కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 12/8 పేజీలు 12-14
  • నేను మరింత కలివిడిగా ఎలా ఉండగలను?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేను మరింత కలివిడిగా ఎలా ఉండగలను?
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మిమ్మల్ని మీరు అల్పులుగా ఎంచుకోవడం మానుకోండి
  • ఇతరులపై ఆసక్తి ఉంచండి
  • ప్రేమచేత పురికొల్పబడి
  • నేను మరింత కలివిడిగా ఎందుకు ఉండలేకపోతున్నాను?
    తేజరిల్లు!—1999
  • సిగ్గు, మొహమాటం ఎలా తగ్గించుకోవచ్చు?
    యువత అడిగే ప్రశ్నలు
  • సంభాషణ ఒక కళ
    తేజరిల్లు!—1995
  • సంభాషణా సామర్థ్యాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చు?
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
తేజరిల్లు!—1999
g99 12/8 పేజీలు 12-14

యువత ఇలా అడుగుతోంది . . .

నేను మరింత కలివిడిగా ఎలా ఉండగలను?

“నేను ఎప్పుడూ అంతగా మాట్లాడేవాడ్ని కాను. నేను ఏమైనా మాట్లాడితే, నన్ను తప్పించుకోవడానికి చూస్తారేమోనని భయపడేవాడ్ని. మా అమ్మ చాలా బిడియస్థురాలు, అందుకే కావచ్చు నాకూ ఈ బిడియం అని నేను అనుకుంటున్నాను.”—ఆర్టీ.

బిడియం లేకుండా, మరింత స్నేహశీలిగా, మరింత కలివిడిగా ఉంటే బాగుండునని మీరు కొన్నిసార్లు కోరుకుంటుంటారా? ఈ పరంపరలోని ముందటి శీర్షికలో పేర్కొన్నట్లు, బిడియం అనేది సాధారణంగా ఉండే ఒక లక్షణమే.a కనుక, మీరు నిశ్శబ్దంగా, గంభీరంగా లేక మితభాషిగా ఉంటున్నట్లయితే నిజానికి అందులో తప్పేమీ లేదు. కాని అమిత బిడియం నిజంగానే ఒక సమస్య కావచ్చు. అమిత బిడియం వల్ల పెద్ద నష్టమేమీ లేకపోయినప్పటికీ, మీరు స్నేహాలను ఆస్వాదించడానికి అది ఆటంకం కావచ్చు. బిడియం మూలంగా, నలుగురిలో ఉండడం మీకు ఇబ్బందిగా ఉండవచ్చు, సరైన విధంగా ప్రవర్తించలేకపోవచ్చు.

పెద్దవాళ్ళు సహితం తరచూ బిడియంతో పోరాడుతూ ఉంటారు. బ్యారీb క్రైస్తవ సంఘంలో ఒక పెద్ద. కానీ ఆయన గుంపులో ఉన్నప్పుడు మాట్లాడరు. “అర్థవంతమైనదేదైనా చెప్పే సామర్థ్యం నాకుందని నేననుకోను” అని ఆయన అంటున్నారు. ఆయన భార్య డైయన్‌కు కూడా అలాంటి సమస్యే ఉంది. ఆమె కనుగొన్న పరిష్కార మార్గం ఏమిటి? “బాగా కలివిడిగా ఉండే వ్యక్తులైతే వాళ్ళే సంభాషణను సాగిస్తారు గనుక, అలాంటి వాళ్ళతో ఉండేందుకు ఇష్టపడతాను” అని ఆమె చెబుతుంది. మీరు మరింత కలివిడిగా ఉండే వ్యక్తులుగా మారేందుకు కొన్ని మార్గాలు ఏమిటి?

మిమ్మల్ని మీరు అల్పులుగా ఎంచుకోవడం మానుకోండి

మొదటిగా, మిమ్మల్ని గురించిన మీ దృక్కోణాన్ని తిరిగి మదింపు చేసుకోవలసిన అవసరం ఉండవచ్చు. ఇతరులకు మీరంటే ఇష్టముండదనీ లేదా మీ దగ్గర చెప్పదగ్గ విషయాలేమీ లేవనీ మీకు మీరు చెప్పుకుంటూ ఎడతెగక మిమ్మల్ని మీరు అల్పులుగా ఎంచుకుంటున్నారా? మీ గురించి మీరు న్యూనతానుభూతులు కలిగి ఉంటే, మీరు ఇతరులతో కలివిడిగా ఉండకుండా అవి ఆటంకపరుస్తాయే తప్ప ఒరిగేదేమీ లేదు. అంత కన్నా ముఖ్యంగా, యేసు చెప్పింది, “నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను” అనే—మిమ్మల్ని మీరు ప్రేమించు కోకుండా పొరుగువారిని ప్రేమించమని కాదు. (మత్తయి 19:19) కనుక మిమ్మల్ని మీరు సహేతుకమైనంత పరిధి వరకు ప్రేమించుకోవడం ఆరోగ్యకరం, సముచితమైనది కూడానూ. అలా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఇతరులను సమీపించేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని కూడా మీకు ఇవ్వగలదు.

అల్పుడనన్న అనుభూతులు మిమ్మల్ని బాధిస్తున్నట్లయితే, యువత అడిగే ప్రశ్నలూ—ఆచరణాత్మకమైన సమాధానాలూc (ఆంగ్లం) అనే పుస్తకంలో ఉన్న, “నన్ను నేను ఎందుకు ఇష్టపడను?” అనే 12వ అధ్యాయాన్ని చదవడం సహాయకరంగా ఉండవచ్చు. ఆ సమాచారం, ఒక వ్యక్తిగా మీ దగ్గర విలువైనవి ఉన్నాయని మీరు గ్రహించేందుకు సహాయపడగలదు. అంతెందుకు, మీరు ఒక క్రైస్తవుడు అన్న వాస్తవమే దేవుడు మీలో విలువైనదేదో చూశాడని చూపిస్తుంది ! ఎంత కాదన్నా, “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు” అని యేసే అన్నాడు.—యోహాను 6:44.

ఇతరులపై ఆసక్తి ఉంచండి

“వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు” అని సామెతలు 18:1 హెచ్చరిస్తుంది. అవును, మిమ్మల్ని మీరు వేరుపరచుకుంటున్నారంటే, మీరు మీపై అమిత అవధానాన్ని ఉంచుకుంటున్నారన్నమాట. ‘సొంతకార్యములను మాత్రమేగాక యతరుల కార్యములను కూడ చూసేవాళ్ళమై’ ఉండాలి అని ఫిలిప్పీయులు 2:4 మనల్ని ప్రోత్సహిస్తుంది. మీరు ఇతరుల ఆసక్తులపైనా, అవసరాలపైనా అవధానాన్ని కేంద్రీకరించినప్పుడు, మీ గురించి మీరు అతిగా చింతిస్తూ ఉండరు. మీరు ఇతరుల గురించి ఎంత ఎక్కువగా శ్రద్ధ వహిస్తే, మీరు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి చొరవతీసుకునేందుకు అంత ఎక్కువగా కదిలించబడతారు.

ఉదాహరణకు, లూదియ అనే స్త్రీనే తీసుకోండి. ఆమె, స్నేహశీలానికీ ఆతిథ్యానికీ ప్రతీకగా పేరు పొందింది. ఆమె అపొస్తలుడైన పౌలు మాటలను విని, బాప్తిస్మం పొందిన తర్వాత, “నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యంటికి వచ్చియుండుడని” పౌలునూ, ఆయన సహచరులనూ బ్రతిమాలింది అని బైబిలు మనకు చెబుతుంది. (అపొస్తలుల కార్యములు 16:11-15) లూదియ క్రొత్త విశ్వాసి అయినప్పటికీ, ఈ సహోదరుల గురించి తెలుసుకునేందుకు చొరవతీసుకుంది. దాని ఫలితంగా ఆమె అనేక ఆశీర్వాదాలను పొందింది అనడంలో సందేహం లేదు. పౌలు, సీలలు జైలు నుండి విడుదల పొందిన తర్వాత, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు తిరిగి లూదియ ఇంటికి వెళ్ళారన్నది ఆసక్తికరమైన విషయం !—అపొస్తలుల కార్యములు 16:35-40.

అలాగే, తమపై మీరు చూపించే ఆసక్తికి చాలా మంది ప్రతిస్పందించడాన్ని మీరు చూస్తారు. మీరు ఇతరులపై ఆసక్తి చూపించడాన్ని ఎలా మొదలుపెట్టవచ్చు? ఇక్కడ కొన్ని సహాయకరమైన సూచనలు ఇస్తున్నాం.

● చిన్నగా మొదలుపెట్టండి. కలివిడిగా ఉండడమంటే, ఇతరులపై మరీ అతిగా శ్రద్ధ చూపించడమని గానీ, అదే పనిగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడమని గానీ భావం కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీరు క్రైస్తవ కూటానికి వెళ్ళిన ప్రతిసారీ కనీసం ఒక్కరితోనైనా మాట్లాడాలన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. చిరునవ్వు నవ్వడానికి ప్రయత్నించండి. కళ్ళలోకి చూడడం నేర్చుకోండి.

● సంభాషించడంలోని తొలి ఆటంకాలను అధిగమించండి. వాటిని అధిగమించడం ‘ఎలా?’ అని మీరు అడగవచ్చు. మీకు ఇతరుల మీద నిజంగానే ఆసక్తి ఉన్నట్లయితే, మాట్లాడగల విషయాలను కనుగొనడం సాధారణంగా అంత కష్టంగా ఉండదు. స్పెయిన్‌లోని హార్‌హే అనే ఒక యౌవనస్థుడు, “ఎలా ఉన్నారు, మీ పని ఎలా సాగుతోంది అని అడిగితే చాలు, వాళ్ళ గురించి మరింత తెలుసుకునేందుకు వీలవుతుంది అని నేను గమనించాను” అని అంటున్నాడు. “ఏమని మాట్లాడాలో మీకు తెలియకపోతే, మీరు ప్రశ్నలు వేయడం మొదలుపెట్టండి” అని ఫ్రెడ్‌ అనే యౌవనస్థుడు సూచిస్తున్నాడు. అయితే మీరు అలా ప్రశ్నలు వేస్తున్నప్పుడు మీరు వాళ్ళను ఇంటరాగేట్‌ చేస్తున్నట్లు వాళ్ళకు అనిపించకూడదు. ఒక వ్యక్తి జవాబివ్వడానికి నిరాకరిస్తున్నట్లయితే, మీ గురించి మీరు కొంత చెప్పడానికి ప్రయత్నం చేయండి.

ఒక టీనేజర్‌కి తల్లియైన మేరీ, “ప్రజలకు ఇబ్బందిలేకుండా ఉండేందుకు, వాళ్ళు తమ గురించి మాట్లాడడానికి అనుమతించడమే శ్రేష్ఠమైన మార్గం అని కనుగొన్నాను” అని అంటున్నారు. “ప్రజల డ్రెస్‌ గురించి లేదా మరి దేని గురించైనా మెచ్చుకోవడానికి అది సహాయపడుతుంది. వాళ్ళంటే మీకు ఇష్టం అన్న అనుభూతి వాళ్ళకు కలిగించండి” అని యౌవనస్థురాలైన కేట్‌ అంటోంది. అవును, కపటం లేకుండా మాట్లాడండి, అవాస్తవమైన ముఖస్తుతి చేయకండి. (1 థెస్సలొనీకయులు 2:5) దయాపూర్వకమైన ఆహ్లాదకరమైన యథార్థమైన మాటలకు ప్రజలు సాధారణంగా స్పందిస్తారు.—సామెతలు 16:24.

● మంచి శ్రోతగా ఉండండి. ‘వినుటకు వేగిరపడువారుగాను, మాటలాడుటకు నిదానించువారుగాను ఉండండి’ అని బైబిలు చెబుతుంది. (యాకోబు 1:19) అంతేకాదు, సంభాషణ అంటే ఒకరితో ఒకరు మాట్లాడడం—ఏకపాత్రాభినయంలా ఒక్కరే మాట్లాడడం కాదు. మీరు మాట్లాడడానికి బిడియపడుతున్నారా, కాస్త బిడియపడడం నిజానికి ప్రయోజనకరంగా ఉండగలదు! మంచి శ్రోతలుగా ఉంటే ప్రజలు మెచ్చుకుంటారు.

● మీరు కూడా చేరండి. ఒక్కొక్కరితో మాట్లాడడంలో పట్టు సాధించాక, గుంపుల్లో మాట్లాడడం మొదలుపెట్టండి. క్రైస్తవ కూటాలు జరిగే స్థలాలు, ఈ నైపుణ్యాన్ని సంపాదించుకోవడానికి కూడా తగిన స్థలాలే. కొన్ని సార్లు, ఒక గుంపులో చేరే అతి సులభమైన మార్గం ఏమిటంటే, అప్పటికే జరుగుతున్న సంభాషణలో పాల్గొనడమే. నిజమే, వివేచనా, మంచి మర్యాదలూ అక్కడ అవసరమే. వ్యక్తిగతమైన విషయాలను మాట్లాడుకుంటున్నట్లు స్పష్టమైతే, అకస్మాత్తుగా మధ్యలో దూరకండి. ఒక గుంపులోని వ్యక్తులు మామూలు విషయాల గురించి మాట్లాడుకుంటున్నట్లు స్పష్టమైతే, మీరూ ఆ గుంపులో కలిసేందుకు ప్రయత్నం చేయండి. లౌక్యంగా ఉండండి; మధ్యలో జొరబడకండి లేదా డామినేట్‌ చేయడానికి ప్రయత్నించకండి. కొంచెం సేపు శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మీరు మాట్లాడేందుకు వీలు కలిగినప్పుడు మీరు కొన్ని వ్యాఖ్యలను చేయడానికి మొగ్గు చూపవచ్చు.

● మీ నుండి మీరు పరిపూర్ణతను ఆశించకండి. తప్పులు ఏమైనా దొర్లుతాయేమో అని కొన్నిసార్లు యౌవనస్థులు అతిగా చింతిస్తూ ఉంటారు. ఇటలీలోని ఏలీజా అనే ఒక అమ్మాయి, “నేను ఏమైనా చెబితే, సరిగ్గా చెప్పగల్గుతానో లేదో, ఎక్కడ ఏ తప్పు దొర్లుతుందో అని ఎప్పుడూ భయపడేదాన్ని” అని గుర్తు చేసుకుంటుంది. అయినప్పటికీ, మనమందరమూ అపరిపూర్ణులం గనుక, మనం పరిపూర్ణమైన మాటలనే మాట్లాడాలంటే అసాధ్యం అని బైబిలు గుర్తు చేస్తుంది. (రోమీయులు 3:23; పోల్చండి యాకోబు 3:2.) “వీళ్ళు నా స్నేహితులు కనుక, నేను ఒకవేళ తప్పు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటారు అని గ్రహించాను” అని ఏలీజా అంటోంది.

● మీరు హాస్య భావాన్ని కాపాడుకోండి. అనుకోకుండా తప్పు దొర్లితే బెంబేలెత్తిపోతామన్నది నిజమే. ఫ్రెడ్‌ చెబుతున్నట్లు, “మీరు గాబరా పడకుండా మీ గురించి మీరే నవ్వుకుంటే, ఆ సమయం త్వరగా గడిచిపోతుంది. మీరు కంగారుపడుతూ, నిరాశలో, లేదా బాధలో మునిగిపోయేందుకు మిమ్మల్ని మీరు అనుమతించినప్పుడు మీరు చిన్న విషయాన్నే కొండంత చేసుకున్నవారౌతారు.”

● ఓపిక కలిగి ఉండండి. వెంటనే అందరూ ప్రతిస్పందించరు అని గ్రహించండి. సంభాషిస్తుండగా ఆయన మనస్సు ఎక్కడికో పోవడమూ, బదులివ్వకపోవడమూ జరిగినంత మాత్రాన ఆ మనిషికి మీరంటే ఇష్టం లేదనీ, మీరు ఇక ఆయనతో మాట్లాడే ప్రయత్నాన్ని విరమించుకోవాలనీ కాదు. కొన్ని సార్లు ప్రజలు ఏదో ఆలోచిస్తూ ఉండిపోతారు, లేదా మీలాగే బిడియస్తులు అయ్యుంటారు. అలాంటి పరిస్థితుల్లో, ఆ వ్యక్తులకు మీతో ఉండడం హాయిగా ఉందనిపించేందుకు కొంచెం ఎక్కువ సమయాన్నివ్వడం సహాయకరంగా ఉండవచ్చు.

● వయోజనులతో మాట్లాడడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు, వయోజనులు, ముఖ్యంగా పరిణతి చెందిన క్రైస్తవులు, బిడియంతో పోరాడుతున్న యౌవనస్థుల మీద చాలా సానుభూతిని చూపిస్తారు. కనుక వయస్సులో పెద్దవారైన ఒకరితో సంభాషణ ప్రారంభించే ప్రయత్నం చేయడానికి భయపడవద్దు. “నా తోటి పిల్లల్లాగా, పెద్దవాళ్ళు నన్ను వీడిలాంటివాడు అలాంటివాడు అని తీర్పు తీర్చరు, ఎగతాళి చేయరు, నన్ను కలతపరచరు కనుక, వాళ్ళ మధ్యన చాలా ప్రశాంతంగా ఉండగలను” అని కేట్‌ అంటుంది.

ప్రేమచేత పురికొల్పబడి

ఈ సూచనలు సహాయపడవచ్చు, అయినప్పటికీ, బిడియాన్ని అధిగమించేందుకు సులభమైన సూత్రమేదీ లేదు. బిడియం, తెలివైన టెక్నిక్‌తోనో లేదా పద్ధతితోనో అధిగమించగల విషయం కాదు. బిడియాన్ని అధిగమించేందుకు కీలకం “నీవలె నీ పొరుగువాని ప్రేమించ”డంలోనే ఉంది. (యాకోబు 2:8) అవును, ఇతరుల మీద—ముఖ్యంగా మీ క్రైస్తవ సహోదర సహోదరీల మీద శ్రద్ధ చూపడం నేర్చుకోండి. (గలతీయులు 6:10) మీ హృదయంలో మీకు యథార్థమైన ప్రేమ ఉంటే, మీరు భయాన్నీ అభద్రతా భావాన్నీ అధిగమించి, ఇతరులలో కలిసేందుకు ప్రయత్నం చేస్తారు. యేసు చెప్పినట్లు, “హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును.”—మత్తయి 12:34.

మొదట్లో పేర్కొనబడిన బ్యారీ, “నేను ఇతరులను ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, వాళ్ళతో మాట్లాడడం నాకు అంత సులభమౌతుంది” అని పేర్కొంటున్నారు. మరో మాటలో చెప్పాలంటే, మీరు కలివిడిగా ఉండేందుకు ఎంత ఎక్కువగా అభ్యాసం చేస్తే, అంత సులభం అవుతుంది. మీరు క్రొత్త స్నేహితులను సంపాదించుకుని, మీరు ఇతరుల చేత అంగీకరించబడుతున్నారన్న అనుభూతి అధికంగా పొందుతుండగా, మీ ప్రయత్నానికి తగిన ఫలితం దొరుకుతుందని మీరు భావిస్తారనడంలో సందేహం లేదు!

[అధస్సూచీలు]

a నవంబరు 8, 1999 సంచికలో, “యువత ఇలా అడుగుతోంది . . . నేను మరింత కలివిడిగా ఎందుకు ఉండలేకపోతున్నాను?” అనే శీర్షికను చూడండి.

b కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

c వాచ్‌టవర్‌ బైబిల్‌ ఆండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించినది.

[14వ పేజీలోని చిత్రం]

చొరవ తీసుకుని, సంభాషణల్లో చేరండి!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి