దేవుని ప్రేమతో విధినిర్ణయం సమన్వయపర్చబడగలదా?
“ప్రతి మనుష్యునితో దేవుడు ఏమి చేయాలన్న దాన్ని ఆయన నిర్ణయించినందువల్ల, దేవుని నిత్య ప్రణాళికగా విధినిర్ణయాన్ని మేము నిర్వచిస్తాము, ఎందుకంటే, వారందరినీ ఒకే పరిస్థితిలో సృష్టించలేదు కానీ కొందరిని నిత్యజీవానికి మరి కొందరిని నిత్య దండనకు ముందుగానే నియమిస్తాడు.”
ప్రొటస్టెంట్ సంస్కరణకర్తయైన జాన్ కాల్విన్ విధినిర్ణయ సిద్ధాంతాన్ని గూర్చిన తన భావనను ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ది క్రిస్టియన్ రిలిజియన్ అనే తన పుస్తకంలో అలా నిర్వచించాడు. ఈ సిద్ధాంతం, దేవుడు సర్వజ్ఞానియని మరి తన ప్రాణుల చర్యలేవీ తన సంకల్పాలను ప్రశ్నించలేవు లేక మార్చుకోవల్సిందిగా చేయలేవనే ఆలోచనపై ఆధారితమైవుంది.
అయితే, దేవున్ని గూర్చి బైబిలు నిజంగా ఇలాగే సూచిస్తోందా? మరి ప్రాముఖ్యంగా, అలాంటి వివరణ దేవుని లక్షణాలకు, ప్రత్యేకంగా ఆయన ముఖ్య లక్షణమైన ప్రేమ విషయంలో తగినదేనా?
భవిష్యత్తును గూర్చి ముందుగా చెప్పగల దేవుడు
దేవుడు భవిష్యత్తునుగూర్చి ముందుగానే చెప్పగలడు. “నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.” అని ఆయన తనను తాను వర్ణించుకున్నాడు. (యెషయా 46:10) మానవ చరిత్రంతటిలోనూ, దేవుడు తన పూర్వజ్ఞానాన్ని ఉపయోగించగలడని మరియు సంఘటనలు సంభవించకముందే వాటిని చెప్పగలడని చూపేందుకు ప్రవచనాలను రాయించాడు.
ఆ విధంగా, బబులోను రాజైన బెల్షస్సరు కాలంలో, ఒక దాని స్థానాన్ని మరొకటి ఆక్రమించుకొనే రెండు క్రూరమృగాలను గూర్చి ప్రవక్తయైన దానియేలు కలగన్నప్పుడు, యెహోవా వాటి భావాన్ని అతనికిలా తెలియజేశాడు: “నీవు చూచిన రెండు కొమ్ములుగల ఆ పొట్టేలున్నదే, అది మాదీయులయొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకులరాజు.” (దానియేలు 8:20, 21) స్పష్టంగా, ప్రపంచాధిపత్యాల పరంపరను బయల్పర్చేందుకు దేవుడు తన పూర్వజ్ఞానాన్ని ఉపయోగించాడు. ఆ నాడున్న బబులోను సామ్రాజ్య స్థానాన్ని మొదట మాదీయపారసీకులు ఆ తర్వాత గ్రీసు ఆక్రమిస్తాయి.
ప్రవచనాలు ఒక వ్యక్తికి సంబంధించినవి కూడా కావచ్చు. ఉదాహరణకు మెస్సీయా బెత్లెహేమునందు జన్మిస్తాడని ప్రవక్తైన మీకా ప్రకటించాడు. (మీకా 5:2) మరలా, ఈ విషయంలో దేవుడు తన పూర్వజ్ఞానాన్ని కనపర్చాడు. అయితే, ఈ సంఘటన ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రకటించబడింది—అదే మెస్సీయాను గుర్తించడం. ప్రతీ వ్యక్తినీ ఇమిడ్చే విధినిర్ణయ సిద్ధాంత సాధారణీకతను ఈ సంఘటన సమర్థించడం లేదు.
బదులుగా, ఒక సంఘటన ఫలితాన్ని దేవుడు ముందుగా తెలుసుకునేందుకు ఎన్నుకోని పరిస్థితులున్నాయని లేఖనాలు చూపుతున్నాయి. సొదొమ గొమొఱ్ఱాల నాశనానికి ముందు ఆయన ఇలా ప్రకటించాడు: “నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందుననెను.” (ఆదికాండము 18:21) దేవుడు విషయాలను పరిశీలించకముందు ఆ పట్టణాల్లోని నీచస్థితి ఎంతగా ఉందో ఆయన ముందే తెలుసుకోలేడని ఈ వాక్యం స్పష్టంగా చూపిస్తోంది.
నిజమే, దేవుడు కొన్ని సంఘటనలను ముందుగానే చూడగలడు, అయినా అనేక సందర్భాల్లో తన పూర్వజ్ఞానాన్ని దేవుడు ఉపయోగించుకోవాలని ఎన్నుకోలేదు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు, తన సామర్థ్యాలను తనకు నచ్చినట్లుగా ఉపయోగించుకునే స్వేచ్ఛగలవాడు, అపరిపూర్ణ మానవులకు నచ్చినట్లుగా కాదు.
వివాదములను తీర్చగల దేవుడు
కాల్విన్ చెప్పినట్లుగానే, మానవుడు సృష్టించబడకముందే, అతను పాపంలో పడిపోతాడని ముందే నిర్ణయించాడని, అలా పడిపోవడానికి ముందే దేవుడు తాను ‘ఏర్పర్చుకున్నవారి’ విధినిర్ణయాన్ని చేసేశాడని కొందరు చెబుతారు. మరి ఇది నిజమైతే, ఆదాము హవ్వలు పొందలేరని పూర్తిగా తెలిసిన తర్వాత కూడా వారికి ఆ ఉత్తరాపేక్షను అందించడం దేవుని పక్షంలో వేషధారణ అయ్యుండేది కాదా? అంతేకాకుండ, దైవిక నడిపింపును అనుసరించి నిత్యం జీవించడం లేక వాటిని తృణీకరించి చనిపోవడం అన్న ఎంపికను మొదటి మానవ దంపతులకు ఇచ్చిన విషయాన్ని లేఖనాలు ఎక్కడా కాదనలేదు.—ఆదికాండము, 2వ అధ్యాయం.
అయితే ఆదాము హవ్వల పాపం దేవుని సంకల్పాలకు నిజంగా అవరోధమైందా? లేదు, వారు పాపము చేసిన వెంటనే, సాతాన్ని మరియు అతని అనుచరులను నాశనం చేసేందుకు ఒక ‘సంతానాన్ని’ ఉత్పన్నం చేస్తాననీ మరి తాను భూమ్మీది విషయాలను మరలా సరిచేస్తాననీ దేవుడు ప్రకటించాడు. కాబట్టి, ఎలాగైతే కొన్ని కీటకాలు ఒక తోటమాలిని, మంచి ఫలాలను పండించకుండా ఆపలేవో అలాగే ఆదాము హవ్వల అవిధేయత, భూమిని పరదైసుగా మార్చే సంకల్పాన్ని నెరవేర్చడం నుండి దేవున్ని ఆపలేదు.—ఆదికాండము 3వ అధ్యాయం.
రాజైన దావీదు సంతానానికి అప్పగించబడే ఒక రాజ్య ప్రభుత్వం రాబోతోందనీ, అంతేకాకుండ ఇతరులు ఈ రాజ్యంలో కలిసి పని చేస్తారని దేవుడు తర్వాత బయల్పర్చాడు. ఈ ఇతరులు “మహోన్నతుని పరిశుద్ధులు” అని పిలువబడుతున్నారు.—దానియేలు 7:18; 2 సమూయేలు 7:12; 1 దినవృత్తాంతములు 17:11.a
ముందుగా చెప్పడం అంటే విధినిర్ణయమని కాదు
మానవజాతి ఏ పద్ధతిని అవలంబిస్తుందో తెలుసుకోకుండా ఉండేందుకు దేవుడు ఎన్నుకున్నాడన్న వాస్తవం, మానవుని యొక్క మంచి లేక చెడు కార్యాల పర్యవసనాన్ని గూర్చి ఆయన ప్రవచించకుండా ఆపుచేయలేడు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే, దానికి కారణం, వాహనం సరిగ్గా పనిచేయడంలేదని డ్రైవర్ను హెచ్చరించిన మెకానిక్కును దానికి బాధ్యునిగా ఎంచలేము లేక విధినిర్ణయాన్ని చేశాడని చెప్పలేము. అదే విధంగా, ఒక వ్యక్తి చర్యలకు విషాదకర పర్యవసనాలను నిర్ణయించాడని దేవున్ని నిందించలేము.
మొదటి మానవ దంపతులకు కల్గిన సంతానం విషయంలో కూడా అదే వాస్తవం. కయీను తన సహోదరుని చంపకముందు, యెహోవా కయీను ఎదుట ఒక ఎంపికను ఉంచాడు. అతను పాపంపై ఆధిపత్యం వహిస్తాడా లేక పాపమే అతనిపై ఆధిపత్యం వహిస్తుందా? ఆ దృష్టాంతంలో ఉన్నదేదీ కూడా, కయీను చెడు ఎంపికను చేసుకొని తన సహోదరుని చంపుతాడని యెహోవా విధినిర్ణయించినట్లు సూచించడం లేదు.—ఆదికాండము 4:3-7.
ఆ తర్వాత, యెహోవానుండి వైదొలగినట్లైతే సంభవించగలదన్న దాన్ని గూర్చి మోషే ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులను హెచ్చరించింది. ఉదాహరణకు, అన్యస్త్రీలను వివాహం చేసుకోవడం. ముందుగా చెప్పినదేదో అదే సంభవించింది. తన తర్వాతి జీవితంలో విగ్రహారాధన చేసేలా అన్యులైన తన భార్యల వల్ల ప్రభావితుడైన సొలొమోను రాజు ఉదాహరణలో అది కనిపిస్తుంది. (1 రాజులు 11:7, 8) అవును, దేవుడు తన ప్రజలను హెచ్చరించాడు, అయితే వారి వ్యక్తిగత చర్యలు ఎలా ఉంటాయన్న దాని గురించిన విధినిర్ణయాన్ని ఆయన చేయలేదు.
ఏర్పర్చబడిన లేక ఎన్నికచేయబడిన క్రైస్తవులు క్రీస్తుతో పాటు పరలోకంలో పరిపాలించే వాగ్దాన బహుమానాన్ని పోగొట్టుకోకుండా ఉండాలనుకుంటే పట్టుదల కల్గివుండాలని ప్రోత్సహించబడ్డారు. (2 పేతురు 1:10; ప్రకటన 2:5, 10, 16; 3:11) గతంలోని కొందరు వేదాంతులు అడిగినట్లుగా, ఏర్పర్చబడినవారి పిలుపే తుదిపిలుపైతే అలాంటి జ్ఞాపికలు ఎందుకు ఇవ్వబడ్డాయి?
విధినిర్ణయం మరియు దేవుని ప్రేమ
“దేవుని స్వరూపమందు” సృష్టించబడి, మానవునికి స్వేచ్ఛా చిత్తం ఇవ్వబడింది. (ఆదికాండము 1:27) ప్రతి కదలిక ముందుగానే నిర్ణయింపబడిన మరమనుష్యులవలెగాక [రాబోట్], ప్రేమనుబట్టి దేవుని మహిమపరచి, సేవించాలంటే ఆవశ్యమైంది స్వేచ్ఛాచిత్తమే. తెలివైన, స్వేచ్ఛా ప్రాణులు కనపర్చిన ప్రేమ, అవాంఛనీయ నిందలను దేవుడు త్రిప్పి కొట్టేందుకు సహాయపడుతుంది. ఆయన ఇలా అంటున్నాడు: “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.”—సామెతలు 27:11.
దేవుని సేవకులకు విధినిర్ణయించబడినట్లైతే—లేక అలంకారికంగా చెప్పాలంటే వాళ్లకు ముందే అంతా ప్రోగ్రామ్ చేయబడినట్లైతే—తమ సృష్టికర్త యెడలగల వారి ప్రేమ యథార్థమైనదేనా అని సందేహించబడదా? అంతేకాకుండ, ఒకరి వ్యక్తిగత యోగ్యతలను పరిగణలోకి తీసుకోకుండా వారికి మహిమనిచ్చేందుకు మరియు సంతోషాన్నిచ్చేందుకు వారి విధిని ముందే నిర్ణయించడం, దేవుని పక్షపాతరాహిత్యానికి విరుద్ధమైంది కాదా? అంతేకాకుండ, ఎవరైనా అలాంటి పక్షపాత వ్యవహారాన్ని పొంది, మరితరులు నిత్య దండనకు నిర్ణయించబడివుంటే, “ఏర్పర్చబడిన” లేక “ఎన్నుకోబడిన” వారిలో యథార్థమైన కృతజ్ఞతా భావాలు ఉత్పన్నంకావు.—ఆదికాండము 1:27; యోబు 1:8; అపొస్తలుల కార్యములు 10:34, 35.
చివరికి, మానవజాతికంతటికీ సువార్తను ప్రకటించమని క్రీస్తు తన శిష్యులతో చెప్పాడు. రక్షించేవారిని దేవుడు ముందుగానే ఏర్పర్చుకుంటే, అది ప్రకటించే పనిలో క్రైస్తవులు కనపర్చే ఆసక్తిని తగ్గించదా? అది ప్రకటించే పనిని పూర్తిగా ఉద్దేశరహితం చేయదా?
దేవుని నుండి వచ్చే పక్షపాతరహిత ప్రేమ, మనుష్యులు తిరిగి ఆయనను ప్రేమించేలా కదిలించే బలమైన శక్తి. అతి గొప్పగా కనపర్చబడిన దేవుని ప్రేమ ఏదంటే అపరిపూర్ణ పాపభూయిష్ఠ మానవజాతి కొరకు తన కుమారుని అర్పించడమే. తన కుమారుని గూర్చిన దేవుని పూర్వ జ్ఞానం విశేషమైనది, అయితే యేసునందు స్థాపితమైన పునరుద్ధరణ వాగ్దానాలు నిజంగా నెరువేరుతాయనే హామీని అది మనకిస్తుంది. గనుక మనం ఆ కుమారుని యందు విశ్వాసముంచి, దేవునికి సన్నిహితులమవుదాం. మన సృష్టికర్తతో మంచి సంబంధాన్ని కల్గివుండమనే దైవిక ఆహ్వానాన్ని గైకొనడం ద్వారా మన మెప్పుదలను చూపిద్దాం. నేడు, స్వేచ్ఛాచిత్తాన్ని కల్గివుండి, దేవుని యెడల తమకున్న ప్రేమను చూపించేందుకు ఇష్టపడుతున్నవారందరికీ ఆయన ఈ ఆహ్వానాన్ని అందిస్తున్నాడు.
[అధస్సూచీలు]
a “లోకము పుట్టినది మొదలుకొని”నప్పుడు, సిద్ధపర్చబడిన రాజ్యమును గూర్చి యేసు మాట్లాడినప్పుడు (మత్తయి 25:34), మొదటి పాపము జరిగిన తర్వాత కొంత కాలాన్ని ఆయన సూచించి ఉండవచ్చు. లూకా 11:50, 51, “లోకము పుట్టినది మొదలుకొని” లేక విమోచన ద్వారా రక్షించబడగల మానవజాతి పుట్టుకను హేబెలు కాలానికి సూచించింది.
[7వ పేజీలోని బాక్సు]
ఒక గుంపుగా విధినిర్ణయించబడ్డం
“అనేకమంది సహోదరులలో తనకుమారుడు జ్యేష్ఠుడగునట్లు, ఆయన పోలికచొప్పున ఉండేందుకు దేవుడు తనకు ముందుగా తెలిసిన వారి విధిని కూడా నిర్ణయించాడు. మరియు ఆయన విధినిర్ణయించిన వారిని పిలిచాడు; పిలిచినవారిని సమర్థించాడు; సమర్థించినవారిని మహిమపర్చాడు.” (రోమీయులు 8:29, 30 న్యూ ఇంటర్నేషనల్ వర్షన్) ఈ వచనాల్లో పౌలు వాడిన “విధినిర్ణయం” అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలము?
ఇక్కడ పౌలు తర్కన, వ్యక్తిగత విధినిర్ణయ పక్షంగా వాదించే అనుల్లంఘనీయ తర్కనేమీ కాదు. మన శతాబ్దపు తొలి భాగంలో, డిక్షనరే దె థియోలజీ కాథోలిక్ పౌలు వాదనలను (రోమీయులు 9-11 అధ్యాయాలను) ఈ విధంగా వివరించింది: “కాథోలిక్ పండితుల నడుమ, నిత్యజీవాన్ని పొందేందుకు విధినిర్ణయించబడడమనే సిద్ధాంతాన్ని విశదంగా వివరించడం ఎక్కువగా జరగలేదు.” ఎమ్. లాగ్రాంజ్ ఇలా అన్నట్లు సూచించిన అదే రెఫరెన్స్, “పౌలు రేపిన ప్రశ్న, విధినిర్ణయానికి మరియు నిర్ణయిత దండనకు సంబంధించినది కాదు కానీ క్రైస్తవత్వపు కరుణను పొందేందుకు అన్యులను ఆహ్వానించడమే, దాని ప్రత్యక్ష వ్యతిరేకత యూదుల . . . అపనమ్మకం. గుంపులు, అన్యులు, యూదులను పరిగణలోకి తీసుకుంటుంది, మరి నిర్దిష్టమైన వ్యక్తులను నేరుగా పరిగణలోకి తీసుకోదు.”—ఇటాలిక్కులు మావి.
ఇటీవల కాలంలో, ఈ అధ్యాయాలను (9-11) గూర్చి ది జెరుషలేమ్ బైబిల్ ఇలా పేర్కొంటూ అదే నిర్ణయాన్ని అందించింది: “ఈ అధ్యాయాల్లోని విషయం ఒక వ్యక్తి మహిమనొందేందుకుగానీ లేక విశ్వాసం పొందేందుకుగానీ విధినిర్ణయించవల్సిన సమస్యకాదు, అయితే పాత నిబంధనలోని వ్యాఖ్యానాలవల్ల రేగిన సమస్యయైన మానవ రక్షణ చరిత్రలో ఇశ్రాయేలీయుల పాత్రే.”
రోమీయులు 8వ అధ్యాయంలోని చివరి వచనాలు అదే సందర్భానికి చెందినవి. ఆ విధంగా, క్రీస్తుతో పరిపాలించేందుకు మానవజాతి నుండి దేవుడు ఒక తరగతిని, లేక గుంపును ముందుగా చూశాడని అలాగే వారు పొందవల్సిన అర్హతలను—మరి దానికి, ఏర్పర్చుకొనబడే ప్రత్యేకమైన వ్యక్తులను ఎంతో కాలం ముందుగా నిర్ణయించలేదు ఎందుకంటే అలా చేయడం ఆయన ప్రేమ మరియు న్యాయానికి విరుద్ధంగా ఉంటుంది.