కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 4/8 పేజీలు 16-18
  • మొసలిని నిశితంగా పరిశీలించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మొసలిని నిశితంగా పరిశీలించడం
  • తేజరిల్లు!—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘నదీ నేత్రాల’ విషయంలో జాగ్రత్తగా ఉండండి!
    తేజరిల్లు!—1996
  • మొసలిని చూసి మీరు చిరునవ్వు చిందించగలరా?
    తేజరిల్లు!—2005
  • మొసలి దవడ
    తేజరిల్లు!—2015
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1996
తేజరిల్లు!—1995
g95 4/8 పేజీలు 16-18

మొసలిని నిశితంగా పరిశీలించడం

కెన్యాలోని తేజరిల్లు! ప్రతినిధి

ఒక అమెరికా పర్యాటకుడు, మారా నది ఒడ్డున ఆతురతతో ఖడ్గమృగాల ఫోటోలను తీస్తున్నాడు. అనుకోకుండా అతని కాలుజారి నీళ్లలో పడిపోయాడు. ఇది కాస్తా, ఆ సమయంలో సూర్యరశ్మిని అనుభవిస్తున్న ఒక దళసరి చర్మంగల ప్రాణి దృష్టిని, అదే మొసలి దృష్టిని ఆకర్షించింది. ఈ సరీసృపము సాధారణంగా చేపలు తినేదైనా, ఈ రుచికరమైన ఆహారం కంటపడే సరికి అది తన జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేక పోయింది. వెంటనే అది వెదకడానికి నీళ్లలోకి జారుకుంది. అదృష్టవశాత్తు ఆ పర్యాటకుడు మొసలి రావడం చూశాడు, అతను వెంటనే—నీటిపై నడిచినంత త్వరగా నదిలోనుండి పారిపోయాడు!

ఆఫ్రికా నదులు, సరస్సులు మరియు గుంటలను దర్శించే పర్యాటకులు తరచూ మొసళ్లను దగ్గరనుండి చూడగలరు, అయితే పైన పేర్కొనబడిన భయకంపితుడైన ఆ పర్యాటకునికి అది అలా తారసిల్లటం మరీ దగ్గరగా అనిపించి ఉండవచ్చు. కెన్యా, సైల్‌ మొసలికి పుట్టిల్లు. స్థానిక స్వాహిలీ భాషలో దాన్ని క్లుప్తంగా మాంబా అని పిలుస్తారు. మొసళ్లు 7 మీటర్ల పొడవు పెరగగల సరీసృపాలు, ఇవి నేలపైనా అలాగే నీళ్లలోను చురుకుగా చరించగలవు. చదునైన, తెడ్డువంటి ఆకారంగల వాటి తోకల మూలంగా నీటిలో అవి ఎంతో వేగంగా వెళ్లగలవు. అవి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదగలవు! మరి రెండు లేక మూడు గంటలవరకు అవి నీటిలోపల ఉండగలగటం వాటికి మామూలే. నేలపై ఉన్నప్పుడు అవి కొద్దిదూరం, చాలా వేగంగా పరిగెత్తగలవు.

కాబట్టి, ఈ మొసలినే దేవుని భయంకరమైన సృష్టికి ఒక ఉదాహరణగా లివాయతాన్‌ (మకరము) అని పిలువబడే దాన్ని బైబిలు సూచించడంలో ఆశ్చర్యం లేదు. యోబు 41:8, 10 ఇలా చెబుతుంది: “దానిమీద నీ చెయ్యి వేసి చూడుము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసికొనిన యెడల నీవు మరల ఆలాగున చేయకుందువు. . . . దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు.” చాలా తెలివైన హెచ్చరికలు! మోరిస్‌ రిచ్చర్డ్‌సన్‌ వ్రాసిన ద ఫ్యాసినేషన్‌ ఆఫ్‌ రెప్‌టైల్స్‌ అనే పుస్తకం ప్రకారం, మొసళ్లు అవుట్‌బోర్డ్‌ మోటర్‌బోట్‌లపై కూడా దాడి చేయగలవని ప్రసిద్ధిచెందాయి! యోబు 41:25 సముచితంగా ఇలా చెబుతుంది: “అది లేచునప్పుడు బలిష్ఠులు భయపడుదురు అధిక భయముచేత వారు మైమరతురు.”

పొలుసులుగల ఈ చరాన్ని చూసి ప్రజలెందుకు భయకంపితులై పారిపోతారు? ఒక కారణాన్ని 14వ వచనం వివరిస్తుంది: “దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్లచుట్టు భయకంపములు కలవు.” మొసలి దవడలు రెండింటిలో, పైదాంట్లోను క్రిందిదాంట్లోను వేర్వేరు పరిమాణాలుగల 24 పళ్లవరకు ఉంటాయి, మరియు దాని జీవితకాలంలో అవన్నీ కూడా ఊడిపోయి మళ్లీ వస్తుంటాయి. ఆసక్తికరంగా, మొసలి క్రింది దవడలోని నాల్గవపన్ను, పై దవడలోని ఒక సందులో బయటివైపున సరిగ్గా కూర్చుంటుంది, అది దవడలు మూసుకుని ఉన్నప్పుడు కూడా సులభంగా కనిపిస్తుంది. తన జాతివంటిదైన మరో రకపు మొసలికి ఇది వేరై ఉన్నదని గుర్తించడానికి ఇది సహాయం చేస్తుంది. అయితే సమస్యేమంటే, ఈ చిన్న దంతపరీక్ష చేయడంలో మీరు మరీ దగ్గరకుపోతే, మొసలి పళ్లను అన్నింటినీ మీరు లోపలినుండి పరీక్షిస్తున్నట్లు ఉంటుంది, అంటే దాని నోట్లోకి వెళ్లే ప్రమాదముంది!

అందుకే మీరు మొసలిని ఒక అనుకూలమైన, సురక్షిత స్థలంనుండి, చూడాలని ఇష్టపడవచ్చు, మీరలా చేయడానికి కెన్యాలో అలాంటి స్థలాలెన్నో ఉన్నాయి. ఉదాహరణకు, మెంబాసాలోని మాంబా గ్రామం మొసళ్లు స్వాధీనంలో పెంచబడే స్థలం.

‘అసలు మొసళ్లనెందుకు పెంచాలనుకుంటారని,’ మీరు అడగవచ్చు. ఒక కారణమేమంటే, అవి అంతరించిపోకుండా పరిరక్షించడానికే. అడవుల్లో, మొసళ్లు వాటి జీవితపు మొదటి సంవత్సరంలోనే 99 శాతం చనిపోతాయి. ఉడుము బల్లులు, మరాబూ కొంగలు మరియు కొందరు ప్రజలు సహితం మొసలి గుడ్లను, వాటి చిన్న పిల్లలను తినడానికి ఇష్టపడుతున్నట్లు కనిపిస్తుంది. అయితే, మొసళ్ల ఫారమ్‌లో శ్రద్ధ తీసుకొనబడుతున్న మొసళ్లు చనిపోయే అవకాశం 10 శాతం కంటే తక్కువ అవుతుంది. ఒక సంవత్సరంలోనే, చిన్న మొసళ్లు 1.5 మీటర్ల పొడవు పెరుగుతాయి—అనేక ప్రమాదాలను ఎదుర్కొనగల్గేంత పెద్దగా అవుతాయన్నమాట. అడవుల్లోని చిన్న మొసళ్లు అంత పొడవు పెరగడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టవచ్చు.

మొసళ్ల ఫారమ్‌లు ఈ జీవులను వ్యాపారం నిమిత్తం కూడా పెంచుతాయి. విదేశీ మార్కెట్‌లో, మొసళ్ల ఉదరం యొక్క మెత్తని చర్మంతో చేయబడిన జోళ్లు (షూస్‌), బెల్టులు, చేతి సంచీలు (హ్యాండ్‌బ్యాగ్‌లు) మరియు ఇతర ఫ్యాషన్‌ వస్తువులను మీరు కనుగొనగలరు. మాంబా గ్రామంనుండి ఇటలీ మరియు ఫ్రాన్స్‌ వంటి ఇతర దేశాలకు సాంవత్సరికంగా దాదాపు 2,000 చర్మాలు చర్మశుద్ధి కొరకు ఎగుమతి చేయబడుతున్నాయి. ఆ జంతువు యొక్క మిగతా భాగానికి ఏమౌతుంది? కెన్యాలో, పర్యాటకుల కొరకు మొసలి మాంసం రుచికరమైన ఆహారంగా ఉపయోగింపబడుతుంది.

అక్టోబరు నుండి ఏప్రిల్‌ వరకు మొసళ్లు పొదిగే కాలం. అడవుల్లో ఆడ మొసలి 20 నుండి 80 గుడ్లను ఎక్కడైనా పెడుతుంది. ఆ సమయంలోనే, నిర్బంధింపబడి ఉన్న ఆడ మొసళ్లు 36 గుడ్లను వేర్వేరు నీటి కొలనుల చుట్టూ పొదిగే స్థలాలో పెడతాయి. ఆ గుడ్లు సమకూర్చబడి పొదిగించబడటానికి ఇన్‌క్యుబేటర్‌లకు తీసుకువెళ్లబడతాయి. దీనికి దాదాపు మూడు నెలలు పడుతుంది.

ఈ ఆసక్తికరమైన ప్రాణులను సురక్షితంగా గమనించడానికి మాంబా గ్రామం చక్కని అవకాశాన్నిస్తుంది. అది మొసళ్ల ఫారమ్‌, ఓషధి శాస్త్ర తోట (బొటానికల్‌ గార్డన్‌), జలజంతు ప్రదర్శనస్థలం (మరైన్‌ అక్వేరియం) మరియు వినోద స్థలంగా ఉండటానికి పునర్‌రూపొందించబడిన 20 ఎకరాల గని దగ్గర ఉంది. ఈ సరీసృపాల్లో 10,000 కంటే ఎక్కువ ఇక్కడ జీవిస్తాయి. అయితే, మీరు వీటన్నిటినీ చూడలేరు. కానీ రెండు పొదిగే స్థలాల్లో మీరు వందకంటే ఎక్కువ పెద్దవాటిని చూడగలరు, మరి ఇతర స్థలాల్లో పెరుగుదల యొక్క అన్ని దశల్లోని వందలకొలది చిన్న మొసళ్లు అక్కడ ఉన్నాయి.

భోజన సమయాల్లో మొసళ్లు ఆసక్తికరంగా ప్రవర్తిస్తాయి. కొలనుకు పైగా వ్రేలాడ దీసిన మాంసాన్ని అందుకోడానికి కొన్ని నీళ్లలోనుండి పైకి కూడా ఎగురుతాయి. టానా నది ప్రాంతంలోని ప్రజలను భయభీతులను చేసిన, బిగ్‌ డాడీ అనే పేరుగల ప్రఖ్యాతిగాంచిన మొసలిని మీరు ఇక్కడ చూడగలరు, అది చెరపట్టుకొనబడి, ఫారమ్‌కు తీసుకురాబడక ముందు కనీసం ఐదుగురిని చంపింది. మొసళ్లను ముఖాముఖిగా చూడటం మీకు భయాన్ని కలిగిస్తే, మీరు వీడియో థియేటర్‌లో వాటిని చక్కగా చూడగలరు.

మీరు మొసళ్లను దగ్గరనుండి చూడటం మీకు ఆసక్తికరంగా ఉండవచ్చు లేక భీతి కలిగించవచ్చు. అయితే యోబు 41:34 నందు “గర్వించిన జంతువులన్నిటికి అది రాజు,” అని బైబిలు మొసలిని గురించి ఎందుకు చెప్పిందో మీరు సరిగ్గా అర్థం చేసుకోగలరు.

[17వ పేజీలోని చిత్రం]

కుడివైపు: మాంబా గ్రామపు విహంగదృశ్యం

[17వ పేజీలోని చిత్రం]

దూరాన ఎడమవైపు: భోజన సమయంలో ఒక మొసలి మాంసాన్ని అందుకోడానికి నీళ్లలోనుండి పైకి ఎగరడం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి