విమోచన క్రయధనంనుండి ప్రయోజనం పొందేలా ఇతరులకు సహాయం చేయండి
క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ ఏప్రిల్ 12న ఆచరించబడుతుంది
1. దేవుని ప్రజలు విమోచనా క్రయధనంపట్ల తమ కృతజ్ఞతను చూపించే ఒక మార్గం ఏమిటి?
1 “చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము.” (2 కొరిం. 9:15) తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన ప్రజలపట్ల చూపించే మంచితనం, కృపల విషయంలో మనకున్న మనోభావనను ఆ మాటలు సరిగ్గా వ్యక్తం చేస్తున్నాయి. ఏప్రిల్ 12న క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకోవడానికి మనం సమకూడినప్పుడు అటువంటి కృతజ్ఞతాభావం ప్రత్యేకంగా బహిర్గతమవుతుంది.
2. జ్ఞాపకార్థ ఆచరణకు యెహోవా సేవకులతోపాటు ఎవరు కూడా హాజరవుతారు, విమోచన క్రయధనం నుండి ప్రయోజనం పొందాలంటే వారు ఏమి చేయాలి?
2 ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు యెహోవా సేవకులతోపాటు దాదాపు కోటిమంది ఇతరులు కూడా హాజరవుతారు. అలా హాజరవడం ద్వారా సాక్షులుకానివారు క్రీస్తు బలిపట్ల తమకు కొంతైనా కృతజ్ఞత ఉందని చూపిస్తారు. అయితే, వారు ఆ విమోచన క్రయధనం నుండి ప్రయోజనం పొందాలంటే, దానిమీద వారు విశ్వాసముంచాలి. (యోహా. 3:16, 36) అలాంటి విశ్వాసం పెంపొందించుకొనేందుకు వారికి మనమెలా సహాయం చేయవచ్చు? ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో, వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేయమనీ, వారపు సంఘ కూటాలకు హాజరవమనీ మనం వారిని ప్రోత్సహించవచ్చు. ఈ క్రింది సలహాలను గమనించండి.
3. మనం జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించేటప్పుడు బైబిలు అధ్యయనం ఎలా ప్రారంభించవచ్చు?
3 బైబిలు అధ్యయనాలు: మీరు ఆసక్తిగలవారిని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించినప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఉపయోగిస్తూ వారితో బైబిలు అధ్యయనం ఎందుకు ప్రారంభించకూడదు? ఆ పుస్తకంలోని 206-8 పేజీలను తెరిచి, “ప్రభువు రాత్రి భోజనం—దేవుణ్ణి మహిమపరిచే ఆచరణ” అనే అంశాన్ని చర్చించడం ద్వారా ఆ వ్యక్తికి జ్ఞాపకార్థ ఆచరణ గురించి వివరించడానికి ప్రయత్నించండి. మీరు ఈ సమాచారాన్ని బహుశా గుమ్మం దగ్గర బైబిలు అధ్యయనం చేస్తున్నట్లే ఒకటి లేదా రెండు సందర్శనాల్లో చర్చించవచ్చు. మీరు ఆ భాగాన్ని పూర్తిచేసిన తర్వాత, ఆ వ్యక్తి, “విమోచన క్రయధనం—దేవుడిచ్చిన అతిగొప్ప బహుమానం” అనే 5వ అధ్యాయాన్ని చర్చించడానికి ఇష్టపడవచ్చు. ఒకసారి క్రమంగా బైబిలు అధ్యయనం ప్రారంభమైన తర్వాత, ఆ పుస్తకం ప్రారంభంలోవున్న నాలుగు అధ్యాయాలను చర్చించండి.
4. జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో మనం ఎవరితో బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించవచ్చు?
4 పై పద్ధతిని ఉపయోగించి మనం ఎవరికి బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించవచ్చు? బహుశా మీ తోటి ఉద్యోగస్థులు, తోటి విద్యార్థులు లేదా మీ పొరుగువారిలో కొందరు అలాంటి చర్చలకు అంగీకరించవచ్చు. సహోదరులు సంఘంలోని సహోదరీల అవిశ్వాసులైన భర్తలతో ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. సాక్షులుకాని మీ బంధువులను మరిచిపోకండి. వారినేకాక, ఒకప్పుడు సంఘంతో క్రమంగా సహవసించిన వారిని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించడానికి మనం ప్రత్యేకంగా కృషి చేయాలనుకుంటాం. (లూకా 15:3-7) అలాంటివారందరూ విమోచన క్రయధనంనుండి ప్రయోజనం పొందేందుకు సహాయం చేయడానికి మనం కృషి చేద్దాం.
5. బైబిలు విద్యార్థులను, ఆసక్తిగల ఇతరులను వారపు సంఘ కూటాలకు హాజరుకమ్మని మనమెలా ప్రోత్సహించవచ్చు?
5 సంఘకూటాలు: జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యే చాలామంది బైబిలు విద్యార్థులకు, ఇతర ఆసక్తిగలవారికి అది వారు హాజరవుతున్న మొదటి కూటం. కానీ ఇతర సంఘ కూటాలనుండి కూడా ప్రయోజనం పొందమని వారిని మనమెలా ప్రోత్సహించవచ్చు? ఏప్రిల్ 2005, మన రాజ్య పరిచర్య, 8వ పేజీ, ఈ సలహాలు ఇచ్చింది: “తర్వాతి వారంలో ఇవ్వబడే బహిరంగ ప్రసంగ ముఖ్యాంశాన్ని పేర్కొనండి. కావలికోట అధ్యయనంలో, సంఘ పుస్తక అధ్యయనంలో పరిశీలించే సమాచారాన్ని చూపించండి. దైవపరిపాలనా పరిచర్య పాఠశాల గురించి, సేవా కూటం గురించి వివరించండి. మీకు పాఠశాలలో నియామకం ఉంటే బహుశా మీరు దానిని వారితో ముందుగా అభ్యాసం చేయవచ్చు. కూటాల్లో అందించే విశేష అంశాలను పంచుకోండి. వారు కూటాల్లో జరిగేవాటిని మనస్సులో చిత్రీకరించుకొనేందుకు సహాయం చేయడానికి మన ప్రచురణల్లోని చిత్రాలను ఉపయోగించండి. వారితో మొదటి అధ్యయనం చేసినప్పటి నుండి వారిని కూటాలకు హాజరుకమ్మని ఆహ్వానించండి.”
6. యథార్థహృదయులు విమోచన క్రయధనం నుండి ప్రయోజనం పొందడానికి మనం ఏ రెండు విధాలుగా వారికి సహాయం చేయవచ్చు?
6 యథార్థహృదయులు క్రమంగా బైబిలు అధ్యయనం చేస్తూ, క్రమంగా సంఘ కూటాలకు హాజరవుతున్నప్పుడే తరచూ వేగంగా ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తారు. కాబట్టి, ఇటువంటి ఆధ్యాత్మిక ఏర్పాట్లనుండి, దేవుడిచ్చిన అతిగొప్ప బహుమతియైన విమోచన క్రయధనంనుండి ప్రయోజనం పొందమని మనం ఇతరులను ప్రోత్సహిద్దాం.