మీ భవిష్యత్తు ముందుగా లిఖించబడిందా?
హిందువైనా, ముస్లిమ్ అయినా క్రైస్తవుడైనా, యూదుడైనా, లేక మరొక మతానికి చెందిన వ్యక్తైనా సరే, అంటే ప్రజలు ఏ మతానికి చెందినవారైనా సరే, విషాదకరమైన సంఘటనల్ని అనుభవిస్తారు, వాటి మూలంగా దుఃఖితులౌతారు.
ఉదాహరణకు, సైబీరియాలోని ఇర్కుటస్క్ నగరంలో 1997 డిసెంబరు 6న భయంకరమైన విషాదకర సంఘటనొకటి జరిగింది. పెద్ద ఎన్-124 ట్రాన్స్‌పోర్ట్ విమానం గాలిలోకి ఎగరగానే దాని రెండు ఇంజన్లు పాడయ్యాయి. టాంకు నిండా ఇంధనం నింపబడివున్న ఆ విమానం, జనావాసిత కాంప్లెక్సుపై కుప్పకూలిపోయింది. ఆ కాంప్లెక్సులోని అనేక అపార్ట్‌మెంట్లను అగ్ని జ్వాలలు చుట్టిముట్టి, అమాయకులైన పసిపిల్లలతోపాటూ అందులో నివసిస్తున్న నిస్సహాయులైన అనేకమంది ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్నాయి, క్షతగాత్రుల్ని చేశాయి.
సైబీరియాలో ఆ దుర్ఘటన జరిగిన ప్రాంతంలో, మతపరంగా భిన్నాభిప్రాయాల్ని కల్గివున్న ప్రజలు నివసిస్తున్నారు. కొంతమంది క్రైస్తవ మతమందు విశ్వాసాన్ని వ్యక్తపర్చినా, వాళ్లు ఆ విషాదకర సంఘటనను విధి వైపరీత్యపు ఫలితంగానే జరిగిందని తలస్తుండవచ్చు. వాళ్లూ, మరితరులూ ‘అది ఖుదా (దేవుని) అభీష్టమనీ, చనిపోయిన వాళ్లు ఈ విధంగా కాకపోతే మరో విధంగానైనా చనిపోయి ఉండేవాళ్లనీ—అది వాళ్ల నసీబ్ అనీ (తలరాతనీ)’ భావించవచ్చు.
పైకి చెప్పినా చెప్పకపోయినా, అలా ఆలోచించడమనేది భూవ్యాప్తంగా ఉన్న అనేక మతాల్లో సామాన్యంగా కన్పించే ఒక సిద్ధాంతాన్ని అంటే కర్మ సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తుంది. మనం పుట్టినప్పటినుండీ పోయేంతవరకూ మన భవిష్యత్తు ఏదో విధంగా ముందుగానే లిఖించబడిందని అనేకమంది విశ్వసిస్తారు.
కర్మ నందలి నమ్మకం వివిధ రూపాల్ని సంతరించుకొని, వాటన్నింటిని ఇమడ్చగలిగే నిర్వచనాన్నొకదాన్ని నిర్వచించడాన్ని అసాధ్యం చేస్తోంది. కర్మ అనేది జరుగుతున్న ప్రతీదీ, ప్రతీ చర్యా, ప్రతీ సంఘటనా, అది మంచిదైనా, చెడ్డదైనా సరే అనివార్యమనే అభిప్రాయాన్ని ప్రధానంగా తెలియజేస్తుంది; అది మానవ అదుపాజ్ఞల్లోలేని ఓ ఉన్నత శక్తి ద్వారా ముందుగానే నిర్ధారించబడినందున అలా జరగాల్సి ఉంటుందని నిర్ణయించబడుతుంది. అలాంటి సిద్ధాంతం జ్యోతిష శాస్త్రంలోనూ, హిందువుల, బౌద్ధమతస్థుల కర్మ సిద్ధాంతంలోనూ, అలాగే క్రైస్తవమత సామ్రాజ్యపు పూర్వ నిర్ధారణ సిద్ధాంతంలోనూ కనబడుతుంది. వెనుకటికి ప్రాచీన బబులోనులో, లిఖితపూర్వక పలకల ద్వారా విధినీ, భవితవ్యాన్నీ దేవతలు అదుపులో ఉంచుతారని మనుష్యులు నమ్మేవారు. ఈ “పూర్వ నిర్ధారిత పలకలను” అదుపులో ఉంచే ఏ దేవతయైనా సరే, మనుష్యుల, రాజ్యాల భవితవ్యాన్నీ, చివరికి దేవతల భవితవ్యాన్ని కూడా నిర్ణయించగలుగుతాడు.
మానవులు జన్మించక ముందే ఖుదా ఆదేశానుసారంగా, మానవుల ఆయు ప్రమాణంతోపాటూ, వాళ్లెలా పుడతారనే విషయాన్నీ అంటే పురుషులుగా లేక స్త్రీలుగా, ధనవంతులుగా లేక దరిద్రులుగా, దుఃఖభరితులుగా లేక సంతోషవంతులుగా పుడతారా అనే విషయాన్నీ వాళ్లకు జరగబోయే వాటినన్నింటినీ ఖుదా నిర్ణయిస్తాడని అనేకమంది విశ్వాసులు నమ్ముతారు. ఒక సంఘటన జరగడానికి ముందే అది ఖుదా మనస్సులో ఉంటుందనీ లేకపోతే, ఒక గ్రంథంలో రాయబడి ఉంటుందనీ చెప్పబడుతుంది. ఆ విధంగా ఏదైనా విపత్తుకు గురైనప్పుడు “మెక్‌తూబ్” అంటే మన నసీబ్ అలా (తలరాతలా) రాయబడి ఉందని ఒక విశ్వాసి అనడం అసాధారణమైన విషయమేమీ కాదు! ఖుదాకి ముందుగానే అన్నీ తెలుసు గనుక విధేయత చూపించేదెవరు, అవిధేయత చూపించేదెవరు అనే విషయాన్ని కూడా ఆయనే నిర్ధారించి ఉంటాడని తర్కించబడింది. అందుకే, ఒకడు జన్మించడానికి మునుపే అతడు ఫిర్దౌస్‌లో (పరదైసులో) నిత్య ఆశీర్వాదాల్ని పొందుతాడా లేక అతడు నిత్యనాశనాన్ని పొందుతాడా అనే విషయాన్ని ఖుదా అప్పటికే నిర్ణయించి ఉంటాడని అనేకమంది విశ్వాసులు నమ్ముతారు.
కొన్ని క్రైస్తవమత సామ్రాజ్య చర్చీల్లో బోధించే పూర్వ నిర్ధారణ సిద్ధాంతంవలె ఇదీ ఉన్నట్టు మీకు అన్పించవచ్చు. 16వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ సంస్కరణకర్తయైన జాన్ కాల్విన్, పూర్వ నిర్ధారణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ప్రతిపాదకుల్లో అగ్రగణ్యుడు. ఆయన పూర్వ నిర్ధారణను “దేవుని నిత్య ఆదేశము”గా నిర్వచించాడు, “దాని ప్రకారంగా ఆయన [దేవుడు] ప్రతి మనుష్యునికీ తానేం చేయాలని అనుకున్నాడో దాన్ని నిర్ణయిస్తాడు. అందరూ ఒకే విధమైన స్థితిలో సృష్టించబడరు, కానీ కొంతమందికి నిత్య జీవమూ, మరితరులకు నిత్య నాశనమూ ముందుగానే నిర్ణయించబడుతుంది.” కాల్విన్ ఇలా కూడా బల్లగుద్ది చెప్పాడు: “మొదటి మానవుడు (పాపంలో) పడిపోతాడనే విషయాన్ని ముందుగా చూడడమేగాక అతనిలో అతని రాబోయే తరాలన్నింటి నాశనాన్ని చూశాడు; కానీ తన సొంత అభిలాష చొప్పున అలా జరిగేలా చేశాడు.”
అయితే, పూర్వ నిర్ధారణను బోధించే లేక కర్మ సిద్ధాంతాన్ని బోధించే మతాలకు చెందిన సభ్యుల్లో ప్రతి ఒక్కరూ దీన్ని వ్యక్తిగతంగా విశ్వసించరు. మత గ్రంథాలు మానవుని స్వేచ్ఛాచిత్తాన్ని ప్రస్తావించాయని సరియైన విధంగానే కొందరు ఎత్తి చూపిస్తారు. వాస్తవానికి, మానవుని చర్యలపై గొప్ప వాదోపవాదాలు అంటే అవి మానవుని స్వేచ్ఛా ఎంపిక మూలంగా కలిగిన పర్యవసానాలైనా లేక ఖుదా (దేవుని) పూర్వ నిర్ధారణ చేసినందువల్ల కలిగిన పర్యవసానాలైనా సరే, అతని చర్యలపై గొప్ప వాదోపవాదాలు ఉన్నాయి. ఉదాహరణకు, న్యాయవంతుడైన ఖుదా (దేవుడు) మానవుని చర్యలకు మానవుణ్ణే బాధ్యునిగానూ, లెక్క చెప్పవలసినవానిగానూ చేస్తున్నాడు గనుక మానవునికి ఎంపికచేసుకొని, ప్రవర్తించే స్వేచ్ఛ ఉండి ఉండాలని కొందరు వాదిస్తారు. మానవుని చర్యల్ని ఖుదాయే (దేవుడే) సృష్టించినా, మానవుడు ఏదో విధంగా వాటిని “అలవర్చుకొని,” వాటికి బాధ్యత వహించాల్సి ఉంటుందని మరితరులు చెబుతారు. అయినా, సామాన్య మాటల్లో చెప్పాలంటే, మన జీవితాల్లో జరిగే ప్రతీదీ అది చిన్నదైనా పెద్దదైనా సరే ఖుదా (దేవుని) ఆదేశానుసారంగానే జరుగుతుందని అనేకమంది విశ్వసిస్తారు.
మీరేమని విశ్వసిస్తారు? మీ భవిష్యత్తు ఏమైవుందో దేవుడు ముందుగానే నిర్ణయించాడా? మానవులు నిజంగా స్వేచ్ఛాచిత్తాన్ని అంటే తమ భవిష్యత్తును గూర్చిన వాస్తవిక ఎంపికల్ని చేసుకునే సామర్థ్యాన్ని కల్గివున్నారా? మన చర్యలు ఎంతమేరకు మన భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి? దీని తర్వాతి శీర్షిక ఈ ప్రశ్నలకు జవాబును ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది.
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
SEL/Sipa Press