బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని తీసుకోవడానికి సిద్ధంగాలేని వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు?
1. మొదట్లోనే, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని తీసుకోవడానికి అందరూ ఇష్టపడతారా? వివరించండి.
1 ఒక వ్యక్తి యెహోవా ఆరాధకుడు అవ్వాలంటే, బైబిలు ఏమి బోధిస్తుందో అతను తప్పకుండా తెలుసుకోవాలి. అయితే, క్రైస్తవులుకాని వాళ్లు బైబిలు దేవుని వాక్యమని నమ్మరు. కొందరికి అసలు దేవుడంటేనే నమ్మకం ఉండదు కాబట్టి బైబిలు మీద కూడా గౌరవం ఉండదు. మొదట్లో బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని తీసుకోవడానికి అంతగా ఇష్టపడనివాళ్లతో మాట్లాడడానికి ఏ ఉపకరణాలు సహాయం చేశాయి? కిందవున్న సలహాలు, 20 దేశాలకు చెందిన ప్రచారకుల మాటల ఆధారంగా రూపొందించినవి.
2. తనకు దేవుని మీద నమ్మకంలేదని ఎవరైనా చెప్తే, మనం ఏమి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి? ఎందుకు?
2 దేవుని మీద నమ్మకం లేనివాళ్లు: తనకు దేవుని మీద నమ్మకం లేదని ఎవరైనా చెప్తే, అందుకు కారణమేమిటో అడిగి తెలుసుకోవడం మంచిది. బహుశా వాళ్లు పరిణామ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారా? లోకంలోని అన్యాయాన్ని, మతంలోని వేషధారణను చూసి వాళ్లకు దేవుని మీద నమ్మకం పోయిందా? దేవుని మీద నమ్మకాన్ని అణచివేసే దేశంనుండి వాళ్లు వచ్చారా? దేవుడున్నాడనే విషయాన్ని వాళ్లు మొండిగా నిరాకరించకపోయినా, ఆయనమీద నమ్మకం ఉంచాల్సిన అవసరం బహుశా వాళ్లకు ఎప్పుడూ రాకపోయివుండొచ్చు. అలాంటివాళ్లను, “మొదట్నుండి మీ అభిప్రాయం అదేనా?” అని అడిగితే, తమ నమ్మకాల గురించి వివరిస్తారని చాలామంది ప్రచారకులు తెలుసుకున్నారు. వాళ్లు మాట్లాడుతున్నప్పుడు అడ్డుచెప్పకుండా వినండి. ఒక వ్యక్తికి దేవునిమీద నమ్మకం ఎందుకు లేదో తెలుసుకుంటే, వాళ్లతో ఏమి మాట్లాడాలో ఏ ప్రచురణ ఇవ్వాలో మనకు అర్థమౌతుంది.—సామె. 18:13.
3. ఇంటివాళ్ల మీద, వాళ్ల నమ్మకాల మీద గౌరవముందని మనమెలా చూపించవచ్చు?
3 మీరు మాట్లాడుతున్నప్పుడు, తమ మీద దాడిచేస్తున్నారనే అభిప్రాయం వాళ్లకు కలగకుండా జాగ్రత్తపడండి. ఈ సలహా ఒక దేశం నుండి వచ్చింది: “తాము ఏమి నమ్మాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంది, దాన్ని గౌరవించడం చాలా ప్రాముఖ్యం. మన వాదనను నెగ్గించుకోవడానికి ప్రయత్నించే బదులు, వాళ్లే ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చేలా చేసే ప్రశ్నలు అడగడం ఎప్పుడూ మంచిది.” ఇంటివాళ్లు తమ అభిప్రాయం చెప్పిన తర్వాత ఒక ప్రయాణ పర్యవేక్షకుడు తరచూ, “దీని గురించి మీరెప్పుడైనా ఆలోచించారా?” అంటూ మాట్లాడడం మొదలుపెడతాడు.
4. బౌద్ధులకు మనం ఎలా సహాయం చేయవచ్చు?
4 బౌద్ధుల్లో చాలామందికి, అసలు దేవుడున్నాడనే ఆలోచనే వింతగా ఉంటుంది. బ్రిటన్‌లోని కొందరు ప్రచారకులు, బ్రోషుర్లను ఉపయోగించి అలాంటివాళ్లకు సాక్ష్యమిస్తారు. తర్వాత, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని చూపించి ఇంటివాళ్లతో ఇలా అనవచ్చు: “మీకు దేవుని మీద నమ్మకం లేకపోయినా, బైబిలును అధ్యయనం చేయడంవల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే, మన జీవితాలకు ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలు దానిలో ఉన్నాయి.” అమెరికాలోని చైనీస్ క్షేత్రంలో సేవచేస్తున్న ఒక పయినీరు ఇలా అన్నాడు: “మా క్షేత్రంలో చాలామంది చదవడానికి ఇష్టపడతారు. ఏదైనా ప్రచురణ ఇస్తే, మళ్లీ కలిసేలోపు దాన్ని ఆసాంతం చదివేస్తారు. కానీ బైబిలు అధ్యయనమంటే ఏమిటో వాళ్లకు అర్థం కాకపోవచ్చు. అందుకే, మొదటిసారి కలిసినప్పుడు నేను మంచివార్త బ్రోషుర్ ఇస్తాను. ఎందుకంటే, దాన్ని ఇతరులతో చర్చించగలిగేలా రూపొందించారు.” మొదటిసారి కలిసినప్పుడే బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని పరిచయం చేయవచ్చని చైనీస్ భాషా సర్క్యూట్లో సేవచేస్తున్న ఒక ప్రాంతీయ పర్యవేక్షకుడు అంటున్నాడు. అయితే, దేవుని గురించి చర్చించే 1వ అధ్యాయంతో కాకుండా బైబిలు గురించి తెలియజేసే 2వ అధ్యాయంతో అధ్యయనం మొదలుపెట్టడం వల్ల మంచి ఫలితాలు రావచ్చు.
5. ఓర్పు చూపించడం ఎందుకు ప్రాముఖ్యం?
5 దేవుని మీద విశ్వాసాన్ని వృద్ధిచేసుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి మనం ఓర్పు చూపించడం చాలా ప్రాముఖ్యం. మొదట్లో కొన్నిసార్లు కలిసి మాట్లాడినంత మాత్రాన, సృష్టికర్త ఉన్నాడని వాళ్లు ఒప్పుకోకపోవచ్చు. అయితే మెల్లమెల్లగా వాళ్ల ఆలోచన మారి సృష్టికర్త ఉండవచ్చని ఒప్పుకుంటారు, లేదా సృష్టికర్త ఉన్నాడని కొందరు ఎందుకు నమ్ముతారో అర్థం చేసుకుంటారు.
6. బైబిలంటే కొందరికి ఎందుకు ఆసక్తి ఉండదు?
6 బైబిలు మీద ఆసక్తి, నమ్మకం లేనివాళ్లు: దేవుడు ఉండివుంటాడని ఒప్పుకునే కొందరికి, బైబిలు దేవుని వాక్యమని తెలియదు. అందుకే, బైబిలు ఏమి బోధిస్తుందో తెలుసుకోవడానికి వాళ్లు ఆసక్తి చూపించరు. బహుశా వాళ్లు క్రైస్తవేతర దేశం నుండి వచ్చివుండవచ్చు, దాంతో బైబిలంటేనే చర్చీలకు వెళ్లే వాళ్ల పుస్తకమని నమ్ముతుండవచ్చు. లేదా వాళ్లు నివసించేది క్రైస్తవ దేశమని పిలిచే దేశంలోనే అయినా, మతానికి అక్కడ ప్రాముఖ్యత లేనందువల్ల, బైబిలు తమకు ఉపయోగపడుతుందనే ఆలోచనే వాళ్లకు రాకపోవచ్చు. అలాంటివాళ్లలో బైబిలుపట్ల ఆసక్తి కలిగించి, బైబిలు బోధిస్తోంది పుస్తకంతో అధ్యయనం చేసేలా వాళ్లను ఎలా ఒప్పించవచ్చు?
7. బైబిలు మీద ఆసక్తి కలిగించడానికి ఏ పద్ధతి బాగా పనిచేస్తుంది?
7 గ్రీస్‌లోని బ్రాంచి కార్యాలయం ఇలా రాసింది: “బైబిలంటే ఆసక్తిలేని వాళ్లకు సహాయం చేసే అత్యుత్తమ పద్ధతి ఏమిటంటే, బైబిలు తెరిచి అందులో ఏముందో వాళ్లకు చూపించడమే. మనం సొంతగా చెప్పే దేనికన్నా కూడా బైబిలు సందేశం ప్రజల హృదయాలను ఎంతో ఎక్కువగా ప్రభావితం చేస్తుందని చాలామంది ప్రచారకులు గమనించారు. (హెబ్రీ. 4:12) బైబిల్లో దేవుని పేరు చూడడంవల్ల, దానిలో ఏముందో తెలుసుకోవాలనే కోరిక చాలామందిలో కలిగింది.” ఇండియాలోని బ్రాంచి కార్యాలయం ఇలా రాసింది: “జీవం-మరణం గురించిన సత్యం, ఎలాంటి కులభేదాలూ లేని లోకం గురించిన బైబిలు వాగ్దానం ఎక్కువమంది హిందువులను ఆకట్టుకుంటాయి.” చాలా సందర్భాల్లో, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించడం వల్ల, దేవుని రాజ్యం వాటిని ఎలా తీసివేస్తుందని బైబిలు చెబుతుందో చూపించే అవకాశం ప్రచారకులకు దొరుకుతుంది.
8. నకిలీ క్రైస్తవుల కారణంగా బైబిలుపట్ల సదభిప్రాయం లేనివాళ్లతో మనమెలా మాట్లాడవచ్చు?
8 కొందరికి బైబిలుపట్ల సదభిప్రాయం లేకపోవడానికి కారణం నకిలీ క్రైస్తవుల ప్రవర్తనే. కారణం అదే అయితే, అలాంటి క్రైస్తవులు బైబిలును, దాని బోధలను వక్రీకరిస్తున్నారని తెలియజేయండి. ఇండియాలోని బ్రాంచి కార్యాలయం ఇలా రాసింది: “కొన్నిసార్లు, చర్చీలు బైబిలు సంరక్షకులు కాదనే విషయాన్ని అర్థంచేసుకోవడానికి ప్రజలకు సహాయం చేయాల్సివుంటుంది.” జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు? బ్రోషుర్‌లోని 4వ అధ్యాయం హిందువులను ఎక్కువగా ఆకట్టుకుంటుందని కూడా అది తెలియజేసింది. దేవుని వాక్యాన్ని కలుషితం చేయడానికి, నాశనం చేయడానికి చర్చీలు ఎలా ప్రయత్నించాయో ఆ అధ్యాయం వివరిస్తుంది. బ్రెజిల్‌లోని ఒక పయినీరు ప్రజలతో ఇలా అంటాడు: “బైబిల్లోని విషయాల గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి మీరెందుకు ప్రయత్నించకూడదు? చాలామంది బైబిలు విషయంలో ఉన్న దురభిప్రాయాలను పక్కనపెట్టి, ఏ మతంలోనూ చేరాల్సిన అవసరం లేకుండానే అలా తెలుసుకుంటున్నారు. మీరు తెలుసుకునే విషయాలు బహుశా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.”
9. బైబిలు బోధించే విషయాల పట్ల కొందరు మొదట్లో ఆసక్తి చూపించకపోయినా మనం ఎందుకు పట్టువిడవకూడదు?
9 యెహోవా ప్రతీ ఒక్కరి హృదయాన్ని చూస్తాడు. (1 సమూ. 16:7; సామె. 21:2) సరైన హృదయస్థితి గలవాళ్లను సత్యారాధన వైపు ఆకర్షిస్తున్నాడు. (యోహా. 6:44) అలాంటివాళ్లలో చాలామందికి దేవుని గురించి ఇప్పటివరకు ఎవరూ నేర్పించలేదు లేదా బైబిలు గురించి తెలుసుకునే అవకాశం వాళ్లకు దొరకలేదు. మన పరిచర్య వల్ల, “రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారు” అయ్యే అవకాశం వాళ్లకు దొరుకుతుంది. (1 తిమో. 2:4) అందుకే, బైబిలు బోధించే విషయాలపట్ల కొందరు మొదట్లో ఆసక్తి చూపించకపోయినా పట్టువిడవకండి. అందుబాటులో ఉన్న ఏదోక ప్రచురణను ఉపయోగించి వాళ్లలో ఆసక్తి కలిగించడానికి ప్రయత్నించండి. కొంతకాలానికి, బైబిలు అధ్యయనాలు చేయడానికి మనం ఉపయోగించే ముఖ్య పుస్తకాన్ని అంటే, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకాన్ని ఉపయోగించి చర్చించడం మొదలుపెట్టగలుగుతారు.
[4వ పేజీలోని బాక్సు]
దేవుని మీద నమ్మకంలేదని ఇంటివాళ్లు అంటే . . .
• ఎందుకు నమ్మకం లేదో తెలుసుకోవడానికి, “మొదట్నుండి మీ అభిప్రాయం అదేనా?” అని అడగండి.
• ఒకవేళ వాళ్లు పరిణామ సిద్ధాంతాన్ని నమ్ముతుంటే, ఈ కింది ప్రచురణ ఉపయోగపడవచ్చు:
సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు? బ్రోషుర్‌లోని 4వ భాగం
• లోకంలోని అన్యాయం వల్ల, బాధ వల్ల వాళ్లు దేవుని మీద నమ్మకం కోల్పోయివుంటే, ఈ కిందివి ఉపయోగపడవచ్చు:
దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? బ్రోషుర్‌లోని 6వ భాగం; జీవిత సంకల్పమేమిటి? బ్రోషుర్‌లోని 6వ అధ్యాయం
• దేవుడు ఉండివుంటాడని ఇంటివాళ్లు అంగీకరించిన వెంటనే, బైబిలు బోధిస్తోంది పుస్తకంతో చర్చించడం మొదలుపెట్టండి. బహుశా 2వ అధ్యాయంతోగానీ వాళ్లకు ఆసక్తికరంగా ఉండే ఇంకో అంశంతోగానీ మొదలుపెట్టడం మంచిది.
[5వ పేజీలోని బాక్సు]
ఇంటివాళ్లకు బైబిలు మీద నమ్మకం లేకపోతే . . .
• బైబిలు సూత్రాలను పాటిస్తే వచ్చే ప్రయోజనాల గురించి చర్చించండి. బైబిల్లోని విషయాలు మన జీవితాలకు ఎలా ఉపయోగపడతాయో చూపించడానికి ఈ ప్రచురణలు పనికొస్తాయి:
దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషుర్‌లోని 9వ పాఠం, 11వ పాఠం; సర్వమానవాళి కొరకైన గ్రంథం బ్రోషుర్‌లోని 22-26 పేజీలు; సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు? బ్రోషుర్‌లోని 2వ భాగం
బైబిలు పట్ల దురభిప్రాయమున్న ప్రాంతంలో మీరు ప్రకటిస్తుంటే గనుక, మీరు పంచుకుంటున్న జ్ఞానయుక్తమైన సలహాలు బైబిల్లోనివని కొంతకాలంపాటు చెప్పకపోవడమే మంచిది.
• నెరవేరిన బైబిలు ప్రవచనాల గురించి వివరించండి. అందుకు ఈ ప్రచురణను ఉపయోగించవచ్చు:
సర్వమానవాళి కొరకైన గ్రంథం బ్రోషుర్‌లోని 27-29 పేజీలు
• ఆయా విషయాల గురించి బైబిలు ఏమి చెబుతుందని ఇంటివాళ్లు అడిగిన వెంటనే, బైబిలు బోధిస్తోంది పుస్తకంతో చర్చించడం మొదలుపెట్టండి.
[6వ పేజీలోని బాక్సు]
“నాకు దేవుని మీద నమ్మకంలేదు” అని ఇంటివాళ్లు అంటే మీరిలా మాట్లాడవచ్చు:
• “ఒకవేళ దేవుడు ఉంటే గనుక, ఆయనకు ఎలాంటి లక్షణాలుంటే బావుంటుందని మీకనిపిస్తుంది?” ప్రేమ, న్యాయం, కనికరంగల దేవుడు, పక్షపాతంలేని దేవుడు తమకు కావాలని చాలామంది అంటారు. అప్పుడు, దేవునికి అలాంటి లక్షణాలే ఉన్నాయని బైబిలు తెరిచి చూపించండి. (వీలైతే, బైబిలు బోధిస్తోంది పుస్తకం మొదటి అధ్యాయంలోని 6వ పేరా నుండి చర్చించడం మొదలుపెట్టవచ్చు.)
“నాకు బైబిలు మీద నమ్మకం లేదు” అని ఇంటివాళ్లు అంటే, మీరిలా మాట్లాడవచ్చు:
• “చాలామందికి ఇలాంటి అభిప్రాయమే ఉంది. బైబిలు విజ్ఞానశాస్త్రానికి అనుగుణంగా లేదని, దానిలోని ప్రమాణాలు మనకు పనికిరావని కొందరు అనుకుంటారు. మీరు ఎప్పుడైనా బైబిలును చదివారా? [వాళ్లేమి చెప్తారో వినండి. తర్వాత, సర్వమానవాళి కొరకైన గ్రంథం బ్రోషుర్ 3వ పేజీలో ఉన్న ఉపోద్ఘాతాన్ని చూపించి, బ్రోషుర్‌ను వాళ్లకు ఇవ్వండి.] మతం బైబిలు బోధలను వక్రీకరించినందువల్లే చాలామందికి దానిమీద నమ్మకం పోయింది. ఈసారి వచ్చినప్పుడు, 4-5 పేజీల్లో ఉన్న ఉదాహరణను మీతో చర్చించాలని అనుకుంటున్నాను.”
• “చాలామందికి మీలాంటి అభిప్రాయమే ఉంది. బైబిల్లో నన్ను బాగా ఆకట్టుకునేది ఏమిటో మీకు చూపించనా? [బైబిలు విజ్ఞానశాస్త్ర ప్రకారం ఖచ్చితంగా ఉందని చూపించే, యోబు 26:7ను గానీ యెషయా 40:22ను గానీ చదవండి.] కుటుంబాలకు ఉపయోగపడే జ్ఞానయుక్తమైన సలహాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఈసారి వచ్చినప్పుడు, అందుకు ఒక ఉదాహరణ చూపించాలని అనుకుంటున్నాను.”
• “మీ అభిప్రాయం చెప్పినందుకు థాంక్స్. దేవుడు మనుషుల కోసం నిజంగానే ఒక పుస్తకం రాసివుంటే, అందులో ఏమి ఉంటుందని మీకనిపిస్తుంది?” తర్వాత, ఆయన చెప్పినదాన్ని సమర్థించే ఒక విషయాన్ని బైబిలు నుండి చూపించండి.