కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w26 మే పేజీలు 20-25
  • అదనంగా చదువుతున్నా యెహోవాకు దగ్గరగా ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అదనంగా చదువుతున్నా యెహోవాకు దగ్గరగా ఉండండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాకు దగ్గర చేసే పనుల్ని మానకండి
  • మీ “ఆలోచనా సామర్థ్యాల్ని” కాపాడుకోండి
  • మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి
  • “తెలివిగలవాళ్లతో” స్నేహం చేయండి
  • అదనంగా చదివినా యెహోవాను సంతోషపెడుతూనే ఉండొచ్చు
  • అదనపు విద్య విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం, ప్రాంతీయ పర్యవేక్షకునితో
  • మనకు తెలియనివి తెలీదని ఒప్పుకోవాలంటే వినయం కావాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • బాప్తిస్మం తర్వాత కూడా యేసును “అనుసరిస్తూ ఉండండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
w26 మే పేజీలు 20-25

జూలై 27–ఆగస్టు 2, 2026

పాట 56 సత్య మార్గంలో నడవండి

అదనంగా చదువుతున్నా యెహోవాకు దగ్గరగా ఉండండి

“మనం ప్రగతి సాధించినమేరకు ఇదే పద్ధతిలో ముందుకు సాగిపోతూ ఉందాం.”—ఫిలి. 3:16.

ముఖ్యాంశం

స్కూల్‌ చదువు పూర్తయ్యాక, అదనంగా చదవాలని నిర్ణయం తీసుకుంటే మీరు యెహోవాకు దూరం అవ్వకుండా, ఆయనతో బలమైన బంధం పెంచుకోవడానికి సహాయం చేసే నాలుగు బైబిలు సూత్రాల్ని పరిశీలిస్తాం.

1-2. (ఎ) మీరు ఇంకా చదవాలని అనుకుంటే, ఏం చేస్తూ ఉండాలి? (బి) “ఇదే పద్ధతిలో ముందుకు సాగిపోతూ ఉందాం” అనే మాటకు అర్థమేంటి? (ఫిలిప్పీయులు 3:16)

స్కూల్‌ చదువు అయిపోయిన తర్వాత కూడా ఇంకా చదవాలని కొంతమంది యెహోవాసాక్షులు అనుకోవచ్చు. వాళ్లు కొన్ని కోర్సులు చేయవచ్చు లేదా ట్రైనింగ్‌ తీసుకోవచ్చు. యెహోవా సేవ చేస్తూ, వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడడానికి ఆ చదువులు సహాయం చేస్తాయని వాళ్లు అనుకోవచ్చు. మీ నిర్ణయం కూడా అదే అయితే యెహోవాకు దూరం అవ్వకుండా ఉండేలా ఎలా జాగ్రత్త పడొచ్చు? (యాకో. 4:8ఎ) స్కూల్లో చదువుకునేటప్పుడు మీ విశ్వాసానికి వచ్చిన ఎన్నో పరీక్షల్ని మీరు ఇప్పటికే ధైర్యంగా దాటి ఉంటారు. ఇకపై కూడా అలాగే చేస్తూ, “ఇదే పద్ధతిలో ముందుకు సాగిపోతూ” ఉండాలి. అంటే, యెహోవాకు నమ్మకంగా ఉంటూ ఆయన సేవలో కొనసాగాలి.—ఫిలిప్పీయులు 3:16 చదవండి.

2 “ఇదే పద్ధతిలో ముందుకు సాగిపోతూ ఉందాం” అని అనువదించబడిన గ్రీకు మాటను, కలిసికట్టుగా నడిచే సైనికుల్ని లేదా మార్చింగ్‌ చేసే సైనికుల్ని సూచించడానికి ఎక్కువగా ఉపయోగించేవాళ్లు. మీరు ఇంకా చదవాలని అనుకుంటే, యెహోవా సేవలో ముందుకు నడుస్తూ ఉండాలి. అంతేగానీ మధ్యలో ఆగిపోకూడదు, వెనకడుగు వేయకూడదు. ఆ విషయంలో మీకు సహాయం చేసే నాలుగు బైబిలు సూత్రాల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. ఇవి మీకు కొత్తేం కాదు, గతంలో కూడా మీరు వీటిని పాటించే ఉంటారు. ప్రస్తుతం మీరు చదువుతున్నా లేదా చదువు పూర్తయినా వాటిని పాటిస్తూనే ఉండాలి.

యెహోవాకు దగ్గర చేసే పనుల్ని మానకండి

3. మీరు అదనంగా చదువుతున్నప్పుడు ఏం జరగవచ్చు?

3 ఏం జరగవచ్చు? మీరు ఎక్కువ చదవాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు చేయాల్సిన పనులు కూడా ఎక్కువే ఉంటాయి. మీరు బిజీ అయిపోవచ్చు; బాగా చదవాలని, మంచి మార్కులు తెచ్చుకోవాలని అనుకోవచ్చు. అందులో తప్పేం లేదు. కానీ, దానివల్ల యెహోవాకు దగ్గర చేసే పనుల్ని పక్కనపెట్టేసే ప్రమాదం ఉంది. అది ఎంతవరకు వెళ్లవచ్చు అంటే మీరు మీటింగ్స్‌కి-ప్రీచింగ్‌కి వెళ్లడం, రోజూ బైబిలు చదవడం, ప్రార్థన చేసుకోవడం లాంటివన్నీ పూర్తిగా తగ్గిపోవచ్చు.—ప్రక. 2:4.

4. మొదటి కొరింథీయులు 15:58 చెప్తున్నట్టు “ప్రభువు సేవలో నిమగ్నమై ఉండడం” అంటే ఏంటి?

4 మొదటి కొరింథీయులు 15:58 చదవండి. మీరు ఒక సైకిల్‌ తొక్కుతున్నట్టు ఊహించుకోండి. మీరు పడిపోకుండా ముందుకు వెళ్తూ ఉండాలంటే దాన్ని తొక్కుతూ ఉండాలి. అదేవిధంగా, యెహోవాతో మీ సంబంధం పాడవ్వకుండా, బలంగా ఉండాలంటే మీరు ఆయన సేవలో బిజీగా ఉండాలి. అందుకే “ఎప్పుడూ ప్రభువు సేవలో నిమగ్నమై ఉండండి” అని బైబిలు చెప్తుంది. ఏదో చేయాలి కదా అని కాదుగానీ, మనకది చాలా ముఖ్యం కాబట్టి మనసుపెట్టి చేస్తాం. మీరు ముందు ఒక యెహోవాసాక్షి అని, ఆ తర్వాతే ఒక స్టూడెంట్‌ అని గుర్తుపెట్టుకోండి. (మత్త. 22:37) సమంత అనే అమ్మాయి ఇలా చెప్తుంది: “నా చదువులు యెహోవాకు బెస్ట్‌ ఇవ్వకుండా చేస్తే నేను దాన్ని వెంటనే మానేస్తాను అని ముందే అనుకున్నాను.”

5. యెహోవా సేవలో మీరు బిజీగా ఉండడానికి ఏం చేయవచ్చు?

5 అదనపు విద్య మొదలుపెట్టక ముందే మీరేం చేయవచ్చు? యెహోవాకు మొదటి స్థానం ఇచ్చేలా చూసుకోండి. ఇలా ప్రశ్నించుకోండి: ‘క్రమంగా మీటింగ్స్‌కి, ప్రీచింగ్‌కి వెళ్లే విషయంలో, వ్యక్తిగత అధ్యయనం చేసే విషయంలో నాకున్న ప్లాన్‌ ఏంటి?’ (యెహో. 1:8; మత్త. 28:19, 20; హెబ్రీ. 10:25) అలాగే, మీరు ఇప్పటివరకు ఎలా ప్లాన్‌ చేసుకుంటూ వచ్చారో కూడా ఆలోచించండి. స్కూల్లో చదువుకునేటప్పుడు మీరు ఏం చేసేవాళ్లు? ఇప్పుడు కూడా అదే చేయవచ్చా లేదా ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవచ్చా? స్కూల్‌ చదువు పూర్తయిన తర్వాత, మీరు ఏం చదివినా యెహోవా సేవలో బిజీగా ఉండాలని మాత్రం నిర్ణయించుకోండి. యెహోవా సేవను పణంగా పెట్టి మరీ చదవకండి.a—మత్త. 6:24.

6. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి ఏ ప్రశ్నలు వేసుకోవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

6 అదనంగా చదువుతున్నప్పుడు మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండండి, నెలకు ఒకసారి అలా చేయడం మంచిది. ఇలా ప్రశ్నించుకోండి, ‘నా దృష్టి ఎక్కువగా దేనిమీద ఉంది?’ కాస్త పక్కదారి పడుతున్నాను అనిపిస్తే వెంటనే జాగ్రత్తపడండి. ఉదాహరణకు, మీటింగ్స్‌కి రాకపోవడం లేదా లేటుగా రావడం ఒక అలవాటు అయిపోయిందా? మీటింగ్‌లో కూర్చుని హోమ్‌వర్క్‌ గురించి, కోర్సు గురించి ఆలోచిస్తున్నారా? మీటింగ్స్‌కి ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే హాజరౌతున్నారా? ప్రార్థన చేసుకోవడం, బైబిలు చదవడం, ప్రీచింగ్‌ చేయడం లాంటి అలవాట్లు ముందున్నట్టుగా ఉన్నాయా, లేదా ఏదో చేయాలి కదా అన్నట్టు గబగబా చేసేస్తున్నారా? వీటిలో ఏ ఒక్క ప్రశ్నకైనా జవాబు “అవును” అని వస్తే వెంటనే మార్పు చేసుకోండి. యెహోవాకే మొదటిస్థానం ఇవ్వండి, ఆ స్థానాన్ని చదువు లాగేసుకోకుండా జాగ్రత్తపడండి.

ఒక బ్రదర్‌ “కావలికోట” ఆర్టికల్‌ని బాగా ప్రిపేర్‌ అవుతూ, అందులోని లేఖనాల్ని చూస్తున్నాడు.

యెహోవాకు మొదటిస్థానం ఇవ్వకుండా మీ చదువు అడ్డుపడనివ్వకండి (6వ పేరా చూడండి)


మీ “ఆలోచనా సామర్థ్యాల్ని” కాపాడుకోండి

7. అదనంగా చదువుతున్నప్పుడు, మీ ఆలోచనా విధానానికి ఏం జరిగే అవకాశం ఉంది?

7 ఏం జరగవచ్చు? కొన్నిసార్లు మీరు తీసుకునే కోర్సులో, ఈ లోకంలోని “తత్వజ్ఞానంతో, మోసపూరితమైన వట్టి మాటల్ని” నేర్పిస్తారు. ఉదాహరణకు, దేవుడు లేడని, పరిణామ సిద్ధాంతం కరెక్ట్‌ అని చెప్తుంటారు. (కొలొ. 2:8) దేవుని మీద కాకుండా, మనమీద మనం ఆధారపడాలని అలాంటి బోధలు నూరిపోస్తాయి. ఒక అబ్బాయి ఏమంటున్నాడంటే: “మాకు కొత్త నైపుణ్యాలే కాదు, కొత్త ఆలోచనా విధానాన్ని కూడా నేర్పించారు. అది కొన్నిసార్లు యెహోవా ఆలోచనా విధానానికి చాలా వేరుగా ఉండేది. ఉదాహరణకు, మనల్ని మనం నమ్ముకుంటేనే జీవితంలో విజయం సాధించగలం అని నేర్పించారు. నాకు కూడా మెల్లమెల్లగా అలాంటి ఆలోచనలు వచ్చాయి, దాంతో నేను యెహోవా మీద ఆధారపడడం తగ్గించేశాను.”

8. సామెతలు 5:1, 2 చెప్తున్నట్టు, మన “ఆలోచనా సామర్థ్యాల్ని” ఎందుకు కాపాడుకోవాలి?

8 సామెతలు 5:1, 2 చదవండి. మీ ‘ఆలోచనా సామర్థ్యాల్ని కాపాడుకోండి’ అని బైబిలు చెప్తుంది. సాధారణంగా ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడే, కాపాడుకోండి అని చెప్తుంటాం. మన ఆలోచనా సామర్థ్యాల విషయంలో కూడా అంతే. సాతాను లోకం మన ఆలోచనల్ని పాడుచేసే ప్రమాదం ఉంది. (1 పేతు. 5:8) ఉదాహరణకు, ఏది మంచి-ఏది చెడు? జీవం ఎలా వచ్చింది? దేవుడు ఉన్నాడా లేడా? లాంటి అనుమానాలు పుట్టేలా చేయవచ్చు. “తెలివి ఎక్కువ” ఉన్నవాళ్లే అలా ఆలోచిస్తారని లోకం అనుకుంటుంది, కానీ నిజానికి అది తెలివితక్కువతనం, చెప్పాలంటే “దేవుని దృష్టిలో మూర్ఖత్వం.”—1 కొరిం. 3:18-20.

9. మీ ఆలోచనా సామర్థ్యాల్ని కాపాడుకోవడానికి ఏం చేయవచ్చు?

9 అదనపు విద్య మొదలుపెట్టక ముందే మీరేం చేయవచ్చు? మీ ఆలోచనా సామర్థ్యాల్ని కాపాడుకోవాలంటే, మీరు అదనంగా చదవడం మొదలుపెట్టక ముందే, బైబిల్లో నేర్చుకున్న విషయాలు నిజమని గట్టిగా నమ్మాలి. ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను దేవున్ని ఎందుకు నమ్ముతున్నాను? బైబిల్ని దేవుడే రాయించాడని ఎందుకు నమ్ముతున్నాను? మంచిచెడుల విషయంలో లోకం చెప్పేదాని కంటే బైబిల్లో ఉన్నదే కరెక్ట్‌ అని ఎందుకు నమ్ముతున్నాను?’ లోకంలోని ఆలోచనా తీరు మీకు కొత్తేం కాదు. స్కూల్‌లో చదువుకున్నప్పుడు అందరూ ఎలా ఆలోచించేవాళ్లో గుర్తుచేసుకోండి. క్లాస్‌లో అందరూ పరిణామ సిద్ధాంతం కరెక్ట్‌ అని చెప్పడం వల్ల, మీకు దేవుడు ఉన్నాడా లేడా అనే అనుమానం వచ్చిందా? క్లాస్‌లో కొంతమంది చేసే తప్పుడు పనుల్ని చూసి మీకు కూడా చేయాలని అనిపించిందా? ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికైనా మీ జవాబు “అవును” అయితే బైబిలు బోధల మీద ఇంకా విశ్వాసం పెంచుకోవడానికి ఏం చేయవచ్చో ఆలోచించండి. ఎవరు ఏం చెప్పినా మీ ఆలోచనా సామర్థ్యాల్ని కాపాడుకోవాలని గట్టిగా నిర్ణయించుకోండి.—2 తిమో. 2:16-18.b

10. మీ చుట్టూ ఉన్నవాళ్లను బట్టి మీ మనసు మారకుండా ఉండాలంటే ఏం చేయాలి?

10 అదనంగా చదువుతుంటే, మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండండి. ఇలా ప్రశ్నించుకోండి: ‘నా చుట్టూ ఉన్నవాళ్లు యెహోవాకు నచ్చని పనులు చేస్తుంటే, వాటిలో తప్పేం లేదులే అని మెల్లమెల్లగా నాకు కూడా అనిపిస్తుందా? లోకంలో ఉన్న జ్ఞానం అంతా వట్టిది అని నేను గుర్తించగలుగుతున్నానా? మనుషులకు వచ్చే సమస్యలన్నిటినీ దేవుని రాజ్యం మాత్రమే తీసేస్తుందని నేను నిజంగా నమ్ముతున్నానా?’ మీ టీచర్స్‌, క్లాస్‌మేట్స్‌ ఏం చెప్పినా సరే మీ మనసు మారకుండా ఉండాలంటే బైబిల్ని చదవాలి, ధ్యానించాలి, నేర్చుకున్నవి పాటిస్తూ ఉండాలి. అలా చేస్తేనే బైబిల్లో ఉన్న సత్యాలు నిజమా కాదా అనే డౌటు రాదు.—1 తిమో. 4:15.

మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి

11. అదనంగా చదువుతున్నప్పుడు, మీ టైంని తెలివిగా ఉపయోగించకపోతే ఏం జరగవచ్చు?

11 ఏం జరగవచ్చు? అదనంగా చదవాలంటే అదనంగా సమయం పెట్టాల్సిందే. ముఖ్యంగా ఎగ్జామ్స్‌ జరుగుతున్నప్పుడు, ఏవైనా ప్రాజెక్ట్‌లు త్వరత్వరగా పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు టైం అంతా దానికే పోతుంది. ఒకవేళ మీ టైంని తెలివిగా ఉపయోగించకపోతే బాగా ఒత్తిడి పెరిగిపోతుంది, మీ ఒంట్లో శక్తి అంతా ఆవిరైపోతుంది. కాబట్టి మీ టైంని ఎప్పుడూ చదువులకే కాదు, మిమ్మల్ని మీరు పట్టించుకోవడానికి కూడా ఉపయోగించుకోవాలి.

12. మీరు ఏయే పనుల కోసం సమయం పెట్టాలి? (ఎఫెసీయులు 5:15, 16)

12 ఎఫెసీయులు 5:15, 16 చదవండి. “సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా” ఉపయోగించాలంటే కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే మనం చేయాల్సిన పనులు ఒకటి-రెండు కాదు, చాలానే ఉంటాయి. మీరు క్లాసులకు వెళ్లడం, చదువుకోవడం ముఖ్యమే కానీ బ్రదర్స్‌-సిస్టర్స్‌తో, కుటుంబంతో సమయం గడపడం అంతకన్నా ముఖ్యం. (కీర్త. 133:1; సామె. 18:1) వీటన్నిటికి మించి, యెహోవాకు దగ్గర చేసే పనులకు మనం ఖచ్చితంగా సమయం ఇవ్వాలి. (మత్త. 6:33) ఇవన్నీ చేస్తూ మీరు ఇంట్లో పనులు, ఉద్యోగం కూడా చేస్తూ ఉండవచ్చు. అంతేకాదు, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విశ్రాంతి తీసుకోవాలి, ఎక్సర్‌సైజ్‌ చేయాలి. (ప్రసం. 4:6; 1 తిమో. 4:8) ఈ పనులన్నీ చేయాలంటే చక్కగా షెడ్యూల్‌ వేసుకోవాలి.

13. మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోవాలంటే మీరు ఏం చేయాలి?

13 అదనపు విద్య మొదలుపెట్టక ముందే మీరేం చేయవచ్చు? చక్కగా ప్లాన్‌ చేసుకుంటే, పనులన్నీ చక్కగా జరుగుతాయని బైబిలు చెప్తుంది. (సామె. 21:5) అదనంగా చదవడం మొదలుపెట్టక ముందే, మీరు అనుకున్నవన్నీ చక్కగా జరగాలంటే ఎలాంటి షెడ్యూల్‌ వేసుకోవాలో ఆలోచించండి. అలా చేయాలంటే ఈ ప్రశ్నలు వేసుకోండి: స్కూల్లో ఉన్నప్పుడు నా టైంని నేను ఎలా మేనేజ్‌ చేసుకున్నాను? అలాగే కొనసాగవచ్చా లేదా మార్పులు చేసుకోవాలా? ఒకవేళ మార్పులు చేసుకోవాల్సి వస్తే ఏం మార్చుకోవాలి? టైం మీ చెప్పుచేతల్లో ఉండాలి గానీ మీరు దాని చెప్పుచేతల్లో ఉండకూడదు.c

14. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి ఏ ప్రశ్నలు వేసుకోవచ్చు?

14 అదనంగా చదువుతూ ఉంటే, మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండండి. ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను వేసుకున్న షెడ్యూల్‌లో విశ్రాంతి తీసుకోవడానికి, ఎక్సర్‌సైజ్‌ చేయడానికి తగినంత సమయం ఉందా? బ్రదర్స్‌-సిస్టర్స్‌తో సరదాగా సమయం గడపడానికి నాకు టైం మిగులుతుందా? నా హోమ్‌వర్క్‌ను టైంకి పూర్తి చేయగలుగుతున్నానా? ఒకవేళ చేయలేకపోతుంటే దానికి కారణం, నా పనులు ఎక్కువైపోవడం వల్లా, లేదా నేను వాయిదా వేయడం వల్లా? నేను వేసుకున్న షెడ్యూల్‌ గురించి మా ఇంట్లోవాళ్లు, ఫ్రెండ్స్‌ ఏమంటున్నారు?’ అవసరమైతే, మీ షెడ్యూల్‌లో మార్పులు చేసుకోండి లేదా మీరే షెడ్యూల్‌కి తగ్గట్టు మారండి, కానీ వెంటనే చేయండి. కావాలంటే, టైంని చక్కగా ఉపయోగించుకునే వాళ్ల సలహా తీసుకోండి.—సామె. 11:14.

“తెలివిగలవాళ్లతో” స్నేహం చేయండి

15. అదనంగా చదువుతున్నప్పుడు ఏం జరగవచ్చు?

15 ఏం జరగవచ్చు? అదనంగా చదువుతున్నప్పుడు, మీ క్లాస్‌మేట్స్‌ సరదాగా టైం గడపమని మిమ్మల్ని అడగొచ్చు. మీకు కూడా వాళ్లతో ఉండాలని అనిపించవచ్చు. ఎందుకంటే వాళ్లదీ మీదీ ఒకటే వయసు, పైగా క్లాస్‌లో ఎక్కువ టైం వాళ్లతోనే కలిసి ఉంటారు, వాళ్లకు నచ్చినవే బహుశా మీకు కూడా నచ్చవచ్చు. వాళ్లతో కలిసిపోయినంత సులభంగా బ్రదర్స్‌-సిస్టర్స్‌తో కలిసిపోలేక పోతున్నానని మీకు అనిపించవచ్చు. కానీ, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకున్న లాంటి విలువలు మీ క్లాస్‌మేట్స్‌కు ఉండవని గుర్తుంచుకోండి. వాళ్లతో మీరెంత ఎక్కువ టైం గడిపితే, అంత ఎక్కువగా వాళ్లలా ఆలోచించడం మొదలుపెడతారు. (1 కొరిం. 15:33) ఎలక్ట్రీషియన్‌ కోర్సు చేసి నాలుగు ఏళ్లు ట్రైనింగ్‌ తీసుకున్న మైఖెల్‌కి అదే జరిగింది. అతను ఇలా చెప్తున్నాడు: “నేను వారంలో 40 కన్నా ఎక్కువ గంటలు బయటివాళ్లతోనే గడిపేవాడిని. వాళ్లు బూతులు మాట్లాడేవాళ్లు, వాళ్లు వినే పాటలు అస్సలు బాగోవు, స్త్రీలను గౌరవించేవాళ్లు కాదు. వాళ్లు చేస్తున్న దాంట్లో పెద్ద తప్పేం లేదని నాకు కూడా మెల్లమెల్లగా అనిపించడం మొదలైంది.”

16. సామెతలు 13:20 లో ఏ పాఠం ఉంది?

16 సామెతలు 13:20 చదవండి. చెడు స్నేహాల వల్ల వచ్చే ప్రమాదాల గురించి బైబిలు చెప్తుంది. అలాగే “తెలివిగలవాళ్లతో తిరిగేవాడు తెలివిగలవాడు అవుతాడు” అని కూడా బైబిలు చెప్తుంది. పాఠం ఏంటి? మనం ఎవరితో ఎక్కువ టైం గడుపుతామో వాళ్లలాగే తయారౌతాం. మంచివాళ్లతో అయితే మంచిగా, చెడ్డవాళ్లతో అయితే చెడ్డగా తయారౌతాం. కాబట్టి మీ మంచిని కోరుకునే వాళ్లతో, మీలాగే యెహోవాను మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్లతో స్నేహం చేయండి.—కీర్త. 101:6, 7; 119:63.

17. యెహోవాను ప్రేమించని వాళ్లతో స్నేహం చేయకుండా ఎలా జాగ్రత్తగా ఉండవచ్చు?

17 అదనపు విద్య మొదలుపెట్టక ముందే మీరేం చేయవచ్చు? మీ క్లాస్‌ వాళ్లతో ఎంత సమయం గడపాలో, ఎంతవరకు చనువుగా ఉండాలో ముందే నిర్ణయించుకోండి. ట్రెంటన్‌ ఇలా చెప్తున్నాడు: “మా క్లాస్‌లో ఉన్న వాళ్లందరితో నేను మంచిగానే ఉంటాను, కానీ స్కూల్‌ తర్వాత నేను వాళ్లతో సమయం గడపను. వాళ్లు నా క్లాస్‌మేట్సే గానీ నా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ కాదు.” మరి, మీరేం చేయాలని అనుకుంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే, మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీ క్లాస్‌ వాళ్లతో ఎంత సమయం గడిపేవాళ్లో ఆలోచించండి. ఇకపై ఏమైనా మార్పులు చేసుకుంటే మంచిదని మీకు అనిపిస్తే, వెంటనే చేసుకోండి. యెహోవాను ప్రేమించని వాళ్లతో ఎక్కువ టైం గడపకూడదని, ‘తెలివైనవాళ్లతోనే’ స్నేహం చేయాలని గట్టిగా నిర్ణయించుకోండి.d

18. మీరు ఏ ప్రశ్నల గురించి ఆలోచించడం మంచిది? (చిత్రం కూడా చూడండి.)

18 మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండండి. ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను క్లాస్‌లో ఉన్న వాళ్లకు మరీ ఎక్కువ దగ్గర అయిపోయానా? నా మాటలు, ఆలోచనలు, అలవాట్లు అన్నీ వాళ్లలాగే తయారవుతున్నాయా? నన్ను చూస్తే యెహోవాకు ఎలా అనిపిస్తుంది?’ (కీర్త. 1:1) ఒకవేళ మార్పులు చేసుకోవాలని మీకు అనిపిస్తే ఆలస్యం చేయవద్దు, వెంటనే చేసుకోండి. యెహోవాను ప్రేమించే వాళ్లతోనే స్నేహం చేయండి, వాళ్లనే మీ బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా చేసుకోండి. అంతేకాదు, మీ క్లాస్‌ వాళ్లకు యెహోవా గురించి చెప్పడానికి అస్సలు వెనకాడకండి. వాళ్లను రోజూ కలిసేది, మాట్లాడేది ఎక్కువగా మీరే కాబట్టి వాళ్లకు సత్యం గురించి బాగా చెప్పగలిగేది కూడా మీరే.

ఒక సిస్టర్‌ తన బ్యూటిషీయన్‌ లేదా కాస్మటాలజీ క్లాస్‌ అయిపోయాక “మన ఆరాధన ఎలా ఉంటే దేవునికి నచ్చుతుంది?” అనే కరపత్రం ఇచ్చి తన క్లాస్‌మేట్‌కు సాక్ష్యం ఇస్తుంది.

మీ క్లాస్‌మేట్స్‌కు యెహోవా గురించి చెప్పడానికి వెనకాడకండి (18వ పేరా చూడండి)e


అదనంగా చదివినా యెహోవాను సంతోషపెడుతూనే ఉండొచ్చు

19. అదనపు విద్య మొదలుపెట్టడానికి ముందే మనం ఎలా సిద్ధపడవచ్చు? ఒక ఉదాహరణతో చెప్పండి.

19 కొండ ఎక్కాలి అనుకునే వ్యక్తి ముందే తెలివిగా సిద్ధపడతాడు. ఉదాహరణకు, ‘ఆ కొండ ఎక్కేంత శక్తి నాకుందా? వాతావరణానికి తగ్గట్టు నా బట్టలు ఉన్నాయా? నా గమ్యం ఏంటో నాకు తెలుసా?’ లాంటి విషయాలు ఆలోచిస్తాడు. నిజమే, కొండ ఎక్కుతున్నప్పుడు ఏమేం జరగవచ్చో అన్నీ ఊహించలేకపోవచ్చు, కానీ సిద్ధపడడం వల్ల గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. అదే విధంగా, మీరు అదనంగా చదవాలనుకుంటే ముందే సిద్ధపడాలి. దానికోసం యెహోవాతో మీకున్న స్నేహాన్ని బలంగా ఉంచుకోవాలి, ‘దేవుడు ఇచ్చిన సంపూర్ణ యుద్ధ కవచాన్ని ధరించుకోవాలి,’ మీ గమ్యం ఏంటో మీకు తెలిసుండాలి. అంటే, మీరు ఎందుకు చదవాలనుకుంటున్నారో గుర్తుపెట్టుకోవాలి. లోకం దృష్టిలో విజయం సాధించాలని కాదుగానీ, ఏం చేసినా యెహోవాకు మహిమ తీసుకురావాలి అన్నదే మీ గమ్యం.—ఎఫె. 6:11-13; 1 కొరిం. 9:26, 27; 10:31.

20. “మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో” ఎలా పరీక్షించుకోవచ్చు?

20 “మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో పరీక్షించుకుంటూ ఉండండి; మీరేమిటో రుజువు చేసుకుంటూ ఉండండి” అని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. (2 కొరిం. 13:5) అదనంగా చదివే విషయంలో కూడా మీరు అదే చేయవచ్చు. ఈ ఆర్టికల్‌లో చెప్పిన వాటిని మీరు ఎంతవరకు పాటిస్తున్నారో ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండండి. యెహోవాకు దగ్గర చేసే పనుల్ని మానకుండా చేస్తూ ఉన్నారా? ఈ లోకంలోని జ్ఞానాన్ని మీరు ఒంటబట్టించుకోకుండా జాగ్రత్త పడుతున్నారా? మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకుంటున్నారా? యెహోవాను ప్రేమించని వాళ్లను కాకుండా, ప్రేమించే వాళ్లను స్నేహితులుగా చేసుకుంటున్నారా? మీరు చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఇంకేం చేస్తున్నా సరే ఆ ప్రశ్నలు వేసుకోవాలి. ఏది ఏమైనా, మీరు మాత్రం విశ్వాసంలో బలంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకోండి. యెహోవా మీ కష్టాన్ని తప్పకుండా దీవిస్తాడు!—సామె. 3:5, 6.

మీరు అదనపు విద్య మొదలుపెట్టక ముందే . . .

  • యెహోవాకు దగ్గర చేసే పనుల్ని ఎలా చేస్తూ ఉండొచ్చు?

  • మీ “ఆలోచనా సామర్థ్యాన్ని” ఎలా కాపాడుకుంటూ ఉండొచ్చు?

  • సమయాన్ని చక్కగా ఎలా ఉపయోగించవచ్చు? యెహోవాను ప్రేమించని వాళ్లతో ఎలా జాగ్రత్తగా ఉండొచ్చు?

పాట 87 రండి, సేదదీర్పు పొందండి!

a యెహోవా సేవలో బిజీగా ఉండడానికి సహాయం చేసే సలహాల కోసం, jw.orgలోని “యువత అడిగే ప్రశ్నలు . . . బాప్తిస్మం తర్వాత ఏం చేయాలి?—1వ భాగం: బాప్తిస్మం కోసం చేసిన పనులే చేస్తూ ఉండండి” అనే ఆర్టికల్‌ చూడండి.

b మీ ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి సహాయం చేసే సలహాల కోసం, కావలికోట మే 2019 సంచికలోని “‘ఈ లోకపు తెలివి’ వల్ల మోసపోకండి” అనే ఆర్టికల్‌ చూడండి.

c మీ రోజువారీ పనుల్ని చక్కగా ప్లాన్‌ చేసుకోవడానికి సహాయం చేసే సలహాల కోసం, jw.orgలో “యువత అడిగే ప్రశ్నలు . . . నేను సమయాన్ని ఎలా జాగ్రత్తగా వాడుకోవచ్చు?” అనే ఆర్టికల్‌ చూడండి.

d మంచి స్నేహితుల్ని ఎంచుకునే విషయంలో సలహాల కోసం, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే పుస్తకంలోని “స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోండి” అనే 48వ పాఠం చూడండి.

e చిత్రం వివరణ: హెయిర్‌ స్టయిలిస్ట్‌ కోర్సు చేస్తున్న ఒక సిస్టర్‌ తన క్లాస్‌లోని అమ్మాయికి నేర్పుగా సాక్ష్యమిస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి