అరిస్తర్కు—యథార్థమైన సహవాసి
అపొస్తలుడైన పౌలు యొక్క అనేకమంది నమ్మకమైన తోటి పని వారిలో అరిస్తర్కు ఒకడు. ఈ పేరు విన్నప్పుడు మీకు వెంటనే జ్ఞాపకం వచ్చేదేమిటి? ఏదైనా జ్ఞాపకం వస్తుందా? తొలి క్రైస్తవ చరిత్ర గమనంలో ఆయన ఏ పాత్ర వహించాడో మీరు చెప్పగలరా? మనకు చాలా పరిచయమున్న బైబిలు పాత్రల్లో అరిస్తర్కు ఒకడు కాకపోయినా, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో వివరించబడిన అనేక వృత్తాంతాల్లో ఆయన తప్పకుండా ఇమిడి ఉన్నాడు.
మరి అలాంటప్పుడు, ఈ అరిస్తర్కు ఎవరు? పౌలుతో ఆయనకు ఏ సంబంధం ఉండేది? అరిస్తర్కు యథార్థమైన సహవాసి అని ఎందుకు చెప్పవచ్చు? ఆయన మాదిరిని, ఉదాహరణను పరిశీలించడం ద్వారా మనం ఏ పాఠాలు నేర్చుకోగలము?
అపొస్తలుల కార్యముల పుస్తకంలోని వృత్తాంతంలోకి అరిస్తర్కు నాటకీయ ప్రవేశం, ఎఫెసు పట్టణంలో వెర్రెత్తిన మూక వేసిన అరుపులూ గలిబిలి మధ్యలో జరిగింది. (అపొస్తలుల కార్యములు 19:23-41) దేమేత్రికి మరియు ఇతర ఎఫెసీయులైన వెండి పని వారికి అబద్ధ దేవతైన అర్తెమి యొక్క వెండి గుళ్లను తయారు చేయడం ఎంతో లాభసాటియైన వ్యాపారంగా ఉండేది. అలా, ఆ నగరంలో పౌలు చేసిన ప్రకటనాపని అనేకులు ఆ దేవత యొక్క అపవిత్రమైన ఆరాధనను విడనాడేందుకు మూలకారణం అయినప్పుడు, దేమేత్రి ఇతర పని వారిని రెచ్చగొట్టాడు. పౌలు యొక్క ప్రకటనాపని తమ ఆర్థిక భద్రతకు ముప్పు వాటిల్లేలా చేయడమే కాక, అర్తెమి యొక్క ఆరాధన కూడా పూర్తిగా నశించిపోయే ప్రమాదం ఉందని వారికి చెప్పాడు.
పౌలును కనుగొనలేక, కోపోద్రేకులైన ఆ గుంపు ఆయన సహవాసులైన అరిస్తర్కును మరియు గాయిని నాటకశాల మధ్యలోకి ఈడ్చుకొస్తారు. వారిరువురూ ప్రమాదంలో ఉన్నందున, పౌలు స్నేహితులు “నీవు నాటకశాలలోనికి వెళ్లవద్దని అతని వేడుకొనిరి.”
ఆ పరిస్థితిలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. దాదాపు రెండు గంటలు ఈ వెర్రెత్తిన గుంపు, “ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి” అని కేకలు వేశారు. ఆ వెర్రి మంద చేతుల్లో చిక్కిన అరిస్తర్కు మరియు గాయిలకు తమ పక్షాన మాట్లాడే అవకాశం కూడా లేకపోవడంతో ఎంతో భయకంపితులై ఉండవచ్చు. తాము సజీవంగా ఉంటామా లేదా అని కూడా వారు ఆలోచించి ఉండవచ్చు. సంతోషకరంగా వారు తప్పించుకున్నారు. వాస్తవానికి, లూకా వృత్తాంతం ఎంతో సవివరంగా వర్ణింపబడి ఉండటం మూలంగా, ఆయన ప్రత్యక్ష సాక్షుల మద్దతు తీసుకుని ఉంటాడనీ బహుశ అరిస్తర్కు మరియు గాయిల మద్దతు తీసుకుని ఉంటాడనీ కొందరు పండితులు భావిస్తున్నారు.
చివరకు కరణము ఆ సమూహమును సముదాయిస్తాడు. అతడు అరిస్తర్కు మరియు గాయులు నిర్దోషులని బాహాటంగా తీర్పుతీర్చి ఆ తర్వాత ఆ గొడవంతా సద్దుమణిగేలా చూసినందుకు వారు ఎంతగా మనశ్సాంతి పొంది ఉంటారో కదా.
అలాంటి అనుభవం తర్వాత మీరు ఎలా భావించి ఉండేవారు? పౌలు యొక్క మిషనరీ సహవాసిగా ఉండటం మీ వల్ల కాదని, అది ప్రమాదకరమైనదనీ, మరింత ప్రశాంతమైన జీవితాన్ని వెదుక్కోవడం మంచిదనీ మీరు భావించే వారా? అరిస్తర్కు మాత్రం అలా భావించలేదు! ఆయన థెస్సలొనీకకు చెందిన వాడైనందున, సువార్తను ప్రకటించడంలోని అనేక ప్రమాదాలను గురించి ఆయనకు చాలా బాగానే తెలుసు. కేవలం రెండు సంవత్సరాల క్రితం పౌలు తన నగరంలో ప్రకటించినప్పుడు అక్కడ కూడా ఒక గొడవ మొదలైంది. (అపొస్తలుల కార్యములు 17:1-9; 20:4) అరిస్తర్కు యథార్థంగా పౌలును హత్తుకుని ఉన్నాడు.
యెరూషలేము నుండి గ్రీసు వరకు
కంసాలుల గొడవ జరిగిన కొన్ని నెలల తర్వాత, పౌలు గ్రీసులో ఉన్నప్పుడు, యెరూషలేము మార్గంలో సిరియాకు వెళ్లాలని అనుకుంటుండగా, “అతని విషయమై యూదులు కుట్ర” పన్నారు. (అపొస్తలుల కార్యములు 20:2, 3) ఈ కష్ట కాలాల్లో పౌలుతో కూడా ఎవరు ఉండటాన్ని మనం కనుగొంటాము? అరిస్తర్కు!
ఈ క్రొత్త బెదిరింపు వల్ల పౌలు, అరిస్తర్కు మరియు వారి సహవాసులు తమ పథకాన్ని మార్చి, మొదట మాసిదోనియ గుండా ప్రయాణించి చివరకు పతారా వద్ద ఫొనీసియాకు వెళ్లే ముందు, అంచెలంచెలుగా చిన్న ఆసియా తీరం వెంబడి ప్రయాణించారు. (అపొస్తలుల కార్యములు 20:4, 5, 13-15; 21:1-3) ఈ ప్రయాణం యొక్క సంకల్పం బహుశ మాసిదోనియ మరియు అకయలో ఉన్న క్రైస్తవులు ఇచ్చిన చందాలను యెరూషలేములో అవసరతల్లో ఉన్న తమ సహోదరులకు అందించడమే అయ్యుంటుంది. (అపొస్తలుల కార్యములు 24:17; రోమీయులు 15:25, 26) చాలా పెద్ద సంఖ్యలో వారు కలిసి ప్రయాణించారు, బహుశ వారికి అనేక సంఘాల ద్వారా ఈ పని అప్పగించబడి ఉండవచ్చు. అలాంటి పెద్ద గుంపు మరింత భద్రతను కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
గ్రీసు నుండి యెరూషలేముకు పౌలు వెంట వెళ్లే మరింత గొప్ప ఆధిక్యత అరిస్తర్కుకు లభించింది. అయితే, వారి తర్వాతి ప్రయాణం వారిని యూదయ నుండి రోముకు తీసుకెళ్తుంది.
రోముకు ప్రయాణం
ఈసారి పరిస్థితులు చాలా వేరుగా ఉన్నాయి. రెండేళ్లుగా పౌలు కైసరయలో నిర్భంధంలో ఉన్నాడు, కైసరుకు విన్నపం చేసుకున్నాడు, ఆయన సంకెళ్లతోనే రోముకు పంపబడతాడు. (అపొస్తలుల కార్యములు 24:27; 25:11, 12) పౌలు సహవాసులు ఎలా భావించి ఉంటారో ఊహించేందుకు ప్రయత్నించండి. కైసరయ నుండి రోముకు ప్రయాణం సుదీర్ఘంగా మరియు భావోద్రేకంగా కలత కలిగించేదిగా ఉంటుంది, తుది ఫలితం ఏమిటో ఎవరికీ తెలియదు. మద్దతు మరియు సహకారం అందించేందుకు ఆయనతో ఎవరు వెళ్తారు? ఇద్దరు వ్యక్తులు ఎంపిక చేయబడ్డారు లేదా తమకుతాము స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వారు అరిస్తర్కు మరియు అపొస్తలుల వృత్తాంతాన్ని రచించిన లూకా.—అపొస్తలుల కార్యములు 27:1, 2.
రోముకు వెళ్లే ప్రయాణంలోని మొదటి విడతలో లూకా మరియు అరిస్తర్కులు కూడా అదే ఓడ ఎలా ఎక్కగలిగారు? చరిత్రకారుడైన గిస్సుపీ రిక్కోయిటీ ఇలా పేర్కొంటున్నాడు: “ఈ ఇరువురూ మామూలు ప్రయాణికుల్లా ప్రవేశించారు . . . లేక చట్టం ఒక రోము పౌరునికి అతని వెంట ఇద్దరు బానిసలను తీసుకెళ్లేందుకు అనుమతిస్తుంది గనుక, వారిని బహుశ పౌలు యొక్క బానిసలుగా పరిగణించినట్లు నటించిన ఒక శతాధిపతి దయ మూలంగా అలా అనుమతించబడి ఉంటారు.” వారి ఉనికి మరియు ప్రోత్సాహం ద్వారా పౌలు ఎంతగా ధైర్యం తెచ్చుకుని ఉంటాడో కదా!
లూకా మరియు అరిస్తర్కులు తమను తాము మూల్యంగా చెల్లించాల్సి వచ్చినా, డబ్బును వెచ్చించవలసి వచ్చినా మరియు తమకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నా కూడా పౌలు ఎడల తమకు గల ప్రేమను ప్రదర్శించారు. వాస్తవానికి, తమ బందీయైన సహవాసితో పాటూ వారు మాల్టా ద్వీపంలో తమ ఓడ బ్రద్దలైనప్పుడు జీవన్మరణ పరిస్థితిని అనుభవించారు.—అపొస్తలుల కార్యములు 27:13–28:1.
పౌలు యొక్క ‘తోడి ఖైదీ’
సా.శ. 60-61లో పౌలు కొలొస్సయులకూ మరియు ఫిలేమోనుకు తన లేఖలను వ్రాసినప్పుడు, అరిస్తర్కు మరియు లూకాలు ఇంకా ఆయన వెంట రోములోనే ఉన్నారు. అరిస్తర్కు మరియు ఎపఫ్రాలు పౌలు యొక్క ‘తోడి ఖైదీలుగా’ పిలువబడ్డారు. (కొలొస్సయులు 4:10, 14; ఫిలేమోను 23, 24) కాబట్టి, కొంతకాలం కొరకు అరిస్తర్కు పౌలు యొక్క చెర బంధకాలను అనుభవించాడు.
పౌలు కనీసం రెండు సంవత్సరాలపాటు చెరసాలలో ఉన్నప్పటికీ, ఆయన తన స్వంత బాడుగ ఇంట్లో పర్యవేక్షణ క్రింద ఉండేందుకు అనుమతించబడ్డాడు, మరి అక్కడ ఆయన సందర్శకులకు సువార్త ప్రకటించగలిగాడు. (అపొస్తలుల కార్యములు 28:16, 30) అరిస్తర్కు, ఎపఫ్రా, లూకా మరియు ఇతరులు పౌలుకు సహాయం చేస్తూ పోషణనిస్తూ ఆయనకు సపర్యలు చేశారు.
‘ఆదరణ కలిగించిన వ్యక్తి’
ప్రేరేపిత బైబిలు వృత్తాంతంలోని అనేక ఘట్టాల్లో అరిస్తర్కు కనిపించిన వివిధ సందర్భాలను పరిశీలించిన తర్వాత, మనకు ఎలాంటి చిత్రం కనిపిస్తుంది? డబ్ల్యు. డి. థామస్ అనే రచయిత ప్రకారం, అరిస్తర్కు “వ్యతిరేకతను ఎదిరించి దృఢమైన విశ్వాసంతో మరియు కదిలించబడని తీర్మానంతో ఉన్న మనిషిగా మనకు పరిచయమౌతాడు. ఆయన మంచి పరిస్థితుల్లో మాత్రమే అంటే నీలి మేఘాల ఆకాశంలో సూర్యుడు ప్రకాశవంతంగా ఉన్నప్పుడే కాక కారు మబ్బుల సమయంలోనూ తుపాను వేళల్లోనూ దేవున్ని ప్రేమించిన వ్యక్తిగా ఆయన ప్రత్యేకంగా నిలిచాడు.”
అరిస్తర్కు వలన మరియు ఇతరుల వలన తనకు “ఆదరణ కలిగెను” (గ్రీకు, పారిగోరియా) అంటే ఊరట కలిగిందని పౌలు చెబుతున్నాడు. (కొలొస్సయులు 4:10, 11) కాబట్టి పౌలుకు ఊరటను, ధ్యైర్యాన్ని కలిగించడం ద్వారా అరిస్తర్కు అవసరతగల సమయాల్లో నిజమైన సహవాసిగా ఉన్నాడు. అపొస్తలుని సహవాసాన్నీ స్నేహాన్నీ అనేక సంవత్సరాలపాటూ అనుభవించడం ఆయనకు ఎంతో సంతృప్తికరంగానూ మరియు ఆత్మీయంగా సుసంపన్నం చేసేదిగానూ ఉండి ఉంటుంది.
అరిస్తర్కు అనుభవించినటువంటి నాటకీయమైన పరిస్థితులనే మనం ఎదుర్కొనక పోవచ్చు. అయినప్పటికీ, నేడు క్రైస్తవ సంఘంలో ఉన్న వారందరూ క్రీస్తు యొక్క ఆత్మీయ సహోదరుల ఎడలా మరియు యెహోవా సంస్థ ఎడలా అదే విధమైన యథార్థతను చూపించవలసిన అవసరం ఉంది. (మత్తయి 25:34-40 పోల్చండి.) మన తోటి ఆరాధికులు ప్రియమైన వారిని మరణమందు కోల్పోవడం మూలంగా, అనారోగ్యం మూలంగా, ఇతర కష్టాల మూలంగా సమస్యలను లేక చింతలను ఎప్పుడో ఒకప్పుడు అనుభవించవలసి వస్తుందని మనకు తెలుసు. వారిని హత్తుకుని ఉండటం ద్వారా మరియు వారికి సహాయాన్ని, ఆదరణను ఊరటను మరియు ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా, మనం ఆనందాన్ని కనుగొనవచ్చు మరియు మనం యథార్థమైన సహవాసులమని నిరూపించుకోవచ్చు.—సామెతలు 17:17; అపొస్తలుల కార్యములు 20:35 పోల్చండి.