“నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి”
ఏప్రిల్ 2న యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి
1. ఎందుకు 2007 ఏప్రిల్ 2 ప్రాముఖ్యమైన తేదీ?
1 యేసు బలి మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి 2007 ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది సమకూడతారు. యేసు తన పరలోకపు తండ్రి సర్వాధిపత్యాన్ని సమర్థించడానికి, మానవులు స్వార్థపూరిత కారణాలతోనే దేవుణ్ణి సేవిస్తారని అపవాదియైన సాతాను చేసిన ఆరోపణ అబద్ధమని నిరూపించడానికి మరణించాడు. (యోబు 2:1-5) యేసు పరిపూర్ణుడిగా, పాపరహితునిగా మరణించడం ద్వారా, ఆయన “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ని[చ్చాడు]” అని కూడా ప్రభువు రాత్రి భోజనం మనకు గుర్తుచేస్తుంది. (మత్త. 20:28) యేసు తన శిష్యులకు ఇలా ఆజ్ఞాపించాడు: “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి.” (లూకా 22:19) దేవుడిచ్చిన ఈ అమూల్య బహుమానంపట్ల కృతజ్ఞత, ఈ సర్వోత్తమ ప్రేమపూర్వక క్రియను జ్ఞాపకం చేసుకునేందుకు ఇప్పటినుండే సిద్ధపడడానికి మిమ్మల్ని పురికొల్పిందా?—యోహా. 3:16.
2. జ్ఞాపకార్థ ఆచరణకు మన హృదయాన్ని ఎలా సిద్ధపరచుకోవచ్చు?
2 మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి: యేసు మానవ జీవితంలోని చివరిరోజుల్లో ఒక్కో రోజున ఏమి జరిగిందో పరిశీలించడం ద్వారా ఈ జ్ఞాపకార్థ ఆచరణకు మన హృదయాన్ని సిద్ధపరచుకోవచ్చు. (ఎజ్రా 7:10) ఈ విషయంలో మనకు సహాయం చేయడానికి, లేఖనాలను పరిశీలించడం—2007 మరియు 2007—క్యాలెండర్లో ప్రత్యేక బైబిలు పఠన పట్టిక ఇవ్వబడింది. ఈ పఠన పట్టిక, నేడు మనం ఉపయోగించే క్యాలెండరు ప్రకారం, యేసు మరణానికి సంబంధించిన సంఘటనలు ఏ యే రోజున ఏమేమి జరిగాయో సరిగ్గా చూపిస్తుంది. బైబిలు వృత్తాంతంలో రోజులు, తేదీలు యూదుల క్యాలెండరు ఆధారంగా ఇవ్వబడ్డాయి, దాని ప్రకారం సూర్యాస్తమయం నుండి సూర్యాస్తమయం వరకు ఒకరోజుగా లెక్కించబడుతుంది. ఈ తేడాను పరిగణలోకి తీసుకుని, దానికి అనుగుణంగానే జ్ఞాపకార్థ బైబిలు పఠన పట్టిక తయారు చేయబడింది. అలాంటి సమాచారాన్ని పరిశీలించడం, దేవుని గాఢమైన ప్రేమను ప్రార్థనాపూర్వకంగా ధ్యానించడం, జ్ఞాపకార్థ ఆచరణనుండి పూర్తిగా ప్రయోజనం పొందడానికి మనకు సహాయం చేస్తాయి.
3. ఆసక్తిగలవారు, నిష్క్రియులుగా మారినవారు జ్ఞాపకార్థ ఆచరణ నుండి ప్రయోజనం పొందడానికి మనమెలా సహాయం చేయవచ్చు?
3 హాజరవమని ఇతరులను ఆహ్వానించండి: ఈ ప్రాముఖ్యమైన ఆచరణకు ప్రజలను ఆహ్వానించేందుకు ఏర్పాటు చేయబడిన ప్రత్యేక ప్రచార కార్యక్రమం గురించి మన రాజ్య పరిచర్య ఫిబ్రవరి సంచికలోని మధ్యపేజీ తెలియజేసింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పూర్తిగా భాగం వహించడానికి మీరు ఏర్పాట్లు చేసుకున్నారా? పరిచయస్థులను ఆహ్వానించడానికి పట్టిక తయారుచేసుకున్నారా, మీరు వారిని కలుసుకోవడం ప్రారంభించారా? జ్ఞాపకార్థ ఆచరణ జరిగే సాయంత్రం, మీరు ఆహ్వానించినవారిని, అలాగే ఆసక్తిగల ఇతరులను స్వాగతించడానికి వీలైనంత త్వరగా వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోండి. వారికి బైబిలు, పాటల పుస్తకం చూపించడానికి వీలుగా మీరు వారితో కూర్చోవాలనుకోవచ్చు. సంఘంలోని ఇతరులకు వారిని పరిచయం చేయండి. కార్యక్రమం ముగిసిన తర్వాత, వారి ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు సమయం వెచ్చించండి. ఏప్రిల్ 15న ఇవ్వబడే ప్రత్యేక బహిరంగ ప్రసంగానికి హాజరవమని వారిని ఆహ్వానించండి. సంఘంతో సహవసించి ఇప్పుడు నిష్క్రియులుగా మారినవారు జ్ఞాపకార్థ ఆచరణకు, ప్రత్యేక ప్రసంగానికి ఆహ్వానించబడేలా చూసేందుకు పెద్దలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
4. జ్ఞాపకార్థ ఆచరణ తర్వాత ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి ప్రజలకు మనమెలా సహాయం చేయవచ్చు?
4 క్రొత్తగా ఆసక్తి చూపిస్తున్నవారు, నిష్క్రియులు ప్రగతి సాధించడానికి సహాయం చేయండి: జ్ఞాపకార్థ ఆచరణ ప్రసంగాన్నిస్తున్న సహోదరుడు బైబిలు అధ్యయన ఏర్పాట్ల గురించి క్లుప్తంగా వివరించి, యెహోవా గురించి నేర్చుకోవడంలో కొనసాగమని క్రొత్తగా ఆసక్తి చూపిస్తున్నవారిని ప్రోత్సహిస్తాడు. మీరు ఆహ్వానించినవారికి మరింత ఆధ్యాత్మిక సహాయం అందించడానికి ప్రసంగీకుని వ్యాఖ్యానాలను ఆధారంగా తీసుకోవచ్చు. ప్రస్తుతం వారు బైబిలు అధ్యయనం చేయడం లేదంటే, జ్ఞాపకార్థ ఆచరణ ముగిసిన వెంటనే వారిని కలిసి, ఉచిత బైబిలు అధ్యయన ఏర్పాటును ప్రదర్శించండి. ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించాలంటే వారు సంఘ కూటాలకు కూడా హాజరవాల్సివుంటుంది. (హెబ్రీ. 10:24, 25) దీన్ని మనసులో ఉంచుకుని, కూటాలకు క్రమంగా రావడం ప్రారంభించమని వారిని ప్రోత్సహించండి. జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన నిష్క్రియులైన క్రైస్తవులను పెద్దలు సందర్శించి, ప్రసంగంలో చెప్పబడిన విషయాల గురించి మరింతగా ఆలోచించడానికి వారికి సహాయం చేయాలనుకోవచ్చు. వారు తిరిగి సంఘంలో క్రియాశీలురయ్యేలా అది ప్రోత్సహించవచ్చు.
5. జ్ఞాపకార్థ ఆచరణను ఆచరించడం మనపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది?
5 యెహోవా, యేసు మనకోసం చేసిన దాని గురించి గంభీరంగా ధ్యానించడానికి జ్ఞాపకార్థ ఆచరణ మంచి అవకాశాన్నిస్తుంది. అలా ధ్యానించడం వారిపట్ల మనకున్న ప్రేమను ప్రగాఢం చేస్తుంది, మన ప్రవర్తనపై ప్రభావం చూపిస్తుంది. (2 కొరిం. 5:14, 15; 1 యోహా. 4:11) మనం ‘ప్రభువు మరణమును ప్రచురించే’ ఈ ప్రాముఖ్యమైన సందర్భానికి మనల్నిమనం సిద్ధపరచుకోవడం, ఆసక్తిగలవారిని సిద్ధం చేయడం ఆరంభించవలసిన సమయం ఇదే.—1 కొరిం. 11:26.