కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 11/1 పేజీలు 9-14
  • మీరు దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తారు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని వాక్యాన్ని “అపేక్షించుడి”
  • దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన ఒక కీర్తన రచయిత
  • భిన్నంగా ఉన్న రాకుమారుడు
  • దేవుని వాక్యం యేసును బలపర్చింది
  • క్రీస్తును అనుకరించిన ఇతరులు
  • యెహోవా వాక్యంపై నమ్మకం ఉంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • దేవుని వాక్యం మీ త్రోవను వెలుగుమయం చేయనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • బైబిలు చదవడం—ప్రయోజనకరం, ఆహ్లాదకరం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • ప్రతిదినం బైబిలు చదవడం నుండి ప్రయోజనం పొందుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 11/1 పేజీలు 9-14

మీరు దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తారు?

“నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.”—కీర్తన 119:97.

1. దైవభయంగల వ్యక్తులు దేవుని వాక్యంపట్ల తమకున్న ప్రేమను ప్రదర్శించడానికి ఒక మార్గం ఏది?

కోట్లాదిమంది స్త్రీ పురుషుల దగ్గర బైబిలు ఉంది. అయితే బైబిలు తమ దగ్గర ఉండడానికీ, దేవుని వాక్యాన్ని ప్రేమించడానికీ ఎంతో తేడా ఉంది. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని చాలా అరుదుగా చదువుతుంటే అతడు, తాను దాన్ని ప్రేమిస్తున్నానని చెప్పడం సబబేనా? ఎంతమాత్రం కాదు! దానికి భిన్నంగా, ఒకప్పుడు దాని పట్ల అంత మక్కువ లేని వాళ్లు ఇప్పుడు దాన్ని ప్రతిదినము చదువుతున్నారు. వాళ్లు దేవుని వాక్యాన్ని ప్రేమించడం నేర్చుకున్నారు, కీర్తనల గ్రంథకర్తలా వాళ్లిప్పుడు దేవుని వాక్యాన్ని “దినమెల్ల” ధ్యానిస్తారు.—కీర్తన 119:97.

2. ఒక యెహోవాసాక్షి విశ్వాసం కష్టపరిస్థితుల్లో ఎలా బలపర్చబడింది?

2 దేవుని వాక్యాన్ని ప్రేమించడం నేర్చుకున్న వ్యక్తి నాషో డోరీ. తన స్వదేశమైన అల్బేనియాలో తోటి విశ్వాసులతో కలిసి సేవచేస్తూ ఆయన ఎన్నో దశాబ్దాలపాటు సహనం కనబర్చాడు. ఆ సమయంలో చాలా భాగం, యెహోవాసాక్షులు నిషేధించబడ్డారు, ఈ నమ్మకమైన క్రైస్తవులకు బైబిలు సాహిత్యం అంతగా అందేదికాదు. అయినప్పటికీ, సహోదరుడు డోరీ విశ్వాసం బలంగా ఉంది. ఎలా? “ప్రతి దినము కనీసం ఒక గంటపాటు బైబిలు చదవాలన్నది నా లక్ష్యం, నా కనుచూపు మందగించకముందు నేను దాదాపు 60 సంవత్సరాలపాటు అలా చదివాను” అని ఆయన చెప్పాడు. ఇటీవలి కాలం వరకు, మొత్తం బైబిలు అల్బేనియా భాషలో అందుబాటులో లేదు, సహోదరుడు డోరీ చిన్నతనంలోనే గ్రీకు నేర్చుకున్నాడు, కాబట్టి ఆయన ఆ భాషలో బైబిలును చదివాడు. క్రమంగా బైబిలు చదవడం సహోదరుడు డోరీ ఎన్నో శ్రమలను ఓర్చుకోవడానికి సహాయం చేసింది, అదే మనకు కూడా సహాయం చేయగలదు.

దేవుని వాక్యాన్ని “అపేక్షించుడి”

3. క్రైస్తవులు దేవుని వాక్యం పట్ల ఎలాంటి దృక్పథాన్ని అలవర్చుకోవాలి?

3 “క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను . . . పాలను అపేక్షించుడి” అని అపొస్తలుడైన పేతురు వ్రాశాడు. (1 పేతురు 2:1) శిశువు తన తల్లి పాల కోసం అపేక్షించినట్లుగానే, తమ ఆధ్యాత్మిక అవసరం గురించి శ్రద్ధగల క్రైస్తవులు దేవుని వాక్యాన్ని చదవడంలో ఎంతో ఆనందాన్ని పొందుతారు. మీరూ అలాగే భావిస్తారా? భావించకపోతే, నిరాశకు గురికాకండి. మీరు కూడా దేవుని వాక్యంపట్ల అపేక్షను అలవర్చుకోవచ్చు.

4. బైబిలు చదవడాన్ని దినచర్యలో భాగంగా చేసుకోవడంలో ఏమి ఇమిడివుంది?

4 అలా చేసేందుకు గాను, క్రమంగా బైబిలు చదవడాన్ని అలవాటు చేసుకోండి, సాధ్యమైతే ప్రతి దినము చదివేలా మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో పెట్టుకోండి. (అపొస్తలుల కార్యములు 17:11) మీరు నాషో డోరీలా ప్రతీ దినము గంటసేపు బైబిలు చదవలేకపోవచ్చు, కానీ ప్రతీ దినము కొంచెం సేపు దేవుని వాక్యాన్ని పరిశీలించటానికి మీరు సమయాన్ని వెచ్చించగలరు. చాలామంది క్రైస్తవులు ఒక బైబిలు భాగాన్ని ధ్యానించేందుకు కొన్ని నిమిషాలు త్వరగా నిద్రలేస్తారు. దినాన్ని ఆరంభించడానికి అంతకన్నా మంచి మార్గం ఇంకేముంటుంది? కొంతమంది నిద్రపోవడానికి ముందు బైబిలు చదవడం ద్వారా దినాన్ని ముగించాలని ఇష్టపడతారు. ఇంకా ఇతరులు మరో అనుకూలమైన సమయంలో బైబిలు చదువుతారు. ప్రాముఖ్యమైన విషయం బైబిలును క్రమంగా చదవాలన్నదే. ఆ తర్వాత, మీరు చదివినదాని గురించి ధ్యానించడానికి కొన్ని నిముషాలు వెచ్చించడమే. దేవుని వాక్యాన్ని చదివి, ధ్యానించడం ద్వారా ప్రయోజనం పొందిన కొంతమంది ఉదాహరణలను మనం పరిశీలిద్దాము.

దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన ఒక కీర్తన రచయిత

5, 6. నూట పందొమ్మిదవ కీర్తన రచయిత పేరు మనకు తెలియకపోయినప్పటికీ, ఆ కీర్తనను చదివి దానిని ధ్యానించడం ద్వారా మనం దాని రచయిత గురించి ఏమి తెలుసుకోవచ్చు?

5 నూట పందొమ్మిదవ కీర్తన రచయితకు దేవుని వాక్యంపట్ల లోతైన మెప్పుదల ఉంది. ఆ కీర్తనను ఎవరు వ్రాశారు? ఆ రచయిత ఎవరన్నది బైబిలులో లేదు. అయితే, సందర్భాన్నిబట్టి, ఆయన గురించి మనం కొన్ని వివరాలు తెలుసుకోవచ్చు, అతని జీవితంలో సమస్యలున్నాయని మనకర్థమౌతుంది. యెహోవా ఆరాధకులై ఉండవలసిన ఆయన పరిచయస్థుల్లో కొంతమందికి బైబిలు సూత్రాలపట్ల ఆయనకున్నంత ప్రేమ లేదు. అయినప్పటికీ, తాను సరైనది చేయడాన్ని వారి దృక్పథం అడ్డగించేందుకు ఈ కీర్తన రచయిత అనుమతించలేదు. (కీర్తన 119:23) మీరు బైబిలు ప్రమాణాలను గౌరవించని వారితో జీవిస్తున్నా లేక కలిసి పనిచేస్తున్నా, కీర్తన రచయిత పరిస్థితికీ మీ స్వంత పరిస్థితికీ పోలికలున్నట్లు మీరు గమనించవచ్చు.

6 కీర్తన రచయిత దైవభక్తిగలవాడే అయినప్పటికీ, అతడు స్వనీతిపరుడు మాత్రం కాదు. ఆయన తన స్వంత అపరిపూర్ణతలను నిర్మొహమాటంగా ఒప్పుకున్నాడు. (కీర్తన 119:5, 6, 67) అయితే పాపం తనను అదుపు చేసేందుకు ఆయన అనుమతించలేదు. “యౌవనులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు?” అని ఆయన ప్రశ్నించాడు. “నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా” అన్నది ఆయన సమాధానం. (కీర్తన 119:9) దేవుని వాక్యం మంచి చేయడానికి పురికొల్పడంలో ఎంత గొప్ప శక్తినిస్తుందో నొక్కిచెబుతూ, కీర్తన రచయిత ఇంకా ఇలా అన్నాడు: “నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను.” (కీర్తన 119:11) నిజంగా, దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకుండా ఉండేందుకు మనకు సహాయం చేయగల ఎంతో బలమైన శక్తిని అది ఇస్తుంది!

7. ప్రాముఖ్యంగా యౌవనస్థులు బైబిలును ప్రతిదినము చదవవలసిన అవసరం పట్ల ఎందుకు శ్రద్ధ కల్గివుండాలి?

7 క్రైస్తవ యౌవనులు ఈ కీర్తన రచయిత మాటలను పరిశీలించడం మంచిది. నేడు యౌవనస్థులైన క్రైస్తవులు దాడికి గురౌతున్నారు. యెహోవా ఆరాధకుల యువతరాన్ని కలుషితం చేయాలని అపవాది ఎంతగానో ఆశిస్తాడు. క్రైస్తవ యౌవనస్థులు శారీరక కోరికలకు లొంగిపోయి, దేవుని చట్టాన్ని ఉల్లంఘించేలా వాళ్లను ప్రలోభ పెట్టాలన్నది సాతాను లక్ష్యం. సినిమాలు, టీవీ కార్యక్రమాలు తరచూ అపవాది ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తాయి. అలాంటి కార్యక్రమాల్లోని తారలు ఆకర్షణీయంగా, అభిమానించదగినవారిగా ఉంటారు; వారి మధ్యన అనైతికమైన లైంగిక సంబంధాలు సహజమే అన్నట్లు చూపించబడతాయి. వాళ్లిస్తున్న సందేశమేమిటి? ‘అవివాహితులు ఒకరినొకరు నిజంగా ప్రేమించుకున్నంత వరకూ వారి మధ్యన లైంగిక సంబంధాలు ఉండటం తప్పేమీకాదు.’ విచారకరంగా, ప్రతి సంవత్సరం అనేకమంది క్రైస్తవ యౌవనులు ఆ విధమైన తర్కానికి బలౌతారు. తమ విశ్వాసానికి సంబంధించి కొందరి ఓడ బ్రద్దలైపోతుంది. కాబట్టి ఒత్తిడి అధికంగా ఉంది! అయితే యౌవనస్థులైన మీరు తట్టుకోవడం అసాధ్యమయ్యేంతగా ఒత్తిడి అధికమౌతోందా? ఎంతమాత్రం కాదు! యౌవనస్థులైన క్రైస్తవులు అనారోగ్యకరమైన కోరికలను అధిగమించేందుకు యెహోవా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ‘దేవుని వాక్యాన్నిబట్టి జాగ్రత్తగా చూచుకోవడం ద్వారానూ, దేవుని మాటలను తమ హృదయంలో భద్రపర్చుకోవడం ద్వారానూ’ వాళ్లు అపవాది ప్రయోగించే ఏ ఆయుధాలనైనా ఎదిరించవచ్చు. వ్యక్తిగతంగా బైబిలు చదివి దాన్ని ధ్యానించడంలో మీరు క్రమంగా ఎంత సమయం వెచ్చిస్తారు?

8. ఈ పేరాలో పేర్కొనబడిన ఉదాహరణలు, మోషే ధర్మశాస్త్రంపట్ల మెప్పును పెంపొందింపజేసుకోవడానికి మీకెలా సహాయం చేస్తాయి?

8 నూట పందొమ్మిదవ కీర్తన రచయిత ఇలా అన్నాడు: “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది”! (కీర్తన 119:97) ఆయన ఏ ధర్మశాస్త్రాన్ని ఉద్దేశిస్తున్నాడు? మోషే ధర్మశాస్త్రంతోపాటు, బయల్పర్చబడిన యెహోవా వాక్యాన్ని ఉద్దేశిస్తున్నాడు. ధర్మశాస్త్రం చాలా ప్రాచీనమైనదనీ, దాన్ని ఎవరైనా ఎలా ప్రేమించగలరనీ కొందరు మొదటి చూపులో దాన్ని కొట్టిపారేయవచ్చు. అయితే, మనం మోషే ధర్మశాస్త్రంలోని వివిధ అంశాలను పరిశీలించినప్పుడు, ఆ ధర్మశాస్త్రం వెనుకనున్న జ్ఞానాన్ని మనం గుణగ్రహించవచ్చు. ధర్మశాస్త్రానికి అనేక ప్రవచనార్థక అంశాలు ఉండటమేగాక, దానిలో పారిశుద్ధ్యానికి ఆహారనియమాలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి, అవి పరిశుభ్రతను, ఆరోగ్యాన్ని పెంపొందింపజేశాయి. (లేవీయకాండము 7:23, 24, 26; 11:2-8) ధర్మశాస్త్రం వ్యాపార విషయాల్లో నిజాయితీని ప్రోత్సహించి, అవసరంలో ఉన్న తోటి ఆరాధకుల పట్ల సహానుభూతిని కనపర్చమని ఇశ్రాయేలీయులకు ఉద్బోధించింది. (నిర్గమకాండము 22:26, 27; 23:6; లేవీయకాండము 19:35, 36; ద్వితీయోపదేశకాండము 24:17-21) న్యాయసంబంధమైన తీర్పులు నిష్పక్షపాతంగా తీర్చాలి. (ద్వితీయోపదేశకాండము 16:19; 19:15) నూట పందొమ్మిదవ కీర్తన రచయిత జీవితంలో అనుభవాన్ని సంపాదించుకున్న తర్వాత, దేవుని ధర్మశాస్త్రాన్ని అన్వయించుకునే వారికి పరిస్థితులు ఎలా మంచికి దారి తీసేవో ఆయన నిస్సందేహంగా గమనించాడు, దానిపట్ల ఆయనకున్న మక్కువ ఇంకా అధికమైంది. అలాగే నేడు, బైబిలు సూత్రాలను అన్వయించుకోవడంలో క్రైస్తవులు సాఫల్యాన్ని సాధిస్తుండగా, దేవుని వాక్యంపట్ల వారికున్న ప్రేమ, మెప్పుదల అధికమౌతాయి.

భిన్నంగా ఉన్న రాకుమారుడు

9. రాజైన హిజ్కియా దేవుని వాక్యంపట్ల ఎలాంటి దృక్పథాన్ని అలవర్చుకున్నాడు?

9 నూట పందొమ్మిదవ కీర్తనలోని అంశాలు, హిజ్కియా ఇంకా యౌవనస్థుడైన రాకుమారునిగా ఉన్నప్పుడు, ఆయన గురించి మనకు తెలిసిన వివరాలతో పొందిక కల్గివున్నాయి. ఆ కీర్తనను హిజ్కియా వ్రాసివుండవచ్చునని కొంతమంది బైబిలు పండితులు సూచిస్తారు. ఇది కచ్చితం కాకపోయినప్పటికీ, హిజ్కియాకు దేవుని వాక్యంపట్ల ఎంతో గౌరవం ఉండేదని మనకు తెలుసు. ఆయన తన జీవన విధానం ద్వారా, తాను కీర్తన 119:97తో హృదయపూర్వక పొందిక కల్గివున్నట్లు చూపించాడు. హిజ్కియా గురించి బైబిలు ఇలా తెలియజేస్తుంది: “అతడు యెహోవాతో హత్తుకొని, ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుండెను.”—2 రాజులు 18:6.

10. హిజ్కియా మాదిరి, నేడు దైవిక తల్లిదండ్రుల పెంపకానికి నోచుకోని క్రైస్తవులకు ఎటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తుంది?

10 ఉన్న ఆధారాలన్నింటినిబట్టి చూస్తే, హిజ్కియా దైవభక్తిగల కుటుంబంలో పెరగలేదని తెలుస్తుంది. ఆయన తండ్రియైన ఆహాజు రాజు విశ్వాసరహితుడైన విగ్రహారాధకుడు, అతడు తన కుమారుల్లో కనీసం ఒకరిని, అంటే హిజ్కియా స్వంత సహోదరుల్లో ఒకరిని అబద్ధ దేవునికి బలిగా సజీవ దహనం చేశాడు! (2 రాజులు 16:3) తన ఎదుట ఇంత చెడు మాదిరి ఉన్నప్పటికీ, హిజ్కియా దేవుని వాక్యంతో పరిచయం ఏర్పరచుకోవడం ద్వారా అన్యమత ప్రభావాల నుండి తన ‘నడతను శుద్ధిపరచుకున్నాడు.’—2 దినవృత్తాంతములు 29:2.

11. హిజ్కియా గమనిస్తుండగా, అవిశ్వాసియైన ఆయన తండ్రికి పరిస్థితులు ఎలా పరిణమించాయి?

11 హిజ్కియా పెరిగి పెద్దవాడౌతూ, విగ్రహారాధకుడైన తన తండ్రి తన రాజ్య కార్యకలాపాలతో ఎలా వ్యవహరించేవాడో ప్రత్యక్షంగా చూశాడు. యూదాను శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు. యెరూషలేముపై ముట్టడి వేయడంలో సిరియా రాజైన రెజీను ఇశ్రాయేలు రాజైన పెకహుతో కలిశాడు. (2 రాజులు 16:5, 6) యూదాపై విజయవంతంగా దాడి చేసి, చివరికి కొన్ని యూదా నగరాలను స్వాధీనం చేసుకున్న ఎదోమీయులు, ఫిలిష్తీయులు ఉన్నారు. (2 దినవృత్తాంతములు 28:16-19) ఈ సంక్షోభాన్ని ఆహాజు ఎలా ఎదుర్కున్నాడు? సిరియాకు వ్యతిరేకంగా సహాయం చేయమని యెహోవాను వేడుకునే బదులు, ఆహాజు అష్షూరు రాజుకు ఆలయ ధనాగారంలో నుండి తీసినవాటిని ఇవ్వడంతో సహా వెండి బంగారాలను లంచం ఇవ్వడం ద్వారా అతడ్ని ఆశ్రయించాడు. కాని ఇది యూదాకు శాశ్వత శాంతిని తీసుకురాలేదు.—2 రాజులు 16:6, 8.

12. ఏమి చేయడం ద్వారా హిజ్కియా తన తండ్రి చేసిన తప్పులు తాను చేయకుండా జాగ్రత్తపడతాడు?

12 చివరికి, ఆహాజు మరణించాడు, హిజ్కియా పాతికేళ్ల వయస్సులో రాజయ్యాడు. (2 దినవృత్తాంతములు 29:1) అతడు చాలా చిన్న వయస్సువాడే, అయినా, అతడు రాజుగా తాను విజయం సాధించడంలో అది ఒక అడ్డంకు కాలేదు. అవిశ్వాసియైన తన తండ్రి ప్రవర్తనను అనుకరించే బదులు ఆయన యెహోవా ధర్మశాస్త్రాన్ని హత్తుకున్నాడు. అందులో రాజుల కోసం ఒక ప్రత్యేకమైన ఆజ్ఞవుంది: “[రాజు] రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తనకొరకు వ్రాసికొన వలెను; అది అతనియొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులును ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరులమీద గర్వించి, యీ ధర్మమును విడిచిపెట్టి కుడికిగాని యెడమకు గాని తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని యీ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను.” (ద్వితీయోపదేశకాండము 17:18, 19) దేవుని వాక్యాన్ని అనుదినం చదవడం ద్వారా, హిజ్కియా యెహోవాకు భయపడటాన్ని నేర్చుకుంటాడు, దైవభక్తిలేని తన తండ్రి చేసిన తప్పులు తాను చేయకుండా జాగ్రత్తపడతాడు.

13. ఆధ్యాత్మిక భావంలో, తాను చేసేదానంతటిలో విజయం సాధించగలనని ఒక క్రైస్తవుడు ఎలా నిశ్చయత కల్గివుండగలడు?

13 దేవుని వాక్యాన్ని గురించి ఎడతెగక తలంచవలసింది ఇశ్రాయేలు రాజులు మాత్రమే కాదుగాని, దైవ భయంగల ఇశ్రాయేలీయులందరూ అలా చేయాలి. మొదటి కీర్తన, “యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు” నిజంగా ధన్యుడని వర్ణిస్తుంది. (కీర్తన 1:1, 2) అలాంటి వ్యక్తి గురించి, కీర్తనల గ్రంథకర్త, “అతడు చేయునదంతయు సఫలమగును” అని చెప్తుంది. (కీర్తన 1:3) దానికి భిన్నంగా, యెహోవా దేవుని యందు విశ్వాసంలేని వ్యక్తి “ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు” అయ్యుంటాడని బైబిలు చెప్తుంది. (యాకోబు 1:7) మనమందరం సంతోషంగా ఉండాలనీ, విజయం సాధించాలనీ కోరుకుంటాము. బైబిలును క్రమంగా, అర్థవంతంగా చదవడం మన సంతోషానికి దోహదపడుతుంది.

దేవుని వాక్యం యేసును బలపర్చింది

14. దేవుని వాక్యంపట్ల ప్రేమను యేసు ఎలా కనబర్చాడు?

14 ఒక సందర్భంలో, యేసు యెరూషలేము ఆలయంలో బోధకుల మధ్య కూర్చుని ఉండటాన్ని ఆయన తలిదండ్రులు చూశారు. దేవుని ధర్మశాస్త్రంలో నిపుణులైన వీరు ‘ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును ఎంతగానో విస్మయమొందారు’! (లూకా 2:46, 47) అప్పుడు యేసుకు పన్నెండేళ్లే. అవును, చిన్న వయస్సులోనే ఆయనకు దేవుని వాక్యంపట్ల స్పష్టంగా మక్కువ ఉంది. తర్వాత, యేసు అపవాదిని గద్దించడానికి లేఖనాలను ఉపయోగిస్తూ ఇలా అన్నాడు: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును.” (మత్తయి 4:3-10) తర్వాత, యేసు తన స్వగ్రామమైన నజరేతు వాసులకు లేఖనాలను ఉపయోగిస్తూ బోధించాడు.—లూకా 4:16-21.

15. ఇతరులకు బోధించేటప్పుడు యేసు ఎలా ఒక మాదిరి నుంచాడు?

15 యేసు తన బోధలకు మద్దతుగా తరచూ లేఖనాలను ఎత్తి చెప్పేవాడు. ఆయన శ్రోతలు “ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.” (మత్తయి 7:28) యేసు బోధలు స్వయంగా యెహోవా దేవుని నుండి వచ్చేవి గనుక అందులో ఆశ్చర్యం లేదు! యేసు ఇలా అన్నాడు: “నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియులేదు.”—యోహాను 7:16, 18.

16. దేవుని వాక్యంపట్ల తనకున్న ప్రేమను యేసు ఎంతమేరకు ప్రదర్శించాడు?

16 నూట పందొమ్మిదవ కీర్తన రచయిత వలె కాక, యేసులో ‘ఏ దుర్నీతియు’ లేదు. ఆయనలో ఏ పాపం లేదు, ఆయన దేవుని కుమారుడు, ఆయన ‘మరణము పొందునంతగా విధేయత చూపించాడు.’ (ఫిలిప్పీయులు 2:8; హెబ్రీయులు 7:26) అయితే, యేసు ఎంత పరిపూర్ణుడైనప్పటికీ, ఆయన దేవుని ధర్మశాస్త్రాన్ని పఠించి, దానికి విధేయుడయ్యాడు. తన యథార్థతను కాపాడుకోవడంలో ఆయనకున్న సామర్థ్యానికి ఇదొక కీలకాంశం. తన ప్రభువు నిర్బంధించబడకుండా అడ్డగించేందుకు ప్రయత్నిస్తూ పేతురు ఒక ఖడ్గాన్ని ఉపయోగించినప్పుడు, యేసు ఈ అపొస్తలుడ్ని గద్దించి ఇలా అడిగాడు: “ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువమంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? నేను వేడుకొనిన యెడల—ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరు[ను].” (మత్తయి 26:53, 54) అవును, క్రూరమైన, అవమానకరమైన మరణాన్ని తప్పించుకోవడం కంటే లేఖనాల నెరవేర్పే యేసుకు ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యంపట్ల ఎంత విశేషమైన ప్రేమ!

క్రీస్తును అనుకరించిన ఇతరులు

17. అపొస్తలుడైన పౌలుకు దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైనది?

17 అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవులకిలా వ్రాశాడు: “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.” (1 కొరింథీయులు 11:1) తన ప్రభువులా పౌలు లేఖనాలపట్ల మక్కువను పెంచుకున్నాడు. ఆయనిలా ఒప్పుకున్నాడు: “నా అంతరంగములో నేను దేవుని ధర్మశాస్త్రమును ఎంతగానో ప్రేమిస్తున్నాను.” (రోమీయులు 7:22, ద జెరూసలేమ్‌ బైబిల్‌) పౌలు దేవుని వాక్యాన్ని తరచూ ఎత్తి వ్రాశాడు. (అపొస్తలుల కార్యములు 13:32-41; 17:2, 3; 28:23) పౌలు తనకు ప్రియమైన తన తోటి పరిచారకుడైన తిమోతికి చివరి ఉపదేశాలు ఇచ్చేటప్పుడు, ప్రతి ‘దైవజనుని’ అనుదిన జీవితంలో దేవుని వాక్యం నిర్వహించవలసిన ప్రాముఖ్యమైన పాత్ర గురించి నొక్కిచెప్పాడు.—2 తిమోతి 3:15-17.

18. ఆధునిక కాలాల్లో, దేవుని వాక్యంపట్ల గౌరవాన్ని చూపించిన ఒకరి ఉదాహరణను చెప్పండి.

18 ఆధునిక కాలాల్లో నమ్మకమైన యెహోవా సేవకులనేకులు దేవుని వాక్యంపట్ల యేసుకున్న ప్రేమను అనుకరించారు. ఈ శతాబ్దం తొలి భాగంలో, ఒక యౌవనస్థుడు తన స్నేహితురాలి నుండి ఒక బైబిలును అందుకున్నాడు. ఈ ప్రశస్తమైన బహుమానం తనపై చూపించిన ప్రభావాన్ని ఆయనిలా వర్ణించాడు: “నేను నా జీవితంలో ప్రతి దినము బైబిల్లోని కొంత భాగాన్ని తప్పనిసరిగా చదవాలని నిశ్చయించుకున్నాను.” ఆ యౌవనస్థుడు ఫ్రెడ్రిక్‌ ఫ్రాంజ్‌, బైబిలు పట్ల ఆయనకున్న ప్రేమ, యెహోవా సేవలో సుదీర్ఘమైన, విజయవంతమైన జీవితాన్ని ఆనందించడానికి నడిపింది. బైబిలులోని మొత్తం అధ్యాయాలను కంఠతా చెప్పగల ఆయనకున్న సామర్థ్యాన్ని అందరూ మక్కువతో జ్ఞాపకం చేసుకుంటారు.

19. దైవపరిపాలనా పరిచర్య పాఠశాల కోసం వారంలో చదువవలసిన బైబిలు భాగాన్ని కొందరు ఎలా చదువుతారు?

19 యెహోవాసాక్షులు క్రమంగా బైబిలు చదవడాన్ని ఎంతో నొక్కి చెప్తారు. ప్రతివారం, తమ క్రైస్తవ కూటాల్లో ఒకటైన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల కోసం సిద్ధమౌతూ, వాళ్లు బైబిలులోని అనేక అధ్యాయాలను చదువుతారు. కూటమిలో, నియమించబడిన చదువవలసిన బైబిలు భాగాలలో నుండి ఉన్నతాంశాలు చర్చించబడతాయి. కొంతమంది సాక్షులు, వారంలో చదువవలసిన బైబిలు భాగాన్ని ఏడు చిన్న చిన్న భాగాలుగా చేసుకుని ఒక్కోదాన్ని ప్రతిదినము చదవడం సౌకర్యవంతంగా ఉన్నట్లు కనుగొన్నారు. వాళ్లు చదువుతూ, ఆ సమాచారం గురించి ఆలోచిస్తారు. సాధ్యమైనప్పుడు, బైబిలు ఆధారిత ప్రచురణల సహాయంతో అదనపు పరిశోధన చేస్తారు.

20. క్రమంగా బైబిలు చదవడానికి సమయాన్ని సంపాదించుకునేందుకు ఏమి అవసరం?

20 బైబిలును క్రమంగా చదివేందుకుగాను మీరు ఇతర కార్యకలాపాల నుండి ‘సమయాన్ని సంపాదించుకోవలసి’ ఉంటుంది. (ఎఫెసీయులు 5:15) అయితే దాని వల్ల వచ్చే ప్రయోజనాలు ఏ త్యాగాలకైనా తగినవే. మీరు ప్రతి దినము బైబిలు చదివే అలవాటు చేసుకుంటే, దేవుని వాక్యంపట్ల మీకున్న ప్రేమ అధికమౌతుంది. త్వరలోనే మీరు కీర్తన రచయితతోపాటు ఇలా చెప్పడానికి కదిలించబడతారు: “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.” (కీర్తన 119:97) తర్వాతి శీర్షిక చూపిస్తున్నట్లుగా, అలాంటి దృక్పథం ఇప్పుడూ భవిష్యత్తులోనూ గొప్ప ప్రయోజనాలను చేకూరుస్తుంది.

మీకు జ్ఞాపకం ఉన్నాయా?

◻ 119వ కీర్తన రచయిత దేవుని వాక్యంపట్ల ప్రగాఢమైన ప్రేమను ఎలా ప్రదర్శించాడు?

◻ యేసు మరియు పౌలుల ఉదాహరణల నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

◻ దేవుని వాక్యంపట్ల మనకున్న ప్రేమను మనం వ్యక్తిగతంగా ఎలా అధికం చేసుకోవచ్చు?

[10వ పేజీలోని చిత్రాలు]

నమ్మకమైన రాజులు దేవుని వాక్యాన్ని క్రమంగా చదువవలసి ఉంది. మీరూ చదువుతారా?

[12వ పేజీలోని చిత్రం]

బాలునిగా యేసుకు దేవుని వాక్యంపట్ల ప్రేమ ఉంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి