మీ ఆరాధనా స్థలాన్ని మీరు గౌరవిస్తున్నారా?
“సువార్త అంకురించిన నాటినుండి, క్రైస్తవులకు దైవారాధనకు సంబంధించిన స్థిరమైన, నిర్దిష్టమైన స్థలాలు ఎప్పుడూ వుండేవి.”—విలియమ్ కేవ్ రచించిన “ప్రిమిటివ్ క్రిస్టియానిటి.”
దేవుని ప్రజలు ఆరాధనకొరకు సమకూడుటలో ఎల్లవేళల్లో ఆనందించారు. నేడున్నట్లే మొదటి శతాబ్దములోనూ ఇది నిజమైయుండెను. క్రైస్తవులు ఆరాధన కొరకు క్రమంగా కూడుకొనేందుకు వారికి నిర్దిష్ట ప్రదేశాలుండేవని అలనాటి గ్రంథకర్తలు, తత్వవేత్తలైన లూషెన్, క్లెమెంట్, జస్టిన్ మార్టెర్, టెర్టులియన్ వీరంతా అంగీకరించారు.
క్రైస్తవ గుంపులు ఏర్పాటు చేసుకొనిన క్రమమైన కూటములను గూర్చిన అనేక ప్రస్తావనలను బైబిలు పేర్కొనుచు, దానిని స్థిరపర్చింది. ఈ గుంపులు సంఘాలని పిలువబడ్డాయి. “సంఘము” అనే బైబిలు ఆదిమ భాషాపదం సరియైనదే, ఎందుకంటే ఆ పదం ఒక ప్రత్యేక సంకల్పం కొరకు లేదా కార్యముకొరకు ఒక గుంపు సమకూడుటను సూచిస్తున్నది.
తొలిక్రైస్తవ ఆరాధనా స్థలాలు
మొదటి శతాబ్దపు క్రైస్తవులు తాము కూడినప్పుడు ఏమి చేసేవారు? అట్టి కూటములనేకములను బైబిలు పేర్కొని, బోధించుట అనేది ప్రముఖ భాగంగా వుండేదని తెల్పుచున్నది. (అపొస్తలుల కార్యములు 2:42; 11:26; 1 కొరింథీయులు 14:19, 26) ప్రసంగాలు, ప్రోత్సాహకర అనుభవాలను తెల్పుట, యెరుషలేమునందలి పరిపాలక సభనుండి లేదా ఒక అపొస్తలుని నుండి వచ్చిన ఉత్తరాలను కూలంకశంగా చర్చించడం వంటి విద్యాకార్యక్రమాలు ఏర్పాటుచేయబడేవి.
అంతియొకయలోనున్న ఒక క్రైస్తవ గుంపుకు అలాంటి ఉత్తరము నొకదానిని చదివిన తరువాత, యూదా, సీల “పెక్కుమాటలతో సహోదరులనాదరించి స్థిరపరచిరి” అని అపొస్తలుల కార్యములు 15:22-35 నందు చదువుతాము. పౌలు, బర్నబా అంతియొకయకు వచ్చినప్పుడు, “సంఘమును సమకూర్చి, దేవుడు తనకు తోడైయుండి చేసిన కార్యములన్నియు . . . వివరించిరి” అని వేరొక వృత్తాంతము పేర్కొంటున్నది. యెహోవాకు ప్రార్థించుట కూడ క్రైస్తవ కూటములలో ఒక ముఖ్య భాగమైయుండెను.—అపొస్తలుల కార్యములు 14:27.
మొదటి శతాబ్దపు సంఘాలు ఆరాధనకు సమకూడిన స్థలములు, నేడు అనేక క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలున్నంత పెద్ద నిర్మాణాలుకావు. తొలిక్రైస్తవులు ఎక్కువగా గృహాల్లో కూడుకొనేవారు. (రోమీయులు 16:5; 1 కొరింథీయులు 16:19; కొలొస్సయులు 4:15; ఫిలేమోను 2) తరచూ యిండ్ల మిద్దెలూ లేక మేడగదులు ఉపయోగించబడేవి. ప్రభువు రాత్రి భోజనము, అలాంటి మేడ గదిలోనే జరిగింది. పెంతెకొస్తునాడు 120 మంది శిష్యులు పరిశుద్ధాత్మతో అభిషేకించబడింది కూడా అలాంటి మేడగదిలోనే.—లూకా 22:11, 12, 19, 20; అపొస్తలుల కార్యములు 1:13, 14; 2:1-4; 20:7, 9.
అపొస్తలులు చూపిన మాదిరిని నేడు యెహోవాసాక్షులు అనుసరిస్తున్నారు. రాజ్యమందిరాలు అనబడే కూడుకునే స్థలాలను వారుపయోగిస్తున్నారు. దేవుని రాజ్య సువార్త ప్రచారకులుగా వారచ్చట శిక్షణపొందుతారు. (మత్తయి 24:14) రాజ్య మందిరము నందు, వారు లేఖనములను కూడ చదువుతారు, ప్రార్థిస్తారు, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. ఇది హెబ్రీయులు 10:24, 25 నందలి బైబిలు సలహాకు అనుగుణంగా వుంది: “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.”
మన ఆరాధనా స్థలాన్ని సరిగా ఉపయోగించుట
“దేవుడు సమాధానమునకే కర్తగాని అల్లరికి కర్తకాడు” మరియు “సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి,” అని అపొస్తలుడైన పౌలు పల్కిన మాటలను మీరు జ్ఞప్తికి తెచ్చుకొనగలరా? ఈ మాటల సందర్భాన్ని గమనిస్తే, క్రైస్తవ కూటములు ఎలా నిర్వహించబడాలో పౌలు చర్చిస్తున్నట్లు మీరు కనుగొంటారు. అపొస్తలుల కాలమందున్నట్లే, క్రైస్తవులు నేడు తమ కూటములు క్రమముగాను, చక్కగా సంస్థీకరించబడినట్లుండేలా చూసుకొంటారు.—1 కొరింథీయులు 14:26-40.
అక్టోబరు 15, 1969 ది వాచ్‌టవర్ సంచిక యిలా పేర్కొన్నది: “రాజ్య మందిరము నందున్న వాతావరణం సరియైనది. అది సత్యారాధనయందు, బైబిలు ఉపదేశము నందుండే నిజమైన ఆసక్తినుండి ఉత్పన్నమైనది. మందిరమందలి వెలుతురు, సహజ పరిసరాలు అక్కడికి వచ్చిన వారిని మర్మముతోకూడిన సంస్కారముతో ముంచి వేయక, స్నేహభావంతో మెలగండని ప్రోత్సహించును.” అయితే, రాజ్య మందిరాన్ని ఉపయోగించునప్పుడు ఎల్లవేళల గౌరవప్రదంగా, హుందాగా వుండేటట్లు జాగ్రత్తవహించాలి.
ఈ విషయంలో క్రైస్తవమత సామ్రాజ్యం ఎంతో లెక్కలేనితనాన్ని ప్రదర్శించింది. కొన్ని మతసంస్థలు తమ ఆరాధనా స్థలాలను సమాజ వినోద కేంద్రాలుగా ఉపయోగిస్తారు. మత సంగీత కార్యక్రమాలు, వ్యాయామ శాలలు, బిలియర్డ్స్ బల్లలు, నర్సరీలు, గృహప్రదర్శనా సినిమాలు వారికున్నాయి. ఒక చర్చి కార్యక్రమంలో మల్లయుద్ధ పోటీ ఉండెను. అపొస్తలులు చూపిన మాదిరికి దీనికి ఏమాత్రం పొంతన లేదు.
మొదటి శతాబ్దపు సంఘములో ఎవరైన అసభ్యంగా ప్రవర్తిస్తే, సరిదిద్దుట జరిగేది. ఉదాహరణకు, కొరింథు క్రైస్తవ సంఘములోనున్న కొందరు ప్రభువురాత్రి భోజన సమయాన్ని, తిని త్రాగే సమయంగా వాడుకున్నారు. కూటమునకు ముందుగాని జరిగేటప్పుడు గాని భుజించేందుకు తమతో పాటు వారు భోజనము తెచ్చుకొనేవారు, కొందరు మితిమీరి తిని, త్రాగేవారు. నిజంగా యిది జరుగ కూడనిది. అపొస్తలుడైన పౌలు వారికిలా వ్రాశాడు: “ఇదేమి? అన్న పానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా?”—1 కొరింథీయులు 11:20-29.
పౌలు యిచ్చిన సలహాననుసరించి, యెహోవాసాక్షులు వ్యక్తిగత విషయాలను రాజ్య మందిరములో కాక గృహములోగాని, మరోచోటగాని చూచుకొనుటకు ప్రయత్నిస్తారు. అనేకమంది స్నేహితులను ఒకేసారి కలుసుకొనే అవకాశములను మన కూటములు మనకు అనుగ్రహిస్తాయనుట నిజమే. అయితే, రాజ్యమందిరము యెహోవాకు సమర్పించబడింది, కనుక దానిని కేవలం ఆయన్ని ఆరాధించుటకే వాడాలి. మనమచ్చటికి వచ్చినప్పుడు వ్యాపార విషయాలను లేదా వ్యక్తిగత ద్రవ్య వ్యవహారాలను చూచుకొనుటకు ప్రయత్నించము.
అంతే కాదు, రాజ్యమందిరాలను సంఘాలు వినోదకార్యక్రమములు, నిధిని సమకూర్చు కార్యక్రమాలకు లేదా పిల్లల సంరక్షణవంటి సమాజ సేవలకొరకు ఉపయోగించరాదు. అలాంటి వ్యక్తిగత విషయాలను, వ్యాపార వ్యవహారములను చూచుకొనేందుకు వేరే స్థలాలున్నాయి.
సంఘ సభ్యులు కూటములందు అప్పు అడుగుట లేదా అప్పు తీసుకున్నవాటిని తిరిగి చెల్లించుట అలవాటు చేసుకొన్నట్లు ఒక రాజ్యమందిరములో పెద్దలు గమనించారు. అంతేకాదు, వారు రాజ్యమందిరాల్లో వీడియో కేసెట్లను మార్చుకొనుటకు అలవాటుపడ్డారు. ఇది వ్యాపార వ్యవహారము కాకపోయినను, వీలైనప్పుడు వీటిని యింటివద్దే చూసుకొంటే మంచిదని గ్రహించేలా పెద్దలు వారికి సహాయపడ్డారు.
చెడు అభిప్రాయాన్ని కల్గించే పరిస్థితులు రాకుండా, రాజ్యమందిరం సరిగ్గా ఉపయోగించబడేలా చూచేందుకు, ప్రతి ఒక్కరు తమ్మును తాము యిలా ప్రశ్నించుకోవాలి: ‘నేను యింటివద్ద చేయగల వ్యక్తిగత విషయాలనేమైనా రాజ్యమందిరమందు చేస్తున్నానా?’ ఉదాహరణకు విహారయాత్రలను లేదా వేడుకలను ఏర్పాటు చేసుకొనేటప్పుడు, అట్టివాటిని యింటివద్ద చర్చించుకొనుట యుక్తము కాదా? మనము ఎవరిని సంప్రదించగోరుతున్నామో వారికి ఫోనుచేయడం గాని, వారి యిండ్లకు వెళ్లడంగాని చేస్తున్నామా? పౌలు మాటలను తీసుకొని మనమిలా చెప్పగలము: ‘నిజమే అట్టివాటిని చూచుకునేందుకు మనకు యిండ్లున్నాయి, అవునా?’
యెహోవాను ఆరాధించుటకు నిర్ణీత సమయము, స్థలము
ప్రసంగి 3:1 నందు బైబిలిట్లంటున్నది: “ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.” మనము రాజ్యమందిరము నందు కూటమునకు హాజరౌతున్నప్పుడు, క్రైస్తవ పరిచర్యకు సంబంధించిన కార్యములలో మనము పూర్తిగా నిమగ్నులము కాగలము. అది యెహోవాను ఆరాధించు నిర్ణీత సమయము.
క్రైస్తవ సంఘములో పక్షపాతమును చూపుటను గూర్చి యేసు తమ్ముడైన యాకోబు, హెచ్చరించాడు. (యాకోబు 2:1-9) మన రాజ్యమందిరములో ఈ సలహాను మనమెలా అన్వయించగలము? విందు ఆహ్వాన పత్రికలను అందరికి కన్పించేలా అందించినప్పుడు పక్షపాతవైఖరి కనబడవచ్చును. కొన్ని సంఘాల్లో అట్టి ఆహ్వానములను హాజరైనవారి బైబిళ్లలో లేదా వారి పుస్తకముల బ్యాగ్‌లో పెట్టుట వాడుక. సరే, ఈ ఆహ్వానములను పోస్టుద్వారా పంపడం లేదా ప్రతి యింటికి వాటిని పంచడం కంటే యిదే ఎంతో సులభమని ఒప్పుకుంటాము. అయితే ఆహ్వానాలు యితరులకు యివ్వబడగా చూచి వాటిని పొందని వారు ఎంత బాధపడతారు? అది పక్షపాతం చూపించినట్టుకాదా?
అయితే, రాజ్యమందిరములో నుండగా ఏవిధమైన వ్యక్తిగత సమాచారము లేదా ప్యాకెట్టులు వేరొకరికి అందించరాదని కఠిన నియమమేమీ వుండనవసరము లేదు, లేక దైనందిన కార్యములు, సంఘటనలను గూర్చి రాజ్యమందిరములో మాట్లాడుట, ఎవరినైనా మీ యింటికి ఆహ్వానించుట లేదా, ఏదో వినోద కార్యక్రమమునకు నీతోపాటు రమ్మని ఎవరినైనా అడుగుట తప్పుకాదు. కాని అవి అంత ముఖ్యమైనవిగా ఉండకూడదు, పైగా అలాంటి ఏర్పాట్లను వివేకముగా, కోపము పుట్టించని రీతిలో చేసికోవాలి. రాజ్యమందిరంలో మనం సమకూడే అసలైన సంకల్పాన్ని మన వ్యక్తిగత ఏర్పాట్లు ఎన్నడు పెడత్రోవ పట్టించకూడదు.—మత్తయి 6:33; ఫిలిప్పీయులు 1:10.
మాదిరి చూపే పురుషులు
రాజ్యమందిరము యెడల గౌరవాన్ని చూపుటలో పెద్దలు, పరిచారకులు ఉత్సాహవంతంగా మాదిరి చూపిస్తారు. సాధారణంగా, రాజ్యమందిరమును శుభ్రంగా ఉంచుటకు సంబంధించిన విషయాలను నిర్వహించేందుకు ఒకరు లేదా యిద్దరు పెద్దలు, పరిచారకులు నియమించబడతారు. ఒకే హాలును ఎక్కువ సంఘాలు ఉపయోగిస్తుంటే, ఈ విషయాలను పెద్దల కమిటీ పర్యవేక్షిస్తుంది.
అట్టి విధులను నిర్వహించేందుకు కొందరు ప్రత్యేకంగా నియమించబడినను, హాలు విషయమై పరిచారకులు, పెద్దలందరూ నిజమైన ఆసక్తిని కనపర్చాలి. రాజ్యమందిరం యెహోవాకు ప్రతిష్ఠించబడినది, ఆయన ఆరాధనకే అది ఉపయోగించబడుతున్నదని వారు గుర్తెరుగుదురు.
మరమ్మత్తులు చేయించాల్సివస్తే పెద్దలు కాలయాపన చేయకూడదు. (2 దినవృత్తాంతములు 24:5, 13; 29:3; 34:8; నెహెమ్యా 10:39; 13:11) ఏదైనా అవసరమైన మరమ్మత్తులు వెంటనే చేయించేందుకు కొన్ని సంఘాలలో రాజ్యమందిరాన్ని అప్పుడప్పుడు తనిఖీ చేస్తుంటారు. అవసరమగు సామగ్రి ఉండేటట్లు లభ్యమయ్యెలా చూచుకొనేందుకు సరుకుల జాబితాను తయారుచేస్తారు. వస్తుసామగ్రి, పరికరాలు, శుభ్రపర్చే సామాగ్రిని నిలువ చేసే నిర్దిష్ట ప్రదేశముంటే అది శుభ్రంగా ఉండేటట్లు పెద్దలు, పరిచారకులంతా దానియందు శ్రద్ధచూపాలి. లిటరేచర్ మాగజైన్ కౌంటర్లను చూస్తున్న వారు ఖాళీపెట్టెలు హాలులో కుప్పలుగా పేరుకుపోకుండునట్లు జాగ్రత్త వహించాలి.
పెద్దలు పరిచారకులు మాదిరి చూపుటద్వారా, రాజ్యమందిరము యెడల ఆసక్తిని కనుపర్చుటలో సంఘములోని యితరులకు సహాయము చేయగలరు. (హెబ్రీయులు 13:7) హాలును శుభ్రపరచుట, అందంగా కన్పించేందుకు మంచి ఆసక్తిని కనుపర్చుటలో భాగము వహించుటలో సరియైన గౌరవాన్ని అందరూ చూపవచ్చును.
మత్తయి 18:20లో యేసు యిట్లనెను: “ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును.” నిజమే, మనం యెహోవాను ఆరాధించుటకు కూడినపుడు, మనము చేసేదాని యందు యేసు ఆసక్తి కల్గియున్నాడు. అందులో గృహములందు జరిగే కూటములు, సభలు లేక సమావేశముల వంటి పెద్దకూటములు కూడా యిమిడియున్నాయి.
లక్షలాదిమంది యెహోవాసాక్షులకు, తమ ఆరాధనా స్థలమైన రాజ్యమందిరము కంటే ప్రియమైనది మరొకటిలేదు. వారు ఆ స్థలానికి సరియైన గౌరవాన్ని చూపుతారు. దానిని సరిగా ఉపయోగించుటకు ఎల్లవేళల కృషి సల్పుతూ, దానియెడల శ్రద్ధ చూపుటలో శ్రమించి పనిచేస్తారు. యెహోవా తానే స్వయంగా యిచ్చిన సలహాను నీవును పాటించుదువు గాక: “నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము.”—ప్రసంగి 5:1.