కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 4/15 పేజీలు 9-14
  • విశ్వాసం, మీ భవిష్యత్తు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విశ్వాసం, మీ భవిష్యత్తు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • గతం ఎలా ఉంది?
  • మానవుల దగ్గర పరిష్కారాలు లేవు
  • యెహోవాసాక్షులు భవిష్యత్తును ఎలా దృష్టిస్తారు
  • మానవ పరిపాలన భవితవ్యం
  • యెహోవా వాగ్దానాలయందు విశ్వాసం ఉంచండి
  • యెహోవా తన సంకల్పం నెరవేరుస్తాడని నమ్మండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • దేవుని సంకల్పం త్వరలో నిజమౌతుంది
    జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?
  • దేవుని రాజ్యం—భూమిపై ఒక క్రొత్త పరిపాలన
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • యెహోవా విశ్వాసులకు చేసిన తన వాగ్దానాల్ని నెరవేరుస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 4/15 పేజీలు 9-14

విశ్వాసం, మీ భవిష్యత్తు

“విశ్వాసమనునది నిరీక్షింపబడువాటి యొక్క నిజ స్వరూపము.”—హెబ్రీయులు 11:1.

1. అనేకమంది ప్రజలు ఎటువంటి భవిష్యత్తును కోరుకుంటారు?

మీకు భవిష్యత్తుపై ఆసక్తి ఉందా? అనేక మందికి ఉంది. శాంతికరమైన భవిష్యత్తు కొరకూ, భయంనుండి స్వాతంత్ర్యం కొరకూ, ప్రతిఫలదాయకమైన, ఆహ్లాదకరమైన పనికొరకూ సంతృప్తికరమైన జీవన పరిస్థితుల కొరకూ, మంచి ఆరోగ్యం కొరకూ, దీర్ఘాయుష్షు కొరకూ వాళ్ళు ఆశిస్తారు. చరిత్రలోని ప్రతి తరమూ వాటిని కోరుకుందనడంలో సందేహమేమీలేదు. కష్టాలతో నిండిపోయిన ఈ ప్రపంచంలో నేడు అలాంటి పరిస్థితులు మునుపెన్నటికన్నా ఎంతగానో కోరదగినవై ఉన్నాయి.

2. రాజనీతిజ్ఞుడొకరు భవిష్యత్తును గూర్చి వ్యక్తపర్చిన ఒక అభిప్రాయం ఎలావుంది?

2 మానవజాతి 21వ శతాబ్దంవైపు పయనిస్తుండగా, భవిష్యత్తు ఎలా ఉంటుందో తీర్మానించడానికి ఏదైనా మార్గముందా? 200 కంటే ఎక్కువ సంవత్సరాల క్రిందట అమెరికా రాజనీతిజ్ఞుడు ప్యాట్రిక్‌ హెన్రీ ఒక మార్గాన్ని గూర్చి వ్యక్తపర్చాడు. ఆయనిలా అన్నాడు: “భవిష్యత్తును గూర్చి చెప్పడానికి గతాన్ని విశ్లేషించడం తప్ప మరో మార్గం నాకు తెలియదు.” ఈ అభిప్రాయం ప్రకారంగా, మానవ కుటుంబపు భవిష్యత్తు, గతంలో మానవుడు చేసిన దాన్నిబట్టి చాలావరకు తెలుస్తుంది. ఆ అభిప్రాయంతో అనేకమంది ఏకీభవిస్తారు.

గతం ఎలా ఉంది?

3. భవిష్యత్తు కొరకైన ఉత్తరాపేక్షలను గూర్చి చరిత్ర ఏమని సూచిస్తోంది?

3 భవిష్యత్తు గతానికి ప్రతిబింబంగా ఉండనైయుంటే, అది ప్రోత్సాహకరంగా ఉన్నట్లు మీరనుకుంటారా? యుగయుగాలుగా మునుపటి తరాల భవిష్యత్తు మెరుగుపడిందా? మెరుగుపడలేదు. వేలాది సంవత్సరాలుగా ప్రజలకు నిరీక్షణలు ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో వస్తుదాయక అభివృద్ధి ఉన్నా, చరిత్రయంతా అణచివేతతోనూ, నేరంతోనూ, హింసలతోనూ, యుద్ధాలతోనూ, పేదరికంతోనూ నిండిపోయింది. ఈ ప్రపంచం ఒకదాని తర్వాత మరొక విపత్తును, ప్రధానంగా అసంతృప్తికరమైన మానవ పరిపాలన తెచ్చిపెట్టిన విపత్తులను చవిచూసింది. బైబిలు ఖచ్చితంగా ఇలా చెబుతోంది: ‘ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనెను.’—ప్రసంగి 8:9.

4, 5. (ఎ) ఇరవయ్యవ శతాబ్దపు తొలి సంవత్సరాల్లో ప్రజలు ఎందుకు ఆశాతప్తులుగా ఉండేవారు? (బి) భవిష్యత్తు కొరకైన వాళ్ల ఆశలు ఏమయ్యాయి?

4 వాస్తవమేమంటే మానవజాతి చెడు చరిత్ర పదే పదే పునరావృతం అవుతోంది, అదీ అంతకంతకూ విస్తృతమైన పరిధిలో ముప్పును వాటిల్లచేసే రీతిలో పునరావృతమవుతోంది. ఈ 20వ శతాబ్దం దానికి రుజువుగా ఉంది. మానవజాతి గత పొరపాట్లనుండి గుణపాఠాలు నేర్చుకుని వాటిని విడిచిపెట్టిందా? సాపేక్షకంగా చూస్తే దీర్ఘకాలంగా సమాధానం ఉన్నందునా, పారిశ్రామికంగా, విజ్ఞానశాస్త్రరీత్యా, విద్యా సంబంధంగా పురోభివృద్ధులు సాధించినందునా ఈ శతాబ్దపు ఆరంభంలో, ఓ శ్రేష్ఠమైన భవిష్యత్తుపై అనేకమంది తమ నమ్మకాన్ని ఉంచారు. “ప్రజలు నాగరికులై పోయారు” గనుక యుద్ధానికిక అసలు తావులేదని విశ్వసించేవారని 1900ల తొలి భాగంలో విశ్వ విద్యాలయ ప్రొఫెసరొకరు చెప్పారు. బ్రిటీషు మాజీ ప్రధాని ఒకరు వెనుకటికి ఆ కాలంలో ప్రజలు కలిగియున్న అభిప్రాయాన్ని గూర్చి ఇలా చెప్పారు: “అంతకంతకు అన్నీ మెరుగుపడతాయి. నేను పుట్టిన ప్రపంచమదే.” అయితే ఆయనింకా ఇలా చెప్పారు: “అకస్మాత్తుగా, అనుకోకుండా 1914లో ఓ ఉదయాన అంతా పటాపంచలైపోయింది.”

5 ఆ కాలంలో ఓ శ్రేష్ఠమైన భవిష్యత్తుపై గట్టి నమ్మకాన్ని ఉంచినా, నూతన శతాబ్దం ప్రారంభమైందో లేదో ఇంతకు ముందు ఎన్నటికన్నా భయంకరమైన మానవ నిర్మిత విపత్తునందు అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో లోకం కూరుకుపోయింది. ఆ యుద్ధం ఎలాంటిదన్న దానికొక ఉదాహరణగా, 1916లో ఒక పోరాటంలో బ్రిటీష్‌ సైన్యాలు ఫ్రాన్స్‌లోని సొమ్మే నదికి దరిదాపుల్లో ఉన్న జర్మన్‌ లైన్లపై దాడిచేసినప్పుడు జరిగినదాన్ని పరిశీలించండి. కొన్ని గంటల్లోనే బ్రిటన్‌ 20,000 మందిని కోల్పోయింది, జర్మన్‌ తరుపునున్న అనేకమంది చంపబడ్డారు. నాలుగు సంవత్సరాలపాటు సాగిన ఆ మారణకాండలో దాదాపు ఒక కోటి మంది సైనికులూ, అనేకమంది పౌరులూ ప్రాణాల్ని కోల్పోయారు. ఒక్కసారిగా అనేకమంది మరణించడంతో ఫ్రాన్స్‌ జనాభా కొంత కాలంపాటు క్షీణించిపోయింది. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయి, 1930లలో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. మొదటి ప్రపంచ యుద్ధం మొదలైన రోజున, లోకానికి పిచ్చెక్కిందని కొందరు చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు!

6. మొదటి ప్రపంచ యుద్ధానంతరం జీవనపరిస్థితులు మెరుగుపడ్డాయా?

6 అప్పటి తరం ఆశించిన భవిష్యత్తు ఇదేనా? ఎంతమాత్రం కాదు. వారి ఆశలు పటాపంచలైపోయాయి; లేక ఆ యుద్ధం ఎలాంటి మేలునూ తీసుకురాలేదు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత 21 సంవత్సరాలకే అంటే 1939లో మరింత భయంకరమైన మానవ నిర్మితమగు విపత్తు అంటే రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. అది 5 కోట్లమంది స్త్రీపురుషుల, పిల్లల ప్రాణాలను బలిగొంది. విపరీతమైన బాంబుల దాడులు అనేక నగరాలను తుత్తునియలు చేశాయి. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఒక పోరాటంలో కొద్ది గంటల్లోనే కొన్ని వేలమంది సైనికులు హతమార్చబడగా, రెండవ ప్రపంచ యుద్ధంలో కేవలం రెండు అణుబాంబులే లక్షకన్నా ఎక్కువమందిని క్షణాల్లో పొట్టనబెట్టుకున్నాయి. నాజీ నిర్బంధ శిబిరాల్లో లక్షలాది మంది ఓ పద్ధతి ప్రకారం హత్యచేయబడ్డం దానికంటే మరెంతో ఘోరమైనదని అనేకమంది పరిగణించారు.

7. ఈ శతాబ్దపు వాస్తవిక స్థితి ఏమిటి?

7 మనం ఆయా దేశాల మధ్య జరిగిన యుద్ధాల్నీ, అంతర్యుద్ధాల్నీ, తమ సొంత పౌరుల్నే ప్రభుత్వాలు హతమార్చిన సంఘటనల్నీ చేర్చినట్లయిన, ఈ శతాబ్దంలో చంపబడిన వారి సంఖ్య దాదాపు 20 కోట్లు ఉంటుందని అనేక సమాచార మూలాలు తెలియజేశాయి. ఒక సమాచార మూలమైతే ఈ సంఖ్య 36 కోట్లని తెలియజేస్తోంది. కలిగిన బాధ, ప్రవహించిన కన్నీరు, తీవ్రవ్యధ, చితికిన బ్రతుకుల మహా భయానకమైన స్థితిని గూర్చి ఒక్కసారి ఊహించండి! అంతేగాక, దారిద్ర్యసంబంధిత కారణాల మూలంగా అనుదినమూ సగటున దాదాపు 40,000 మంది ప్రజలు చనిపోతున్నారు, వారిలో అధిక సంఖ్యాకులు పిల్లలే. గర్భవిచ్ఛిత్తుల మూలంగా అనుదినమూ దానికి మూడు రెట్లు చంపబడుతున్నారు. అలాగే, దాదాపు 100 కోట్లమంది ప్రజలు రోజులో నామమాత్రపు పనులను చేసుకోవడానికి కావల్సినంత శక్తినిచ్చే ఆహారాన్ని సహితం సంపాదించుకోలేనంత దారిద్ర్యావస్థలో ఉన్నారు. ఇవన్నీ, మనం ఈ దుష్ట విధానపు “అంత్యదినములలో” జీవిస్తున్నామని బైబిలు ప్రవచించినదానికి రుజువులై ఉన్నాయి.—2 తిమోతి 3:1-5, 13; మత్తయి 24:3-12; లూకా 21:10, 11; ప్రకటన 6:3-8.

మానవుల దగ్గర పరిష్కారాలు లేవు

8. మానవ నాయకులు ప్రపంచ పరిస్థితుల్ని ఎందుకు పరిష్కరించలేరు?

8 ఈ 20వ శతాబ్దం ముగుస్తుండగా, దీని అనుభవాన్ని గత శతాబ్దాల అనుభవంతో జతచేయవచ్చు. ఇప్పుడా చరిత్రంతా మనకేమి తెలియజేస్తోంది? మానవ నాయకులు ప్రపంచపు ప్రధాన సమస్యలను ఏమాత్రం పరిష్కరించలేకపోయారనీ, వాటిని ఇప్పుడూ పరిష్కరించడంలేదనీ, ఆలాగే భవిష్యత్తులోనూ పరిష్కరించలేరనీ ఇది తెలియజేస్తుంది. వాళ్లకెంత చిత్తశుద్ధి ఉన్నా మనం కోరుకునే భవిష్యత్తును అందించడమనేది వారికి అసాధ్యం. అధికారంలో ఉన్న కొందరికి అలాంటి చిత్తశుద్ధే లేదు; వాళ్లు ఇతరుల క్షేమం కొరకు గాక తమ అహాన్ని తృప్తి పర్చుకోవడం కొరకూ, వస్తుదాయక ఆదాయం కొరకూ పదవుల్నీ, అధికారాన్నీ పొందడానికి ప్రయత్నిస్తారు.

9. మానవ సమస్యలకు జవాబులను విజ్ఞానశాస్త్రం కల్గివుందనడంలో సంశయాన్ని వ్యక్తపర్చడానికి కారణమేమిటి?

9 విజ్ఞాన శాస్త్రమేమైనా జవాబులు కలిగిఉందా? గతాన్ని గనుక మనం పరిశీలిస్తే దాని దగ్గరా జవాబులు లేవని మనకు తెలుస్తుంది. వినాశనకరమగు భయంకరమైన రసాయనిక ఆయుధాల్నీ, జీవశాస్త్రసంబంధ ఆయుధాల్నీ, ఇతర రకాలైన ఆయుధాల్నీ వృద్ధి చేయడంలో గవర్నమెంటు శాస్త్రజ్ఞులు భారీ మొత్తాల్లో ధనాన్నీ, తమ సమయాన్నీ, ప్రయత్నాల్నీ వెచ్చించారు. వాటి కోసం అస్సలు వెచ్చించలేని స్థితిలో ఉన్న పేదదేశాలతోపాటూ దేశాలన్నీ ఆయుధాల కొరకు సమిష్టిగా ఏటా 70 వేల కోట్ల డాలర్లను ఖర్చు చేస్తున్నాయి! అంతేగాక, భూమీ, నీరూ, గాలీ, ఆహార పదార్థాలూ కలుషితమవ్వడానికి దోహదపడిన రసాయన పదార్థాల విషయంలో ‘విజ్ఞాన శాస్త్ర పురోభివృద్ధి’ పాక్షికంగా బాధ్యతవహించాలి.

10. విద్యా సంస్థలు కూడా శ్రేష్ఠమైన భవిష్యత్తుకు భరోసాను ఎందుకు ఇవ్వలేవు?

10 ఉన్నత నైతిక ప్రమాణాల్నీ, ఇతరుల ఎడల శ్రద్ధనూ, పొరుగువారి ఎడల ప్రేమనూ బోధించడం ద్వారా ప్రపంచ విద్యా సంస్థలు ఒక శ్రేష్ఠమైన భవిష్యత్తును నిర్మించుకొనేందుకు సహాయపడతాయని మనమాశించగలమా? ఆశించలేం. బదులుగా, అవి కెరీర్లపైనా, డబ్బు సంపాదనపైనా దృష్టి నిల్పుతున్నాయి. అవి సహకార స్ఫూర్తినిగాక విపరీతమైన పోటీ స్వభావాన్ని పెంపొందిస్తున్నాయి; పాఠశాలలు నైతిక విలువల్ని బోధించడంలేదు. బదులుగా, వాటిలో అనేకం లైంగిక స్వేచ్ఛను అనుమతిస్తున్నాయి. ఫలితంగా, టీనేజ్‌ గర్భవతుల సంఖ్యా, సుఖవ్యాధులూ విపరీతంగా పెరిగిపోయాయి.

11. వాణిజ్య సంస్థల రికార్డు భవిష్యత్తుని సందేహించేలా ఎలా చేసింది?

11 ప్రపంచపు భారీ వాణిజ్య వ్యవస్థలు కేవలం లాభార్జనే ధ్యేయంగాగాక నిజమైన ప్రయోజనమిచ్చే ఉత్పత్తులను ఉత్పత్తిచేయడం ద్వారా మన గ్రహం ఎడల మంచి శ్రద్ధను తీసుకోవడానికీ, ఇతరుల ఎడల ప్రేమను చూపించడానికీ ఆకస్మికంగా పురికొల్పబడతాయా? అలా కన్పించడంలేదు. ప్రజల మనస్సులను, ప్రత్యేకంగా యువత మనస్సులను పాడు చేయటానికి దోహదపడే హింసతోనూ, అనైతికతతోనూ నిండివున్న టెలివిజన్‌ కార్యక్రమాలను నిర్మించడాన్ని వాళ్లు ఆపివేస్తారా? ఈ విషయంలో గతం ఏ మాత్రం ప్రోత్సాహకరంగా లేదు, ఎందుకంటే టీవీ కార్యక్రమాల్లో అధికభాగం లైంగిక అవినీతికీ, విచ్చలివిడితనానికీ, బలాత్కారానికీ నెలవైన మురికికూపంగా తయారయ్యింది.

12. రోగం విషయంలోనూ, మరణం విషయంలోనూ మానవుని స్థితి ఏమైవుంది?

12 దీనికితోడు, వైద్యులు ఎంత నిజాయితీగా ప్రయత్నించినప్పటికీ వాళ్లు రోగాన్నీ మరణాన్నీ జయించలేరు. ఉదాహరణకు, మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, స్పానిష్‌ ఫ్లూ వ్యాపించడాన్ని వాళ్లు ఆపలేకపోయారు; ప్రపంచవ్యాప్తంగా, ఆ వ్యాధి 2 కోట్లమందిని కబళించింది. నేడు హృద్రోగమూ, క్యాన్సర్‌ మరితర ప్రాణాంతక రుగ్మతలూ విస్తృతంగా పెరిగిపోయాయి. మహామారి అయిన ఎయిడ్స్‌ను కూడా ఆధునిక వైద్య ప్రపంచం జయించలేకపోయింది. దానికి భిన్నంగా, ఎయిడ్స్‌ వైరస్‌ మునుపటి అంచనాలకన్నా రెట్టింపు వేగంతో వ్యాపిస్తోందని నవంబరు 1997లో ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నివేదిక నిర్ధారించింది. ఎయిడ్స్‌ వైరస్‌ మూలంగా లక్షలాదిమంది ఇప్పటికే మరణించారు. ఇటీవల ఒక సంవత్సరంలో మరొక 30 లక్షలమందికి ఎయిడ్స్‌ వైరస్‌ సోకింది.

యెహోవాసాక్షులు భవిష్యత్తును ఎలా దృష్టిస్తారు

13, 14. (ఎ) యెహోవాసాక్షులు భవిష్యత్తును ఎలా దృష్టిస్తారు? (బి) మానవులు ఒక శ్రేష్ఠమైన భవిష్యత్తును ఎందుకు తీసుకురాలేరు?

13 మానవజాతికి ఉజ్జ్వలమైన, అత్యంత శ్రేష్ఠమైన భవిష్యత్తు ఉందని యెహోవాసాక్షులు నమ్ముతున్నారు! అయితే ఆ శ్రేష్ఠమైన భవిష్యత్తు మానవ ప్రయత్నాల ద్వారా వస్తుందని వాళ్లు ఆశించరు. బదులుగా, వాళ్లు సృష్టికర్తయైన యెహోవా దేవునివైపు చూస్తారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో దేవునికి తెలుసు, మరి అది అత్యద్భుతంగా ఉంటుంది! అలాంటి భవిష్యత్తును మానవులు తీసుకురాలేరని కూడ ఆయనకు తెలుసు. ఆయనే వాళ్లను సృష్టించాడు గనుక వాళ్ల పరిమితుల్ని గురించి మరెవరికన్నా ఎక్కువగా ఆయకే తెలుసు. దైవిక నడిపింపులేకుండా విజయవంతంగా పరిపాలించుకొనే సామర్థ్యంతో మానవుల్ని తాను సృజించలేదని ఆయన తన వాక్యంలో మనకు స్పష్టంగా చెబుతున్నాడు. మానవుడు తనపై తానే ఆధారపడి పరిపాలించుకోవడాన్ని దేవుడు దీర్ఘకాలం అనుమతించడం, మానవుని అసమర్థతను ఏమాత్రం సందేహం లేకుండా చూపించింది. ఒక రచయిత ఇలా గుర్తించాడు: “మానవ మేధస్సు వీలైనన్ని మిశ్రిత సర్వాధిపత్యాలను ప్రయత్నించి చూసింది, అవన్నీ నిష్ప్రయోజనమే.”

14 యిర్మీయా 10:23లో మనం ప్రేరేపిత ప్రవక్త మాటలను ఇలా చదువుతాం: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.” ఆలాగే, కీర్తన 146:3 ఇలా చెబుతోంది: “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి.” నిజానికి, మనం అపరిపూర్ణులముగా జన్మించాం గనుక, మనపై మనమే నమ్మకముంచుకోకూడదని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తోంది. యిర్మీయా 17:9 ఇలా చెబుతోంది: “హృదయము అన్నిటికంటె మోసకరమైనది.” అందుకే, సామెతలు 28:26 ఇలా ప్రకటిస్తోంది: “తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును.”

15. మనల్ని నడిపించే జ్ఞానాన్ని మనమెక్కడ కనుగొనగలం?

15 ఈ జ్ఞానాన్ని మనమెక్కడ కనుగొనగలం? “యెహోవాయందు భయభక్తులు గలిగియుండుటయే జ్ఞానమునకు మూలం. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము.” (సామెతలు 9:10) ఈ భయానక కాలాల్లో మనల్ని నడిపించగల జ్ఞానాన్ని కేవలం సృష్టికర్తయగు యెహోవా మాత్రమే కల్గి ఉన్నాడు. మన నడిపింపు నిమిత్తం ఆయన ప్రేరేపించి రాయించిన పరిశుద్ధ లేఖనాల ద్వారా తన జ్ఞానాన్ని మనం పొందే సౌలభ్యాన్ని ఆయన కలుగజేశాడు.—సామెతలు 2:1-9; 3:1-6; 2 తిమోతి 3:16, 17.

మానవ పరిపాలన భవితవ్యం

16. భవిష్యత్తును ఎవరు తీర్మానిస్తారు?

16 మరి భవిష్యత్తును గూర్చి దేవుని వాక్యం మనకు ఏం చెబుతోంది? భవిష్యత్తు గతంలో మానవులు చేసిన వాటిని నిశ్చయంగా ప్రతిబింబించదని అది మనకు తెలియజేస్తోంది. కాబట్టి ప్యాట్రిక్‌ హెన్రీ అభిప్రాయం తప్పైవుంది. ఈ భూమి భవిష్యత్తూ, దానిమీద గల ప్రజల భవిష్యత్తూ మానవుల ద్వారాగాక యెహోవా దేవుని ద్వారానే తీర్మానించబడుతుంది. ఏ మానవుని చిత్తమో లేక ఈ లోక జనాంగముల చిత్తమో గాక ఆయన చిత్తమే ఈ భూమిపై నెరవేరుతుంది. “నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవాయొక్క తీర్మానమే స్థిరము.”—సామెతలు 19:21.

17, 18. మన కాలం విషయంలో దేవుని చిత్తమేమైవుంది?

17 మన కాలం విషయంలో దేవుని చిత్తమేమైవుంది? ఈ ప్రస్తుత హింసాయుత, అనైతిక లోక విధానాన్ని అంతమొందించాలని ఆయన సంకల్పించాడు. శతాబ్దాల మానవ దుష్ట పరిపాలన స్థానే త్వరలో దేవుడేర్పరచే పరిపాలన వస్తుంది. దానియేలు 2:44లో ఉన్న ప్రవచనం ఇలా చెబుతోంది: “ఆ [నేడున్న] రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు [పరలోకములో] ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” ఆ రాజ్యం మానవులు ఎన్నడూ తొలగించలేనిదాన్ని అంటే అపవాదియైన సాతాను దుష్ట ప్రభావాన్ని తొలగిస్తుంది కూడా. వాడి లోక పరిపాలనాధిపత్యం ఇక ఎన్నటికీ లేకుండా నాశనమౌతుంది.—రోమీయులు 16:20; 2 కొరింథీయులు 4:4; 1 యోహాను 5:19.

18 ఆ పరలోక ప్రభుత్వం అన్ని రకాల మానవ పరిపాలనలను ఉనికిలో లేకుండా బొత్తిగా నాశనం చేస్తుందన్న విషయాన్ని గమనించండి. భూపరిపాలన ప్రజల చేతుల్లోకి మారదు. పరలోకంలో దేవుని రాజ్యంగా తయారయ్యే ప్రతినిధులు మానవుల మేలు నిమిత్తం భూమిపై వ్యవహారాలన్నింటినీ నియంత్రిస్తారు. (ప్రకటన 5:10; 20:4-6) దేవుని రాజ్య నిర్దేశాలకు భూమిపై ఉన్న నమ్మకమైన మానవులు సహకరిస్తారు. “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని యేసు చెప్పినప్పుడు, ప్రార్థించమని మనకు నేర్పించినది ఆ పరిపాలన కొరకే.—మత్తయి 6:10.

19, 20. (ఎ) రాజ్య ఏర్పాటును బైబిలు ఏ విధంగా వర్ణిస్తోంది? (బి) దాని పరిపాలన మానవజాతికేమి తెస్తుంది?

19 యెహోవాసాక్షులు తమ విశ్వాసాన్ని దేవుని రాజ్యంపై ఉంచుతారు. “మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును” అని అపొస్తలుడైన పేతురు రాసిన “క్రొత్త ఆకాశము[లు]” అదే. (2 పేతురు 3:13) ఆ “క్రొత్త భూమి” దేవుని రాజ్యమనే క్రొత్త ఆకాశములచే పరిపాలించబడే నూతన మానవ సమాజమే. “నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. . . . [దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని” రాసిన అపొస్తలుడైన యోహానుకి దర్శనంలో దేవుడు బయల్పర్చిన ఏర్పాటు అదే.—ప్రకటన 21:1, 4.

20 క్రొత్త భూమి నీతియుక్తమైనదై ఉంటుందనే విషయాన్ని గమనించండి. దేవుడు జోక్యం చేసుకోవడం ద్వారా అంటే అర్మగిద్దోను యుద్ధం ద్వారా సమస్త అవినీతీ తొలగించబడుతుంది. (ప్రకటన 16:14, 16) సామెతలు 2:21, 22లోని ప్రవచనం దాన్నిలా చెబుతోంది: “యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు.” కీర్తన 37:9 ఇలా వాగ్దానం చేస్తోంది: “కీడుచేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టు కొనువారు దేశమును స్వతంత్రించుకొందురు.” అలాంటి నూతన లోకంలో జీవించాలని మీరనుకోరా?

యెహోవా వాగ్దానాలయందు విశ్వాసం ఉంచండి

21. యెహోవా వాగ్దానాలయందు మనం విశ్వాసాన్ని ఎందుకు ఉంచగలం?

21 యెహోవా వాగ్దానాలందు మనం విశ్వాసాన్ని ఉంచగలమా? తన ప్రవక్తయైన యెషయా ద్వారా ఆయన చెబుతున్న దాన్ని వినండి: “చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి. దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చు కొనెదననియు చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను.” 11వ వచనపు తర్వాతి భాగం ఇలా చెబుతోంది: “నేను చెప్పి యున్నాను దాని నెరవేర్చెదను, ఉద్దేశించియున్నాను సఫలపరచెదను.” (యెషయా 46:9-11) అవును, ఆ వాగ్దానాలు ఇప్పటికే నెరవేరాయన్నంత నిశ్చయతతో యెహోవాయందూ, ఆయన వాగ్దానాలయందూ మనం విశ్వాసాన్ని ఉంచగలం. బైబిలు దాన్నీ విధంగా వ్యక్తపరుస్తోంది: “విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది.”—హెబ్రీయులు 11:1.

22. యెహోవా తన వాగ్దానాల్ని నెరవేరుస్తాడని మనమెందుకు నిశ్చయంగా ఉండవచ్చు?

22 దేవుడు తన వాగ్దానాల్ని నెరవేరుస్తాడని వినయంగల ప్రజలకు తెలుసు గనుక వాళ్లు అలాంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. ఉదాహరణకు, కీర్తన 37:29లో మనమిలా చదువుతాం: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. వారు దానిలో నిత్యము నివసించెదరు.” మనం దీనిని నమ్మగలమా? అవును, ఎందుకంటే హెబ్రీయులు 6:18 ఇలా చెబుతోంది: ‘దేవుడు . . . అబద్ధమాడజాలడు.’ వినయంగల వారికి ఇవ్వగల్గేందుకు ఈ భూమి దేవుని సొంతమా? ప్రకటన 4:11 ఇలా ప్రకటిస్తోంది: “నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను.” అందుకే, కీర్తన 24:1 ఇలా అంటోంది: “భూమియు దాని సంపూర్ణతయు, . . . లోకము దాని నివాసులును యెహోవావే.” యెహోవాయే ఈ భూమిని సృష్టించాడు. ఆయనే దాని యాజమాని, తనయందు విశ్వాసాన్నుంచే వారికి ఆయన దాన్ని ఇస్తాడు. ఈ విషయంలో మన నమ్మకాన్ని పటిష్ఠపర్చుకోవడానికి సహాయపడేందుకు, యెహోవా గతకాలాల్లోనూ అలాగే ప్రస్తుత కాలంలోనూ తన ప్రజలకు తాను చేసిన వాగ్దానాల్ని ఎలా నెరవేర్చాడో, భవిష్యత్తులో కూడా ఆయన అలానే చేస్తాడని మనమెందుకు సంపూర్ణమైన నమ్మకాన్ని కల్గివుండవచ్చో దీని తర్వాతి శీర్షిక చూపిస్తుంది.

పునఃసమీక్ష కొరకైన అంశాలు

◻ చరిత్రయందంతటా ప్రజల ఆశలన్నీ ఏమైపోయాయి?

◻ శ్రేష్ఠమైన భవిష్యత్తు కోసం మానవులవైపు మనమెందుకు చూడకూడదు?

◻ భవిష్యత్తు విషయంలో దేవుని చిత్తమేమైవుంది?

◻ దేవుడు తన వాగ్దానాల్ని నెరవేరుస్తాడని మనమెందుకు నిశ్చయంగా ఉన్నాం?

[10వ పేజీలోని చిత్రం]

బైబిలు ఖచ్చితంగా ఇలా చెబుతోంది: “మనుష్యులు . . . సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లే(దు).”—యిర్మీయా 10:23

[క్రెడిట్‌ లైను]

బాంబు: U.S. National Archives photo; ఆకలితో అలమటిస్తున్న పిల్లలు: WHO/OXFAM; శరణార్థులు: UN PHOTO 186763/J. Isaac; ముస్సోలిని, హిట్లర్‌: U.S. National Archives photo

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి