా చట్టం నిషేధించింది, కానీ హానికరమైన ఈ ఆచారం ఇప్పటికీ వాడుకలో ఉంది. పెళ్ళి కూతురి ఇంటివారు కావలసినంత వరకట్నం ఇవ్వలేకపోయినందువల్ల లేక రెండో పెళ్ళిలో మరింత వరకట్నం లభించే అవకాశం ఉన్నందువల్ల ఎన్నో వేలమంది పెళ్ళికూతుళ్ళు ఒక విధంగా కాకపోతే, మరో విధంగా హత్య చేయబడ్డారు.

కాలక్రమేణా, వరకట్న మరణాల ముఖ్య కారణాలపై శ్రద్ధ చూపబడింది. పారంపర్యంగా ఒక భారతీయ వనిత వివాహం చేసుకున్న తరువాత, తన భర్తతో అతని తలిదండ్రుల ఇంటికి వెళ్ళి, తన మరణం వరకు అక్కడే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోను ఆమె తలిదండ్రులు ఆమెను ఇంటికి తిరిగి తీసుకువెళ్ళరు. ప్రాథమిక విద్యాభ్యాసం లేనందువల్ల చాలామంది స్త్రీలు భర్తఇంటిని వదిలిపెట్టి, తమను తాము పోషించుకోవడానికి పని సంపాదించుకోలేరు. కాబట్టి యువతులు తరచూ హింసించబడేవారు, చంపబడతామనే భయం వారిని వెన్నాడుతూ ఉండేది, మరి వారి తలిదండ్రులు తమ పేరాశపరులైన వియ్యంకులను సంతృప్తి పరచడానికి మరింత డబ్బును లేదా వస్తువులను ఇవ్వలేనట్లయితే పెళ్ళికూతుళ్ళు వేదనతో నిశ్శబ్దంగా తమ మరణం కోసం ఎదురు చూసేవారు. సాధారణంగా ముందే వేసిన పథకం ప్రకారం, ప్రాణాంతకమైన ప్రమాదంలో వంట స్టవ్‌ ప్రేలుతుంది, లేక పలుచని చీరకు నిప్పంటుకుంటుంది.

తన జీవితం అపాయంలో ఉందని వివాహిత స్త్రీ భావిస్తే చట్టం, స్త్రీల పోలీసు యూనిట్లు, స్త్రీల మద్దతు కోర్టులు మరియు మద్దతు గుంపులు ఆమెకు ఇప్పుడు సహాయాన్నందిస్తున్నాయి. తమకు మరింత విద్యాభ్యాసం లభ్యమౌతున్నందువల్ల మరియు ఉద్యోగ అవకాశాలు తెరువబడి ఉండడంవల్ల వివాహం చేసుకోవద్దని లేదా ఉద్యోగం సంపాదించుకున్న తరువాత వివాహం చేసుకోవచ్చని కొందరు స్త్రీలు తీర్మానించుకున్నారు. అలా మగవారిపై ఆధారపడడం వల్ల తరచూ కనిపించే కఠినమైన ఆధిపత్యం ఇప్పుడు అంతగా కనిపించడం లేదు.

ఆడపిల్లలు ఎక్కువ శ్రద్ధను పొందుతున్నారు

స్త్రీలను బాధించే మరో సమస్యయైన మగపిల్లల కోసమైన అత్యాశ 21వ శతాబ్దం సమీపిస్తుండగా మారుతోంది. ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు, ప్రాచీన మత బోధలపై ఆధారపడిన ఈ తలంపు ఆడ శిశువులు చంపబడడానికి, అమ్మాయిలకు ఆహారాన్ని, విద్యాభ్యాసాన్ని, ఆరోగ్య సంరక్షణను అబ్బాయిల కన్నా తక్కువగా ఇస్తూ వారిని ఆదరించకుండా ఉండడానికి నడిపింది.

ఇటీవల కాలాల్లో గర్భస్థపిండం ఆడా, మగా అని నిర్ణయించడానికి ఆమ్నియోసెంటిసిస్‌ ఉపయోగించడం వల్ల శిశువు ఆడపిల్లని తెలిసినప్పుడు తరచూ గర్భస్రావం చేయించుకోవడం అంతటా మామూలైంది. దాన్ని చట్టం నిషేధించినప్పటికీ, ఈ పద్ధతి ఇప్పటికీ సాధారణ అలవాటుగానే ఉంది. మగపిల్లవాడే కావాలన్న దృక్పథాన్ని మార్చేందుకు ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి.

మానవ తత్త్వశాస్త్రాలు స్త్రీలను అనేక రకాలుగా కించపర్చాయి. విధవరాండ్రను చూసే విధానం ఒక ఉదాహరణ. ప్రాచీన భారతదేశంలో విధవరాండ్ర పునర్వివాహం అంగీకరించబడలేదు. అయితే దాదాపు సా.శ. ఆరవ శతాబ్దం నుండి నియమనిర్మాణకులు దీనిని ఎదిరిస్తూనే ఉన్నారు. చాలామంది విధవరాండ్ర పరిస్థితి దీనంగా మారింది. పునర్వివాహం నిషేధించబడగా, చనిపోయిన తమ భర్తల ఆస్తిని తరచూ బంధువులు దోచుకునేవారు, ఆమెను కుటుంబానికి శాపంగా ఎంచేవారు కనుక అనేకమంది విధవరాండ్రు కష్టాలతో, అవమానంతోకూడిన జీవితాని కన్నా తమ భర్తల చితిపై బలవ్వడాన్నే ఎన్నుకున్నారు.

పందొమ్మిదవ శతాబ్ద తుది భాగం నుండి, సంస్కర్తలు అలాంటి స్త్రీల కష్టాల భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు, కాని లోతుగా పాతుకుపోయిన భావాలు అంత త్వరగా చావవు. అనేక సమాజాల్లో విధవరాలి పరిస్థితి, అంటే తన వృద్ధ పతి చనిపోయిన యువతి పరిస్థితి నిజంగా పరితాపకరం. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ అనే సంస్థలోని డా.  సహారదా జేన్‌ ఈ విధంగా చెబుతున్నారు: “ముఖ్యంగా, తమ వ్యక్తిత్వమంతా భర్త గుర్తింపుపైనే ఆధారపడి ఉంటుంది కనుకనే వైధవ్యం వల్ల వేదన కలుగుతుంది.” విధవరాండ్రు 21వ శతాబ్దంలో అడుగుపెట్టడానికి సహాయపడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

గ్రామానికి, పట్టణానికి మధ్య తేడాలు

గ్రామాల్లో ఉండే వనితలకు పట్టణాల్లో ఉండే వనితలకు చాలా తేడా ఉంది. గ్రామాల్లోని దాదాపు 25 శాతం మంది అక్షరాస్యులని; పట్టణాల్లో మరి ఎక్కువ శాతం మంది పాఠశాలలకు మరియు కళాశాలలకు వెళ్ళి ప్రయోజనం పొందుతున్నారని అంచనా వేయబడింది. గ్రామీణ స్త్రీలకు సహాయపడేందుకు సాంఘిక సేవకులు అక్షరాభ్యాస తరగతులను, ఆరోగ్య సంరక్షణ తర్ఫీదును, ఉద్యోగ పథకాలను ఏర్పాటు చేశారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగంలోను సహకార సంఘాల్లోను స్థానిక స్వపరిపాలనా సంస్థల్లోను స్త్రీలకొరకు 30 శాతం ఉద్యోగాలను కేటాయించాయి. స్త్రీ విమోచనా సంస్థలు భారతదేశంలోని కోట్ల కొలది మంది వనితల దుఃఖాన్ని, బాధను తీసివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొంతమేరకు ఇవి సఫలీకృతమయ్యాయి. కాబట్టి మనం భారతీయ వనితల భవిష్యత్తును గూర్చి ఏమి చెప్పగలం?

ఇరవై ఒకటవ శతాబ్దంలోనికి అడుగుపెట్టడం!

భారతీయ వనిత 21వ శతాబ్దంలోనికి అడుగుపెడుతుండగా ఆమె పాత్ర మారుతుందా? అవును, అది త్వరితంగా జరుగుతుంది. అయితే భారతీయ వనితలు ప్రపంచమంతటా ఉన్న తమ సహోదరీలు ఎదుర్కుంటున్న పరిస్థితినే ఎదుర్కుంటున్నారు. అభివృద్ధి ఉన్నా ఆటంకాలూ ఉన్నాయి. నిరీక్షణ ఉన్నా నిరాశా ఉంది. అందమైన ఇండ్లు, విలాసవంతమైన జీవిత-విధానాలు ఉన్నా గుడిసెలు, అతి పేదరికము మరియు విపరీతమైన ఆకలి ఉన్నాయి. కోట్లమంది అత్యవసర వస్తువులకు మించి ఏమీ పొందలేరు. మరి కొందరు లోకంలో ఉన్నదంతా పొందగల్గే స్థితిలో ఉన్నారు. అనేకులకు భవిష్యత్తు అనేది అనిశ్చితంగా ఉంది. వాళ్ళకు సంతృప్తి ఉంది, సందేహాలు కూడా ఉన్నాయి.

అయితే కొందరికీ, ముఖ్యంగా క్రీస్తుయేసు ద్వారా యెహోవా రాజ్యపరిపాలనలో రానున్న భూపరదైసు నిరీక్షణ ఉన్నవారికి భవిష్యత్తు వాగ్దానంతో తేజోవంతంగా ఉంది. (ప్రకటన 21:1, 4, 5) స్త్రీలు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించే 21వ శతాబ్దం కొరకు వీరు పూర్తి విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు.

[20వ పేజీలోని చిత్రం]

భవన నిర్మాణ స్థలానికి ఇటుకలను మోసుకుపోవడం

[21వ పేజీలోని చిత్రం]

ఇంటి అవసరాల కొరకు నీళ్ళు తోడుకోవడం

[22వ పేజీలోని చిత్రం]

సమావేశంలో పురుషులతో

[22వ పేజీలోని చిత్రం]

కంప్యూటర్‌ ఆపరేట్‌ చేయడం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి