సమస్యల నెదుర్కొనుటకు దేవునితోటి సన్నిహితత్వం నాకు సహాయపడింది
నాకు మతమంటే ఆసక్తివుండేదికాదు. సంస్థీకరించబడిన మతాలన్నీ నాకు వేషధారణగా కనిపించేవి. ఇతరుల యెడల అసహనాన్ని పెంపొందించడం కంటే ప్రజలకు అది ఇంకేమీ చేయడం నేను చూడలేదు. అది పందొమ్మిది వందల 60వ శతాబ్దాంతం. ఒక అమెరికా రాష్ట్రపతి హత్యచేయబడ్డాడు, వియత్నాంలో ఒక యుద్ధమందు వేలాదిమంది చనిపోతున్నారు. ప్రపంచమంతా గందరగోళంగా అనిపించింది. నా స్వంత జీవితం ఎటూ తోచనిస్థితిలో పడిపోయింది. నన్ను లేక మానవజాతిని గూర్చి పట్టించుకునే దేవుడున్నాడని ఎలా నమ్మడం?
ఒక పొరుగింటి స్త్రీ నాతో బైబిలు గురించి మాట్లాడ్డం మొదలు పెట్టేనాటికి నేను ఒక మానసిక రోగుల చికిత్సాలయంలో పనిచేస్తున్నాను, అప్పుడు నాకు 27 ఏళ్లు. వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే నేనలా వింటూండిపోయాను. అంత్యదినాలని చెప్తున్న వాటిని గురించి ఆమె మాట్లాడింది. ఆమె క్రొత్త విషయాలు చెబుతూ వుంటే నేను సమాధానాలు అడిగేదాన్ని. నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పేరుగల పుస్తకాన్ని ఆమె నాకిచ్చింది. నేను లేఖనాలు పరిశీలించి చూస్తూ, దాన్ని ఒక్కరాత్రిలోనే చదివేశాను, ‘నేను నిజంగా సత్యం తెలుసుకున్నానా?’ అని నాలో నేనే అనుకున్నాను.
అదే నిజమైతే దానివల్ల ఓ సమస్య వచ్చింది. నేను యూదుల కుటుంబంలో జన్మించాను, నా భర్త యూదుడు, నాకిద్దరు చిన్న పిల్లలు, నా బంధువులు యూదులే. నేను యెహోవాసాక్షులలో ఒకరినైతే వారు ఇష్టపడరని నాకు తెలుసు. నాకుటుంబాన్ని అనవసరంగా బాధించడం నాకిష్టంలేదు; నేను ఏ సంగతి కచ్ఛితంగా తేల్చుకోవాలనుకున్నాను. నేను అప్పటికే బైబిలు సాహిత్యాన్ని తీవ్ర ఆకాంక్షతో చదవడం మొదలెట్టాను. ఒక వారంలో ఇదే సత్యమని నేను తెలుసుకోగలిగాను. నేను తప్పనిసరిగా సత్యం నేర్చుకోవాలనుకున్నాను. అందుకే యెహోవాసాక్షులతో నేను పఠించడం మొదలుపెట్టాను. కొన్ని వారాలలో నేను ప్రతిఒక్కరికి ప్రకటించుట కారంభించాను. దేవుని పేరు యెహోవా అని, ఆయన నా గురించి మానవజాతంతటి గురించి శ్రద్ధ కలిగివున్నాడని, భూపరదైసులో నిత్యజీవం సాధ్యమని తెలుసుకొనుటకు పులకరించిపోయాను. నేను 1970 జూన్ 12న బాప్తిస్మం పొందాను.
నేను అనుమానించినట్లే నా కుటుంబం, నా అత్తమామలు ఇందుకు ఇష్టపడలేదు. కొంతమంది నన్ను నిరాకరించారు. నా భర్త సంవత్సరాల తరబడి అప్పుడప్పుడు పఠనంచేశాడు గాని విశ్వాసి కాలేదు. అయితే, నా పిల్లలు యెహోవాసాక్షులయ్యారు. మొదటి నుండి నేను దేవుని రాజ్యసువార్తను ఇంటింటికీ ప్రకటిస్తూ పూర్తికాల సేవకురాలిని కావాలనుకున్నాను. కాని నాకు పెరుగుతున్న కుటుంబం, అవిశ్వాసియైన భర్త ఉన్నారు గదా. నేను ఉద్యోగం చేస్తున్నప్పటికీ, మేము డబ్బు చెల్లించలేక రెండు ఇల్లు పోగొట్టుకున్నాము, ఎన్నోసార్లు తలదాచుకోవడానికి స్థలంలేకుండా పోయింది. బ్రతుకు భారంగా ఉండేది.
ఒకసారి మా ఇల్లు తాకట్టులో ఉండింది. ఒక ఆదివారం మధ్యాహ్నాం ఆ ఇంటినుండి బయటికి వెళ్లవలసి వచ్చింది, మాకు ఇంక వెళ్లటానికి వేరే స్థలంలేదు. నేను చేయగలిగిందంతా చేశాను, ఆఖరుకు శనివారం ఉదయం అంటే ఖాళీ చేయవలసిన ముందు రోజు, యేసు మత్తయి 6:33లో చెప్పినట్లు నేను మొదట దేవునిరాజ్యమును వెదకుతూ నాకు అవసరమైన వాటిని యెహోవా దయచేస్తాడని ఎదురుచూడటానికి నిశ్చయించుకున్నాను. నేను బహిరంగ సేవకు వెళ్లిపోయాను. ఆ పరిస్థితి వత్తిడినిబట్టి ఏడవటం నాకు గుర్తుంది, కాని ఐదు నిమిషాల్లో తేరుకున్నాను. ప్రకటించడం ఎప్పుడూ నాపై అనుకూల ప్రభావాన్ని కలిగిస్తున్నట్లు నా సమస్యలకు మించిన ఉత్సాహాన్నిస్తున్నట్లు, యెహోవా ఆత్మ నన్ను సంతోషంగా, ఫలభరితంగా ఉంచి, నా జీవితానికి అర్థాన్నిస్తున్నట్లు నేను గమనించాను. ఎలాగైతేనేం, ఆరోజు నేను ఇంటికి తిరిగివచ్చాను గాని, మేము వెళ్లటానికి మాకు స్థలం లేకపోయింది, అయినా నేను దిగులు పడలేదు.
ఆ సాయంత్రం మాకు, మా అవసరతలను చూస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థ నుండి ఒక కాల్ వచ్చింది. అప్పుడు రాత్రి 11:30 మాకు వెళ్లటానికి స్థలం ఏది లేదని మాగురించి ఎంతో శ్రద్ధతో రియల్ ఎస్టేట్ ఏజంట్, మేము ఉండబోయే ఇల్లు సిద్ధం అయ్యేంత వరకు తాత్కాలికంగా ఉండటానికి ఒక స్థలం చూపించారు. ఆదివారం నాతోటి సాక్షులు మమ్మల్ని ఆ ఇంట్లోకి మార్చారు. మా ఇల్లు తయారయ్యేంత వరకు అంటే మూడు వారాలు మా వస్తువులన్నీ పెట్టెల్లోనే వుంచుకుని ఆ ఇంట్లో ఉన్నాము. అది అంత తేలికైన పనేమికాదు, కాని యెహోవా మా అవసరతలు తీర్చాడు. ఇది నన్నెంతో బలపర్చి, నా విశ్వాసాన్ని పెంచింది. “నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు” అని కీర్తనలు 37:25లో దావీదు రాజు చెప్పినట్లే జరిగింది.
కుటుంబ ఖర్చుల విషయంలో ఎన్నో కష్టాలుండేవి. కొన్నిసార్లు నేనే ఆర్థిక నిర్వహణ బాధ్యతంతా తీసుకుని అన్నీ చక్కబెట్టేదాన్ని. యెహోవా యెడల నాకున్న ప్రేమను బట్టి, వివాహ ఏర్పాటు యెడల ఆయనకున్న గౌరవాన్ని బట్టి, మా వివాహం విచ్ఛిన్నంకాకుండా వుండాలని ఆ సంవత్సరాలలో నేనెంతగానో ప్రయత్నించాను. నా భర్త మారి సత్యంలోకి వస్తాడని అంతర్గతంగా నిరీక్షించేదాన్ని.
నేను క్రమపయినీరు సేవను గూర్చి విడువక ప్రార్థించి, అవకాశం దొరికిన ప్రతిసారి సహాయ పయినీరు సేవచేసాను.a నా జీవితాన్ని సరైన విధంగా ఉపయోగించటానికి ప్రకటించే పని శ్రేష్టమైనదని, అత్యంత ముఖ్యమైనదని నాకు తెలుసు. నేను యెహోవాను ప్రేమించాను, ఆయనను పూర్ణాత్మతో సేవించాలని ఇష్టపడ్డాను. నేను ప్రజలను కూడ ప్రేమించాను, వారికి సహాయం చేయాలని కోరుకున్నాను. కష్టతరమైన నా స్వంత జీవితానుభవం ద్వారా బైబిలుసూత్రాలు ఎంత ప్రయోజనకరమైనవో గుణగ్రహించి, రాజ్యం సమకూర్చే నిరీక్షణ ప్రజలకు అవసరమని నేను తెలుసుకున్నాను. కాని, నేను పనిచేయకపోతే నాకుటుంబం జీవించలేదని నేను భయపడ్డాను. మేం అతికష్టం మీద జీవించాము.
నేను కేకలువేసాను, అత్యాచారి పారిపోయాడు
యెహోవా నా గురించి శ్రద్ధవహించి, అవసరమైనప్పుడల్లా నాకు సహాయం చేస్తాడనే నమ్మకాన్ని కలిగించిన ఒక సంఘటన నా జీవితంలో సంభవించింది. ఎవరో ఒకడు మా ఇంట్లోకి ప్రవేశించి నాపై అత్యాచారం చేయటానికి ప్రయత్నించాడు. నేను నిద్రిస్తుండగా అతడు నాపై దాడిచేసాడు, నేను మేల్కొన్న తరువాత కదిలినా, కేకలువేసినా నన్ను చంపేస్తానని అతడు బెదిరించాడు. నేను వణకిపోయినప్పటికీ, నిశ్శబ్దంగా ఉండి ప్రార్థించటానికి, తగిన ప్రత్యామ్నాయాన్ని గూర్చి ఆలోచించటానికి యెహోవా నాకు సహాయం చేశాడు. కేకలు వేయడాన్ని గూర్చి బైబిలేమి చెప్తుందో నాకు తెలుసు కాని, ఒకవేళ నేను కేకలువేస్తే అతను నన్ను చంపేస్తాడేమో, అప్పుడు నా పిల్లలు లేస్తే వారిని కూడ చంపేస్తాడేమో అనుకున్నాను. నా పేరు చనిపోయినవారి జాబితాలో ఉన్నట్లు ఊహించి, నేను చనిపోతే యెహోవా నా పిల్లలను రక్షించాలని ప్రార్థించాను. అయినప్పటికీ, బైబిలు సూచించినదే చేశాను—నేను కేకలు వేసాను. (ద్వితీయోపదేశకాండము 22:26, 27) అత్యాచారి పారిపోయాడు. నేను ఆ రాత్రి నిజంగా చనిపోతాననుకున్నాను. యెహోవాకు నేనెంతో సన్నిహితురాలినయ్యాను.
నేను నా ఉద్యోగం వదిలేసి, 1975లో క్రమపయినీరుగా సేవచేయడం మొదలెట్టాను. నేను ఆరు సంవత్సరాలు పయినీరు సేవచేసాను, నా భర్త ఖర్చులు భరించాడు. విచారకర విషయమేమంటే అంతచిన్న వయసులోనే నాకు మధుమేహవ్యాధి వచ్చి, ఒక సారి చాల అనారోగ్యంగా ఉంటిని. దాన్ని సహించడానికి నేను ఇంకా ఎక్కువగా యెహోవాపై ఆధారపడ్డాను. నా పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ, అంతవరకు నేననుభవించిన సంతోషకరమైన, అత్యంత ఫలవంతమైన సంవత్సరాలు అవే. బాప్తిస్మం తీసుకునేంత వరకు అభివృద్ధి చెందిన అనేకమంది బైబిలు విద్యార్థులనిచ్చి యెహోవా నన్నాశీర్వదించాడు. వారిలో కొంతమంది పయినీర్లయ్యారు.
మరలా 1980లో మా జీవితాలు చీలిపోయాయి. నాకు నాభర్తకు మధ్య విముఖత పెరిగిపోయింది. నా పిల్లలు ఎంతో మనోవ్యాకులత చెందారు, కాబట్టి వారి గురించి మా వివాహం విచ్ఛిన్నం కాకుండా కాపాడాలని ప్రయత్నించాను, కాని నా భర్త నా ప్రయత్నాలకు తగిన విధంగా ప్రతిస్పందించలేదు. అప్పుడు, లేఖనాను సారంగా విడాకులు తీసుకోవడానికి అది తగిన సమయమని నేను గ్రహించాను. అతను నన్ను విడిచిపోవడం నా పిల్లలపై చాల వినాశకర ప్రభావాన్ని కలుగజేసింది.
ఆ సమయంలో పయినీరు సేవను కొనసాగించాలని నేనెంతగానో ప్రయత్నిస్తూనే, అలా ఒక సంవత్సరం వరకు కొనసాగాను. నా కుమార్తె పరిస్థితినెదుర్కోలేక ప్రతిదానికి, ఆఖరుకు నాకు, సత్యానికి కూడ ఎదురుతిరగడం మొదలెట్టింది. ఆమె ప్రవర్తనను బట్టి ఆ సమయంలో నేను పయినీరుసేవ చేయడం మానేశాను. ఇది నన్నెంతగానో కలవరపరిచింది; నా జీవనరేఖ తెగిపోయింది. మరీ ఒంటరిదానినై పోయినట్లు, నేను యెహోవాను తప్ప సమస్తాన్ని కోల్పోయినట్లు భావించాను.
ఆ సమయంలోనే యెహోవా ఇద్దరు ప్రియమైన సహోదరుల ద్వారా సహాయమందించాడు. వారిలో ఒకరు ప్రయాణ కాపరి, ఇంకొకరు సంఘపెద్ద. ఆయన నాభర్తకు స్టడీ యిచ్చాడు గనుక మా పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. యెహోవా మనుష్యులలో అనుగ్రహించిన యీ కృపావరములకు నేనెల్లప్పుడూ కృతజ్ఞురాలినే. వారు ఎప్పటికీ నాకు అత్యంత ప్రియమైనవారై యుంటారు.
తరువాత కొద్దికాలానికి, చిన్న వయసులోనే నా కుమార్తె సత్యంలోలేని వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇది మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి మమ్మల్ని పూర్తిగా దుఃఖంలో ముంచేసింది. తరువాత వెంటనే నా కుమారుడు వేరుగా కాపురం పెట్టాడు. నా కుటుంబం సత్యంలోనే ఉండేటట్లు సహాయం చేయమని నేను యెహోవాకు నిర్విరామంగా ప్రార్థించాను. వారు నాకెంతో అమూల్యమైనవారు, వారు యెహోవాను హత్తుకొని ఉండాలన్నదొక్కటే నేనెంతో కోరుకున్నది. నేను సత్యమందున్న కాలంమంతటిలో ఇదే నా తదేక ప్రార్థనగా ఉండేది. నా ఇరవైఏళ్ల వివాహ జీవితం దుర్భరంగా ఉన్నప్పటికీ, యీ కాలం వాటికన్న మరింత దుర్భరమైంది. అయితే ఎలాగైనా యెహోవా నాకు సహాయం చేస్తాడని నాకు తెలుసు, ఏదేమైనా నేను యెహోవా చిత్తమే చేయాలనుకున్నాను.
ఒక సంఘటన నాకు బాగా జ్ఞాపకముంది. అప్పటికి నేనింకా పయినీరుసేవ చేస్తున్నాను, మావద్ద అసలు డబ్బేమిలేదు కాని ఆ వారం గడవటానికి, మరుసటి వారం పనికెళ్లటానికయ్యే ప్రయాణ ఖర్చులకు మాత్రం మాకు షుమారు 70 డాలర్లు అవసరమైయుండెను. నేను రెండురోజులు తాత్కాలికంగా పనిచేశాను. మామూలుగా అయితే నేను సంపాదించిన ఆ 40 డాలర్లు రావటానికి ఒక వారం ఆగవలసి వుంటుంది. మాకు తిండికొరకు అసలు డబ్బులేదు, ప్రయాణ ఖర్చుల మాట వదిలేయండి. ఆ మరునాటి రాత్రి నేను ఒక స్త్రీతో బైబిలు పఠనం చేశాను, ఆమె ప్రయాణ ఖర్చుల కొరకు సహాయం చేయగలిగింది.
మరునాడు శుక్రవారం. నేను ఉత్తరాలు తెచ్చుకోవటానికి వెళ్లాను, అక్కడ రెండు ఉత్తరాలున్నాయి. వాటిలో, మరుసటి వారం వస్తుందని నేను ఎదురుచూస్తున్న చెక్కు ఒకటి ఉంది. అది మూడు రోజులలోనే సిటీకి వెళ్లి తిరిగివచ్చింది. నేను ఆశ్చర్యపోయాను. నాకు ఇంకా 29 లేక 30 డాలర్లు కావాలి. మరో కవరులో నాకు సరిగ్గా అవసరమైన 29 డాలర్లకు చెక్కు వుంది. దీనిగురించి నిజంగా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ సంవత్సరం ఫిబ్రవరిలో మా ఇంటిని వేడిచేయటానికి అవసరమయ్యే నూనెకొరకు ప్రభుత్వం పారితోషికంగా డబ్బు ఇచ్చారు. అయితే ఆగస్టునెలలో, వారు నాకు 29 డాలర్లు బాకీ ఉన్నట్లు నిర్ణయించారు, ఈ ఆగస్టునెలలో వేడిచేయటానికా? అసలు వారు నాకు బాకీ ఉన్నట్లు ఎందుకు భావించారు, అదీ ఈ ఆగస్టులో నూనె కొరకు? ఇది నాపై ఎంతటి విశ్వాసాన్ని దృఢపర్చే ప్రభావాన్ని కలుగజేసిందో!
వస్తుదాయక విషయాలు జవాబుకాదు
నేను పూర్తికాలం పనిచేయడం మొదలెట్టి, నేను చేసిన పనులలో కంప్యూటర్లను ఉపయోగించడానికి నేర్చుకోవడం మొదలెట్టాను. నేను పయినీరు సేవచేయని సంవత్సరాలు ఎంతో కష్టతరంగా ఉండేవి. నాకు శ్రేష్టమైన ఉద్యోగం, ఆర్థికభద్రత, వస్తుసంపద ఉన్నప్పటికీ, నేను సంతోషంగా లేను. నా పిల్లలు నానుండి వేరై చాల కష్టాలు పడుతుండిరి. నా కూతురు మళ్లీ సత్యంవైపు తిరుగుతున్నప్పటికీ ఆమెకు ఇంకా సమస్యలుండేయి. నా కుమారుడు కూడ తన సమస్యలతో సతమతమౌతూ వుండెను. కొంత కాలం తరువాత, నేను ఎంతగానో ఇష్టపడే దేవునితో సన్నిహిత సంబంధాన్ని కోల్పోతున్నట్లు భావించాను. ఎవరు గమనించక పోయినప్పటికీ, నేను యెహోవా నుండి దూరంగా వెళ్లిపోతున్నట్లు గ్రహించాను. నేను అన్ని కూటాలకు హాజరై, పఠించి, సేవకొరకు వెళ్తూ ఉండేదాన్ని, కాని అంతమాత్రమే సరిపోలేదు. నేను స్నేహితులతో ఎక్కువ కలుపుగోలుగా ఉండేదాన్ని, గాని అది కూడ నాకు సహాయపడలేదు.
నా గురించి నేను బాధపడడం ప్రారంభించాను. నన్ను నేను పరిశీలించుకుంటూ, నా గురించి నేను ఆలోచించడం మొదలెట్టాను. ఇంకా ఎక్కువ పొందటానికి నాకు అర్హతలేదా? ఈ విధమైన ఆలోచనావిధానమే సాతానుకు కావలసింది. మొదటిసారిగా నేను నా స్నేహితులవైపుకు ఆకర్షింపబడుతున్నట్లు భావించాను. ‘వాళ్లకు ప్రకటిస్తాను’ అని నేననుకున్నాను. అలాగే చేసాను. కానీ నా హృదయం నిర్లక్ష్యం చేయకూడని వాటిని నిర్లక్ష్యం చేస్తున్నట్లు నేను అంతర్గతంగా గ్రహించగలిగాను. సమస్యలు వెలుపలివి కావు, నాతోనే సమస్య వుంది. నేను బైబిలు శిక్షణపొందిన మనస్సాక్షిని తప్పించుకోలేక పోయాను. నేను యెహోవాకు ప్రార్థించాను.
నేను పూర్తికాలం పనిచేస్తుంటిని. నేను కూడబెట్టిన వస్తుసంబంధమైన సురక్షతను వదలివేయవలసిన అవసరముండెను. నేను లాంగ్ ఐలాండ్ నుండి వాల్‌స్ట్రీట్ వరకు ప్రతిరోజు మూడుగంటలు ప్రయాణించేదాన్ని. చాల సమయం! ట్రైనులో చాలమంది లోకస్థులను కలుస్తున్నప్పటికీ నా పరిస్థితిలో మార్పేమిలేదు. నేను పెద్దలతో మాట్లాడి, ముఖ్యమైన విషయాలపై కేంద్రీకరించటానికి సహాయం చేయడానికి వారాంతాలలో సమావేశాలకు వెళ్లడానికి మొదలెట్టాను. జీవితంలో మొదటిసారిగా, నేను వస్తుసంబంధ విషయాల గురించి విచారించాల్సిన అవసరం లేకపోయింది గనుక, మళ్లీ నేనెందుకు పోరాడాలి? ఒక సంవత్సరం పాటు ప్రార్థించిన తర్వాత, నా పరిస్థితిలో మార్పు చేసుకోవాలా లేదాయనేది బాగా ఆలోచించిన తరువాత నేను మార్పు చేసుకున్నాను.
నేను బ్రూక్లిన్ హైట్స్ ప్రాంతానికి మారాను. అక్కడి సంఘాన్ని సందర్శించి, అక్కడున్న ఆత్మీయతే నాకు కావలసిందని నేను తెలుసుకున్నాను. ఎంతోమంది నమ్మకమైన విశ్వాసులు ఎన్నో ఏళ్లుగా పూర్తికాలసేవ చేస్తూండడం—నేను ఇంటికి వస్తున్నట్లుగానే భావించేటట్లు చేసింది. ఆరు నెలల్లో నేను నా ఉద్యోగం వదిలేసి పయినీరు సేవ చేయటానికి సిద్ధపడ్డాను. నేను కొద్దిసమయం పనిచేసే ఉద్యోగం ప్రారంభించాను, 1984లో నేను మళ్లీ క్రమ పయినీరుగా నియమించబడ్డాను.
సంవత్సరాలుగా, యెహోవా నాకు ఎన్నో ఆశ్చర్యకరమైన దీవెనలిచ్చాడు, మరెన్నెన్నో విలువైన పాఠాలు నేర్పాడు. నేను విశ్వాస, ధైర్యములతో వుంటూ ప్రతి పరీక్షలో ఒక పాఠం నేర్చుకోవటానికి ప్రయత్నించాను. సమస్యలుండటం సిగ్గుకరం కాదు; గాని వాటిని పరిష్కరించుకోవటానికి బైబిలు సూత్రాలను అన్వయించుకోక పోవడమే పాపమౌతుంది. నేను సత్యంలోకి క్రొత్తగా వచ్చినప్పుడున్న సమస్యలు ఇక్కడ బ్రూక్లిన్‌లో ఇప్పుడులేవు. ఆర్థికంగా ఇప్పుడే సమస్యలు లేవు. అవిశ్వాసి అయిన భర్త విషయంలో ఇప్పుడు సమస్యలేదు. నా గుండెకోత మానింది. నేను ఎంతోమంది ఆత్మీయ పిల్లలను పొందడం ద్వారా ఆశీర్వదింపబడ్డాను.
కాని ఎప్పటికప్పుడు క్రొత్త క్రొత్త సమస్యలు, సవాళ్లు ఉంటూనే ఉంటాయి. నా కుమారుడు మార్క్, 1987లో తీవ్రమైన నరాల బలహీనతకు గురై చాలా బాధపడ్డాడు దాని కారణంగా తీవ్రంగా కృంగిపోయాడు, కాని యెహోవా మాకు సహాయం చేశాడు. మార్క్ ఇప్పుడు సంఘంలో బాగా చురుకుగా అభివృద్ధి చెందుతున్నాడు. నా కుమార్తె ఆండ్రీయా, మళ్లీ సత్యంలోకి తిరిగివచ్చి, బాప్తిస్మం తీసుకుని, తన పిల్లలను కూడ సత్యంలో పెంచుతోంది. మనం త్వరలో మహాశ్రమలను ఎదుర్కోబోతున్నాము గనుక, సమస్యలు ఇలాగే కొనసాగుతాయని లేక ఇంకా ఎక్కువ అవుతాయని నేను అనుకుంటున్నాను, కాని ఏ సమస్యలు, ఏ సవాళ్లు మనకు ఎదురైనా సహాయం చేయటానికి యెహోవా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు.
నిజంగా, ఎంతో సంతోషకర, ఫలవంతమైన జీవితాన్ని కలిగి వుండటానికి యెహోవా నాకు సహాయం చేశాడు. మిగిలిన జీవితాన్ని అలాగే ఆయనకు దగ్గరగా గడుపుతూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉండాలని నిరీక్షిస్తున్నాను.—మార్లీన్ పావ్లో చెప్పింది.
[అధస్సూచీలు]
a “పయినీరు సేవ” అనే పదం పూర్తికాల పరిచర్యపనిని సూచిస్తుంది.
[25వ పేజీలోని చిత్రం]
మార్లీన్ పావ్లో, రాజ్యసువార్త ప్రకటించే పూర్తికాల సేవకురాలు