యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
నేనెందుకు స్నేహితులను నిలుపుకోలేకపోతున్నాను?
“నేను నా స్నేహితురాలు ఎన్నో ఇష్టాయిష్టాలను, కార్యకలాపాలను పంచుకున్నాము; మేము సమయాన్ని కలిసి గడపడంలో ఆనందించాము. కానీ ఉన్నట్లుండి మా స్నేహం చల్లబడిపోయింది. అది నేను నిజంగా కృంగిపోయేలా చేసింది.”—మారీయా.
చివరికి మీరు ఒక స్నేహితుడిని, మిమ్మల్ని అర్థం చేసుకుని, మీకు తీర్పు చెప్పని ఒకరిని కనుగొన్నారు. ఆ తర్వాత, అనుకోకుండా, మీ స్నేహం చేజారిపోనారంభిస్తుంది. మీరు దాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తారు, కానీ విఫలులౌతారు.
ఒక యథార్థమైన స్నేహితుడు అమూల్యమైనవాడు. (సామెతలు 18:24) మరి ఒకరిని పోగొట్టుకోవడం బాధాకరమైన అనుభవమై ఉండగలదు. యోబును తన స్నేహితులు విడిచిపెట్టినప్పుడు, ఆయనిలా విలపించినట్లు బైబిలు చెబుతుంది: “నా బంధువులు నాయొద్దకు రాకయున్నారు. నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయియున్నారు.” (యోబు 19:14) ఒకవేళ ఇటీవలెనే మీరు ఓ స్నేహితుడిని పోగొట్టుకుంటే కూడా అటువంటి బాధనే అనుభవించవచ్చు. యౌవనుడైన పాట్రిక్ చెప్పినట్లుగా, “అది మీరు ప్రేమించిన ఎవరైనా చనిపోయినట్లు ఉంటుంది.” కానీ దాదాపు మీకున్న స్నేహితులందరు విడిచి వెళ్లిపోతే అప్పుడేమిటి?
సున్నితమైన స్నేహాలు
ఈస్ట్వుడ్ అట్వొటర్ రచించిన కౌమారం (ఆంగ్లం) పుస్తకం “స్నేహితులు విడిపోయినప్పుడు ఆకస్మిక, నాటకీయ మార్పులతో, చేదు అనుభూతులతో” కౌమార స్నేహాలు “అస్థిరంగా ఉంటున్నట్లు” తెలుపుతుంది. కౌమార స్నేహాలను అంత సున్నితం చేసేది ఏమిటి? ఒక కారణమేమంటే మీరు పెద్దవారయ్యే కొలది, మీ భావాలు, దృక్కోణాలు, గమ్యాలు, అభిరుచులు మారనారంభిస్తాయి. (1 కొరింథీయులు 13:11 పోల్చండి.) మీరు మీ స్నేహితులకు ముందుగాని లేక వెనుకగాని వెళ్తున్నట్లు మిమ్మల్ని మీరు కనుగొంటారు.
అందువలన స్నేహితులు పెరిగి పెద్దవారైనప్పుడు కొన్నిసార్లు దూరమౌతారు—వారు ఒకరియెడల ఒకరు కోపంతో ఉన్నందువల్ల కాదు, కానీ వారు వేర్వేరు గమ్యాలను, అభిరుచులను, విలువలను పెంపొందించుకుంటారు గనుకనే. ఒక సంబంధం అంతం కావడమే ఎంతో శ్రేష్ఠం అయ్యుండవచ్చు కూడా. మీరు పెద్దవారయ్యే కొలది, ఆత్మీయ విషయాలను గంభీరంగా తీసుకోవడం మొదలుపెట్టే కొలది, మీ పూర్వ స్నేహితులలో కొంతమంది ప్రభావం ఆరోగ్యకరమైనది కాదని మీరు గ్రహించవచ్చు. (1 కొరింథీయులు 15:33) మీరు వారియెడల శ్రద్ధ వహిస్తారు, కానీ మీరొకప్పుడు ఆనందించినంతగా వారి సహవాసంలో ఆనందించరు.
స్నేహాలను విషమయంచేసే విషయాలు
అయితే, క్రమంగా స్నేహితులను—మీరు కాపాడుకోవాలని ఇష్టపడే సంబంధాలను—మీరు కోల్పోతుంటే అప్పుడేమిటి? సూటిగా చెప్పాలంటే, మీరు కొన్ని వ్యక్తిత్వపు లోపాలను అధిగమించాలని దాని అర్థం కావచ్చు. ఉదాహరణకు, అసూయ స్నేహాన్ని విషమయం చేస్తుంది. మీకంటే సంపన్నుడైన, మీకన్నా ఎక్కువ ప్రతిభాశాలియైన, ఎక్కువ ఆకర్షణగల, లేక ఎక్కువ ప్రజాదరణగల స్నేహితుడు ఉన్నాడని ఊహించుకోండి. ఆయన లేక ఆమె అధిక అవధానాన్ని పొందుతున్నందున మీకు ఉక్రోషం కలుగుతుందా? “మత్సరము ఎముకలకు కుళ్లు.” (సామెతలు 14:30) “నా స్నేహితునికున్న ప్రజాదరణ వలన, నా దగ్గర లేనివన్నీ ఆయన దగ్గర ఉండడం వలన నేను నిజంగా ఈర్ష్యపడ్డాను,” అని ఒప్పుకుంటూ, “అది మా స్నేహంపై ప్రభావాన్ని చూపింది” అని కీనన్ అనే యౌవనస్థుడు అంటున్నాడు.
స్వాధీనతాసూచక భావం (పాసెసివ్నెస్) ఇంకొక వినాశకర ప్రవృత్తి కాగలదు. ఒక స్నేహితుడు ఇతరులతో ఎంతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడని, మీతో మరీ తక్కువ సమయాన్ని గడుపుతున్నాడని ఒకవేళ మీరు తెలుసుకుంటే అప్పుడేమిటి? ఒక యౌవనురాలిలా ఒప్పుకుంటుంది: “ఇతరులు నా స్నేహితురాండ్రలో కొందరితో మాట్లాడినా నేను అసూయ పడేదాన్ని.” ఇతరులతో మీ స్నేహితుని సహచర్యం ఒక విద్రోహ చర్య అని మీరు గ్రహించవచ్చు.
పరిపూర్ణతావాదం కూడా ఒక స్నేహాన్ని విఫలం చేయవచ్చు. ఉదాహరణకు, ఒక స్నేహితుడు మీ గురించి మీ వెనుక మాట్లాడాడని, బహుశ ఆంతరంగిక విషయాలను కూడా బహిర్గతం చేశాడని మీరు తెలుసుకుంటారు. (సామెతలు 20:19) “ఆయన్ని/ఆమెను నేనెప్పటికీ మళ్ళీ నమ్మలేను!” అని మీరు కోపంగా అరుస్తారు.
స్నేహం—పొందడమా లేక ఇవ్వడమా?
అసూయ, స్వాధీనతాసూచక భావం, లేక పరిపూర్ణతావాదం మీ స్నేహాలను పీల్చివేస్తే, ‘ఒక స్నేహం నుండి నాకు ఏమి కావాలి?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. స్నేహంలో ఎవరో ఒకరు మీ కనుసన్నలలో మెలిగేవాడు, మీరడిగిన ప్రతీదాన్ని చేసే సేవకుని వంటివాడు ఇమిడి ఉండాలని మీరనుకుంటారా? మీరు స్నేహితులను ప్రతిష్ఠ కొరకు, ప్రజాదరణ పొందడానికి, లేక లబ్ది పొందడానికి ఎన్నుకుంటారా? ఆ సంబంధంలో ఇతరులకు తావివ్వకుండా ఒక స్నేహితుని నుండి అనితర భక్తిని మీరు ఆశిస్తారా? అప్పుడు స్నేహాన్ని గూర్చిన మీ అభిప్రాయాన్ని చక్కదిద్దుకోవాలి.
ఇతరులతో మంచి సంబంధాలనేవి పొందడం నుండి కాదు గానీ, ఇవ్వడం నుండి వస్తాయని బైబిలు బోధల నుండి మనం నేర్చుకుంటాము! మత్తయి 7:12లో యేసుక్రీస్తు తానే ఇలా అన్నాడు: “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” స్నేహితుల నుండి కొన్ని విషయాలను అపేక్షించడం కేవలం స్వాభావికం. సంబంధాలను అర్థం చేసుకోవడం (ఆంగ్లం) పుస్తకం ఇలా ఒప్పుకుంటుంది: “ఒక స్నేహితుడు నిజాయితీగా, నిర్మొహమాటంగా ఉంటాడని, అనురాగం చూపుతాడని, ఆతని లేక ఆమె రహస్యాలను మరియు సమస్యలను చెబుతాడని, మనకవసరం అయినప్పుడు సహాయమందిస్తాడని, మనల్ని నమ్ముతాడని, అంతేగాక . . . అనంగీకారాలను పరిష్కరించడానికి పనిచేస్తాడని మనం విధిగా అపేక్షిస్తాము.” అయితే, విషయమక్కడితో ముగిసిపోదు. ఆ పుస్తకం ఇలా జతచేరుస్తుంది: “ఒక స్నేహితుడు తమకు చేస్తాడని, ప్రతిగా తాము ఆ స్నేహితునికి చేస్తామని వారు అపేక్షించే విషయాలు ఇవి.”—ఇటాలిక్కులు మావి.
తనకు సన్నిహితులైన వారితో యేసు వ్యవహరించిన విధానాన్ని గమనించండి. ఆయన తన శిష్యులకు ఇలా చెప్పాడు: “దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను.” కానీ తన శిష్యులతో యేసు స్నేహం, వారు తనకేమి చేయగలరన్న దానిపై ఆధారపడి ఉండెనా? లేనే లేదు. ఆయనిలా అన్నాడు: “తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.” (యోహాను 15:13, 15) అవును, స్నేహానికి నిజమైన ఆధారం స్వయం-త్యాగపూరిత ప్రేమ! ఒక సంబంధానికి ప్రేమే ఆధారం అయినప్పుడు, అది వాగ్వివాదాలను, సమస్యలను తప్పించుకుంటుంది.
సమస్యలు ఉత్పన్నమైనప్పుడు
ఉదాహరణకు, మీ స్నేహితునికి ఎక్కువ డబ్బు, తెలివి, లేక ప్రతిభ ఉందనుకోండి. నిస్వార్థ ప్రేమ మీరు మీ స్నేహితునితో ఆనందించేందుకు సహాయం చేస్తుంది. నిజానికి అసలు, “ప్రేమ మత్సరపడదు” అని బైబిలు చెబుతుంది.—1 కొరింథీయులు 13:4.
లేకపోతే మీ భావాలను గాయపరిచేదేదైనా అనడమో లేక చేయడమో జరిగిందనుకోండి. దానర్థం మీ స్నేహం అంతమైందనా? అలా కానవసరం లేదు. తన స్నేహితుడు మార్కు ఒక మిషనరీ యాత్రలో తనను విడిచిపెట్టినందుకు అపొస్తలుడైన పౌలు చాలా నిరాశ చెందాడు. ఆయన ఎంతగా నిరాశ చెందాడంటే తన తరువాతి యాత్రలో మార్కును వెంటబెట్టుకుని వెళ్లడానికి నిరాకరించాడు! పౌలు మరియు మార్కు మారుటి సహోదరుడైన బర్నబా, ఈ విషయంపై కొంత కటువుగా మాట్లాడుకున్నారు. అయినా, సంవత్సరాల తరువాత, పౌలు మార్కు గురించి అనురాగపూరితంగా మాట్లాడాడు, తనకు పరిచర్య చేయమని ఆయనను రోముకు రమ్మని కూడా ఆహ్వానించాడు. స్పష్టంగా వారు తమ అభిప్రాయ భేదాలను పరిష్కరించుకున్నారు.—అపొస్తలుల కార్యములు 15:37-39; 2 తిమోతి 4:11.
మీ స్నేహాలలో తలెత్తిన సమస్యల విషయంలో కూడా అదే చేయడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? విషయాలు విషమించడానికి అనుమతించకండి. (ఎఫెసీయులు 4:26) ఒక ముగింపుకు వచ్చే ముందు లేక కోపంతో కూడిన నేరారోపణలు చేసే ముందు, మీ స్నేహితుని వైపునుండి కథను వినండి. (సామెతలు 18:13; 25:8, 9) బహుశ కొంత అపార్థం జరిగివుండవచ్చు. కానీ మీ స్నేహితుడు వాస్తవంగానే వివేచనారాహిత్యాన్ని కనబరిస్తే అప్పుడేమిటి? మీ స్నేహితుడు కేవలం మానవమాత్రుడే అని గుర్తుంచుకోండి. (కీర్తన 51:5; 1 యోహాను 1:10) మనం తరువాత అనుతాపంచెందేటువంటి విషయాలను అనడంలోను, చేయడంలోను మనమందరము దోషులమే.—ప్రసంగి 7:21, 22 పోల్చండి.
అయినా, మీరు మీ స్నేహితుని చర్యలు మిమ్మల్ని ఎంత గాయపరిచాయో మీరు బాహాటంగా వ్యక్తం చేయవచ్చు. అది మీ స్నేహితున్ని ఒక మనఃపూర్వక క్షమాపణను అడగడానికి కదిలించవచ్చు. ప్రేమ “అపకారమును మనస్సులో ఉంచుకొనదు” గనుక బహుశ మీరు ఆ సంఘటనని అంతటితో మర్చిపోవచ్చు. (1 కొరింథీయులు 13:5) పోగొట్టుకున్న స్నేహం వైపు తిరిగి చూస్తూ, యౌవనుడైన కీనన్ వివరిస్తున్నాడు: “అదంతా నేను మరలా చేయాల్సివస్తే, నేను మా స్నేహం నుండి పరిపూర్ణతను అపేక్షించేవాడిని కాదు. నేనింకా ఎక్కువ వినుండేవాడిని, ఆయనకు మద్దతుయిచ్చి ఉండేవాడిని, మరి ఆయన లోపాలను పెద్దవిగాచేసి చూసేవాడిని కాను. స్నేహాన్ని విజయవంతం చేసేది పరీక్షలు, సవాళ్ల గుండా పనిచేయడమే అని నేనిప్పుడు అర్థం చేసుకున్నాను.”
ఇంతకుముందు గడిపినంతగా లేక మీరు కోరుకున్నంతగా మీ స్నేహితుడు మీతో సమయాన్ని గడపకపోతున్నట్లయితే అప్పటి విషయమేమిటి? ఇది మీ స్నేహితుని సమయం, అవధానం విషయంలో మీరు అతి స్వాధీనతాసూచకంగా తయారవుతున్నందున కావచ్చా? ఇది ఒక సంబంధం కొనసాగకుండా అడ్డగించవచ్చు. ఆరోగ్యవంతమైన సంబంధాలతో ఉన్న ప్రజలు వారికిష్టమైన విషయాలను చేయడానికి ఒకరికొకరు స్వేచ్ఛను ఇస్తారు. (సామెతలు 25:17) ఇతరులు ఆనందించడానికి వారు సావకాశమిస్తారు! నిజానికి బైబిలు తమ స్నేహాలను “విశాలపరచు”కొనుమని క్రైస్తవులను ప్రోత్సహిస్తుంది. (2 కొరింథీయులు 6:13) కాబట్టి ఒక స్నేహితుడు ఇది చేసినప్పుడు, ఆయనను లేక ఆమెను యథార్థతలేని వారిగా దృష్టించాల్సిన అవసరం లేదు.
నిజానికి, ఎవరైనా ఒక్క వ్యక్తిపై అతి ఎక్కువగా ఆధారపడడమనేది మంచి ఆలోచన కాదు. (కీర్తన 146:3) మీ తలిదండ్రులతో, పెద్దలతో, మరితర శ్రద్ధగల, బాధ్యతగల పెద్దవయస్కుల వంటివారితో, మీ సమానవయస్కులు గల గుంపుకు వెలుపలి వ్యక్తులతో స్నేహాలను పెంపొందించుకోవడం తెలివితో కూడిన పని. ఆనా ఆసక్తిగా వివరిస్తుంది: “నా తల్లి నాకు మంచి స్నేహితురాలు. దేనిగురించి అయినా మరి ప్రతీదాని గురించి నేను ఆమెతో మాట్లాడగలను.”
నిలిచే స్నేహాలను ఆనందించవచ్చు!
1 పేతురు 3:8లో బైబిలిలా చెబుతుంది: “తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునైయుండుడి.” అవును, దయను, అనురాగాన్ని, నైతిక యథార్థతను, ఇతరుల ఎడల యథార్థమైన అవధానాన్ని చూపండి, అలాగైతే మీరు ఎల్లప్పుడూ స్నేహితులను ఆకర్షిస్తారు! అయితే, కొనసాగే స్నేహాలకు శ్రమ, దృఢ సంకల్పం అవసరమౌతాయి. కానీ ప్రతిఫలాలు వాటిని ఆ ప్రయత్నానికి తగినవిగా చేస్తాయి.
ఆసక్తికరంగా దావీదు, యోనాతానుల గురించి బైబిలు చెబుతుంది. వారు అత్యంత విశిష్టమైన స్నేహాన్ని అనుభవించారు. (1 సమూయేలు 18:1) వారు స్వల్పమైన అసూయకు, వ్యక్తిత్వ లోపాలకు అతీతంగా ఉన్నారు. దావీదు, యోనాతానులు ఇద్దరూ యెహోవా దేవునితో స్నేహాన్ని, ఆయన ఎడలగల యథార్థతను అన్నింటికీ పైగా ఉంచారు గనుక ఇది సాధ్యమైంది. మీరూ అదే చేయండి, దేవునికి భయపడే స్నేహితులను కాపాడుకోవడంలో మీకంత సమస్య ఉండదు మరి!
[25వ పేజీలోని చిత్రాలు]
ఇతర స్నేహితులను కలిగివుండడం యథార్థత లేకపోవడమని ఒకరు భావించినప్పుడు స్నేహాలు తరచూ విచ్ఛిన్నమైపోతుంటాయి