రానైయున్న వెయ్యిసంవత్సరముల కొరకు ఇప్పుడే వ్యవస్థీకరింపబడు
“వీరు. . .వెయ్యిసంవత్సరముల వరకు రాజ్యము చేయుదురు.”—ప్రకటన 20:6.
1. ఇప్పటినుండి వెయ్యికిపైగాగల సంవత్సరములలో భూమిమీది వ్యవహారముల స్థితి ఏమైయుండును?
ఏమిటి! ఇప్పటి నుండి ఇంకా వెయ్యిసంవత్సరములపాటు మానవజాతి భూమిమీదయుండునని మా భావమా? అవును అదే మా భావము! అంతేకాదు భూగోళము మీద మొదటి స్త్రీపురుషుల ఉనికి ప్రారంభమైనప్పుడు వారు ఎలా ఉండిరో అదే విధముగా మానవజాతియంతయు శరీరమందును, హృదయమందును మనస్సునందును, పరిపూర్ణులైయుందురు. అవును ఇప్పటినుండి ఇక వెయ్యిసంవత్సరముల వరకు మానవులు తమ దేవుడు మరియు వారిని పునరుద్ధరించినవాని యొక్క స్వరూపమందును ఆయన పోలిక చొప్పుననుయుందురు. (ఆదికాండము 1:26-30) మానవనివాసులు క్రిక్కిరిసి జీవించని “ఏదెను తోటలో” ఆనంద పరదైసులో పరిశుభ్రపరచబడిన భూమిమీద జీవితమును సంపూర్ణముగా అనుభవింతురు. (ఆదికాండము 2:15) ఇదంతయు భూమియెడల, దానియందు కాపురముండు వారియెడల సృష్టికర్త ఆది సంకల్పముయొక్క నెరవేర్పుయైయుండును. ఎంత వ్యతిరేకతయున్నను మానవజాతిని ఆశీర్వదించవలెనను తన ప్రేమపూర్వక వాగ్దానముయెడల నమ్మకముగా యుండువాడని ఈ అందమైన నెరవేర్పు ఆయనను మహిమపరచును.
2. పరిపూర్ణ మానవజాతి ఎట్లుండుననుటను గూర్చిన దృష్టిని 19 శతాబ్దములనాటి ప్రజలు ఎట్లు కలిగియుండిరి?
2 దాదాపు 19 శతాబ్దముల క్రితము పరిపూర్ణ మానవునిగా 33 1/2 సంవత్సరములు గడిపిన తన మహిమాన్విత కుమారుడు పరిపాలించు దేవుని వెయ్యిసంవత్సరముల పాలనకు ఆ ధన్యతగల నెరవేర్పు సంపూర్ణతనిచ్చును. ఆ కాలమందు ఆయన ప్రత్యక్ష్యపరచబడిన విధమును గూర్చి మనమిట్లు చదువుదుము: “ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగాను మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.” (యోహాను 1:14) కాబట్టి, అప్పటి ఇశ్రాయేలీయ ప్రజలు యేసు క్రీస్తునందు ఒక పరిపూర్ణ మానవుడు ఎట్లుండెనో చూసిరి. (లూకా 3:23, 38) అవును, రానైయున్న భూపరదైసులో పరిపూర్ణ మానవజాతి ఎట్లుండునో కొందరు 19శతాబ్దముల క్రితము చూసిరి.
3, 4. (ఎ) యేసుక్రీస్తు మరియు 1,44,000మంది ద్వారాగల యెహోవా పాలన ఎంతకాలముండును? (బి) ఆ సమయ కాలము కొరకు ఏ మాట ఉపయోగించబడినది, మరియు అది వాచ్‌టవర్ సొసైటి సాహిత్యములలో కొన్నింటి పేర్లలో ఎట్లు ప్రతిబింబించినది?
3 యేసు క్రీస్తు మరియు ఆయన మహిమపరచబడిన 1,44,000 మంది శిష్యుల ద్వారాయుండు యెహోవా రాజ్యపాలనాకాలము 1,000సంవత్సరములని ముందే చెప్పబడినది. ఆ వెయ్యి సంవత్సరముల పాలనను గూర్చి అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాసెను: “అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడా రాజ్యము చేసిరి. ఆ వెయ్యి సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రదుకలేదు; ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునైయుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.”—ప్రకటన 20:4-6.
4 పాలన వెయ్యిసంవత్సరములు గనుక, ఆ కాలము క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన కాలము అని పిలువబడినది. ఈ బైబిలు సిద్ధాంతమును అంగీకరించి దానిని బోధించువారు కొన్ని సమయములయందు మిల్లినేరియన్స్ లేక “వెయ్యి” అను అర్థమువచ్చు గ్రీకు పదము ప్రకారము చిలియాస్ట్స్ అని పిలువబడిరి. చోద్యమైన విషయమేమంటే, స్టడీస్ ఇన్ ది స్క్రిప్చర్స్ సంపుటలు (ఒకప్పుడు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్టు సొసైటి ప్రచురించినవి) మొదట మిల్లెనియల్ డాన్ అని పిలువబడెను. ఇంటర్నేషనల్ బైబిల్ స్టూడెంట్స్ ఒకప్పుడు ఉపయోగించిన కీర్తనల పుస్తకమునకు హైమ్స్ ఆఫ్ ది మిల్లెనియల్ డాన్ అని పేరుండెను.
5. క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా కాలములో అపవాది అతని దయ్యముల పరిస్థితి ఏమైయుండును?
5 ప్రకటన 20:4 నందలి “వెయ్యి సంవత్సరములను” మాట సూచనార్థకమైనది కాదు అయితే అది వెయ్యి సౌర సంవత్సరములను సూచించుచున్నది. ఆ వెయ్యి సంవత్సరముల కాలములో అపవాదియగు సాతాను అతగాడి దయ్యముల సేనలు అగాధములో పడవేయబడుదురు, ఏలయనగా క్రీస్తు వెయ్యేండ్ల పాలనను గూర్చి చెప్పుటకు కొద్దిముందు, అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాసెను: “పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధముయొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతాను అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్రవేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను.”—ప్రకటన 20:1-3.
6. (ఎ) క్రీస్తు వెయ్యేండ్ల పాలనాంతమునకు కొందరు రోమను కాథోలిక్కులు ఏ తేదిని ఇచ్చిరి? (బి) కాథోలిక్కుల మాటలు నిజమైనట్లయిన, అడుగులేని గొయ్యినుండి సాతాను విడిపింపబడు కొద్దికాలము ఇప్పటికే ఎంతైనది?
6 1799లో ఫ్రెంచిసేనలు రోమును పట్టుకొని దాని పాలకునిగా పోపును పదవీభ్రష్టుని చేసి, ఖైదిగా ఫ్రాన్సుకు పరవాసముగా కొనిపోగా అక్కడ ఆయన మరణించెను, అప్పటికి యేసుక్రీస్తు వెయ్యిసంవత్సరముల పాలన అంతమయ్యెనని కొందరు రోమను కాథోలిక్కులు చెప్పుకొనిరి. అప్పుడు “అడుగులేని గొయ్యినుండి” లేక “అగాధము”నుండి, “కొద్దికాలము” వరకు తమ మోసపూరిత పనిని మరలా కొనసాగించుటకు సాతాను అతని దయ్యములు విడుదల చేయబడెనని కొందరు కాథోలిక్కు మతనాయకులు చెప్పిరి. (ప్రకటన 20:1-3, కాథోలిక్కు డుయే వర్షన్) అదే నిజమయినట్లయిన, ఆ “కొద్దికాలము” ఇప్పటికే గత 190 సంవత్సరములుగా కొనసాగుచున్నదని, దాని ముగింపు కనుచూపుమేరలో లేదని దాని భావము.
7. యేసుక్రీస్తు వెయ్యేండ్ల పాలనాకాలము మరియు దానిసహజస్థితిని గూర్చి బైబిలు ఏమని సూచించుచున్నది?
7 అయితే, లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు వెయ్యేండ్ల పాలన ఇంకను భవిష్యత్తునందు ఉన్నది. ప్రస్తుత-దిన బైబిలు ప్రవచన నెరవేర్పు అది చాలా సమీపముననున్నదని చూపించుచున్నది. నిజమైన, వెయ్యేండ్ల పాలనాకాలములో సాతాను అతని దయ్యములు వాస్తముగా బంధింపబడును, కాగా యేసుక్రీస్తు ఆయన 1,44,000మంది తోటి వారసులు అపవాది సంస్థనుండి ఎలాంటి అడ్డంకు లేకుండా మానవజాతి మీద పరిపాలన చేయుదురు. అప్పుడు యెహోవా తన “స్నేహితుడైన” అబ్రాహాముతో చేసిన నిబంధన నెరవేర్పునందు విడిపింపబడిన మానవజాతియంతటికి వచ్చు నిత్యాశీర్వాదము, ఈ దుష్టవిధానము అంతమును అసాధారణమైన రీతిలో అంతమొందించు “మహాశ్రమల”నుండి తప్పించుకొను “గొప్ప సమూహము”తో ఆరంభమగును. గొర్రెపిల్లయగు యేసుక్రీస్తు “రక్తము” ద్వారా విమోచింపబడు మృతులైయున్న కోట్లాదిమంది మానవులకును ఇది విస్తరించును. (యాకోబు 2:21-23; ప్రకటన 7:1-17; ఆదికాండము 12:3; 22:15-18; మత్తయి 24:21, 22) దీనిని పొందుటకు, వీరు సమాధులలోని తమ మృతనిద్రనుండి భూమిమీది జీవమునకు పునరుత్థానము చేయబడుదురు.—యోహాను 5:28, 29.
ఒక క్రైస్తవ సంస్థ
8. ది న్యూ క్రియేషన్ అను పుస్తకము ఏ సంస్థను వర్ణించినది, అయితే అది ఏ సంస్థాపరమైన పనిని దృష్టించలేదు?
8 దైవసంకల్ప కార్యనెరవేర్పునందు, ఆ ఆశీర్వాదములకు ముందు శతాబ్దములుగా ఒకక్రొత్త సంస్థ ఉనికియందున్నది. ఆ సంస్థను గూర్చి మనమీలాగు చదువుదుము: “ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి.” “క్రొత్త సృష్టి [ఒక క్రొత్త ప్రాణి, కింగ్ జేమ్సు వర్షన్] పొందుటయేగాని సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందేమియు లేదు.” (2 కొరింథీయులు 5:17; గలతీయులు 6:15) 1904లో ది న్యూ క్రియేషన్ అను పుస్తకము, సా.శ. మొదటి శతాబ్దములో ఉనికిలోనికి వచ్చిన ఈ నూతన సంస్థమీదకు, దృష్టిని తీసుకువచ్చినది. (స్టడీస్ ఇన్ ది స్క్రిప్చర్స్, VIవ గ్రంథము, స్టడి Vనకు “నూతన సృష్టియొక్క సంస్థ” అని పేరుపెట్టబడినది) 1914లో అంతమగు అన్యరాజుల కాలముల అంతము విషయములో తనదృష్టి ఏమిటనుటకు కట్టుబడియుండుట వలన, మానవచరిత్రలోని ప్రపంచయుద్ధము యొక్క నాశనకర ప్రభావముల తర్వాత జరుగు అసాధారణ వ్యవస్థాపరమైన పనిని ఆ పుస్తకము దృష్టించలేదు.—లూకా 21:24, KJ
9. నూతన సృష్టియొక్క శేషము ఏ అక్కరను తీర్చుటకు లేచినిలువబడిరి?
9 ఆత్మీయ నూతన సృష్టియొక్క శేషము 1918లో మొదటి ప్రపంచయుద్ధ ముగింపు వరకు భద్రపరచబడుట, అలాగే యుద్ధానంతర సంవత్సరమగు 1919లో ఇంకను శరీరమందు జీవించియుండుట ఇదంతయు అద్భుతముగా ఆశ్చర్యరీతిలో జరిగినది. అయితే వెయ్యేండ్లకాల పరిస్థితులు ఇంకను ప్రయోగములోనికి రాలేదు. కాబట్టి సాక్ష్యాధారముగా, నూతన సృష్టి శేషమునకు చెందినవారు వెయ్యేండ్లపాలనా పనిలో యేసుక్రీస్తుతో భాగము వహించుటకు పరలోకమునకు వెళ్లు నిరీక్షణ నిజరూపము దాల్చకముందు, వారికి భూమిమీద ఇంకా ఎంతో పనియుండెను. అందువలన, మరలా శక్తినింపుకొనుట మరియు పునఃవ్యవస్థీకరణల గొప్ప అవసరతయుండెను. కాగా, అతిధృఢమైన విశ్వాసముతో, ముందున్న ఉత్తేజభరితమైన పనియెడల బహు ఆసక్తితో, వారు ఆ అక్కరను తీర్చుటకు లేచినిలువబడిరి.
10. నూతన విధానములోనికి రక్షింపబడుటను అపేక్షించు లక్షలాదిమంది సంబంధముగా ఏ ప్రశ్నలు ఉత్పన్నమయ్యెను?
10 ఈ దుష్టవిధానముయొక్క విపత్కర అంతమునుండి మానవజాతిలోని కొందరితోపాటు తప్పింపబడి, యేసుక్రీస్తు వెయ్యేండ్లపాలనలోనికి ప్రవేశించుటను అభిషక్తులైన శేషము అపేక్షించినది. ప్రత్యేకముగా, 1918లో కాలిఫోర్నియా, లాస్ఏంజిల్స్లో ఇవ్వబడిన “మిలియన్స్ నౌ లివింగ్ మే నెవర్ డై” అను బహిరంగ ప్రసంగము తర్వాత ఈ భావము వారిలో యుండెను. భవిష్యత్తునందు మరి లక్షల సంఖ్యలో హార్మెగెద్దోనును తప్పించుకొనువారు వ్యవస్థీకరింపబడవలెనా? (ప్రకటన 16:14-16) “నూతన భూమి”లో భాగముగా తయారయ్యేందుకు వెయ్యేండ్లపాలనలోనికి ప్రవేశించకముందు, శేషించినవారితో మరి వీరు రాజ్య-ప్రచారపనియందు భాగము వహింతురా? (2 పేతురు 3:13) ఈ ప్రశ్నలకు జవాబులు యుద్ధానంతర కాలములో జరుగు పనులద్వారా లభింపనైయుండెను.
11. (ఎ) శేషించినవారితో ఒక్క మందగా కావలిసియున్న వేరేగొర్రెల సంబంధముగా ఏమి చేయవలసియుండెను? (బి) శేషించినవారికి వేరేగొర్రెలవారికి మధ్య విభజనకు భిన్న నిరీక్షణలు కారణము కానేరదు ఎందుకు?
11 మంచి కాపరియైన యేసుక్రీస్తు చెప్పిన ఈ క్రిందిమాటలు, సరియైన విధముగా ముందుకు వచ్చినవి: “ఈ దొడ్డివికాని వేరే గొర్రెలును నాకు కలవు; వాటినికూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెలకాపరి ఒక్కడును అగును.” (యోహాను 10:16) యుద్ధానంతర కాలములోని పనికి 1919నుండి అభిషక్తులైన శేషము వ్యవస్థీకరింపబడవలసియున్నట్లయిన, మరియు ఆ తర్వాత శేషించినవారితో వేరే గొర్రెలవారును ఒక్కమందగా తయారు కావలసియున్నట్లయిన, మరి అప్పటి మాటేమిటి? ఎందుకు, ఈ వేరే గొర్రెలవారును శేషించినవారితో అనుబంధముగా వ్యవస్థీకరింపబడుదురు! వేరే గొర్రెలవారు మరొక నిరీక్షణను—ఆనందదాయక పరదైసు భూమిమీది జీవితమును—కలిగియున్నను, వారిమధ్య విభజన కొరకు ఇది ఎంతమాత్రము ఒక కారణము కాదు. వీరందరికి కేవలము ఒకే కాపరి కలడు, అలాగే అభిషక్త శేషము రాజ్యమునందు మహిమపరచబడు పర్యంతము ఈ రెండు గుంపులమధ్య ఎలాంటి ఎడబాటు ఉండబోదు.
12. (ఎ) మానవజాతి రక్షణకంటే మరిఎక్కువ ప్రాముఖ్యమైనది ఏమిటి? (బి) రాజ్యమును ప్రకటించుట ఎప్పుడు మరియు ఎందుకు బహుప్రాముఖ్యమయ్యెను?
12 పాపమరణములనుండి మానవుల విడుదల, లోకముమీద సాతాను అధికార అంతము, భూవ్యాప్తముగా పునరుద్ధరింపబడిన పరదైసులో విధేయతా మానవజాతిని పునఃస్థాపించుట యెహోవా ప్రేమగల సంకల్పములో ప్రముఖ అంశములైయున్నవి. అయితే, విశ్వమందలి అందరికి మరిప్రాముఖ్యమైయున్న మరొక సంగతి ఏదోకలదు. ఏమిటది? అది యెహోవా దేవుని పరిశుద్ధ నామమును ప్రతిష్టించుటతో బాటుగా, ఆయన విశ్వ సార్వభౌమాధిపత్యమును మహిమపరచుటయైయున్నది. పరిపాలించుచున్న రాజు ద్వారాగల యెహోవా రాజ్యమును ప్రకటించు సమయము ఇదేయని, 1922లో సీడార్పాయింట్, ఒహాయోలో జరిగిన అంతర్జాతీయ బైబిలు విద్యార్థుల సమావేశములో నొక్కిచెప్పబడినది. 1914లో అన్యరాజుల కాలములు అంతమైనందున, యేసుయొక్క ఈ ప్రవచనార్థక మాటలను నెరవేర్చుటకు అది తగిన కాలమైయుండెను: “ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటు తరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:14) యెహోవా విశ్వసార్వభౌమాధిపత్యమును మహిమపరచునట్టియు, అలాగే ఆయన నామమును ప్రతిష్టితము చేయునట్టియునైన రాజ్యము 1914లో పరలోకములో స్థాపించబడినది, మరియు అప్పటినుండి యేసుక్రీస్తు తన శత్రువుల మధ్యను పరిపాలన చేయుచున్నాడు. ఇది రాజును రాజ్యమును ప్రకటించుట కొరకు లభ్యమగు మాధ్యమములన్నింటితో ప్రచారము చేయవలసిన దివ్యసువార్తయై యుండెను!
13. రాజ్యప్రచార పనికి, దేవుడేమి అనుగ్రహించెను, ఎందుకు?
13 యెహోవా పరమశ్రేష్టుడును, సర్వోన్నతుడును గనుక, ఆయన సమస్తవిశ్వమునకు వ్యవస్థాపకుడైయున్నాడు. యుగ సమాప్తికి ముందే ఇక్కడ భూమిమీద, సంస్థీకరణ పద్ధతిద్వారా అంతర్జాతీయముగా రాజ్యప్రచార పని జరుగునట్లు ఆయనిప్పుడు చూసియున్నాడు. కాబట్టి, ఇంకను బ్రతికియున్న అభిషక్త శేషముయొక్క సభ్యులు ఆయన చిత్తముచేయుటకు ఒక అంతర్జాతీయ సంస్థయందు ఏకమైనవారైయున్నారు. యెహోవా విశ్వసార్వభౌమాధిపత్యమును సాతాను సవాలుచేసిన దృష్ట్యా, సార్వభౌమాధిపత్య నిజత్వము మరియు హక్కు, ఈ రెండును సమస్త కాలముల వరకు మహిమపరచబడవలెనని, సమర్ధింపబడవలెనని వీరు లోకమునకు చాటవలసియున్నారు.
వెయ్యేండ్లకు-ముందున్న సంస్థ
14. (ఎ) మన సామాన్యశకమునకు పూర్వము, యెహోవా విశ్వ సంస్థలో ఏ సంస్థ భూమిమీది భాగమయ్యెను? (బి) దావీదు ఎట్లు మిన్నయైన వ్యవస్థాపకునిగా నిరూపించుకొనెను?
14 మన సామాన్య శకమునకు 15 శతాబ్దముల పూర్వమే, యెహోవా ఈ భూమిమీద ఒక దృశ్యసంస్థను కలిగియుండెను. బైబిలు చరిత్రలోని మొదటి ప్రపంచ ఆధిపత్యమైన ఐగుప్తునుండి విడుదలగావించిన తరువాత, ఇశ్రాయేలు జనాంగమును వ్యవస్థీకరించుటకు ఆయన తన మధ్యవర్తిగా ప్రవక్తయైన మోషేను ఉపయోగించెను. మోషే ధర్మశాస్త్రము క్రింద, ఇశ్రాయేలీయులు యెహోవా విశ్వసంస్థలో దృశ్యభాగమైరి. దేవుడు ఏర్పరచుకొనిన ప్రజలలో కాపరి-రాజుయైన దావీదు, మిన్నయైన వ్యవస్థాపకునిగా యుండెను, ఆయనను గూర్చి మనమిలా చదువుదుము: “గెర్షెను కహాతు మెరారీయులు అను లేవీకుమారులను [లేవీయులు యెహోవా ఆలయమందు సేవచేసెడివారు] దావీదు వ్యవస్థీకరించెను.” ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతిలోవారిలో కొందరును దేవునికి ప్రతిష్టితులగు అధికారులైయుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి ఆయన వారిని [యాజకులను] వ్యవస్థీకరించెను.”—1 దినవృత్తాంతములు 23:3, 6; 24:1, 5, ది న్యూ ఇంగ్లీషు బైబిల్.
15. (ఎ) ఏవిధముగా ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి బయలువెడలిరి? (బి) ఎవరు కూడా ఐగుప్తును విడుచుటకు ఎంపిక చేసుకొనిరి, మరి వారు ఇశ్రాయేలీయులతో కూడా నిలిచియుండిరా?
15 దావీదు కాలమునకు ముందు వందలాది సంవత్సరముల క్రితము, ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి విడుదల చేయబడినప్పుడు, వారు తమ ఇష్టారాజ్యముగా విచ్చలివిడిగా పరుగెత్తిపోలేదు, అయితే వారు క్రమపద్ధతిలో బయలు వెడలిరి. ఇది వారి మధ్యవర్తియగు మోషేయొక్క చక్కని వ్యవస్థీకరణా కార్యమును సూచించినది. ఐగుప్తు దేవతలందరికంటే గొప్పవాడైనట్టి, మరియు అద్భుత-కార్యములకు కర్తయైన యెహోవా దేవుని ప్రజలతోనే మా బ్రతుకు అంటూ ఇశ్రాయేలీయులు కానివారి పెద్దగుంపు ఒకటికూడా వారితో బయలువెడలెను. అనేక కష్టములు వచ్చినను, ఈ “అనేకులైన అన్యజనముల సమూహము” కొంతకాలము తర్వాతకూడా, యెహోవా ఏర్పరచుకొనిన ప్రజలయెడల సుహృద్భావమును కలిగియుండి ఆ భయంకరమైన సీనాయి అరణ్యమందును వారితో యుండిరి. (నిర్గమకాండము 12:37-51; సంఖ్యాకాండము 11:4) దేవుడు అలాంటి పరదేశులకును జీవనాధార ఏర్పాట్లను నియమించెను గనుక, సాక్ష్యాధారముగా మోషే తర్వాత వచ్చిన యెహోషువ నాయకత్వము క్రింద ఇశ్రాయేలీయులతోపాటు ఆ అనేకులైన అన్యజనుల సమూహమును వాగ్ధాన దేశములో ప్రవేశించెను.
16. (ఎ) అనేకులైన అన్య జన సమూహము ఎవరికి చిత్రీకరణగా ఉండిరి? (బి) ఈ విధానాంతమునుండి తప్పించుకొనుటకు తప్పక వీరేమి చేయవలెను?
16 ఐగుప్తు ఫరో ఏలుబడినుండి బయలువెడలిన అనేకులైన ఆ అన్యజనుల సమూహము ఈ 20వ శతాబ్ద గొప్పసముహమునకు చిత్రీకరణయైయుండెను. వారు ఆత్మీయ ఇశ్రాయేలీయులు కాక, మంచికాపరియైన యేసుక్రీస్తుయొక్క వేరే గొర్రెలైయున్నారు. వీరు అభిషక్త శేషముతో కలిసి ఐగుప్తుకు దృష్టాంతముగాయున్న ఈ లోకవిధానమునుండి,—దీనికి మహాగొప్ప ఫరో అయిన అపవాదియగు సాతాను దేవుడైయున్నాడు—సంపూర్ణ విడుదలను ఎదురుచూచుచున్నారు. (యోహాను 10:16; 2 కొరింథీయులు 4:4; ప్రకటన 7:9) అయితే, సాతాను పాతలోకముయొక్క నాశనమునుండి తప్పించుకొని, మహాగొప్ప యెహోషువ అయిన యేసుక్రీస్తు నాయకత్వముక్రింద వాగ్ధాన నూతన లోకములోనికి ప్రవేశించుటకు వారేమి చేయవలెను? (2 పేతురు 3:13) దానికి వారు యెహోవా దృశ్యసంస్థ అభిషక్తుల మూలబీజముయొక్క వ్యవస్థీకరణ ఏర్పాట్లకణుగుణ్యముగా తప్పక నిలిచియుండవలెను.
17. ఈ అస్తవ్యస్తలోకములో, గొప్పసమూహపువారు ఎట్లు ప్రవర్తింతురు, మరియు వారు దేనికొరకు ఎదురు చూతురు?
17 ప్రత్యేకముగా 20వ శతాబ్దముయొక్క నాల్గవ దశాబ్దమధ్య కాలమునుండి, మహిమపరచబడిన, మరియు ఏలుచున్నరాజైన యేసుక్రీస్తు నాయకత్వముక్రింద ఈ వేరేగొర్రెల గొప్పసమూహము ఒక్క మందగా వ్యవస్థీకరింపబడిరి. ఐక్యరాజ్య సమితియున్నను, అంతకంతకు అస్తవ్యస్తమగుచున్న లోకములో, ఈ గొప్పసమూహములోని వారు అభిషక్త శేషమునకు సంపూర్ణహృదయ మద్దతునిస్తు, అలా వారు యెహోవా పరిశుద్ధాత్మయొక్క ఐక్యపరచు శక్తికి సాక్ష్యమిచ్చుచున్నారు. యేసుక్రీస్తు వెయ్యేండ్ల పాలనలో భూమిమీది ప్రత్యేక సేవకొరకు ఎదురుచూస్తునే, వారు తీర్మానపూర్వకముగా శేషించినవారితో వ్యవస్థీకరింపబడుచున్నారు. (w89 9⁄1)
మీ తలంపులు ఏమైయున్నవి?
◻ యేసుక్రీస్తు వెయ్యేండ్ల పాలనాకాలము మరియు దానిసహజస్థితిని గూర్చి లేఖనములు ఏమని సూచించుచున్నవి?
◻ మానవజాతి రక్షణకంటే మరిఎక్కువ ప్రాముఖ్యమైనది ఏమిటి?
◻ మన సామాన్యశకమునకు పూర్వము, యెహోవా విశ్వ సంస్థలో ఏ సంస్థ భూమిమీది భాగమయ్యెను?
◻ అనేకులైన అన్య జన సమూహము చిత్రీకరణగాయున్న వారు ఎట్లు వెయ్యేండ్ల పాలనలోనికి రక్షింపబడుదురు?