విలియమ్ టిండేల్—దూరదృష్టిగల వ్యక్తి
విలియమ్ టిండేల్ జన్మించిన స్థలం తేదీ కచ్చితంగా నిర్ధారింపబడనప్పటికీ, ఇంగ్లాండులో “వేల్స్ సరిహద్దు ప్రాంతమందు,” బహుశా గ్లూసెస్టర్‌సైరిలో జన్మించాడు. అక్టోబరు 1994లో “మనకు ఆంగ్ల బైబిల్నిచ్చిన” పురుషుని 500వ వార్షిక జన్మదినోత్సవాన్ని ఇంగ్లాండు నిర్వహించింది. ఈ గ్రంథం కొరకే టిండేల్ చంపబడ్డాడు. ఎందుకు?
విలియమ్ టిండేల్ గ్రీకు లాటిన్ల అధ్యయనంలో మేటి. పట్టుమని 21 ఏళ్లయినా లేనప్పుడు అంటే జూలై 1515లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంనందు మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని ఆయన పుచ్చుకున్నాడు. ఆయన 1521లో రోమన్ కాథోలిక్కు మత గురువుగా నియమింపబడ్డాడు. ఆ కాలంలో మార్టిన్ లూథర్ చర్యలవల్ల జర్మనీనందు కాథోలిక్కు మతం సంక్షోభంలో చిక్కుకుంది. అయినా 1534లో రాజైన హెన్రీ VIII రోముతో సంబంధాల్ని త్రెంచుకొనేవరకు ఇంగ్లాండు ఓ కాథోలిక్కు దేశంగానే ఉంది.
టిండేల్ కాలంలో వాడుక భాష ఆంగ్లమే అయినప్పటికీ, విద్యాభ్యాసమంతా లాటిన్‌లోనే జరిగేది. అది చర్చి మరియు బైబిలు భాష కూడా. ఐదవ శతాబ్దంనాటి జెరోమ్స్ లాటిన్ వల్గేట్‌ను మాత్రమే ఉపయోగించాలని 1546లో కౌన్సిల్ ఆఫ్ ట్రెన్ట్ పదే పదే తెలియజేసింది. అయితే, విద్యావంతులు మాత్రమే దానిని చదవగలిగేవారు. ఇంగ్లాండులోని ప్రజలకు ఆంగ్లంలో బైబిల్ని కల్గివుండే మరి దాన్ని చదివే స్వాతంత్ర్యం ఎందుకు ఇవ్వబడలేదు? “జెరోమ్ కూడా తన మాతృభాషలోనికి బైబిల్ని అనువాదం చేసుకోగా లేనిది మనమే ఎందుకు చేసుకోరాదు?” అనేదే టిండేలు వాదన.
విశ్వాసపుటడుగు
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం ముగిసిన తరువాత, బహుశా కేంబ్రిడ్జ్‌లో అదనపు విద్యనభ్యసిస్తుండగా, గ్లూసెస్టర్‌సైరిలో రెండు సంవత్సరాలు జాన్ వాల్స్ కుమారులకు టిండేల్ బోధించాడు. ఈ సమయంలోనే ఆంగ్లంలోనికి బైబిల్ని అనువదించాలనే తన కోరికను ఆయన పెంచుకున్నాడు మరి సమాంతర నిలువు వరుసలలో గ్రీకు లాటిన్లతోనున్న ఎరాస్మస్ క్రొత్త బైబిలు టెక్ట్స్ సహాయంతో తన అనువాద నైపుణ్యాలను పెంపొందించుకొనే అవకాశం నిస్సందేహంగా ఆయనకు దొరికింది. 1523లో టిండేల్ వాల్స్ కుటుంబాన్ని విడిచి లండన్‌కు వెళ్లాడు. ఆయన ఉద్దేశమేమంటే లండన్ బిషప్ అయిన కత్‌బెర్ట్ టన్‌స్టాల్ నుండి తన అనువాదానికి అనుమతిని పొందడమే.
టన్‌స్టాల్ ఉత్తరువు అవసరం ఎందుకంటే ఆక్స్‌ఫర్డ్ నందలి 1408వ ధర్మసభ యొక్క ఏర్పాట్లు ఆక్స్‌ఫర్డ్ శాసనాలుగా ప్రసిద్ధిగాంచాయి, అందులో బిషప్ అనుమతితో తప్ప స్వభాషలో బైబిల్ని అనువదించడంపై లేక చదవడంపై నిషేధం చేర్చబడింది. ఈ నిషేధోల్లంఘనకు తెగించినందున లల్లార్దీయులుగా పేరుగాంచిన అనేకమంది సంచార బోధకులు ధర్మవిరోధులుగా తగలబెట్టబడ్డారు. ఈ లల్లార్దీయులు వల్గేట్ నుండి అనువదింపబడిన ఒక ఆంగ్ల అనువాదమైన జాన్ విక్లిఫ్ బైబిల్ని చదివారు, పంచిపెట్టారు. టిండేల్ తన చర్చి కొరకు ఇంగ్లాండులోని ప్రజల కొరకు ఓ నూతన ప్రామాణిక పాఠాంతరానికి గ్రీకు నుండి క్రైస్తవ పుస్తకాలను అనువదించేందుకు సమయం ఆసన్నమయ్యిందని భావించాడు.
బిషప్ టన్‌స్టాల్ ఎరాస్మస్‌ను ప్రోత్సహించేందుకు ఎంతో చేసిన విద్యావంతుడు. టిండేల్ తన నైపుణ్యాలకు రుజువుగా సంక్లిష్టమైన గ్రీకు ప్రతియైన ఇసోక్రేట్స్ ఉపన్యాసాలలో ఒకదానిని టన్‌స్టాల్ అనుమతిని పొందేందుకు అనువదించాడు. టన్‌స్టాల్ స్నేహాన్ని సాచి ఆశ్రయాన్నిస్తాడని, లేఖనాల్ని అనువదించే తన ప్రతిపాదనను అంగీకరిస్తాడని టిండేల్ ఆశల్ని పెంచుకున్నాడు. బిషప్ ఏమి చేశాడు?
తిరస్కారం—ఎందుకు?
టిండేల్ పరిచయ లేఖను వ్రాసుకున్నప్పటికీ టన్‌స్టాల్ ఆయన్ని చూడనైనా లేదు. అందుచేత టిండేల్ ఇంటర్వ్యూ కొరకు ఎదురు చూస్తున్నానని వ్రాయాల్సి వచ్చింది. టన్‌స్టాల్ టిండేల్‌ని కలవడానికి చివరికి ఉద్దేశించాడో లేదో తెలియదు గాని ‘నా గృహం నిండిపోయింది.’ అన్నదే ఆయన ప్రత్యుత్తరం. టన్‌స్టాల్ టిండేల్‌ని మరీ ఉద్దేశపూర్వకంగా ఎందుకు అధిక్షేపించాడు?
ఇంగ్లాండులోని ప్రతిఘాతాలతో పాటు, ఐరోపా ఖండంపై లూథర్ మతసంస్కరణోద్యమ కార్యక్రమం కాథోలిక్కు చర్చి అతిగా చింతించడానికి కారణమైంది. 1521లో రాజైన హెన్రీ VIII లూథర్‌కి వ్యతిరేకంగా పోపును సమర్థిస్తున్న ఓ శక్తివంతమైన పుస్తకాన్ని ప్రచురించాడు. పోపు కృతజ్ఞతాపూర్వకంగా “విశ్వాసాన్ని సమర్థించినవాడు” అనే బిరుదుని హెన్రీకి ఇచ్చాడు.a హెన్రీ యొక్క మతాధికారియైన వొల్‌సే కూడా చురుకుగా ఉండి, లూథర్ చట్టవిరుద్ధంగా దిగుమతి చేసిన పుస్తకాల్ని నాశనం చేస్తున్నాడు. పోపుకి రాజుకి తన మతాధికారికి నమ్మకస్థుడైన ఒక కాథోలిక్కు బిషప్‌గా టన్‌స్టాల్, లూథర్ తిరుగుబాటుకు సానుభూతిని చూపించే ఏ ఆలోచననైనా అణచివేయడాన్నే నైతిక బాధ్యతగా భావించాడు. టిండేల్ ఓ ప్రధాన అనుమానితుడు. ఎందుకు?
ఆయన వాల్స్ కుటుంబంతో ఉన్న సమయంలో స్థానిక మతగురువుల నిర్లక్ష్యం మరి దురభిమానానికి ప్రతికూలంగా టిండేల్ నిర్భీతితో మాట్లాడాడు. వారిలో ఆక్స్‌ఫర్డ్‌లో టిండేల్‌ని ఎరిగిన జాన్ స్టాక్‌స్లే ఉన్నాడు. ఆయన చివరకు లండన్ బిషప్‌గా కత్‌బెర్ట్ టన్‌స్టాల్ స్థానంలోనికి మార్చబడ్డాడు.
“పోపు నియమాలు లేకపోవడం కన్నా దేవుని నియమాలు లేకపోవడమే మాకు మంచిది,” అని చెప్పిన ఓ ఉన్నత శ్రేణికి చెందిన మతగురువు చేసిన ప్రతిఘటనలో కూడా టిండేల్ ఎడల ప్రతికూలత స్పష్టమైంది. మరువరాని మాటలలో టిండేల్ ప్రత్యుత్తరమిలా ఉంది: ‘పోపుని అతని నియమాలన్నింటిని నేను ధిక్కరిస్తాను. దేవుడు నాకు ఆయుష్షుననుగ్రహిస్తే, ఏళ్లు గడవక మునుపే నాగలి దున్నే బాలుడు మీకన్నా ఎక్కువ లేఖనాలు తెలుసుకోవడానికి నేను కారకుడినౌతాను.’
టిండేల్ ధర్మవిరోధి అనే తప్పుడు అభియోగాలపై ఉస్టర్ మత న్యాయస్థానాధికారి ఎదుటికి వెళ్లాల్సి వచ్చింది. “ఆయన నన్ను తీవ్రంగా భయపెట్టి, దూషించాడు, ఓ కుక్క”లా చూడబడ్డానని తరువాత టిండేల్ జ్ఞాపకం చేసుకున్నాడు. అయినా మతవిరోధియని టిండేల్‌ని నిర్ధారించే రుజువేమీ దొరకలేదు. ఈ విషయాలన్నీ టన్‌స్టాల్ తీర్పును ప్రభావితం చేసేందుకు అతనికి రహస్యంగా నిర్ధారించబడ్డాయని చరిత్రకారులు విశ్వసిస్తున్నారు.
లండన్‌లో ఒక సంవత్సరం గడిపిన తరువాత, టిండేల్ ఈ నిర్ధారణకి వచ్చాడు: “క్రొత్త నిబంధనను అనువదించడానికి నా లండన్ ప్రభు రాజసౌధంలో చోటేలేదు, అంతేగాకుండా . . . దానిని చేయడానికి ఇంగ్లాండంతటిలోనూ స్థలం లేదు.” ఆయన చెప్పింది వాస్తవమే. లూథర్ కార్యక్రమం మూలంగా ఉత్పన్నమైన దమననీతిగల వాతావరణంలో, ఆంగ్లంలోనికి బైబిల్ని ముద్రించడానికి ఇంగ్లాండులోని ఏ ముద్రణాకర్త ధైర్యం చేయగలడు? గనుక 1524లో టిండేల్ ఇంగ్లీషు కాలువను దాటి వెళ్లాడు, మరెన్నడూ తిరిగి రాలేదు.
ఐరోపాకు తరలివెళ్లడం, తాజా సమస్యలు
తన అమూల్యమైన పుస్తకాలతోపాటు, విలియమ్ టిండేల్ జర్మనీలో ఆశ్రయాన్ని పొందాడు. ఆయన, పలుకుబడిగల లండన్ వ్యాపారస్థుడైన హమ్‌ప్రీ మాన్‌మత్ అనే తన స్నేహితుడు తనకు దయాపూర్వకంగా ఇచ్చిన 10 పౌండ్లను తనతో తెచ్చుకున్నాడు. ఆ బహుమానం టిండేల్ అనువదించడానికి ప్రణాళిక వేసుకున్న గ్రీకు లేఖనాల్ని ఆయన ముద్రించగలిగేందుకు ఆకాలంలో దాదాపు సరిపోతుంది. మాన్‌మత్, టిండేల్‌కు సహాయం చేసినందుకు లూథర్‌కి సానుభూతి చూపిస్తున్నాడని ఆరోపింపబడినందున అటుతరువాత బంధించబడ్డాడు. విచారణ జరిగి, లండన్ కోటలోనికి నెట్టివేయబడ్డాడు, మాన్‌మత్ క్షమాభిక్ష కొరకు కార్డినల్ ఉల్జీకి అభ్యర్థన చేసుకున్న తరువాత మాత్రమే విడుదల చేయబడ్డాడు.
టిండేల్ జర్మనీలో ఎక్కడికి వెళ్లాడో సరిగ్గా తెలియదు. ఆయన ఓ సంవత్సరంపాటు హమ్‌బర్గ్‌లో గడిపాడని కొన్ని రుజువులు సూచిస్తున్నాయి. ఆయన లూథర్‌ని కలుసుకున్నాడా? ఆయన కలుసుకున్నాడని మాన్‌మత్‌కి వ్యతిరేకంగా మోపబడిన ఆరోపణ తెలియజేస్తున్నప్పటికినీ ఇది అస్పష్టం. ఓ విషయం స్పష్టం: టిండేల్ గ్రీకు లేఖనాల్ని అనువదించడంలో పూర్తిగా నిమగ్నమైపోయాడు. తన వ్రాత ప్రతులను ఆయన ఎక్కడ ముద్రించగలిగాడు? ఆయన ఈ పనిని పీటన్ క్వెన్‌టెల్‌కి కొలోన్ నగరంలో అప్పగించాడు.
జాన్ డోబనెక్ మరోలా చెప్పాలంటే కాక్లీయాస్‌గా పేరుగాంచిన వ్యతిరేకి జరుగుతున్న దానిని తెలుసుకొనేంత వరకూ అంతా సవ్యంగానే కొనసాగింది. కాక్లీయాస్ తాను కనుగొన్నవాటిని క్వెన్‌టెల్ ద్వారా టిండేల్ అనువాదం ముద్రింపబడడానికి వ్యతిరేకంగా తక్షణమే నిషేధాన్ని తెచ్చిన హెన్రీ VIII యొక్క సన్నిహిత స్నేహితునికి ఫిర్యాదు చేశాడు.
టిండేల్ మరి ఆయన సహాయకుడైన విలియమ్ రాయ్, ముద్రింపబడిన మత్తయి సువార్త పుటలను తమతోపాటు తీసుకొని, తమ జీవాల్ని కాపాడుకోవడానికి పారిపోయారు. వారు రిన్ నది నుండి తమ పనిని పూర్తిచేసుకున్న నగరమైన వమ్జ్‌కి ప్రయాణించారు. తగిన కాలంలో, టిండేల్ క్రొత్త నిబంధన యొక్క మొదటి ముద్రణా ప్రతులు 6,000 వెలువడ్డాయి.b
వ్యతిరేకత ఉన్నా విజయం
అనువదించి ముద్రించడం ఓ సమస్య. బైబిళ్లను బ్రిటన్‌లోనికి తీసుకు వెళ్లడం మరో సమస్య. చర్చి ప్రతినిధులు, లౌకిక అధికారులు ఇంగ్లీషు కాలువను దాటి వచ్చే ఎగుమతులను అరికట్టేందుకు నిశ్చయించుకున్నారు అయినా సానుభూతిపరులైన వ్యాపారస్థుల దగ్గర జవాబు ఉంది. బట్టల బేళ్లు మరితర వాణిజ్య సరుకులుగల బేళ్ల అడుగున పుస్తకాల్ని పెట్టి ఇంగ్లాండు తీరానికి, స్కాట్‌లాండు వరకు దొంగ రవాణా చేశారు. టిండేల్ పోరాటం ఆరంభ దశలోనే ఉన్నా తాను ఎంతో ప్రోత్సాహింపబడ్డాడు.
“పెద్ద గంపలతో నింపబడిన పుస్తకాలు అగ్నిలో వేయడాన్ని చూడడానికి” ఫిబ్రవరి 11, 1526లో కార్డినల్ ఉల్జీ, 36 మంది బిషప్‌లు మరితర చర్చి ఉన్నతాధికారులతో కలిసి లండన్‌లోని సెయింట్ పాల్స్ కాథడ్రల్ సమీపాన సమావేశమయ్యారు. వాటిలో, టిండేల్ యొక్క విలువైన అనువాద ప్రతులలో కొన్ని కూడా చేరి ఉన్నాయి. ఈ మొదటి ముద్రణలోనివి కేవలం రెండు మాత్రమే నేటి వరకూ ఉన్నాయి. (ముఖ పత్రం మినహా) మిగతా అన్నీ ఉన్న ప్రతి బ్రిటీషు గ్రంథాలయంలో ఉంది. విచిత్రమేమంటే, 71 పేజీలు లేకుండా ఉన్న మరొక ప్రతి సెయింట్ పాల్స్ కాథడ్రల్ గ్రంథాలయంలో దొరికింది. అది అక్కడికెలా వెళ్లిందో ఎవరికీ తెలియదు.
సాహసియైన టిండేల్ తన అనువాదం యొక్క తాజా సంపుటిలను ముద్రిస్తూనే ఉన్నాడు, అవి ఓ పద్ధతి ప్రకారం పట్టుబడి ఆంగ్లేయ గుమస్తాల చేత కాల్చబడేవి. తరువాత టన్‌స్టాల్ వ్యూహరచనను మార్చుకున్నాడు. అతను క్రొత్తనిబంధనతో పాటు టిండేల్ రచించిన ఏ పుస్తకాన్నయినా కాల్చడానికిగాను తనకు అమ్మేందుకు అగస్టయిన్ పాకిన్‌టన్ అనే పేరుగల ఓ వ్యాపారితో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. పాకిన్‌టన్ ఒప్పందం కుదుర్చుకున్నవానితో ఈ ఏర్పాటు టిండేల్ కొరకే చేయబడింది. హాల్ యొక్క వృత్తాంతం ఇలా చెబుతుంది: “బిషప్ పుస్తకాల్ని పాకిన్‌టన్ అభినందల్ని, టిండేల్ డబ్బును పొందారు. మరిన్ని క్రొత్త నిబంధనలు ముద్రింపబడిన తరువాత త్వరితగతిన అనేకమైన బైబిళ్లు ఇంగ్లాండులోనికి ప్రవేశించాయి.”
టిండేల్ అనువాదాన్ని మతగురువులు ఎందుకంత కఠినంగా వ్యతిరేకించారు? లాటిన్ వల్గేట్ పరిశుద్ధ లేఖనాల్ని అస్పష్టంగా ఉంచడానికి ఉద్దేశింపబడగా, ఆదిమ గ్రీకు నుండి చేయబడిన టిండేల్ భాషాంతరీకరణ ఆంగ్ల ప్రజలకు స్పష్టమైన భాషలో బైబిలు వర్తమానం తొలిసారిగా తెలియజేయబడింది. ఉదాహరణకు, టిండేల్ 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో, అ·గాʹపే అనే గ్రీకు పదాన్ని “కారుణ్యం” అని అనువదించడానికి బదులు “ప్రేమ” అని అనువదించడానికి ఎన్నుకున్నాడు. చర్చి కట్టడాలను గాక ఆరాధికుల్ని నొక్కి చెప్పడానికి “చర్చి”కి బదులు “సంఘ”మేనని ఆయన వాదించాడు. అయినా మతగురువులు సహించలేని చివరి విషయం, టిండేల్ “గురువు” అనే పదాన్ని “పెద్ద”తోను మరి “పాప ప్రాయశ్చిత్త సంస్కారానికి” బదులు “పశ్చాత్తాపా”న్ని ఉపయోగించినందున వారి పౌరోహిత కల్పనా శక్తులను మతగురువుల నుండి పెరికివేయబడినప్పుడు తలెత్తింది. డేవిడ్ డానియల్ దానిని గురించి ఇలా చెబుతున్నాడు: “పాపవిమోచన లోకం లేదు; చెవిలో పాపాల్ని ఒప్పుకోవడం, పాప ప్రాయశ్చిత్త సంస్కారాలు లేవు. చర్చి సంపదకు శక్తికి మద్దతునిచ్చే ఈ రెండూ కుప్పకూలిపోయాయి.” (విలియమ్ టిండేల్—స్వీయచరిత్ర) టిండేల్ అనువాదం అందించిన సవాలు అదే మరి ఆయన పదాల్ని ఎన్నుకోవడంలోని కచ్చితత్వాన్ని ఆధునిక పాండిత్యం పూర్తిగా ఆమోదించింది.
యాన్టవర్ప్, అప్పగించబడడం, మరణం
ఆంగ్ల వ్యాపారస్థుల మధ్య తాను సురక్షితంగా ఉండగలనని భావించి యాన్టవర్ప్ అనే నగరానికి టిండేలు 1526 మరి 1528 మధ్య కాలంలో వెళ్లాడు. అక్కడ ఆయన పాపిష్టి సంపదను గూర్చిన ఉపమానం, క్రైస్తవ పురుషుని విధేయత, ప్రధాన గురువుల అభ్యాసం అనే పుస్తకాల్ని ఆయన రచించాడు. టిండేల్ తన అనువాద కార్యక్రమాన్ని కొనసాగించాడు మరి హెబ్రీ లేఖనాల ఆంగ్లానువాదంలో దేవుని నామం, యెహోవా అని తొలిసారిగా ఉపయోగించాడు. ఆ నామం 20సార్ల కన్నా పైగా కన్పిస్తుంది.
యాన్టవర్ప్‌లో తన స్నేహితుడు హితోపకారియైన థామస్ పాన్ట్స్ దగ్గర ఉన్నంత కాలం, ఉల్జీ మరి అతని వేగులవారి ఎత్తుగడల నుండి ఆయన సురక్షితంగానే ఉన్నాడు. ఆయన రోగగ్రస్తుల ఎడల బీదవారి ఎడల శ్రద్ధ తీసుకోవడంలో పేరుగాంచాడు. తుదకు ఆంగ్లేయుడైన హెన్రీ ఫిలిప్స్ టిండేల్ నమ్మకాన్ని యుక్తిగా చూరగొన్నాడు. తత్ఫలితంగా 1535లో టిండేల్ అప్పగింపబడి, బ్రస్సెల్స్ నగరానికి ఉత్తరాన పది కిలోమీటర్ల దూరాన ఉన్న విల్‌వొర్డ్ కోటకు కొనిపోబడ్డాడు. అక్కడ ఆయన 16 నెలలు ఖైదీ చేయబడ్డాడు.
ఫిలిప్స్‌ని కిరాయికి తీసుకున్నదెవరో కచ్చితంగా తెలియదు గాని అటుతరువాత లండన్‌లో “మత విరోధుల్ని” తగలబెట్టడంలో నిమగ్నుడైపోయిన బిషప్ స్టాక్స్‌లే వైపే అనుమానపు వ్రేలు చూపుతోంది. 1539లో స్టాక్స్‌లే తన మరణశయ్యపై ఉన్నప్పుడు “తన జీవిత కాలంలో యాభై మంది మత విరోధుల్ని తగలబెట్టానని ఆనందించాడు,” అని బైబిలు సంస్కరణోద్యమంలో డబ్ల్యు. జె. హెటన్ చెబుతున్నాడు. అక్టోబరు 1536లో తన దేహాన్ని బహిరంగంగా తగలబెట్టడానికి మునుపు గొంతు పిసికి చంపబడిన విలియమ్ టిండేల్ కూడా ఆ సంఖ్యలో ఉన్నాడు.
ఫిలిప్స్ దాఖలు చేయబడిన కాథోలిక్కు లువన్ విశ్వవిద్యాలయం నుండి ముగ్గురు వేదాంతులు పరిశీలనా సంఘంగా వచ్చి టిండేల్‌ను విచారించారు. లువన్ నుండి వచ్చిన ముగ్గురు మత గురువులు, ఇతర మతాధికారులతో పాటు ముగ్గురు బిషప్‌లు కూడా టిండేల్‌ని మతవిరోధిగా త్రోసిపుచ్చి మరి ఆయన మతాధికారాన్ని తొలగించారు. బహుశా 42వ ఏట ఆయన మృత్యువాత పడడాన్ని అందరూ ఆనందించారు.
“టిండేల్ తన నిర్భయమైన నిజాయితీ విషయంలో ఎల్లప్పుడూ ప్రస్ఫుటంగానే ఉన్నాడు,” అని స్వీయ చరిత్రకారుడైన రాబర్ట్ డెమాస్ ఓ వంద సంవత్సరాల క్రిందటే పేర్కొన్నాడు. స్టాక్స్‌లే చేత లండన్‌లో తగలపెట్టబడిన తన సహయోగియైన జాన్ ప్రిత్‌కు టిండేల్ ఇలా వ్రాశాడు: “నా మనస్సాక్షికి విరుద్ధంగా దేవుని వాక్యంలోని ఒక్క పదాంశాన్నయినా నేనెన్నడూ మార్చలేదు, భూమిపైనున్న వాటన్నింటినీ అది సంతోషమైనా, ఘనతైనా లేదా సంపదయైనా, నాకిస్తానన్నప్పటికీ ఈరోజైనా మార్చను.”
ఆవిధంగా ఇంగ్లాండు ప్రజలు సులభంగా అర్థం చేసుకొనే ఓ బైబిల్ని వారికి ఇచ్చే ఆధిక్యత కొరకు విలియమ్ టిండేల్ తన జీవితాన్నే త్యాగం చేశాడు. ఆయనెంత మూల్యాన్ని చెల్లించాడో—అయినా ఎంతటి వెలకట్టలేని బహుమానమో కదా!
[అధస్సూచీలు]
a ఫిడీ డాపెన్‌సర్ ఆ దేశ నాణాలపై ముద్రింపబడ్డాడు, ఈ బిరుదుని తన వారసులకు ఇవ్వాలని హెన్రీ అడిగాడు. నేడు అది ఫిడ్. డెఫ్. లేదా ఎఫ్.డి., అని బ్రిటీషు నాణాల్లో సార్వభౌమాధిపతి బొమ్మవున్న పైభాగం చుట్టూ కన్పిస్తుంది. ఆసక్తిదాయకంగా “విశ్వాసాన్ని సమర్థించినవాడు” అనేది తరువాత 1611 నాటి కింగ్ జేమ్స్ వర్షన్‌లో కింగ్ జేమ్స్‌కు అంకితం ఇచ్చినప్పుడు ముద్రింపబడింది.
b ఈ సంఖ్య సందేహాస్పదమైనది; కొన్ని అధికారిక మూలాలు 3,000 అని చెబుతున్నాయి.
[29వ పేజీలోని బాక్సు]
తొలి అనువాదాలు
వాడుక భాషలోనికి బైబిల్ని అనువదించడం కొరకు టిండేల్ చేసుకున్న విన్నపం నిర్హేతుకమైనదో పూర్వ దృష్టాంతం లేనిదో కాదు. పదవ శతాబ్దంలో ఆంగ్లో సక్సాన్ భాషల్లోనికి అనువాదం జరిగింది. 15వ శతాబ్దం తరువాయి భాగంలో లాటిన్ నుండి ఈ క్రింది భాషల్లోనికి అనువదింపబడిన బైబిళ్లు ఐరోపాలో స్వేచ్ఛగా పంచిపెట్టబడ్డాయి: జర్మన్ (1466), ఇటాలియన్ (1471), ఫ్రెంచ్ (1474), జెక్ (1475), డచ్ (1477) మరియు కటాలన్ (1478). 1522లో మార్టిన్ లూథర్ తన క్రొత్త నిబంధనను జర్మన్ భాషలో ప్రచురించాడు. ఇంగ్లాండు కూడా అదేవిధంగా చేసేందుకు ఎందుకు అనుమతించకూడదనే టిండేలు అడిగాడు.
[26వ పేజీలోని చిత్రసౌజన్యం]
Bible in the background: © The British Library Board; William Tyndale: By kind permission of the Principal, Fellows and Scholars of Hertford College, Oxford