యెహోవా అధికస్తోత్రము పొందదగినవాడు
ప్రభువు రాత్రి భోజనం ఏప్రిల్ 16న ఆచరించబడుతుంది
1 ఏప్రిల్ 16, 2003 సమీపిస్తున్న కొద్దీ మనలో ఆనందోద్వేగాలు అధికమవుతాయి. ఆ రాత్రి మనం ప్రపంచవ్యాప్తంగా యెహోవా నామమును మహిమపరుస్తున్న లక్షలాదిమంది తోటి ఆరాధకులతోపాటు యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అద్భుతమైన విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేసినందుకు యెహోవా మనందరి స్తోత్రము పొందదగినవాడు. ఆయన ఆ ఏర్పాటు ద్వారానే విధేయులైన మానవులందరిపైనా తన అత్యద్భుతమైన ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. “యెహోవా మహాత్మ్యముగలవాడు, ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు” అని ఎలుగెత్తి చెప్పడంలో మనం కీర్తనకర్తతో హృదయపూర్వకంగా గొంతుకలుపుతాము.—కీర్త. 145:3.
2 దేవుని మంచితనం గురించి, ‘మనము జీవించునట్లు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపినందుకు’ యెహోవాకు మనం చెల్లించవలసిన కృతజ్ఞత గురించి ధ్యానించాల్సిన సమయమిది. (1 యోహా. 4:9, 10) ప్రభువు రాత్రి భోజనాన్ని విధేయతతో ఆచరించడం, “యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు . . . కృపాతిశయముగలవాడు” అని మన మనస్సుల్లో ముద్రించుకుపోయేలా చేస్తుంది. (కీర్త. 145:8) విమోచన క్రయధనం నిజంగానే, యెహోవాకు మానవాళి పట్ల ఉన్న ప్రేమకు అత్యంత గొప్ప వ్యక్తీకరణ. (యోహా. 3:16) మనం దేవుని ప్రేమ గురించి ధ్యానించినప్పుడు, యథార్థతతో కూడిన యేసు విశ్వసనీయమైన జీవన విధానాన్ని మననం చేసుకున్నప్పుడు మనం యెహోవాను స్తుతించేందుకు కదిలించబడతాము. మనకు నిత్యజీవాన్ని సాధ్యం చేయడంలో ఆయన అవధుల్లేని తన ప్రేమను వ్యక్తం చేసినందుకు మనమాయనను శాశ్వతంగా స్తుతిస్తాము.—కీర్త. 145:1, 2.
3 యెహోవాను స్తుతించేందుకు ఇతరులకు సహాయం చేయండి: దేవుడిచ్చిన అత్యున్నత బహుమతి అయిన విమోచన క్రయధనం పట్ల మనకున్న కృతజ్ఞత, మనతో కలిసి యెహోవాను స్తుతించడానికి మనం ఇతరులను ఆహ్వానించేందుకు మనల్ని కదిలిస్తుంది. కీర్తనకర్త ఇలా వ్రాయడానికి ప్రేరేపించబడ్డాడు: “నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతినిగూర్చి వారు గానము చేసెదరు.” (కీర్త. 145:7) యెహోవాసాక్షులు గత సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల కంటే ఎక్కువ గంటలను ప్రకటనా పనికి అంకితం చేశారు. వారి ప్రయత్నాలకు ఫలితమేమిటి? ప్రతి వారం సరాసరి 5,100 కంటే ఎక్కువమంది యెహోవాకు తాము చేసుకున్న సమర్పణకు సూచనగా బాప్తిస్మం పొందారు. జ్ఞాపకార్థ ఆచరణకు మొత్తం 1,55,97,746 మంది హాజరు కాగా వారిలో యెహోవాను స్తుతించడంలో భాగంగా సువార్త ప్రకటించడం ప్రారంభించనివారు 90 లక్షలమంది ఉన్నారు, కాబట్టి అభివృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి! మనం రాజ్య ప్రచారకులుగా సువార్తను ప్రకటించే ఆధిక్యతను, ఇతరుల హృదయాలను యెహోవావైపు, ఆయన కుమారునివైపు, రాజ్యం వైపు మళ్ళించే ఆధిక్యతను ఎంతో విలువైనదిగా ఎంచుతాం.
4 యెహోవాను స్తుతించేందుకు ఇతరులను ప్రోత్సహించడానికి శ్రేష్ఠమైన మార్గమేమిటంటే ప్రభువు రాత్రి భోజన ఆచరణకు మనతోపాటు హాజరుకమ్మని వారిని ఆహ్వానించడం. మీరు ఆహ్వానించదలచుకొన్నవారి పేర్లను, ఆ రోజు గురించి, సమయం గురించి గుర్తుచేయాల్సిన అవసరమున్న ఇతరుల పేర్లను ఒక పట్టికలో వ్రాసుకున్నారా? మీ పట్టికలో ఉన్నవారందరినీ రమ్మని ఆహ్వానించారా? లేనట్లయితే మిగిలి ఉన్న ఈ సమయంలో వారిని ఆహ్వానించండి. ఈ వేడుక ఉద్దేశమేమిటో అర్థం చేసుకునేందుకు వారికి సహాయపడండి. ఆచరణకు హాజరైన సందర్శకులను పలకరించేందుకు సిద్ధంగా ఉండండి. వారు తాము సాదరంగా ఆహ్వానించబడుతున్నామని గ్రహించేలా చేయండి, వారిని ఇతరులకు పరిచయం చేయండి, వచ్చినందుకు వారిని ప్రశంసించండి.
5 కొత్త వాళ్ళు ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించడానికి జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవడం ప్రేరణనివ్వగలదు. పోస్ట్ ట్రామటిక్ స్ట్రెస్ డిసార్డర్, అంటే ప్రజలు ఎక్కువగా ఉండే బహిరంగ స్థలాల్లోకి వెళ్ళేందుకు భయపడే సమస్యవున్న ఒక బైబిలు విద్యార్థి జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యాడు. ఆ కూటమి గురించి ఆయన అభిప్రాయం అడిగినప్పుడు, ఆయనిలా అన్నాడు: “అదొక అత్యంత పవిత్రమైన రాత్రి, దానికి నేను హాజరు కాగలిగాను.” అప్పటినుండి ఆయన కూటాలకు హాజరవడం ప్రారంభించాడు.
6 జ్ఞాపకార్థ ఆచరణ తర్వాత: ఆసక్తిగల వీరు యెహోవాను స్తుతించేవారిగా మారేందుకు సహాయం చేయడానికి మనం ఏమి చేయవచ్చు? జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన కొత్తవారిని పెద్దలు గమనించి, యోగ్యులైన ప్రచారకులు వారిని కలుసుకొని ఆ జ్ఞాపకార్థ ఆచరణలో వారు తెలుసుకున్న, గమనించిన ఉత్తేజకరమైన విషయాల గురించి సమీక్షించేందుకు ఏర్పాటు చేస్తారు. కొందరు గృహ బైబిలు అధ్యయనం కావాలని కోరుకోవచ్చు. క్రమంగా హాజరవడం వారి బైబిలు పరిజ్ఞానాన్ని అధికం చేస్తుంది కాబట్టి, వారంలో జరిగే సంఘ కూటాలన్నింటికి కూడా వారిని ఆహ్వానించాలి.
7 క్రమంగా హాజరుకాని వారిని, నిష్క్రియులుగా మారిన వారిని కూటాలకు క్రమంగా హాజరుకమ్మని ప్రోత్సహించే ఏర్పాట్లు చేయబడతాయి. నిష్క్రియుడిగా మారిన ఒక వ్యక్తి తిరిగి క్షేత్రసేవలో పాల్గొనేందుకు తోడ్పడమని పెద్దలు మిమ్మల్ని కోరితే దానికి ప్రతిస్పందించడానికి సంసిద్ధంగా ఉండండి. మన సహోదరుల పట్ల అలాంటి ప్రేమపూర్వకమైన శ్రద్ధను చూపించడం అపొస్తలుడైన పౌలు చేసిన ఈ ప్రబోధకు అనుగుణంగా ఉంటుంది: “మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.”—గల. 6:10.
8 ఏప్రిల్ 16న జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యేందుకు మనమందరం ప్రత్యేక ప్రయత్నాలు చేద్దాం. యెహోవాను స్తుతించేందుకు మనకు లభిస్తున్న అత్యంత పవిత్రమైన ఈ సందర్భాన్ని చేజార్చుకోవడానికి మనం ఇష్టపడము. అవును యెహోవా చేసిన గొప్ప కార్యములకు ఇప్పుడే కాదు, ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తూనే ఉందాము!—కీర్త. 145:21.