ఒక ప్రాముఖ్యమైన సహస్రాబ్ది కోసం సిద్ధపడండి!
క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన మానవ కుటుంబానికి ఊహించనలవికానన్ని ఆశీర్వాదాలను తెస్తుంది. యేసు ప్రేమపూర్వక నడిపింపు క్రింద, మానవజాతి ప్రస్తుత దుర్భర స్థితి నుండి మహిమాన్వితమైన పరిపూర్ణతకు తీసుకురాబడుతుంది. మీకు దాని భావం ఏమై ఉండగలదో ఆలోచించండి. సంపూర్ణమైన ఆరోగ్యం! ప్రతి ఉదయం మునుపటికన్నా మంచి ఆరోగ్యంతో నిద్రలేవడం గురించి ఆలోచించండి. లక్షలాదిమంది స్త్రీపురుషులు, పిల్లలు ఆ సంతోషభరితమైన సమయంలో జీవించాలని ఎదురు చూస్తున్నారు. వాళ్లు ఆ కాలం తప్పక వస్తుందని దానికోసం నిరీక్షిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఈ ఆశీర్వాదాలు తమకు లభిస్తాయని, వారు చేసిన బైబిలు అధ్యయనం వారికి హామీనిచ్చింది.
అయితే, యేసుక్రీస్తు తన వెయ్యేండ్ల పరిపాలనను ప్రారంభించే ముందు, తన పరిపాలనను వ్యతిరేకించే వారందరినీ భూమిపై నుండి నిర్మూలిస్తాడు. ఆయన దీన్ని, బైబిల్లో అర్మగిద్దోను అని పిలువబడుతున్న యుద్ధంలో చేస్తాడు. (ప్రకటన 16:15) భూమిపైనున్న నిజక్రైస్తవులు ఆ యుద్ధంలో పోరాడరు. అది దేవుని యుద్ధం. అది ఒక భౌగోళిక ప్రాంతానికి పరిమితమై ఉండదు. అది భూదిగంతముల వరకూ చేరుతుందని బైబిలు చెబుతుంది. క్రీస్తు పరిపాలనా వ్యతిరేకులు వధించబడతారు. ఎవ్వరూ తప్పించుకోలేరు!—యిర్మీయా 25:33.
అప్పుడు యేసు తన అవధానాన్ని అపవాది అయిన సాతాను వైపుకు, అతని దయ్యాల వైపుకు మళ్లిస్తాడు. ఆ దృశ్యాన్ని మీ కళ్లెదుట చిత్రించుకోండి, ప్రకటన గ్రంథ రచయిత దాన్నిలా చూశాడు: “పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధముయొక్క తాళపుచెవిగల యొక దేవదూత [యేసుక్రీస్తు] పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్య సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవే[సెను].” (ప్రకటన 20:1, 2) తర్వాత, సాతాను అతని దయ్యాలు శాశ్వతంగా నాశనం చేయబడతారు.—మత్తయి 25:41.
“యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము” అర్మగిద్దోనును తప్పించుకుని జీవిస్తుంది. (ప్రకటన 7:9) ఒక గొఱ్ఱెల కాపరి తన గొఱ్ఱెలను జీవదాయక నీటి వద్దకు నడిపించినట్లుగా, క్రీస్తు వీరిని “జీవజలముల బుగ్గల” నుండి పూర్తి ప్రయోజనం పొందేందుకు నడిపిస్తాడు. (ప్రకటన 7:17) అర్మగిద్దోనును తప్పించుకుని వచ్చేవారు, తమ ఆధ్యాత్మిక పురోభివృద్ధిలో సాతాను అతని దయ్యాలచే అడ్డగించబడకుండా, చివరికి పరిపూర్ణతకు చేరుకునేంత వరకు తమ పాపభరిత దృక్పథాలను అధిగమించేందుకు సహాయాన్ని పొందుతారు.
క్రీస్తు ప్రేమపూర్వక పరిపాలన క్రింద జీవన పరిస్థితులు క్రమక్రమంగా మెరుగుపడతాయి. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ద్వారా, బాధా వేదనలకు కారణమైనవాటన్నింటినీ నిర్మూలిస్తాడు. ఆయన, “వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.” (ప్రకటన 21:4) ప్రవక్తయైన యెషయా, “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును” అని చెబుతూ ఆ దృశ్యాన్ని సంపూర్ణం చేస్తున్నాడు. (యెషయా 35:5, 6) “గొప్పవారేమి కొద్దివారేమి” మృతులైన వారందరూ మళ్లీ ఇక ఎన్నడూ మరణించకుండా జీవించే ఉత్తరాపేక్షతో తిరిగి జీవానికి తీసుకురాబడతారు!—ప్రకటన 20:12.
ఇప్పుడు అర్మగిద్దోనును తప్పించుకుని జీవించే “గొప్ప సమూహము” సమకూర్చబడుతోంది. వాళ్లు క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన కోసం సిద్ధమౌతున్నారు. ఆ పరిపాలన ఎప్పుడు ప్రారంభమౌతుందో వాళ్లకు తెలియకపోయినప్పటికీ, దేవుని నిర్ణీత కాలంలో అది వస్తుందని వాళ్లు దృఢ నిశ్చయత కల్గివున్నారు. మీరూ వారిలో ఒకరై ఉండవచ్చు, కాని మీరు కూడా సిద్ధపడాలి, అంటే మీ ఆస్తులను అమ్ముకుని ఏదోక భౌగోళిక ప్రాంతానికి తరలి వెళ్లడం ద్వారా కాదుగానీ, బైబిలు పఠనం ద్వారా యెహోవా దేవుని గురించీ ఆయన సంకల్పాల గురించీ కచ్చితమైన జ్ఞానాన్ని పొందడం ద్వారానే. బైబిలు పఠనం మీకూ, మీ కుటుంబానికీ ఎలా ప్రయోజనం చేకూర్చగలదో యెహోవాసాక్షులు సంతోషంగా మీకు చూపిస్తారు, దాని కోసం మీరు డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు, మీరు కట్టుబడివుండాల్సి వస్తుందని భయపడనవసరం లేదు. ఈ పత్రిక ప్రచురణకర్తలు సంతోషంగా మీకు మరింత సమాచారాన్ని అందజేస్తారు.
[7వ పేజీలోని బాక్సు]
వెయ్యి సంవత్సరాలు—అక్షరార్థమా లేక సూచనార్థకమా?
బైబిలు పుస్తకమైన ప్రకటన గ్రంథంలోని ఎక్కువ భాగం సూచనార్థక భాషలో వ్రాయబడింది గనుక, ఒక ప్రశ్న తలెత్తుతుంది. ప్రకటనలో ప్రస్తావించబడిన క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన మాటేమిటి? అది అక్షరార్థ కాలమా లేక సూచనార్థక కాలమా?
అక్కడ ఉద్దేశించబడినది అక్షరార్థ వెయ్యేండ్ల కాలమే అనడానికి కచ్చితమైన దాఖలాలు ఉన్నాయి. ఇది పరిశీలించండి: మానవజాతి తీర్పు తీర్చబడే క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన గురించి అపొస్తలుడైన పౌలు ఒక దినం అని ప్రస్తావిస్తున్నాడు. (అపొస్తలుల కార్యములు 17:31; ప్రకటన 20:4) యెహోవాకు ఒక దినం (24 గంటలు) వెయ్యి సంవత్సరాలవంటిదని అపొస్తలుడైన పేతురు వ్రాశాడు. (2 పేతురు 3:8) ఈ తీర్పు “దినం” అక్షరార్థంగా వెయ్యేండ్ల కాలమని అది సూచిస్తుంది. అంతేగాక, ప్రకటన 20:3, 5-7 నందు మనం నాలుగుసార్లు “వెయ్యి సంవత్సరములు” అని మాత్రమే కాక, “ఆ వెయ్యి సంవత్సరములు” అని కూడా చదువుతాము. ఇది ఒక నిర్దిష్టమైన నిడివిగల కాలాన్ని సూచిస్తుండవచ్చు.