కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 4/15 పేజీలు 5-8
  • మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ముందుగానే లిఖించబడిన భవిష్యత్తు
  • దేవునికి ప్రతీదీ ముందుగానే తెలుసా?
  • మానవుని ఎదుటనున్న రెండు మార్గాలు
  • దేవుని ప్రేమతో విధినిర్ణయం సమన్వయపర్చబడగలదా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • మంచివాళ్లకు చెడు జరుగుతోంది—ఎందుకు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • యెహోవా ‘ఆదినుండి కలుగబోవువాటిని’ తెలియజేస్తున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • మీ భవితవ్యాన్ని మీరు ఎంపిక చేసుకోవచ్చు
    తేజరిల్లు!—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 4/15 పేజీలు 5-8

మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది?

సర్వోన్నతుడైన దేవుడు (ఖుదా) వర్తమాన భూత భవిష్యత్కాల విషయాలన్నింటినీ ఎరిగిన సర్వజ్ఞుడైతే, ఆయన ముందుగా చూసినట్లుగానే అన్ని విషయాలూ ఖచ్చితంగా నిర్దేశించబడిన రీతిలోనే జరుగుతున్నాయంటారా? ప్రతి మానవుని జీవిత గమనాన్నీ, తుదిగతినీ, దేవుడు (ఖుదా) ముందుగానే చూసినట్లైతే, ఆదేశించినట్లైతే మన జీవితగమనాన్నీ, భవిష్యత్తునూ ఎంపికచేసుకొనే స్వేచ్ఛాచిత్తం మనకుందని నిజంగా చెప్పగలమా?

శతాబ్దాలుగా ఈ ప్రశ్నలపై వాదోపవాదాలు జరిగాయి. ఈ వ్యాజ్యం ప్రధాన మతాల్ని ఇప్పటికీ విభజిస్తోంది. భవిష్యత్తును ముందుగా తెలుసుకోగలిగే దేవుని సామర్థ్యం మానవుని స్వేచ్ఛాచిత్తంతో పొందికకల్గినదై ఉండగలదా? మనం జవాబుల కోసం ఎక్కడ చూడాలి?

తన వాగ్దూతలైన ప్రవక్తల ద్వారా తెలియజేసిన తన రాతపూర్వక మాధ్యమం ద్వారా మానవాళితో దేవుడు (ఖుదా) సంభాషించాడనే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు అంగీకరిస్తారు. ఉదాహరణకు, ఖుదా నుండి వచ్చినవని ఖురాన్‌ చెబుతున్న దైవవాణులు (ప్రకటనలు) ఏవంటే: తౌరాత్‌ (తోరా, ధర్మశాస్త్రం, లేక మోషే రాసిన ఐదు పుస్తకాలు), జబూర్‌ (కీర్తనలు), ఇంజీల్‌ (సువార్తలు, క్రైస్తవ గ్రీకు లేఖనాలు లేక “క్రొత్త నిబంధన”) అలాగే ఇశ్రాయేలు ప్రవక్తలకు బయల్పర్చబడినవి.

క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో మనమిలా చదువుతాం: “దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.” (2 తిమోతి 3:16) మనం పొందే ఏ నిర్దేశమైనా లేక ఏ జ్ఞానోదయమైనా సరే, చివరికది దేవుని నుండే రావాలనేది సుస్పష్టం. మరైతే దేవుని తొలి ప్రవక్తల గ్రంథాల్ని పరిశీలించడం జ్ఞానయుక్తమైన పని కాదంటారా? మన భవిష్యత్తును గురించి అవేం బయల్పరుస్తున్నాయి?

ముందుగానే లిఖించబడిన భవిష్యత్తు

పవిత్ర లేఖనాల్లో అక్షరార్థంగా వందలాది ప్రవచనాలు ఉన్నాయనే విషయం వాటిని చదివే ఏ వ్యక్తికైనా తెలిసిన సంగతే. ప్రాచీన బబులోను కూలిపోవడమూ, (సా.శ.పూ. ఆరవ శతాబ్దంనుండి ఐదవ శతాబ్దం వరకూ జరిగిన) యెరూషలేము పునఃనిర్మాణమూ, ప్రాచీన మాదీయ-పారశీక, గ్రీకు రాజుల ఉత్థానపతనాలూ వంటి చారిత్రక సంఘటనలన్నీ సవివరంగా ముందుగానే తెలియజేయబడ్డాయి. (యెషయా 13:17-19; 44:24–45:1; దానియేలు 8:1-7, 20-22) అలాంటి ప్రవచనాల నెరవేర్పు, పవిత్ర లేఖనాలు నిశ్చయంగా దేవుని వాక్యమేననే బలమైన రుజువుల్లో ఒకటై ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందుగా చూడగలిగే శక్తీ, నిర్ధారించగలిగే శక్తీ దేవునికి మాత్రమే ఉంది. ఈ భావంలో, పవిత్ర లేఖనాలు నిశ్చయంగా భవిష్యత్తును ముందుగానే లిఖించివుంచాయి.

దేవుడే ఇలా ప్రకటిస్తున్నాడు: “దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను . . . నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను. ఉద్దేశించియున్నాను సఫలపరచెదను.” (యెషయా 46:9-11; 55:10, 11) దేవుడు తన ప్రాచీన ప్రవక్తలకు తనను తాను గుర్తింపచేసుకున్న నామము యెహోవా. దాని అక్షరార్థభావం “తానే కర్త అవుతాడు.”a (ఆదికాండము 12:7, 8; నిర్గమకాండము 3:13-15; కీర్తన 83:18) తన మాటను నెరవేర్చేవాడిననీ, తన సంకల్పాల్ని ఎల్లప్పుడూ సఫలపర్చేవాడిననీ దేవుడు తనను తాను బయల్పర్చుకున్నాడు.

అలా దేవుడు తన సంకల్పాల్ని నెరవేర్చడంలో భవిష్యత్తు ముందుగా తెలుసుకొనగలిగే తన శక్తిని ఉపయోగిస్తాడు. ఆయన ఆ శక్తిని దుష్టులపైకి రాబోయే తీర్పును హెచ్చరించేందుకూ, అలాగే రక్షణకొరకైన నిరీక్షణను తన సేవకులకు ఇచ్చేందుకూ తరచుగా ఉపయోగించాడు. అయితే దేవుడు ఈ శక్తిని అపరిమితమైన రీతిలో ఉపయోగిస్తాడా? తాను ముందుగా తెలుసుకొని ఉండకూడదని దేవుడు ఎంపిక చేసుకున్న విషయాల్ని గూర్చి పవిత్ర లేఖనాల్లో రుజువేమైనా ఉందా?

దేవునికి ప్రతీదీ ముందుగానే తెలుసా?

త్రోసిపుచ్చలేని రీతిలో దేవునికి ముందుగా తెలుసుకొనే, భవిష్య సంఘటనల్ని నిర్ధారించే శక్తి ఉంది గనుక, ప్రతీ వ్యక్తి భవిష్య చర్యలతోపాటూ అన్నీ ఆయనకు ముందుగానే తెలిసి ఉండాలనే ఊహపై పూర్వ నిర్ధారణ సిద్ధాంతాన్ని బలపర్చే వాదనలన్నీ ఆధారపడి ఉన్నాయి. ఈ ఊహ సరియైనదేనంటారా? దేవుడు తన పవిత్ర లేఖనాల్లో బయల్పర్చిన విషయాలు దీనికి భిన్నంగా సూచిస్తున్నాయి.

ఉదాహరణకు, అబ్రాహాము కుమారుడైన ఇస్సాకును దహన బలిగా అర్పించమని ఆజ్ఞాపించడం ద్వారా “దేవుడు అబ్రాహామును పరిశోధించెను” అని లేఖనాలు చెబుతున్నాయి. అబ్రాహాము ఇస్సాకును అర్పించబోతుండగా, దేవుడాయన్ని ఆపి, “నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్నదనెను.” (ఆదికాండము 22:1-12) అబ్రాహాము ఈ ఆజ్ఞకు విధేయత చూపిస్తాడని ముందుగానే దేవునికి తెల్సివున్నట్లైతే ఆయన అలా వ్యాఖ్యానించి ఉండేవాడా? అది నిజాయితీతో కూడిన పరీక్షౌతుందా?

అంతేగాక, దేవుడు తాను చేసిన దానినిబట్టిగానీ లేక చేయాలని అనుకుంటున్న దాన్నిబట్టిగానీ ‘సంతాపపడినట్లు’గా దేవుడు తనను గురించి తాను పదే పదే చెప్పుకున్నట్టు ప్రాచీనకాల ప్రవక్తలు నివేదించారు. ఉదాహరణకు, “అతనిని [సౌలును] రాజుగా నిర్ణయించినందుకు నేను [హెబ్రీ పదమైన నాచమ్‌ నుండి వచ్చిన పదమైన] పశ్చాత్తాపపడుచున్నాను” అని దేవుడు తెలియజేశాడు. (1 సమూయేలు 15:11, 35; పోల్చండి యిర్మీయా 18:7-10; యోనా 3:10) దేవుడు పరిపూర్ణుడు గనుక, ఇశ్రాయేలీయుల మొదటి రాజుగా సౌలును ఎంపికచేసుకోవడంలో దేవుడు పొరపాటు చేశాడని ఈ వచనాల భావంకాదు. బదులుగా, సౌలు విశ్వాసభ్రష్టునిగానూ, అవిధేయునిగానూ మారినందుకు దేవుడు వ్యక్తపర్చిన విచారాన్నవి సూచిస్తుండాలి. సౌలు చర్యలు దేవునికి ముందే తెలిసివుంటే తనను తాను సూచిస్తూ అలాంటి అభివ్యక్తీకరణల్ని దేవుడు ఉపయోగించడం అర్థరహితమైనవై ఉంటాయి.

నోవహు దినాల్ని సూచిస్తున్న అతి ప్రాచీన కాలం గురించి లేఖనాల్లో అలాంటి పదమే కనబడుతుంది, అక్కడిలా చెప్పబడుతోంది: “తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా—నేను సృజించిన నరు[ల]ను . . . భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నాననెను.” (ఆదికాండము 6:6, 7) మానవుని చర్యలను దేవుడు పూర్వ నిర్ధారణ చేయలేదని ఇక్కడ మరలా ఇది సూచిస్తోంది. దేవుడు తన సొంత చర్యలు సరియైనవికానందుకుగాక, మానవుని దుష్టత్వం అధికమైపోయినందుకే సంతాపపడ్డాడు, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు కూడా. నోవహునూ, అతని కుటుంబాన్నీ మినహాయించి సమస్త మానవజాతినీ నాశనం చేయాల్సిన అగత్యం ఏర్పడినందుకు సృష్టికర్త సంతాపపడ్డాడు. దేవుడు మనకిలా అభయమిస్తున్నాడు: “దుర్మార్గుడు మరణము నొందుటవలన నాకు సంతోషము లేదు.”—యెహెజ్కేలు 33:11; పోల్చండి ద్వితీయోపదేశకాండము 32:4, 5.

ఆదాము పాపంలో పడిపోతాడనీ, అలా పాపంలో పడిపోవడం మానవ కుటుంబంపైకి విపత్కర పర్యవసానాలను తీసుకు వస్తుందనీ దేవునికి ముందుగానే తెలిసీ, అలా జరగాలని ఆదేశించాడంటారా? ఇది నిజంకాదని మనం పరిశీలించిన సంఘటనలు చూపిస్తున్నాయి. అంతేగాక, ఇవన్నీ దేవునికి ముందుగానే తెలిస్తే, ఆయన మానవుణ్ణి చేసినప్పుడే, పాపానికి మూలకర్తయై ఉండేవాడు, అలాగైతే సమస్త మానవ దుష్టత్వానికీ, బాధలకూ ఉద్దేశపూర్వకంగా దేవుడే బాధ్యుడై ఉండేవాడు. స్పష్టంగా, ఇది లేఖనాల్లో దేవుడు తనను తాను బయల్పర్చుకున్న దానికి పొందికగాలేదు. ఆయన దుష్టత్వాన్ని అసహ్యించుకొని నీతిని ప్రేమించే ప్రేమగల దేవుడూ, న్యాయమూర్తీ అయ్యున్నాడు.—కీర్తన 33:5; సామెతలు 15:9; 1 యోహాను 4:8.

మానవుని ఎదుటనున్న రెండు మార్గాలు

మన వ్యక్తిగత భవిష్యత్తు ఏదో విధంగా దేవునిచే ముందే నిర్ధారించబడిందనీ లేక పూర్వ నిర్ధారణ చేయబడిందనీ పవిత్ర లేఖనాలు బయల్పర్చడంలేదు. బదులుగా, అవి మానవునికి సాధ్యనీయమైన రెండు మార్గాలను దేవుడు ముందుగా తెలియజేశాడనే విషయాన్ని మాత్రమే బయల్పర్చాయి. వాటిలో ఏది తన మార్గమై ఉండాలో ఎంపికచేసుకొనే స్వేచ్ఛాచిత్తాన్ని దేవుడు ప్రతి మానవునికీ ఇచ్చాడు. ప్రవక్తయైన మోషే ఎంతో కాలం క్రిందట ఇశ్రాయేలీయులకు ఇలా తెలియజేశాడు: “నేడు జీవమును మరణమును . . . నేను నీ యెదుటను ఉంచి[యున్నాను.] . . . నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి.” (ద్వితీయోపదేశకాండము 30:19, 20) దేవుని ప్రవక్తయైన యేసు ముందే ఇలా హెచ్చరించాడు: “ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.” (మత్తయి 7:13, 14) ఆ రెండు దారులూ, రెండు భవిష్యత్తులై ఉన్నాయి. మన భవిష్యత్తు మన సొంత చర్యలపై ఆధారపడివుంది. దేవునికి విధేయత చూపించడమంటే జీవం, ఆయనకు అవిధేయత చూపించడమంటే మరణం.—రోమీయులు 6:23.

దేవుడు “అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు.” (అపొస్తలుల కార్యములు 17:30, 31) నోవహు దినాల్లోని మానవజాతిలో అధికసంఖ్యాకులు ఏవిధంగానైతే దేవునికి అవిధేయత చూపించడాన్ని ఎంపికచేసుకొని, సర్వనాశనమయ్యారో, అలాగే నేడు కూడా అధికసంఖ్యాకులు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడంలేదు. అయితే, నాశనమయ్యే వాళ్లెవరు, రక్షణ పొందేవాళ్ళెవరు అనే విషయాన్ని దేవుడిప్పటికే నిర్ధారించేసేయలేదు. నిజానికి, దేవుడు “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు[న్నాడని]” దేవునివాక్యం చెబుతోంది. (2 పేతురు 3:9) పరమ దుర్మార్గులు సహితం పశ్చాత్తాపపడి, విధేయులై దేవుని అనుగ్రహాన్ని సంపాదించడానికి అవసరమైన మార్పుల్ని చేసుకోవచ్చు.—యెషయా 1:18-20; 55:6, 7; యెహెజ్కేలు 33:14-16; రోమీయులు 2:4-8.

విధేయత చూపించే వారందరికీ, దేవుడు శాంతియుతమైన పరదైసులో (పిర్దౌసులో) అంటే సకల విధములైన దుష్టత్వమూ, హింసా, యుద్ధాలూ తుడిచివేయబడిన భూమిపై, క్షుద్బాధ, బాధా, రోగమూ, మరణమూ ఇకవుండని లోకంలో నిత్యజీవాన్ని వాగ్దానం చేస్తున్నాడు. (కీర్తన 37:9-11; 46:9; యెషయా 2:4; 11:6-9; 25:6-8; 35:5, 6; ప్రకటన 21:4) మృతులు కూడా పునరుత్థానులౌతారు, దేవుని సేవచేసే అవకాశం వారికి ఇవ్వబడుతుంది.—దానియేలు 12:2; యోహాను 5:28, 29.

“నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము. సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును” అని కీర్తనల గ్రంథకర్త చెబుతున్నాడు. (కీర్తన 37:37, 38) మీ భవిష్యత్తు ఏమైవుంటుంది? అది మీపైనే ఆధారపడివుంది. మీకుగా మీరు సంతోషకరమైన శాంతియుతమైన భవిష్యత్తును ధృవపర్చుకొనేలా మిమ్మల్ని సంసిద్ధుల్ని చేయడానికి మరింత సమాచారాన్ని అందించడానికి ఈ పత్రిక ప్రచారకులు సంతోషిస్తారు.

[అధస్సూచి]

a పవిత్ర లేఖనాల్లో యెహోవా నామము 7,000 కన్నా ఎక్కువసార్లు కనిపిస్తుంది; వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన మహాగొప్ప నామము (ఆంగ్లం) అనే కరపత్రాన్ని చూడండి.

[6వ పేజీలోని చిత్రం]

తన సంకల్పాల్ని నెరవేర్చడంలో దేవుడు భవిష్యత్తును ముందుగా తెలుసుకోగలిగే తన శక్తిని ఉపయోగిస్తాడు

[8వ పేజీలోని చిత్రం]

దేవుడు “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు(న్నాడు).” 2 పేతురు 3:9

[7వ పేజీలోని చిత్రం]

అబ్రాహాము తన కుమారుణ్ణి అర్పించడానికి సుముఖంగా ఉన్నాడన్న విషయం దేవునికి ముందుగానే తెలిస్తే, అది నిజాయితీతో కూడిన పరీక్షౌతుందా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి