బైబిలు మనకు చేరిన విధానం—భాగం రెండు
భగ భగ మండుతున్న మంటల్లో ఇంధనం వేసిన ప్రతిసారీ అగ్ని జ్వాలలు ఉవ్వెత్తున ఆకాశానికి ఎగిసాయి. అయితే ఇవి మామూలు మంటలు కావు. ప్రీస్టులూ, ప్రీలేట్‌లూ చూస్తూ ఉండగా ఈ ప్రళయాగ్నిలో బైబిళ్లను దహనం చేస్తూ ఉన్నారు. కానీ, బైబిళ్లను నాశనం చేయడానికిగాను వాటిని కొనడం ద్వారా లండన్ బిషప్పు తనకు తెలియకుండానే అనువాదకుడైన విలియం టిండేల్‌కు మరిన్ని సంపుటిలను వెలువరించడంలో ఆర్థిక సహాయం చేశాడు!
పోరాటంలోని ఇరు పక్షాలవారూ ఆ విధంగా దృఢ తీర్మానాలకు రావడానికి ఏవి నడిపించాయి? మునుపటి ఒక సంచికలో, మనం మధ్య యుగాల తరువాతి కాలంవరకు ఉన్న బైబిలు ప్రచురణా చరిత్రను పరిశీలించాము. ఇప్పుడు మనం దేవుని వాక్యం యొక్క సందేశమూ ప్రామాణికత్వమూ సమాజంపైన గొప్ప ప్రభావం చూపిన క్రొత్త శకం ఆరంభానికి చేరుకున్నాము.
ఒక అగ్రగామి ఉదయించాడు
ఆక్స్‌ఫర్డ్‌లో గౌరవనీయుడైన విద్వాంసుడు జాన్ విక్లిఫ్, ‘దేవుని చట్టం’పై అంటే బైబిలుపై ఆధారపడి, కాథోలిక్ చర్చి యొక్క బైబిలు విరుద్ధ అభ్యాసాలకు వ్యతిరేకంగా శక్తివంతంగా ప్రచారమూ, రచనలూ చేశాడు. ఆయన వినడానికి సుముఖంగా ఉన్న వారందరికీ ఇంగ్లీషులో బైబిలు సందేశాన్ని వినిపించడానికి లోలర్డ్‌లు అని పిలువబడే తన విద్యార్థులను ఇంగ్లాండు గ్రామసీమల్లోకి పంపించాడు. ఆయన 1384లో చనిపోవడానికి ముందు బైబిలును లాటిన్ నుండి తన కాలంనాటి ఇంగ్లీషు భాషలోనికి అనువదించే బృహత్కార్యాన్ని ఆరంభించాడు.
విక్లిఫ్‌ను నిరసించడానికి చర్చి చాలా కారణాలనే కనుగొంది. మొదటిగా, పాదిరీలు హద్దులు మీరడాన్నీ, వారి అనైతిక ప్రవర్తననూ ఆయన ఖండించాడు. దానికితోడు, విక్లిఫ్ అభిమానుల్లో చాలామంది తమ సాయుధ తిరుగుబాటులను సమర్థించుకోవడానికి ఆయన బోధలను దుర్వినియోగం చేశారు. హింసాయుత తిరుగుబాటులను విక్లిఫ్ ఎన్నడూ ప్రచారం చేయకపోయినప్పటికీ పాదిరీలు చివరికి ఆయన మరణించిన తర్వాత కూడా ఆ విషయమై ఆయన్ను నిందించారు.
పోప్ జాన్ XXIIIకు 1412లో తాను వ్రాసిన ఉత్తరంలో ఆర్చ్‌బిషప్ అరండల్ “నీచుడూ, పీడించేవాడూ అయిన ఆ జాన్ విక్లిఫ్, అసహ్యకరమైన ఒక జ్ఞాపకమైన ఆ మనిషి, ఆ సర్ప సంతానం, క్రీస్తు విరోధికి సాక్షాత్తూ పూర్వసూచకుడూ, క్రీస్తు విరోధి సంతానం” అని సూచించాడు. తన అధిక్షేపణను ముగిస్తూ అరండల్ ఇలా వ్రాశాడు: “తన దురుద్దేశాల చిట్టాను పెంచుకుంటూ పోతూ, ఆయన లేఖనాల క్రొత్త అనువాదాన్ని మాతృభాషలో రూపొందించాడు.” నిజానికి, చర్చి నాయకులను ఎక్కువగా రెచ్చగొట్టిందేమిటంటే ప్రజలకు తమ స్వంత భాషలో బైబిలును అందివ్వాలని విక్లిఫ్ అనుకోవడమే.
ఏదేమైనా, కొంతమంది ప్రముఖులకు తమ భాషల్లో లేఖనాలు అందుబాటులో ఉన్నాయి. వారిలో ఒకరు బొహేమియాకు చెందిన ఆన్, ఆమె 1382లో ఇంగ్లాండుకు భావి రాజైన రిచర్డ్ IIను పెళ్లి చేసుకుంది. ఆమె విక్లిఫ్ యొక్క సువార్తల ఇంగ్లీషు అనువాదాలను సంపాదించి, వాటిని ఎప్పుడూ చదువుతూ ఉండేది. ఆమె రాణి అయినప్పుడు, ఆమెకున్న అనుకూల దృక్పథం బైబిలు సంకల్పాన్ని అభివృద్ధిచేయడానికి సహాయపడింది—మరి ఇది కేవలం ఇంగ్లాండుకు మాత్రమే పరిమితం కాలేదు. బొహేమియాలోని ప్రాగ్ యూనివర్శిటీ విద్యార్థులను ఆక్స్‌ఫర్డ్‌కు రమ్మని ఆన్ ప్రోత్సహించింది. వారక్కడ విక్లిఫ్ కృతులను ఔత్సాహికంగా అధ్యయనం చేసి వాటిలో కొన్నింటిని ప్రాగ్‌కు తమవెంట తీసుకెళ్లారు. ప్రాగ్ యూనివర్శిటీలో విక్లిఫ్ బోధలు పొందిన ప్రజాదరణ అటుతర్వాత యాన్ హస్‌కు మద్దతుగా పనిచేసింది, ఆయన అక్కడే అధ్యయనంచేసి చివరికి అక్కడే బోధించాడు. హస్ పాత స్లావోనిక్ అనువాదం నుండి చదవడానికి అనువుగా ఉండే చెక్ అనువాదాన్ని చేశాడు. ఆయన ప్రయత్నాలు బొహేమియాలోనూ పొరుగున ఉన్న తదితర ప్రాంతాల్లోనూ బైబిలును సామాన్యరీతిలో ఉపయోగించడాన్ని పురికొల్పాయి.
చర్చి పగతీర్చుకోవడం
సంక్లిష్టంగావుండే సాంప్రదాయిక వివరణలైన “టీకా”ల కన్నా, మూల ప్రేరేపిత లేఖనాలైన “శుద్ధమైన గ్రంథపాఠానికి” ఏమీ జతచేర్చకుండా ఉన్నవాటికే ఎక్కువ అధికారం ఉంది అని బోధించినందుకు కూడా విక్లిఫ్‌పట్లా, హస్‌పట్లా పాదిరీలు మహా కోపంతో ఉన్నారు. ఈ ప్రచారకులు కోరుకున్నది కలుషితం కాని దేవుని వాక్యపు సందేశం సామాన్యుడికి కూడా చేరాలనే.
భద్రతను ఇస్తామని అబద్ధ వాగ్దానం చేసి, 1414లో హస్ తన దృక్పథాలను సమర్థించుకోవడానికి జర్మనీలోని కాన్‌స్టాన్స్‌వద్ద కాథోలిక్ కౌన్సిల్ ముందుకు వచ్చేలా చేసి ఆయన్ను మోసం చేశారు. ఈ కౌన్సిల్‌లో 2,933 మంది ప్రీస్టులూ, బిషప్‌లూ, కార్డినల్‌లూ ఉన్నారు. తన బోధలు తప్పని లేఖనాధారంగా రుజువుచేస్తే తన పూర్వాభిప్రాయాల్ని ఉపసంహరించుకుంటానని హస్ ఒప్పుకున్నాడు. కౌన్సిల్‌కైతే అంత వివాదాంశంగా ఉన్న విషయం అది కాదు. 1415లో ఆయన గట్టిగా ప్రార్థిస్తుండగా ఆయన్ను కొయ్యకి కట్టి కాల్చివేయడానికి, తమ అధికారాన్ని ఆయన సవాలు చేయడమే వారికి తగిన కారణంగా సరిపోయింది.
తమ అధిక్షేపణకు చివరి సంకేతంగానూ అలాగే అవమానానికి గురిచెయ్యడానికిగానూ అదే కౌన్సిలు జాన్ విక్లిఫ్ సమాధిని త్రవ్వించి ఆయన ఎముకలను బయటికి తీసి వాటిని ఇంగ్లాండులో కాల్చివేయాలని ఆజ్ఞాపించింది. ఈ నిర్దేశనం ఎంత అసంగతంగా ఉందంటే ఆ ఆజ్ఞ 1428లో పోప్ డిమాండు చేసేంతవరకూ అమలుకాలేదు. అయితే, ఎప్పటిలానే, ఇటువంటి భీకరమైన వ్యతిరేకత కూడా సత్యాన్ని ప్రేమించే ఇతరుల ఆసక్తిని నీరుకార్చలేదు. దానికి బదులుగా, దేవుని వాక్యాన్ని ప్రచురపర్చాలన్న వారి దృఢ నిశ్చయాన్ని అది మరింత బలపర్చింది.
ముద్రణ ప్రభావం
హస్ మరణించిన కేవలం 35 సంవత్సరాలకే అంటే 1450కల్లా యోహాన్నెస్ గుటెన్‌బర్గ్ జర్మనీలో మూవబుల్ టైప్ ప్రింటింగు సహాయంతో ముద్రణని ప్రారంభించాడు. ఆయన తలపెట్టిన మొట్టమొదటి గొప్ప కార్యం—లాటిన్ వల్గేట్ సంపుటిని ఒకదాన్ని దాదాపు 1455కల్లా పూర్తి చేయడమే. 1495కల్లా బైబిల్లో కొంత భాగంగానీ పూర్తిగా గానీ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జర్మనీ, ఇటాలియన్, ఫ్రెంచి, చెక్, డచ్, హెబ్రీ, కాటలన్, గ్రీకు, స్పానిష్, స్లావోనిక్, పోర్చుగీస్, సెర్బియన్ భాషల్లో ముద్రించబడ్డాయి.
డచ్ విద్వాంసుడైన డేసీడెరియస్ ఎరాస్‌మస్ 1516లో మొట్టమొదటి పూర్తి గ్రీకు గ్రంథపాఠాన్ని ఉత్పత్తి చేశాడు. లేఖనాలు “ప్రజలందరి భాషల్లోకీ అనువదించబడాలని” ఎరాస్‌మస్ కోరుకున్నాడు. అయితే, ఆయన తనకున్న అత్యధిక ప్రజాదరణను పణంగా పెట్టి తనకై తాను అనువాదం చేయడానికి సంకోచించాడు. అయినప్పటికీ, మరింత ధైర్యవంతులైన ఇతరులు ముందుకు సాగిపోయారు. వారిలో అత్యంత ఉత్కృష్టమైన వ్యక్తి విలియం టిండేల్.
విలియం టిండేల్, ఇంగ్లీషు బైబిలు
టిండేల్ ఆక్స్‌ఫర్డ్‌లో విద్యను సముపార్జించి, దాదాపు 1521కల్లా సర్ జాన్ వాల్ష్ ఇంట్లో ఆయన పిల్లలకు చదువు చెప్పేందుకు చేరాడు. ఆహారం సమృద్ధిగా ఉండే వాల్ష్ భోజనపు బల్ల చుట్టూ యౌవనుడైన టిండేల్ స్థానిక పాదిరీలతో మౌఖిక యుద్ధాలు చేసేవాడు. బైబిలును తెరిచి వారికి లేఖనాలను చూపించడం ద్వారా టిండేల్ సూటిగా వారి అభిప్రాయాల్ని సవాలు చేసేవాడు. కొంతకాలానికి, టిండేల్ చెబుతున్నదానిపై వాల్ష్ దంపతులకు నమ్మకం ఏర్పడిపోయింది, దానితో పాదిరీలను ఆహ్వానించడం తక్కువైపోయి, వస్తే గనుక నీరసంగా స్వాగతించడం మొదలైంది. సహజంగానే, ఇది పాదిరీలు టిండేల్‌కూ ఆయన నమ్మకాలకూ వ్యతిరేకంగా చేదైన భావాలు కలిగివుండేలా చేసింది.
ఒకసారి ఒక వివాదం రేగినప్పుడు, టిండేల్ మత వ్యతిరేకుల్లో ఒకాయన ఇలా దృఢంగా చెప్పాడు: “పోప్ నియమాల కన్నా దేవుని నియమాలు లేకపోవడమే శ్రేష్ఠం.” అందుకు టిండేల్ ఇలా ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు ఆయన దృఢచిత్తాన్ని ఊహించుకోండి: “నేను పోప్‌నూ, ఆయన నియమాలనన్నింటినీ ధిక్కరిస్తున్నాను. ఒకవేళ దేవుడు నన్ను బ్రతకనిస్తే, ఎన్నో సంవత్సరాలు గడవక ముందే, నాగలిపట్టి భూమి దున్నే బాలుడు లేఖనాల గురించి మీకన్నా ఎక్కువగా తెలుసుకొనేలా చేస్తాను.” టిండేల్ తీర్మానం స్పష్టమైంది. ఆయన తర్వాత ఇలా వ్రాశాడు: “లేఖనాల సారాంశాన్నీ, క్రమాన్నీ, అర్థాన్నీ సామాన్యులు గ్రహించేందుకు లేఖనాలను స్పష్టమైన రీతిలో వారి మాతృభాషలో వారి కళ్ల ముందుంచితేనేగాని వారిని సత్యంలో సుస్థిరులను చేయడం అసంభవమని నేను అనుభవపూర్వకంగా గ్రహించాను.”
ఆ కాలంలో, ఇంగ్లీషులో ఏ బైబిలూ ఇంకా ముద్రించబడలేదు. అందుకని టిండేల్ 1523లో, ఒక అనువాద ప్రణాళికపై బిషప్ టన్‌స్టాల్ ఆమోదముద్రను పొందడానికి లండన్‌కు వెళ్లాడు. తిరస్కరింపబడిన టిండేల్ తన సంకల్పం నిమిత్తం ఇంగ్లాండును విడిచిపెట్టాడు, మళ్లీ తిరిగిరానేలేదు. జర్మనీలోని కొలోన్‌లో ఆయన మొట్టమొదటి ప్రింటరుపై దాడి జరిగింది, టిండేల్ బైండు చేయని అమూల్యమైన కొన్ని కాగితాలతో కొద్దిలో తప్పించుకున్నాడు. అయితే, జర్మనీలోని వర్మ్‌స్‌లో తన ఇంగ్లీషులోని “క్రొత్త నిబంధన” యొక్క 3,000 కాపీల ముద్రణ పూర్తయ్యింది. ఇవి ఇంగ్లాండుకు పంపించబడి, అక్కడ 1526 సంవత్సరం తొలిభాగంలో పంపిణీ చేయబడ్డం మొదలైంది. ఈ బైబిళ్లలో కొన్నింటిని బిషప్ టన్‌స్టాల్ కొని, వాటిని కాల్చివేశాడు, తద్వారా తనకు తెలియకుండానే టిండేల్ తన పనిని కొనసాగించడంలో సహాయం చేసినట్లైంది!
పరిశోధన స్పష్టమైన అవగాహనకు నడిపిస్తుంది
టిండేల్ స్పష్టంగానే తన పనిలో ఆనందాన్ని అనుభవించాడు. ద కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ద బైబిల్ చెబుతున్నట్లుగా, “లేఖనాలు ఆయన్ను సంతోషభరితున్ని చేశాయి, ఆయన ఆనందాన్ని ప్రకటిస్తున్న ఆయన లయలో చురుకైనదీ, ఉల్లాసవంతమైనదీ ఏదో ఉంది.” టిండేల్ లక్ష్యం ఏమంటే సామాన్యుడికి సాధ్యమైనంతలో కచ్చితమైన, సుళువైన భాషలో లేఖనాలను అందుబాటులో ఉంచాలి. శతాబ్దాల తరబడి చర్చి సిద్ధాంతాల ముసుగులో కూరుకుపోయిన బైబిలు పదాల అర్థాలను ఆయన చేసే అధ్యయనాలు ఆయనకు తెలుపుతూ ఉన్నాయి. మరణమంటే భయపడకుండా, సర్ ధామస్ మోర్ అనే శక్తివంతమైన శత్రువుల కలంపోటులంటే జడవకుండా, టిండేల్ తన అనువాదంలో తాను కనుగొన్న విషయాల్ని పొందుపర్చాడు.
లాటిన్‌పైన కాకుండా ఎరాస్‌మస్ గ్రంథపాఠం యొక్క ఆదిమ గ్రీకుపై ఆధారపడి పనిచేస్తూ టిండేల్, అగాపే అనే గ్రీకు పదం అర్థాన్ని మరింత పూర్తిగా వ్యక్తం చేయడానికి “దాతృత్వము” అనే పదానికి బదులుగా “ప్రేమ” అనే పదాన్ని ఎన్నుకున్నాడు. ఆయన “చర్చి” స్థానంలో “సంఘం” అనీ, “పరితాపం చెందు” స్థానంలో “పశ్చత్తాపపడు” అనీ, “ప్రీస్టులు” స్థానంలో “పెద్దలు” అనీ ఉపయోగించాడు. (1 కొరింథీయులు 13:1-3; కొలొస్సయులు 4:15, 16; లూకా 13:3, 5; 1 తిమోతి 5:17, టిండేల్) ఈ దిద్దుబాట్లు చర్చి అధికారానికీ, చేసిన పాపాలను ప్రీస్టుల ముందు ఒప్పుకోవడమూ వంటి సాంప్రదాయిక మత ఆచారాలకూ వినాశకరంగా పరిణమించాయి.
అదేవిధంగా పాపవిమోచనా స్థలమూ, మరణం తర్వాత స్పృహలో ఉండడం బైబిలు బోధలకు విరుద్ధమని వాటిని తిరస్కరిస్తూ, టిండేల్ “పునరుత్థానం” అనే పదానికి అంటిపెట్టుకుని ఉన్నాడు. మృతులను గూర్చి ఆయన మోర్‌కు ఇలా వ్రాశాడు: “వారు పరలోకంలోనూ, నరకంలోనూ, పాపవిమోచనా స్థలంలోనూ ఉన్నారని [నీవు] చెప్పడం ద్వారా, పునరుత్థానాన్ని రుజువు చేస్తూ క్రీస్తూ పౌలూ చేసిన వాదనలను నీవు నాశనం చేస్తున్నావు.” ఈ విషయంలో, టిండేల్ మత్తయి 22:30-32, 1 కొరింథీయులు 15:12-19 లేఖనాలను సూచించాడు. ఆయన యుక్తమైన రీతిలోనే మృతులు భవిష్యత్తులోని పునరుత్థానం వరకు స్పృహ లేకుండా ఉంటారని నమ్మాడు. (కీర్తన 146:4; ప్రసంగి 9:5; యోహాను 11:11, 24, 25) అంటే దీనర్థం మరియకూ, “సెయింట్”లకూ ప్రార్థన చేయడమనే ఏర్పాటు యావత్తు నిష్ప్రయోజనకరమైనది, ఎందుకంటే వారు స్పృహలేని స్థితిలో ఉన్నారు గనుక అటు విననూలేరు లేక ఇటు మధ్యవర్తిత్వం నెరపనూ లేరు.
టిండేల్ హెబ్రీ లేఖనాలను అనువదించడం
1530లో, టిండేల్ హెబ్రీ లేఖనాల్లోని మొదటి ఐదు పుస్తకాలైన పెంటటక్ సంపుటి ఒకదాన్ని ఉత్పత్తి చేశాడు. ఆ విధంగా ఆయన హెబ్రీ నుండి బైబిలును తిన్నగా ఇంగ్లీషులోనికి అనువదించిన వారిలో మొదటివాడయ్యాడు. యెహోవా పేరును ఉపయోగించిన ఇంగ్లీషు అనువాదకులలో కూడా టిండేల్ మొట్టమొదటి వాడు. డేవిడ్ డాన్యల్ అనే లండన్ విద్వాంసుడు ఇలా వ్రాస్తున్నాడు: “దేవుని పేరు క్రొత్తగా ప్రకటితమవ్వడం, టిండేల్ చదువరులను నిశ్చయంగానే గాఢంగా ప్రభావితం చేసివుంటుంది.”
స్పష్టతను సాధించడం కోసం చేసిన ప్రయత్నంలో టిండేల్ ఒక్క హెబ్రీ పదాన్ని అనువదించడానికి వేర్వేరు ఇంగ్లీషు పదాల్ని ఉపయోగించాడు. అయితే, ఆయన హెబ్రీ సరళిని దగ్గరగా అనుకరించాడు. తత్ఫలితంగా, హెబ్రీ భాషలోవున్న బిగి కాపాడబడింది. ఆయన తానుగా ఇలా చెప్పాడు: “హెబ్రీ భాషా లక్షణాలు లాటిన్ భాషతోకన్నా ఇంగ్లీషు భాషతోనే వెయ్యి రెట్లు ఎక్కువగా సరిపడతాయి. మాట్లాడే పద్ధతి ఈ రెంటిలో దాదాపు ఒకటే; అందుకని అనేకానేక సందర్భాల్లో కేవలం హెబ్రీ పదానికి తత్సమానమైన ఇంగ్లీషు పదాన్ని పెడితే సరిపోతుంది.”
ప్రాథమికంగా అక్షరార్థమైన ఈ అనువాద శైలితో టిండేల్ అనువాదం హెబ్రీ వ్యక్తీకరణలతో రుచికరంగా తయారయ్యింది. మొదటిసారి చదివినప్పుడు వాటిలో కొన్ని చాలా వింతగా ఉన్నట్లు తోచివుండవచ్చు. అయినా, బైబిలు చివరికి ఎంత సుపరిచితమయ్యిందంటే ఈ వ్యక్తీకరణల్లో కొన్ని ఇప్పుడు ఇంగ్లీషు భాషలో భాగమైపోయాయి. కొన్ని ఉదాహరణలు, “a man after his own heart” (1 సమూయేలు 13:14లో ఉన్నట్లుగా), “passover,” “scapegoat.” అంతకన్నా ఎక్కువగా, ఇంగ్లీషు బైబిలును చదివేవారికి ఆ విధంగా హెబ్రీ ఆలోచనా విధానంతో పరిచయం ఏర్పడింది, ఇది వారికి ప్రేరేపిత లేఖనాల్లో మరింత చక్కని అంతర్దృష్టిని ఇచ్చింది.
నిషేధంలో బైబిలూ, టిండేలూ
దేవుని వాక్యాన్ని తన స్వంత భాషలో చదవగల్గే సాధ్యత చాలా అద్భుతమైన విషయం. ఇంగ్లీషు ప్రజానీకం తమ దేశంలోనికి స్మగుల్ చేయబడిన బైబిళ్లనన్నింటినీ ఖరీదు చేయడం ద్వారా తమ ప్రతిస్పందనను చూపించారు, అవి బట్టల బేళ్లూ, మరితర సరుకుల బేళ్లలో దొంగతనంగా తీసుకురాబడేవి. ఈలోగా, బైబిలే చిట్టచివరి ప్రమాణం అని పరిగణించడం ప్రారంభమైతే మాత్రం పాదిరీలు తమ స్థానాన్ని తాము కోల్పోవడం నిశ్చయమని అనుకున్నారు. ఆ కారణాన, అనువాదకునికీ, ఆయనకు మద్దతునిచ్చేవారికీ పరిస్థితి జీవన్మరణ సమస్యగా తయారయ్యింది.
చర్చీ, ప్రభుత్వమూ నిర్విరామంగా వెంటాడుతుండడంతో, టిండేల్ బెల్జియంలోని ఆంట్‌వెర్ప్‌లో రహస్యంగా తన పనిని కొనసాగించాడు. అయినప్పటికీ, ఆయన వారంలో రెండు రోజుల్ని ఇతర ఇంగ్లీషు శరణార్థులకూ, బీదలకూ, మరితర రోగులకూ పరిచర్య చేయడానికి అంకితం చేశాడు—దీన్ని ఆయన కాలక్షేపం అని పిల్చాడు. ఆయన తన నిధుల్లో చాలా మొత్తాన్ని ఆ విధంగానే ఖర్చుచేశాడు. హెబ్రీ లేఖనాల్లో రెండవ భాగాన్ని అనువదించక ముందే, స్నేహితుని ముసుగు ధరించిన ఒక ఇంగ్లీషువాడు డబ్బు కొరకు టిండేల్‌ను మోసం చేశాడు. 1536లో బెల్జియంలోని విల్‌వూర్డ్‌లో ఆయనకు మరణశిక్ష అమలు చేయబడింది, ఆయన భావోద్రేకంతో పలికిన చివరి పలుకులు ఇవే, “ప్రభువా! ఇంగ్లాండు రాజు కళ్లు తెరువు.”
1538కల్లా, కింగ్ హెన్రీ VIII తన స్వంత కారణాల నిమిత్తం ఇంగ్లాండులోని ప్రతి చర్చిలో బైబిళ్లను ఉంచాలని ఆజ్ఞాపించాడు. ఆ బైబిలు టిండేల్‌దే అని చెప్పనప్పటికీ చర్చీల్లో ఉంచడానికి ఎంపిక చేసుకున్నది ప్రాథమికంగా ఆయన అనువాదం చేసినదే. ఈ విధంగా టిండేల్ కృతి ఎంత ప్రసిద్ధికెక్కిందంటే, ప్రజలు దానిని ఎంతగా ప్రేమించనారంభించారంటే, ఇంగ్లీషులో “అటుతర్వాత వచ్చిన చాలా అనువాదాల ప్రాథమిక లక్షణాలను అది నిర్ధారించింది.” (ద కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ద బైబిల్) టిండేల్ అనువాదంలోని దాదాపు 90 శాతం తిన్నగా 1611లోని కింగ్ జేమ్స్ వెర్షన్‌లోనికి తీసుకోబడింది.
బైబిలు స్వేచ్ఛగా లభ్యమవ్వడం ఇంగ్లాండులో ఒక గొప్ప మార్పుకు దారితీసింది. చర్చీల్లో పెట్టబడిన బైబిళ్ల చుట్టూ జరిగే చర్చలు ఎంత చైతన్యవంతంగా ఉండేవంటే అవి కొన్నిసార్లు చర్చి కార్యక్రమాలకు అంతరాయం కల్గించేవి! “వృద్ధులు దేవుని వాక్యాన్ని తమకై తాము చదవగల్గేలా చదవడం నేర్చుకున్నారు, మరి పిల్లలు వినడానికి తమ పెద్దలతో కలిసారు.” (ఇంగ్లీషు బైబిలు యొక్క సంక్షిప్త చరిత్ర, [ఆంగ్లం]) యూరప్‌లోని ఇతర దేశాల్లోనూ, భాషల్లోనూ, బైబిలు పంపిణీ నాటకీయమైన పెరుగుదలను అనుభవించినది కూడా ఈ కాలంలోనే. కానీ ఇంగ్లాండులోని బైబిలు ఉద్యమం ప్రపంచవ్యాప్త ప్రభావాన్ని చూపాల్సివుంది. ఇదెలా సంభవించింది? అంతేగాక, అటుతర్వాత జరిగిన మరితర ఆవిష్కరణలూ, పరిశోధనలూ మనం నేడు ఉపయోగించే బైబిళ్లను ఎలా ప్రభావితం చేశాయి? మనం మన వృత్తాంతాన్ని ఈ పరంపరలోని తర్వాతి శీర్షికలో సమాప్తం చేద్దాము.
[26వ పేజీలోని చిత్రం]
1526లోని టిండేల్ యొక్క “క్రొత్త నిబంధన”—మనకు తెల్సినంత వరకు అగ్ని జ్వాలల్ని తప్పించుకున్న ఒకే ఒక్క పూర్తి ప్రతి
[క్రెడిట్ లైను]
© The British Library Board
[26, 27వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
బైబిలు మన చేతికి వచ్చిన విధానంలోని కీలక తేదీలు
సామాన్య శకము
విక్లిఫ్ బైబిలు ప్రారంభమైంది (1384కి ముందు)
1400
హస్ మరణశిక్ష అమలు 1415
గుటెన్‌బర్గ్—ముద్రితమైన మొట్టమొదటి బైబిలు దాదాపు 1455
1500
తొలుత ముద్రితమైన అన్యభాషా బైబిళ్లు
ఎరాస్‌మస్ గ్రీకు గ్రంథపాఠం 1516
టిండేల్ యొక్క “క్రొత్త నిబంధన” 1526
టిండేల్ మరణశిక్ష అమలు 1536
చర్చీల్లో బైబిళ్లు ఉంచాలని హెన్రీ VIII ఇచ్చిన ఆజ్ఞ 1538
1600
కింగ్ జేమ్స్ వెర్షన్ 1611
[చిత్రం]
విక్లిఫ్
హస్
టిండేల్
హెన్రీ VIII