రాజ్య ప్రచారకుల నివేదిక
“లోకమందు జ్యోతులవలె” ప్రకాశించుట
యెహోవాసాక్షులు విశేషమైనవారిగా ఉంటారు మరియు వారు రక్తమార్పిడిని నిరాకరించినందున తరచూ చెడు ప్రచారానికి గురౌతారు. అయితే ఈ దృక్పథం బైబిలుపై దృఢంగా ఆధారపడినది. దేవుని దృష్టికి రక్తం అమూల్యమైనది గనుక రక్తాన్ని దుర్వినియోగ పర్చడాన్ని ఆయన ఖండిస్తున్నాడని ఇది చూపిస్తుంది. (ఆదికాండము 9:3, 4; లేవీయకాండము 17:14) ఈ విషయంపై లేఖనాలను పరిశీలించడం ద్వారా, ‘రక్తాన్ని విసర్జించమని’ బైబిలు ఇస్తున్న ఆజ్ఞలో రక్తమార్పిడి అనే ఆధునిక ఆచారం కూడా స్పష్టంగా చేరివుందని యెహోవాసాక్షులు తీర్మానిస్తారు.—అపొస్తలుల కార్యములు 15:19, 20, 28, 29.
ఇటీవలి సంవత్సరాల్లో, వైద్య విజ్ఞాన వర్గానికి చెందిన సభ్యులు, అలాగే కొన్ని దేశాల్లోని కోర్టులు ఈ విషయంలో యెహోవాసాక్షులకు మద్దతునిచ్చాయి. ఉదాహరణకు, డెన్మార్క్‌లో, రక్తం విషయంలో బైబిలు దృక్కోణం గురించి ఎరిగివున్న యౌవనస్థురాలైన ఒక తల్లి, వాహన సంబంధమైన దుర్ఘటన మూలంగా మరణించింది. రక్తమార్పిడికి ఆమె అంగీకరించకపోవడంవల్ల, ఆమె వైద్యులు యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా ప్రచారమాధ్యమాల ద్వారా ఒక నెలరోజుల పాటు కొనసాగిన నిరసన ప్రచారాన్ని రేకెత్తించారు.
ఆ యౌవనస్థురాలి తలిదండ్రులు విచారణ కొరకు కోరారు, 1994 ఏప్రిల్‌లో డెన్మార్క్ యొక్క రోగుల ఫిర్యాదుల కమీషన్ ఒక తీర్మానాన్ని ప్రకటించింది. రోగి మరణించింది రక్తాన్ని నిరాకరించినందుకు కాదుగాని, చికిత్సా లోపం వల్లనని అది తెలియజేసింది. న్యాయ వైద్యశాస్త్ర బోర్డు మరియు ఆరోగ్య అధికారులు చేసిన పరిశోధనల ఆధారంగా తీర్మానం జరిగింది. డెన్మార్క్‌లోని అన్ని ఆరోగ్య పరిరక్షణ కేంద్రాలకు జాతీయ ఆరోగ్య బోర్డు వ్రాసిన ఒక పత్రం, రక్తం ఎక్కించుకోవడాన్ని గూర్చిన యెహోవాసాక్షుల నిరాకరణను పరిగణలోకి తీసుకుంటూ, అందుబాటులోవున్న శ్రేష్ఠమైన ప్రత్యామ్నాయ చికిత్సను వారికి అందజేయాలని తెలియజేసింది.
మరో కేసు, లుకేమియా మూలంగా మరణించిన 15 సంవత్సరాల డాన్ అనే సాక్షికి సంబంధించినది. ఈ కేసులో, రక్తమార్పిడిని నిరాకరించడానికి డాన్ తీసుకున్న ధైర్యంతో కూడిన నిర్ణయాన్ని వైద్యులు గౌరవించారు. దీని ఫలితంగా వార్తాపత్రికలలో విస్తృతమైన ప్రచారం జరిగింది, దానిలో డాన్ మరణానికి వైద్యులు కారణమని ప్రచార మాధ్యమాలు నిందించాయి. అయితే, అనేకులు ఈ ప్రతికూల ప్రచారంతో ఏకీభవించలేదు.
ఉదాహరణకు, డాన్ చదువుకుంటుండిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజ్యమందిరంలో జరిగిన అంత్యక్రియల ప్రసంగానికి హాజరయ్యాడు. డాన్ మరణాన్ని గూర్చిన అన్యాయమైన వార్తా ప్రచారం గురించి ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. సహోద్యోగియైన సాక్షిని యెహోవాసాక్షుల గురించి అనేక ప్రశ్నలు అడిగిన తర్వాత, ఆయన యెహోవాసాక్షులు—ఆ నామము వెనుకనున్న సంస్థ (ఆంగ్లం) అనే వీడియో టేపును తీసుకున్నాడు. ఆ వీడియో ఆయనను ఎంతగా ప్రభావితం చేసిందంటే, పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ దాన్ని చూడడానికి ఆయన ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత, ఒక్కో తరగతికి ఒకసారి చొప్పున మొత్తం విద్యార్థులందరికీ ఆ వీడియో చూపించబడింది.
డాన్‌కు వైద్యం చేసిన వైద్యులకు ఎదురైన చెడు ప్రచారాన్ని డెన్మార్క్ యొక్క ఆరోగ్యశాఖ మంత్రి కూడా అంగీకరించలేదు. డాన్ యొక్క పరిపక్వతగల నిర్ణయాన్ని, సుస్థాపితమైన విశ్వాసాన్ని గౌరవించడంలో వైద్యులు సరైన పని చేశారని ఆయన అన్నాడు.
దేవుని ఆజ్ఞలకు విధేయత చూపే రాజ్య ప్రచారకులు లక్షలాదిమంది ఉన్నారు. వారు తమ విధేయత మూలంగా, “లోకమందు జ్యోతులవలె” ప్రకాశిస్తూ ప్రత్యేకంగా ఉంటారు.—ఫిలిప్పీయులు 2:12, 15, 16.