కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 9/1 పేజీలు 21-26
  • క్రైస్తవ కుటుంబము వృద్ధులకు సహాయముచేయును

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రైస్తవ కుటుంబము వృద్ధులకు సహాయముచేయును
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు కాలాల్లో వృద్ధులయందు శ్రద్ధవహించుట
  • శ్రద్ధచూపుటకు ఎవరు అర్హులు?
  • వృద్ధులైనవారికొరకు శ్రద్ధవహించడంలో కుటుంబ పాత్ర
  • శ్రద్ధతీసుకొనడంలో సంఘపాత్ర
  • సంఘానికి సొగసైన సంపద
  • వృద్ధులపట్ల శ్రద్ధ తీసుకోవడం—క్రైస్తవ బాధ్యత
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • దేవుడు వృద్ధులపట్ల శ్రద్ధ చూపిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • క్రైస్తవులెట్లు వృద్ధులకు సహాయపడగలరు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • వృద్ధులైన తన సేవకులను యెహోవా వాత్సల్యంతో సంరక్షిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 9/1 పేజీలు 21-26

క్రైస్తవ కుటుంబము వృద్ధులకు సహాయముచేయును

“వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము; నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము.”—కీర్తన 71:9.

1. అనేక సంస్కృతులలో వృద్ధులను ఎలా చూడటం జరుగుతుంది?

“హింసకు గురౌతున్న వృద్ధులలో దాదాపు ఏడుగురిలో ఆరుమంది (86%) తమ స్వంత కుటుంబములచే సరిగా చూడబడటంలేదని” సర్వేలుచూపుతున్నట్లు ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ చెప్పింది. మోడరన్‌ మెచ్యూరిటి అనే పత్రిక ఇలా తెల్పింది: “ఈనాడు వృద్ధులను హింసించడం మూలంగా చెలరేగుతున్న కుటుంబ దౌర్జన్యమే దేశములోని వార్తాపత్రిక పేజీలన్ని నిండిపోతున్నట్లు చేస్తున్నది.” ఔను, అనేక సంస్కృతులలో వృద్ధులు తీవ్ర హింసకు నిర్లక్షానికి గురౌతున్నారు. మన కాలము నిజంగా అనేకులు “స్వార్థ ప్రియులు, . . . కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితు” లైయున్న కాలము.—2 తిమోతి 3:1-3.

2. హెబ్రీ లేఖనముల ప్రకారం, యెహోవా వృద్ధులను ఎలా దృష్టించును?

2 అయితే, ప్రాచీన ఇశ్రాయేలులోని వృద్ధులు అలా చూడబడలేదు. ధర్మశాస్త్రము ఇలా తెల్పుతుంది: “తలనెరసిన వానియెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను.” ప్రేరేపణవలన కలిగిన జ్ఞానయుక్తమైన సామెతల గ్రంథము మనకిలా ఉపదేశిస్తుంది: నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.” అది ఇలా ఆజ్ఞాపిస్తుంది: “నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. నీ తల్లి చెప్పుబోధను త్రోసివేయకుము.” మోషే ధర్మశాస్త్రము వృద్ధులైన స్త్రీ, పురుషులను గౌరవించి వారియెడల మర్యాద చూపాలని బోధిస్తుంది. నిశ్చయంగా వృద్ధులు గౌరవించబడాలని యెహోవా కోరుతున్నాడు.—లేవీయకాండము 19:32; సామెతలు 1:8; 23:22.

బైబిలు కాలాల్లో వృద్ధులయందు శ్రద్ధవహించుట

3. వృద్ధుడైన తన తండ్రియెడల యోసేపు ఎలా కరుణను ప్రదర్శించాడు?

3 గౌరవాన్ని కేవలము మాటలయందేగాక, శ్రద్ధగల కార్యాలలోను చూపాలి. యోసేపు వృద్ధుడైన తన తండ్రియెడల గొప్ప కనికరాన్ని చూపాడు. కనానునుండి ఐగుప్తుకు దాదాపు 300 కిలో మీటర్ల దూరము తన తండ్రి ప్రయాణముచేసి రావాలని కోరాడు. అందుకు యోసేపు “తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయుచున్న పది గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండారములను మోయుచున్న పది ఆడు గాడిదలను పంపెను.” అలా యాకోబు గోషెనుకు వచ్చినప్పుడు యోసేపు అక్కడికి వెళ్లి, “అతని మెడమీద పడి అతని మెడ పట్టుకొని యెంతో ఏడ్చెను.” యోసేపు గాఢమైన ఆప్యాయతతో తన తండ్రిని హత్తుకొన్నాడు. వృద్ధుల యెడల చూపు శ్రద్ధకు ఎంతటి ప్రేరేపణాత్మకమైన ఉదాహరణ.—ఆదికాండము 45:23; 46:5, 29.

4. అనుసరించుటకు రూతు ఎందుకు ఒక మంచి మాదిరి?

4 వృద్ధులయెడల చూపు దయకు మరో మంచి మాదిరి రూతు. ఆమె అన్యురాలైనప్పటికి వృద్ధ, విధవరాలైన తన అత్తయగు నయోమి అను యూదురాలిని సన్నిహితంగా అంటిపెట్టుకొని వుండెను. ఆమె తన స్వంత ప్రజలను విడిచిపెట్టి మరో భర్తను చూసుకొనకుండటవలన కలిగే భారాన్ని పైనవేసుకొనెను. నయోమి ఆమెను తన స్వంత ప్రజలయొద్దకు తిరిగి వెళ్లమని ప్రోత్సహించినప్పుడు, బైబిలులో కనపడే కొన్ని అతి చక్కని మాటలలో భాగమైన ఈ మాటలతో రూతు సమాధానమిచ్చింది: “నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లుచోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు; నీవు మృతిబొందు చోటనే నేను మృతిబొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక.” (రూతు 1:16, 17) లేవీ వివాహ పద్ధతిచొప్పున వృద్ధుడైన బోయజును వివాహము చేసుకొనడానికి యిష్టత చూపినప్పుడును రూతు మంచి లక్షణములను ప్రదర్శించెను.—రూతు 2 నుండి 4 అధ్యాయములు.

5. ప్రజలతో మెలగునప్పుడు ఏ లక్షణాలను యేసు కనపర్చాడు?

5 యేసుకూడ ప్రజలతో వ్యవహరించేటప్పుడు అలాంటి మాదిరినే చూపెను. ఆయన ఓర్పు, కరుణ, దయ, ఆదరణాత్మక విశ్రాంతిని కలుగజేశాడు. నడుచుటకు శక్తిలేక 38 సంవత్సరములుగా పడియున్న పేదవాడైన అంగవికలునిపట్ల ఆయన వ్యక్తిగత శ్రద్ధతీసుకొని స్వస్థపరచెను. విధవరాండ్రయెడల శ్రద్ధ కనపరచెను. (లూకా 7:11-15; యోహాను 5:1-9) ఆయన హింసాకొయ్యపై బాధకరమైన మరణమును అనుభవిస్తున్న వేదనలోను, బహుశా తన ఏభై సంవత్సరాల తొలిభాగంలో ఉండిన తన తల్లిని గూర్చి శ్రద్ధతీసుకొనే ఏర్పాటు చేశాడు. వేషధారులైన ఆయన శత్రువులకు తప్ప ఆయన ప్రతి ఒక్కరికి ఆదరణకరంగా సేదతీర్చేవానిగా ఉన్నారు. అందుకే ఆయన ఇలా చెప్పగలిగాడు: “నేను సాత్వికుడను దీనమనస్సుగలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”—మత్తయి 9:36; 11:28, 29; యోహాను 19:25-27.

శ్రద్ధచూపుటకు ఎవరు అర్హులు?

6. (ఎ) ప్రత్యేక శ్రద్ధకు ఎవరు పాత్రులు? (బి) మనలను మనము ఏ ప్రశ్నలను అడుగుకోవాలి?

6 యెహోవా దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు శ్రద్ధతీసుకొనే విషయంలో అటువంటి మాదిరినుంచుతున్నారు గనుక, సమర్పించుకొన్న క్రైస్తవులమైన మనము వారి మాదిరిని అనుసరించుట యుక్తమే. మన మధ్య ఎన్నో సంవత్సరములనుండి భారం మోస్తూ ప్రయాసపడుతున్న వారు కొందరున్నారు—వారు తమ జీవితంలో క్షీణించిపోయే సంవత్సరములలో ప్రవేశించిన వృద్ధులైన సహోదర సహోదరీలు. వారిలో కొందరు మన తల్లిదండ్రులు, లేక తాత, నానమ్మలు లేక అమ్మమ్మలు కావచ్చును. వారిని మనము తేలికగా విలువలేనివారిగా దృష్టించుతామా? వారికి సహాయముచేస్తూ వారియెదుట మన హుందాతనాన్ని తగ్గించుకొని వారికి సేవచేస్తామా? వారికున్న అధిక అనుభవ జ్ఞానాన్ని మనము నిజంగా గుణగ్రహిస్తున్నామా? అవును, కొందరు వృద్ధాప్యంలో సహజంగా వచ్చే ఒక ప్రత్యేక తరహా కోపము, చేసే పొరపాట్లతో మన సహనాన్ని పరీక్షించవచ్చు. నీకై నీవు ఇలా ప్రశ్నించుకో, ‘ఆ పరిస్థితులలో నేను మాత్రం వారి లాగా ప్రవర్తించనా?’

7. వృద్ధులైన వారియెడల సానుభూతిని చూపే అవసరతను ఏ ఉదాహరణ వివరిస్తుంది?

7 ఒక బాలిక వృద్ధులయెడల చూపిన కరుణనుగూర్చి మధ్యప్రాత్యంలోని ఓ కథ హృదయాన్ని ద్రవింపజేస్తుంది. ఓ అమ్మమ్మ వంటగదిలో సహాయంచేస్తూ, పొరపాటున పింగాణి ప్లేటు క్రిందపడవేసింది. ఏదో తెలివితక్కువ పనిచేశానన్నట్లు ఆమె కలవరపడిపోతుంది. ఆమె కూతురు దానికి మండిపోయి, వెంటనే చిన్నబాలికైన తన బిడ్డను పిలిచి మీ అమ్మమ్మకు ఈ సారి పగిలిపోకుండా ఉండే ఒక చెక్క గిన్నె కొని తెమ్మని వెంటనే దుకాణానికి పంపింది. ఈ బాలిక వెళ్లి రెండు చెక్క గిన్నెలు కొని పట్టుకొచ్చింది. తల్లి రెండు ప్లేట్లు ఎందుకు తెచ్చావే అని గట్టిగా అరిచింది. తడబడుతూ ఆ మనమరాలు ఇలా సమాధానమిచ్చింది: “ఒకటి అమ్మమ్మకు మరొకటేమో ముసలిదానివైనప్పుడు నీకు.” అవును ఈ లోకంలో అందరము ముసలివాళ్లమౌతాము. అయితే ఓపిక దయతో చూడబడటాన్ని మనందరము ఇష్టపడమా?—కీర్తన 71:9.

8, 9. (ఎ) మన మధ్యలో ఉన్న వృద్ధులను మనము ఎలా చూడాలి? (బి) ఇటీవల క్రైస్తవులైన కొందరు దేనిని గుర్తుంచు కొనవలసియున్నారు?

8 వృద్ధులైన మన సహోదర సహోదరీలు ఎంతోకాలము నమ్మకంగా క్రైస్తవ సేవచేసిన చరిత్రను కలిగివున్నారని మరిచిపోవద్దు. నిశ్చయంగా వారు మన గౌరవానికి, శ్రద్ధకు, దయాపూర్వక సహాయానికి, ప్రోత్సాహానికి పాత్రులైయున్నారు. జ్ఞాని సరైనరీతిగా ఇలా అన్నాడు: “నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము. అవి నీతి ప్రవర్తనగలవానికి కలిగియుండును.” వారు స్త్రీలైనా లేక పురుషులైనా సరే నెరసిన తలను గౌరవించాలి. ఈ వృద్ధులైన స్త్రీపురుషులలో కొందరు ఇంకా నమ్మకమైన పయినీర్లుగా సేవచేస్తున్నారు. అనేకమంది పురుషులు ఇంకా నమ్మకంగా సంఘములో పెద్దలుగా సేవచేస్తున్నారు. కొందరు ప్రయాణ కాపరులుగా మాదిరికరమైన పనిని చేస్తున్నారు.—సామెతలు 16:31.

9 పౌలు తిమోతికి ఇలా ఉపదేశించాడు: “వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని యౌవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యౌవన స్త్రీలను హెచ్చరించుము.” (1 తిమోతి 5:1, 2) అగౌరవపూర్వకమైన లోకములోనుండి ఇటీవల క్రైస్తవ సంఘములోనికి వచ్చినవారు ప్రత్యేకంగా, ప్రేమపై ఆధారపడిన పౌలు మాటలను హృదయాల్లోకి తీసుకొనవలెను. పిల్లలారా, బహుశా మీరు పాఠశాలలో చూస్తుండే చెడ్డ స్వభావాలను అనుకరించవద్దు. వృద్ధులైన సాక్షులు ఇచ్చే దయగల ఉపదేశాన్ని త్రోసిపుచ్చవద్దు. (1 కొరింథీయులు 13:4-8; హెబ్రీయులు 12:5, 6, 11) అయినా, వృద్ధులైన వారికి అనారోగ్య మూలంగానో, లేక ఆర్థిక సమస్యలవలనో సహాయము అవసరమైతే, వారికి సహాయపడవలసిన ప్రాథమిక బాధ్యత ఎవరికుంది?

వృద్ధులైనవారికొరకు శ్రద్ధవహించడంలో కుటుంబ పాత్ర

10, 11. (ఎ) బైబిలు చెప్పిన ప్రకారము వృద్ధులైనవారినిగూర్చి శ్రద్ధతీసుకొనడంలో ఎవరు ముందు నడిపింపు తీసుకోవాలి? (బి) వృద్ధులనుగూర్చి శ్రద్ధవహించడం ఎల్లప్పుడు అంత సులభం కాదెందుకు?

10 తొలి క్రైస్తవ సంఘములో విధరాండ్రనుగూర్చి శ్రద్ధవహించే విషయంలో సమస్యలు తలెత్తాయి. అయితే అలాంటి అవసరతలను ఎలా తీర్చాలని అపొస్తలుడైన పౌలు సూచించాడు? “నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. అయితే ఏ విథవరాలికైనను పిల్లలుగాని, మనుమలుగాని యుండినయెడల వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవుని దృష్టికి అనుకూలమైయున్నది. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన యింటివారిని, సంరక్షింపకపోయినయెడల వాడు విశ్వాస త్యాగముచేసినవాడై, అవిశ్వాసికన్న చెడ్డవాడైయుండును.”—1 తిమోతి 5:3, 4, 8.

11 అవసరతగల సమయాల్లో, వృద్ధులకు సహాయం చేయడంలో సన్నిహిత కుటుంబ సభ్యులే మొదటివారైయుండాలి.a ఈ విధంగా పెరిగిన పిల్లలు సంవత్సరములుగా తమ తల్లిదండ్రులు వారికి అందించిన ప్రేమ, సేవ, శ్రద్ధపట్ల మెప్పును ప్రదర్శించగలరు. ఇది అంత సులభం కాకపోవచ్చు. మనుష్యులు ముసలివాళ్లయ్యేకొలది సహజంగా నిదానమై పోతారు, కొందరైతే శక్తిహీనులౌతారు కూడ. కొందరు తమ్మునుగూర్చే తలస్తూ, బహుశా దానిని గుర్తెరుగకనే అతిగా కోరుతుంటారు. అయితే చిన్నపిల్లలగా ఉన్నప్పుడు మనంకూడా ప్రతిదీ మనకే కావాలన్నట్లు, అతిగా పట్టుపట్ట లేదా? మన తల్లిదండ్రులు ఆతురతో దగ్గరకువచ్చి మనకు సహాయం చేయలేదా? ఇప్పుడు వారి వృద్ధాప్యంలో పరిస్థితులు మారినవి. కనుక ఇప్పుడు వారికి కావలసిందేమిటి? కరుణ, ఓపిక.—1 థెస్సలొనీకయులు 2:7, 8 పోల్చండి.

12. వృద్ధులనుగూర్చి—క్రైస్తవ సంఘములోని ఇతర అందరినిగూర్చి శ్రద్ధతీసుకొనడానికి ఏ లక్షణాలు అవసరము?

12 అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాసినప్పుడు ఆచరణాత్మకమైన ఉపదేశాన్నిచ్చాడు: “కాగా దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హానిచేసెనని ఒకడనుకొనినయెడల ఒకనినొకడు క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.” ఇటువంటి దయను కనికరాన్ని, ప్రేమను సంఘములోనే చూపవలసివుంటే, మరి కుటుంబములో దానిని మరెక్కువగా చూపవద్దా?—కొలొస్సయులు 3:12-14.

13. వృద్ధులైన తల్లిదండ్రులు తాతయ్యలతో పాటు ఎవరికి కూడ సహాయం అవసరము కావచ్చును?

13 కొన్నిసార్లు ఇటువంటి సహాయం కేవలం మన తల్లిదండ్రులు, తాతయ్యలకేగాక వృద్ధులైన ఇతర బంధువులకు కూడా అవసరం కావచ్చును. పిల్లలు లేని కొందరు వృద్ధులు అనేక సంవత్సరములపాటు మిషనరీ సేవ, ప్రయాణ పరిచర్య, ఇతర పూర్తికాల సేవ చేశారు. వారు నిజంగా తమ జీవితమంతటిలో రాజ్యాసక్తులనే మొదట పెట్టారు. (మత్తయి 6:33) కనుక అటువంటి వారియెడల శ్రద్ధగల స్వభావము చూపుట యుక్తమైంది కాదా? ఈ విషయంలో వాచ్‌టవర్‌ సొసైటి వృద్ధులైన బెతేలు కుటుంబ సభ్యులను చూసే మాదిరి మంచి మనకు ఉన్నది. బ్రూక్లిన్‌లోని బెతేలు ప్రధానకార్యాలయములోను, సొసైటి ఇతర అనేక బ్రాంచిలలోను, అనేకమంది వృద్ధులైన సహోదర సహోదరీల నిమిత్తము ప్రతిదిన శ్రద్ధతీసుకొనేందుకు దీనికొరకు శిక్షణపొంది నియమించబడిన కుటుంబ సభ్యులున్నారు. వీరు వారినిగూర్చి తమ స్వంత తల్లిదండ్రులు లేక తాతయ్యలైనట్లు శ్రద్ధతీసుకొనడంలో సంతోషిస్తున్నారు. అదే సమయంలో వృద్ధుల అనుభవమునుండి వారెంతో నేర్చుకొందురు.—సామెతలు 22:17.

శ్రద్ధతీసుకొనడంలో సంఘపాత్ర

14. వృద్ధులైనవారికి తొలిక్రైస్తవ సంఘములో ఏ ఏర్పాటు చేయబడింది?

14 ఈనాడు పలుదేశాలలో వృద్ధులకు వృద్ధాప్య ఫించను, ఇతర ప్రభుత్వ సంబంధమైన వైద్యసౌకార్యాల ఏర్పాట్లూ ఉన్నవి. క్రైస్తవులు వారికిగల యోగ్యతనుబట్టి ఇలాంటి సౌకార్యాలను పూర్తిగా వినియోగించుకొనవచ్చును. అయితే, మొదటి శతాబ్దములో అటువంటి ఏర్పాట్లు లేవు. అందుచేత అనాథలైన విధవరాండ్రనుగూర్చి శ్రద్ధతీసుకొనేందుకు క్రైస్తవ సంఘమే సరైన చర్యను చేపట్టింది. పౌలు ఇలా సూచించాడు: “అరువది ఏండ్ల కంటె తక్కువ వయస్సు లేక, ఒక్క పురుషునికే భార్యయై సత్‌క్రియలకు పేరుపొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి, పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమపడువారికి సహాయముచేసి, ప్రతి సత్కార్యముచేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును.” ఆవిధంగా వృద్ధులకు సహాయం చేయడంలో సంఘమునకు కూడా పాత్ర ఉందని పౌలు చూపించాడు. విశ్వాసులైన పిల్లలు లేని ఆత్మీయ మనస్సుగల స్త్రీలు అలాంటి సహాయము పొందడానికి అర్హులైయుండిరి.—1 తిమోతి 5:9, 10.

15. ప్రభుత్వ సహాయము పొందేందుకు సహాయం చేయాల్సిన అవసరమెందుకు ఉండవచ్చును?

15 వృద్ధులకు ప్రభుత్వపరంగా సహాయ ఏర్పాట్లున్నచోట, సహజంగా దాన్నిపొందేందుకు ముందు కొంత వ్రాతపూర్వకంగా చేయాల్సిన పని ఉంటుంది. అలాంటి పరిస్థితులలో సంఘములోని అధ్యక్షులు వృద్ధులు దరఖాస్తుచేసేందుకు, దాన్ని పొందేందుకు లేక అట్టి సహాయం మరింత ఎక్కువయ్యేలా చేసేందుకు తగిన సహాయం పొందేలా ఏర్పాటుచేయడం సముచితమే. కొన్నిసార్లు మారిన పరిస్థితులనుబట్టి కూడా పింఛనులో పెరుగుదల ఉండవచ్చు. అలాగున వృద్ధులపట్ల తగిన శ్రద్ధతీసుకోడానికి అధ్యక్షులు వ్యవస్థీకరించగల అనేక ఆచరణాత్మకమైన విషయాలు కూడా గలవు. వీటిలో కొన్ని ఏమిటి?

16, 17. ఏ విభిన్న రీతులలో సంఘములోని వృద్ధులకు మనము ఆతిథ్యమివ్వ వచ్చును?

16 ఆతిథ్యం ఇవ్వడమనేది బైబిలు కాలం నుండి వస్తున్న ఒక ఆచారము. ఈనాటికి కూడా అనేక మధ్యప్రాశ్చ దేశాలలో కొత్తవారికి కనీసం ఒక కప్పు కాఫీ లేక టీ ఇవ్వడం ద్వారానైనా ఆతిథ్యం చూపబడుతుంది. అందుకే పౌలు ఇలా వ్రాయడంలో ఆశ్చర్యంలేదు: “పరిశుద్ధుల అవసరంలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.” (రోమీయులు 12:13) ఆతిథ్యమునకు ఉపయోగించబడిన గ్రీకు పదము ఫి.లోక్సిని’యా అంటే అక్షరార్థంగా “కొత్తవారియెడల (ఇష్టత లేక దయ) ప్రేమ” అనే భావము కలిగివున్నది. క్రొత్తవారియెడల క్రైస్తవుడు ఆతిథ్యమిచ్చేవాడై యుండాలంటే, విశ్వాసములో తనకు సంబంధించినవారియెడల తాను మరెక్కువగా ఆతిథ్యమిచ్చేవాడై ఉండవలదా? భోజనానికి ఆహ్వానించడం సాధారణంగా వృద్ధునికి తన సాధారణ క్రమంలో కొంతమార్పుగా ఉంటుంది. సామాజిక పరంగా మీరు కలుసుకునే సమయాల్లో జ్ఞానము, అనుభవముగల మాటలను వినాలనుకుంటే వృద్ధులనుకూడా పిలవవచ్చును.—లూకా 14:12-14 పోల్చండి.

17 వృద్ధులను ప్రోత్సహించడానికి అనేక మార్గాలున్నవి. మనము రాజ్యామందిరానికి, లేక సమావేశానికి వెళ్లేందుకు ఒక కారు లేక బస్సును ఏర్పాటుచేసుకుంటే తీసుకు వెళ్లేందుకు ఎవరైనా వృద్ధులున్నారా? వాళ్లు అడిగేంతవరకు వేచివుండవద్దు. తీసుకు వెళ్తాము రండి అని మీరే చెప్పండి. మరొక ఆచరణాత్మక సహాయమేమంటే వారికొరకు దుకాణానికి వెళ్లి వస్తువులను కొనుక్కొని రావడం. లేక వారు రాగలిగినట్లయితే మనము వెళ్తున్నప్పుడు వారిని మనతోపాటు షాపింగ్‌కు తీసుకు వెళ్తామా? అయితే అవసరమైతే వారు కొంత విశ్రాంతి తీసుకొని, సేదతీర్చుకొనే స్థలాలను కూడా ఏర్పాటుచేయండి. ఇందుకు ఓపిక, దయ నిశ్చయంగా అవసరము, అయితే వృద్ధుడైన వ్యక్తి చూపే కృతజ్ఞత ఇంకా ప్రయోజనకరంగాను ఉండగలదు.—2 కొరింథీయులు 1:11.

సంఘానికి సొగసైన సంపద

18. వృద్ధులు సంఘమునకు ఎందుకు ఆశీర్వాదకరము?

18 సంఘములో కొన్ని నెరసిన తలలను (వయస్సుబట్టి జుట్టు ఊడిన బట్టతలలు కూడా) చూడటం ఎంత ఆశీర్వాదకరము! అంటే దాని అర్థము బలము, శక్తితోనిండిన యౌవనులతోపాటు మన మధ్య జ్ఞానము అనుభవము కూడా ఉంది అది సంఘమునకు నిజమైన సంపద. వారి జ్ఞానము బావిలోనుండి మనము తోడుకొనే సేదతీర్చు నీళ్లవంటిది. అది సామెతలు 18:4 చెప్పినట్లున్నది: “మనుష్యుని నోటి మాటలు లోతు నీటివంటివి. అవి నదీ ప్రవాహమువంటివి జ్ఞానపు ఊటవంటివి.” వృద్ధులు మనకు అవసరమని, వారు మెచ్చుకొనబడుతున్నారని వారు తెలిసికొనుట ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుంది!—కీర్తన 92:14 పోల్చండి.

19. వృద్ధులైన తమ తల్లిదండ్రుల నిమిత్తము కొందరెలా త్యాగం చేశారు?

19 ఇంటికి తిరిగి వెళ్లి వృద్ధులు, రోగగ్రస్తులైయున్న తమ తల్లిదండ్రులను గూర్చి శ్రద్ధవహించడానికి పూర్తికాల సేవలో నున్న కొందరు వారి ఆధిక్యతలను విడిచిపెట్టవలసిన అవసరతను గుర్తించారు. ఒకప్పుడు వారికొరకు త్యాగముచేసినవారికై వీరు ఇప్పుడు త్యాగం చేస్తున్నారు. గతంలో మిషనరీలుగా సేవచేసి ఇప్పుడు పూర్తికాల సేవలో కొనసాగుతున్న ఒక జంట వృద్ధులైన తమ తల్లిదండ్రులనుగూర్చి శ్రద్ధతీసుకొనేందుకు ఇంటికి తిరిగివచ్చారు. ఇలా 20 సంవత్సరములు వారు శ్రద్ధవహించారు. నాలుగు సంవత్సరముల క్రితం ఆయన తల్లిని నర్సింగ్‌ హోమ్‌లో చేర్పించాల్సి వచ్చింది. ప్రస్తుతం అరవైలలో ఉన్న ఈయన 93 సంవత్సరముల వయస్సుగల తన తల్లిని రోజూ దర్శిస్తుంటాడు. ఆయన ఇలా అంటున్నాడు: “ఆమెను నేను ఎలా విడిచి పెట్టగలను, ఆమె నా తల్లి!” ఇతర సందర్భాలలో సంఘములు లేక ఆయావ్యక్తులు ముందుకొచ్చి వారి పిల్లలు వారి నియామకాలలో సేవచేసేందుకు వీలుగా తామే వీరిని చూస్తామనిన సందర్భాలు కలవు. అలాంటి నిస్వార్థమైన ప్రేమ ఎంతగానో పొగడదగింది. ప్రతి పరిస్థితిని అతి సున్నితంగా జాగ్రత్తతో నిర్వహించాలి. ఎందుకనగా వృద్ధులు నిర్లక్ష్యమునకు గురికారాదు. వృద్ధులైన మీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నామని మీరు చూపండి.—నిర్గమకాండము 20:12; ఎఫెసీయులు 6:2, 3.

20. వృద్ధులనుగూర్చి శ్రద్ధవహించడంలో యెహోవా మనకు ఏ మాదిరినుంచాడు?

20 నిజంగా వృద్ధ సహోదర సహోదరీలు కుటుంబానికి, సంఘానికి సొగసైన కిరీటమైయున్నారు. యెహోవా ఇలా చెప్పాడు: “ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడును నేనే, నేనే చేసియున్నాను చంక పెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.” మనము కూడా క్రైస్తవ కుటుంబములోని వృద్ధులైన సహోదర సహోదరీలయెడల అదే శ్రద్ధ, ఓపికను చూపుదుము గాక.—యెషయా 46:4; సామెతలు 16:31.

[అధస్సూచీలు]

a వృద్ధులకు సహాయం చేసేందుకు కుటుంబ సభ్యులు ఏమిచేయవచ్చో చూపే వివరమైన సూచనలకు కావలికోట డిశంబరు 1, 1987 చూడండి.

మీకు జ్ఞాపకమున్నవా?

◻ వృద్ధులనుగూర్చి శ్రద్ధవహించడంలో ఏ బైబిలు మాదిరులు మనకున్నవి?

◻ వృద్ధులను మనము ఎలా చూడాలి?

◻ కుటుంబ సభ్యులు వృద్ధులైన వారి ప్రియలనుగూర్చి ఎలా శ్రద్ధ తీసుకొనగలరు?

◻ వృద్ధులకు సహాయం చేసేందుకు సంఘము ఏమి చేయవచ్చును?

◻ వృద్ధులు మనందరికి ఎందుకు ఆశీర్వాదకరము?

[23వ పేజీలోని చిత్రం]

వృద్ధురాలైన నయోమి పట్ల రూతు దయను గౌరవమును కనపర్చెను

[24వ పేజీలోని చిత్రం]

వృద్ధులు సంఘములో విలువైన సభ్యులు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి