కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 11/1 పేజీలు 19-23
  • యెహోవాను సంతోషపరచాలన్నదే నా మొదటి చింత

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాను సంతోషపరచాలన్నదే నా మొదటి చింత
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సమర్పిత సేవా జీవితం
  • పాఠశాలలో విశ్వాస పరీక్షలు
  • నా క్రైస్తవ తటస్థ వైఖరి పరీక్షించబడింది
  • విడుదల తర్వాత నవీకరించబడిన క్రియాశీలత
  • ఐశ్వర్యవంతమైన, ప్రతిఫలదాయకమైన జీవితం
  • యెహోవా ప్రేమగల హస్తం క్రింద సేవచేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • అనాథగా మిగిలిన అబ్బాయి ప్రేమగల తండ్రిని పొందాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో యాభై సంవత్సరాలకుపైగా సేవ చేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • క్రీస్తు సైనికుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 11/1 పేజీలు 19-23

యెహోవాను సంతోషపరచాలన్నదే నా మొదటి చింత

తియాడారాస్‌ నీరాస్‌ చెప్పినది

నా జైలుగది తలుపు ఒక్కసారిగా కదిలి తెరుచుకుంది. “నీరాస్‌ ఎవరు?” అని ఒక అధికారి కేకవేశాడు. నేనేనని చెప్పినప్పుడు. “లేచి రా, మేము నీకు శిక్ష విధించబోతున్నాం” అని ఆయన ఆజ్ఞాపించాడు. అది గ్రీసులోని కొరింథులో 1952లో జరిగింది. నా జీవితం ఎందుకలా సందిగ్ధావస్థలో ఊగిసలాడుతోంది? దానిని వివరించే ముందు, నా పుట్టు పూర్వోత్తరాల్ని గురించి కొంత చెబుతానుండండి.

బైబిలు విద్యార్థులు (యెహోవాసాక్షులు అప్పట్లో అలా పిలువబడేవారు) మా నాన్నగారిని సంప్రదించారు. త్వరలోనే ఆయన వారిలో ఒకరయ్యారు. తన నమ్మకాలను తన అక్కకూ, ఏడుగురు తమ్ముళ్ళకూ తెలియజేశారు. వాళ్ళందరూ కూడా బైబిలు సత్యానికి హత్తుకున్నారు. ఆయన అమ్మానాన్నలు కూడా అదే పని చేశారు. ఆ తర్వాత ఆయన పెండ్లి చేసుకున్నారు. గ్రీసులోని, ఆగ్రీన్యోలో 1929లో వాళ్ళకు నేను జన్మించాను.

అవి గ్రీస్‌కు ఎంత భయంకరమైన సంవత్సరాలో చెప్పలేం! మొదట అక్కడ జనరల్‌ మెటాక్సాస్‌ యొక్క క్రూర నిరంకుశాధికారం ఉండేది. తర్వాత, 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆ తర్వాత మా దేశాన్ని నాజీలు ఆక్రమించుకున్నారు. రోగమూ ఆకలీ తీవ్రరూపం దాల్చాయి. ఉబ్బిన శవాలను తోపుడు బండ్లపై తీసుకువెళ్ళారు. లోకంలోని చెడుతనం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. దేవుడి రాజ్యపు అవసరత మరింత కనిపించింది.

సమర్పిత సేవా జీవితం

1942, ఆగస్టు 20న థెస్సలొనీకాకు వెలుపల మేము ఒక గుంపుగా ఒక కూటానికి సమావేశమయ్యాం. బ్రిటీష్‌ యుద్ధవిమానాలు, నగరంపై బాంబులను కురిపించినదానిని గురించి మా ప్రిసైడింగ్‌ ఓవర్‌సీయర్‌ తెలియజేశారు. ‘మనం సమాజముగా కూడటం మానకూడదు’ అన్న ఉద్బోధను అనుసరించడం ద్వారా మేమెలా తప్పించుకున్నామన్న విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. (హెబ్రీయులు 10:25) ఆ సందర్భంలో, మేము సముద్ర తీరంలో సమావేశమయ్యాం. బాప్తిస్మం కోసం అక్కడ హాజరైనవారిలో నేనూ ఒకడ్ని. మేము నీళ్ళ నుండి వెలుపలికి వచ్చి, వరుసగా నిలబడ్డాం. అప్పుడు మా క్రైస్తవ సహోదర సహోదరీలు మేము తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించే ఒక పాటను పాడారు. నిజంగా, అది మరపురాని రోజే!

కొంత కాలం తర్వాత, నేనూ, మరొక అబ్బాయీ ఇంటింటి పరిచర్యలో ప్రజలను సందర్శిస్తుండగా, పోలీసులు మమ్మల్ని బంధించి, పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. మమ్మల్ని కమ్యూనిస్టులుగా దృష్టిస్తారనీ, మా ప్రకటనా పని నిషేధించబడిందనీ వక్కాణించి తెలిపేందుకు, వాళ్ళు మమ్మల్ని కొట్టి, “మూఢులారా, యెహోవా అన్నా స్టాలిన్‌ అన్నా పెద్ద తేడాలేదు!” అని అన్నారు.

అప్పటికి గ్రీస్‌లో అంతర్యుద్ధం జరుగుతోంది. కమ్యూనిస్ట్‌ వ్యతిరేక అలజడి తీవ్రతరమైంది. మరుసటి రోజు మా చేతులకు బేడీలు వేసి మా ఇండ్ల ముందుగా మేము నేరస్థులమన్నట్లుగా మమ్మల్ని ఊరేగించారు. అయితే మాకు ఎదురైన శ్రమలు అవి మాత్రమే కాదు.

పాఠశాలలో విశ్వాస పరీక్షలు

1944 తొలినాళ్ళలో, నేను అప్పటికీ పాఠశాలలో చదువుకుంటున్నాను. థెస్సలొనీకా అప్పటికీ నాజీల వశంలోనే ఉంది. ఒక రోజు స్కూల్లో, మతం సబ్జెక్ట్‌లో ప్రొఫెసర్‌ అయిన గ్రీక్‌ ఆర్థడాక్స్‌ ప్రీస్ట్‌, ఆ రోజటి పాఠం విషయమై నన్ను పరీక్షించాలని చెప్పాడు. “ఇతడు ఆర్థడాక్స్‌ క్రైస్తవుడు కాడు” అని మిగతా పిల్లలు చెప్పారు.

“మరెవరు?” అని ప్రొఫెసర్‌ అడిగారు.

“నేను యెహోవాసాక్షుల్లో ఒకరిని” అని బదులిచ్చాను.

“గొర్రెల మధ్య ఒక తోడేలు” అని ఆయన అరిచాడు. నన్ను లాగి పట్టుకుని ముఖం మీద కొట్టాడు.

‘ఒక గొర్రె తోడేలును కొట్టడం ఎలా సాధ్యమౌతుంది?’ అని నాలో నేను అనుకున్నాను.

కొన్ని రోజుల తర్వాత, మధ్యాహ్నం భోజనం కోసం 350 మందిమి బల్లల దగ్గర కూర్చుని ఉన్నాం. “నీరాస్‌ కృతజ్ఞతా ప్రార్థనను చేస్తాడు” అని సూపర్వైజర్‌ అన్నాడు. మత్తయి 6:9-13లో యేసు తన అనుచరులకు నేర్పించిన ‘మా పరలోక తండ్రీ’ అని మొదలయ్యే ప్రార్థనను చేశాను. అది సూపర్వైజర్‌కు నచ్చలేదు. కనుక ఆయన తను కూర్చున్న దగ్గరే ఉండి, “నువ్వు ఈ విధంగా ఎందుకు ప్రార్థించావు?” అని కోపంగా అడిగారు.

“నేను యెహోవాసాక్షిని గనుకనే అలా ప్రార్థించాను” అని అన్నాను. అది విని ఆయన కూడా నన్ను లాగి చెంప మీద కొట్టారు. తర్వాత ఆ రోజే మరో టీచర్‌ తన ఆఫీసుకు నన్ను పిలిచి, “మంచి పని చేశావ్‌ నీరాస్‌. నువ్వు ఏది నమ్ముతున్నావో దానిలో స్థిరంగా ఉండు. నీ నమ్మకాన్ని వదులుకోకు” అని చెప్పారు. “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు” అని అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలతో ఆ రోజు రాత్రి మా నాన్నగారునన్ను ప్రోత్సహించారు.—2 తిమోతి 3:12.

నేను ఉన్నత పాఠశాల చదువు ముగించిన తర్వాత, నేను ఏ కెరియర్‌ను చేపట్టాలనే విషయంలో ఒక నిర్ణయానికి రావలసి ఉండింది. గ్రీస్‌లో జరుగుతున్న అంతర్‌ పోరాటం వల్ల, క్రైస్తవ తటస్థ వైఖరి విషయమైన ప్రశ్నను నేను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. (యెషయా 2:4; మత్తయి 26:52) చివరికి, 1952వ సంవత్సరపు తొలినాళ్ళలో, గ్రీస్‌ చరిత్రలోని అత్యంత క్లిష్టమైన ఆ కాలంలో నేను ఆయుధాలను చేత పట్టుకోవడానికి నిరాకరించినందుకు నాకు 20 ఏండ్ల జైలుశిక్ష విధించబడింది.

నా క్రైస్తవ తటస్థ వైఖరి పరీక్షించబడింది

నన్ను మెసలోంగియన్‌ మరియు కొరింథు సైనిక క్యాంపుల్లో ఉంచారు. బైబిలు శిక్షితమైన నా మనస్సాక్షి రాజకీయ కారకాలకు మద్దతునిచ్చేందుకుగాను సైనికుడవ్వడానికి అనుమతించదని మిలిటరీ కమాండర్‌లకు వివరించే అవకాశం నాకు లభించింది. 2 తిమోతి 2:3ను పేర్కొంటూ, “నేను ఇప్పటికే యేసు సైనికుడనయ్యాను” అని వివరించాను. విషయాన్ని గురించి మరోసారి ఆలోచించుకోమని నాకు చెప్పారు. నేను తీసుకున్న నిర్ణయం అప్పటికప్పుడు కలిగిన ప్రేరణ మూలంగా కాదనీ, చాలా గంభీరంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమనీ, ఇది దేవుడి చిత్తాన్ని చేస్తానని నన్ను నేను ఆయనకు సమర్పించుకున్న దాని దృష్ట్యా తీసుకున్న నిర్ణయమనీ చెప్పాను.

దాని ఫలితంగా, తప్పనిసరైన శ్రమకరమైన పనిని నేను చేయవలసి వచ్చింది. రోజు విడిచి రోజు మాత్రమే భోజనం పెట్టేవారు. 20 రోజుల వరకూ అలాగే చేశారు. మూడు అడుగుల పొడవూ ఆరడుగుల వెడల్పూ ఉండే చిన్న జైలు గదిలోని సిమెంట్‌ గచ్చుపై నిద్రపోయేవాడ్ని. ఆ గదిలోనే మరో ఇద్దరు సాక్షులు ఉండేవారు! శిక్ష కోసం రమ్మన్న ఆ పిలుపు నాకు వచ్చింది నేను కొరింథు క్యాంపులో ఉన్న ఈ సమయంలోనే.

మేము శిక్ష అమలు జరిపే స్థలానికి బయల్దేరినప్పుడు, “నీకు చెప్పుకోవడానికి ఏమీ లేదా?” అని అధికారి నన్ను అడిగారు.

“లేదు” అని జవాబిచ్చాను.

“మీ కుటుంబానికి నువ్వు ఉత్తరం వ్రాయడం లేదా?”

“లేదు. నాకు ఇక్కడ శిక్ష విధించేస్తారని వాళ్ళకు తెలుసు” అని మరొకసారి జవాబు చెప్పాను.

మేము వధశిక్ష అమలు జరిపే ప్రాంగణాన్ని చేరుకున్నాం. ఆ గోడ దగ్గర నిలబడమని నాకు చెప్పారు. నన్ను కాల్చేయమని సైనికులను ఆజ్ఞాపించే బదులు, “అతడ్ని లోపలికి తీసుకు వెళ్ళండి” అని అధికారి ఆజ్ఞాపించాడు. నా నిర్ణయాన్ని పరీక్షించేందుకు రూపకల్పన చేయబడిన ఎగతాళి శిక్ష విధింపు కార్యక్రమం అది.

ఆ తర్వాత నన్ను మాక్రొనీసొస్‌ అనే ద్వీపానికి తీసుకువెళ్ళారు. అక్కడ నా దగ్గర బైబిలు తప్ప మరి దేనిని ఉంచుకునేందుకు నన్ను అనుమతించలేదు. దాదాపు 500 మంది నేర ఖైదీల నుండి విడిగా 13 మంది సాక్షులను ఒక చిన్న ఇంట్లో బందీలుగా ఉంచారు. అయినప్పటికీ, సాహిత్యం ఏదో విధంగా దొంగచాటుగా మాకు చేరేది. ఉదాహరణకు, ఒక రోజు లూకూమ్యా (పేరుగాంచిన కలకండ అది) బాక్స్‌ నా కోసం వచ్చింది. పరిశోధకులు లూకూమ్యా రుచి చూడాలని చాలా ఆతృతతో ఉన్నారు గనుక, దాని క్రింద దాచి ఉంచిన కావలికోటను వాళ్ళు పట్టించుకోలేదు. “సైనికులు లూకూమ్యా తిన్నారు. మనం కావలికోట ‘తిన్నాం’!” అని ఒక సాక్షి పేర్కొన్నాడు.

ఆ మధ్యే విడుదల చేయబడిన వాట్‌ హ్యాస్‌ రిలిజియన్‌ డన్‌ ఫొర్‌ మ్యాన్‌కైండ్‌? (మానవజాతి కోసం మతం ఏమి చేసింది?) అనే పుస్తకపు ప్రతి మాకు చేరింది. ఖైదీగా ఉన్న ఇంగ్లీష్‌ తెలిసిన ఒక సాక్షి దాన్ని మా కోసం తర్జుమా చేశాడు. మేము కూటాలను రహస్యంగా జరుపుకుంటూ, కావలికోట కూడా పఠించేవాళ్ళం. మేము జైలును ఒక పాఠశాలగా, మా ఆధ్యాత్మికతను బలపరచుకునే అవకాశంగా దృష్టించాం. అన్నింటి కన్నా ముఖ్యంగా, మేము యథార్థతను నిలుపుకోవడం యెహోవాను సంతోషపరుస్తుందని మాకు తెలుసు గనుక మేము సంతోషంగా ఉన్నాం.

తూర్పు పెలపనీసస్‌లోని టిరీంథా నా చివరి జైలు. నేను తోటి ఖైదీతో బైబిలు పఠనాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఒక గార్డు జాగ్రత్తగా గమనించడాన్ని నేను గమనించాను. సంవత్సరాల తర్వాత థెస్సలొనీకాలో ఆ గార్డును కలిసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను! అప్పటికెల్లా ఆయన ఒక సాక్షి అయ్యాడు. తర్వాత ఆయన పిల్లలో ఒకరు జైలుకు వెళ్ళారు. ఒక గార్డుగా పనిచేసేందుకు కాదు, ఒక ఖైదీగా. నేను ఏ కారణాన ఖైదీనయ్యానో అదే కారణాన ఆయన కూడా ఖైదీ అయ్యాడు.

విడుదల తర్వాత నవీకరించబడిన క్రియాశీలత

నాకు 20 సంవత్సరాల జైలుశిక్ష విధించబడినప్పటికీ, నేను మూడు సంవత్సరాలే జైలుశిక్ష అనుభవించాను. నేను విడుదల పొందిన తర్వాత, ఏథెన్స్‌లో నివసించాలని నిర్ణయించుకున్నాను. కానీ, త్వరలోనే అనారోగ్యం పాలయ్యాను. నాకు ఒక రకమైన ప్లూరసీ రావడంతో నేను థెస్సలొనీకాకు తిరిగివెళ్ళడం తప్పనిసరైంది. నేను రెండు నెలలు మంచాన పడ్డాను. తర్వాత కూలా అనే అందమైన అమ్మాయిని కలిశాను. 1959 డిసెంబర్‌లో ఆమెను వివాహమాడాను. 1962లో, ఆమె పయినీరుగా సేవచేయనారంభించింది, యెహోవాసాక్షుల పూర్తికాల సేవకులు అలా పిలువబడుతారు. మూడు సంవత్సరాల తర్వాత, నేను పయినీరు పనిలో ఆమెతో చేరాను.

1965 జనవరిలో, సంఘాలను దర్శించి ఆధ్యాత్మికంగా బలపరచే సర్కిట్‌ పనికి మమ్మల్ని నియమించారు. ఆ వేసవిలో, ఆస్ట్రియాలోని వియన్నాలో జరిగే మొదటి పెద్ద జిల్లా సమావేశానికి హాజరయ్యే ఆధిక్యత కూడా మాకు లభించింది. అది గ్రీస్‌లో జరిగే సమావేశంలా కాదు. అక్కడ మా పని నిషేధించబడింది కనుక, చెట్ల మధ్య చాలా రహస్యంగా కలుసుకోవలసి వచ్చేది. 1965 ముగియబోతుండగా, ఏథెన్స్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచ్‌ ఆఫీస్‌లో పనిచేసేందుకు మాకు ఆహ్వానం వచ్చింది. అయితే, మా బంధువుల్లో కొందరికి ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల మేము 1967లో థెస్సలొనీకకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది.

కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే, మేము సువార్త పనిలో చాలా బిజీగా ఉండేవాళ్ళం. ఒకసారి, నేను నా కజిన్‌ కొస్టాస్‌తో మాట్లాడుతూ, దేవుని సంస్థ యొక్క చక్కదనాన్ని, దానిలో ఉన్న ప్రేమ, ఐక్యత, విధేయతలను ఆయనకు వర్ణించి చెప్పాను. “దేవుడనేవాడు ఉంటేనే, ఇవన్నీ బాగుంటాయి” అని ఆయన అన్నాడు. దేవుడు ఉన్నాడా లేడా అని పరిశీలించమన్న నా ఆహ్వానాన్ని ఆయన అంగీకరించాడు. 1969 ఆగస్టులో జర్మనీలోని న్యూరమ్‌బర్గ్‌లో జరిగే యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశానికి మేము హాజరుకాబోతున్నామని కూడా చెప్పాను. తను మాతో పాటు రావచ్చా అని అడిగాడు. ఆయన స్నేహితుడు ఆలకోస్‌ కూడా మాతోపాటు బైబిలు పఠిస్తున్నాడు. ఆయన కూడా రావాలని కోరుకున్నాడు.

న్యూరమ్‌బర్గ్‌ సమావేశం అసాధారణ దృశ్యంగా ఉంది ! హిట్లర్‌ తన మిలిటరీ విజయాలను ఉత్సవంగా జరుపుకున్న పెద్ద స్టేడియమ్‌లో ఆ సమావేశం జరిగింది. మా సమావేశ హాజరు 1,50,000ను మించిపోయింది. యెహోవా ఆత్మ అన్ని కార్యక్రమాల్లోనూ ప్రత్యక్షపరచబడింది. కొద్దికాలంలోనే కొస్టాస్‌, ఆలకోస్‌ బాప్తిస్మం పొందారు. వాళ్ళిరువురూ ఇప్పుడు క్రైస్తవ పెద్దలుగా సేవ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సాక్షులయ్యారు.

ఆసక్తిగల ఒక మహిళతో నేను బైబిలు పఠించనారంభించాను. మన నమ్మకాలను పరిశీలించాలనుకుంటున్నానని ఆమె భర్త వ్యక్తం చేశారు. తర్వాత కొద్దికాలానికే, గ్రీక్‌ ఆర్థడాక్స్‌ థియోలజస్ట్‌ మిస్టర్‌ సాకోస్‌ను ఒక డిబేట్‌ కోసం ఆహ్వానించానని కూడా ఆయన తెలిపారు. ఆయన మా ఇద్దరి ఎదుట కొన్ని ప్రశ్నలను ఉంచాలని కోరుకున్నారు. మిస్టర్‌ సాకోస్‌, ఒక ప్రీస్ట్‌తోపాటు వచ్చారు. మేము సందర్శిస్తున్న ఆ వ్యక్తి, “మిస్టర్‌ సాకోస్‌ను మొదట మూడు ప్రశ్నలు అడుగుతాను” అంటూ ప్రారంభించారు.

మేము చర్చలో ఉపయోగిస్తూ వస్తున్న బైబిలును ఎత్తిపట్టుకుని, “మొదటి ప్రశ్న: ఇది యథార్థమైన బైబిలేనా, లేక సాక్షుల బైబిలా?” అని ఆ వ్యక్తి ప్రశ్నించారు. మిస్టర్‌ సాకోస్‌ ఇది అధికారిక అనువాదమని జవాబు చెబుతూ, యెహోవాసాక్షులను గురించి వారు “బైబిలు ప్రేమికులు” అని వర్ణించాడు కూడా.

ఆయన తన ప్రశ్నలను కొనసాగిస్తూ, “రెండవ ప్రశ్న: యెహోవాసాక్షులు ధార్మికత గలవారేనా?” అని అడిగారు. నిజానికి, తన భార్య సహవసించనారంభించినది ఎలాంటి వ్యక్తులతోనన్న విషయాన్ని తెలుసుకోవాలనే ఆయన అలా అడిగారు. వాళ్ళు ఖచ్చితంగా ధార్మికతగల ప్రజలే అని థియోలజిస్ట్‌ జవాబిచ్చాడు.

“మూడవ ప్రశ్న” అని అంటూ, “యెహోవాసాక్షులు జీతం తీసుకుని ప్రకటిస్తున్నారా?” అని ఆ వ్యక్తి అడిగాడు. “లేదు” అని థియోలజిస్ట్‌ జవాబిచ్చాడు.

“నా ప్రశ్నలకు జవాబులు లభించాయి. నేను ఒక నిర్ణయానికి వచ్చాను” అనే ముగింపుకు ఆయన వచ్చాడు. ఆ తర్వాత ఆయన బైబిలు పఠనాన్ని కొనసాగించారు. త్వరలోనే యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకున్నారు.

ఐశ్వర్యవంతమైన, ప్రతిఫలదాయకమైన జీవితం

1976 జనవరిలో నేను మళ్ళీ సర్కిట్‌ ఓవర్‌సీయర్‌గా సేవచేయనారంభించాను. సుమారు ఆరు సంవత్సరాల తర్వాత, గ్రీస్‌లో క్రొత్త పద్ధతిలో ప్రకటించే కార్యక్రమానికి—వీధి సాక్ష్యానికి—నేతృత్వం వహించే ఆధిక్యత నాకు లభించింది. తర్వాత, 1991 అక్టోబర్‌లో, నేనూ, నా భార్యా ప్రత్యేక పయినీర్లుగా సేవ చేయనారంభించాం. కొన్ని నెలల తర్వాత, క్వాడ్రుపుల్‌ బైపాస్‌ హార్ట్‌ ఆపరేషన్‌ చేయించుకోవలసి వచ్చింది, ఆ ఆపరేషన్‌ విజయవంతమైందన్నది సంతోషకరమైన విషయం. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. నేను పూర్తికాల ప్రకటనా పనిని పునరారంభించగలిగాను. థెస్సలొనీకాలోని ఒక సంఘంలో నేను పెద్దగా కూడా సేవ చేస్తున్నాను. అలాగే చికిత్సా సంబంధ అవసరాలు గలవారికి సహాయపడేందుకు స్థానిక హాస్పిటల్‌ లీయసన్‌ కమిటీతో పని చేస్తున్నాను.

నేను నా జీవితాన్ని వెనుదిరిగి చూస్తే, మన పరలోక తండ్రిని సంతోషపరచే పనిని చేయడం ఎంత తృప్తినిస్తుందో గ్రహించాను. “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును” అన్న ఆహ్వానాన్ని చాలా కాలం క్రితమే అంగీకరించినందుకు ఆనందిస్తున్నాను. (సామెతలు 27:11) యెహోవా సంస్థలోకి వస్తున్న యథార్థ హృదయులైన ప్రజల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరగడాన్ని చూడడం కూడా నా హృదయానికి ఆనందాన్నిస్తుంది. బైబిలు సత్యంతో ప్రజలను స్వతంత్రులను చేసే పనిలో భాగం వహించి, తద్వారా నీతియుక్తమైన క్రొత్త లోకంలో నిత్యజీవాన్ని గురించిన అపేక్షను వారికి కలిగించడం నిజంగా ఒక ఆధిక్యతే!—యోహాను 8:32; 2 పేతురు 3:13.

తమ సమయాన్నీ, తమ బలాన్ని యెహోవాకు సమర్పించేందుకు పూర్తికాల పరిచర్యను తమ లక్ష్యంగా ఉంచుకోవాలని యౌవనస్థులైన యెహోవా సేవకులనందరినీ ప్రోత్సహించడానికి మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాం. నిజంగానే, యెహోవాయందు నమ్మకముంచి, ఆయన హృదయాన్ని ఆనందింపజేయడంలో అత్యధిక ఆనందాన్ని పొందగల జీవితమే, ఒకరు అనుభవించగల అత్యంత సార్ధక జీవితం!—సామెతలు 3:5; ప్రసంగి 12:1.

[21వ పేజీలోని చిత్రాలు]

(ఎడమ నుండి కుడికి)

1965లో బేతేలు వంటగదిలో సేవచేయడం

1970లో మన ప్రకటనా పని నిషేధంలో ఉన్నప్పుడు ప్రసంగం ఇస్తున్నాను

1959లో నా భార్యతో

[23వ పేజీలోని చిత్రం]

నాభార్య కూలాతో

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి