కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 3/15 పేజీలు 4-6
  • శాశ్వతమైన స్నేహబంధాలను మీరు ఆస్వాదించగలరు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శాశ్వతమైన స్నేహబంధాలను మీరు ఆస్వాదించగలరు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • స్నేహ బంధాలకు బైబిలు మాదిరులు
  • స్నేహబంధాలను ఎలా పెంపొందించుకోవచ్చు
  • స్నేహబంధాలను తెగిపోకుండా కాపాడుకోవడం
  • ప్రేమలేని లోకంలో స్నేహాలను ఎలా కాపాడుకోవాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • నేనెందుకు స్నేహితులను నిలుపుకోలేకపోతున్నాను?
    తేజరిల్లు!—1996
  • మంచి ఫ్రెండ్స్‌ ఎలా ఉంటారు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోండి
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 3/15 పేజీలు 4-6

శాశ్వతమైన స్నేహబంధాలను మీరు ఆస్వాదించగలరు

స్నేహబంధాలకు అవరోధాలున్నాయి. నిజానికి, ఈ “అంత్య దినము”లలో ప్రేమ, సహజానురాగం మరియు విశ్వసనీయత కొరవడుతాయని బైబిలు ముందుగానే చెప్పింది. (2 తిమోతి 3:1-5; మత్తయి 24:12) ఈ పరిస్థితులు మునుపెన్నటికన్నా ఎక్కువగా ఒంటరితనమనే మహామారికి కారణమయ్యాయి. “అది మా ఇరుగుపొరుగున నోవహు ఓడవంటిది. మీరు దంపతులు కానట్లయితే, మిమ్మల్ని కలుపుకోరు” అని ఒక స్త్రీ చెబుతుంది. దీనికంతా ప్రతి ఒంటరి వ్యక్తి బాధ్యుడని చెప్పలేము. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో శాశ్వతమైన స్నేహబంధాలకుండే సవాళ్ళల్లో ప్రజలు ఒక చోట నుండి మరో చోటకు తరచూ తరలివెళ్ళడం, కుటుంబాలు విచ్ఛిన్నమవ్వడం, భావరహితమైన ప్రమాదకరమైన నగరాలు, విశ్రాంతి సమయం చెప్పుకోదగినంతగా తగ్గడం వంటి విషయాలు చేరివున్నాయి.

18వ శతాబ్దంలోని ఒక గ్రామస్థుడు ఒక సంవత్సరంలో లేక ఒక జీవితకాలంలో చూసినవారికన్నా ఎక్కువ మంది ప్రజలతో ఒక్క వారంలోనే ఆధునిక దిన నగరవాసి సహవాసం కలిగి ఉండవచ్చు! అయితే, నేటి సంబంధాలు తరచూ పైపైవి మాత్రమే. చాలామంది ఎడతెగక సాంఘిక కార్యక్రమాల్లోనూ వినోద కార్యక్రమాల్లోను మునిగి ఉంటారు. అయితే, పొరపాటున చెడు సహచరులతో అర్థశూన్యంగా వేడుకలు జరుపుకోవడం వంటచెరకు కొరకు ముళ్ళను ఉపయోగించడం వంటిదని మనం ఒప్పుకోవలసిందే. “బుద్ధిహీనుల పాటలు వినుటకంటె జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏలయనగా బానక్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే; ఇదియు వ్యర్థము” అని ప్రసంగి 7:5, 6 చెబుతుంది. ముళ్ళు కొంతసేపు ప్రకాశాన్నిస్తూ చిటపటమనే చప్పుడు చేస్తూ మండుతాయి, కాని మనకు వెచ్చదనాన్నిచ్చేంత సత్తువ ఆ మంటకు ఉండదు. అలాగే, సందడి చేసే, నవ్వే సహచరులు తాత్కాలికంగా మన ధ్యాసను మళ్ళించవచ్చు, కాని వారు ఒంటరితనాన్ని పూర్తిగా పారద్రోలి, మనకుగల నిజమైన స్నేహితుల అవసరతను తీర్చలేరు.

ఏకాంతం ఒంటరితనానికి భిన్నమైనది. మనలను మనం నవోత్తేజితులను చేసుకునేందుకు, స్నేహితునిగా అందించవలసినది మరింత కలిగి ఉండేందుకు కొంత ఏకాంతం అవసరం. ఒంటరితనం ఏర్పడిన వెంటనే అనేకులు ఏదో ఒక రకమైన ఎలక్ట్రానిక్‌ వినోదం వైపుకు తిరుగుతారు. ఒంటరితనం అనిపించినప్పుడు సాధారణంగా కలిగే ప్రతిస్పందనల్లో ఒకటి దూరదర్శినిని చూడడమని ఒక అధ్యయనం కనుగొంది. అయితే, దూరదర్శినిని ఎక్కువసేపు చూడడమనేది మనం ఒంటరిగా ఉన్నప్పుడు చేసే అతి హీనమైన పనుల్లో ఒకటనే నిర్ధారణకు పరిశోధకులు వచ్చారు. ఇది నిష్క్రియాశీలతను విసుగును ఊహాభావాలను పెంపొందింపజేస్తూ ఇతరులతో కలిగే వ్యక్తిగత సంబంధాలకు సరితూగని ప్రత్యామ్నాయమౌతుంది.

నిజానికి, మనం ఒంటరిగా ఉన్న సమయాన్ని నిర్మాణాత్మకమైన విధంగా ఉపయోగించినట్లయితే, ఏకాంతం చాలా విలువైనదిగా ఉండగలదు. మనం చదవడం ద్వారా, ఉత్తరాలు వ్రాయడం ద్వారా వస్తువులను తయారు చేయడం ద్వారా విశ్రాంతి తీసుకోవడం ద్వారా మనం దీనిని చేయవచ్చు. నిర్మాణాత్మకమైన ఏకాంతంలో దేవునికి ప్రార్థన చేయడం, బైబిలును పఠించడం, దానిని ధ్యానించడం ఇమిడి ఉన్నాయి. (కీర్తన 63:6) మన గొప్ప స్నేహితునిగా ఉండగల యెహోవా దేవునికి మరింత దగ్గరయ్యేందుకు ఇవి మార్గాలు.

స్నేహ బంధాలకు బైబిలు మాదిరులు

అనేక మంది ప్రజలతో స్నేహంగా ఉండడం మంచిదే అయినప్పటికీ, “సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు” అని బైబిలు మనకు గుర్తుచేస్తుంది. (సామెతలు 18:24) తమ స్నేహంతో మనకు ఆనందాన్ని బలాన్ని సమాధానాన్ని ఇచ్చే, మనపై నిజంగా శ్రద్ధ చూపించే కొందరు సన్నిహిత స్నేహితులు మనకందరికీ అవసరం. అలాంటి నిజమైన స్నేహబంధాలు నేడు అరుదైనప్పటికీ కొన్ని ప్రాచీన మాదిరులు బైబిలులో ప్రత్యేకంగా వ్రాయబడ్డాయి. ఉదాహరణకు, దావీదుకు యోనాతానుకు మధ్య విశిష్టమైన స్నేహముండేది. దాని నుండి మనమేమి నేర్చుకోగలం? వారి స్నేహబంధం ఎందుకు నిలిచింది?

ఒక ఉదాహరణగా, దావీదు మరియు యోనాతానులకు ప్రాముఖ్యమైన ఒకే విధమైన విషయాల్లో ఆసక్తి ఉండేది. అన్నింటికంటే ముఖ్యంగా, వారు యెహోవా దేవునియందు ప్రగాఢమైన భక్తి భావాలను పంచుకున్నారు. దేవునియందు దావీదుకున్న విశ్వాసాన్ని, యెహోవా ప్రజల రక్షణార్థమై అతడు చేసిన పనులను గమనించిన తరువాత, “యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను; యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను.” (1 సమూయేలు 18:1) దేవుని ఎడల పరస్పర ప్రేమ స్నేహితులు ఒకరికొకరు దగ్గరవ్వడానికి సహాయపడుతుంది.

యోనాతాను మరియు దావీదు దైవిక సూత్రాలతో జీవించిన శక్తిమంతులు. కనుక, వారు ఒకరినొకరు గౌరవించుకోగలిగారు. (1 సమూయేలు 19:1-7; 20:9-14; 24:6) లేఖనాధార సూత్రాలచే నడిపించబడే దైవిక భక్తిగల స్నేహితులు మనకున్నట్లయితే నిశ్చయంగా మనం ఆశీర్వదించబడినవారమే.

యోనాతాను మరియు దావీదుల స్నేహబంధానికి వేరే కారకాలు దోహదపడ్డాయి. వారి సంబంధం అనేది నిజాయితీ కలది మరియు నిశ్చయత కలది, మరి ఒకరియందొకరు తమ నమ్మకాన్నుంచారు. యోనాతాను నమ్మకంగా దావీదు ఆసక్తులను తన స్వంత ఆసక్తులకు ముందుంచాడు. దావీదుకు రాజత్వం వాగ్దానం చేయబడినందుకు అతడు అసూయపడలేదు; బదులుగా, యోనాతాను అతనిని భావోద్రేకంగాను, ఆత్మీయంగాను బలపర్చాడు. మరి దావీదు అతని సహాయాన్ని అంగీకరించాడు. (1 సమూయేలు 23:16-18) లేఖనాధారంగా సరైనవిధాల్లో దావీదు మరియు యోనాతాను తమ స్నేహబంధపు భావాలను ఒకరితోనొకరు చెప్పుకున్నారు. వారి దైవిక స్నేహబంధం నిజమైన మెప్పు మరియు అనురాగాలపై ఆధారపడి ఉంది. (1 సమూయేలు 20:41; 2 సమూయేలు 1:26) ఆ ఇద్దరు పురుషులు దేవుని ఎడల నమ్మకస్థులుగా ఉన్నారు గనుక వారి స్నేహమనేది విడదీయరానిదిగా ఉండేది. అలాంటి సూత్రాలను ఆచరణలో పెట్టడం నిజమైన స్నేహబంధాలను నిర్మించుకోవడానికి, నిలుపుకోవడానికి మనకు సహాయపడగలవు.

స్నేహబంధాలను ఎలా పెంపొందించుకోవచ్చు

మీరు నిజమైన స్నేహితుల కొరకు ఎదురు చూస్తున్నారా? మీరు ఎక్కడో చూడవలసిన అవసరం లేదు. మీతో క్రమంగా సహవసిస్తున్న వారిలో కొందరు మీ స్నేహితులుగా ఉండగలరు, వారికి మీ స్నేహం అవసరం కావచ్చు. “విశాలపరచుకొనుడి” అని అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సలహాను ముఖ్యంగా తోటి క్రైస్తవుల విషయంలో అన్వయించుకోవడం జ్ఞానయుక్తము. (2 కొరింథీయులు 6:11-13) అయినప్పటికీ, స్నేహితునిగా చేసుకోవాలనే ప్రతి ప్రయత్నంవల్ల దృఢమైన బంధం ఏర్పడకపోతే కలతచెందవద్దు. సాధారణంగా స్నేహబంధం వృద్ధి కావడానికి సమయం పడుతుంది, ప్రతి స్నేహబంధం ఒకే లోతు కలిగి ఉండదు. (ప్రసంగి 11:1, 2, 6) నిజమే, నిజమైన స్నేహబంధాలను ఆస్వాదించేందుకు, మనం నిస్వార్థపరులమై ఉండాలి మరియు మనం యేసు ఉపదేశాన్ని అనుసరించవలసిన అవసరముంది: “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి.”—మత్తయి 7:12.

మీ స్నేహం ఎవరికి కావాలి? మీ తోటివయస్కులే కాకుండా, మీకన్నా చిన్నవారిని గూర్చి మరియు పెద్దవారిని గూర్చిన విషయం ఏమిటి? దావీదు యోనాతానుల, రూతు నయోమిల, పౌలు తిమోతిల స్నేహబంధాల్లో వయస్సు భేదం ఉంది. (రూతు 1:16, 17; 1 కొరింథీయులు 4:17) విధవరాండ్ర వరకు మరితర అవివాహితుల వరకు మీరు మీ స్నేహబంధాన్ని విస్తరింపజేయగలరా? మీ ఇరుగుపొరుగున క్రొత్తగా వచ్చినవారి గురించి కూడా ఆలోచించండి. తమ నివాసస్థలాన్ని మార్చడం వల్ల లేదా తమ జీవనమార్గాన్ని మార్చుకోవడంవల్ల తమ స్నేహితులందరి సహవాసాన్ని లేదా వారిలో చాలా మంది సహవాసాన్ని వదిలిపెట్టవలసి వచ్చి ఉండవచ్చు. ఇతరులు మీ దగ్గరకు వచ్చేంతవరకు వేచి ఉండవద్దు. మీరొక క్రైస్తవుడైతే పౌలు సలహాను అన్వయించడం ద్వారా శాశ్వతమైన స్నేహబంధాలను చేసుకోండి: “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.”—రోమీయులు 12:10.

స్నేహమంటే ఇవ్వడమని మనం అనుకోవచ్చు. మనం ఇచ్చే అలవాటును చేసుకుంటే ప్రజలు మనకు ఇస్తారని యేసు చెప్పాడు. పుచ్చుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషముందని కూడా ఆయన సూచించాడు. (లూకా 6:38; అపొస్తలుల కార్యములు 20:35) విభిన్న పుట్టుపూర్వోత్తరాలుగలవారిని మీరు కలిశారా? విభిన్న సంస్కృతులుగల ప్రజలు ఒకే దేవున్ని ఆరాధించినప్పుడు నిజమైన శాశ్వతమైన స్నేహబంధాలను వారు ఏర్పరచుకోగలరని యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశాలు నిరూపించాయి.

స్నేహబంధాలను తెగిపోకుండా కాపాడుకోవడం

విచారకరంగా, స్నేహితులుగా ఎంచబడుతున్నవారు కొన్నిసార్లు ఒకరి బాధకు మరొకరు కారణమౌతారు. హానికరమైన వదంతులు, నమ్మకద్రోహం, మెప్పుదల లేకపోవడం అనేవి మీరు నిజమైన స్నేహితులని ఎంచుతున్న వారితో మొదలైనప్పుడు చాలా వేదనాకరంగా ఉండే విషయాల్లో కొన్ని. అలాంటి పరిస్థితుల్లో ఏమి చేయవచ్చు?

మంచి మాదిరినుంచండి. అనవసరంగా బాధ కలగడాన్ని నివారించేందుకు మీరు చేయగల ప్రతిదీ చేయండి. కొన్ని ప్రాంతాల్లో స్నేహితులు ఒకరి లోపాలను మరొకరు ఎగతాళిచేయడం సాధారణం. కాని కఠినంగా ప్రవర్తించడం లేదా కుయుక్తిగా ఉండడం “నవ్వులాటకు” చేసినవని చెప్పబడుతున్నప్పటికీ అవి స్నేహితులను సన్నిహితులనుగా చేయవు.—సామెతలు 26:18, 19.

స్నేహబంధాలను కాపాడుకునేందుకు బాగా కృషిచేయండి. స్నేహితులు ఒకరి నుండి ఒకరు అమితంగా అపేక్షించినప్పుడు కొన్నిసార్లు అపార్థాలు చేసుకోవడం జరుగుతోంది. రోగిగా ఉన్న లేక ఒక పెద్ద సమస్య వల్ల అమితంగా వ్యాకులపడుతున్న స్నేహితుడు బహుశా సాధారణంగా చూపేంత ఆప్యాయతను చూపించలేకపోవచ్చు. అలాంటి సమయాల్లో, అర్థం చేసుకునే వారిగాను మద్దతునిచ్చేవారిగాను ఉండడానికి ప్రయత్నించండి.

సమస్యలను త్వరగాను దయాపూర్వకంగానూ పరిష్కరించుకోండి. సాధ్యమైతే రహస్యంగా అలా చేయండి. (మత్తయి 5:23, 24; 18:15) మీరో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నారని మీ స్నేహితునికి తెలిసేలా చూడండి. యథార్థమైన స్నేహితులు ఒకరినొకరు క్షమించుకుంటారు. (కొలొస్సయులు 3:13) ఒక సహోదరునికంటె సన్నిహితంగా ఉండేలాంటి స్నేహితుని(రాలి)గా మీరుంటారా?

స్నేహబంధాలను గూర్చి చదవడం మరియు ఆలోచించడం కేవలం ఆరంభమే. మనం ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లయితే, మనం సరైన చర్యను గైకొందాం, మనమిక ఎంతోకాలం ఒంటరితనాన్ని అనుభవించం. మనం కృషిచేస్తే, నిజమైన స్నేహితులను చేసుకోగలం. వారిలో కొందరితో మనకు ప్రత్యేక బంధాన్ని ఏర్పరచుకుంటాం. కానీ మహాగొప్ప స్నేహితుడైన దేవుని స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. యెహోవా మాత్రమే మనలను తెలుసుకుని, అర్థంచేసుకుని, మనకు పూర్తిగా మద్దతునివ్వగలడు. (కీర్తన 139:1-4, 23, 24) అంతేకాక, ఆయన వాక్యం భవిష్యత్‌ కొరకైన అద్భుతమైన నిరీక్షణను అంటే నిజమైన స్నేహితులను ఎప్పటికీ కలిగివుండడం సాధ్యమయ్యే క్రొత్తలోకమనే నిరీక్షణనిస్తుంది.—2 పేతురు 3:13.

[5వ పేజీలోని చిత్రం]

దావీదు యోనాతానులు నిజమైన స్నేహబంధాన్ని ఆస్వాదించారు, గనుక మనమూ ఆస్వాదించగలం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి