క్రైస్తవులెట్లు వృద్ధులకు సహాయపడగలరు
“మేము అధైర్యపడము; మా బాహ్యపురుషుడు కృశించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము . . . ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు” అని అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు తాను వ్రాసిన రెండవ పత్రికలో అన్నాడు.—2 కొరింథీయులు 4:16-18.
ప్రాచీన కాలాల్లో, విశ్వాసులైన స్త్రీపురుషులు అదృశ్యమైన వాటిపై తమ దృష్టినిల్పారు, వాటిలో తమ దేవుడైన యెహోవా తగిన కాలంలో చేస్తానని వాగ్దానం చేసిన సమస్తం యిమిడివుండెను. మరణ పర్యంతం తమ విశ్వాసాన్ని కాపాడుకున్న హెబ్రీయులను గూర్చి పౌలు చాలా ఉన్నతంగా మాట్లాడాడు. అట్టివారిలో కొందరు బహు వృద్ధులయ్యేంత వరకు జీవించారు. వారు మనకు మాదిరిగా ఉన్నారని సూచిస్తూ ఆయనిట్లన్నాడు: “వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి . . . విశ్వాసముగలవారై మృతినొందిరి.”—హెబ్రీయులు 11:13.
ఈ వాగ్దానముల నెరవేర్పుకు నేడు మనం అతి సమీపంగా ఉన్నాము. అయితే ఈ దుష్ట విధానాంతమును తాము వ్యక్తిగతంగా చూస్తామని కచ్చితంగా భావించని రోగులు వృద్ధులు మనమధ్య ఉన్నారు. తమ జీవిత కాలంలో సమస్త వాగ్దానాల నెరవేర్పు చూడకుండానే వీరిలో కొందరు విశ్వాసముగలవారై మృతినొందవచ్చు. అటువంటి వారికి పైన పేర్కొనబడిన 2 కొరింథీయులు 4:16-18 నందలి పౌలు మాటలు బహు ప్రోత్సాహకరంగా ఉండగలవు.
రోగులు, వృద్ధులతో సహా యెహోవా తన యథార్థ సేవకులందరిని జ్ఞాపకముంచుకుంటాడు. (హెబ్రీయులు 6:10) బైబిలునందు అనేక స్థలాల్లో విశ్వాసులైన వృద్ధులను గూర్చి ఘనంగా చెప్పబడింది, మోషే ధర్మశాస్త్రంలో వృద్ధులను ఘనపర్చాలని ప్రత్యేకంగా చెప్పబడింది. (లేవీయకాండము 19:32; కీర్తన 92:12-15; సామెతలు 16:31) తొలి క్రైస్తవుల మధ్య వృద్ధులను చాలా గౌరవంగా చూసేవారు. (1 తిమోతి 5:1-3; 1 పేతురు 5:5) వృద్ధురాలైన తన అత్తయెడల ప్రేమపూర్వకమైన శ్రద్ధను, స్ఫూర్తిదాయకమైన స్వయం త్యాగం చూపిన ఒక యౌవన స్త్రీని గూర్చిన చక్కని వర్ణన ఒక బైబిలు పుస్తకంలో ఉంది. ఆ పుస్తకానికి యుక్త రీతిలో ఆ యౌవన స్త్రీ పేరు, అనగా రూతు అని పేరుపెట్టబడింది.
అంకితభావంగల సహాయకారి
వృద్ధురాలౌతున్న నయోమీకి జీవితం కష్టంగా తయారయ్యింది. కరవు ప్రబలడంతో యూదాలో స్నేహితుల్ని, తమకున్న ఆస్తిని విడిచిపెట్టి వారి చిన్నకుటుంబం యొర్దానుకు తూర్పునగల మోయాబు దేశానికి తరలివెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ భర్త చనిపోవడంతో ఇద్దరు మగపిల్లలతో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. యుక్త కాలమున వీరు పెరిగి వివాహాలు చేసుకున్నారు గాని ఎంతోకాలం కాకముందే వారుకూడ చనిపోయారు. ఇప్పుడు నయోమిని చూసే వారసులే లేకుండా పోయారు.
క్రొత్త జీవితం ఆరంభిద్దామంటే ఆమె ఇప్పుడు వృద్ధురాలు, పైగా ఎక్కువ సంవత్సరాలు జీవించే ఆశలేదు. నిస్వార్థంగా ఆమె విధవరాండ్రైన తన కోడళ్లగు రూతు, ఓర్పాలు తమ తల్లుల ఇండ్లకు తిరిగివెళ్లిపోతే వారు పెండ్లిచేసుకోవచ్చునని కోరింది. తనొక్కతే తన స్వదేశం వెళ్లిపోతానంది. నేడు కూడ, కొంతమంది వృద్ధులు, ప్రత్యేకంగా తమకు ప్రియమగు వారు మరణిస్తే అలా మానసికంగా కృంగిపోవచ్చు. నయోమి వలెనే, వారిని ఎవరో ఒకరు చూడాలి, అయితే తామెవరికి భారం కాకూడదనే వారు కోరుకుంటారు.
అయితే, రూతు తన అత్తను విడిచివెళ్లలేదు. ఆమె ఈ వృద్ధురాలైన నయోమిని, ఆమె ఆరాధించిన దేవుడగు యెహోవాను ప్రేమించింది. (రూతు 1:16) కావున వారిద్దరు కలిసి యూదాకు ప్రయాణమయ్యారు. ఆ దేశంలో యెహోవా ధర్మశాస్త్రం క్రింద బీదవారు కోత ముగిసిన తర్వాత పొలాల్లో వదిలివేయబడిన పరిగే ఏరుకునే లేదా ధాన్యం సమకూర్చుకునే ప్రేమగల ఏర్పాటువుండెను. యౌవనురాలైన రూతు ‘నేనూ పొలములోనికి పోయెదనని’ చెబుతూ ఈ పనిచేయడానికి ఇష్టపూర్వకంగా ముందుకువెళ్లింది. వారిద్దరి ప్రయోజనార్థమై ఆమెక్కడ అలయక పనిచేసింది.—రూతు 2:2, 17, 18.
క్రియాత్మకంగా, క్షేమాభివృద్ధికరంగా ఆలోచించుట కారంభించిన నయోమికి యెహోవా యెడల రూతు చూపిన విశ్వాస్యత, ప్రేమ ఒక బలమైన ప్రోత్సాహముగా ఉండెను. తనకు తెలిసిన ధర్మశాస్త్రం, ఆ దేశపు కట్టుబాట్లు ఇప్పుడు ఉపయోగపడగలవు. బంధువు ధర్మంచొప్పున వివాహం చేసుకుంటే తమ కుటుంబ స్వాస్థ్యం తిరిగి సంపాదించవచ్చునని, ఆలాగే కుమారుని కని తమ వంశాన్ని కాపాడవచ్చునని ఆమె అంకిత భావంతో తనకు సహాయపడుతున్న ఆ యౌవనురాలికి చక్కని సలహానిచ్చింది. (రూతు 3వ అధ్యాయం) రోగులు, వృద్ధులయెడల శ్రద్ధచూపడానికి త్యాగంచేయు వారికి రూతు ఒక చక్కని మాదిరి. (రూతు 2:10-12) నేడు సంఘమందు అదే ప్రకారం రోగులకు, వృద్ధులకు సహాయం చేయడానికి ఎంతో చేయవచ్చును. ఎలా?
వ్యవస్థీకరణ ఎంతో విలువైనది
తొలి క్రైస్తవ సంఘమందు వస్తుదాయక మద్దతు నివ్వవలసిన విధవరాండ్ర పట్టిక ఉంచబడేది. (1 తిమోతి 5:9, 10) అదేవిధంగా నేడు, కొన్ని సందర్భాల్లో పెద్దలు ప్రత్యేక శ్రద్ధనివ్వాల్సిన రోగుల, వృద్ధుల పట్టికను తయారుచేయవచ్చు. కొన్ని సంఘాల్లో దీనినొక ప్రత్యేక బాధ్యతగా ఒక పెద్దకు పని అప్పగిస్తున్నారు. నయోమి వలెనే చాలామంది వృద్ధులు సహాయం అర్థించడానికి ప్రయత్నించనందున, అట్టి సహోదరుడు పరిస్థితిని విశ్లేషించడంలో నైపుణ్యతను ప్రదర్శించి అనగా యుక్తిగా, వివేచనాయుక్తంగా వారికి అవసరమైనవి చేయబడేటట్లు చూడాలి. ఉదాహరణకు, ఆయన రాజ్యమందిరంలో రోగులకు, వృద్ధులకు తగిన ఏర్పాట్లు ఉన్నాయా లేదాని చూడగల్గాలి. ఆచరణయోగ్యమైతే వీల్ఛైర్స్ కొరకు చదునైన దారి, సరైన విశ్రాంతి గది, సరిగా వినలేని వారికి ఇయర్ఫోన్లు, ప్రత్యేక కుర్చీల కొరకు కొంతస్థలం ఏర్పాటుచేయడం వంటి విషయాలను గూర్చి ఆయన ఆలోచించవచ్చును. ఆలాగే ఈ సహోదరుడు రాజ్యమందిరానికి రాలేని వారందరు కూటముల కార్యక్రమం రికార్డు చేయబడిన టేపును తీసుకెళ్లడానికి లేదా టెలిఫోను ద్వారా వాటిని వినగల ఏర్పాటుకూడా చేయవచ్చును.
కూటములకు, సమావేశములకు రవాణా ఏర్పాటుచేయడాన్ని కూడా వ్యవస్థీకరించే అవసరం కూడా ఉండొచ్చు. తనను క్రమంగా కూటములకు తీసుకొచ్చే సహోదరి అందుబాటులో లేనందున ఒక సహోదరి సమస్య నెదుర్కోవాల్సి వచ్చింది. తనను తీసుకెళ్లడానికి ఎవరికైనా వీలవుతుందా తెలుసుకోవడానికి ఆమె చాలామందికి ఫోన్ చేయాల్సొచ్చింది చివరకు ఎవరో ఒప్పుకున్నారు గాని తను భారమయ్యానేమోనని ఆమె తలంచింది. అట్టి విషయాలన్నీ చూసే ఒక పెద్దను ఏర్పాటుచేసుంటే ఆమె కలతను ఆయన దూరం చేసివుండేవాడు.
వృద్ధులను తలా ఒకసారి సందర్శించగలరేమో చూడుడని ఈ పెద్ద వివిధ కుటుంబాల వారిని కూడా అడుగగలడు. ఈ విధంగా పిల్లలు వృద్ధుల యెడల శ్రద్ధ చూపడం తమ క్రైస్తవ జీవితంలో భాగమని నేర్చుకుంటారు. ఈ బాధ్యత చేపట్టడాన్ని పిల్లలు నేర్చుకొనుట మేలు. (1 తిమోతి 5:4) ఒక ప్రాంతీయ కాపరి యిలా చెబుతున్నాడు: “నా అనుభవంలో చాలా కొద్దిమంది పిల్లలు లేదా యౌవనులు స్వంతగా వృద్ధులను లేదా రోగులను సందర్శిచడం నేను చూశాను.” బహుశ వారా విషయాన్ని గూర్చి తలంచకపోవచ్చు లేదా తామేమి చేయాలి లేదా చెప్పాలో వారికి తోచకపోవచ్చు; తలిదండ్రులు దీనిని వారికి నేర్పవచ్చును.
చాలామంది వృద్ధులు తమ దగ్గరకొక స్నేహితుడు సందర్శిస్తున్నాడని ముందుగానే తెలుసుకోవడాన్ని అభినందిస్తారని గుర్తుంచుకోండి. ఒక సందర్శకుని కొరకు ఎదురుచూడ్డం వారి ఆనందాన్ని ఇనుమడింపజేస్తుంది. వచ్చే సందర్శకులు కాఫీ, కేక్ వంటి తినేపదార్థాలు తెచ్చి, ఆ తర్వాత వెంటనే ఇల్లంతా శుభ్రంచేస్తే వృద్ధులపై అదనపు భారం పడకుండా ఉంటుంది. ఇంకా చురుకుగావున్న ఒక వృద్ధ దంపతులు ప్రతివారం ఒకరోజు క్రమం తప్పకుండా ఒక చిన్న పిక్నిక్ బాస్కెట్లో తినడానికి కావల్సినవన్నీ పెట్టుకుని సంఘమందున్న ఇతర వృద్ధులను వరుసగా సందర్శిస్తుంటారు. వారి సందర్శనలు బహుగా అభినందింపబడుచున్నవి.
వృద్ధుల ప్రయోజనార్థమై, అనేక సంఘాలు పగటిపూటే సంఘ పుస్తక పఠనం జరుపుకునే ఏర్పాటుచేశాయి. ఒక స్థలంలో అట్టి గుంపుకు మద్దతు నివ్వడానికి వారికి వీలవుతుందా, వారిష్టపడుతున్నారా అని కొన్ని కుటుంబాల్ని, ఒంటరిగానున్న ప్రచారకులను అడగడం జరిగింది, దాని ఫలితంగా ఒకరియెడల ఒకరు శ్రద్ధచూపుకునే వృద్ధులు యౌవనులుగల ఒక పుస్తక పఠన గుంపు ఏర్పడింది.
ఈ రంగమందు చొరవ తీసుకోవడాన్ని కేవలం పెద్దలకు మాత్రమే వదిలివేయకూడదు. మనమందరము కూడ రోగులు, వృద్ధుల అవసరతల్ని కనిపెట్టువారమై యుండాలి. రాజ్యమందిరంలో వారిని పలకరించి, వారితో మాట్లాడటానికి మనం సమయం తీసుకోవచ్చును. ఒకసారి ఇంటికి రావల్సిందిగా వారిని పిలువవచ్చును. లేదా మనతోపాటు పిక్నిక్కు లేదా సెలవుల్లో మనతో గడపడానికి రమ్మని వారిని ఆహ్వానించవచ్చును. ఒక సాక్షి వ్యాపారం నిమిత్తం వేరే ఊరికి వేళ్లేటప్పుడు కారులో తనతోపాటు వృద్ధ ప్రచారకులను తరచు తీసుకెళ్తాడు. తామింకా కావల్సిన వారమేనని వృద్ధులు భావించునట్లు వారికి సహాయం చేయడం ప్రాముఖ్యము. నాకేం ఫరవాలేదని చెప్పజూచిన నయోమి వలె వారు మనల్ని నివారించడానికి అనుమతించవద్దు, అలా వారిని వదిలివేయడం వృద్ధులు కావడాన్ని లేదా వార్ధక్య సమస్యల్ని వేగిరపరుస్తుంది.
వికలాంగులైన లేదా రోగగ్రస్థులైన యౌవనుల యెడల కూడా శ్రద్ధచూపాలి. చికిత్సలేని జబ్బుగల ముగ్గురు కుమారుల్లో ఇద్దరు చనిపోయిన తర్వాత ఒక సాక్షి యిలా అంటున్నాడు: “దీర్ఘకాలముండే జబ్బుగల వారియెడల నిర్విఘ్నంగా శ్రద్ధచూపాలంటే సంఘానికది చాలా కష్టంగా ఉంటుంది. జబ్బుపడి మంచానపడ్డ తమ స్నేహితునికి ప్రతిదినం దినవచనాన్ని చర్చించి, బైబిలు నుండి ఒక అధ్యాయం చదవడానికి నమ్మకమైన యౌవన ప్రచారకులను ఎందుకు ఏర్పాటుచేయకూడదు? పయినీర్లతో సహా యౌవనులు వంతులవారీగా అలాచేయవచ్చు.”
మరణం తప్పదని అనిపించినప్పుడు
యెహోవా సేవకులు ఎల్లప్పుడు అది రోగంవల్లగాని లేదా హింసవల్లగాని ధైర్యంగా మరణాన్ని ఎదుర్కొన్నారు. వ్యధకు గురైనవారు తమకు మరణం సమీపించినదని భావింప నారంభించినప్పుడు, వారు వివిధ రీతుల భావావేశాలను అనుభవించడం సహజం. వారి మరణం తర్వాత, వారి బంధువులు కూడ దుఃఖంలోవుండి ఆ తర్వాత నెమ్మదిగా కుదుటపడి, సర్దుకుంటారు. కాబట్టి రోగియైన వ్యక్తి యాకోబు, దావీదు, పౌలువలె బాహాటంగా మరణాన్ని గూర్చి మాట్లాడ్డం మంచిదే.—ఆదికాండము 48, 49 అధ్యాయాలు; 1 రాజులు 2:1-10; 2 తిమోతి 4:6-8.
వైద్యుడైన ఒకసాక్షి యిలా వ్రాస్తున్నాడు: “ఈ విషయంలో మనం నిర్భయంగా ఉండాలి. ఆ వ్యక్తికి మరణం తప్పదనే వాస్తవాన్ని చెప్పకుండా ఉండుట రోగికి ఎదైనా మేలుచేయడాన్ని నా వృత్తిలో నేనెన్నడూ చూడలేదు.” ఏమైనప్పటికిని, రోగి తానుగా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నాడు, అతడు ఎప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాడనేది మనం అర్థం చేసుకోవాలి. మరణం సమీపమైందని తమకు తెలుసని ఈ విషయమై తమ తలంపులను, భావాలను చర్చించాలని కొంతమంది రోగులు స్పష్టంగా సూచిస్తారు. మరికొందరు తామింకా బ్రతుకుతామనే ఆశిస్తుంటారు, కాబట్టి వారి స్నేహితులు కూడా అట్టి ఆశను వ్యక్తపర్చడం యుక్తం.—రోమీయులు 12:12-15 పోల్చండి.
మరణశయ్యపై నున్నవ్యక్తి తీవ్ర అలసటతో లేదా ఆందోళనతో ఉంటాడు కావున ప్రార్థించుట అతనికి కష్టంగా ఉంటుంది. దేవుడు వారి “ఉచ్చరింప శక్యముకాని మూలుగులను” అర్థం చేసుకుంటాడని చెప్పే రోమీయులు 8:26, 27 నుండి నేర్చుకొనుట ద్వారా అట్టి రోగి బహుశ ఓదార్పు పొందవచ్చు. అంతటి వత్తిడి క్రిందనున్న వ్యక్తికి ప్రార్థనకు మాటలు దొరకుట కష్టమని యెహోవాకు తెలుసు.
సాధ్యమైనప్పుడు, రోగితో కలిసి ప్రార్థించుట ప్రాముఖ్యము. ఒక సహోదరుడు యిలా వివరిస్తున్నాడు: “మా అమ్మ చనిపోయే సమయానికి నోరు మెదపలేని స్థితికొచ్చింది, అప్పుడామె మేము తనతోకూడ ప్రార్థించాలని తన చేతులు ముడిచి చూపించింది. ప్రార్థన తర్వాత మేమొక రాజ్య కీర్తన పాడాము, ఎందుకంటే మా అమ్మకు సంగీతమంటే చాలా ప్రియం. మొదట మేము కూనిరాగాలతో పాడినా ఆ తర్వాత పదాలతో నెమ్మదిగా ఆ పాట పాడాము. ఆమె చాలా సంతోషించింది. యెహోవాసాక్షులుగా మన జీవితానికి సంబంధించిన ఈ పాటలు నిస్సందేహంగా, ఇతరత్రా మాటలతో వ్యక్తపర్చలేనంత భావగర్భితంగా ఉంటాయి.”
చనిపోయే వ్యక్తితో మాట్లాడ్డానికి ప్రేమ, యుక్తి, భావప్రకటన అవసరం. సందర్శించే వ్యక్తి తాను ప్రస్తావించాలనుకున్న క్షేమాభివృద్ధికరమైన, విశ్వాసాన్ని బలపరిచే మాటల్ని సిద్ధపడి వెళ్లవచ్చును, ఆలాగే అతడు ఇతరులను గూర్చి వారి సమస్యలను గూర్చి ప్రతికూలముగా మాట్లాడకుండా జాగ్రత్తపడాలి. అంతేకాకుండ, సందర్శనా సమయాన్ని సమంజసమైన, సరియైన కాలానికి కుదించుకోవాలి. రోగి అపస్మారక స్థితిలోవున్నట్టు అన్పించిననూ, అతడు చెప్పే విషయాలు వినగలిగే స్థితిలోనే ఉండవచ్చునని గుర్తుంచుకోవడం మంచిది. కాబట్టి మీరు మాట్లాడే విషయాలను గూర్చి జాగ్రత్తగా ఉండండి.
మనం భాగం వహించే బాధ్యత
రోగుల, వృద్ధుల యెడల శ్రద్ధ వహించడం ఒక బరువైన బాధ్యత. రోగి సమీప బంధువులకు భౌతికంగా, మానసికంగా ఆ బాధ్యత మరింత ఎక్కువ ఉంటుంది. సంఘమందలి ఇతర సభ్యులు అర్థంచేసుకొని, వారికి సహాయం చేయడం అవసరం, దానికి వారు అర్హులే. రోగులైన కుటుంబ సభ్యుల లేదా తోటి విశ్వాసులయెడల శ్రద్ధ కనబరచువారు కొన్నిసార్లు కూటములకు రాలేకపోయిననూ లేదా ప్రాంతీయ సేవలో వారి భాగం తగ్గిపోయిననూ వారుచేసేది మంచిపనే. (1 తిమోతి 5:8 పోల్చండి.) అర్థం చేసుకునే సంఘ దృక్పథాన్నిబట్టి వారు బలపర్చబడతారు. ఒక సహోదరుడు లేదా సహోదరి తాత్కాలికంగా కొన్నిసార్లు సహాయం చేయగల్గినట్లయితే, రోగియెడల శ్రద్ధ చూపుతున్న అట్టి వ్యక్తి కూటానికి హాజరగుటకు లేదా కొన్ని గంటలపాటు ప్రకటించు సేవచేయుటకు ఆనందిస్తాడు.
మీరే ఆ రోగియైనట్లయిన మీరు కూడ కొంత చేయవచ్చును. మీ బలహీనతకు సంబంధించిన నిరాశా, నిస్సహాయత మీలో నిర్లిప్తత నింపవచ్చు, అయితే ఆ నిర్లిప్తత ఒక వ్యక్తిని ఒంటరివాన్నిచేసి ఇతరులను దగ్గరకు రానీయకుండా చేస్తుంది. దానికి బదులుగా మీరు హర్ష్యం వ్యక్తపరచి, సహకరించవచ్చు. (1 థెస్సలొనీకయులు 5:18) బాధలోనున్న ఇతరుల కొరకు ప్రార్థించండి. (కొలొస్సయులు 4:12) బైబిలు నందలి అద్భుతమైన సత్యాల్ని ధ్యానిస్తూ, సందర్శించ వచ్చేవారితో వాటిని చర్చించండి. (కీర్తన 71:17, 18) విశ్వాసాన్ని బలపరిచే దేవుని ప్రజల అభివృద్ధిని ఎప్పటికప్పుడు ఆసక్తితో తెలుసుకుంటూ ఉండండి. (కీర్తన 48:12-14) ఈ సంతోషదాయకమైన అభివృద్ధికి యెహోవాకు కృతజ్ఞత చెల్లించండి. అటువంటి విషయాల్ని ధ్యానించుట మధ్యాహ్నపు సూర్యునికంటే అస్తమించు సూర్యుడిచ్చు చక్కని, వెచ్చని వెలుగునుపోలి మన జీవిత చివరి కాలానికది రమ్యతను చేకూరుస్తుంది.
ప్రత్యేకంగా పరీక్షా సమయాల్లో శిరస్త్రాణంవలె మన మనస్సును సంరక్షించే నిరీక్షణను కాపాడుకొనుటకు మనం గట్టిగా పోరాడాలి. (1 థెస్సలొనీకయులు 5:8) పునరుత్థాన నిరీక్షణను, అది కలిగివున్న బలమైన పునాదిని గూర్చి ధ్యానించుట మంచిది. వృద్ధాప్యం కారణంగా కలిగే రోగం బలహీనత గతించిపోయే రోజు కొరకు నిశ్చయతతో ఆసక్తిగా అపేక్షిస్తూ మనం ముందుకు చూడగలము. అప్పుడు, ప్రతివారు ఆరోగ్యంగా ఉంటారు. చనిపోయిన వారు సహితం సజీవులౌతారు. (యోహాను 5:28, 29) ఈ “అదృశ్యమైనవాటిని” మనం మన విశ్వాస, మనో నేత్రాలతో చూస్తున్నాము. వాటిని గూర్చిన దృష్టి నెన్నటికిని కోల్పోకండి.—యెషయా 25:8; 33:24; ప్రకటన 21:3, 4.