కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 11/1 పేజీలు 4-6
  • మూడవ సహస్రాబ్దం ఎప్పుడు ప్రారంభమౌతుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మూడవ సహస్రాబ్దం ఎప్పుడు ప్రారంభమౌతుంది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు ఎప్పుడు జన్మించాడు?
  • వారి సహస్రాబ్ద నిరీక్షణలు చిన్నాభిన్నమైపోతాయా?
  • మరీ ముందా లేక మరీ ఆలస్యమా?
    తేజరిల్లు!—2000
  • 2000—ప్రత్యేకమైన సంవత్సరమా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • 2000 సంవత్సరం ఎంత ప్రాముఖ్యమైనది?
    తేజరిల్లు!—1998
  • నూతన సహస్రాబ్ది—అది మీకు ఎలాంటి భవిష్యత్తును తీసుకువస్తుంది?
    నూతన సహస్రాబ్ది—అది మీకు ఎలాంటి భవిష్యత్తును తీసుకువస్తుంది?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 11/1 పేజీలు 4-6

మూడవ సహస్రాబ్దం ఎప్పుడు ప్రారంభమౌతుంది?

మూడవ సహస్రాబ్దం 2000వ సంవత్సరంలో కాదుగానీ 2001వ సంవత్సరంలో ప్రారంభమౌతుందన్న వాదనను మీరు విన్నారా? ఆ వాదన కరక్టే—కొంతమేరకు. కొందరు ఒకప్పుడు అనుకున్నట్లుగా, ఇప్పుడు సా.శ.పూ. 1వ సంవత్సరమని పిలువబడుతున్న సంవత్సరంలో యేసుక్రీస్తు జన్మించాడని మనం అనుకుంటే, అప్పుడు (1999 కాదుగాని) 2000, డిసెంబరు 31, రెండవ సహస్రాబ్ద ముగింపును, 2001, జనవరి 1, మూడవ సహస్రాబ్ద ఆరంభాన్ని సూచిస్తాయి.a అయితే, యేసుక్రీస్తు సా.శ.పూ. 1వ సంవత్సరంలో జన్మించలేదని నేడు దాదాపు పండితులందరూ ఒప్పుకుంటారు. మరైతే, ఆయన ఎప్పుడు జన్మించాడు?

యేసు ఎప్పుడు జన్మించాడు?

యేసు నిర్దిష్టంగా ఏ తేదీన జన్మించాడన్నది బైబిలు తెలియజేయడంలేదు. అయితే, ఆయన “రాజైన హేరోదు దినముల”లో జన్మించాడని మాత్రం అది తెలియజేస్తుంది. (మత్తయి 2:1) హేరోదు సా.శ.పూ. 4వ సంవత్సరంలో మరణించాడనీ, యేసు అంతకన్నా ముందే జన్మించాడనీ, అంటే బహుశా సా.శ.పూ. 5 లేక 6లో జన్మించి ఉంటాడనీ చాలామంది బైబిలు పండితులు నమ్ముతారు. మొదటి శతాబ్దపు యూదా చరిత్రకారుడైన ఫ్లేవియస్‌ జోసీఫస్‌ చేసిన వ్యాఖ్యానాల ఆధారంగా వాళ్లు హేరోదు మరణాన్ని గురించిన ముగింపులకు వస్తున్నారు.b

జోసీఫస్‌ చెప్తున్న దాని ప్రకారం, హేరోదు రాజు మరణించడానికి కొంచెం ముందు, చంద్రగ్రహణం ఏర్పడింది. సా.శ.పూ. 4వ సంవత్సరం, మార్చి 11న పాక్షికంగా ఏర్పడిన చంద్రగ్రహణం హేరోదు ఆ సంవత్సరం మరణించి ఉంటాడనటానికి నిదర్శనమని బైబిలు పండితులు సూచిస్తున్నారు. అయితే, సా.శ.పూ. 1వ సంవత్సరంలో, జనవరి 8న పూర్ణ చంద్రగ్రహణం, డిసెంబరు 27న పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడ్డాయి. జోసీఫస్‌ సా.శ.పూ. 1వ సంవత్సరంలో ఏర్పడిన వాటిల్లో ఒక గ్రహణాన్ని ఉద్దేశిస్తున్నాడో లేక సా.శ.పూ. 4వ సంవత్సరంలో ఏర్పడిన గ్రహణాన్ని ఉద్దేశిస్తున్నాడో ఎవరూ చెప్పలేరు. తత్ఫలితంగా, హేరోదు మరణించిన కచ్చితమైన సంవత్సరాన్ని సూచించడానికి మనం జోసీఫస్‌ మాటలను ఉపయోగించలేము. ఒకవేళ మనం ఉపయోగించగల్గినప్పటికీ, మరింత సమాచారం లేకుండా యేసు ఎప్పుడు జన్మించినదీ మనం నిర్ధారణగా చెప్పలేము.

యేసు జనన తేదీని గురించిన అతి బలమైన సాక్ష్యాధారం మనకు బైబిలు నుండి లభిస్తుంది. రోమా పరిపాలకుడైన తిబెరి కైసరు పరిపాలనలోని 15వ సంవత్సరంలో, యేసు బంధువైన బాప్తిస్మమిచ్చే యోహాను ప్రవక్తగా తన పనిని ప్రారంభించాడని ప్రేరేపిత లేఖనాలు చెప్తున్నాయి. (లూకా 3:1, 2) తిబెరి సా.శ. 14వ సంవత్సరం సెప్టెంబరు 15న చక్రవర్తి అయ్యాడని లౌకిక చరిత్ర ధృవీకరిస్తోంది, కాబట్టి అతని పరిపాలనలోని 15వ సంవత్సరం, సా.శ. 28వ సంవత్సరం యొక్క చివరి భాగం నుండి సా.శ. 29వ సంవత్సరం చివరి భాగం వరకూ ఉంటుంది. యోహాను తన పరిచర్యను ఆ కాలంలోనే ప్రారంభించాడు, యేసు తన పరిచర్యను ఆరు నెలల తర్వాత ప్రారంభించాడని స్పష్టమౌతుంది. (లూకా 1:24-31) ఇదీ, దీనితోపాటు ఇతర సాక్ష్యాధారాలన్నీ కలిపి, యేసు పరిచర్య సా.శ. 29వ సంవత్సరం శరదృతువులో ఆరంభమైందని చూపిస్తాయి.c యేసు తన పరిచర్యను ప్రారంభించేనాటికి “ముప్పది ఏండ్ల” వాడని బైబిలు తెలియజేస్తుంది. (లూకా 3:23) ఆయన సా.శ. 29వ సంవత్సరం శరదృతువులో 30 ఏండ్ల వాడంటే, ఆయన సా.శ.పూ. 2వ సంవత్సరం శరదృతువులో జన్మించి ఉండాలి. ఇప్పుడు మనం (సున్న సంవత్సరం లేదు గనుక, సా.శ.పూ 2 నుండి సా.శ. 1కి రెండు సంవత్సరాలని గుర్తుంచుకుని) సా.శ.పూ. 2వ సంవత్సరం శరదృతువు నుండి రెండు వేల సంవత్సరాలు ముందుకు లెక్కిస్తే, 1999 శరదృతువులో రెండవ సహస్రాబ్దం ముగిసిందనీ, మూడవ సహస్రాబ్దం ప్రారంభమైందనీ మనం గ్రహిస్తాము!

అది ప్రాముఖ్యమైనదేనా? ఉదాహరణకు, మూడవ సహస్రాబ్ద ప్రారంభం, ప్రకటన గ్రంథంలో పేర్కొనబడిన, యేసుక్రీస్తు యొక్క వెయ్యేండ్ల పరిపాలనారంభాన్ని సూచిస్తుందా? లేదు. మూడవ సహస్రాబ్దానికీ, క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనకూ సంబంధం ఉన్నట్లు బైబిలు ఎక్కడా సూచించడం లేదు.

తేదీలను ఊహించవద్దని యేసు తన అనుచరులను హెచ్చరించాడు. ఆయన తన శిష్యులకిలా చెప్పాడు: “కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచు కొనియున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.” (అపొస్తలుల కార్యములు 1:7) క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనకు మార్గం సుగమం చేస్తూ దేవుడు ఈ దుష్ట విధానంపై ఎప్పుడు తీర్పుతీరుస్తాడనేది తనకు కూడా అప్పుడు తెలియదని యేసు మునుపు ఒకసారి తెలియజేశాడు. “ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు” అని ఆయన చెప్పాడు.—మత్తయి 24:36.

క్రీస్తు మానవునిగా జన్మించిన తేదీ నుండి సరిగ్గా 2,000 సంవత్సరాలకు తిరిగి వస్తాడని ఎదురు చూడటం సహేతుకమైనదేనా? ఎంతమాత్రం కాదు. యేసుకు తన జన్మ తేదీ తెలిసే ఉండవచ్చు. ఆ తేదీ నుండి 2,000 సంవత్సరాలను ఎలా లెక్కించాలో ఆయనకు కచ్చితంగా తెలుసు. అయినప్పటికీ, ఆయనకు తాను తిరిగి వచ్చే దినముగానీ గడియగానీ తెలియలేదు. ఆయన తిరిగి వచ్చే తేదీని కచ్చితంగా చెప్పడం అంత సులభం కాదని స్పష్టమౌతుంది! ‘కాలములు సమయములు’ తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, అంటే కాల పట్టిక ఆయనకు మాత్రమే తెలియాలి.

అంతేగాక, ఒక నిర్దిష్టమైన భౌగోళిక స్థలంలో తన కోసం వేచి ఉండమని యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించలేదు. కలిసి సమకూడి వేచి ఉండమని ఆయన వారికి చెప్పలేదు గానీ “భూదిగంతముల వరకు” చెదరిపోయి, అన్ని జనాంగాల ప్రజలను శిష్యులనుగా చేయమని ఆజ్ఞాపించాడు. ఆయన ఎన్నడూ ఆ ఆజ్ఞను వెనక్కు తీసుకోలేదు.—అపొస్తలుల కార్యములు 1:8; మత్తయి 28:19, 20.

వారి సహస్రాబ్ద నిరీక్షణలు చిన్నాభిన్నమైపోతాయా?

ఏదేమైనప్పటికీ, కొంతమంది మత ఛాందసవాదులు 2000వ సంవత్సరం గురించి గొప్ప ఆశలు పెట్టుకుని ఉన్నారు. రాబోయే కొద్ది నెలల్లో, ప్రకటన గ్రంథంలోని కొన్ని భాగాలు అక్షరార్థంగా నెరవేరుతాయని వాళ్లు నమ్ముతున్నారు. నిజానికి, ఆ నెరవేర్పులో తాము వ్యక్తిగతంగా భాగం వహిస్తున్నట్లు వాళ్లు భావిస్తారు. ఉదాహరణకు, ‘తమ ప్రభువు కూడ సిలువవేయబడిన, ఆధ్యాత్మిక భావంలో సొదొమ అనియు ఐగుప్తు అనియు పిలువబడిన మహాపట్టణములో’ ప్రవచించిన ఇద్దరు సాక్షుల గురించి చెప్పే, ప్రకటన 11:3, 7, 8లో వ్రాయబడివున్న ప్రవచనాన్ని వాళ్లు సూచిస్తారు. వాళ్లు తమ సాక్ష్యపు పనిని ముగించినప్పుడు, అగాధంలోనుండి బయటికి వచ్చే భయంకరమైన క్రూరమృగం ఆ ఇద్దరు సాక్షులను చంపేస్తుంది.

1998, డిసెంబరు 27 నాటి ద న్యూ యార్క్‌ టైమ్స్‌ మ్యాగజైన్‌లోని ఒక నివేదిక ప్రకారం, ఒక మతగుంపు నాయకుడు, “భూమికి సంభవించనైయున్న నాశనాన్నీ, ప్రభువు రాకడనూ ప్రకటించి యెరూషలేము వీధులలో సాతానుచే వధించబడే ఇద్దరు సాక్షులలో తాను ఒకడినని తన అనుచరులకు చెప్పాడు.” ఇశ్రాయేల్‌ అధికారులు కలవరపడ్డారంటే అది అర్థం చేసుకొనదగినదే. కొంతమంది తీవ్రవాదులు తమ స్వంతగా ప్రవచనాన్ని “నెరవేర్చడానికి” ప్రయత్నిస్తారేమోనని, అంటే అది సాయుధ సంఘర్షణకు దారి తీసినప్పటికీ అలా చేయడానికి ప్రయత్నిస్తారేమోనని వాళ్లు భయపడుతున్నారు! అయితే, తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి దేవునికి మానవుని “సహాయం” అవసరం లేదు. బైబిలు ప్రవచనాలన్నీ దేవుని స్వంత సమయంలో, దేవుని స్వంత పద్ధతిలో నెరవేరుతాయి.

ప్రకటన గ్రంథం ‘సూచనల్లో’ వ్రాయబడింది. ప్రకటన 1:1 ప్రకారం, త్వరలోనే జరుగబోయే వాటిని యేసు (లోకానికి కాదుగాని) “తన దాసులకు” తెలియజేయాలని అనుకున్నాడు. ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి క్రీస్తు దాసులకు లేక అనుచరులకు దేవుని పరిశుద్ధాత్మ అవసరం, యెహోవా తనను ప్రీతిపర్చే వారికి దాన్ని ఇస్తాడు. ప్రకటన గ్రంథాన్ని అక్షరార్థంగా అర్థం చేసుకోవాలంటే, విశ్వాసం లేని వాళ్లు సహితం దాన్ని చదివి అర్థం చేసుకోవచ్చు. అప్పుడిక దాన్ని అర్థం చేసుకోవడానికి క్రైస్తవులు పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించవలసిన అవసరమే ఉండదు.—మత్తయి 13:10-15.

బైబిలు సాక్ష్యాధారం ప్రకారం, యేసు జననం నుండి మూడవ సహస్రాబ్దం 1999 శరదృతువులో ప్రారంభమౌతుందనీ, ఆ తేదీగానీ లేక 2000 జనవరి 1 గానీ, లేక 2001 జనవరి 1 గానీ ఏ ప్రత్యేకతా కలిగిలేవనీ మనం చూశాము. అయినప్పటికీ, క్రైస్తవులకు ఎంతో ఆసక్తికరమైన ఒక సహస్రాబ్దం ఉంది. మూడవ సహస్రాబ్దం కాకపోతే మరింకేది? ఈ పరంపరలోని చివరి శీర్షిక దానికి సమాధానమిస్తుంది.

[అధస్సూచీలు]

a 5వ పేజీలో ఉన్న “2000 లేక 2001?” అనే బాక్సును చూడండి.

b ఈ పండితుల కాలగణనం ప్రకారం, మూడవ సహస్రాబ్దం 1995లో లేక 1996లో ఆరంభమై ఉండేది.

c మరిన్ని వివరాల కోసం, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం) సంపుటి 1, 1094-5 పేజీలను దయచేసి చూడండి.

[5వ పేజీలోని బాక్సు]

2000 లేక 2001?

యేసు జననం నుండి మూడవ సహస్రాబ్దం 2001, జనవరి 1న ప్రారంభమౌతుందని కొందరెందుకు అంటారో అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణను పరిశీలించండి. మీరు 200 పేజీలుగల ఒక పుస్తకాన్ని చదువుతున్నారనుకోండి. 200వ పేజీ పైభాగానికి చేరుకున్నప్పుడు మీరు 199 పేజీలు చదివేశారు, ఇంకా ఒక పేజీ చదవవలసి ఉంది. మీరు 200వ పేజీ చివరికి చేరుకునే వరకూ మీరు పుస్తకాన్ని ముగించినట్లు కాదు. అలాగే, సాధారణంగా దృష్టించబడుతున్నట్లుగా, 1999 డిసెంబరు 31న ప్రస్తుత సహస్రాబ్దంలోని 999 సంవత్సరాలు గడిచిపోయి, సహస్రాబ్దం ముగియడానికి ఇంకా ఒక సంవత్సరం గడవవలసి ఉంటుంది. ఆ లెక్కింపు ప్రకారం, మూడవ సహస్రాబ్దం 2001, జనవరి 1న ప్రారంభమౌతుంది. అయితే, ఈ శీర్షిక చూపిస్తున్నట్లుగా, ఆ తేదీనాటికి యేసు జనన తేదీ నుండి సరిగ్గా 2,000 సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయని దాని భావం కాదు.

[6వ పేజీలోని బాక్సు]

క్రీ.పూ.-క్రీ.శ. అనే లెక్కింపు అభివృద్ధి చెందిన విధానం

సా.శ. ఆరవ శతాబ్దం తొలిభాగంలో పోప్‌ జాన్‌ 1, చర్చీలు ఈస్టర్‌ను జరుపుకోవడానికి ఒక అధికారిక తేదీని నియమించుకునేందుకు ఒక విధమైన లెక్కింపు విధానాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను డయోనిసియస్‌ ఎక్సీగూస్‌ అనే సన్యాసికి అప్పగించాడు.

డయోనిసియస్‌ తన పనిని ప్రారంభించాడు. ఆయన సమయాన్ని వెనక్కి లెక్కించి, అంటే యేసు మరణ తేదీనీ దాటి వెళ్లి, యేసు జనన సంవత్సరమని తాను తలంచిన సమయం వరకు లెక్కించాడు; ఇక అక్కడి నుండి ముందుకు ఒక్కో సంవత్సరానికి సంఖ్యలు నిర్ణయిస్తూ వచ్చాడు. డయోనిసియస్‌ యేసు జననానికి తర్వాతి కాలాన్ని “క్రీ.శ.” (అన్నో డోమిని—“మన ప్రభువు సంవత్సరంలో”) అని సూచించాడు. ప్రతి సంవత్సరం ఈస్టర్‌ను లెక్కించేందుకు ఒక నమ్మకమైన విధానాన్ని నెలకొల్పాలన్న ఉద్దేశం మాత్రమే ఉన్న డయోనిసియస్‌, క్రీస్తు జననం నుండి సంవత్సరాలను ముందుకు లెక్కించే పద్ధతిని తనకు తెలియకుండానే ప్రవేశపెట్టాడు.

డయోనిసియస్‌ తన లెక్కింపులకు ఆధారంగా ఉపయోగించిన సంవత్సరంలో యేసు జన్మించలేదని అనేకమంది పండితులు అంగీకరించినప్పటికీ, అతడు ప్రవేశపెట్టిన లెక్కింపు విధానం మూలంగా మనం కాలప్రవాహంలోని సంఘటనలను గుర్తించడానికీ, వాటికి ఒకదానితో మరోదానికి ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికీ వీలవుతుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి