మన ఆరాధనా స్థలాలను మంచి స్థితిలో ఉంచుకుందాం
1. రాజ్య మందిరం దేని కొరకు ఉపయోగపడుతుంది?
1 ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల సంఘాలు 94,000 కంటే పైగా ఉన్నాయి. స్థానిక స్వచ్ఛారాధనా కేంద్రంగా ఉపయోగపడే రాజ్య మందిరంలో అనేక సంఘాలు బైబిలు అధ్యయనం కోసం, క్రైస్తవ సహవాసం కోసం సమకూడతాయి.
2. రాజ్య మందిరం పరిశుభ్రంగా, చూడముచ్చటగా ఉంచడం ఎందుకు ప్రాముఖ్యం?
2 పట్టిక వేసుకుని క్రమంగా శుభ్రం చేయడం: రాజ్య మందిరాన్ని మంచి స్థితిలో ఉంచుకోవడం మన పవిత్ర సేవలో చాలా ప్రాముఖ్యమైన భాగం. మన పరిచర్య పుస్తకం 61-2 పేజీల్లో ఇలా చెబుతోంది: “సహోదరులు రాజ్యమందిరానికి ఆర్థిక సహాయము చేయుట ఒక ఆధిక్యతయని మాత్రమే అనుకోకుండా దాన్ని మంచిస్థితిలోను, పరిశుభ్రముగాను, చూడముచ్చటగా వుండునట్లు దానికొరకు స్వచ్ఛంద సేవ చేయవలెను. రాజ్యమందిరం లోపల వెలుపల యెహోవా సంస్థకు తగిన ప్రాతినిధ్యం వహించేదిగా తీర్చిదిద్దవలెను.” వారంలో పలుమార్లు ఉపయోగించే రాజ్య మందిరాన్ని క్రమంగా పరిశుభ్రపరచాల్సిన మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా ఆ రాజ్య మందిరంలో కూటాలు జరుపుకునే సంఘ (సంఘాల) స్వచ్ఛంద సేవకులే ఈ పనులు చూసుకుంటారు. బైబిలు కాలాల్లో చేసినట్లే, నేడు యెహోవా సేవకులు తమ ఆరాధనా స్థలాన్ని ‘బాగుచేసుకొనుటకు’ కృషి చేయాలి.—2 దిన. 34:10.
3. రాజ్య మందిరం పరిశుభ్రం చేయడాన్ని ఎలా వ్యవస్థీకరించాలి, ఈ ఆధిక్యతలో ఎవరెవరు పాల్గొనవచ్చు?
3 రాజ్య మందిర సమాచార బోర్డుపై ప్రతివారం పరిశుభ్రం చేసే పట్టిక ఉంచాలి. మందిరాన్ని ప్రతివారం పరిశుభ్రం చేయడంలోపుస్తక అధ్యయన గ్రూపులన్నీ వంతులు వేసుకోవాలి, చేయవలసిన పనుల పట్టికను అనుసరించాలి. రాజ్య మందిరాన్ని పరిశుభ్రంగా, చూడముచ్చటగా ఉంచడానికి ప్రతివారం లభించే ఆధిక్యతలో పాల్గొనగలిగే వారందరూ భాగం వహించాలి. తల్లిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలు కూడా భాగం వహించవచ్చు, తద్వారా ఆ ఆధిక్యత పట్ల కృతజ్ఞతతో ఉండడాన్ని వారికి నేర్పించవచ్చు. ప్రత్యేకించి రాజ్య మందిరాన్ని ఒకటి కంటే ఎక్కువ సంఘాలు ఉపయోగిస్తుంటే, మన ఆరాధనలో ఒక ప్రాముఖ్య భాగమైన ఈ విషయంలో పరస్పరం మంచి సహకారం ఆవశ్యకం, తద్వారా ఆ భారం కేవలం కొందరిపైనే పడకుండా ఉంటుంది.
4. సంఘం రాజ్య మందిరం పరిశుభ్రం చేసేటప్పుడు ఏ పనులు చెయ్యాలో తెలుసుకునేందుకు ఏమి చెయ్యాలి?
4 చేయవలసిన పనుల వివరాల పట్టిక పరిశుభ్రంచేసే సామగ్రి ఉంచే చోట అంటించవచ్చు. ఆ పట్టికలో ఊడవడం, కిటికీలు తుడవడం, బల్లల మీది దుమ్ము దులపడం, చెత్తబుట్టలు ఖాళీ చేయడం, తడిగుడ్డతో నేల తుడవడం, అద్దాలు శుభ్రం చేయడం వంటి ప్రతివారం చేయవలసిన పనులు వ్రాసి పెట్టాలి. కలప ఫర్నీచర్ పాలిష్ చేయడం, కుర్చీలు తుడవడం, కర్టెన్లు ఉతకడం, ఫ్యాన్లు, లైట్లు సమగ్రంగా పరిశుభ్రం చేయడం వంటి కొన్ని పనులు అప్పుడప్పుడు మాత్రమే చేయవలసి ఉంటుంది. పరిశుభ్రం చేయడానికి ఉపయోగించే కెమికల్స్ పిల్లలకు అందకుండా పెట్టాలి, వాటి మీద స్పష్టంగా పేర్లు వ్రాసిపెట్టాలి. ప్రతి కెమికల్ను ఎలా ఉపయోగించాలో తెలిపే క్లుప్తమైన వివరణ కూడా వాటి మీద అంటించాలి.
5. భద్రత ఎంత ప్రాముఖ్యం, అప్పుడప్పుడు వేటిని పరిశీలించాలి? (4వ పేజీలోని బాక్సు చూడండి.)
5 రాజ్య మందిరంలో భద్రత అత్యంత ప్రాముఖ్యమైన విషయం. (ద్వితీ. 22:8) దీనికి సంబంధించి, 4వ పేజీలోని బాక్సు ప్రమాదాలను నివారించేందుకు అప్పుడప్పుడు పరిశీలించవలసిన వాటి గురించి తెలియజేస్తుంది.
6. రాజ్య మందిర నిర్వహణా పనిని ఎలా సమన్వయపరచాలి?
6 రాజ్య మందిర నిర్వహణ: రాజ్య మందిర నిర్వహణా పనుల పర్యవేక్షణకు పెద్దల సభ బాధ్యత వహిస్తుంది. పనిని సమన్వయపరచడానికి ఈ సభ సాధారణంగా ఒక పెద్దను లేదా ఒక పరిచర్య సేవకుణ్ణి నియమిస్తుంది. ఆయన రాజ్య మందిరంలో ఆయా రోజుల్లో చేయవలసిన పనులు క్రమంగా ఏర్పాటుచేస్తూ, అది పరిశుభ్రంగా మంచి స్థితిలో ఉండేలా చేయడానికి, అవసరమైన సామాన్లు అందుబాటులో ఉండేలా చూస్తాడు. మందిరంలో గానీ పరిసరాల్లో గానీ అపాయం కలిగించగలవేవీ లేకుండా చూసుకోవడం ప్రాముఖ్యం. రెండు లేక అంతకంటే ఎక్కువ సంఘాలు ఒకే రాజ్య మందిరాన్ని ఉపయోగిస్తుంటే పెద్దల సభలు ఆ భవనం, స్థలం జాగ్రత్తగా చూసుకునేందుకు ఒక నిర్వాహక కమిటీని నియమిస్తాయి. ఈ కమిటీ పెద్దల సభల మార్గదర్శకంలో పని చేస్తుంది.
7. (ఎ) రాజ్య మందిరం మంచి స్థితిలో ఉంచేందుకు ప్రతి సంవత్సరం ఏమి చెయ్యాలి? (బి) అప్పుడప్పుడు ఎలాంటి విషయాలపై శ్రద్ధ చూపాలి? (5వ పేజీలోని బాక్సు చూడండి.)
7 ప్రతి సంవత్సరం రాజ్య మందిరాన్ని పూర్తిగా తనిఖీ చెయ్యాలి. మరమ్మతు చేయవలసిన పనులేమైనా ఉంటే వాటిని సమగ్రంగా చూసే ఏర్పాట్లు చేయడానికి పెద్దలు బాధ్యత వహించాలి. అవసరమైన మరమ్మతులు చేయడానికి నిర్వహణకు ప్రచారకులను ఆహ్వానించవచ్చు. చేయవలసిన పనులు చిన్నవైనా, వాటిపై శ్రద్ధ చూపించడంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి, శ్రద్ధ చూపించవలసిన వాటి విషయంలో వెంటనే చర్య తీసుకోవాలి.
8. కాంట్రాక్టరుకు పనులు అప్పగించాల్సిన పరిస్థితులు ఏర్పడితే ఏ పద్ధతి అవలంబించాలి?
8 సంఘ విరాళాలను జ్ఞానవంతంగా ఉపయోగించడం: రాజ్య మందిరంలోని, దాని ఆవరణలోని ఎక్కువ శాతం పనులు స్వచ్ఛంద సేవకులు చేసినవే. వారి త్యాగపూరిత ప్రయత్నాలు వారి ప్రేమకు చక్కని నిదర్శనాలు, అవి ఖర్చులు తగ్గించడానికి ఎంతో దోహదపడ్డాయి. అయితే రాజ్య మందిరం లోపల గానీ బయట గానీ మరమ్మతులు చేసే పనులు ఎక్కువగా ఉండి వాటిని కాంట్రాక్టరుకు ఇవ్వాల్సిన అవసరం వస్తే, ఆ పని పెద్దల సభ చేస్తుంది. మొదట వాటి వివరాలను అంటే ఏమేమి పనులు చేయాలి, ఏమేమి సామాన్లు కావాలి అనే వివరాలను ముందుగా సిద్ధం చేస్తుంది. అలా తయారు చేసిన పట్టికను వివిధ కాంట్రాక్టర్లకు ఇస్తే, వారు ఏమేమి చెయ్యాలో ఖచ్చితంగా అర్థంచేసుకొని తాము ఆ పనులు ఎంత ధరకు చేయగలరో తెలియజేస్తారు. అలా వారినుండి వ్రాతపూర్వకంగా ధరలు తెలుసుకున్న తర్వాత పెద్దలు వాటిలో సరైనదాన్ని ఎంపిక చేసుకోవాలి. ఏ సహోదరుడైనా ఓ నిర్దిష్ట ధరతో ఈ పనులు చేస్తానని లేదా సరుకు పంపిణీ చేస్తానని ముందుకువచ్చినా ఇదే పద్ధతిని అవలంబించాలి.
9. సంఘానికి చెందిన డబ్బు సరైన విధంగా ఉపయోగించబడేలా ఎలా చూడవచ్చు?
9 రాజ్య మందిరాన్ని ఒకటికంటే ఎక్కువ సంఘాలు ఉపయోగిస్తుంటే, నిర్వాహక కమిటీ ప్రత్యేకంగా పద్దు వ్రాసి ప్రతినెలా వాటి నివేదికలను సంబంధిత పెద్దల సభలకు అందిస్తుండాలి. ఆ విధంగా డబ్బు ఎలా ఖర్చవుతుందో పెద్దలకు తెలుస్తుంది. సంఘానికి చెందిన డబ్బు సరైన విధంగా ఖర్చుచేసే బాధ్యత పెద్దలది.
10. భారీ నిర్వహణ లేదా మరమ్మతులు అవసరమైతే ఏమి చేయాలి?
10 భారీ నిర్వహణ, మరమ్మతులు: రాజ్య మందిరం నిర్వహణకు లేక మరమ్మతులకు సంబంధించి భారీ పనులు చేయవలసిన అవసరముందని నిర్వాహక కమిటీకి అనిపిస్తే, మార్గదర్శకం కోసం ఆ కమిటీ పెద్దల సభలకు ఆ విషయాన్ని తెలియజేయాలి. భారీ మరమ్మతులు లేదా పునరుద్ధరణ పనులు అవసరమని గానీ లేక ఆ రాజ్య మందిరాన్ని ఉపయోగించే సంఘాలు కాకుండా వేరే సంఘాల సహాయం అవసరమని గానీ నిర్ణయిస్తే, సలహా కోసం పెద్దలు బ్రాంచిని సంప్రదించాలి. వీలైతే ఒకటి కంటే ఎక్కువ సంఘాలు సమిష్టిగా డబ్బు కూడబెట్టడం మంచిది. ఆ విధంగా వారు ఉన్న మందిరాన్ని పెద్దగా చేసుకోవచ్చు లేదా మరో పెద్ద మందిరమే కట్టుకోవచ్చు, అది ఇప్పుడే కాక రానున్న సంవత్సరాల్లోను చాలా సంఘాలకు ప్రయోజనమివ్వగలదు.
11. రాజ్య మందిరంలో కూటాలకు హాజరయ్యే ఆధిక్యతకు మన కృతజ్ఞతను ఎలా వ్యక్తం చేయవచ్చు?
11 రాజ్య మందిరంలో సమకూడే మహత్తర అవకాశాన్ని మనమెంత గొప్పగా భావిస్తామో గదా! మనం మన కూటాలను నిర్లక్ష్యం చేయాలని గానీ వాటిని తక్కువగా అంచనా వేయాలని గానీ ఎన్నడూ కోరుకోము. మన రాజ్య మందిరాన్ని బాగా చూసుకోవడంలో సంపూర్ణంగా పాల్గొనడం ద్వారా, మన ప్రోత్సాహం కోసం చేయబడిన కూటాల ఏర్పాటు సక్రమంగా కొనసాగడానికి మనమందరం తోడ్పడవచ్చు. ఇది స్వచ్ఛారాధనను శ్లాఘిస్తూ యెహోవా నామానికి కీర్తి తెస్తుంది. మన ఆరాధనా స్థలాన్ని మంచి స్థితిలో ఉంచుకోవాలని దృఢ నిశ్చయంతో ఉందాం.
[4వ పేజీలోని బాక్సు]
తీసుకోవలసిన భద్రతల జాబితా
◻ అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలి, ప్రతి సంవత్సరం తనిఖీ చేయాలి.
◻ బయటకు వెళ్ళే మార్గాలను, మెట్లను సూచించేందుకు స్పష్టమైన గుర్తులుండాలి, సరైన వెలుతురుండాలి దారిలో ఏవీ అడ్డుగా ఉండకూడదు, పట్టుకుని మెట్లు దిగడానికి వీలుగా బిగించిన కమ్మీలు పటిష్ఠంగా ఉండాలి.
◻ సామాన్లు పెట్టే గదులు, టాయ్లెట్లు శుభ్రంగా, సక్రమంగా ఉండాలి, వాటిలో త్వరగా నిప్పంటుకునే వస్తువులు లేదా వ్యక్తిగత వస్తువులు ఉండకూడదు.
◻ పైకప్పు, వర్షపు నీరుపారే దోనెలు క్రమంగా తనిఖీ చేస్తూ శుభ్రపరచాలి.
◻ రాజ్య మందిరానికి వెళ్ళే దారిలో, పార్కింగు స్థలంలో సరైన వెలుతురుండాలి, జారేందుకు లేక పడేందుకు కారణమయ్యేవి లేకుండా ఉండాలి.
◻ విద్యుత్తుకు, గాలిసరఫరాకు సంబంధించి అమర్చిన వాటిని తనిఖీ చేసి సరిగ్గా సర్వీస్ చేయించాలి.
◻ అధిక తేమవల్ల కలిగే తీవ్ర సమస్యలను నివారించేందుకు లీకేజీలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే బాగు చేయించాలి.
◻ బిల్డింగులో ఎవరూ లేనప్పుడు దానికి తాళం వేసి ఉంచాలి.
[5వ పేజీలోని బాక్సు]
బిల్డింగు, ఆస్తికి సంబంధించి శ్రద్ధ చూపించవలసిన విషయాలు
◻ వెలుపల: పైకప్పు, గోడలు, పెయింటు, కిటికీలు, రాజ్య మందిరాన్ని సూచించే బోర్డు మంచి స్థితిలో ఉన్నాయా?
◻ ఖాళీస్థలం: ఖాళీస్థలం పరిశుభ్రంగా ఉందా? దార్లు, కంచే, ఆవరణ మంచి స్థితిలో ఉన్నాయా?
◻ లోపల: కార్పెట్లు, కర్టెన్లు, కుర్చీలు, లైట్లకు నీటి పైపులకు సంబంధించిన ఫిట్టింగులు, గోడల రంగులు చూడముచ్చటగా ఉన్నాయా లేక అస్తవ్యస్తంగా ఉన్నాయా?
◻ వస్తు సామగ్రి: లైట్లు, సౌండ్ సిస్టమ్, ఫ్యాన్లు, వెంటిలేషన్ అన్నీ సక్రమంగా పని చేస్తున్నాయా?
◻ బాత్రూములు: టాయ్లెట్లు పరిశుభ్రంగా, ఎటువంటి దుర్వాసన లేకుండా సరిగ్గా పనిచేస్తున్నాయా?
◻ సంఘ డాక్యుమెంట్లు: కార్పొరేషన్ డాక్యుమెంట్లను ఎప్పటికప్పుడు తాజాగా, ఖచ్చితమైన వివరాలతో ఉంచాలి. ఆస్తికి సంబంధించిన పేపర్లు, పన్నుల రసీదులు, ఇతర ప్రాముఖ్యమైన పేపర్లు క్రమంగా ఫైలు చేయబడి ఉన్నాయా?