కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 12/1 పేజీలు 9-14
  • ప్రకటన గ్రంథంలో “ఆనందభరిత వార్తలు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటన గ్రంథంలో “ఆనందభరిత వార్తలు”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆనందభరిత వార్తల ఉద్ఘోషకులు
  • ప్రకటనలో మనకోసం ఏమి ఉంది?
  • ఘనతకు యోగ్యుడైన గొఱ్ఱెపిల్ల
  • “ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి”
  • అద్భుతమైన సహస్రాబ్ది పరిపాలన
  • ప్రకటన గ్రంథపు ధన్యులైన పాఠకులై ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ప్రకటన గ్రంథం—దాని అర్థం ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ప్రకటన—దాని సంతోషకరమైన ముగింపు!
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • ప్రకటన మరియు మీరు
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 12/1 పేజీలు 9-14

ప్రకటన గ్రంథంలో “ఆనందభరిత వార్తలు”

“అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు . . . [“ఆనందభరిత వార్తలుగా,” NW] ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను.”—ప్రకటన 14:6.

1. యెహోవాసాక్షులు అపోకలిప్స్‌ పుస్తకం దేవునిచే ప్రేరేపించబడిందని నమ్ముతున్నప్పటికీ, వారిది “అపోకలిప్టిక్‌ తెగ” ఎందుకు కాదు?

తమకు విరుద్ధంగా కొన్ని నిందారోపణలు ఉన్నా, యెహోవాసాక్షులది “అపోకలిప్టిక్‌ తెగ” గానీ లేదా “వినాశనాన్ని ప్రకటించే మతతెగ” గానీ కాదు. అయితే, వారు అపోకలిప్స్‌ను అంటే ప్రకటన పుస్తకాన్ని దేవుని ప్రేరేపిత వాక్యంలో భాగంగా స్వీకరిస్తారు. ప్రకటనలో దుష్టులకు విరుద్ధంగా తీర్పు సందేశాలున్నాయన్నది నిజమే. కానీ తమ బహిరంగ సాక్ష్యంలో దేవుని సేవకులు ప్రముఖంగా బైబిలులో ఉన్న, అలాగే అపోకలిప్స్‌ అంటే ప్రకటన పుస్తకంలో ఉన్న అద్భుతమైన నిరీక్షణపైనే దృష్టిని కేంద్రీకరిస్తారు. అందుకని, వారు అందులోని ప్రవచన మాటలకు ఏమీ జోడించరు ఏమీ తీసివేయరు.—ప్రకటన 22:18, 19.

ఆనందభరిత వార్తల ఉద్ఘోషకులు

2. యెహోవాసాక్షులు తమ ప్రకటనా పనిలో తరచుగా ఉపయోగించే కొన్ని లేఖనాలు ఏవి?

2 యెహోవాసాక్షుల బహిరంగ పరిచర్యకు లేఖనాధార వచనముగా వారు యేసు చెప్పిన ఈ మాటని ఉల్లేఖిస్తారు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటుతర్వాత అంతము వచ్చును.” (మత్తయి 24:14) మరి ఈ “రాజ్య సువార్త” ఏమిటి? చాలామంది సాక్షులు ప్రకటన 20 మరియు 21 అధ్యాయాల్లోని కొన్ని వచనాల్ని ఎత్తిచెబుతూ జవాబిస్తారు. క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా, ఆయన ప్రభుత్వం గురించీ, మరణము దుఃఖము వేదన ‘ఇక ఉండని’ మానవ సమాజం గురించీ ఆ వచనాల్లో ఉన్నదాన్ని వారు వివరిస్తారు.—ప్రకటన 20:6; 21:1, 4.

3. యెహోవాసాక్షుల బహిరంగ పరిచర్య ఎవరి కార్యనియామకంతో కలుస్తుంది?

3 ఆనందభరిత వార్తల ఉద్ఘోషకులుగా యెహోవాసాక్షులు నిజానికి ఒక సూచనార్థకమైన పరలోకపు సందేశకునికి ప్రతినిధులుగా పనిచేస్తున్నారు. ఈ సందేశకుని కార్యనియామకం కూడా ప్రకటనలో వివరించబడింది. “అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును [“ఆనందభరిత వార్తలుగా,” NW] ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను.” (ప్రకటన 14:6) ఈ “నిత్యసువార్త”లో “ఈ లోకరాజ్యము [లేదా పరిపాలనాధికారం] మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను” అన్న ప్రకటన కూడా ఉంది; అలాగే “భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకు” యెహోవా “సమయము వచ్చియున్నద[న్న]” ప్రకటన కూడా ఉంది. (ప్రకటన 11:15, 17, 18) ఇది నిజంగా సువార్త కాదా?

ప్రకటనలో మనకోసం ఏమి ఉంది?

4. (ఎ) ప్రకటన ఒకటవ అధ్యాయంలో ఎటువంటి ప్రాథమిక సత్యాలు ఉన్నాయి? (బి) ఆనందభరిత వార్తల నుండి ప్రయోజనం పొందాలనుకుంటున్న వారు ఏమి చేయాల్సిన అవసరం ఉంది?

4 ప్రకటన పుస్తకంలోని మొదటి అధ్యాయం, యెహోవాను గురించి చెబుతూ ఆయన “అల్ఫాయు ఓమెగయు . . . వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడును . . . సర్వాధికారియు” అయిన దేవుడు అని చెబుతుంది. ఆ అధ్యాయం ఆయన కుమారుడైన యేసు క్రీస్తును గురించి చెబుతూ ఆయన “నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతియు” అని చెబుతుంది. యేసు “మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించిన”వాడని కూడా అది చెప్తుంది. (ప్రకటన 1:5, 6, 8) ఆ విధంగా, ప్రారంభం నుండీ ప్రకటన పుస్తకం ప్రాణాల్ని రక్షించే ప్రాథమిక సత్యాల్ని వివరిస్తుంది. “భూనివాసులకు” ఆనందభరిత వార్తల్ని తెలియజేసిన తర్వాత, వారు యెహోవా సర్వాధిపత్యాన్ని గుర్తించనంత వరకు, చిందించబడిన యేసు రక్తంలో విశ్వాసం ఉంచనంత వరకు, యెహోవా ఆయన్ను పునరుత్థానం చేశాడనీ, ఆ క్రీస్తు ప్రస్తుత దైవనియుక్త పరిపాలకుడనీ నమ్మనంత వరకు వారు ఆ వార్తల నుండి ప్రయోజనాన్ని పొందలేరు.—కీర్తన 2:6-8.

5. ప్రకటన రెండవ మూడవ అధ్యాయాల్లో క్రీస్తు ఏ పాత్రలో చిత్రీకరించబడ్డాడు?

5 రెండు మూడు అధ్యాయాలు క్రీస్తు యేసును, భూమ్మీది తన శిష్యుల సంఘాల ప్రేమపూర్వకమైన పరలోక పైవిచారణకర్తగా చిత్రీకరిస్తాయి. సా.శ. మొదటి శతాబ్దపు ఆసియా మైనరులో ఉన్న సంఘాల్లో నుండి ఎంపిక చేయబడిన ఏడు క్రైస్తవ సంఘాలకు వ్రాయబడిన ఆ గ్రంథపు చుట్టలో ఆ సంఘాలకు ప్రోత్సాహం ఉంది, నేటికీ వర్తించే స్థిరమైన సలహాలూ ఉన్నాయి. ఆ సంఘాలకు పంపించబడిన సందేశాలు సాధారణంగా “నీ క్రియలను . . . నేనెరుగుదును” అనో లేదా “నీ శ్రమను . . . నేనెరుగుదును” అనో ప్రారంభమౌతాయి. (ప్రకటన 2:2, 9) అవును, తన శిష్యుల సంఘాల్లో ఏమి జరుగుతుందో క్రీస్తుకు కచ్చితంగా తెలుసు. ఆయన వారి ప్రేమకు, వారి విశ్వాసానికి, పరిచర్యలో వారి పరిశ్రమకు, వారి సహనానికి, తన నామము తన వాక్యముల పట్ల వారి నమ్మకత్వానికి వారిని మెచ్చుకున్నాడు. ఇతరులను ఆయన మందలించాడు, ఎందుకంటే వారు యెహోవా పట్ల ఆయన కుమారుని పట్ల తమకుగల ప్రేమ విషయంలో చల్లారిపోయారు. లేదా వారు లైంగిక అనైతికతలోనో విగ్రహారాధనలోనో మతభ్రష్ట తెగవాదంలోనో పడిపోయారు.

6. నాలుగవ అధ్యాయంలో నమోదు చేయబడిన దర్శనం ప్రజలు ఏమి అర్థం చేసుకోవటానికి సహాయం చేస్తుంది?

6 నాలుగవ అధ్యాయం యెహోవా దేవుని పరలోక సింహానాన్ని గూర్చిన భక్తిపూర్వకమైన భయాన్ని రేకెత్తించే దర్శనాన్ని అందిస్తుంది. ఈ అధ్యాయం యెహోవా సన్నిధిలో ఉండే మహిమను గూర్చి, ఆయన ఉపయోగించే పరలోక పరిపాలనా విధానాన్ని గూర్చి మనకు క్షణమాత్ర దర్శనాన్ని ఇస్తుంది. విశ్వాధినేత సింహాసనం చుట్టూ ఉన్న సింహాసనాల్లోని కిరీటధారులైన పరిపాలకులు యెహోవాకు సాగిలపడి ఇలా ప్రకటిస్తారు: “ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడ[వు].”—ప్రకటన 4:10-11.

7. (ఎ) భూనివాసులు ఏమి చేయాలని దేవదూత చెబుతున్నాడు? (బి) మన విద్యా పనిలో ఏది ఒక ప్రముఖమైన భాగం?

7 ఇది నేటి ప్రజలకు ఏమైనా అర్థాన్నిస్తుందా? తప్పకుండా. సహస్రాబ్ది రాజ్యం క్రింద జీవించాలనుకుంటే వారు “ఆకాశమధ్యమున ఎగురుచు[న్న]” దేవదూత చేస్తున్న ఈ ప్రకటనను శిరసావహించాలి: “దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి” ఎందుకంటే, “ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను.” (ప్రకటన 14:6, 7) యెహోవాసాక్షులు కొనసాగిస్తున్న బైబిలు విద్యాపనికి గల అసలు లక్ష్యాల్లో ఒకటిగా యెహోవాను తెలుసుకుని, ఆయనను ఆరాధించటం ప్రారంభించి, ఆయన సృష్టికర్తృత్వాన్ని గుర్తించి, నీతియుక్తమైన ఆయన సర్వాధిపత్యానికి ఇష్టపూర్వకంగా విధేయత చూపేలా “భూనివాసులకు” సహాయం చేయటమే.

ఘనతకు యోగ్యుడైన గొఱ్ఱెపిల్ల

8. (ఎ) ఐదు ఆరు అధ్యాయాల్లో క్రీస్తు ఎలా చిత్రీకరించబడ్డాడు? (బి) ఈ దర్శనంలోని ఆనందభరిత వార్తలను వినే వారందరు ఏమి తెలుసుకోగలరు?

8 తర్వాతి రెండు అధ్యాయాలైన 5, 6 అధ్యాయాలు యేసుక్రీస్తును ఒక గొఱ్ఱెపిల్లగా చిత్రీకరిస్తాయి. ఏడు ముద్రలున్న ఒక గ్రంథాన్ని విప్పటానికి గొఱ్ఱెపిల్లకు యోగ్యత ఉన్నట్లు, తద్వారా మన కాలంలో జరుగనైయున్న సంఘటనల్ని ఆ గ్రంథంలో ఉన్న విషయాలు సూచనార్థక భాషలో వెల్లడి చేస్తున్నట్లు ఆ అధ్యాయాల్లో ఉంది. (పోల్చండి యోహాను 1:29.) ఈ సూచనార్థక గొఱ్ఱెపిల్లతో పరలోకపు పెద్దలు ఇలా చెబుతున్నారు: “నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదు[రు].” (ప్రకటన 5:9, 10) చిందించబడిన క్రీస్తు రక్తం ఆధారంగా అన్ని జాతుల ప్రజల్లో నుండి కొందరు మానవులు క్రీస్తుతోపాటు పరలోకం నుండి ‘భూలోకమందు ఏలటానికి’ పిలువబడ్డారని ఈ దర్శనం తెలుపుతుంది. (పోల్చండి ప్రకటన 1:5, 6.) వీరి సంఖ్య ఎంతో ప్రకటనలో తర్వాత చెప్పబడింది.

9. ఆరవ అధ్యాయంలో క్రీస్తు ఎలా చిత్రీకరించబడ్డాడు?

9 మరో దర్శనంలో, క్రీస్తు తెల్లని గుఱ్ఱంపై స్వారీ చేస్తున్న, “జయించుచు, జయించుటకు బయలు”దేరిన కిరీటధారిగా వర్ణించబడ్డాడు. ఆనందకరమైన విషయం ఏమిటంటే, ఆయన మరి ముగ్గురు గుఱ్ఱపు రౌతులచే సూచించబడిన దుష్ట ప్రభావాల్ని ఆయన జయిస్తాడు. ఈ ముగ్గురి భయంకరమైన స్వారీ అతి కీలకమైన 1914 నుండి యుద్ధాల్ని, కరవుల్ని, మృత్యువుని మానవజాతిపైకి తీసుకువచ్చింది. (ప్రకటన 6:1-8) మానవజాతి రక్షణ కోసం దేవుని గొఱ్ఱెపిల్లగా క్రీస్తు వహించే విశిష్టమైన పాత్ర, అలాగే యెహోవా దేవుని అద్భుతమైన సంకల్పాలను నెరవేర్చటంలో ఆయన వహించే పాత్ర యెహోవాసాక్షుల బైబిలు బోధనా పనిలో ఒక కీలకమైన అంశం.

10. (ఎ) ఏడవ అధ్యాయంలో ఎటువంటి ప్రముఖమైన సమాచారం ఇవ్వబడింది? (బి) రాజ్యాన్ని పొందే వారిని గురించి క్రీస్తు ఎలా మాట్లాడాడు?

10 ఏడవ అధ్యాయం నిజంగా ఆనందభరిత వార్తల్ని కలిగివుంది. కేవలం ప్రకటన పుస్తకంలో మాత్రమే యేసు “చిన్నమందా” అని పిలిచినవారి సంఖ్య ఉంది, గొఱ్ఱెపిల్ల తండ్రి వీరికి రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. (లూకా 12:32; 22:28-30) వీరు యెహోవా దేవునిచే ఆయన ఆత్మ ద్వారా ముద్ర వేయబడ్డారు. (2 కొరింథీయులు 1:21, 22) ప్రకటనను పొందిన అపొస్తలుడైన యోహాను ఇలా ధృవీకరిస్తున్నాడు: “ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. . . . లక్ష నలువది నాలుగు వేలమంది.” (ప్రకటన 7:4) నిర్దిష్టమైన ఈ సంఖ్య తర్వాత మరో అధ్యాయంలో, గొఱ్ఱెపిల్లతోపాటు పరలోకపు సీయోను పర్వతం మీద పరిపాలించటానికి “భూలోకములోనుండి కొనబడిన”వారి పూర్తి సంఖ్యగా ధృవీకరించబడింది. (ప్రకటన 14:1-4) క్రైస్తవమత సామ్రాజ్యపు చర్చీలు ఈ సంఖ్యను గురించి అస్పష్టమైన వివరణలను ఇస్తాయి, అయితే ఆసక్తికరంగా బైబిలు విద్వాంసుడైన ఇ డబ్ల్యు. బూలింగర్‌ దీని గురించి ఇలా చెబుతున్నాడు: “ఇది సరళమైన వాస్తవం: ఇదే అధ్యాయంలోని అనిర్దిష్టమైన సంఖ్యకు విరుద్ధంగా ఉన్న ఒక నిర్దిష్టమైన సంఖ్య ఇది.”

11. (ఎ) ఏడవ అధ్యాయంలో ఏ ఆనందభరిత వార్తలు ఉన్నాయి? (బి) “గొప్ప సమూహము”లోని సభ్యుల ఎదుట ఎటువంటి ఉత్తరాపేక్షలు తెరిచి ఉన్నాయి?

11 బూలింగర్‌ ఏ అనిర్దిష్టమైన సంఖ్యను గురించి చెబుతున్నాడు? తొమ్మిదవ వచనంలో అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “అటుతరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము కనబడెను.” (ప్రకటన 7:9) ఈ గొప్ప సమూహంలోని వారెవరు, దేవుని ఎదుట వారి స్థానం ఏమిటి, వారి భవిష్యత్తు ఏమిటి? ప్రకటనలోని జవాబు భూమ్మీది నివాసులందరికీ ఒక సువార్తే. మనం ఇలా చదువుతాము: “వీరు మహాశ్రమలనుండి వచ్చినవారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.” క్రీస్తు చిందించిన రక్తంలో విశ్వాసం ఉంచటం ద్వారా వారు “మహాశ్రమ”ల్లో కాపాడబడతారు. క్రీస్తు “జీవజలముల బుగ్గలయొద్దకును వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతిబాష్పబిందువును తుడిచివేయును.” (ప్రకటన 7:14-17) అవును, నేడు జీవిస్తున్న కోట్లాదిమంది ప్రజలు ప్రస్తుత దుష్ట విధానాంతం నుండి తప్పించుకోబోయే అసంఖ్యాకమైన సమూహంలో భాగం కాగలరు. రాజైన యేసు క్రీస్తుకు ఆయన వెయ్యేండ్ల పరిపాలనలో విధేయ ప్రజలుగా వారు భూమ్మీద నిత్యజీవానికి నడిపించబడతారు. అది సువార్త కాదా?

“ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి”

12, 13. (ఎ) ఎనిమిది నుండి పందొమ్మిది అధ్యాయాల్లో ఏమి ఉంది? (బి) నిష్కపటులైన ప్రజలు అటువంటి వాగ్దానాల విషయంలో ఎందుకు కలత చెందకూడదు?

12 ఎనిమిది నుండి 19 అధ్యాయాలు అపోకలిప్స్‌ పుస్తకం, అంటే ప్రకటన గ్రంథం భయంకరమైన వినాశనాన్ని ప్రవచించే పుస్తకమని ప్రసిద్ధికెక్కటానికి చాలామట్టుకు కారణం. వాటిలో, సాతాను విధానంలోని వివిధ శక్తులకు విరుద్ధంగా కఠినమైన తీర్పు సందేశాలు (ఇవి బూరలు ఊదటం, తెగుళ్ళు రావటం, దైవిక ఉగ్రతా పాత్రలను కుమ్మరించటం వంటివాటిచే సూచించబడ్డాయి) ఉన్నాయి. ఈ తీర్పులు తప్పక అమల్లోకి వస్తాయి, మొదట అబద్ధ మతంపైన (“మహా బబులోను”), తర్వాత క్రూర మృగాలచే సూచించబడిన దైవభక్తిలేని రాజకీయ వ్యవస్థలపైన అమల్లోకి వస్తాయి.—ప్రకటన 13:1, 2; 17:5-7, 15, 16.a

13 ఈ అధ్యాయాలు, సాతాను వాని దయ్యాలు భూమ్మీదికి పడద్రోయబడటం ద్వారా పరలోకాన్ని పరిశుభ్రపర్చటాన్ని చిత్రీకరిస్తున్నాయి. కేవలం ఇది మాత్రమే, 1914 నుండి ఈ లోకంలో ఇంతకు మునుపెన్నడూ లేనటువంటి విపద్దశలు ఎందుకు ఉన్నాయో తర్కబద్ధంగా వివరిస్తుంది. (ప్రకటన 12:7-12) సూచనార్థక భాషలో ఆ అధ్యాయాలు భూమ్మీద ఉన్న సాతాను దుష్ట విధాన నాశనాన్ని కూడా వర్ణిస్తున్నాయి. (ప్రకటన 19:19-21) అటువంటి నాటకీయమైన సంఘటన మూలంగా నిష్కపటులైన ప్రజలు విభ్రాంతి చెందాలా? లేదు, ఎందుకంటే దేవుని తీర్పులు అమలుపర్చబడినప్పుడు పరలోకంలోని ఒక గొప్ప స్వరం ఇలా చెబుతుంది: “ప్రభువును [“యెహోవాను,” NW] స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును; ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి.”—ప్రకటన 19:1, 2.

14, 15. (ఎ) ప్రస్తుత దుష్ట విధానాంతం నీతియుక్తంగా ఎలా అంతమౌతుంది? (బి) అపోకలిప్స్‌లోని ఈ భాగం నిష్కపటులైన ప్రజల్ని ఎందుకు ఆనందభరితుల్ని చేయాలి?

14 భూమిని నాశనం చేస్తున్న వారి పీడ వదిలించకుండా యెహోవా నీతియుక్తమైన విధానాన్ని తీసుకురాడు. (ప్రకటన 11:17, 18; 19:11-16; 20:1, 2) అయితే, అలా వదిలించటానికి ఏ మానవునికీ లేదా ఏ రాజకీయ శక్తికీ అధికారం గానీ శక్తి గానీ లేదు. కేవలం యెహోవా మాత్రమే, ఆయనచే నియుక్తుడైన రాజు న్యాయాధిపతి అయిన క్రీస్తు యేసు మాత్రమే దీన్ని నీతియుక్తమైన రీతిలో చేయగలరు.—2 థెస్సలొనీకయులు 1:6-9.

15 అపోకలిప్స్‌ స్పష్టంగా చూపిస్తున్నట్లుగా యెహోవా ప్రస్తుత దుష్ట విధానానికి అంతాన్ని తీసుకురావాలని సంకల్పిస్తున్నాడు. జరుగుతున్న “హేయకృత్యములనుగూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న” స్త్రీపురుషుల్ని ఈ వాస్తవం ఆనందభరితం చేయాలి. (యెహెజ్కేలు 9:4) దేవదూత ఆనందభరిత వార్తల విషయంలో ఇచ్చే పిలుపు అనుసారంగా చేయాల్సిన అవసరం విషయమై ఇది వారి మనస్సులపై గట్టి ముద్రను వేయాలి, దేవదూత ఇలా ప్రకటిస్తున్నాడు: “దేవునికి భయ[పడుడి] . . . ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి.” (ప్రకటన 14:7) అటువంటి ప్రజలు యెహోవాను, “దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన” ఆయన సాక్షులతోపాటు ఆరాధించుదురు గాక.—ప్రకటన 12:17.

అద్భుతమైన సహస్రాబ్ది పరిపాలన

16. (ఎ) క్రైస్తవమత సామ్రాజ్యంలోని చర్చీలు సహస్రాబ్ది నిరీక్షణను ఎందుకు తిరస్కరించాయి? (బి) మాదిరి ప్రార్థనకు జవాబు దొరుకుతుందని యెహోవాసాక్షులు ఎందుకు నమ్ముతారు?

16 ప్రకటన గ్రంథములోని 20 నుండి 22 అధ్యాయాల్లో సహస్రాబ్దికి లేఖనాధార మద్దతు ఉంది. పరలోకంలోను భూమ్మీద నిత్య ఆనందానికి దారితీసే వెయ్యి సంవత్సరాల కాలాన్ని గురించి బైబిల్లో కేవలం ఇక్కడే ఉంది. క్రైస్తవమత సామ్రాజ్యపు చర్చిలు సహస్రాబ్ది నిరీక్షణను తిరస్కరించాయి. నీతిమంతులు పరలోకానికి వెళ్తారని దుష్టులు నరకానికి వెళ్తారని చర్చి సిద్ధాంతాలు చెబ్తున్నాయి గనుక చర్చీల్లో పరదైసు భూమి తలంపు లేదు. దేవుని “చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని అడుగుతున్న మాదిరి ప్రార్థన క్రైస్తవమత సామ్రాజ్యపు చర్చీల సభ్యుల విషయంలో అర్థరహితమే. (మత్తయి 6:10) కానీ అది యెహోవాసాక్షుల విషయంలో నిజం కాదు. వారు యెహోవా దేవుడు భూమిని “నిరాకారముగానుండునట్లు” చేయలేదు గానీ, “నివాసస్థలమగునట్లుగా” నిర్మించాడని స్థిరంగా విశ్వసిస్తారు. (యెషయా 45:12, 18) ఆ విధంగా ప్రాచీనకాలపు ప్రవచనం, మాదిరి ప్రార్థన, ప్రకటనలోని సహస్రాబ్ది నిరీక్షణ ఇవన్నీ ఏకీభావంతో ఉన్నాయి. క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో యెహోవా చిత్తం పరలోకంలో జరుగుతున్నట్లే భూమ్మీద కూడా జరిగేట్లు చూస్తాడు.

17. “వెయ్యి సంవత్సరములు” అక్షరార్థమని ఏమి సూచిస్తుంది?

17 ప్రకటన 20వ అధ్యాయంలోని మొదటి ఏడు వచనాల్లో “వెయ్యి సంవత్సరములు” అన్న మాట ఆరుసార్లు కన్పిస్తుంది. గమనార్హమైన విషయం ఏమిటంటే, క్రైస్తవమత సామ్రాజ్యంలోని అనేకమంది వ్యాఖ్యాతలు చెప్పేదాని ప్రకారంగా కాక, అది అక్షరార్థమైన సహస్రాబ్దిని సూచిస్తుందనీ, ఏదో అనిర్దిష్ట కాలావధిని సూచించటం లేదనీ మూలభాషలోని వ్యాకరణ నిర్మాణం చూపిస్తుంది. ఆ సహస్రాబ్దిలో ఏమి జరుగుతుంది? మొదటిగా, ఆ కాలం అంతట్లో సాతాను నిర్వీర్యం చేయబడతాడు. (ప్రకటన 20:1-3; పోల్చండి హెబ్రీయులు 2:14.) అదెంతటి సువార్త!

18. (ఎ) సహస్రాబ్దిని తీర్పు “దినము” అని ఎందుకు పిలువవచ్చు? (బి) వెయ్యి సంవత్సరముల చివర్లో ఏమి జరుగుతుంది?

18 “క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము” చేసేవారికి “విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను” గనుక, నిజానికి ఈ కాలం వెయ్యి-సంవత్సరాల తీర్పు “దినము” అని చెప్పవచ్చు. (ప్రకటన 20:4, 6; పోల్చండి అపొస్తలుల కార్యములు 17:31; 2 పేతురు 3:8.) మృతులు పునరుత్థానం చేయబడతారు, “మహాశ్రమల” నుండి తప్పించుకున్నవారితోపాటు వారు ఆ కాలంలోని వారివారి క్రియల ప్రకారం, లేదా చర్యల ప్రకారం సమానంగా తీర్పుతీర్చబడతారు. (ప్రకటన 20:12, 13) వెయ్యి సంవత్సరాల చివర్లో మానవజాతిని చివరి పరీక్షకు గురిచేయటానికి సాతాను కొద్దికాలం విడుదల చేయబడతాడు, తర్వాత సాతాను వాని దయ్యాలు అలాగే వారిని అనుసరించే భూమ్మీది తిరుగుబాటుదారులు నిత్య నాశనానికి గురిచేయబడతారు. (ప్రకటన 20:7-10) పరీక్షలో సఫలులైన మానవుల పేర్లు చెరపరాని విధంగా ‘జీవగ్రంథం’లో వ్రాయబడతాయి, వారు నిత్యానందంతో కూడిన జీవితంలోకి ప్రవేశిస్తారు, యెహోవాను పరదైసు భూమిపై సేవిస్తూ ఆరాధిస్తారు.—ప్రకటన 20:14, 15; కీర్తన 37:9, 29; యెషయా 66:22, 23.

19. (ఎ) ప్రకటన పుస్తకంలోని అద్భుతమైన వాగ్దానాలు విఫలం కాకుండా నెరవేరతాయని మనం ఎందుకు నిశ్చింతగా ఉండవచ్చు? (బి) తర్వాతి శీర్షికలో ఏమి పరిశీలించబడుతుంది?

19 అపోకలిప్స్‌ పుస్తకంలో ఉన్న ఆనందభరిత వార్తలు అలా ఉన్నాయి. అవి మానవులు చేసే శూన్యమైన వాగ్దానాలు కావు. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు—ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు—ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు.” (ప్రకటన 21:5) ఈ ఆనందభరిత వార్తల నెరవేర్పులో భాగం వహించాలంటే మనం ఏమి చేయాలి? ప్రకటన పుస్తకంలో దేవుణ్ణి ప్రీతిపర్చాలనుకునే వారికి ఎంతో సలహా ఉంది. తర్వాతి శీర్షిక చూపిస్తున్నట్లుగా ఆ సలహాల్ని పాటించటం మనకు అవధుల్లేని ఆనందాన్ని తెస్తుంది, ఇప్పుడూ నిరంతరమూను.

[అధస్సూచీలు]

a ప్రకటన గ్రంథాన్ని గూర్చిన పూర్తి వివరణ కోసం 1994లో వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ప్రచురించిన ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకం చూడండి.

పునఃసమీక్షా అంశాలు

◻ ప్రకటన నాలుగు నుండి ఆరు అధ్యాయాల్లో ఉన్న ఏ ప్రాథమిక సత్యాలు ఆనందభరిత వార్తల్లో ప్రముఖ భాగంగా ఏర్పడతాయి?

◻ ప్రకటన ఏడవ అధ్యాయంలో ఏ ఆనందభరిత వార్తలు ఉన్నాయి?

◻ నిష్కపటులైన ప్రజలు ప్రకటనలోని తీర్పు సందేశాల విషయంలో ఎందుకు కలత చెందకూడదు?

◻ సహస్రాబ్ది ఏ విధాలుగా తీర్పు “దినము”గా ఉంటుంది?

[10వ పేజీలోని చిత్రం]

రాజైన యేసుక్రీస్తు భూమ్మీది నుండి యుద్ధాల్నీ, కరవుల్నీ, మృత్యువునీ పూర్తిగా తీసివేస్తాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి