పూర్తికాల సేవలో ఆనందాన్ని కలిగి ఉండగల విధానం
మనం ఈ భక్తిహీన విధానం యొక్క అంత్య దినాల్లో జీవిస్తున్నామని బైబిలు ప్రవచనాల నెరవేర్పు స్పష్టంగా చూపుతుంది. ఈ వాస్తవాన్ని గుర్తెరిగిన వారై యెహోవా దేవుని సేవకులు ఆయన రాజ్యాన్ని గురించిన సువార్తను వ్యాప్తి చేయడంలో తాము సహేతుకంగా వెచ్చించగలిగినంత సమయాన్ని వెచ్చిస్తారు. 6,00,000 కంటే ఎక్కువమంది యెహోవాసాక్షులు తాము పూర్తికాల సేవలో భాగం వహించేందుకు వీలుగా తమ జీవితాల్లో సర్దుబాట్లు చేసుకున్నారు. వారిలో కొందరు పయినీర్లని పిలువబడే పూర్తికాల రాజ్య ప్రచారకులుగా ఉన్నారు. మరితరులు వాచ్ టవర్ సొసైటీ యొక్క ప్రధాన కార్యాలయంలో లేక దాని బ్రాంచి కార్యాలయాల్లో బేతేలు స్వచ్ఛంద సేవకులుగా ఉన్నారు. ఇంకా ఇతరులు మిషనరీలుగా ప్రయాణ పైవిచారణ కర్తలుగా ఉన్నారు.
అంత్య దినాల్లో “అపాయకరమైన కాలములు వచ్చునని” బైబిలు సూచిస్తుంది. (2 తిమోతి 3:1-5) గ్రీకు బైబిలు మూల పాఠం ఉపయోగించే పదాన్ని “భయానక నిర్ణయ కాలాలు” అని అనువదించవచ్చు. కాబట్టి, మన కాలంలో ఎవ్వరూ కూడా సమస్యలు లేని జీవితాన్ని అపేక్షించ కూడదు. కొందరు క్రైస్తవ పరిచారకులకు, సమస్యలు మరీ గంభీరమైనవిగా కనిపిస్తాయి, కాబట్టి తమనుతాము వారిలా ప్రశ్నించుకోవచ్చు, ‘నేను పూర్తికాల సేవలో కొనసాగగలనా, లేక ఆపివేయాలా?’
ఒక పయినీరుగా, బేతేలు స్వచ్ఛందసేవకునిగా, ప్రయాణ పైవిచారణ కర్తగా లేక మిషనరీగా తన పరిస్థితిని గురించి పునరాలోచించడానికి ఏ పరిస్థితులు కారణం కావచ్చు? బహుశా గంభీరమైన ఆరోగ్య సమస్య ఉండవచ్చు. బహుశ వయస్సుమళ్లిన లేక అనారోగ్యంగా ఉన్న బంధువులకు ఎడతెగని శ్రద్ధ అవసరమై ఉండవచ్చు. ఒక వివాహిత జంట కుటుంబాన్ని ప్రారంభించడం కావచ్చు. ఇలాంటి కారణాలను బట్టి మరియు లేఖనాధార బాధ్యతలను బట్టి పూర్తికాల సేవను మానుకునే వారెవరైనా, అలాంటి సర్దుబాట్లు చేసుకున్నందుకు సిగ్గుపడకూడదు.
అయితే, ఎవరైనా ఆనందం కరువైనందున పూర్తికాల సేవను ఆపేయాలని అనుకుంటే అప్పుడేమిటి? బహుశ ఒక పయినీరు తన పరిచర్యలో ఎలాంటి ప్రతిస్పందననూ చూడలేక పోవడం వలన, ఇలా అడుగవచ్చు, ‘చాలా తక్కువ మంది మాత్రమే వింటున్నప్పుడు నా స్వయంత్యాగ జీవిత విధానంలో నేనెందుకు కొనసాగాలి?’ బహుశ ఒక బేతేలు స్వచ్ఛంద సేవకుడు తన నియామకం విషయంలో సంతోషంగా లేకపోవచ్చు. లేక ఎడతెరిపి లేని అనారోగ్యం, ఒక వ్యక్తి పయినీరు సేవను అసాధ్యం చేయకపోయినప్పటికీ, తుదకు ఆ వ్యక్తి ఆనందాన్ని తీసివేయవచ్చు. అలాంటి వ్యక్తులు తమ ఆనందాన్ని ఎలా కాపాడుకొనగలరు? అనుభవంగల కొద్దిమంది పరిచారకులు ఏమి చెబుతున్నారో పరిశీలిద్దాం.
నిరాశను ఎదిరించడం
స్విడ్జర్లాండ్‌కు చెందిన ఆనీ 1950లో వాచ్ టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌కు హాజరైంది. ఆమె తనకు ఖండాంతర దేశాల్లో మిషనరీ నియామకం లభిస్తుందని ఎదురు చూసింది. యూరప్‌లోని బేతేలులో సేవ చేసేందుకు తిరిగి నియామకాన్ని పొందినప్పుడు ఆనీ నిరాశ చెందింది. అయినప్పటికీ, అనువాద విభాగంలో ఆమెకు ఇవ్వబడిన నియామకాన్ని ఆమె అంగీకరించింది, ఆమె ఆ పనిని ఇప్పటికీ చేస్తుంది. ఆమె తన నిరాశను ఎలా అధిగమించింది? “చేసేందుకు అప్పుడూ ఇప్పుడూ కూడా ఎక్కువ పని ఉంది. ఆ పనికంటే నా భావాలు మరియు ఇష్టాయిష్టాలు ప్రాముఖ్యమైనవి కావు” అని ఆనీ వివరిస్తుంది.
మనం మన నియామకాన్ని బట్టి నిరుత్సాహం చెంది ఉంటే, బహుశా మనం ఆనీ వంటి దృక్పథాన్ని వృద్ధి చేసుకోవచ్చు. మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు అత్యంత ప్రాముఖ్యమైనవి కావు. రాజ్య వర్తమానాన్ని ప్రకటించడానికి సంబంధించిన విభిన్న బాధ్యతలన్నీ కూడా చక్కగా జరుపబడాలన్నదే అత్యంత ప్రాముఖ్యమైన విషయం. “ఏ కష్టము చేసినను లాభమే కలుగును” అని సామెతలు 14:23 మనకు చెబుతుంది. మనకు ఏ నియామకం ఇవ్వబడినప్పటికీ, దాన్ని నమ్మకంగా కొనసాగించడం రాజ్య పని నెరవేర్పుకు దోహదపడుతుంది. మరి దేవుడిచ్చిన అలాంటి పనిలో గొప్ప సంతృప్తి అవును, గొప్ప ఆనందం లభించగలదు.—1 కొరింథీయులు 12:18, 27, 28 పోల్చండి.
ఇతరులతో కలగలిసిపోవడం
పూర్తికాల సేవ అంటే ప్రాంతీయ పరిచర్యలో, బేతేలులో, మిషనరీ గృహంలో లేక ప్రయాణ పైవిచారణకర్తగా ఒక సంఘం తర్వాత మరొక సంఘాన్ని దర్శిస్తున్నప్పుడు, అన్ని రకాలైన ప్రజలతో దగ్గరగా వ్యవహరించడం ఇమిడి ఉంటుంది. కాబట్టి, చాలా మేరకు ఇతరులతో కలగలిసి పోవడంపై ఆనందం ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ అంత్య దినాల విషయంలో ముందే ప్రస్తావించబడిన ‘భయానక కాలాలు’ మానవ సంబంధాలకు ఎంతో కష్టం కలిగిస్తాయి. ఎవరైనా తనను నిరాశపర్చినా, ఓ పరిచారకుడు తన ఆనందాన్ని పోగొట్టుకోకుండా ఎలా ఉండగలడు? బహుశ మనం విల్‌హెల్మ్ నుండి కొంత నేర్చుకోగలం.
విల్‌హెల్మ్ 1947లో యూరప్‌లో ఒక బేతేలు కుటుంబంలో సభ్యుడయ్యాడు. ఆ తర్వాత, ఆయన పయినీరు పనిలో మరియు ప్రయాణ పైవిచారణకర్తగా సేవ చేయడంలో కాలం గడిపాడు. “మంచివి కావని మేము భావించే సంగతులను లేక మాకు వ్యక్తిగతంగా బాధను కలిగించే సంగతులను నేనూ నా భార్యా చూసినప్పుడు, మేమెలా భావిస్తున్నామో ఆ విషయాన్ని మేము యెహోవాకు చెబుతాము మరి ఆ విషయాన్ని ఆయన చేతుల్లో వదిలేస్తాం” అని విల్‌హెల్మ్ వివరిస్తున్నాడు.—కీర్తన 37:5.
బహుశ మీతో అవమానకరంగా లేక అనాలోచితంగా మాట్లాడిన ఒక తోటి క్రైస్తవుని ప్రవర్తన మూలంగా మీరు కలత చెంది ఉండవచ్చు. మన మాటల్లో మనందరమూ అనేకసార్లు తొట్రిల్లుతామనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. (యాకోబు 3:2) కాబట్టి ‘ప్రార్థన ఆలకించువానికి’ సన్నిహితం అయ్యేందుకు ఈ పరిస్థితిని ఎందుకు ఉపయోగించుకోకూడదు? (కీర్తన 65:2) ఆ విషయాన్ని గురించి యెహోవాతో మాట్లాడండి, తర్వాత ఆ విషయాన్ని ఆయన చేతుల్లో వదిలేయండి. ఒకవేళ దేవుడు మార్పులు చేయాలని అనుకుంటే ఆయనే చేస్తాడు. మిషనరీ గృహంలో జీవించే వారు, అలాంటి పరిస్థితులవల్ల కలత చెందితే ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకోవాలి, ఎందుకంటే యెహోవా సేవలో తమ ఆనందాన్ని కాపాడుకునేందుకు ఇది వారికి సహాయం చేస్తుంది.
ఆరోగ్యం క్షీణించినప్పుడు
ఎంతో తక్కువమంది ఎప్పుడూ మంచి ఆరోగ్యంతో ఉంటారు. జీవితంలో సర్వోత్తమ దశలో ఉన్నారని చెప్పబడే వారు కూడా కృంగుదల లేక వ్యాధి చేత పీడించబడవచ్చు. అనారోగ్యం మూలంగా కొందరు పూర్తికాల సేవను ఆపివేయవలసి రావచ్చు, అయితే వారు ఆ తర్వాత రాజ్య ప్రచారకులుగా చక్కని పని సాధిస్తారు. అయితే, ఇతరులు అనారోగ్యం ఉన్నప్పటికీ పూర్తికాల సేవలో కొనసాగగలుగుతున్నారు. ఉదాహరణకు, హార్మట్ మరియు గిస్లాండ్‌లను గూర్చి ఆలోచించండి.
హార్మట్ మరియు గిస్లాండ్‌లు వివాహ దంపతులు. వారు పయినీర్లుగా, మిషనరీలుగా మరియు ప్రయాణ సేవలో 30 సంవత్సరాలు గడిపారు. వారిరువురూ కూడా తమకు కొన్నిసార్లు తీవ్రమైన భౌతిక మరియు భావోద్రేకపరమైన కలత కలిగించిన అనారోగ్యాన్ని అనుభవించారు. అయినప్పటికీ, వారు చక్కని సేవ చేశారు, మరియు కష్టాలను అనుభవిస్తున్న ఇతరులను ప్రోత్సహించగలిగారు. వారు ఏ సలహా ఇస్తున్నారు? “మీరు భవిష్యత్తునే చూడాలిగానీ గతాన్ని కాదు. మీ పరిస్థితిని చక్కగా ఉపయోగించుకోండి. యెహోవాను స్తుతించేందుకు ఒక్కో రోజు మీకు కేవలం ఒక అవకాశాన్ని మాత్రమే కలిగించవచ్చు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి, దాన్ని బట్టి ఆనందించండి.”
హన్నెలోర్ విషయాన్ని పరిశీలించండి. ఆమె తన 30 సంవత్సరాల పయినీరు సేవలో, మిషనరీ సేవలో తన భర్తతో కలిసి చేసిన ప్రయాణ సేవలో, బేతేలు సేవలో అనేకసార్లు పదే పదే అనారోగ్యం పాలయ్యింది. హన్నెలోర్ ఇలా చెబుతుంది: “మానవులు తమకు హాయిగా ఉన్నప్పుడు మాత్రమే యెహోవాను ఆరాధిస్తారని సాతాను లేవదీసిన వివాదాన్ని గురించి నేను ఆలోచిస్తాను. నేను శోధనలను సహించడం ద్వారా సాతాను అబద్ధీకుడని నిరూపించడంలో భాగం కలిగి ఉండగలను.” ఇది ఎంతో గొప్ప ప్రోత్సాహాన్ని అందించగలదు. మీరు పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు యెహోవా ఎడల యథార్థంగా ఉండటం ఆయనకు ఎంతో ప్రాముఖ్యమైన విషయం అని జ్ఞాపకం ఉంచుకోండి.—యోబు 1:8-12; సామెతలు 27:11.
మీ ఆరోగ్యానికి సంబంధించి సమతూకంగల నిర్ణయాన్ని తీసుకునేందుకు ప్రయత్నించేటప్పుడు, విధానాంతాన్ని గురించిన యేసుక్రీస్తు ప్రవచనం యొక్క రెండు అంశాలను పరిశీలించండి. యేసు ఒక స్థలం తర్వాత మరొక స్థలంలో కలిగే తెగుళ్లను గురించి ప్రవచించాడు. ఆయన ఇలా కూడా అన్నాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును.” (మత్తయి 24:3, 14; లూకా 21:11) అంత్య దినాల్లో తన అనుచరులు అనారోగ్యంతో బాధపడతారని యేసుకు తెలుసు. అయితే మంచి ఆరోగ్యంగల వారు మాత్రమే కాక అనారోగ్యాన్ని అనుభవిస్తున్న వారు కూడా ఈ ప్రకటనాపనిని చేస్తారని ఆయన గ్రహించాడు. మనం అనారోగ్యాన్ని అనుభవిస్తున్నప్పటికీ పూర్తికాల పరిచర్యలో కొనసాగితే, యెహోవా నామం ఎడల మనం చూపుతున్న ప్రేమను ఆయన మర్చిపోడు.—హెబ్రీయులు 6:10.
ప్రజల్లో ఉదాసీనత ఉన్నప్పటికీ ఆనందాన్ని కాపాడుకోవడం
రాజ్య ప్రచార పని ఎడల ప్రజలు ఎలా ప్రతిస్పందిస్తారనే విషయాన్ని బట్టి కూడా మన దృక్పథం ప్రభావితం చెందగలదు. “ఒక గృహస్థునితో సంభాషణను ప్రారంభించడం పయినీర్లకు కూడా కష్టంగా ఉంటుంది” అని ఒక అనుభవంగల పరిచారకుడు చెబుతున్నాడు. “మన ఆనందాన్ని కాపాడుకునేందుకు మనందరమూ పోరాడాలి.” అవును, ప్రజల్లోని ఉదాసీనత ప్రాంతీయ సేవలో మన ఆనందాన్ని సన్నగిల్ల జేయవచ్చు. కాబట్టి క్రమంగా ఉదాసీనతను ఎదుర్కొనే ఒక పయినీరు ఎలా తన ఆనందాన్ని కాపాడుకోగలడు? అనుభవంగల పరిచారకులు ఈ క్రింది సలహాలను ఇస్తున్నారు, ఇవి ప్రయత్నించబడి, పరీక్షించబడినవి.
ఉదాసీనత ఒక సవాలు వలె ఉండగలదు, అయితే దానర్థం ఓటమి కాదు. అయితే తీవ్రంగా వ్యాపించి ఉన్న ఉదాసీనతే మనం పూర్తికాల పరిచర్యను ఆపివేయడానికి కారణం కారాదు. మనం లేఖనాలను జాగ్రత్తగా అధ్యయనం చేసేందుకు తగినంత సమయాన్ని కేటాయించుకుంటే మనం ఉదాసీనతను ఎదుర్కొన్నప్పటికీ మనం ఆనందాన్ని కాపాడుకోగలం. లేఖనాలు మనలను ‘ప్రతి సత్కార్యమునకు సిద్ధం’ చేస్తాయి, ఆ సత్కార్యాలలో మన సువార్త వినకుండా ఉండేందుకు ప్రయత్నించే వారితో మనం మాట్లాడటం కూడా ఇమిడి ఉంది. (2 తిమోతి 3:16, 17) ప్రజలు ప్రవక్తయైన యిర్మీయా మాటలను వినేందుకు ఇష్టపడకపోయినప్పటికీ, అది ఆయనను ఆపలేదు. (యిర్మీయా 7:27) క్రైస్తవ ప్రచురణల సహాయంతో బైబిలు పఠించేటప్పుడు, మన విశ్వాసాన్ని బలపర్చి, ఉదాసీనతతో వ్యవహరించేందుకు మనకు సహాయం చేయగల విషయాలను మనం పరిశీలిస్తే మనం ఎంతో ప్రయోజనాన్ని పొందగలం.
ఉదాసీనత అనేది ఒక సవాలు అనే విషయాన్ని అంగీకరిస్తూ, మనం ఎవరికి ప్రకటిస్తున్నామో వారి ఎడల మన దృక్పథాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాము. వారు ఎందుకు భిన్నంగా ఉన్నారు? యూరప్‌లోని అనేక భాగాల్లో ఉదాసీనత వ్యాపించడానికి గల ఒక కారణం అబద్ధ మతం యొక్క నీచ చరిత్రే. తమ జీవితంలో మతానికి ఎలాంటి స్థానమూ లేదని వారు ఇప్పుడు భావిస్తున్నారు, వారు దానితో ఎలాంటి సంబంధాన్నీ కలిగి ఉండకూడదని అనుకుంటున్నారు. మనం నమ్యత కలిగివుంటూ నిరుద్యోగం, ఆరోగ్యం, నేరం, అసహనం, పర్యావరణం మరియు యుద్ధ భయం వంటి విషయాలను గురించి, అంటే ప్రజలను ప్రభావితం చేసే విషయాలను గురించి మనం చర్చించాలి.
ఒక గృహస్థునితో మనం ప్రారంభంలో మాట్లాడే మాటల్లో, ఆ ప్రాంతంలో జరిగిన సంఘటనల వంటి వాటిని మనం ప్రస్తావించవచ్చు. తన వర్తమానం ఎడల ప్రజలు ఎక్కువగా ప్రతిస్పందించని ఒక గ్రామంలో, అలాగే ప్రస్తావించేందుకు డీట్‌మార్ ప్రయత్నించాడు. ఆ గ్రామస్థుల్లో ఒకరు ముందు రోజు ఆ గ్రామంలో ఒక దుర్ఘటన జరిగిందని ప్రస్తావించాడు. ఆ తర్వాత ప్రతి ఇంటిలోనూ డీట్‌మార్ ఆ విషాదాన్ని గురించి బాధ వ్యక్తం చేశాడు. “వెంటనే ప్రజలు ప్రతిస్పందించనారంభించారు” అని ఆయన చెబుతున్నాడు. “ఆ దుర్ఘటన అందరి మనస్సుల్లోనూ ఉంది. నేను వారి జీవితాల్లో ఆసక్తిని కనపర్చినందుకు ఆ రోజు నేను ఎన్నో చక్కని చర్చలు చేయగలిగాను.”
మనం ప్రజలను ఎక్కడ కనుగొన్నప్పటికీ మనం వారికి రాజ్య సాక్ష్యాన్ని ఇవ్వ వలసిన అవసరం ఉంది. అనియత సాక్ష్యం ఫలవంతంగా ఉండవచ్చు, మరియు బైబిలు ఆధారిత ప్రచురణల్లో అందించబడిన సలహాలను ఉపయోగించడం ద్వారా మనం ఆ రంగంలో తర్ఫీదు పొందవచ్చు. గృహస్థునితో కొంతసేపు స్నేహపూర్వకంగా మాట్లాడితే లేక కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలను అందిస్తే ఎంతో ఆనందం లభించగలదు. మనం పునర్దర్శనాలను చేసి ఆసక్తిగల వ్యక్తితో బైబిలు పఠనాన్ని ప్రారంభించగలిగినట్లయితే, “బైబిలును అధ్యయనం చేయాలని ఇష్టపడుతున్న వారు ఎవరైనా మీకు తెలుసా?” అని అడగటం ద్వారా మీరు ఆ మేరకు సమాచారం పొందవచ్చు. మరొక గృహ బైబిలు పఠనాన్ని ప్రారంభించేందుకు ఇది నడిపించవచ్చు. ఏ సందర్భంలోనైనా, మనం అనుకూల దృక్పథంతో ఉండి, ఉదాసీనత మనలను నిరుత్సాహపర్చేందుకు అనుమతించకుండా ఉంటూ ప్రార్థనలో యెహోవాపై ఆధారపడదాం.
ఇతరుల నుండి ప్రోత్సాహం
జర్గన్ మరియు క్రిస్టీన్‌లు పయినీరు సేవలో మరియు ప్రయాణ సేవలో 30 సంవత్సరాలకు పైగా సేవ చేశారు. వారి నియామకంలో భాగంగా వారు ఒకసారి, ఉదాసీనంగానూ మొండివారిగానూ ఉన్న ప్రజలు నివసించే ప్రాంతంలో ప్రకటించవలసి వచ్చింది. జర్గన్ మరియు ఆయన భార్య అలాంటి ప్రోత్సాహం కొరకు ఎంతగా తపించిపోయారో! అయితే ఏదో కారణం చేత సంఘంలోని ఇతరులు వారి అవసరత ఎడల ప్రతిస్పందించ లేదు.
కాబట్టి “కొందరు పయినీర్లకు కష్ట సమయం ఉంటుందని” జర్గన్‌కు తన అనుభవం ద్వారా తెలుసు. “వారికి పెద్దలనుండి ఇతర ప్రచారకుల నుండి మరింత ప్రోత్సాహం అవసరం.” యెహోషువను ప్రోత్సహించి బలపర్చమని దేవుడు మోషేకు చెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 3:26-28) మరి క్రైస్తవులు ఒకరికొకరు ప్రోత్సాహానికి మూలంగా ఉండాలి. (రోమీయులు 1:11, 12) ప్రోత్సాహకరమైన మాటల ద్వారా మరియు వారి వెంట అప్పుడప్పుడూ పరిచర్యలో కలిసి సేవ చేయడం ద్వారా రాజ్య ప్రచారకులు పూర్తికాల సేవకులను ప్రోత్సహించగలరు.
యెహోవా యందలి ఆనందం—మన దుర్గం
పయినీరు సేవలో లేక మిషనరీ సేవలో లేక బేతేలులో సేవ చేస్తూ లేక ప్రయాణ సేవలో సంఘాలను దర్శిస్తూ తమ జీవితంలోని ఎక్కువ భాగాన్ని గడిపిన క్రైస్తవులు, అనేక సమస్యలు చాలా తక్కువ కాలం ఉండేవనీ అయితే కొన్ని మాత్రం దీర్ఘ కాలం ఉంటాయనీ కనుగొన్నారు. మరి ఎన్నడూ పరిష్కారం లభించనివని అనిపించే కొన్ని సమస్యలు కూడా మన ఆనందాన్ని దొంగిలించకూడదు. దాదాపు 45 సంవత్సరాలు విదేశీ నియామకంలో సేవ చేసిన రామన్, సమస్యలు ఎప్పుడైతే మనకు దుఃఖాన్ని కలిగిస్తాయో అప్పుడు, “మనకున్న అనేక దీవెనలను గురించి మరియు మనకంటే ఎక్కువ కష్టాలను అనుభవిస్తున్న ఇతర వేలాది మందిగురించీ మనం ఆలోచించాలని” సలహా ఇస్తున్నాడు. వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా వున్న మన తోటి విశ్వాసులు కష్టాలను అనుభవిస్తున్నారు, మరి యెహోవా మనందరి ఎడలా శ్రద్ధ వహిస్తున్నాడు.—1 పేతురు 5:6-9.
కాబట్టి, మన వ్యక్తిగత పరిస్థితులు మనం పూర్తికాల పరిచర్యలో భాగం వహించి అందులోనే కొనసాగేందుకు మనలను అనుమతిస్తుంటే, మన పరలోక తండ్రిపై ఆధారపడుతూ మనం మన ఆనందాన్ని నిలుపుకుందాము. ఆయన తన సేవకులను బలపరుస్తాడు, మరియు “యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు.”—నెహెమ్యా 8:10.
[21వ పేజీలోని చిత్రం]
“నా భావాలు మరియు ఇష్టాయిష్టాలు నా సేవకంటే ప్రాముఖ్యమైనవి కావు”
[22వ పేజీలోని చిత్రం]
“మేము ఎలా భావిస్తున్నామో యెహోవాకు చెబుతాము మరి విషయాలను ఆయనకే వదిలేస్తాము”
[23వ పేజీలోని చిత్రం]
“ప్రతి పరిస్థితిని చక్కగా ఉపయోగించుకోండి. యెహోవాను ఆరాధించేందుకు ఒక్కో రోజు మీకు కేవలం ఒక అవకాశాన్ని మాత్రమే కలిగించవచ్చు”
[23వ పేజీలోని చిత్రం]
“నేను శోధనలను సహించడం ద్వారా సాతాను అబద్ధీకుడని నిరూపించడంలో భాగం కలిగి ఉండగలను”
[24వ పేజీలోని చిత్రం]
“కొందరు పయినీర్లకు కష్ట సమయం ఉంటుంది. వారికి పెద్దలనుండి మరియు ఇతర ప్రచారకుల నుండి మరింత ప్రోత్సాహం అవసరం”
[24వ పేజీలోని చిత్రం]
“మనకున్న అనేక దీవెనలను గురించి మనం ఆలోచించాలి”