గృహస్థులు మరో భాష మాట్లాడేవారైతే ఏమి చేయాలి?
1 ప్రపంచవ్యాప్తంగా రాజ్యప్రచారకులు, తమ సంఘ కూటాలు నిర్వహించబడే భాష కాక మరో భాష మాట్లాడే, ఆసక్తిగల ప్రజలను ఎంతో తరచుగా కలుస్తున్నారు. అలాంటి వారికి ఆధ్యాత్మికంగా సహాయం చేయడానికి, భాషా గుంపులను, సంఘాలను ఏర్పాటు చేయవలసిన అవసరముందని అనేక బ్రాంచీలు గుర్తిస్తున్నాయి. ఒక ప్రాంతంలో వివిధ భాషల ప్రజలుంటారు కాబట్టి వివిధ భాషా సంఘాలు ఒకే క్షేత్రంలో ప్రకటిస్తుండవచ్చు. ప్రకటనాపని క్రమబద్ధంగా జరిగేలా సంఘాలు పరస్పరం ఎలా సహకరించుకోవచ్చు?—1 కొరిం. 14:33.
2 మంచి సహకారం: ప్రచారకులు వీధి సాక్ష్యమిస్తున్నా, తటస్థ సాక్ష్యమిస్తున్నా, మరో భాష మాట్లాడే ప్రజలతో సహా ఎవరినైనా సమీపించి, వారు చదవాలనుకునే భాషలో సాహిత్యాన్ని ఇవ్వడానికి వెనుకాడకూడదు. అయితే మరో భాషా గుంపు లేదా సంఘం పరిచర్యచేస్తున్న క్షేత్రంలోనే తాము కూడా ఇంటింటి పరిచర్య చేస్తుంటే ప్రచారకులు సాధారణంగా, తన సంఘం ఉపయోగించే భాష మాట్లాడే గృహస్థులకు ప్రకటించాలి. వివిధ సంఘాలు ఒకే ప్రాంతంలో ప్రకటిస్తున్నప్పుడు అన్ని వివరాలు వ్రాసిపెట్టడం చాలా ప్రాముఖ్యం. సేవా పైవిచారణకర్తలు ఒకరితో ఒకరు సంభాషించుకొని, అందరికీ ప్రయోజనకరంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. (సామె. 11:14) అయితే, ఇంటింటి పరిచర్య చేస్తున్నప్పుడు మరో భాష మాట్లాడే వ్యక్తి తారసపడితే, ఆ భాషా సంఘాలు దగ్గర్లో లేకపోతే, ప్రచారకులు సాక్ష్యమివ్వడానికి, ఆ వ్యక్తి ఆసక్తిని పెంపొందించడానికి ప్రయత్నించాలి.
3 ఒకే పని: వివిధ సంఘాలు ఒకే క్షేత్రంలో పనిచేస్తున్నప్పుడు క్షేత్రం విషయంలో ఎలా వ్యవహరించాలి? క్షేత్రంలో ఫలానా భాష మాట్లాడేవారు ఎంతమంది ఉన్నారనే దాని ఆధారంగా, సేవా పైవిచారణకర్తలు వివిధ భాషా సంఘాలు ఆ ప్రాంతంలో వంతులవారీగా ఎలా పరిచర్య చేయాలో నిర్ణయిస్తారు. దానికనుగుణంగానే టెరిటరీ మ్యాప్ కార్డులు ఆయా సంఘాలకు నియమించబడతాయి. సంఘం నుండి ఏదైనా ఒక టెరిటరీ మ్యాప్ కార్డు లభించకపోతే ప్రచారకులు ఆ క్షేత్రంలోకి వెళ్ళకుండా తమ క్షేత్రంలోనే పనిచేస్తారు. క్రైస్తవ ప్రేమకు ఎలాంటి భాషా హద్దులుండవు, అంతేకాక అందరూ ముఖ్యంగా క్షేత్రంలోని ప్రజల పట్ల శ్రద్ధ కలిగివుంటారు. (యోహా. 13:34, 35) ఏ క్షేత్రంలో ఎవరు పరిచర్య చేయాలనే విషయాన్ని నిర్ణయించేటప్పుడు, నాయకత్వం వహిస్తున్నవారు సహేతుకతను, క్రమబద్ధతను, ప్రేమను ప్రదర్శిస్తారు.—యాకో. 3:17, 18.
4 వివిధ భాషలవారు సువార్తను వింటారని బైబిలు ప్రవచించింది. (ప్రక. 14:6, 7) వివిధ సంఘాలు పరస్పరం సహకరించుకుంటే, వివిధ భాషా గుంపుల, సంఘాల ప్రచారకులు ప్రకటించిన ఇళ్ళలోనే మళ్ళీ ప్రకటించకుండా, మరో భాష మాట్లాడేవారితో సహా చాలామంది క్రొత్తవారికి సువార్త ప్రకటించడం సాధ్యమవుతుంది.—ఎఫె. 4:16.
[అధ్యయన ప్రశ్నలు]
1. పరిచర్య చేసేటప్పుడు సంఘాలు పరస్పరం సహకరించుకోవలసిన అవసరం ఎందుకు ఎక్కువగా ఉంది?
2. ఇంటింటి పరిచర్య చేస్తున్నప్పుడు, మన ప్రాంతంలో ఉన్న మరో భాషా గుంపుతో లేదా సంఘంతో మనమెలా సహకరించవచ్చు?
3. వివిధ భాషా గుంపులు లేదా సంఘాలు ఒకే క్షేత్రంలో పనిచేస్తున్నప్పుడు క్షేత్రం విషయంలో ఎలా వ్యవహరించాలి?
4. నేడు ఏ ప్రవచనం నెరవేరుతోంది?