మన క్రైస్తవ జీవితం
వేర్వేరు భాషలు ఉన్న క్షేత్రంలో కలిసి పనిచేయడం
ప్రజలు రాజ్యవార్తను తమ సొంత భాషలో విన్నప్పుడు వెంటనే స్పందిస్తారు. అందుకే క్రీ.శ. 33 పెంతెకొస్తు రోజున అక్కడున్న యూదులు సాధారణంగా హీబ్రూ లేదా గ్రీకు భాష మాట్లాడేవారైనా, “భూమ్మీదున్న అన్ని దేశాల నుండి వచ్చిన దైవభక్తిగల యూదులు” వాళ్ల “మాతృభాషల్లో” మంచివార్త వినేలా యెహోవా ఏర్పాటు చేశాడు. (అపొ 2:5, 8) ఈ రోజుల్లో ఒకే ప్రాంతంలో వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నప్పుడు ఆ భాషల్లో మీటింగ్ జరిగే సంఘాల క్షేత్రం పక్కపక్కనే ఉండవచ్చు. అలాంటి సంఘాల్లో ఉన్న ప్రచారకులు, ఒకే ఇంటికి మళ్లీమళ్లీ వెళ్లి ఇంటివాళ్లకు విసుగు తెప్పించకుండా అందరికి సాక్ష్యం ఇచ్చేలా ఎలా కలిసి పని చేయవచ్చు?
సంప్రదించండి (సామె 15:22): సేవా పర్యవేక్షకులు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మంచివార్తను వ్యాప్తి చేయడానికి ఏ పద్ధతి మంచిదో నిర్ణయించుకోవాలి. వాళ్లకున్న క్షేత్రం చిన్నదైతే, వేరే భాష మాట్లాడే సంఘాలు, వాళ్ల క్షేత్రంలో కొన్ని ఇళ్లకు వెళ్లకుండా ఉండవచ్చు. కానీ వాళ్ల క్షేత్రం ఎక్కువ ప్రాంతంలో విస్తరించి ఉండడం వల్ల క్షేత్రాన్ని పూర్తి చేయలేక పోతుంటే ఏమి చేయవచ్చు? అన్ని ఇళ్లు మాట్లాడుతూ వేరే భాష మాట్లాడే వాళ్లు ఎవరైనా ఆసక్తి చూపిస్తే, అదే భాష మాట్లాడే సంఘానికి వాళ్ల వివరాలు ఇవ్వడం మంచిది. (od 93వ పేజీ, 37వ పేరా) లేదా తమ భాష మాట్లాడే ప్రజల్ని గుర్తించి, వాళ్ల అడ్రస్‌లను తెలియజేయమని, వేరే భాష సంఘం మీ సంఘాన్ని కోరవచ్చు. (km 2/14 5వ పేజీ, బాక్సు) కొన్నిసార్లు, ఒకే ఇంటివాళ్లు వేర్వేరు భాషలు మాట్లాడే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. వేరేవాళ్ల వివరాలు తెలియజేయడానికి సంబంధించి మీ దేశంలో ఉన్న చట్టాలకు అనుగుణంగా టెరిటరీని పూర్తి చేయడానికి చేసిన ఏర్పాట్లు ఉండాలి.
సహకరించుకోండి (ఎఫె 4:16): మీ సేవా పర్యవేక్షకుడి దగ్గర నుండి వచ్చిన ఏ నిర్దేశాన్ని అయినా జాగ్రత్తగా పాటించండి. మీ సంఘానికి సంబంధించిన భాషను కాకుండా వేరే భాషను కోరుకున్న వాళ్లతో మీరు బైబిలు స్టడీ చేస్తున్నారా? ఆ విద్యార్థి మాట్లాడే భాషకు సంబంధించి మీకు దగ్గర్లో ఉన్న సంఘం లేదా గ్రూపుకు ఆ స్టడీని అప్పగిస్తే, ఆ విద్యార్థి త్వరగా ప్రగతి సాధించవచ్చు.
సిద్ధపడండి (సామె 15:28; 16:1): మీ క్షేత్రంలో వేరే భాష మాట్లాడేవాళ్లు ఎవరైనా ఎదురైతే వాళ్లకు మంచివార్త చెప్పడానికి మీరు పూర్తిగా కృషి చేయండి. మీ క్షేత్రంలో ఏయే భాషలు మాట్లాడేవాళ్లు ఉండవచ్చో ముందే ఊహించి, వాటికి సంబంధించిన బైబిలు అనువాదాలు, వీడియోలు డౌన్లోడ్ చేసి పెట్టుకోవడం ద్వారా మీరు చక్కగా సిద్ధపడి ఉండవచ్చు. కొన్ని భాషల్లో ఎలా పలకరించాలో తెలుసుకోవడానికి మీరు JW ల్యాంగ్వేజ్ యాప్ కూడా ఉపయోగించవచ్చు.