అనుభవాలు
◼ ఆస్ట్రేలియా: బాగా చదువుకున్న జాన్, చిన్న వయసులో చర్చీకి వెళ్లేవాడు. కానీ తర్వాత్తర్వాత, “నిష్ఠగల నాస్తికునిగా” మారిపోయాడు. మన పయినీరు ఒకరు ఆయనకు ఒక బ్రోషుర్ ఇచ్చాడు. తర్వాత, వేరే ప్రచురణలనూ కొత్తకొత్త పత్రికలనూ ఇచ్చి, వాటిలో సృష్టి గురించీ బైబిలు ప్రవచనాల గురించీ ఉన్న ఆర్టికల్స్ చూపిస్తూ ఆయన ఆసక్తిని పెంచడానికి ప్రయత్నించాడు. జాన్ వాటిని చదివాక, తాను “ఓ మోస్తరు అస్తిత్వవాదిగా” మారానని చెప్పుకున్నాడు. తర్వాత ఆ పయినీరు బైబిలు బోధిస్తోంది పుస్తకం ఇచ్చి, 20వ పేజీలోని 8వ పేరానూ 23-24 పేజీల్లోని 13-16 పేరాలనూ చూపించాడు. ఆ పేరాల్లోని లేఖనాలు జాన్‌ను ఎంతగా కదిలించాయంటే, “నేను బైబిలుకు ఇంకో అవకాశం ఇవ్వాలనుకుంటా” అని ఆయన అన్నాడు.
◼ మెక్సికో: బైబిలును దేవుని ప్రేరణతో రాశారనే విషయాన్ని తాను నమ్మనని ఒకతను మన ప్రచారకునితో అన్నాడు. బైబిలును దేవుడే రాయించాడని తెలిపే రుజువులను చూపిస్తానని ప్రచారకుడు అన్నాడు. కొన్ని చర్చల తర్వాత, బైబిలు నుండి నేర్చుకుంటున్న విషయాలు అతని హృదయాన్ని కదిలించసాగాయి. ముఖ్యంగా, దేవుని ప్రమాణాలు అతణ్ణి బాగా ఆకట్టుకున్నాయి. ప్రచారకునితో అతనిలా అన్నాడు: “మొదట్లో మనమిద్దరం కలిసి బైబిలు చదువుతున్నప్పుడు అదీ అన్ని పుస్తకాల్లాంటిదేనని అనిపించేది, కాబట్టి దానిలోని సలహాలు నామీద ఎలాంటి ప్రభావమూ చూపించలేదు. కానీ ఇప్పుడు మనం బైబిలు చదువుతుంటే, ముఖ్యంగా దానిలోని నైతిక విషయాల గురించి చదువుతుంటే నా హృదయం నొచ్చుకుంటుంది.”
◼ అమెరికా: స్పెషల్ మెట్రోపోలిటన్ విట్నెసింగ్ చేస్తున్న ఒక జంట, తైవాన్ నుండి వచ్చిన ఒక స్త్రీని కలిసింది. ఆమెకు దేవునిమీద నమ్మకం ఉండేది కానీ బైబిలు పాశ్చాత్యుల కోసమేనని అనుకునేది. సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నా తన జీవితంలో ఏదో లోటున్నట్లు ఆమెకు అనిపించేది. బైబిలు తన జీవితానికి ఒక అర్థం చేకూరుస్తుందనే ఆశతో ఆ పత్రికలు ప్రదర్శించే చోటుకు వచ్చింది. వాళ్లు, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని, ఒక బ్రోషుర్‌ను ఉపయోగించి ఆమెతో అధ్యయనం మొదలుపెట్టారు. కొంత సమాచారాన్ని పరిశీలించాక, ఇతర మతగ్రంథాలతో పోలిస్తే బైబిలు ఎంత ప్రత్యేకంగా ఉందో చూసి ఆమె ఆశ్చర్యపోయింది. నెరవేరిన బైబిలు ప్రవచనాల గురించి పరిశీలించాక ఆమె ఇలా అంది: “నాకు తెలిసి, మరే పుస్తకమూ బైబిలంత ఖచ్చితంగా లేదు!”
◼ జపాన్: తనకు దేవుడంటే నమ్మకంలేదని ఒక గృహస్థుడు ప్రచారకునితో చెప్పాడు. అయినా మన సహోదరుడు ఆయనను కలిసి మన పత్రికల్లోని ఆయా ఆర్టికల్స్‌లో ఉన్న సమాచారాన్ని క్లుప్తంగా చర్చించేవాడు. మెల్లమెల్లగా ఆయన తన ఆలోచనను మార్చుకుని సృష్టికర్త ఉండివుంటాడని ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయన దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు. మన సహోదరుడు, దేవుడు చెబుతున్న మంచివార్త! అనే బ్రోషుర్ ఉపయోగించి ఆయనతో అధ్యయనం చేస్తున్నాడు.
◼ కెనడా: ఒక స్త్రీ ఇంట్లోనుండి బయలుదేరి తన కారు దగ్గరకు వెళ్తున్నప్పుడు మన సహోదరి ఆమెకు ఒక తాజా పత్రికను ఇచ్చింది. సహోదరి మళ్లీ కలిసినప్పుడు తనకు ఆసక్తి లేదని, దేవుని మీద నమ్మకం కూడా లేదని ఆమె ఖరాకండిగా చెప్పింది. తన ప్రయత్నాలను విరమించుకోకూడదని, ఆ స్త్రీకి సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు? అనే బ్రోషుర్ ఇవ్వాలని సహోదరి అనుకుంది. సహోదరి ఆమెను ఇంటి దగ్గర కలిసి ఇలా అంది: ‘మీకు దేవుని మీద నమ్మకం లేదని నాకు తెలుసు. అయినా మీరు ఒంటరి తల్లి కాబట్టి మీ గురించి చాలాసేపు ఆలోచించాను.’ మంచి సలహా ఎక్కడ దొరుకుతుందనే దాని గురించి ఆ బ్రోషుర్‌లోని 4వ పేజీలో 6వ పేరాను చూపించింది. తర్వాత, పిల్లలను పెంచడం గురించి 2వ పాఠంలో ఉన్న సలహాలను చదవమని ప్రోత్సహించింది. ఆ స్త్రీ ఎంతో సంతోషంగా బ్రోషుర్ తీసుకుంది.