కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 4/8 పేజీలు 19-22
  • సంభాషణ ఒక కళ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సంభాషణ ఒక కళ
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనం మాట్లాడాల్సిన అవసరముంది!
  • సంభాషణకు అడ్డంకులు
  • ‘నేను ఏమి చెప్పగలను?’
  • మంచి శ్రోతగా ఉండండి
  • యథార్థమైన ఆసక్తికి ప్రతిస్పందన లభిస్తుంది
  • సానుభూతి—సంభాషణ యొక్క మూలరాయి
  • మీరు దాన్ని చేయగలరు!
  • సంభాషణా సామర్థ్యాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చు?
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • మాట్లాడడం ఎప్పుడు ఆపేయాలి?
    ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం
  • పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—రోజువారీ పనుల్లో కలిసేవాళ్లకు ఎలా సాక్ష్యమివ్వవచ్చు?
    మన రాజ్య పరిచర్య—2014
  • నేను మరింత కలివిడిగా ఎలా ఉండగలను?
    తేజరిల్లు!—1999
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 4/8 పేజీలు 19-22

సంభాషణ ఒక కళ

తినడం, నిద్రపోడం, పనిచేయడం, ఇవి సాధారణ మానవ అవసరతలు. అయితే, మరో అవసరత కూడా తీర్చబడవలసిన ప్రాముఖ్యత ఉంది. అదేంటి?

జీవితావసరతల్లో చాలా అమూల్యమైన ఒక అవసరతనుండి దూరపర్చబడి, ఐదు సంవత్సరాలు ఏకాంత నిర్బంధంలో గడిపిన ఒక వ్యక్తి మాటలను గమనించండి. “నేను ఒక భాగస్వామి కొరకు, మాట్లాడేందుకు, సంభాషించడానికి ఎవరైనా ఉండాలని ఇష్టపడ్డాను. ఒంటరితనాన్ని ఎదుర్కోడానికి నేనేదైనా చేయాలని నేను గుర్తించడం ప్రారంభించాను. నా ఏకాంతత మరియు నిశ్శబ్దతలో, నా మనస్సు ప్రభావితం చెందుతుంది,” అని అతను ఒప్పుకుంటున్నాడు.

అవును, మనకు భాషించాల్సిన జన్మసిద్ధ అవసరత ఉంది. ఆ అవసరతను తీర్చడానికి సంభాషించడం సహాయపడుతుంది. డెనిస్‌ ఆర్‌. స్మిత్‌ మరియు ఎల్‌. కీత్‌ విలియమ్‌సన్‌ అనే పరిశోధకులు ఇలా వ్యాఖ్యానిస్తున్నారు: “మనం నిష్కపటంగా మన స్వంత విషయాలను చెప్పుకోగల వారు, వారితో మన అతి గొప్ప సంతోషాలను మరియు మన అత్యంత దుఃఖకరమైన భయాలను పంచుకోగల, మనం మాట్లాడగల ప్రజలు మనకు కావలసిన అవసరముంది.”

మనం మాట్లాడాల్సిన అవసరముంది!

మానవులకు మాట్లాడగల అద్భుతమైన బహుమానం ప్రసాదించబడింది. అవును, మనం సంభాషించేలా రూపొందించబడ్డాము. ఒక వ్యక్తి ఈ విషయాన్ని గమనించాడు: “మనం సాంఘికంగా మెలిగేలా దేవునిచే సృష్టించబడ్డాం. మీకు మాట్లాడే అవకాశం లేకపోతే, లేక భాషించగల మీ సామర్థ్యాన్ని ఎవరైనా తీసివేస్తే, అదొక శిక్షలా ఉంటుంది. మీరు సంభాషించినప్పుడు, ఒక విలువైన విషయం జరుగుతుంది. మీ గురించి మీరు మంచిగా భావిస్తారు మరియు ఇతరులు ఏమి ఆలోచిస్తున్నారు, భావిస్తున్నారు అనే విషయం తెలుసుకోవడం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు.”

ఒక ప్రయాణ కాపరి యొక్క భార్య అయిన ఎలాన్‌ ఇలా చెబుతుంది: “పదాలు భావాలను వ్యక్తం చేస్తాయి. మన జత మనకెంత అమూల్యమైనవారిగా ఉన్నారో అతనికి లేక ఆమెకు [మన జతకు] తెలుసునని మనం ఊహించకూడదు. అది తెలియజేయబడాలి; చెవులు మాటల్ని వినాల్సిన అవసరముంది. మనం సంభాషించాల్సిన అవసరముంది.”

ఒక క్రైస్తవ పెద్ద యొక్క కుమారుడైన డేవిడ్‌ తన భావాలనిలా వ్యక్తం చేస్తున్నాడు: “కొన్నిసార్లు నాకు విసుగెత్తి నేనేం భావిస్తున్నానో నాకు తెలియకుండా పోతుంది. నా మొదటి ప్రతిస్పందన మౌనంగా ఉండిపోవడమే, తర్వాత నాలో ఒత్తిడి అధికమౌతుంది. నేనెవరితోనైనా మాట్లాడితే, ఆ ఒత్తిడిని తీసివేయడానికి అదొక మార్గంలా ఉంటుందని నేను కనుగొన్నాను. నేను మాట్లాడుతుండగా నా గురించి నేను వాస్తవంగా ఎలా భావిస్తున్నాను అన్నది తెలుసుకోడానికి నాకు అవకాశం ఉంటుంది మరియు దానితో వ్యవహరించేందుకు, దానికి పరిష్కారాన్ని కనుగొనేందుకు నాకు వీలౌతుంది.”

సంభాషణకు అడ్డంకులు

వాస్తవానికి, సంభాషణ ఒక అవసరాన్ని తీర్చుతుంది. అయితే, సంభాషణకు అడ్డంకులు ఉన్నాయి. నిజానికి, కొందరికి సంభాషించడం ఒక పోరాటంగా—నిరాకరించాల్సిన ఒక పనిగా ఉంటుంది.

“నా జీవితమంతా, ఇతరులతో సంభాషించడాన్ని ప్రక్కకు నెట్టడం సులభంగా ఉంటుందని నేను భావించానని” గేరి చెబుతున్నాడు. అతనిలా వివరిస్తున్నాడు: “నాకు ధైర్యం లేకపోవడమే దానికి కారణం. నేను ప్రజలతో సంభాషించేటప్పుడు, నేను అవివేకంగా మాట్లాడుతున్నానేమో లేక నేను చెప్పిన దానికి ఎవరైనా నన్ను చిన్నచూపు చూస్తారేమో అనే భయం ఇంకా నన్ను పీడిస్తుంది.”

ఎలాన్‌ తనకున్న సమస్య సిగ్గుపడటమేనని వర్ణిస్తుంది. ఆమె ఇలా వివరిస్తుంది: “నేను అర్థవంతమైన సంభాషణ లేని కుటుంబంలో పెరిగాను. నా తండ్రి తీవ్రంగా భయపెట్టేవాడు. కాబట్టి నేను పెరిగేకొలది, చెప్పేందుకు నావద్ద విలువైన విషయాలేమి లేవని భావించేదాన్ని.” అవును, సిగ్గుపడటం సంభాషణ యొక్క ఆనందానికి తీవ్ర అడ్డంకులను ఉత్పన్నం చేయగలదు. అంతెందుకు, అది మిమ్మల్ని నిశ్శబ్దపు గోడల్లో బంధించగలదు!

తాను ఆత్మన్యూనతతో పోరాడుతున్నానని తెలియజేస్తున్న ఒక క్రైస్తవ పెద్ద అయిన జాన్‌ “అదొక రోగమని,” అంటున్నాడు. “మీరు సిగ్గుపడితే, మిమ్మల్ని మీరు ఏకాంతపర్చుకుంటారు. గదిలో ఒక వందమంది ప్రజలు ఉన్నా మీరు సంభాషించరు. మరి దానివలన మీరెంతో నష్టపోతారు!”

మరోవైపు, డాన్యెల్‌ అనే పేరుగల ఒక పెద్ద ఇలా చెబుతున్నాడు: “మాట్లాడటంలో నేను దిట్టను. అయితే నేను ఎవరికో ఒకరికి అంతరాయం కల్గించానన్న విషయాన్ని నేను గ్రహించేలోపే, నేను అంతరాయం కల్గించి, సంభాషణను నా వైపుకు మళ్లించుకొని ఉంటాను. నా భార్య మొహంపై ఉన్న ఆ చూపును చూసినప్పుడు నేను దాన్ని గ్రహిస్తాను, మరి నాలో నేనిలా అనుకుంటాను, ‘అయ్యో, మళ్లీ నేనలా చేశానే.’ సంభాషణ యొక్క శేష భాగంలో ఆమె ఆనందంగా పాల్గొనదని నాకు తెలుసు.”

సంభాషణకున్న వీటిని మరితర అడ్డంకులను ఎలా అధిగమించవచ్చు? ఈ కళకు ఏ లక్షణాలు ప్రాముఖ్యం? వాటినెలా అన్వయించుకోవచ్చు?

‘నేను ఏమి చెప్పగలను?’

‘నేను దేని గురించి మాట్లాడగలను?’ ‘నాకేమీ తెలియదు.’ ‘నేను చెప్పేదాన్ని ఎవరూ వినడానికి ఇష్టపడరు.’ మీకు ఈ ఆలోచనలు ఉన్నప్పటికీ, అవి బహుశా సత్యాలుకావు. మీరు గ్రహించే దానికంటే మీకు చాలా ఎక్కువే తెలుసు, మరి ఆ సమాచారంలో కొంత ఇతరులకు ఆసక్తికరంగా ఉండవచ్చు. ఉదాహరణకు, మీరు ఈ మధ్యే ఎక్కడికైనా వెళ్లి వచ్చారనుకోండి. తాము జీవిస్తున్న ప్రాంతంతో పోల్చి చూస్తే, ఆ ప్రాంతం ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకోవాలని ప్రజలు ఇష్టపడవచ్చు.

దానికి తోడు, చదవడం ద్వారా వేర్వేరు అంశాలను గూర్చిన మీ జ్ఞానాన్ని మీరు అధికం చేసుకోగలరు, చేసుకోవాలి. ప్రతిదినం ఏదైనా చదివేందుకు కొంత సమయాన్ని వెచ్చించడమనేది మంచి అలవాటు. యెహోవాసాక్షుల సాహిత్యాలు, బైబిలు అంశాలను మరియు ఎక్కువమందికి ఆసక్తిగల అంశాలను కలిగుంటాయి. మీరెంత ఎక్కువ సమాచారాన్ని పొందుతారో, మీరంత సమాచారాన్ని పంచుకోగలరు. యెహోవాసాక్షులచే ఉపయోగింపబడే ప్రతిదినము లేఖనములను పరిశీలించుట అనే చిన్న పుస్తకమందలి దిన వచనం ఒక చక్కని ఉదాహరణ. ప్రతిదినం, మీరు ఆలోచించడానికి మరియు సంభాషణలో ఉపయోగించడానికి అది ప్రతిసారి వేర్వేరు అంశాలను అందిస్తుంది.

సంభాషించడమంటే ఒక వ్యక్తే సంగతులన్నీ మాట్లాడాలని అర్థం కాదు. ఇరు వర్గాలవారు తమను తాము వ్యక్తం చేసుకోవాలి. ఎదుటి వ్యక్తి మాట్లాడడానికి అనుమతించండి. అతను నెమ్మదిగా ఉంటే, మీరు అతన్ని యుక్తమైన ప్రశ్నలచేత మాట్లాడేందుకు ప్రోత్సహించవచ్చు. మీరు ఒక పెద్దవయస్కునితో మాట్లాడుతున్నారనుకోండి. మీరతన్ని గత కాలాల సంఘటనలను గురించి మరియు అతను యౌవనంలో ఉన్నప్పటినుండి ప్రపంచం లేక కుటుంబ జీవితం ఎంతగా మారిందో మీరడుగవచ్చు. మీరు అతని మాటలను వినడాన్నిబట్టి ఆనందించవచ్చు, మరి మీరు ఎంతో నేర్చుకుంటారు.

మంచి శ్రోతగా ఉండండి

శ్రద్ధగా వినడం సంభాషణలో ఒక విలువైన లక్షణం. ఇతరులు చెప్పేదాన్ని మనం వినే విధానం, తమ భారాల విషయమై సహాయం కోరే వారికి అది మద్దతునివ్వగలదు. ‘మనుష్యులందరిలోకెల్లా పనికిరాని,’ వాడినని తననుతాను పరిగణించుకున్న ఒక వ్యక్తి, దుఃఖంలో ఉండి సహాయం కొరకు ఒక స్నేహితునికి ఫోన్‌ చేశాడు. అదెంతో అననుకూలమైన సమయమైనప్పటికీ, ఆ స్నేహితుడు దయాపూర్వకంగా విన్నాడు—రెండు గంటల సేపు! మరి ఆ వ్యక్తి ఇప్పుడు ఆ ఒక్క సంభాషణను తన జీవితంలో ఒక గొప్ప మలుపుగా భావిస్తున్నాడు. ఈ తేడాకు కారణమేంటి? “కేవలం మంచి శ్రోతగా ఉండటమే,” అని శ్రద్ధగా విన్న స్నేహితుడు చెబుతున్నాడు. “నేను జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడినట్లు నాకు జ్ఞాపకం లేదు. నేను కేవలం సరైన ప్రశ్నలను అడిగానంతే, ‘మీరు ఎందుకు అలా భావిస్తున్నారు?’ ‘అది మీకు ఎందుకు చింత కలిగిస్తుంది?’ ‘ఏది సహాయం చేయగలదు?’ అతను నా ప్రశ్నలకు జవాబు చెప్పినప్పుడు, తన వాటికి జవాబు చెప్పుకున్నాడు!”

తమతో సంభాషించడానికి సమయాన్ని వెచ్చించే తల్లిదండ్రులను పిల్లలు విలువైనవారిగా భావిస్తారు. స్కాట్‌ అనే పేరుగల ఒక యువకుడు ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “మీ తల్లిదండ్రులు మీ వద్దకు వచ్చి, మీ చింతలను గురించి తెలుసుకోవాలని ఇష్టపడితే అది చాలా మంచిది. నాన్న ఈ మధ్య అలా చేస్తున్నాడు, మరి అది సహాయకరంగా ఉంది ఎందుకంటే కొన్ని విషయాలు మీకైమీరే తెలుసుకోలేరు.”

“మీ పిల్లలు మీతో మాట్లాడేందుకు వీలయ్యే వాతావరణాన్ని మీరు సృష్టించాలని,” ఒక వ్యక్తి సలహా ఇస్తున్నాడు. తన నలుగురు పిల్లల్లో ఒకొక్కరితో ఒంటరిగా అతను కొంత సమయాన్ని క్రమంగా గడుపుతాడు, ఎందుకంటే యౌవనులు చక్కగా సర్దుకుపోయే వ్యక్తిత్వాలను పెంపొందించుకోవాలంటే వారు చెప్పేదాన్ని తల్లిదండ్రులు శ్రద్ధతో, సహానుభూతితో వినడం ప్రాముఖ్యమని అతను భావిస్తున్నాడు. ఆయనేమి సిఫారసుచేస్తున్నాడు? అవకాశాలు తలెత్తినప్పుడు మరియు పిల్లవాడు మాట్లాడాలనుకున్నప్పుడు వినడానికి సిద్ధంగా ఉండండి. “మీరు ఎంత అలసిపోయినా లేక కృంగిపోయి ఉన్నా, వాళ్లను నిరుత్సాహపర్చకండి! వినండి,” అని అతను చెబుతున్నాడు.

యథార్థమైన ఆసక్తికి ప్రతిస్పందన లభిస్తుంది

సంభాషణలో భాషించడానికి మరియు తమనుతాము వ్యక్తం చేసుకోగల్గడానికి అనేకమంది ప్రజలకు భావోద్రేక మద్దతు అవసరం. ఒక యౌవన పురుషుడిలా విలపించాడు: ‘నేను ఎవరైనా ఒకరితో మాట్లాడవల్సిన అవసరముంది, కానీ నేనెవరి వద్దకు వెళ్లగలను? మాట్లాడటం నాకు సులభం కాదు. నా పట్ల ఆసక్తి కనపర్చే వారు నాకు కావాలి!’ నిష్కల్మషమైన యథార్థమైన ఆసక్తి, నమ్మకమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించగలదు, అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మరొకరితో మాట్లాడడానికి మరియు తన భావాలు వెలిబుచ్చడానికి సులభంగా ఉంటుంది.

ఒక వ్యక్తి ఇలా తెలియజేస్తున్నాడు: “అనేక సంవత్సరాల క్రితం, నా కుటుంబ పరిస్థితులతో వ్యవహరించడం నాకు కష్టతరంగా ఉన్నప్పుడు, నేను ఒక స్నేహితునితో సంభాషించాలని ప్రయత్నించాను. అతను చెప్పిందల్లా, ‘మీరు నడుంబిగించి ఈ విషమ పరిస్థితిని సహించడానికి సిద్ధమవ్వండి, అప్పుడు అంతా చక్కబడుతుంది.’ అప్పుడు చర్చించలేదు, సంభాషించలేదు, మరి అది సహాయకరంగా లేదు. వాస్తవానికి అది నన్ను మళ్లీ నా గూటిలోకి పంపింది. దానికి భిన్నంగా, ఆ తర్వాత నేను యెహోవాసాక్షుల కాపరితో మాట్లాడాను. ఆయన చూపు, ముఖ కవళికలు మరియు ఆయన దయాగుణాన్నిబట్టి ఆయన కనికరంగలవాడని నేను తెలుసుకున్నాను. తత్ఫలితంగా, నేను కలుపుగోలుగా మారి ఎక్కువ సంభాషించగలిగాను, ఎందుకంటే ఆయన యథార్థంగా ఆసక్తి చూపాడు. ఆయనిలా చెప్పాడు: ‘మీ పరిస్థితుల్లో మీకు మద్దతునివ్వడానికి మాకు వీలైనదంతా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము.’ మీరు అలాంటి ప్రజలకే ప్రతిస్పందిస్తారు!”

మనలో అనేకులం మన హృదయాలను తెరిచి ఇతరులను అర్థవంతమైన సంభాషణలో పాల్గొనేలా చేయగలమా? గుంపుతో సంభాషణలో పాల్గొనకుండా ప్రక్కకు ఉంటూ, సంభాషించడానికి ఎక్కువ సిగ్గుపడుతున్న వారెవరైనా ఉంటే, ఆ వ్యక్తిని మన సంభాషణలో కలుపుకోడానికి మనం ప్రయత్నిస్తున్నామా? మునుపు ప్రస్తావించబడిన జాన్‌ ఇలా చెబుతున్నాడు: “నేను అలాంటి భావనను గ్రహించగలను ఎందుకంటే నన్ను నేను అతనిలో చూసుకుంటాను, మరియు నేను అతనితో పాటు బాధను అనుభవిస్తుంటాను!” అతనింకా ఇలా చెబుతున్నాడు: “మనం అతన్ని సమీపించి, అతన్ని కూడా కలుపుకోవడం ఎంత ప్రాముఖ్యమో. ఆ విషయాన్ని గురించి మనం మౌనంగా ప్రార్థించవచ్చు కూడా.”

డాన్‌ ఒక స్నేహితుని గురించి ఇలా చెబుతున్నాడు: “రాయ్‌కి సంభాషించే తన సామర్థ్యంలో అలాంటి నమ్మకం లోపించింది, అంటే ఒక గుంపు మాట్లాడుతున్నప్పుడు అతనెప్పుడూ కూడా ఓ రెండడుగులు వెనక్కి ఉండేవాడు. కాబట్టి నేను అతన్ని ఏదో ఒక ప్రశ్న అడిగేవాన్ని, ‘చెప్పండి, రాయ్‌, ఆ ఫలానీ అంశంపై మీ ఉద్దేశం ఏమిటన్నారు?’ అప్పుడు అతడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. తత్ఫలితంగా, అది ఉనికిలో ఉందని ఇతరులకు తెలియని అతని మరో పార్శ్వాన్ని చూడగలిగే వారు.” డాన్‌ ఇలా పురికొల్పుతున్నాడు: “ఒక వ్యక్తితో సంభాషించడం మరియు అతడు తననుతాను వ్యక్తం చేసుకోవడం కష్టంగా ఉంటే మీ ప్రయత్నం మానుకోకండి. మాట్లాడాలని ఇష్టపడుతున్న ఒక మంచి వ్యక్తి అతనిలో ఉన్నాడని మీకై మీరు భావించుకోండి. అతడు తననుతాను వ్యక్తం చేసుకోడానికి సహాయం చేస్తుండండి మరియు ఈ విషయమై కృషి చేస్తూ ఉండండి.”

ఇతరుల్లో ప్రేమపూర్వకమైన, యథార్థమైన ఆసక్తిని పెంపొందించుకోవడం ద్వారా, ఒకవేళ మీకు సిగ్గుపడే సమస్య ఉన్నా—మీరు ప్రయోజనం పొందుతారు. తననుతాను ఏకాంతపర్చుకునే స్వభావాన్ని అధిగమించడానికి ఇది సహాయకరంగా ఉండేదని జాన్‌ తెలుసుకున్నాడు. “ప్రేమ . . . స్వప్రయోజనమును విచారించుకొనదు,” అని అతను వివరిస్తున్నాడు. (1 కొరింథీయులు 13:4, 5) “ప్రేమపూర్వకమైన పని చేయడానికి మీరు ఇతరులతో మాట్లాడి, వారిని గురించి తెలుసుకోవాలి. మీ లోపాలకు లొంగిపోవడం మీ అవసరాలను తీర్చదు. మీరు ప్రార్థనాపూర్వకంగా మీ వ్యక్తిగత స్వభావాన్ని అధిగమించవచ్చు.” అతనింకా ఇలా చెబుతున్నాడు: “దాన్ని చేయడం వలన ఎంతో గొప్ప బహుమానం ఉంటుంది. ఇతరులు ప్రతిస్పందించడాన్ని మీరు చూసినప్పుడు, వారెలా ప్రోత్సహింపబడుతున్నారు అన్నది గమనించినప్పుడు, మీరు కూడా నిర్మింపబడతారు. మీరు పదే పదే అలా చేయడానికి అది మీకు ధైర్యాన్నిస్తుంది.”

సానుభూతి—సంభాషణ యొక్క మూలరాయి

అతి విలువైనవిగా ఎంచబడే మానవ గుణాల్లో సానుభూతి ఒకటి. అసలు సానుభూతి అంటే ఏమిటి? సానుభూతి అనేది ‘మీరు ఎదుటి వ్యక్తితో అంగీకరించినా లేక అంగీకరించక పోయినా—అతని భావాలను మరియు దృక్కోణాన్ని గుణగ్రహించగల్గడమని’ పెన్సిల్‌వేనియా రాష్ట్ర విశ్వవిద్యాలయానికి చెందిన డా. బెర్‌నార్డ్‌ గర్నీ చెబుతున్నాడు. సంభాషణలో సానుభూతి ఎంత ప్రాముఖ్యమైనది? “అది మూలరాయి! మిగతాది అంతా దానిపైననే నిర్మింపబడటానికి అదే ఆధారం.”

అన్ని మంచిసంబంధాలకు సంభాషణ జీవాధారమని డా. గర్నీ వివరిస్తున్నాడు. నిజమే, భిన్నాభిప్రాయాలు సర్వసాధారణము. వాటిని నివారించేందుకు మరియు సంబంధాన్ని పరిరక్షించేందుకు మనం సమస్యను గురించి మాట్లాడడానికి సుముఖంగా ఉండాలి. అనేకులు అలా చేయడాన్ని నివారిస్తారు ఎందుకంటే ఎదుటి వ్యక్తికి ఉద్రేకం మరియు కోపం రాకుండా ఎలా మాట్లాడాలో వారికి తెలియదు. డా. గర్నీ ప్రకారం, “అనేకమంది ప్రజలు, ఎదుటి వ్యక్తి యొక్క ఉద్దేశ్యంపట్ల గుణగ్రహణను మరియు గౌరవాన్ని, ఆ ఉద్దేశ్యాన్ని అంగీకరించడంతో గందరగోళం చేస్తున్నారు. తుదకు, వారు అంగీకరించనప్పుడు, వారు గుణగ్రహణను మరియు గౌరవాన్ని చూపరు. అంగీకారానికి మరియు గుణగ్రహణకు మధ్యనున్న వ్యత్యాసాన్ని మీరు తెలుసుకోడానికి సానుభూతి మీకు సహాయం చేస్తుంది.

మిమ్మల్ని మీరు మానసికంగా ఎదుటి వ్యక్తి స్థానంలో ఉంచుకోవడం ద్వారా, మీరు అతనిలా భావించగలరు, ఆలోచించగలరు. అలాంటి పరిస్థితుల్లో, ఒకవేళ మీరు అంగీకరించకపోయినా, ఇతరులను అర్థం చేసుకోవడం, గుణగ్రహించడం మరియు గౌరవించడం అనేవి అధికమౌతాయని మీరు తెలుసుకుంటారు.

నలుగురు పిల్లల తల్లి అయిన జానెట్‌ను గమనించండి. ఒకప్పుడు ఆమె నిరుత్సాహం చెంది, తాను పనికిరానిదాన్నని భావించేది. ఎవరికైనా సహాయం అందించడంలో సానుభూతి ఎంత ప్రాముఖ్యమైందో ఆమె ఇప్పుడు గుర్తిస్తుంది. ఆమె ఇలా చెబుతుంది: “నేను వేర్వేరు విధాలుగా ఎలా సహాయం చేస్తున్నానో వాటి గురించి నా భర్త నాతో మాట్లాడి నాకు వివరించడం నాకు జ్ఞాపకముంది, కానీ నేను మాత్రం నా క్రియలు నిష్ప్రయోజనమైనవని భావించేదాన్ని. నేను ఏడుస్తూ నా బాధలు చెప్పుకుంటున్నప్పుడు ఆయన ఎంతో ప్రేమతో విన్నారు, తర్వాత ఆయన నన్ను ప్రోత్సహించారు. అయితే ఆయన నా ఆలోచనలను చిన్నచూపు చూసి ఉంటే లేక ‘ఓహా, నీవు వట్టి తెలివిలేని దానివి,’ అని లేక అలాంటిది మరేదైనా అని ఉంటే, నేను నిశ్శబ్దంగా ఉండిపోయి నా దారిన నేను వెళ్లిపోయే దాన్ని. దానికి భిన్నంగా, ఆ సాయంత్రం మేము సుదీర్ఘంగా, అర్థవంతంగా సంభాషించాము.”

‘సానుభూతి మీరు శ్రద్ధకలిగి ఉన్నారని చూపుతుంది. అది, అనేకమంది ప్రజలకు కావలసిన మరియు అవసరమైన పరస్పర సంభాషణను అంటే భాషించడాన్ని వృద్ధిపరుస్తుందని,’ డా. గర్నీ తేల్చి చెబుతున్నాడు.

మీరు దాన్ని చేయగలరు!

మీరు చక్కని సంభాషకులుగా ఉండగలరు. సంభాషించే కళలో పాండిత్యం సంపాదించడానికి ప్రాముఖ్యమైన కొన్నింటిని మనం పరిశీలించాం, అయితే అలాంటివి అనేకానేకం ఉన్నాయి. కొన్ని చెప్పాలంటే స్నేహశీలత, హాస్యగుణం మరియు నిపుణత అందులో ఇమిడి ఉన్నాయి. అయితే ఒక అందమైన చిత్రపట్టాన్ని సృష్టించడానికి, తర్ఫీదు మరియు శిక్షణ ద్వారా తన కుంచెను క్యాన్‌వాస్‌పై నిపుణతతో అలవోకగా ఆడించే చిత్రకారుని వలె, ఆవశ్యకమైన ఈ లక్షణాలను వృద్ధిపర్చుకోడానికి మనం కృషి చేయాలి.

ఉదాహరణకు, డాన్యెల్‌ చక్కని సంభాషకుడు అయ్యాడు. ఎలా? సంభాషణలకు అంతరాయం కలిగించి వాటిని తన వైపుకు మళ్లించుకునే తన స్వభావాన్ని అదుపు చేసుకోవడాన్ని నేర్చుకోడం ద్వారా. ఆయనిలా ఒప్పుకుంటున్నాడు: “ఓ సంభాషణను నా వైపుకు మళ్లించుకోకుండా ఉండడానికి నేను శాయశక్తులా ప్రయత్నించాలి. దానర్థం నేను నా నాలుకకు కళ్లెం వేయాలి. సంభాషణకు కొంత మెరుగులు దిద్దాలని నాకనిపించినప్పుడు, నేను మానసికంగా అడ్డంకులను వేసుకుంటాను! ఏదైనా ఒక వ్యాఖ్యానం సంభాషణాదిశను మళ్లిస్తుందని లేక ఇతరుల సంభాషణా సామర్థ్యాన్ని తీసివేస్తుందని నేను భావించినప్పుడు నేను దాన్ని చెప్పనే చెప్పను!”

ఎలాన్‌కు ఏది సహాయం చేసింది? ఆమె బైబిలు యొక్క కచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత, తాను మాట్లాడటానికి విలువైన మరియు ఘనమైన విషయం ఉందని ఆమె గ్రహించింది. తాను ఇలా చెబుతుంది: “నేను నాపైనుండి అవధానాన్ని మళ్లించి, ఇతరులతో ఆత్మీయ విషయాలను గూర్చి మాట్లాడినప్పుడు నేను సులభంగా సంభాషించగలనని తెలుసుకున్నాను. మనం క్రమంగా అందుకునే బైబిలు ఆధారిత సాహిత్యాలను చదవడం కూడా సహాయకరంగా ఉంటుంది. నేను వాటిని ఎప్పటికప్పుడు చదివినప్పుడు, నేను పంచుకోడానికి క్రొత్త మరియు తాజా విషయాలు నావద్ద ఉంటాయి, మరి నేను ఎక్కువ సులభంగా సంభాషించగలను.”

మీ సంభాషణలో ఈ ప్రాముఖ్యమైన లక్షణాలను వృద్ధిపర్చుకోడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు కూడా ఇతరులకు ఉల్లాసాన్ని, ఆనందాన్ని తీసుకురాగలరు మరియు మానవ అవసరతను ఒకదాన్ని వాస్తవంగా తీర్చే ఒక కళలో మీరు పాండిత్యం పొందారన్న సంతృప్తి మీకు లభిస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి